
ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్ : జంక్‌ఫుడ్ తినటం వల్ల బరువు పెరిగి.. తద్వారా గుండె సంబందిత జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని అందరికి తెలిసే ఉంటుంది. జంక్‌ఫుడ్ తినటం వల్ల గుండె సంబంధ జబ్బులే కాకుండా ఆస్థమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనలలో తేలింది. అమెరికాకు చెందిన గాంగ్ వాంగ్ అనే పరిశోధకుడు హ్యమ్‌బర్గర్, ఫాస్ట్‌ఫుడ్ వంటి పదార్థాల వల్ల పోలెన్ ఫీవర్, ఎక్సేమా, రైనో కంజెక్టివిటీస్ వంటి అలర్జీ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఫాస్ట్‌ఫుడ్ తినటం వల్ల ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెరిగి ఇతర రోగాలకు దారి తీస్తుందని ఆయన తేల్చి చెప్పారు.
పిల్లలపై ప్రభావం..
పెద్దవారిలో కంటే పిల్లలపై జంక్‌ఫుడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారంలో మూడు కంటే ఎక్కువసార్లు ఫాస్ట్‌ఫుడ్ తినే పిల్లలకు ఆస్థమా, ఎక్సేమా వచ్చే అవకాశాలు ఎక్కువ. జంక్‌ఫుడ్ కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గి శరీరం తరచూ రోగాల బారిన పడుతుంది. చిన్న పిల్లలను పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.
పెద్దలపై ప్రభావం..
జంక్‌ఫుడ్ తీసుకోవటం అన్నది పెద్దల విషయంలో ఓ ప్రాణాంతక అలవాటుగా పరిగణించవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు వంటివే కాకుండా ఆస్థమా, ఇతర అలర్జీలకు తావిస్తుంది. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో సమతుల్యత పాటించకపోవటం వల్ల ఆస్థమా పెరిగే అవకాశాలు ఉంటాయని పరిశోధనలు తేటతెల్లం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment