
ఒంటరిగా ఉన్నా.. ఆస్తమాతో బాధపడుతున్నా
న్యాయమూర్తి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు
సెల్ మార్చే విషయంపై రెగ్యులర్ కోర్టులో మెమో వేయమన్న న్యాయమూర్తి
ముగిసిన మూడ్రోజుల కస్టడీ ∙కస్టడీకి మళ్లీ పిటిషన్ వేస్తామన్న ఏసీపీ
విజయవాడ లీగల్ : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మూడ్రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు వంశీని గురువారం రెండవ అదనవు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వద్ద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు బ్యారక్‌లో తనను ఒంటరిగా ఉంచారని, ఆస్తమా సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్‌లోకి తనను మార్చాలని కోరారు.
తాను ఇన్‌ఛార్జి న్యాయమూర్తిగా ఉన్నందున వేరేవారిని సెల్‌లో ఉంచేందుకు ఉత్తర్వులు ఇవ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. సెల్ మార్చాలనే అంశంపై రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేసుకోవాలని సూచించారు. ఇక తనను కేసుతో సంబంధంలేని ప్రశ్నలు అడిగారని.. సత్యవర్థన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే అసలు నిజాలు బయటకొస్తాయని న్యాయమూర్తికి వంశీ చెప్పారు.
కాగా.. వంశీ ఆరోగ్యం దృష్ట్యా ఒక వార్డెన్‌ను ఏర్పాటుచేయడానికి తమకు అభ్యంతరంలేదని.. ఆయన భద్రత దృష్ట్యా మాత్రమే ఆయన్ను సెల్‌లో ఒంటరిగా ఉంచినట్లు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.
ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ ఇవ్వలేదు: వంశీ సతీమణి
ఈ కేసుకు సంబంధించి వంశీని ఎందుకు అరెస్టుచేశారో ఇంతవరకు తమకు తెలీదని.. ఇప్పటివరకు తమకు ఎఫ్‌ఐఆర్ కూడా ఇవ్వలేదని, ఏ విషయంలో అరెస్టుచేశారో కూడా తెలీడంలేదని వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ మీడియాకు తెలిపారు. మూడ్రోజుల కస్టడీలో పోలీసులు తన భర్తను అర్థంపర్థంలేని ప్రశ్నలతో విసిగించారని ఆమె తెలిపారు.
వంశీని ప్రభుత్వం టార్గెట్ చేసింది..
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాటా్లడుతూ.. ప్రభుత్వం కావాలనే వంశీని టార్గెట్ చేసిందని, అందులో భాగంగానే అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందన్నారు. న్యాయవాది తానికొండ చిరంజీవి మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం సెక్షన్లు మాత్రమే పెట్టారని.. ఏ విషయంలో పెట్టారో తమకు సమాచారం ఇవ్వకపోవడం కూడా అక్రమ నిర్బంధం కిందకు వస్తుందన్నారు.
వంశీ కస్టడీకి మళ్లీ పిటిషన్ వేస్తాం : ఏసీపీ
వంశీ, అతని అనుచరులు సత్యవర్థన్‌ను బెదిరించి, భయపెట్టి కేసును తారుమారు చేయాలని చూసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను సేకరించామని ఏసీపీ దామోదర్ మీడియాకు వివరించారు. విచారణలో కొన్ని ప్రశ్నలకు అవునని చెప్పిన వంశీ, మరికొన్నింటికి తెలీదని, గుర్తులేదని చెప్పారన్నారు.
తమకు పూర్తి సమాచారం రావాల్సి ఉన్నందున కస్టడీ కోరుతూ మరోసారి పిటిషన్ వేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. సత్యవర్థన్ కేసులో మరో ఇద్దరు నిందితులు వంశీబాబు వీర్రాజులను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు గురువారం పిటిషన్ వేశారు.