Asthma
-
ఒత్తిడికి గురైతే ఆస్తమా అటాక్ అవుతుందా..?
తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తూ, టార్గెట్లు ఛేదించడానికి శ్రమపడుతూ ఉండే వారిలో... ఒత్తిడి తీవ్రత పెరిగినప్పుడు ఆస్తమా రావడం కొందరిలో కనిపిస్తుంది. అందుకే ఈ అంశం అటు పరిశోధనల్లో, ఇటు వైద్యవర్గాల్లో చాలావరకు ఓ చర్చనీయాంశం (డిబేటబుల్ సబ్జెక్ట్)గా ఉంది. ఏతావాతా చెప్పదగిన అంశమేమిటంటే... ఆస్తమా లేనివారిలో అధిక ఒత్తిడి కొత్తగా ఆస్తమాను కలిగించదుగానీ... అప్పటికే ఆస్తమా సమస్య ఉన్నవారిలో ఒత్తిడి అనేది ఓ ట్రిగరింగ్ ఫ్యాక్టర్‌గా పనిచేసి ఆస్తమాను ప్రేరేపించగలదు.మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే... తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొనేవారిలో ఆస్తమా ఎటాక్స్ చాలా తరచుగా కనిపిస్తుంటాయి. పరిశోధకులు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆస్తమా లక్షణాలు కనిపించడాన్ని చాలా సందర్భాల్లో నమోదు చేశారు. ఇదే విషయాన్ని చాలామంది ఇతర అధ్యయనవేత్తలూ రూఢి చేశారు. ఉదాహరణకు పిల్లల్లోనైతే స్కూలు పరీక్షలు, ఎక్కడైనా నలుగురిలో మాట్లాడాల్సి రావడం, పెద్దల్లో కుటుంబాల్లో విభేదాలు, విపత్తుల్లో చిక్కుకు΄ోవడం, హింసకు లోనుకావడం వంటి సంఘటనల్లో ఒత్తిడి పెరిగితే అది ఆస్తమాను ట్రిగర్ చేయవచ్చు. మొదట ఒత్తిడి అనేది యాంగ్జైటీని పెంచి అటాక్ వచ్చేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తుంది. అంటే ఆస్తమా అటాక్‌ను ప్రేరేపించే హిస్టమైన్, ల్యూకోట్రైన్ వంటి రసాయనాలను విడుదలయ్యేలయ్యేలా చేస్తుంది. ఆ ప్రభావంతో వాయునాళాలు సన్నబారిపోతాయి. ఇక మిగతా సాధారణ వ్యక్తులతో పోలిస్తే... ఒత్తిడీ, యాంగ్జైటీ వంటి సమస్యలతో బాధపడేవారిలో ఆస్తమా ఉన్నప్పుడు వారి పరిస్థితిని నియంత్రించడం మరింత కష్టమవుతుంది.ఒత్తిడినీ, దాంతో వచ్చే ఆస్తమానూ అరికట్టడం ఎలా...? మొదట తమకు ఒత్తిడి కలిగిస్తున్న అంశాలేవో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక సమస్యలా, కుటుంబ సభ్యులతో విభేదాలా, ఎవరూ సహాయసహకారాలు అందించకపోవడం, ఎప్పుడూ పనిలోనే ఉండాల్సి రావడం లేదా నిత్యం డెడ్‌లైన్స్‌తో సతమతమవుతుండటమా అనేది తొలుత గుర్తించాలి. సమస్యను గుర్తించాక... దాన్ని ఎదుర్కోవడమనేది తమ వల్ల అవుతుందా, ఎవరి సహాయమూ లేకుండానే సమస్యకు పరిష్కారం సాధ్యపడుతుందా లేదా ఎవరైనా వృత్తినిపుణుల సహాయం అవసరమా తెలుసుకొని, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అన్ని పనులూ ఒకరే పూర్తి చేయలేరని గుర్తించాలి. తొలుత పనుల జాబితా రూపొందించి, ఎవరు చేయదగ్గపనుల్ని వారికి అప్పగించాలి. ఉదాహరణకు డెడ్‌లైన్‌లోపు ఒకరే ఆ పని చేయలేరనుకుంటే... దాన్ని విడదీసి తలా కాసింత బాధ్యత అప్పగించాలి. దీన్నే వర్క్‌ప్లేస్ స్ట్రాటజీ అంటారు. ఆఫీసు పనిచేసే సమయాల్లో ఈ వర్క్‌ప్లేస్ స్ట్రాటజీ అనుసరించాలి. అంతేకాదు... పని ఒత్తిడి అన్నది ఆఫీసులో ఒక్కరికే పరిమితమైనది కాదు... అది అక్కడ పనిచేసే అందరికీ వర్తించేదన్న విషయాన్ని గుర్తెరగాలి. దాంతో సగం ఒత్తిడి తగ్గుతుంది. ప్రతిరోజూ అలసట కలిగించని వ్యాయామాలు చేయాలి. వ్యాయామం మంచి స్ట్రెస్ బస్టర్. ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ విధానాల వంటివి అనుసరించాలి. యోగా, ధ్యానం వంటివీ ప్రాక్టీస్ చేయడం స్ట్రెస్‌ను చాలావరకు తగ్గిస్తుంది. అటాక్ వచ్చినప్పుడు వాడే మందులు, అటాక్ రాకుండా నివారించే మందులు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి . రోజూ కంటినిండా నిద్రపోవాలి. ఒత్తిడితో కూడిన అటాక్ వచ్చినప్పుడు 5 – 10 నిమిషాల్లో మీరు నార్మల్ స్థితికి రాకపోతే తక్షణం తప్పనిసరిగా వైద్యుల సహాయం తీసుకోవాలి. చికిత్స : విండ్పైపులు (వాయునాళాలు) వాపునకు (ఇన్ఫ్లమేషన్కు) గురైనప్పుడు... ఆ వాపు వల్ల గాలి ప్రవహించే లోపలి దారి సన్నబారి΄ోవడంతో శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. దాంతో ఆయాసం, పిల్లికూతల వంటి లక్షణాలతో ఆస్తమా కనిపిస్తుంది. ఈ లక్షణాలు తగ్గాలంటే మొదట తక్షణమే వాయునాళాలను విప్పార్చే / విస్తరింపజేసే మందులను లేదా ఇన్హేలర్స్ను వాడాలి. అదే రాకముందు లేదా వచ్చి తగ్గాక డాక్టర్ సలహా మేరకు ... ఆస్తమా రాకుండా నివారించే ప్రివెంటివ్ మందులు / ఇన్హేలర్స్ వాడాలి. ఆస్తమా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించేందుకు అవసరాన్ని బట్టి డాక్టర్లు యాంటీ హిస్టమైన ఇంజెక్షన్స్ కూడా వాడవచ్చు.అపోహ – వాస్తవం : ఇన్హేలర్ అలవాటు అవుతుందనీ, అది మంచిది కాదనే అ΄ోహ కొంతమందికి ఉంటుంది. నిజానికి టాబ్లెట్లతో పోలిస్తే ఇన్‌హేలర్స్‌తో దేహంలోకి ప్రవేశించే మందు మోతాదు చాలా తక్కువ. దాంతో సైడ్ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. అందుకే ఇన్హేలర్స్ సురక్షితమని గుర్తించాలి. ప్రివెంటివ్ మందు ఉండే ఇన్హేలర్స్ వాడుతుంటే అటాక్ రాకుండా అవి ఆస్తమాను అదుపులో ఉంచుతాయి.డాక్టర్ రవీంద్ర రెడ్డి, పల్మనాలజిస్ట్(చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
చేప ప్రసాదంగా కొల్లేరు కొర్రమీను
కైకలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొల్లేరు కొర్రమీను పిల్లలు (సీడ్) ఆస్తమా నివారణలో ఔషధంగా మారాయి. మృగశిరకార్తె రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదానికి కొల్లేరు ప్రాంత కొర్రమీను పిల్లలను సరఫరా కానున్నాయి. తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ (టీఎస్ ఎఫ్సీఓఎఫ్) ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదం నిమిత్తం టెండర్లను ఆహా్వనించింది. దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కొర్రమీను పిల్ల అవసరమని గుర్తించారు. తెలంగాణ మత్స్యశాఖ అధికారులు కొర్రమీను సీడ్ అందించే సీడ్ ఫామ్‌లను పరిశీలించి నివేదికను అక్కడి ప్రభుత్వానికి అందించారు. తెలంగాణలో లభ్యత లేకపోవడంతో.. చేప ప్రసాదానికి తెలంగాణలో సరిపడినన్ని చేప పిల్లల లభ్యత లేకపోవడంతో ఏపీ నుంచి కొర్రమీను పిల్లలకు మే 21న టెండర్లు ఆహా్వనించింది. ఏపీ నుంచి కొల్లేరు ప్రాంతాలైన ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం దేవపూడి ఫణిరామ్ ఫిష్ సీడ్ ఫామ్, ఏలూరుకు చెందిన దుర్గమల్లేశ్వర ఫిష్ హేచరీస్, కలిదిండి మండలం పోతుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు నుంచి దుర్గ ఫిష్ సీడ్ ఫామ్‌తో పాటు తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు కలిపి మొత్తం ఏడుగురు టెండర్లను దాఖలు చేశారు. తెలంగాణకు చెందిన వనపర్తి, ఖమ్మం, హన్మకొండ, సంగారెడ్డిలకు చెందిన జిల్లా మత్స్యశాఖ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతను అక్కడి ప్రభుత్వం అప్పగించింది. ఖమ్మం మత్స్యశాఖ అధికారి డి.ఆంజనేయస్వామి నేతృత్వంలో అధికారులు టెండర్లు వేసిన ఏపీలో సీడ్ ఫామ్‌లను పరిశీలించి ఈ నెల 25 తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించారు. పోషకాల గని కొర్రమీను కొర్రమీను పిల్ల చాలా హుషారుగా ఉంటుంది. ఇది మీటరు వరకు పెరుగుతుంది. మంచినీటి సరస్సులు, పొలాల బోదెలు, బురద నేలల్లో ఇవి పెరుగుతాయి. వీటిలో 18–20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఆకు కూరల్లో లభించే విటమిన్ ‘ఏ’ కంటే కొర్రమీనులో ఉండే విటమిన్ ‘ఏ’ తేలిగ్గా జీర్ణమవుతుంది. వీటిలో గంధకం కలిగిన లైసిన్, మిథియానిక్, సిస్టిన్ అమినో యాసిడ్లు లభిస్తాయి.చేప మందుతో కొర్రమీనుకు గుర్తింపు ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని హైదరాబాద్‌లో బత్తిన సోదరులు ఉచితంగా అందిస్తారు. కరోనా కారణంగా మూడేళ్లు ఆగిన ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్ 8న మృగశిరకార్తె ప్రారంభమయ్యే ఉదయం 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. వీరు తయారు చేసిన ప్రత్యేక మందును కొర్రమీను పిల్ల సహా నోటిలో వేస్తారు. తెలంగాణకు సరఫరా చేసే కొర్రమీను పిల్ల సైజు 2 అంగుళాల నుంచి 3 అంగుళాలు ఉండాలి. నల్ల రంగులో హుషారుగా ఉండాలి. ప్రస్తుత మార్కెట్లో ఒక్కో కొర్రమీను పిల్ల రూ.30 ధర పలుకుతోంది. పిల్ల సేకరణ ఓ సవాల్ కొర్రమీను పిల్లను సేకరించడం పెద్ద సవాల్‌గా మారుతోంది. కొల్లేరు సరస్సు, పొలాల గుంతల్లో కొర్రమీను తల్లి చేపను గుర్తిస్తారు. తల్లి వద్ద తిరిగే వేలల్లో పిల్లలను సేకరించి సిమెంటుతో చేసిన కుండీలలో ప్రత్యేకంగా పెంచుతారు. రోజుకు మూడుపూటలా నీరు మారుస్తారు. నాలుగు పూటలా మేత వేస్తారు. తెలంగాణ వరకు వ్యాన్లలో అత్యంత జాగ్రత్తగా వీటిని రవాణా చేస్తారు. కొల్లేరు ప్రాంతాల నుంచి వెళ్లే వ్యాన్లలో పిల్లలకు మూడు ప్రాంతాల్లో నీటిని మార్పు చేస్తారు. చేప మందు ప్రసాదం నిమిత్తం జూన్ 6వ తేదీన ఉదయం హైదారాబాద్‌కు కొల్లేరు కొర్రమీను పిల్లల్ని తరలించనున్నారు.కొల్లేరు ప్రాంతం అనుకూలం చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు సరస్సులో సహజసిద్ధంగా కొర్రమీను పెరుగుతుంది. నల్లజాతి చేపల్లో కొర్రమీనుకు ప్రత్యేక స్థానం ఉంది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొర్రమీను సాగు సైతం చేస్తున్నారు. కొర్రమీనులో పోషకాహారాలు అధికంగా ఉంటాయి. – షేక్ చాన్‌బాషా, ఫిషరీస్ ఏడీ, కైకలూరు -
ఇవి తింటే.. ఆస్తమా అటాక్ అవ్వదు!
ఆస్తమా నివారణ ఇలా... ఆస్తమా ఊపిరాడనివ్వకుండా చేస్త... ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలిసిన విషయమే. పైగా వర్షాలతో ఇప్పుడున్న వాతావరణం ఆస్తమాకు మరింత దోహదం చేస్తుంది. కొన్ని ఆహారాలతో ఆస్తమా అటాక్ రాకుండా నివారణ ఇలా... తమకు సరిపడని పదార్థాలతో ఆస్తమా ట్రిగర్ అవుతుంది. అందుకే ఆహారాల్లో తమకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి. భోజనంలో... ఆకుకూరల్లో పాలకూర, బచ్చలి వంటి వాటివి... కాయగూరల్లో కాకర, గుమ్మడి, క్యారట్, బీట్రూట్, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యాలు తీసుకోవాలి. పండ్లలో పుల్లటి పండ్లయిన కమలాలు, నిమ్మ, బత్తాయి, అరటిపండు వంటి వాటిని మినహాయించి, మిగతావాటిని అంటే ఉదాహరణకు బెర్రీ, బొప్పాయి వంటి పండ్లను తీసుకోవచ్చు. ఆహారాన్ని వండేందుకు ఉపయోగించే దినుసుల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు. ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు వంటి సహజ మసాలాదినుసులు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. (చదవండి: షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!) -
Health: ఆస్తమా ఉందా? కాకర, గుమ్మడి, లవంగాలు.. తరచుగా తింటున్నారా? అయితే
కొన్ని పదార్థాలు (అలర్జెన్స్) మాత్రమే కాకుండా ఒక్కోసారి కొన్ని ఆహారాలూ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అయితే మరికొన్ని ఆహారపదార్థాలు ఆస్తమాను నివారిస్తాయి కూడా. ఆస్తమాను అదుపులో ఉంచుకోడానికి మనకు సరిపడని ఆహారాలకు దూరంగా ఉంటూ, ఆస్తమాను నివారించే వాటిని తీసుకోవడం మంచిది. అయితే తమ తమ వ్యక్తిగత తత్త్వాన్ని బట్టి ఆస్తమాను నివారించేవిగా పేర్కొన్న అదే ఆహారం... మరికొందరిలో ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే తమ తమ శరీరతత్త్వాన్ని బట్టి తమకు ఏయే ఆహారాలు సరిపడవో జాగ్రత్తగా పరిశీలించుకుని సరిపడేవే వాడాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా ఆస్తమాను నివారించే, ప్రేరేపించే ఆహారాల జాబితా ఇది. ఆరోగ్యాన్నిచ్చి.. ఆస్తమాను అదుపు చేసే ఆహారాలు... కాయగూరలూ, ఆకుకూరలు : ►ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆస్తమా అదుపులో ఉంటుంది. ►ఇందుకోసం కాకర, గుమ్మడి, అరటి వంటి కూరగాయలు, పాలకూర వంటి ఆకుకూరలు.. మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. వండకుండానే తినే వాటిల్లో : ►కిస్మిస్, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్, క్యారట్, బీట్రూట్, తాజా కాయగూరలు తీసుకోవాలి. అలాగే కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పండ్లలో సాధారణంగా విటమిన్–సితో పాటు అనేక ఇతర విటమిన్లు, పోషకాలు ఉండటం వల్ల అవి ఆస్తమాను నివారించేవే. అయితే ఇవే పండ్లు కొందరిలో ఆస్తమాను ప్రేరేపించనూ వచ్చు. ►అలాగే అరటిపండు, పెరుగు వంటివి కొందరిలో ఆస్తమాను ట్రిగర్ చేయవచ్చు. వ్యక్తిగతంగా అవి తమకు సరిపడనప్పుడు మాత్రమే వీటి నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ తమ శరీర తత్వాన్ని బట్టి అవి ఆస్తమాను ప్రేరేపించనివైతే... ఈ ఆహారాలు ఆస్తమాను సమర్థంగా నివారించడమే కాదు... ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి. ఆస్తమాతో పాటు మరెన్నో రుగ్మతలను నివారిస్తాయి. ►అలాగే బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు నివారణకు ఎంతో తోడ్పతాయి. ►వెల్లుల్లి, ఉల్లి, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా గింజలు, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు. ►ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్తమాను నివారిస్తాయి, తీవ్రతనూ తగ్గిస్తాయి. ►అయితే మసాలాల తీవ్రత పెరగడం కొందరిలో ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా తీవ్రతను పెంచే ఆహారాలు: ►రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ►కూల్డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వీటిని మానేయాలి. ►ఉప్పు బాగా తగ్గించాలి. ►ఆస్తమా రావడానికి చిన్నప్పటి ఆహారపు అలవాట్లు కూడా కారణమేననే కోణంలో చాలా అధ్యయనాలు జరిగాయి. ►చిన్నపిల్లలకు ఆ వయసప్పుడే మంచి ఆహారపు అలవాట్లను నేర్పడం వల్ల పెద్దయ్యాక వారిలో ఆస్తమా వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. నోట్: కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించిన వివరాలు ఇవి. శరీర తత్త్వాన్ని బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఏదేమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది. చదవండి: Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. Health Tips In Telugu: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే.. -
గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా..
న్యూఢిల్లీ: దేశంలో 2020లో సంభవించిన మరణాల్లో 42 శాతం మరణాలకు కేవలం గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా కారణమని అధ్యయనంలో తేలింది. ఏడాదిలో 18,11,688 మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల గణాంకాల ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘ఇండియా రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్’ తాజాగా మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ 2020 పేరిట నివేదిక విడుదల చేశారు. కరోనా మహమ్మారి వల్ల 2020లో 1,60,618 మంది మృతిచెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంటే మొత్తం మరణాల్లో కరోనా సంబంధిత మరణాలు కేవలం 8.9 శాతమే. అలాగే రక్తప్రసరణ సంబంధిత వ్యాధుల కారణంగా 32.1 శాతం మంది, శ్వాస సంబంధిత జబ్బుల వల్ల 10 శాతం మంది మరణించినట్లు గుర్తించారు. ఇక టీబీ, సెప్టిసెమియా కారణంగా 7.1 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యయనకర్తలు తెలిపారు. అంతేకాకుండా డయాబెటిస్, పోషకాహార లేమి వంటి వాటితో 5.8 శాతం మంది, గాయాలు, విషం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటి వాటితో 5.6 మంది, క్యాన్సర్‌తో 4.7 శాతం మంది మృతిచెందారు. 2020లో మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల్లో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తం మరణాల్లో 28.6 శాతం మంది(5,17,678) బాధితులు 70 ఏళ్ల వయసు దాటినవారే కావడం గమనార్హం. బాధితుల్లో ఏడాదిలోపు వయసు ఉన్నవారు 5.7 శాతం మంది ఉన్నారు. 15 నుంచి 24 ఏళ్లవారిలో 19 శాతం మందిని రక్తప్రసరణ సంబంధిత వ్యాధులే పొట్టనపెట్టుకున్నాయి. -
కొత్త ప్రక్రియలతో ఆస్తమాను ఇలా అధిగమించవచ్చు..!
ఆస్తమా అదుపు చేయడానికి మందులు, స్టెరాయిడ్స్, ఇన్హేలర్స్ వంటి సంప్రదాయ మందులు వాడటం మామూలే. ఇప్పటికీ ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే మరికొన్ని కొత్త కొత్త ప్రక్రియల ద్వారా ఆస్తమాను అదుపు చేయడం ఇప్పుడు మరింత తేలికగా మారింది. ఈ కొత్త ప్రక్రియలను తెలుసుకుందాం. తీవ్రమైన ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఇప్పుడు బ్రాంకియల్ థర్మోప్లాస్టీ, బయలాజిక్ మెడిసిన్ అనే రెండు ఆధునిక చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో ఆస్తమా కాస్తంత తీవ్రమైన సమస్యగా ఉన్నవారు కూడా సాధారణ జీవితం గడపడం సాధ్యమవుతుంది. బ్రాంకియల్ థర్మోప్లాస్టీ ప్రక్రియలో ఒక ప్రత్యేకమైన పరికరం సహాయంతో శ్వాసనాళపు గోడల్ని వేడి చేస్తారు. ప్రోబ్ అనే పరికరాన్ని బ్రాంకోస్కోప్ సహాయంతో లోపలికి పంపుతారు. అది అక్కడ వేడిమిని వెలువరిస్తుంది. ఆ వేడిమి తో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్‌ను తొలగిస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకునే నాళం విశాలంగా తెరుచుకుంటుంది. దాంతో హాయిగా శ్వాస పీల్చుకోవడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియను మూడు వారాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మూడు దఫాల చికిత్స పూర్తయ్యేసరికి తీవ్రమైన ఆస్తమా వ్యాధి లక్షణాలు బాగా తగ్గిపోతాయి. మంచి ఉపశమనం దొరుకుతుంది. జీవననాణ్యత గణనీయంగా పెరగడంతో పాటు, ఆస్తమా అటాక్స్ తగ్గుతాయి. దాంతో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాలూ తగ్గుతాయి. ఈ చికిత్స ఫలితాలు చాలా కాలం... అంటే దాదాపుగా ఎనిమిదేళ్లు ఉంటాయి. ఇన్హేలర్స్ వాడినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించని, పద్ధెమినిమిదేళ్లు పైబడిన యుక్తవయస్కులైన బాధితులకు ఎవరికైనా ఈ చికిత్స అందించవచ్చు. అలాగే ఇప్పుడు బయోలాజిక్ మెడిసిన్స్ అనే కొత్తరకం మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో శ్వాసనాళాల వాపు కారణంగా ఆ నాళాలు సన్నబడతాయి. ఆ వాపును ఈ మందులు తగ్గించడం ద్వారా ఆస్తమాను అదుపు చేస్తాయి. -
కనిపించని శత్రువు.. ముందే గుర్తిస్తే మందులతో నయం!
ఎలా సోకుతుంది....? వంశపారంపర్యంగా... దుమ్ము,ధూళిలో ఎక్కువగా ఉండేవారికి పని ప్రదేశాలలో శుభ్రత లేకపోతే ఎలర్జీ, జీవన విధానం లక్షణాలు శరీరంలో గాలిగొట్టాలు ముడుచుకుపోవడం పిల్లికూతలు ఊపిరి ఆడనంతగా ఆయాసం ఎడతెరపిలేకుండా దగ్గు రావడం పెదవాల్తేరు (విశాఖతూర్పు): ప్రపంచంలో పూర్తిగా నయమయ్యే వ్యాధులలో ఆస్తమా ఒకటి. చైనాలో క్రీస్తుపూర్వం 2,600 సంవత్సరంలో ఒక వ్యక్తి దగ్గు, ఆయాసంతో బాధపడడంతో తరువాతి కాలంలో ఇది ఆస్తమా అని వైద్యనిపుణులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇచ్చిన పిలుపు మేరకు 1993 సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఏటా మే 3వ తేదీన జరుపుకుంటున్నారు. ఇది అంటువ్యాధి కాకపోవడంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. చినవాల్తేరులోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో దాదాపుగా 500 మంది ఆస్తమా రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది కేంద్ర ఆరోగ్యశాఖ ఆస్తమా దినోత్సవాన్ని ‘క్లోజింగ్ గేప్స్ ఇన్ ఆస్తమా కేర్’ నినాదంతో జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది. ఆస్తమా వ్యాధి సాధారణంగా రెండేళ్ల వయసు నుంచి 78 సంవత్సరాల వయసు గల వ్యక్తులలో కనిపిస్తుంది. రెండు వారాలకు మించి దగ్గు, ఆయాసం వుంటే వెంటనే పల్మనాలజిస్టును సంప్రదించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదని వారు స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో 10 నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని అంచనా. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో మొత్తం 288 పడకలు వుండగా, సూపరింటెండెంట్ పర్యవేక్షణలో నలుగురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్, పది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 45మంది పీజీలు, ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి గిరిజనులకు ఎక్కువగా సోకుతుండడం విచారకరం. చికిత్స ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో ఆస్తమా రోగులకు సాధారణంగా రెండునుంచి మూడు వారాల పాటు చికిత్స అందిస్తారు. ఈ రోగులు ఇన్హేలర్, కొన్నిరకాల మాత్రలు వాడాల్సి వుంటుంది. ఆస్తమా సోకితే ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి వైటల్ ఆర్గానిక్స్, కిడ్నీపై కూడా ప్రభావం చూపే అవకాశం కూడా వుంటుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్తమా రోగులకు అన్నిరకాల చికిత్స ఉచితంగానే అందిస్తున్నారు. తీవ్రమైన ఆస్తమాతో బాధపడే రోగులకు వెంటిలేటర్లపై చికిత్స చేస్తారు. ఏరో థెరపీ, ఇన్హీలర్థెరపీ, నిబ్యులైజేషన్ చికిత్సలతో రోగులకు ఇట్టే నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలనుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలతో చికిత్స అందుబాటులో ఉండడం విశేషం. చాలాకాలంగా ఆస్తమా రోగుల్లో మరణాలు నమోదు కాకపోవడం సంతోషకరం. ఓపీలో సేవలు స్థానిక ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో రోజూ ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలు, తిరిగి 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపీ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో గతనెలనుంచి ఛాతీ ఆస్పత్రిలో మళ్లీ సాధారణ వైద్యసేవలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఓపీ విభాగంలో రోజూ 120 మంది వరకు రోగులు వైద్యం పొందుతున్నారు. అవగాహన సదస్సు ప్రపంచ ఆస్తమా దినోత్సవం పురస్కరించుకుని ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 10 గంటలనుంచి అవగాహన సదస్సు జరుగింది. వైద్యనిపుణులు ఆస్తమాపై అవగాహన కల్పించి, రోగుల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఎయిర్‌కూలర్లు, ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఆస్తమాని త్వరగా గుర్తిస్తే చికిత్సతో పూర్తిగా నయం అవుతుంది. అంతర్జాతీయ వైద్యనిపుణుల సూచనలతో ఆధునిక చికిత్స చేస్తున్నాం. –డాక్టర్ ఆర్.సునీల్‌కుమార్, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, చినవాల్తేరు -
Inhaler Usage: చిన్నారులు ఇన్హేలర్స్ వాడుతున్నారా? అయితే..
ఆస్తమా ఉన్నవారికి డాక్టర్లు ఇన్‌హేలర్స్‌తో చికిత్స చేస్తుంటారు. వీటిపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా మందును ఊపిరితిత్తులోకి పీలుస్తుండాలి కాబట్టి... వాటితో ఏదైనా హాని జరుగుతుందేమో అని కొందరు ఆందోళన పడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు, పసివాళ్లకు అవి మంచివేనా అంటూ సందేహ పడుతుంటారు. నిజానికి ఇన్హేలర్స్ చాలా సురక్షితం. ఓ మందును మింగడం వల్ల అది కేవలం ఊపిరితిత్తులకే కాకుండా... మిగతా అన్ని అవయవాల కణాలకూ చేరుతుంది. కానీ ఇన్హేలర్స్ కేవలం సమస్య ఉన్న చోటే చికిత్స జరిగేలా చూస్తాయి. ఇన్హేలర్స్లో వాడే మందు మోతాదు కూడా చాలా తక్కువ. ఇది మైక్రోగ్రాముల్లో ఉంటుంది. ముఖ్యంగా టానిక్స్, ట్యాబ్లెట్లతో పోలిస్తే ఇది మరీ మరీ తక్కువ. ఇక స్పేసర్ డివైజ్ వాడితే... మందు ఏమాత్రం వృథా కాదు. అందుకే... ఎలాంటి అపోహలూ లేకుండా ఇన్హేలర్స్ వాడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. చదవండి: మొదటిసారే గుండెపోటు తీవ్రంగా.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా? Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... -
అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా..
Winter Season: Tips To Handle Asthma Allergy Doctors Suggestions: ఆస్తమా, అలర్జీ ఈ రెండూ వేర్వేరని అనుకుంటారు కొందరు. కానీ ఆస్తమా అన్నది కూడా అలర్జీ తాలూకు ఒక రకమైన వ్యక్తీకరణ. సౌకర్యం కోసం శ్వాస వ్యవస్థను అప్పర్ రెస్పిరేటరీ ఎయిర్ వే అనీ... కింది భాగాన్ని లోయర్ రెస్పిరేటరీ ఎయిర్ వే అని చెబుతుంటారు గానీ... ఈ రెండూ ఒకటే. డూప్లె(క్స్) భవనంలోని పై భాగం అప్పర్ ఎయిర్ వే అయితే... కింది భాగం లోయర్ ఎయిర్ వే... ఈ రెండూ కలిసిన ఒకే ఇల్లు లాంటివివి. అలర్జీ వల్ల పై భాగం ప్రభావితమైతే ‘అలర్జిక్ రైనైటిస్’. అదే కింది భాగం అయితే అది ఆస్తమా. గమనించి చూస్తే 60% నుంచి 70% మందిలో అలర్జీలూ, ఆస్తమా ఈ రెండూ ఉంటాయి. ఈ సీజన్లో వీటి బెడద మరింత ఎక్కువ. అందుకే చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమా... తీవ్రతను తగ్గించుకోవడం ఎలాగో చూద్దాం. అలర్జీలు అలర్జీ అంటే ఏదైనా మనకు సరిపడని పదార్థం మనలోకి ప్రవేశిస్తే... దాన్ని ఎదుర్కొనేందుకు మన వ్యాధి నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా స్పందించడం. కొందరిలో ఈ ప్రతిస్పందన చాలా ఎక్కువ!. అదెంత ఎక్కువగానంటే... మన ఆరోగ్యాన్నే దెబ్బతీసేంత తీవ్రంగా! అప్పుడు మన దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్నే ‘అలర్జీ’ అంటారు. అలా అలర్జీని కలిగించే పదార్థాల్ని ‘అలర్జెన్’ అంటారు. అలర్జీలు వేటివేటితో... నిర్వహణ ఎలా? సాధారణంగా పిల్లల్లో / పెద్దల్లో చాలా మందికి చాలా రకాల అంశాలు సరిపడవు. ఆహారాలు : చాక్లెట్స్, గోధుమలతో వండిన ఆహారాలు, కొందరికి గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు, పాలతో చేసిన పదార్థాల వంటి వాటితో రావచ్చు. పాలు తాగే పసిపాపల్లో సైతం బాటిల్ ఫుడ్, పోతపాలు, టిన్డ్ ఫుడ్ వంటివాటితో అలర్జీలు రావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : పిల్లలకు సరిపడని వాటిని... వారినుంచి దూరంగా ఉంచడమే దీనికి తొలి చికిత్స అని గుర్తుపెట్టుకోవాలి. పరిసరాలు/ వాతావరణం : పొగ, దుమ్ము ధూళి, పుప్పొడి, దోమల మందు వంటివి. నిర్వహణ (మేనేజ్మెంట్) : పైన పేర్కొన్నవి కమ్ముకుని ఉండే చోట్ల నుంచి దూరంగా ఉండాలి. మందులు / ఇతరాలు : కొందరు పిల్లలకు పెన్సిలిన్, యాస్పిరిన్ వంటివి సరిపడకపోవచ్చు. మరికొందరికి కాస్మటిక్స్ పడకపోవచ్చు. సోయా అలర్జీ, మోల్డ్ అలర్జీ, సన్ అలర్జీ, కొందరికి రబ్బర్ వస్తులతో కలిగే లేటెక్స్ అలర్జీ... ఇలా ఎన్నెన్నో కారణాలతో... రకాల అలర్జీలు వచ్చే అవకాశముంది. నిర్వహణ (మేనేజ్మెంట్) : మనకు అలర్జీ కలిగించే అంశం ఏదైనా దాన్ని నుంచి దూరంగా ఉండటమే దాని నివారణకూ, నిర్వహణకు మేలైన మార్గమని గుర్తుంచుకోవాలి. ఆస్తమా ఆస్తమాను ప్రేరేపించే అంశాలు... దాని నిర్వహణ అలర్జిక్ ఆస్తమా : అలర్జీ తీవ్రతరమైనప్పుడు ఆస్తమాలా రావచ్చు. అలాగే తమకు సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : మనకు సరిపడని ఆహారానికి/వాతావరణానికి/పరిసరాలకు దూరంగా ఉండటం వ్యాయామం : తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు కొందరిలో ఆస్తమా రావచ్చు. మనం గాలిని పీల్చగానే ముక్కులోకి ప్రవేశించిన బయటి చలి గాలిని కాస్తంత వెచ్చబరచడం, తేమ ఉండేలా చేయడం వంటి పనులను ముక్కు చేస్తుంది. వ్యాయామ సమయంలో సాధారణ సమయంలో కంటే పెద్దమొత్తంలో గాలిని పీల్చుకుంటుంటాం. దాంతో బయటి గాలి తాలూకు టెంపరేచర్, తేమల తేడాలను తట్టుకోలేని శ్వాసనాళాలు ముడుచుకుపోతాయి. వ్యాయామం కారణంగా ఎక్కువ మోతాదులో గాలి అవసరమవుతుంది. కానీ ముడుచుకుపోయిన శ్వాసనాళాల నుంచి అవసరమైన మేరకు గాలి అందదు. దాంతో ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా’ వస్తుంది. నిర్వహణ (మేనేజ్మెంట్) : సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా మొదలవుతుంది. బయటి గాలిలో, ముక్కు నుంచి దేహంలోకి లోపలికి ప్రవేశించాక ఉన్నగాలిలో తేడాలు ఎక్కువైతే ఇది వస్తుంది కాబట్టి దేహం కూడా దీన్ని తట్టుకునేలా నేరుగా వ్యాయామం మొదలుపెట్టకుండా... కనీసం 5 – 10 నిమిషాల పాటు వార్మ్ అప్ వ్యాయామాలు చేయాలి. వార్మ్ అప్ వ్యాయామాలు ఎంతసేపు చేస్తే... ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా వచ్చే అవకాశాలు అంతగా తగ్గుతాయి. ఒకవేళ అప్పటికీ వస్తూనే ఉంటే వ్యాయామం తాత్కాలికంగా ఆపేసి, డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే మొదలుపెట్టాలి. జీఈఆర్డీ సమస్యతో అజీర్తి / పులితేన్పులుతో : కొందరిలో ఆహారం తీసుకున్న తర్వాత వారి కడుపులో జీర్ణం చేసేందుకు ఉపయోగపడే యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావం కడుపులోంచి గొంతులోకి వెనక్కు వెళ్లినప్పుడు (రిఫ్లక్స్) గొంతు, పొట్టపైభాగంలో మంట, నొప్పి వస్తాయి.కొందరిలో తిన్నది గొంతులోకి వస్తున్నట్లుగా అనిపిస్తు్తంది. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అంటారు. పులితేన్పుల రూపంలో యాసిడ్ గొంతులోకి రాగానే గొంతు మండడం, కడుపు ఉబ్బరం చాలామందికి అనుభవంలోకి వచ్చేదే. జీఈఆర్డీ సమస్య ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత కడుపు బరువుగా ఉండటం, ఆయాసంగా అనిపించడం, నిద్రలో సమస్య ఎక్కువై, మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. నిర్వహణ (మేనేజ్మెంట్) : సాధారణంగా ఒకేసారి ఎక్కువ మోతాదులో తినేవారిలో ఇలాంటి ఆస్తమా ఎక్కువ. అందుకే తక్కువ మోతాదుల్లో తింటూ కడుపును తేలిగ్గా ఉంచుకునే వారిలో ఈ సమస్య తగ్గుతుంది. రాత్రివేళ వీలైనంత ముందుగా భోజనం పూర్తి చేయాలి. తిన్న వెంటనే (ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత) పడుకోకుండా / నిద్రకు ఉపక్రమించకుండా కాసేపు అటు ఇటు నడిచాకే పక్క మీదికి చేరాలి. ఇతర కారణాలతో... పొగాకు పొగ, కట్టెల పొయ్యినుంచి వెలువడే పొగ, రంగుల (పెయింట్స్) లేదా అగరుబత్తీల వంటి వాటి వాసన సరిపడకపోవడం వంటి అంశాలతోనూ ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్‌ప్లేస్ ఆస్తమా’ అంటారు. కొందరిలో కొన్ని మందులు సరిపడకపోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. నిర్వహణ (మేనేజ్మెంట్) : తమకు సరిపడని వాటి నుంచి దూరంగా ఉండటమే ఈ సమస్యల నివారణకు మార్గం. అలాగే వర్క్‌ప్లేస్ ఆస్తమా ఉన్నవారు... వీలైతే తమ వృత్తిని మార్చుకోవడమే మేలు. ఇక మందులతో ఆస్తమా వచ్చేవారు... ఏవి తమకు సరిపడటం లేదో గుర్తించి, ఆ విషయాన్ని డాక్టర్‌కు తెలిపి, మందులను మార్పించుకోవాలి. -డాక్టర్ రఘుకాంత్..సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ చదవండి: Bottle Gourd Juice: సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే అద్భుత ఫలితాలు! జ్యూస్ అస్సలు వదలరు! -
పిల్లలకు ఇవి తినిపించండి... ఆస్తమాకు దూరంగా ఉంచండి
ఇటీవల ఆస్తమాతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. చిన్నప్పుడు తాజాపండ్లు, కూరగాయలు అంతగా తినకుండా చాలావరకు ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే వారు... పెద్దయ్యాక ఆస్తమా బారిన పడడానికి అవకాశాలెక్కువ. అందుకే దాని నివారణకు పిల్లల ఆహారం మీద దృష్టి కేంద్రీకరించాలి. పిల్లలకు తినిపించాల్సినవి... కిస్మిస్, బాదం, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్, బెర్రీ పండ్లు, బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, కూర అరటి, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు పిల్లల చేత తినిపించాలి. క్యారట్, బీట్రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు తీసుకోవాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, పాలు రోజూ తీసుకోవచ్చు. ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలా దినుసులతో చేసిన పదార్థాలు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. వీటిని ప్రయత్నించి చూడవచ్చు... పాలలో చిటికెడు పసుపు కలిపి తాగించడం, ఒక స్పూన్ పసుపులో అంతే మోతాదులో తేనె కలిపి పరగడుపున తీసుకోవడం... ఉపశమనంతోపాటు నివారణకూ తోడ్పడుతుంది. పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగించాలి. ఇవి ఆస్తమాను పెంచుతాయి! రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్, కూల్‌డ్రింక్స్ తీసుకోకపోవడం మంచిది. చదవండి : కాకరకాయ కూర తరచూ తింటే చక్కెర అదుపులోకి వస్తుందా? -
గ్యాస్ స్టవ్‌లతో కూడా ‘ఆస్తమా’!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇప్పటికీ మీరు కట్టెల పొయ్యి ఉపయోగిస్తున్నారా?’ అంటూ అవాక్కవుతాం, గ్యాస్ పొయ్యి వాడని వారిని చూసి. కట్టెల పొయ్యి నుంచి పొగ వస్తుందని, ఆ పొగ వల్ల వంటచేస్తున్న వారు ఉక్కిరిబిక్కిరవుతారని, వారి ఊపిరి తిత్తులు దెబ్బతింటాయని, పైగా ఆ పొగ వల్ల వాతావరణ కాలుష్యం కూడా పెరగుతుందని ఎవరైనా చెబుతారు. అందుకే కట్టెల పొయ్యిలతో నేటికి కుస్తీలు పడుతున్న మహిళలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఉజ్వల పథకం’ కింద ఇంటింటికి గ్యాస్ స్టవ్ పథకాన్ని ప్రారంభించారు. వాస్తవానికి గ్యాస్ స్టవ్‌ల వల్ల కూడా పిల్లలకు ఆస్తమా వస్తోందని, వాతావరణ కాలుష్యం కూడా పెరగుతోందని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. గ్యాస్ స్టవ్ వెలిగించి నేచురల్ గ్యాస్‌ను మండించడం వల్ల మంచి నీలి రంగు మంట వస్తుంది. మంటను ఏ స్థాయిలో పెట్టుకోవాలంటే ఆ స్థాయిలో పెట్టుకోవచ్చు. ఊపిరి తిత్తులను ఉక్కిరిబిక్కిరి చేసే పొగకు అవకాశమే ఉండదు. కానీ మంట వల్ల కూడా కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. అలా వెలువడే కిలో కార్బన్ డయాక్సైడ్తోపాటుగా 34 గ్రాముల కార్బన్ మోనాక్సైడ్, 79 గ్రాముల నైట్రోజన్ ఆక్సైడ్, ఆరు గ్రాముల సల్ఫర్ ఆక్సైడ్లు విడుదలవుతాయి. (రైతుల ఫేస్బుక్, ఇన్‌స్టా బ్లాక్ : ఫేస్బుక్ స్పందన) ఇక వాతావరణాన్ని కాలుష్యానికి కారణమయ్యే ధూళి లేదా నుసి రేణువులు ‘పీఎం 2.5 (పర్టికులేట్ మ్యాటర్ డయామీటర్‌లో 2.5 మైక్రోమీటర్కన్నా తక్కువ పరిణామం ఉండడం)’ కూడా విడుదలవుతాయి. ఎలక్ట్రిక్ స్టవ్లకన్నా గ్యాస్ స్టవ్‌ల వల్ల నుసి రేణువులు రెట్టింపు విడుదలవుతాయి. అదే కట్టెల పొయ్యిల వల్ల ఈ నుసి రేణువులు ఏడు వందల రెట్లు పెరగుతాయి. ఆ పొయ్యిల వల్ల సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఎక్కువగానే విడుదలవుతుంది. బొగ్గులు, కట్టెల పొయ్యిల కన్నా గ్యాస్ స్టవ్‌లు తక్కువ కాలుష్యాన్ని కలుగ జేస్తాయంటూ వాదించే వారు లేకపోలేదు. పొదలు, అడవులు అంటుకోవడం వల్ల, డీజిల్ వాహనాల వల్ల, కట్టెల పొయ్యిలు, కట్టెల బాయిలర్లు వల్ల, పంట దుబ్బలను తగుల పెట్టడంతోపాటు గ్యాస్ స్టవ్‌ల వినియోగం వల్ల వెలువడే నైట్రోజెన్ డయాక్సైడ్, పీఎం 2.5’ రేణువులతో మనుషుల, ముఖ్యంగా పిల్లల ఊపిరితుత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా లాంటి జబ్బులు వస్తాయి. గ్యాస్ ఈటర్ల వల్ల కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. ‘పిల్లలకు సహజంగా వచ్చే ఆస్తమా కన్నా గ్యాస్ కుకింగ్ ఇళ్లలో నివసిస్తోన్న పిల్లల్లో ఆస్తామా వచ్చే అవకాశాలు 42 శాతం పెరిగినట్లు ‘నెదర్లాండ్స్‌లో నిర్వహించిన ఓ సర్వే’లో వెల్లడయింది. అమెరికా ఇళ్లలో గ్యాస్ కూకర్స్ను ఉపయోగించడం వల్ల నైట్రోజన్, డయాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. గ్యాస్ స్టవ్ వినియోగం వల్ల 80 ఇళ్లలో ఏడేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు మధ్య వయస్కు పిల్లలు ఆస్తమా బారిన పడినట్లు ‘ఆస్ట్రేలియన్ స్టడీ ఇన్ ది లాత్రోబ్ వ్యాలీ’లో వెల్లడయింది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ స్టవ్‌ల వినియోగం వల్ల పిల్లల్లో అస్తమా వచ్చే అవకాశాలు 12.8 శాతం ఉండగా, మంచి వెంటిలేషన్ వల్ల లేదా మంచి చిమ్నీల వల్ల ఆ ప్రమాదాన్ని 3.4 శాతం తగ్గుంచుకోవచ్చు’ అని అడెలేడ్ యూనివర్శిటీలో ఫార్మకాలోజీ సీనియర్ అధ్యాపకులు ఐయాన్ ముస్గ్రేవ్ తెలిపారు. -
ఆలస్యం చేయకండి..!
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంపై ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు సీజనల్ వ్యాధులు విశ్వరూపం చూపుతున్నాయి. జ్వరాలపట్ల అలసత్వంగా ఉన్నా, చికిత్సకు ఆలస్యం చేసినా పంజా విసిరి జనాలను ఆగం చేస్తున్నాయి. కరోనాలోనూ, మలేరియా, డెంగీ, టైఫాయిడ్లోనూ జ్వరమే సాధా రణంగా కనిపించే లక్షణం. కరోనా కాలంలో ఎవరిలో? ఏ జ్వరం ఉందో? గుర్తించడం బాధితులకే కాదు.. వైద్యులకూ ఇబ్బందిగా మారింది. చాలామంది కరోనా జ్వరాలను కూడా సాధారణ జ్వరంగా భావించి చికిత్సను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం టెస్టు కూడా చేయించుకోవడం లేదు. ముఖ్యంగా యాభై ఐదేళ్లు పై బడిన బీపీ, షుగర్, ఆస్తమా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చికిత్సను నిర్లక్ష్యం చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుం టున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేక నిస్సహా యతను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మృతి చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుసహా ప్రముఖ గాయకుడు నిస్సార్, బహుజన మేధావి ఉ.సా, ప్రముఖ జర్నలిస్టు పీవీరావుతోపాటు పలువురిలో అక స్మాత్తుగా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో.. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన బాధితుల్లో 40 ఏళ్లలోపువారు 57.1 శాతం మంది ఉండగా, ఆపై వయసు వారు 48.8 శాతం మంది ఉన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలోనూ హైపర్ టెన్షన్, మధుమేహం, ఆస్తమా ఇలా ఏదో ఒక ఇతర అనారోగ్య సమస్య ఉంటుంది. సాధారణ యువకులతో పోలిస్తే వీరిలో రోగనిరోధకశక్తి తక్కువ. వీరిలో చాలామంది తమ పని ప్రదేశాల్లో 35 ఏళ్లలోపు సాధారణ యువకులతో కలిపి పని చేస్తుంటారు. యువకులు అసింప్టమేటిక్‌గా ఉంటున్నారు. వీరిలో చాలామందికి తమకు వైరస్ సోకిన విషయమే తెలియడం లేదు. వీరంతా తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా, శానిటైజర్ ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. అసింప్టమేటిక్ బాధితుల నుంచి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే 55 ఏళ్లు పైబడినవారికి వైరస్ సోకుతోంది. వీరిలో చాలామంది సాధారణ జ్వరం, జలుబు, దగ్గుగా భావించి టెస్టులు, చికిత్సలను లైట్‌గా తీసుకుంటున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుండటంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ శాతం పడి పోయి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి వచ్చిన వీరిని కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమిం చాల్సి వస్తోంది. పరిస్థితి విషమించి చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాదు, పడకలు, వైద్య సిబ్బంది నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేయాల్సి వస్తోంది. అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే... సాధారణ ప్రజలతో పోలిస్తే.. వైరస్‌పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే చికిత్స లను ఎక్కువ నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒంట్లో ఏ చిన్న లక్షణం కన్పించినా చాలామంది వెంటనే అప్రమత్తమైపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వివిధ కషాయాలు తాగుతూ పౌష్టికాహారం తీసుకుంటూ ప్రాణాయామం వంటి యోగాసనాలు చేస్తూ వైరస్‌ను జయిస్తు న్నారు. కానీ, వైద్యంపై కనీస అవగాహన లేని ఇలాంటివారితో పోలిస్తే.. ఉన్నత చదువులు చదివి, వైరస్‌పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఇటీవల వెలుగు చూసిన పలు ఘటనలు పరిశీలిస్తే అవగతమవుతుంది. వీరు అతి తెలివిగా ఆలోచించి, చివరకు చిక్కుల్లో పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మొదలు.. చికిత్స వరకు... ఇలా ప్రతి విషయంలోనూ దాటవేత ధోరణినే అవలం బిస్తూ చివరకు తమ ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వైరస్‌ను ముందే గుర్తించి అప్రమత్తమైతే... ప్రమాదం నుంచి బయట పడేవారని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్వాసనాళాలపైనే ఎక్కువ ప్రభావం.. ప్రస్తుతం కంటికి కన్పించని ప్రమాదకరమైన కరోనా వైరస్‌తో పోరాడుతున్నాం. ఇది ఒకరి నుంచి మరొకరికి ముక్కు, కన్ను, చెవి, నోరు వంటి భాగాల ద్వారా ప్రవేశిస్తుంది. ముందు గొంతు, శ్వాసనాళాలు, ఆ తర్వాత గుండె, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. వృద్ధులు, మధుమేహులు, ఆస్తమా బాధితులపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వైరస్ బారి నుంచి బయటపడొచ్చు. నిర్లక్ష్యం చేయడం ద్వారా వైరస్ శ్వాసనాళాల పనితీరును దెబ్బతీస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. శరీరంలో ఆక్సిజన్ శాతం పడిపోతుంది. ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతుంది. ముందుగానే టెస్టు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ, చాలామంది ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. – డాక్టర్ రఫీ, పల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి -
ఆస్తమా నియంత్రణతో హ్యాపీ ఊపిరి
చలికాలం వచ్చిందంటే చాలమంది చిన్నపిల్లలకు ఇబ్బంది. ఆ పిల్లల తల్లిదండ్రులకూ వణుకు. కారణం... ఈ వాతావరణంలో పిల్లల్లో ఆస్తమా మరింత పెచ్చరిల్లుతుంది. ఆస్తమా ఉన్నవారిలో ఊపిరితిత్తులకు ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) వస్తుంది. అప్పుడప్పుడూ ఎటాక్ చేస్తూ ఇది దీర్ఘకాలికంగా బాధిస్తుంది. ఈ సీజన్లో మరిన్ని ఎక్కువసార్లు, మరింత తీవ్రతతో కనిపించేందుకు అవకాశాలెక్కువ. అలర్జీ కారణంగా వచ్చే ఆస్తమా... ఈ సీజన్లో అయితే సరిపడని వాతావరణంతోనూ వస్తుంది. ఆస్తమాపై అవగాహనకు, దానిని నియంత్రణలో ఉంచుకునేందుకే ఈ కథనం... ఆస్తమాను అర్థం చేసుకోవాలంటే మన ఊపిరితిత్తుల్లోని వాయు నాళాల పనితీరును అవగతం చేసుకోవాలి. మన దేహానికి అవసరమైన ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లి, అక్కడి కాలుష్య కార్బన్ డై ఆక్సైడ్‌ను మళ్లీ బయటకు వదలడానికి అంచెలంచెలుగా అనేక నాళాలు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట, ఎర్రబారడం) కారణంగా అవి ఉబ్బుతాయి. దాంతో సెన్సిటివ్‌గా మారిపోతాయి. ఉదాహరణకు చర్మంపై ఏదైనా గాయమైనప్పుడు అది ఎర్రబారి, వాచి, ముట్టుకుందామన్నా ముట్టనివ్వని విధంగా మారడాన్ని ఇన్ఫ్లమేషన్ అని చెప్పవచ్చు. ఇలా ఊపిరితిత్తుల్లోని నాళాల కండరాలు ఉబ్బడం వల్ల వాటి మధ్యభాగంలోని స్థలం సన్నబడిపోయి, శ్వాసమార్గాలు మూసుకు పోయినట్లుగా అవుతాయి. ఫలితంగా ఆ నాళాల్లో గాలి ఫ్రీగా కదిలేందుకు సరిపడనంత స్థలం లేక శ్వాస సరిగా అందదు. దాంతో మనకు ఆస్తమా అటాక్ వస్తుందన్నమాట. ఏవైనా మనకు సరిపడని వాటిని తిన్నా, పీల్చుకున్నా మన వాయునాళాలు తీవ్రంగా ప్రతిస్పందించడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సీజన్లో చల్లటి వాతావరణంలోని గాలిలో మంచు కారణంగా వాయునాళాలు ఉబ్బుతాయి. దాంతో పాటు వాయునాళాల్లో కాస్త జిగురుగా ఉండే మ్యూకస్ అనే పదార్థం స్రవిస్తుంది. అసలే నాళాలు సన్నబడి ఉండటంతో పాటు... ఈ మ్యూకస్ కూడా అడ్డుపడటం వల్ల వాయువులు కదిలే ప్రాంతం మరింత మూసుకుపోతుంది. ఫలితంగా గాలి పీల్చడమూ, వదలడమూ... అంటే మొత్తంగా శ్వాస తీసుకోవడమే చాలా కష్టమవుతుంది. కారణాలు: ఆస్తమాకు ప్రధాన కారణం జన్యుపరమైనవని అనేక అధ్యయనాల్లో స్పష్టమైంది. అయితే ఇటీవల జన్యుపరమైన కారణాలేమీ లేకుండానే ఇది వస్తోందంటూ కూడా మరికొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇక మనకు సరిపడని వాతావరణం దీన్ని ట్రిగ్గర్ చేస్తుందనేది చాలామందికి తెలిసిన విషయమే. మనం శ్వాసించే సమయంలో ఏదైనా మనకు సరిపడని పదార్థం (దీన్ని అలర్జెన్ అంటారు) మన ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశిస్తే అది అలర్జిక్ రియాక్షన్‌కు కారణమవుతుంది. ఇలా అలర్జిక్ రియాక్షన్ రావడానికి కారణమయ్యే అంశాల్లో ఇవి కొన్ని... ►గదుల్లోపల (ఇన్‌డోర్స్‌లో)ఉండే అలర్జెన్స్ (ఉదా... పక్కబట్టల్లో, కార్పెట్స్‌లో, ఇరుగ్గా ఉండే ఫర్నిచర్లో ఉండే డస్ట్‌మైట్స్, కాలుష్యంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే ధూళి కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు. ►ఆరుబయట ఉండే అలర్జెన్స్: పుప్పొడి, బూజు వంటి పదార్థాలు. ►పొగాకు కాలినప్పుడు / మండినప్పుడు వచ్చే పొగ ►ఘాటైన రసాయనాలు, స్ప్రేలు.. వాటి తాలూకు ఘాటైన వాసనలు కొందరిలో ఆస్తమాకు కారణం కావచ్చు. అలర్జిక్ ఆస్తమా కోసం చేసే కొన్ని అలర్జీ పరీక్షలు కొన్ని ట్రిగరింగ్ అంశాల కారణంగా పిల్లల్లో ఆస్తమా కనిపిస్తుంటే... అలాంటి పిల్లల్లో డాక్టర్లు అలర్జీ స్కిన్ టెస్ట్ చేయిస్తారు. ఇందులో ఏదైనా అలర్జీ కలిగించే పదార్థాన్ని (అంటే జంతువుల వెంట్రుకలో లేదా బూజునో) ఉపయోగించి చర్మంలోని కొంత భాగాన్ని సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఏదైనా అలర్జిక్ రియాక్షన్ జరుగుతుందేమోనని గమనిస్తారు. కొన్నిసార్లు చర్మంపై లక్షణాలు కనిపిస్తూ ఉండేవారికి, యాంటీ హిస్టమైన్ మందులు తీసుకునే వారికి అలర్జీ బ్లడ్ టెస్ట్‌ల వల్ల ఉపయోగం ఉంటుంది. అయితే కొంతమందికి ఆహారం కారణంగా అలర్జీ వచ్చి ఆస్తమా కనిపించవచ్చు. అలాంటప్పుడు ఏయే రోగులకు ఏయే ఆహారం వల్ల అలర్జీ కలుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. అందుకే పెద్దవారైతే తమకు తాము... పిల్లల విషయంలోనైతే తల్లిదండ్రులు... ఏయే పదార్థాలు తిన్న తర్వాత లక్షణాలు కనిపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఫలానా పదార్థాలతోనే ఆస్తమా లక్షణాలు బయటపడుతున్నాయని ఒకటి రెండుసార్లు గమనించాక తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఆయా పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు మరింత సూక్ష్మస్థాయి పరీక్షలనూ ఆశ్రయించాల్సి రావచ్చు. చికిత్స సాధారణంగా చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే చాలామందిలో వారు పెరుగుతున్న కొద్దీ... అంటే టీన్స్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడుగానీ లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడుగానీ ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ లక్షణాలు కొంతకాలం తర్వాత మళ్లీ వ్యక్తం కావచ్చు. ఇక చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా ఉన్న పిల్లల్లో పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు. రెండు రకాల చికిత్స ... ►దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్ చికిత్స. వాయునాళాల ఇన్ఫ్లమేషన్ నివారణకు ఈ మందులను వాడాలి. వీటిని రోజూ తీసుకోవాలి. ►తక్షణ ఉపశమనం కోసం: ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడానికి దోహదపడేందుకు ఉపయోగించే మందులు వాడాలి. వీటినే రెస్క్యూ మెడికేషన్ అనీ, క్విక్ రిలీఫ్ మెడికేషన్ అనీ అంటారు. ఇది ఆస్తమా అటాక్ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. ►మూడేళ్ల లోపు పిల్లలకు ఇన్‌హేలర్స్‌తో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఆ మందు పిల్లల ఊపిరితిత్తుల్లోకి సమర్థంగా వెళ్లడానికి స్పేసర్ డివైజ్ విత్ మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇందువల్ల మందు వృథా కాకుండా ఉంటుంది. ఇక ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్లో స్పేసర్‌తో ఇన్హేలర్ ఉపయోగించాలి. ►ఇప్పుడు ఆస్తమాకు ఇమ్యూనోథెరపీ చికిత్స కూడా అందుబాటులో ఉంది. చివరగా... కేవలం కొన్నాళ్లు మందులు వాడటం లేదా చికిత్స తీసుకోవడంతో మాత్రమే ఆస్తమా తగ్గిపోదు. దీన్ని అనుక్షణం నియంత్రణలో ఉంచడం అవసరం. అందుకే పిల్లలకు ఆస్తమా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆ విషయాన్ని అంగీకరించి, దీర్ఘకాలం పాటు చికిత్సకు సిద్ధపడాలి. ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు రోగిని దూరంగా ఉంచడం, తమకు ఆస్తమాను ప్రేరేపించే అంశాలేమిటో క్రమంగా గుర్తించి, వాటినుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండటం చేస్తుండాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆస్తమా నివారణ, నియంత్రణ చాలా సులభమే. అందుకే ఆందోళనకు గురికాకుండా తమ డాక్టర్‌తో నిత్యం ఫాలోఅప్‌లో ఉండాలి. ఆస్తమా లక్షణాలు ►దగ్గు, ఆయాసం... ప్రధానంగా రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శ్రమకలిగే వ్యాయామం చేడం లేదా గట్టిగా నవ్వడం, ఏడ్వటం, పరుగెత్తడం వంటివి చేస్తే ఈ దగ్గు, ఆయాసాలు మరింతగా పెరుగుతాయి. ►శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ►ఛాతీ బిగుతుగా పట్టేసినట్లుగా ఉండటం ►హాయిగా ఊపిరి అందకపోవడం, సాఫీగా ఊపిరాడకపోవడం ►పిల్లికూతలు (శ్వాస తీసుకునే సమయంలో... అందునా మరీ ముఖ్యంగా గాలి వదిలే సమయంలో సన్నటి పిల్లికూతలు వినిపిస్తుంటాయి). ►కొందరిలో ఆస్తమా వచ్చినప్పుడు ఒళ్లు (చర్మం) కూడా ఎర్రబారి పొడిగా మారుతుంది. మరికొందరిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, గురక వంటి లక్షణాలు కనిపించవచ్చు. పిల్లల్లో పైన పేర్కొన్న లక్షణాల్లో ఏదో ఒకటిగాని లేదా కొన్ని లక్షణాలు కలగలిసి గాని కనిపించవచ్చు. ఇలా లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని జలుబు లేదా బ్రాంకైటిస్ కావచ్చని అనుకుంటాం. అయితే అవే లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే అప్పుడు అది ఆస్తమా కావచ్చని అనుమానించాలి. ఆ పిల్లలకు ఆస్తమాను ప్రేరేపించే అంశం (ట్రిగరింగ్ ఫ్యాక్టర్) ఏదైనా ఎదురైతే వారి పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. వెంటనే ఆస్తమా లక్షణాలు మొదలైపోతాయి. పొగ, ఘాటైన వాసనలు, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, డస్ట్‌మైట్స్... ఇవి సోకీ సోకగానే ఆస్తమాను తక్షణం ప్రేరేపిస్తాయి. నిర్ధారణ ఆస్తమా నిర్ధారణ కాస్తంత కష్టమైన ప్రక్రియ. లక్షణాలతో పాటు... అవి ఎంత వ్యవధిలో మళ్లీ మళ్లీ వస్తున్నాయనే అంశం ఆధారంగా అది ఆస్తమా కావచ్చేమోనని అనుమానిస్తారు. దాంతో నిర్ధారణ కోసం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా బాల్యంలో వచ్చే మరికొన్ని సమస్యల లక్షణాలూ ఆస్తమా లక్షణాలతో కలగలసి ఉంటాయి. దాంతో ఆయా లక్షణాలు ఆస్తమా వల్లనే కనిపిస్తున్నాయా లేక ఇతర మరికొన్ని ఆరోగ్య సమస్యల వల్లనా అని నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఆస్తమా లాంటి లక్షణాలే కనబరిచే మరికొన్ని కండిషన్లు.... ►రైనైటిస్ ►సైనసైటిస్ ►ఆసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) ►వాయునాళాలలో ఏమైనా తేడాలు (ఎయిర్ వే అబ్నార్మాలిటీస్) ►స్వరపేటిక సరిగా పనిచేయకపోవడం (వోకల్ కార్డ్ డిస్ఫంక్షన్) ►బ్రాంకైటిస్ వంటి శ్వాసమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్లు ఆస్తమా నిర్ధారణ ఇంత సంక్లిష్టం కాబట్టే డాక్టర్లు చిన్నారి లక్షణాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్ని వైద్య పరీక్షలూ చేయించాల్సి రావచ్చు. అవి... ►ఐదేళ్లు లేదా అంతకంటే పైబడిన వయసు పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్లలోనూ నిర్ధారణ చేసేందుకు నిర్వహించే లంగ్ ఫంక్షన్ పరీక్షలు (స్పైరోమెట్రీ) వంటివి చేస్తారు. ఇందులో పిల్లలు ఎంత సమర్థంగా గాలిని బయటకు వదలగలరో చూస్తారు. సాధారణ స్థితితో ఈ పరీక్ష చేయడంతో పాటు, కాస్త వ్యాయామం తర్వాత, అటుపైన కొంత ఆస్తమా మందు ఇచ్చాక ఆ పరీక్షల్లో కనిపించే తేడాలను సునిశితంగా గమనించాకే ఆస్తమా అని నిర్ధారణ చేస్తారు. ►ఇక మూడేళ్లు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో లంగ్ ఫంక్షన్ పరీక్షతో ఆస్తమా నిర్ధారణ ఒకింత కష్టం. దాంతోపాటు రోగి చెప్పేవి, తల్లిదండ్రులు గమనించే అనేక లక్షణాల ఆధారంగా ఆస్తమాను నిర్ధారణ చేస్తారు. పిల్లల్లో ఆస్తమా చిన్న పిల్లల్లో సాధారణంగా ఐదేళ్ల వయసు తర్వాత ఆస్తమా లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో ఆస్తమాను గుర్తించడం అటు తల్లిదండ్రులకు, ఇటు డాక్టర్లకు కూడా ఒకింత కష్టమవుతుంది. చిననపిల్లల్లో ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే బ్రాంకియల్ ట్యూబులు మొదటే చాలా సన్నగా, చిన్నగా ఉంటాయి. ఇక జలుబు, పడిశం వంటి వాటి కారణంగా ఆ మార్గాలు మామూలుగానే ఇన్ఫ్లమేషన్కు గురవుతుంటాయి. దాంతో అవి మరింత సన్నగా మారతాయి. అందువల్ల అవి ఆస్తమా వల్ల సన్నబడ్డాయా లేక పడిశం, జలుబు తాలూకు లక్షణాలా అన్నది గుర్తించడం కొంత కష్టమవుతుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
వ్యాయామంతో తీవ్రమైన ఆయాసం
నా వయసు 34. నాకు దుమ్ము సరిపడదు. డస్ట్ అలర్జీ ఉంది. దుమ్ముకు ఎక్స్పోజ్ అయితే ఆయాసం వస్తుంటుంది. వింటర్ వచ్చింది కదా అని వ్యాయామం చేయదలచినప్పుడల్లా నాకు ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. వ్యాయామ ప్రక్రియ ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడటంతో పాటు తేమపూరితమవుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... ►పొడి దగ్గు వస్తుండటం ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ►పిల్లికూతలు వినిపించడం వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ►వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకో డయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్‌బాల్, వాకింగ్ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్‌బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే దేహానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. పల్మునరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి? నాకు కొద్దినెలలుగా నెలలుగా దగ్గు, విపరీతమైన ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక డాక్టర్‌గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. పల్మునరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి? దయచేసి తగిన సలహా ఇవ్వండి. పల్మునరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్) రావడం పెరిగిపోతే కనెక్టివ్ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. ఫలితంగా రక్తానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీని వల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. కొంతమంది రోగుల్లో దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు. ఇలాంటి జబ్బును ఇడియోపతిక్ పల్మునరీ ఫైబ్రోసిస్ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది మరింత ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు వస్తుండటం, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెకండరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్), వైరల్ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి కారణాలతో ఇది వస్తుంది. ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్‌లతో ఉన్న గాలిని పీల్చడం, కోళ్ల దాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్ పొగ ఈ కండిషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటర్ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్ఫ్లమేషన్ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్లలో నిపుణులైన పల్మునాలజిస్ట్లను సంప్రదించండి. డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం
-
8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : ఆస్తమా రోగులకు వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాద పంపిణీ చేపడతామన్నారు. మంగళవారం సచివాలయంలో చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె. జోషి, వివిధ శాఖల అధికారులతో తలసాని సమన్వయ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బత్తిని హరినాధ్‌గౌడ్ కుటుంబీకులు 173 ఏళ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని గుర్తుచేశారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజలు వస్తారని, వారికి అవసరమైన చేప పిల్లలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మంచినీరు, వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు ట్రాఫిక్, బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అగ్నిమాపక నిరోధక వ్యవస్ధకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జీహెచ్ఎంసీ ద్వారా పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్స్, అదనపు సిబ్బంది, రోడ్లకు రిపేర్లు, రూ. 5 భోజనం వసతి కల్పించాలని వివరించారు. మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా మంచినీటి ప్యాకెట్లు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఆర్టీసీ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి 150 బస్సులను నడుపుతున్నట్లు తలసాని తెలిపారు. పనుల పరిశీలనకు జూన్ 4న ఉదయం 11 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమావేశం అవుతామన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ఫైర్ సర్వీసెస్ డీజీ గోపీకృష్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్, ఫిషరీస్ కమిషనర్ సువర్ణ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డిలతోపాటు బత్తిని హరినాధ్‌గౌడ్ కుటుంబీకులు పాల్గొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆక్సిజన్ సిలిండర్‌తో పరీక్షకు..
తుర్కయంజాల్: లక్ష్యం ముందు ఎంత పెద్ద సమస్య అయిన చిన్నదే అని నిరూపించింది ఆ విద్యార్థిని. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్కు చెందిన బాలయ్య, వసంతల కూతురు నవీన ఇంజాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నవీన మూడు నెలలుగా ఆస్తమాతో బాధ పడుతోంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నప్పటికీ ఇంకా నయం కాలేదు. ఆస్తమా తీవ్ర స్థాయిలో ఉండటంతో నవీనకు 24 గంటలూ ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో శ్వాస అందించాల్సి ఉంది. కాగా, నవీన శనివారం రాగన్నగూడలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి తెలుగు పరీక్షకు సిలిండర్ ద్వారా శ్వాస తీసుకుంటూనే హాజరైంది. ఎంత కష్టమైనా పరీక్ష రాస్తానని తమ కూతురు చెప్పిందని, అందుకే పరీక్ష రాసేందుకు తీసుకువచ్చామని తల్లి వెల్లడించింది. -
ఉబ్బసానికి విరుగుడు మితాహారమా?
ఉబ్బసంతో బాధపడేవారు వీలైనన్ని తక్కువ కేలరీలను తీసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చునని అంటున్నారు హాప్కిన్స్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. అంతేకాకుండా శరీరానికి అందే కేలరీలు కొవ్వుల నుంచి వచ్చినా.. చక్కెరల నుంచి వచ్చినా ఈ ఫలితాల్లో తేడాలేవీ ఉండవని వారు ఎలుకలపై జరిపిన పరిశోధనల ఆధారంగా చెబుతున్నారు. అధికాహారం కారణంగా ఊబకాయులైన వారి ఊపిరితిత్తులు మంట/వాపులకు గురవుతాయని.. ఫలితంగా ఉబ్బస లక్షణాలు కనిపిస్తాయని.. మంట/వాపు నివారణకు మందులు వేసుకుంటే పరిస్థితి సాధారణమవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వసెవోలోడ్ పొలోట్స్‌కీ అంటున్నారు. ఎలుకలకు తాము నాలుగు రకాల ఆహారాన్ని అందించి వాటిపై పరిశీలనలు జరిపామని, ఎనిమిది వారాల తరువాత తక్కువ కేలరీలు తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలిసిందని, కొవ్వు ఎక్కువగా తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలు సాధారణం కంటే చాలా రెట్లు కుంచించుకుపోయినట్లు తెలిసిదని వివరించారు. దీన్నిబట్టి మితాహారానికీ ఊబ్బస లక్షణాలకూ మధ్య సంబంధం ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఉబ్బసం వ్యాధికి మరింత మెరుగైన చికిత్స కల్పించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని అన్నార -
దాచాల్సిన అవసరం లేదు!
గొప్పలు చెప్పుకోవడానికి కాదు మనలో ఉన్న లోపాలను ఒప్పుకోవడానికి నిజంగా ధైర్యం కావాలి. ఈ విషయంలో ప్రియాంకా చోప్రా ముందు వరసలోనే ఉన్నారు. ‘‘నేను ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నా’’ అని సూటిగా చెప్పేశారు. ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం ఓ సంస్థ కోరిన మీదట వారిలో ధైర్యం నింపే విధంగా మాట్లాడారు ప్రియాంక. ‘‘నాకు బాగా దగ్గరగా ఉన్నవారికి నేనూ ఆస్తమా పేషంట్ అని తెలుసు. ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆస్తమా నన్ను కంట్రోల్ చేయడానికి ముందే నేనూ ఆస్తమాను కంట్రోల్ చేయగలనని నమ్మాను. ఆస్తమా ఉందని అధైర్యపడలేదు. నా గోల్‌ను సాధించుకోవడంలో బెదరలేదు’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంకా చోప్రా. ఇక ప్రియాంకా చోప్రా సినిమాల దగ్గరకు వస్తే సోనాలీ బోస్ దర్శకత్వంలో ‘ద స్కై ఈజ్ పింక్’ అనే సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పర్సనల్ లైఫ్‌లోకి తొంగి చూస్తే.. కాబోయే భర్త నిక్ జోనస్‌కు ముద్దు రూపంలో మంచి గిఫ్ట్ ఇచ్చారు ప్రియాంకా చోప్రా. ఇటీవల నిక్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్‌గా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో నిక్ని ముద్దాడారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడ ఇన్సెట్లో ఉన్న ఫొటో అదే. -
పారాసిట్మాల్తో ఆస్తమా!
మెల్బోర్న్: బాల్యంలో పారాసిట్మాల్ తీసుకున్న వారికి భవిష్యత్తులో ఆస్తమా వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండేళ్ల వయసు వరకు పారసిట్మాల్ తీసుకున్న పిల్లల్లో 18 ఏళ్ల వయసు దాటాక ఆస్తమా లక్షణాలు పరిశోధకులు గుర్తించారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేపట్టారు. కుటుంబంలో ఒక్కరికైనా ఆస్తమా ఉన్న వారి పిల్లలను పుట్టక ముందే ఎంచుకున్నారు. ఇలా 620 మంది పిల్లలపై పుట్టినప్పటి నుంచి 18 ఏళ్లు వచ్చే వరకు అధ్యయనం చేపట్టారు. అయితే పారసిట్మాల్ తీసుకోని వారిలో ఆస్తమా లేదని పరిశోధకులు తెలిపారు. ఫలితాలపై స్పష్టత రానందున పారసిట్మాల్ వాడకంపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు ఇంకా పరిశోదనలు జరపాల్సి ఉందన్నారు. -
వీటితో ఆస్త్మాకు చెక్
లండన్ : పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకునేవారిలో ఆస్త్మా వ్యాధి దరిచేరదని, ఇప్పటికే ఆ వ్యాధి ఉన్నవారికి నియంత్రణలో ఉంటుందని తాజా అథ్యయనం పేర్కొంది. ఆరోగ్యకర ఆహారం తీసుకునే వారిలో ఊపిరితిత్తుల సమస్యలు అరుదుగా కనిపిస్తాయని వెల్లడించారు. పండ్లు, కూరగాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, వాపును తగ్గించే పదార్ధాలు ఉండటంతో సాధారణ శ్వాస సమస్యల నుంచి మనల్ని కాపాడతాయని అథ్యయనం తెలిపింది. మాంసాహారం, తీపిపదార్ధాలు, సాల్ట్ అధికంగా ఉండే పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటే ఆస్త్మాను అదుపులో ఉంచడం కష్టమని పరిశోధకులు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల లోపల వాపు ద్వారా వచ్చే ఆస్త్మాను పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాల్లో ఉండే వాపును తగ్గించే పదార్ధాలు అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యకర ఆహారం తీసుకునే పురుషుల్లో ఆస్త్మా లక్షణాలు 30 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. అథ్యయన వివరాలు యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
జంక్‌ఫుడ్ తింటున్నారా.. జర జాగ్రత్త
వాషింగ్టన్ : జంక్‌ఫుడ్ తినటం వల్ల బరువు పెరిగి.. తద్వారా గుండె సంబందిత జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని అందరికి తెలిసే ఉంటుంది. జంక్‌ఫుడ్ తినటం వల్ల గుండె సంబంధ జబ్బులే కాకుండా ఆస్థమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనలలో తేలింది. అమెరికాకు చెందిన గాంగ్ వాంగ్ అనే పరిశోధకుడు హ్యమ్బర్గర్, ఫాస్ట్‌ఫుడ్ వంటి పదార్థాల వల్ల పోలెన్ ఫీవర్, ఎక్సేమా, రైనో కంజెక్టివిటీస్ వంటి అలర్జీ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఫాస్ట్‌ఫుడ్ తినటం వల్ల ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెరిగి ఇతర రోగాలకు దారి తీస్తుందని ఆయన తేల్చి చెప్పారు. పిల్లలపై ప్రభావం.. పెద్దవారిలో కంటే పిల్లలపై జంక్‌ఫుడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారంలో మూడు కంటే ఎక్కువసార్లు ఫాస్ట్‌ఫుడ్ తినే పిల్లలకు ఆస్థమా, ఎక్సేమా వచ్చే అవకాశాలు ఎక్కువ. జంక్‌ఫుడ్ కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గి శరీరం తరచూ రోగాల బారిన పడుతుంది. చిన్న పిల్లలను పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పెద్దలపై ప్రభావం.. జంక్‌ఫుడ్ తీసుకోవటం అన్నది పెద్దల విషయంలో ఓ ప్రాణాంతక అలవాటుగా పరిగణించవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు వంటివే కాకుండా ఆస్థమా, ఇతర అలర్జీలకు తావిస్తుంది. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో సమతుల్యత పాటించకపోవటం వల్ల ఆస్థమా పెరిగే అవకాశాలు ఉంటాయని పరిశోధనలు తేటతెల్లం చేశాయి. -
ఉబ్బసం వ్యాధి నిర్ధారణకు తేలికైన పరీక్ష
ముక్కులో ఉండే ద్రవాలను పరీక్షించడం ద్వారా ఉబ్బసం వ్యాధిని నిర్ధారించేందుకు మౌంట్ సినాయి (అమెరికా) శాస్త్రవేత్తలు ఓ సులువైన పద్ధతిని ఆవిష్కరించారు. రైబో న్యూక్లియిక్ ఆసిడ్ నమూనాలను సేకరించడం ద్వారా ఈ పద్ధతి పనిచేస్తుంది. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్‌తో మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించే అవకాశముండగా.. కొత్త పద్ధతి ద్వారా ఎవరైనా ఈ పరీక్షలు పూర్తి చేయడమే కాకుండా... కచ్చితమైన ఫలితాలూ పొందవచ్చు. అంతేకాకుండా ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. మౌంట్ సినాయి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పరీక్షను దాదాపు 190 మంది కార్యకర్తలపై ప్రయోగించి చూసినప్పుడు వారిలో 66 మందికి తక్కువస్థాయి నుంచి ఒక మోస్తరు స్థాయి ఉబ్బసం లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ముక్కులోని ద్రవాల ద్వారా సేకరించిన ఆర్ఎన్ఏలో ఉబ్బసం వ్యాధిగ్రస్తుల్లో మాత్రమే కనిపించే కొన్ని జన్యుపరమైన అంశాలను గుర్తించడం ద్వారా తాము వ్యాధి నిర్ధారణ చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ సుపింద బున్యావానిచ్ తెలిపారు. వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ముగిసిన చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు అందజేసే చేప ప్రసాదానికి ఈ సారి అనూహ్యమైన స్పందన కనిపించింది. కిందటే డాది కంటే భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభించిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారంతో ముగిసింది. శనివారం ఉదయం 10 గంటల వరకు 75, 631 మందికి చేపప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యహ్నానికి ఈ సంఖ్య 80 వేలు దాటింది. 75 వేల మందికి పైగా చేప పిల్లల మందు పంపిణీ చేయగా, మరో 5 వేల మందికి బెల్లంలో కలిపి మందు ఇచ్చారు. చేప ప్రసాదం కోసం 1.32 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. 34 కౌంటర్ల ద్వారా కూపన్లు అందజేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సేవలందించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను ఆయన అభినందించారు. ఉత్తరాది నుంచి భారీగా జనం చేప ప్రసాదంకోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. రాజస్తాన్, పంజాబ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిలీ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చేప ప్రసాదంపై హిందీ దిన పత్రికలు, చానళ్లలో వెలువడిన ప్రకటనలతో జనంలో బాగా స్పందన కనిపించింది. ఈ రెండు రోజుల్లో చేప ప్రసాదం తీసుకోలేకపోయినవారు దూద్‌బౌలీలోని బత్తిన హరినాథ్ గౌడ్ నివాసంలో కూడా పొందవచ్చు. -
ముగిసిన చేపమందు ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసింది. శనివారం ఉదయం 9 గంటల వరకు దాదాపు 75,567 మందికి చేపమందు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. క్యూ లైన్లలో మరో ఐదు వందల మంది వరకు ఇంకా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ క్యూ లైన్లో వేచి ఉన్న వారికి ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మిగిలిన వారికి దూద్ బౌలిలోని తమ ఇంటి వద్ద పంపిణీ చేస్తామని బత్తిన కుటుంబ సభ్యులు చెప్పారు. పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు తరలివచ్చారు. దాదాపుగా 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ బిక్షం రెడ్డి మాట్లాడుతూ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసిందని తెలిపారు. ‘గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది హజరయ్యారు. గత ఏడాది 59వేల మంది వస్తే.. ఈ ఏడాది దాదాపు 75వేల మంది వచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పంపిణీ చేశాం. పోలీస్ సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు దొరకని వారు బత్తిన కుటుంబ సభ్యుల ఇండ్ల వద్ద తీసుకోవచ్చు’ అని చెప్పారు.