తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తూ, టార్గెట్లు ఛేదించడానికి శ్రమపడుతూ ఉండే వారిలో... ఒత్తిడి తీవ్రత పెరిగినప్పుడు ఆస్తమా రావడం కొందరిలో కనిపిస్తుంది. అందుకే ఈ అంశం అటు పరిశోధనల్లో, ఇటు వైద్యవర్గాల్లో చాలావరకు ఓ చర్చనీయాంశం (డిబేటబుల్ సబ్జెక్ట్)గా ఉంది. ఏతావాతా చెప్పదగిన అంశమేమిటంటే... ఆస్తమా లేనివారిలో అధిక ఒత్తిడి కొత్తగా ఆస్తమాను కలిగించదుగానీ... అప్పటికే ఆస్తమా సమస్య ఉన్నవారిలో ఒత్తిడి అనేది ఓ ట్రిగరింగ్ ఫ్యాక్టర్‌గా పనిచేసి ఆస్తమాను ప్రేరేపించగలదు.
మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే... తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొనేవారిలో ఆస్తమా ఎటాక్స్ చాలా తరచుగా కనిపిస్తుంటాయి. పరిశోధకులు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆస్తమా లక్షణాలు కనిపించడాన్ని చాలా సందర్భాల్లో నమోదు చేశారు. ఇదే విషయాన్ని చాలామంది ఇతర అధ్యయనవేత్తలూ రూఢి చేశారు.
ఉదాహరణకు పిల్లల్లోనైతే స్కూలు పరీక్షలు, ఎక్కడైనా నలుగురిలో మాట్లాడాల్సి రావడం, పెద్దల్లో కుటుంబాల్లో విభేదాలు, విపత్తుల్లో చిక్కుకు΄ోవడం, హింసకు లోనుకావడం వంటి సంఘటనల్లో ఒత్తిడి పెరిగితే అది ఆస్తమాను ట్రిగర్ చేయవచ్చు.
మొదట ఒత్తిడి అనేది యాంగ్జైటీని పెంచి అటాక్ వచ్చేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తుంది. అంటే ఆస్తమా అటాక్‌ను ప్రేరేపించే హిస్టమైన్, ల్యూకోట్రైన్ వంటి రసాయనాలను విడుదలయ్యేలయ్యేలా చేస్తుంది. ఆ ప్రభావంతో వాయునాళాలు సన్నబారిపోతాయి. ఇక మిగతా సాధారణ వ్యక్తులతో పోలిస్తే... ఒత్తిడీ, యాంగ్జైటీ వంటి సమస్యలతో బాధపడేవారిలో ఆస్తమా ఉన్నప్పుడు వారి పరిస్థితిని నియంత్రించడం మరింత కష్టమవుతుంది.
ఒత్తిడినీ, దాంతో వచ్చే ఆస్తమానూ అరికట్టడం ఎలా...?
మొదట తమకు ఒత్తిడి కలిగిస్తున్న అంశాలేవో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక సమస్యలా, కుటుంబ సభ్యులతో విభేదాలా, ఎవరూ సహాయసహకారాలు అందించకపోవడం, ఎప్పుడూ పనిలోనే ఉండాల్సి రావడం లేదా నిత్యం డెడ్‌లైన్స్‌తో సతమతమవుతుండటమా అనేది తొలుత గుర్తించాలి. సమస్యను గుర్తించాక... దాన్ని ఎదుర్కోవడమనేది తమ వల్ల అవుతుందా, ఎవరి సహాయమూ లేకుండానే సమస్యకు పరిష్కారం సాధ్యపడుతుందా లేదా ఎవరైనా వృత్తినిపుణుల సహాయం అవసరమా తెలుసుకొని, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలి.
అన్ని పనులూ ఒకరే పూర్తి చేయలేరని గుర్తించాలి. తొలుత పనుల జాబితా రూపొందించి, ఎవరు చేయదగ్గపనుల్ని వారికి అప్పగించాలి. ఉదాహరణకు డెడ్‌లైన్‌లోపు ఒకరే ఆ పని చేయలేరనుకుంటే... దాన్ని విడదీసి తలా కాసింత బాధ్యత అప్పగించాలి.
దీన్నే వర్క్‌ప్లేస్ స్ట్రాటజీ అంటారు. ఆఫీసు పనిచేసే సమయాల్లో ఈ వర్క్‌ప్లేస్ స్ట్రాటజీ అనుసరించాలి. అంతేకాదు... పని ఒత్తిడి అన్నది ఆఫీసులో ఒక్కరికే పరిమితమైనది కాదు... అది అక్కడ పనిచేసే అందరికీ వర్తించేదన్న విషయాన్ని గుర్తెరగాలి. దాంతో సగం ఒత్తిడి తగ్గుతుంది.
ప్రతిరోజూ అలసట కలిగించని వ్యాయామాలు చేయాలి. వ్యాయామం మంచి స్ట్రెస్ బస్టర్. ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది.
బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ విధానాల వంటివి అనుసరించాలి. యోగా, ధ్యానం వంటివీ ప్రాక్టీస్ చేయడం స్ట్రెస్‌ను చాలావరకు తగ్గిస్తుంది.
అటాక్ వచ్చినప్పుడు వాడే మందులు, అటాక్ రాకుండా నివారించే మందులు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి .
రోజూ కంటినిండా నిద్రపోవాలి.
ఒత్తిడితో కూడిన అటాక్ వచ్చినప్పుడు 5 – 10 నిమిషాల్లో మీరు నార్మల్ స్థితికి రాకపోతే తక్షణం తప్పనిసరిగా వైద్యుల సహాయం తీసుకోవాలి.
చికిత్స : విండ్‌పైపులు (వాయునాళాలు) వాపునకు (ఇన్‌ఫ్లమేషన్‌కు) గురైనప్పుడు... ఆ వాపు వల్ల గాలి ప్రవహించే లోపలి దారి సన్నబారి΄ోవడంతో శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. దాంతో ఆయాసం, పిల్లికూతల వంటి లక్షణాలతో ఆస్తమా కనిపిస్తుంది. ఈ లక్షణాలు తగ్గాలంటే మొదట తక్షణమే వాయునాళాలను విప్పార్చే / విస్తరింపజేసే మందులను లేదా ఇన్‌హేలర్స్‌ను వాడాలి. అదే రాకముందు లేదా వచ్చి తగ్గాక డాక్టర్ సలహా మేరకు ... ఆస్తమా రాకుండా నివారించే ప్రివెంటివ్ మందులు / ఇన్‌హేలర్స్ వాడాలి. ఆస్తమా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించేందుకు అవసరాన్ని బట్టి డాక్టర్లు యాంటీ హిస్టమైన ఇంజెక్షన్స్ కూడా వాడవచ్చు.
అపోహ – వాస్తవం : ఇన్‌హేలర్ అలవాటు అవుతుందనీ, అది మంచిది కాదనే అ΄ోహ కొంతమందికి ఉంటుంది. నిజానికి టాబ్లెట్లతో పోలిస్తే ఇన్‌హేలర్స్‌తో దేహంలోకి ప్రవేశించే మందు మోతాదు చాలా తక్కువ.
దాంతో సైడ్‌ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. అందుకే ఇన్‌హేలర్స్ సురక్షితమని గుర్తించాలి. ప్రివెంటివ్ మందు ఉండే ఇన్‌హేలర్స్ వాడుతుంటే అటాక్ రాకుండా అవి ఆస్తమాను అదుపులో ఉంచుతాయి.
డాక్టర్ రవీంద్ర రెడ్డి, పల్మనాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment