Allergies
-
వింటర్ ఎంటరైంది..అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!
ఆస్తమా, అలర్జీ వేర్వేరనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఆస్తమా కూడా అలర్జీ తాలూకు వ్యక్తీకరణల్లో ఒకటి అని అంటున్నారు నిపుణులు. అలర్జీ వల్ల అప్పర్ ఎయిర్ వే అనే విండ్ పైపులోని పై భాగం ప్రభావితమైతే ‘అలర్జిక్ రైనైటిస్’ అనీ, అదే కింది భాగమైన లోయర్ రెస్పిరేటరీ ఎయిర్ వే ప్రభావితమైతే అయితే అది ఆస్తమా అని పేర్కొంటారన్నది నిపుణుల మాట. అందుకే తరచి చూసినప్పుడు మన జనాభాలోని బాధితుల్లో 60% నుంచి 70% మందిలో అలర్జీలూ, అస్తమా ఈ రెండూ ఉంటాయి. చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమాల గురించి తెలుసుకుందాం. సరిపడని పదార్థమేదైనా ఒంట్లోకి ప్రవేశించినప్పుడు... ఒంట్లోని వ్యాధి నిరోధకశక్తి దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో వ్యాధినిరోధక శక్తి చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. ఆ తీవ్రత కారణంగా దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్ని ‘అలర్జీ’ అంటారు. ఆ అలర్జీని కలిగించే పదార్థాలను ‘అలర్జెన్స్’ అంటారు. ఈ అలర్జీ అన్నది ఏ పదార్థం లేదా కారణం వల్లనైనా రావచ్చు. ఉదాహరణకు... కొందరిలో గోధుమలతో లేదా పాలతో చేసిన పదార్థాలు సరిపడకపోవచ్చు. ఇక ఆహారాలు కాకుండా పొగ, దుమ్ము ధూళి, ఫుడ్‌పై పడి, దోమల మందులు... ఇలా ఏ కారణాలతోనైనా రావచ్చు. అలాగే కొన్ని మందులు సరిపడకపోవడంతోనూ అలర్జీలు వచ్చే అవకాశముంది. అలర్జీ వచ్చినప్పుడు... అలర్జెన్స్ లోపలికి రాగానే కొందరికి అప్పర్ ఎయిర్వేలోని సున్నితమైన ప్రాంతాలు ఎర్రబారతాయి. అక్కడి ప్రాంతాలను రక్షించుకునేందుకు స్రావాలు వెలువడతాయి. ముక్కు, కళ్లు ఎరుపెక్కడం, దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలర్జీ కేవలం ముక్కు, దాని పరిసరాలూ, శ్వాస వ్యవస్థలో పైభాగానికే పరిమితమైతే దాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా చెబుతారు, ఒకవేళ కింది భాగమూ ప్రభావితమైతే మాటిమాటికీ దగ్గు వస్తుండటం (రికరెంట్ కాఫ్), పిల్లికూతలు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం (బ్రీతింగ్ డిఫికల్టీ) కనిపిస్తాయి. ఆస్తమా అంటే...? అదే మరింత తీవ్రమై లోవర్ ఎయిర్వేస్ ప్రభావితం కావడం... అంటే ఊపిరితిత్తులూ, గాలిగదుల తోపాటు కాస్త పైన ఉండే గాలి పీల్చుకున్నప్పుడు ప్రవహించే నాళాలైన (బ్రాంకై) వాచి, బాగా సన్నబారి΄ోయి శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. అలా ఊపిరి తీసుకోవడం కష్టమై΄ోయే సమస్యను ‘ఆస్తమా’ అంటారు. కొందరిలో దీని తీవ్రతతో ఆయాసపడే స్థితి మరింత ఎక్కువైనప్పుడు అది ‘ఎనైఫిలాక్సిస్’’ అనే ప్రమాదకరమైన స్థితికి దారి తీయవచ్చు. ఆస్తమా లక్షణాలు... ఊపిరి అందడంలో ఇబ్బందితో ఆయాసం ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ఒక్కోసారి దగ్గు ఆయాసడుతున్నప్పుడు శ్వాస సమయంలో గొంతులోంచి పిల్లికూతలు వినిపించడం. ఆస్తమాను ప్రేరేపించే (ట్రిగర్ చేసే) అంశాలు... అలర్జిక్ ఆస్తమా : అలర్జీ తీవ్రతరమైనప్పుడు ఆస్తమాకి దారితీయవచ్చు. సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా సరిపడని అంశానికి ఎక్స్΄ోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. వ్యాయామం : కాస్త కష్టమైన వ్యాయామం మొదలుపెట్టగానే కొందరిలో అది ఆస్తమాకు దారితీయవచ్చు. దాన్నే ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా’ అంటారు. అజీర్తి / పులితేన్పులుతో : కొందరిలో తిన్న ఆహారం గొంతులోకి రావడమేనే సమస్య ఉంటుంది. దీన్నే ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ ఇంటస్టినల్ డిసీజ్’ (జీఈఆర్డీ) అంటారు. వీళ్లలో ఆహారం తీసుకున్న తర్వాత వాళ్ల కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడే యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. ఆ యాసిడ్ గొంతులోకి తన్నినప్పుడు కడుపు/గొంతులో మంట కనిపిస్తుంది. అది పులితేన్పుల రూపంలో గొంతులోకి రాగానే యాసిడ్ కారణంగా గొంతు మండుతుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. చాలామందిలో రాత్రి భోజనం కాస్త ఎక్కువగా తింటే కడుపు బరువుగా మారి, ఆయాసంగా ఉండటం, తర్వాత నిద్రలో సమస్య తీవ్రమై మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. పెరిమెనుస్ట్రువల్ ఆస్తమా: మహిళల్లోని కొందరికి రుతుస్రావం మొదలుకాబోయే ముందుగా కెటామేనియల్ ఆస్తమా లేదా ప్రీ/పెరీమెనుస్ట్రువల్ ఆస్తమా అని పిలిచే ఆస్తమా కనిపిస్తుంది. ఇతర కారణాలతో : పొగాకు, పొగ, కట్టెల పొయ్యినుంచి వెలువడే పొగ, రంగులూ (పెయింట్స్) లేదా అగరుబత్తీల వంటి ఘాటైన వాసనలు సరిపడక΄ోవడంతో కూడా ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం తమకు సరిపడక΄ోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్‌ప్లేస్ ఆస్తమా’ అంటారు. నిర్ధారణ పరీక్షలు... అలర్జీలో ముక్కు కారడం, దగ్గు, కొందరిలో చర్మం మీద ర్యాష్, ముక్కు/కళ్లు ఎర్రబారి బాగా రుద్దుకోవాలనిపించడం, దురదగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన ఆయాసం, పిల్లికూతలు వంటి లక్షణాలతో ఆస్తమాను తెలుసుకోవచ్చు. కొన్ని అలర్జీలను ‘స్కిన్ ప్రిక్ టెస్ట్’ అనే పరీక్షతో నిర్ధారణ చేస్తారు. స్పైరోమెట్రీ/పీఎఫ్‌టీ (PFT) అనే పరీక్ష ఆస్తమా నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో బాధితులతో ఓ పరికరం ద్వారా గాలి ఊదేలా చేస్తారు. బాధితులు ఏమేరకు ఊదగలుగుతున్నారనే అంశం ఆధారంగా వాయునాళాలు ఏమేరకు ముడుచుకుపోయాయనే అంశాన్ని తెలుసుకుని, దాని ఆధారంగా రూపొందించిన గ్రాఫ్ సహాయంతో ఆస్తమా తీవ్రతను తెలుసుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు : ఆస్తమా నిర్ధారణతో పాటు, దాని తీవ్రతను తెలుసుకోవడం కోసం ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు ముడుచుకు΄ోయేలా చేస్తారు. ఇందులో ‘మెథాకైలైన్’ అనే రసాయనాన్ని ఉపయోగించడం గానీ... లేదా కొందరితో వ్యాయామం చేయించి ఆయాసపడేలా చేస్తారు. అటుతర్వాత ‘పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో టెక్నిక్’ అనే ప్రక్రియతో ఆస్తమాను తెలుసుకుంటారు. ఎవరికైనా ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటే ఈ పరీక్ష సహాయంతో అది ప్రారంభం కాకముందే తెలుసుకోవచ్చు. నిశ్వాసలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ పరీక్ష (FENO): గాలి వదిలే నిశ్వాస ప్రక్రియలో కార్బన్ డై ఆక్సైడ్‌ను వదిలే సమయంలో ఆస్తమా బాధితుల్లో ఇజినోఫిల్స్ అనే తెల్ల రక్తకణాల వృద్ధి కారణంగా వారి నిశ్వాసలో నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఆస్తమా బాధితుల్లో... మందులు ఏ మేరకు పనిచేస్తున్నాయి, ఊపిరితిత్తుల్లో వాపు, మంట, ఎర్రబారడం (ఇన్ఫ్లమేషన్) ఏమేరకు ఉన్నాయి అని తెలుసుకోడానికి ఈ పరీక్ష చేస్తారు. రక్తపరీక్ష : ఆస్తమా వచ్చినవారి రక్తంలో ఇజినోఫిల్స్ అనే తెల్లరక్తకణాలు ఎక్కువ. అవి రక్తంలో ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోడానికి ఈ పరీక్ష చేస్తారు. అలాగే ఓ వ్యక్తిలో ఏ నిర్దిష్టమైన పదార్థం వల్ల ఆస్తమా వచ్చిందనేది తెలుసుకోవడం కోసం కూడా కొన్ని సెన్సిటివిటీ రక్త పరీక్షలు చేస్తారు. ఎక్స్–రే : ఆస్తమా వ్యాధి నిర్ధారణలో ఎక్స్–రే కీలకం. సీటీ స్కాన్ : కొందరిలో సీటీస్కాన్ (ఛాతీ) అవసరం కావచ్చు. ఆస్తమా నిర్ధారణలో కేవలం... ఆయాసం, పిల్లికూతలు అనే రెండు ప్రధాన అంశాలతో ఆస్తమాను నిర్ధారణ చేయకూడదు. ఇవే లక్షణాలు గుండెజబ్బులు, కేన్సర్, సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), వోకల్ కార్డ్ లకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించే అవకాశమున్నందున ఆస్తమా నిర్ధారణలో నిశితమైన పరిశీలన అవసరం.నివారణ / చికిత్స... అలర్జీ అయినా లేదా ఆస్తమా అయినా దాన్ని ప్రేరేపించే ‘అలర్జెన్స్’కు దూరంగా ఉండటం అన్నది మంచి నివారణ మార్గం. కొంత వయసు పైబడినవారికి డాక్టర్ సలహా మేరకు ఫ్లూ, నిమోకోకల్ వ్యాక్సిన్లు ఇప్పిస్తూ ఆస్తమాను నివారించవచ్చు.అలర్జీలకు చికిత్స ఇలా... అలర్జీలను నెమ్మదింపజేయడానికి ‘అలర్జెన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ’ (సిట్) చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు... అలర్జీ సమయంలో బాధితుల దేహంలో వెలువడే జీవరసాయనాలను బట్టి ఆయా వ్యక్తులకు వ్యక్తిగతమైన మందులు అంటే ‘హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ’ల పరిశోధనలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. అయితే వాటి ప్రభావాలు అందరి విషయంలో ఒకేలా ఉండక΄ోవచ్చు. ఉదాహరణకు ఒమాలిజుమాబ్ వంటివి మాస్ట్ సెల్స్, బేసోఫిల్స్ మీద... ఇక రెస్లిసుమాబ్, మె΄÷లిజుమాబ్, బెర్నాలిజుమాబ్ వంటివి ఐఎల్–5ల సహాయంతో ఇజినోఫిల్స్ వెలువడటాన్ని అరికడుతూ... అలా తీవ్రమైన ఆస్తమాతో బాధపడే వారి విషయంలో ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. ఆస్తమా చికిత్స ఇలా..!ఆస్తమాను నివారించేందుకు ‘ప్రివెంటార్స్’ అనే ఇన్హేలర్లూ, ఆస్తమా వచ్చిన సమయంలో దాన్ని తగ్గించేందుకు ‘రిలీవర్స్’ అనే ఇన్హేలర్లు వాడుతుంటారు. ఈ ఇన్హేలర్లు హానికరమనే అ΄ోహ కొందరిలో ఉంటుంది. నిజానికి అవి పూర్తిగా సురక్షితమైనవి. ముందస్తు నివారణ కోసం నెబ్యులైజర్లలాంటి పీల్చే చికిత్స (ఇన్హెలేషన్ థెరపీ) కూడా చేస్తుంటారు. నేసల్ స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి, తేలిగ్గా గాలి ఆడేలా చేస్తాయి. ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్‌లో వచ్చిన వాపు, మంట, ఎర్రబారడాన్ని (ఇన్ఫ్లమేషన్ను) తగ్గించే యాంటీ హిస్టమైన్ వంటి మందుల్ని వాడతారు.ఇప్పుడు అలర్జీలనూ, ఆస్తమానూ వేర్వేరుగా చూడటం సరికాదని డాక్టర్లు చెబుతుంటారు. ఇందుకు ‘ఏరియా’ అనే అంశాన్ని ప్రమాణంగా చూపుతారు. ఇక్కడ ‘ఏరియా’ అంటే... ‘ఏ.. ఆర్... ఐ.. ఏ’ అనే స్పెలింగ్తో ‘అలర్జిక్ రైనైటిస్ అండ్ ఇంటర్మిట్టెంట్ ఆస్తమా’ అని అర్థం. అందుకే అలర్జీలనూ, ఆస్తమానూ కలిపి ‘ఒన్ ఎయిర్‌వే డిసీజ్’గా పరిగణిస్తూ... అవసరాన్ని బట్టి శ్వాసవ్యవస్థ పైభాగంలోని రైనైటిస్కూ, కింద ఆస్తమాకూ చికిత్స చేయాలన్నది ఇప్పుడు ఆధునిక దృష్టికోణంలో అవసమన్నది డాక్టర్లు చెబుతున్న మాట. ఇక అలర్జీ అంటే ఏమిటో, ఆస్తమా అని దేన్ని అంటారో చూద్దాం. డా. ఏ. రఘుకాంత్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ (చదవండి: ఆ నాలుగు 'వైట్ ఫుడ్స్'ని నివారిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
అలర్జీని ఎలా వదిలించుకోవాలి..?
ఒక్కోసారి మనం బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు. అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోవడానికి వీలు లేదు. తలలో కూడా వస్తుంది. ముందుగా ఈ దురద ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది. కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేతులు, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదేవిధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది. పరిష్కారాలు: ఇలా ఇబ్బంది పెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా నూరాలి. తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొద్దిగా వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే తల దురద పూర్తిగా పోతుంది. ఆహారం ద్వారా: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్లను తీసుకోవడం మంచిది. మంచినీరు బాగా తాగడం, తగినంత వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా కూడా దురదలను తగ్గించుకోవచ్చు. దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు: దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి. శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి: మనం వంటికి రుద్దుకునే సబ్బు లేదా తలకు రాసుకునే నూనె, మనం వాడే స్ప్రే లేదా కొత్త మోడల్ దుస్తులకు ఉపయోగించే మెటీరియల్ కూడా మన చర్మానికి సరిపడకపోవచ్చు. అందువల్ల ఉన్నట్టుండి దురదలు వస్తుంటే, మన అలవాట్లలో కొత్తగా వచ్చిన మార్పేమిటో తెలుసుకుని దానినుంచి దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి చదవండి: 90 శాతం యువతుల్లో ఇప్పటికీ ఆ లోపం, బెస్ట్ ఫుడ్ ఇదిగో! -
ఇది ఆడవాళ్లకు మాత్రమే.. బొట్టు తీయకుండా నిద్రపోతున్నారా?
బొట్టుబిళ్ల పెట్టుకునే ప్రదేశంలో కొన్నిసార్లు దురద, దద్దుర్లు, వాపు, మచ్చలు ఏర్పడుతుంటాయి. బొట్టుపెట్టుకునే ప్రదేశంలో చర్మం పొడిబారడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధిగమించేందుకు ఇలా చేయండి చాలు... మాయిశ్చరైజర్ : బొట్టుబిళ్ల తీయకుండా అదేపనిగా ఉంచడం వల్ల చర్మం పొడిబారి దురద వస్తుంటుంది. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసి మాయిశ్చరైజర్ రాసి మర్దన చేయాలి. ఇది పొడిబారిన చర్మానికి తేమనందించి దురదను తగ్గిస్తుంది. నూనె: రోజూ రెండు నిమిషాల పాటు కొబ్బరి లేదా నువ్వుల నూనె రాసి మర్దన చేయాలి. దీనివల్ల చర్మానికి తేమ అంది మచ్చపడకుండా ఉంటుంది. జెల్ : అలోవెరా జెల్‌ను రాసి మర్ధన చేయడం వల్ల అక్కడ ఏర్పడే దద్దుర్లు, మొటిమలు పోతాయి. అలోవెరా జెల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు చర్మాన్ని దురద, దద్దుర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. గ్లూ తక్కువగా : బొట్టు బిళ్లలను ఎంపిక చేసేటప్పుడు గ్లూ, గమ్ తక్కువగా ఉండే వాటినే ఎంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసేసి మాయిశ్చర్ రాసుకుని పడుకోవాలి. ఉదయం బొట్టు బిళ్ల పెట్టుకుంటే ఏ సమస్యా ఉండదు. -
అలెర్జీలకు చెక్ పెట్టే యంత్రం - ధర రూ. 10795 మాత్రమే!
వాతావరణం మారినప్పుడు, గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అలర్జీ బాధలు తప్పవు. అలర్జీలు తీవ్రమైతే కొందరికి ఉబ్బసం కూడా మొదలవుతుంది. అలెర్జీలకు, ఉబ్బసానికి ఇప్పటి వరకు మందులు, ఇన్హేలర్లే గతి. అలెర్జీలకు పరిష్కారంగా ఎస్టోనియాకు చెందిన ‘రెస్పిరే’ కంపెనీ ఇటీవల మెడలో తొడుక్కునేందుకు వీలైన ‘ఏ ప్లస్ వేర్’ పేరుతో అలెర్జీ ఫిల్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మెడలో తొడుక్కున్నట్లయితే, గాలిలోని అలెర్జీకి కారణమయ్యే కణాలేవీ దీనిని దాటి ముక్కులోకి చొరబడలేవు. (ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం.. ఇలాగే జరిగితే చైనా కంపెనీల కథ కంచికే!) ఇందులోని హెపా ఫిల్టర్లు అలెర్జీలకు దారితీసే సూక్ష్మాతి సూక్ష్మకణాలను సైతం ఇట్టే లోపలకు పీల్చేసుకుని, గాలిని శుభ్రం చేస్తాయి. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది చార్జ్ కావడానికి గంటన్నర సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఎనిమిది గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 119 యూరోలు (రూ.10,795). దీనిని వాడటం మొదలుపెడితే అలెర్జీల కోసం మందులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. -
Health: అలర్జీలు.. అలసత్వం వహిస్తే ప్రాణాంతకం కూడా! ఆహారంలో పీతలు, సోయా.. ఇంకా
Winter Care- Health Tips: మడిసన్నాక కాసింత కళాపోషణుండాల అనే సినిమా డైలాగ్‌లా మనిషన్నాక జీవితంలో ఏదో ఒక దశలో అలర్జీ కలగక మానదు. బాధించకుండానూ ఉండదు. ఇందుకు మనం పీల్చే గాలి, తీసుకునే ఆహారం, ప్రేమతో పెంచుకునే జంతువులు, వాడే సుగంధ ద్రవ్యాలు లేదా తీసుకునే మందులు కూడా కారణం కావచ్చు. అలర్జీ అంత ప్రమాదకరం కాకపోయినా, అలసత్వం వహిస్తే ప్రాణాంతకం కూడా కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలర్జీల విజృంభణకు శీతాకాలం అనువైన సమయం. అందువల్ల మనం సాధారణంగా ఎదుర్కొనే కొన్ని రకాల అలర్జీలు, కారణాలు, నివారణలపై అవగాహన కోసం.. అలర్జీ అంటే ఏదో పెద్ద వ్యాధి అని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ, అది కరెక్ట్ ఆలోచన కాదు. అలర్జీ అంటే శరీరం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అన్నమాట. అంటే, మనం తీసుకునే ఆహారం లేదా గాలి శరీరంలోకి వెళ్లినప్పుడు, మన శరీరం స్పందించాల్సిన దానికంటే ఎక్కువగా స్పందిస్తుంది. ఈ విధంగా మోతాదు కంటే ఎక్కువగా స్పందిస్తే దాన్ని అలర్జీ లేదా హైపర్ సెన్సిటివిటీ అంటారు. దీనిమూలంగా రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఆహారపరమైన అలర్జీ మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు ఆహార సంబంధమైన అలర్జీలకు దారితీస్తాయి. సాధారణంగా ఫుడ్ అలర్జీలు గుడ్లు, పాలు, వేరుశెనగ, చేపలు, రొయ్యలు, పీతలు, సోయా, కొన్ని రకాల నట్స్ (ఆక్రోట్స్, బాదం, బ్రెజిల్ నట్స్), గోధుమ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వస్తాయి. శరీరానికి ఈ పదార్థాలు సరిపడకపోతే దురద, చర్మంపై దద్దుర్లు, వాంతులు లేదా కడుపులో అసౌకర్యం, శ్వాస సరిగా అందకపోవటం, గురక, దగ్గు, గొంతునొప్పి, పల్స్ పడిపోవడం, చర్మం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫుడ్ అలర్జీల నిర్ధారణకు చర్మ పరీక్షతోపాటు రక్త పరీక్షలు(ఐజీఈ యాంటీబాడీస్) కూడా చేయాల్సి ఉంటుంది. దుమ్మెత్తే అలర్జీ దుమ్ము, ధూళి వల్ల, వాటిలోని సూక్ష్మజీవుల వల్ల వచ్చే అలర్జీని డస్ట్ అలర్జీ అంటారు. వైద్య పరిభాషలో వీటిని డస్ట్ మైట్స్ అంటారు. శ్వాస తీసుకునే క్రమంలో ఈ డస్ట్ మైట్స్ శరీరంలోకి ప్రవేశించి శ్వాసనాళాల వ్యాకోచం లేదా వాపునకు కారణమవుతాయి. దీనివల్ల తుమ్ములు, ముక్కు కారడం, కంటిలో దురద, కళ్ళలో నుంచి జిగట నీరు, ఒళ్లంతా దురద, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే తేమ, దుమ్ము, మురికి ఈ డస్ట్ మైట్స్‌కు ఆవాసాలు. కాబట్టి దుప్పట్లు, దిండు గలీబులు, టవల్స్, కార్పెట్లు, ఇతర సామగ్రిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. డస్ట్ అలర్జీ కారకాలను గుర్తించడానికి కొన్ని రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఫలితాలను బట్టి ఏయే పదార్థాలు మనకు సరిపడటం లేదో, ఆయా పదార్థాలకు దూరంగా ఉండమని లేదా వాటికి తగిన మందులను సూచిస్తారు వైద్యులు. డస్ట్ అలర్జీతో బాధపడేవారు 80 శాతం మంది ఆస్తమా రోగులుగా మారుతున్నారు. కంటి అలర్జీ సాధారణంగా కంటి అలర్జీలు పుప్పొడి, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల చర్మ కణాలు వంటి వాటి వల్ల సంభవిస్తాయి. వీటివల్ల కళ్లలో దురద, వాపు, మంట, జిగట నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి అంటువ్యాధులు కావు. కంటి అలర్జీలకు ప్రత్యేకమైన నిర్ధారణ పరీక్షలు ఏవీ ఉండవు. కంటి అలర్జీకి కారకాలేమిటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటమే నివారణ. అలర్జీ వస్తే ఏం చేయాలంటే..? శరీరంలో అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. డాక్టర్ తో మీ ఫ్యామిలీ హిస్టరీ, జీవనశైలి, ఇతర జబ్బులకు వాడుతున్న మందులు తదితర వివరాలను తెలియజేస్తే, దానికి తగిన నిర్ధారణ పరీక్షలను సూచిస్తారు. ముందుగా ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, ఎక్స్‌రే వంటి పరీక్షలు నిర్వహించి ఆ తరువాత మీ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ పరీక్షలు, ప్యాచ్ లేదా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల నివేదికల ఆధారంగా మీరు ఏరకమైన అలర్జీ లతో బాధపడుతున్నారో నిర్ధారించుకొని తగిన చికిత్సను సిఫార్సు చేస్తారు. చికిత్స ఏమిటి? అలర్జీలకు సరైన చికిత్సను నిర్ధారణ పరీక్షల ఆధారంగానే కాకుండా బాధితుడి మెడికల్ హిస్టరీ, లక్షణాల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఇవ్వవలసి ఉంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. దీన్ని ఏదో ఒక చికిత్సా విధానం ద్వారా అదుపులో ఉంచుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే! చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. -
మందుమాకులతో పనిలేదు..అలెర్జీలను తరిమికొట్టే పరికరం!
వాతావరణం మారినప్పడు, గాలిలో దుమ్ము ధూళి పుప్పొడి రేణువులు వంటివి రేగినప్పుడు రకరకాల అలెర్జీలు ఇబ్బందిపెడుతుంటాయి. తుమ్ములు, దగ్గులు, హే ఫీవర్‌లాంటి జ్వరాలతో బాధపడాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. అలెర్జీలతో బాధపడేటప్పుడు వైద్యుల వద్దకు వెళితే యాంటీహిస్టామిన్ మందులు ఇస్తుంటారు. కొందరిలో అలెర్జీలు ఉబ్బసానికి కూడా దారితీస్తుంటాయి. అలాంటప్పుడు కార్టికో స్టిరాయిడ్స్‌తో కూడిన మందులు, కార్టికో స్టిరాయిడ్స్‌ను మోతాదుగా విడుదల చేసే ఇన్హేలర్స్ వాడాల్సి ఉంటుంది. అయితే, ఎలాంటి మందుమాకులతో పనిలేకుండా, అలెర్జీలు పరారయ్యేలా చేసే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చేసింది. చూడటానికి ఇన్హేలర్లా ఫొటోలో కనిపిస్తున్నది అదే! ఇందులో ఎలాంటి ఔషధాలూ ఉండవు. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘ఫ్లూవో ల్యాబ్స్’ ఈ పరికరాన్ని రూపొందించింది. గాలిలో తేడా ఉన్నప్పుడు దీనిని ముక్కు వద్ద ఉంచుకుని స్విచాన్ చేయాలి. దీని నుంచి వెలువడే నానో ఇన్ఫ్రారెడ్ కిరణాలు శరీరం నుంచి హిస్టామిన్స్ వెలువడకుండా నిరోధించి, అలెర్జీ ఇబ్బందులు తలెత్తకుండా చేస్తాయి. -
పిల్లల్లో కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్ల వలయం?
పెద్ద వయసు వాళ్లలో కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్లటి వలయం రావడం మామూలే. వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల్లోని చాలామందిలో ఇది కనిపిస్తుంది. కానీ పిల్లల్లోనైతే ఇది రావడానికి వాతావరణ కాలుష్యం ఓ కారణమనీ, దాంతో వచ్చే అలర్జీ కారణంగానే ఇలా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఆరుబయట తిరుగుతూ దువు్మూ ధూళి, ఆరుబయటి కాలుష్య, పుప్పొడి వంటి వాటికి నిత్యం ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు... ఏదైనా అంశంతో అలర్జీ కలిగితే ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలా కార్నియా చుట్టు తెల్లవలయం రావడాన్ని వైద్య పరిభాషలో వెర్నల్ కెరటో కంజంక్టవైటిస్ (వీకేసీ) అంటారు. ఈ సమస్య నివారణ కోసం వాతావరణ కాలుష్యాలకు దూరంగా ఉండటం ద్వారా కంటిని రక్షించుకోవాలి. ఇందుకోసం ప్లెయిన్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఈ సవుస్య ఉన్నవారు వీలైనన్నిసార్లు కంటిని స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. కంటి డాక్టర్‌ను కలిసి... వారు సూచించిన యాంటీ అలర్జిక్ చుక్కల వుందుల్ని వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు ఒకింత ఎక్కువ కాలం పాటు వీటిని వాడాల్సిరావచ్చు. వీటిల్లోనూ స్టెరాయిడల్, నాన్ స్టెరాయిడల్ (స్టెరాయిడ్ లేనివి) అనే రెండు రకాల మందులు ఉంటాయి. స్టెరాయిడ్ మోతాదులు ఉన్న మందుల్ని మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు మాత్రమే వాడాలి. ఎక్కువకాలం వాడితే సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల డాక్టర్ సూచించిన కాలానికి మించి వాటిని వాడకూడదు. ఇక నాన్‌స్టెరాయిడ్ (స్టెరాయిడ్ లేని) మందుల్ని మాత్రం చాలా కాలంపాటు వాడవచ్చు. ఉదాహరణకు ఓలోపాటడిన్ వంటి నాన్‌స్టెరాయిడ్ డ్రాప్స్ రోజుకు రెండుసార్లు చొప్పున ఆరుమాసాల వరకు వాడవచ్చు. అలాగే లూబ్రికెంట్ డ్రాప్స్ కూడా వాడాలి. దాంతో అలర్జెన్స్ పలచలబారుతాయి. కంటికి ఉపశమనం కలుగుతుంది. ఈ మందుల్ని వాడుతున్న కొద్దీ నల్లగుడ్డు చుట్టూ ఉన్న తెల్లటి రంగు క్రమంగా మాయమవుతుంది. అలర్జీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచనల మేరకు యాంటీహిస్టమైన్ ఐ డ్రాప్స్‌తో పాటు కొందరిలో యాంటీహిస్టమైన్ మాత్రలు కూడా వాడాల్సి వస్తుంది. ఈ సవుస్య గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయినా... నిర్లక్ష్యం మాత్రం మంచిది కాదు. -
ఉంగరం ఒంటికి ఆనే చోట చర్మం నల్లగా అవుతోందా?
ఉంగరం లేదా ఆభరణం వంటిది ధరించినప్పుడు... అది అనుకునే చోట కొందరిలో చర్మం రంగు మారుతుంది. ఒక్కోసారి అక్కడ నల్లబారుతుంది. ఇలా రంగు మారడానికి ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అనే సమస్య కారణం కావచ్చు. ఉంగరాన్ని «ధరించే మనం స్నానం చేయడంతో ముఖం కడుక్కునే సమయంలో సబ్బు వాడటం వల్ల... దాని తాలూకు డిటెర్జెంట్ ఉపయోగిస్తుంటే దాని మిగిలిపోయిన భాగం (రెసిడ్యూ) ఉంగరం / ఆభరణం వెనక ఉండిపోతుంది. అది చర్మంపై చూపే ప్రతిచర్యతో చర్మం నల్లబారడం లేదా అలర్జీలా రావడం జరగవచ్చు. అంతేకాదు... ఉంగరం లేదా ఆభరణాల్లో ఉండే ఇతర లోహాల (అల్లాయ్స్) వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు చేయాల్సిన పనులు.. ఉంగరాన్ని / ఆభరణాన్ని తీసి, శుభ్రపరచి మళ్లీ ధరించాలి. ఇలా తరచూ శుభ్రం చేసుకుని మళ్లీ తొడుగుతూ ఉండటం మేలు. చేతులు కడుక్కునే సమయంలో ఉంగరం వెనక ఎలాంటి సబ్బుగానీ లేదా రెసిడ్యూగానీ మిగలని విధంగా శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. లేదా ఉంగరం తీసి కడుక్కుని... వేళ్లు పొడిగా మారాక తొడుక్కోవాలి. ఇతర ఆభరణాల విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకోవచ్చు. ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, అలా కూడా మార్చి చూడవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా నలుపు తగ్గకపోతే... చర్మనిపుణులు సూచించిన మందుల్ని, వారు సూచించినంత కాలం వాడాలి. ఇలాంటి సందర్భాల్లో చర్మం నల్లగా మారిన చోట డాక్టర్ సలహా మేరకు హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాలు లేదా డాక్టర్ నిర్దేశించినంత కాలం వాడాల్సి రావచ్చు. -
పర్ఫ్యూమ్స్తో జాగ్రత్త!
ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా బాగా చవగ్గా లభ్యమయ్యే సెంట్లు, ఇతర సుగంధ ద్రవ్యాలు మార్కెట్లోకి విరివిగా వస్తున్నాయి. ఈ చీప్ పర్ఫ్యూమ్స్ కారణంగా కొన్ని వ్యాధులు, సెంట్ల కారణంగా వచ్చే అలర్జీలు పెరిగాయంటున్నారు అధ్యయనవేత్తలు. పర్ఫ్యూమ్స్తో అనర్థాలివే... సెంట్స్ కారణంగా అనేక రకాల అలర్జీలు, కాంటాక్ట్ డర్మటైటిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి. అంతేకాదు... అలా సెంట్ వాసన సోకిన వెంటనే కొందరిలో మైగ్రేన్ సమస్య మొదలవుతుంది. ఇటీవల ఈ కారణంగా వచ్చే తలనొప్పులు పెరుగుతున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. సెంట్స్ చర్మానికి తగలడంతో పాటు, వాటి వాసన వ్యాప్తిచెందడం వల్ల అనేక రకాల చర్మవ్యాధులు వస్తున్నాయని ఇంగ్లాండ్‌లోని క్యాంటర్బరీ కెంట్ ఛాసర్ హాస్పిటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్ సుసానా బ్యారన్ పేర్కొన్నారు. ఇలా ఉపయోగించామో లేదు... వెంటనే అలా అలర్జీకి కారణమయ్యే అలర్జెన్ల తాలూకు జాబితాను రూపొందించేందుకు యూరోపియన్ యూనియన్ సైంటిఫిక్ కమిటీ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ఘాటైన సువాసనలు వెదజల్లే అనేక సుగంధ ద్రవ్యాలు చోటు చేసుకున్నాయి. మంచి వాసనలను వెదజల్లే వస్తువులు ఉదాహరణకు... కొన్ని ఘాటైన వాసనలు వెదజల్లే సబ్బులు, షాపూలు సైతం అలర్జీలకు కారణమవుతున్నట్లు తేలింది. కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్ పార్ట్ వద్ద సుగంధద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు.వారి చర్మ ఆరోగ్యం గురించి డర్మటాలజిస్టు నిపుణులు చెప్పే మాటలిలా ఉన్నాయి. ‘కొందరు తమ అండర్ గార్మెంట్స్ వద్ద టాల్కం పౌడర్ వంటివి జల్లుకుంటారు. అలా మన ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఘాటైన వాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం కంటే... ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికిన ఫ్రెష్ అండర్ గార్మెంట్స్ తొడుక్కోవడమే ఆరోగ్యకరం’ అన్నది డర్మటాలజిస్టుల సలహా. -
జంక్‌ఫుడ్ తింటున్నారా.. జర జాగ్రత్త
వాషింగ్టన్ : జంక్‌ఫుడ్ తినటం వల్ల బరువు పెరిగి.. తద్వారా గుండె సంబందిత జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని అందరికి తెలిసే ఉంటుంది. జంక్‌ఫుడ్ తినటం వల్ల గుండె సంబంధ జబ్బులే కాకుండా ఆస్థమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనలలో తేలింది. అమెరికాకు చెందిన గాంగ్ వాంగ్ అనే పరిశోధకుడు హ్యమ్బర్గర్, ఫాస్ట్‌ఫుడ్ వంటి పదార్థాల వల్ల పోలెన్ ఫీవర్, ఎక్సేమా, రైనో కంజెక్టివిటీస్ వంటి అలర్జీ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఫాస్ట్‌ఫుడ్ తినటం వల్ల ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెరిగి ఇతర రోగాలకు దారి తీస్తుందని ఆయన తేల్చి చెప్పారు. పిల్లలపై ప్రభావం.. పెద్దవారిలో కంటే పిల్లలపై జంక్‌ఫుడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారంలో మూడు కంటే ఎక్కువసార్లు ఫాస్ట్‌ఫుడ్ తినే పిల్లలకు ఆస్థమా, ఎక్సేమా వచ్చే అవకాశాలు ఎక్కువ. జంక్‌ఫుడ్ కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గి శరీరం తరచూ రోగాల బారిన పడుతుంది. చిన్న పిల్లలను పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పెద్దలపై ప్రభావం.. జంక్‌ఫుడ్ తీసుకోవటం అన్నది పెద్దల విషయంలో ఓ ప్రాణాంతక అలవాటుగా పరిగణించవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు వంటివే కాకుండా ఆస్థమా, ఇతర అలర్జీలకు తావిస్తుంది. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో సమతుల్యత పాటించకపోవటం వల్ల ఆస్థమా పెరిగే అవకాశాలు ఉంటాయని పరిశోధనలు తేటతెల్లం చేశాయి. -
అలర్జీ సమస్య తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నాకు అలర్జీ సమస్య ఉంది. హోమియోలో దీనికి మందులు ఉన్నాయా. నాకు ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? – రవికుమార్, నిడదవోలు అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్స విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి కాన్స్టిట్యూషన్ పద్ధతిలో వాడే మందులివి... యాంట్ టార్ట్: జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆర్స్ ఆల్బ్: దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు మధ్యరాత్రి ఎక్కువ. హెపార్‌సల్ఫ్: చాలా చలిగా అనిపిస్తుంది. చలిని ఏమాత్రం తట్టుకోలేరు. చల్లని–పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంది. కూర్చుని తలవాల్చి పడుకుంటే ఉపశమనంగా ఉంటుంది. సోరియమ్: ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకుని కూర్చుంటారు. ప్రతి చలికాలంలోనూ ఆయాసం తిరగబెడుతుంటుంది. నేట్రమ్ సల్ఫ్: నేలమాళిగలు, సెలార్స్లోకి ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కఫం పచ్చరంగులో ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతుంటారు. రోడో: వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే ఈ మందును సూచించవచ్చు. వీళ్లకు మెరుపులంటే భయం ఎక్కువగా ఉంటుంది. మెర్క్‌సాల్: వీళ్లు చాలా నిదానంగా ఉంటారు. ఎవరినీ నమ్మరు. సమాధానాలు సైతం చాలా నింపాదిగా చెబుతారు. గట్టిగా పట్టుదలగా ఉండలేరు. కుడివైపు తిరిగి నిద్రపోలేరు. కఫం పచ్చగా పడుతుంది. పైన పేర్కొన్న మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత, శారీరక, మానసిక లక్షణాలను బట్టి వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులను వాడాలి. వాటిని తగిన పొటెన్సీలో ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ సమస్యను విపులంగా చర్చించి, మీకు తగిన మందును తీసుకోండి. ఛాతీలో మంట... తగ్గేదెలా? గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నేను చాలా రోజుల నుంచి ఛాతీలో మంటతో బాధపడుతున్నాను. యాంటాసిడ్ సిరప్ తాగినప్పుడు మంట తగ్గుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఏం చేయాలి? నాకు తగిన సలహా ఇవ్వగలరు. – జనార్దన్‌రావు, నల్లగొండ మీరు తెలిపిన వివరాలు, లక్షణాలను బట్టి చూస్తే మీరు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్యమిది. మీ రోజువారీ జీవనశైలినీ, ఆహారపు అలవాట్లనూ సరిచేసుకుంటే ఈ వ్యాధి చాలావరకు తగ్గుముఖం పడుతుంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని సూచనలివి... n మీరు తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించడం n కాఫీ, టీలను పూర్తిగా మానేయడం n పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయడం, మద్యం అలవాటుకు దూరంగా ఉండటం n బరువు ఎక్కువగా ఉంటే దాన్ని సరైన స్థాయికి తగ్గించడం n భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాస్త సమయం తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి n తలవైపున పడక కొంచెం ఎత్తుగా ఉండేలా అమర్చుకోవాలి. పై సూచనలతో పాటు మీ డాక్టర్ సలహా మీద పీపీఐ డ్రగ్స్ అనే మందులు వాడాలి. అప్పటికే తగ్గకపోతే ఎండోస్కోపీ చేయించుకొని తగిన చికిత్స తీసుకోండి. నాకు ఈమధ్య కొంతకాలంగా కడుపులో నీరు వస్తోంది. కాళ్లవాపులు వస్తున్నాయి. దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. రెండు సమస్యలూ తగ్గిపోయాయి. కానీ కొన్ని రోజుల తర్వాత సమస్య మళ్లీ మొదలైంది. మందులు వాడితే తగ్గుతోంది. నేను దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. దానివల్ల ఈ సమస్య వస్తోందా? నా సమస్య పరిష్కారానికి ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు. – చలమయ్య, విజయవాడ సాధారణంగా కిడ్నీలో సమస్య వల్ల కాళ్లలో వాపు కనిపిస్తుంది. కడుపులో నీరు చేరడం కూడా ఉంటుంది. కాలేయం, గుండెజబ్బులు ఉన్నవారిలో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. మీరు దాదాపు ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటున్నానని చెబుతున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ కాలేయం వల్ల వచ్చిన సమస్యే అయి ఉంటుంది. మీరు ఈ విషయమై ఏవైనా వైద్యపరీక్షలు చేయించుకున్నారా లేదా అన్న సంగతి తెలపలేదు. మీరు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కడుపులోని నీటి పరీక్షలు చేయించుకొని, ఆ రిపోర్టులు తీసుకొని మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు ఆ రిపోర్టుల ఆధారంగా మీ సమస్యను గుర్తించి, మీకు తగిన చికిత్స చేస్తారు. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ -
పిల్లలలో అలర్జీలు!
ఏదైనా సరిపడని వస్తువు పిల్లలకు తాకినా, పిల్లల శ్వాసమార్గంలోకి వెళ్లినా, పొరపాటుగా నోటిద్వారా తీసుకున్నా వెంటనే ఆ సరిపడని వస్తువు దుష్ర్పభావాలు అనేక లక్షణాల రూపంలో కనిపిస్తాయి. పిల్లల్లో దగ్గు, శ్వాసలో ఇబ్బంది, ఒంటినిండా దద్దుర్లు, కడుపునొప్పి... ఇలా అనేక రూపాల్లో ఆ సరిపడని తత్వం వ్యక్తమవుతుంది. ఇలా ఏదైనా వస్తువు సరిపడని తత్వాన్ని అలర్జీ అంటారు. ఈ అలర్జీని కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. పిల్లల్లో వచ్చే అనేక అలర్జీలు, వాటికి కారణాలు, వాటి నివారణ వంటి అనేక అంశాలను తెలుసుకుందాం. పిల్లల్లో అలర్జీ రావడానికి కారణం ఉంటుంది. వారు ఏదైనా తమకు సరిపడని పదార్ధాన్ని ముట్టుకున్నా లేదా శ్వాసించినా, లేదా పొరబాటున తిన్నా... వెంటనే ఆ సరిపడని వస్తువును మన శరీరం ఒక శత్రువుగా భావిస్తుంది. దానితో పోరాడి బయటకు తరలించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తుంది. ఈ పోరాటంలో భాగంగా శరీరంలో కొన్ని రసాయనాలు, హిస్టమైన్స్ అనే పదార్థాలు విడుదల అవుతాయి. ఇవి వెలువడినందువల్ల పిల్లల్లో తుమ్ములు, దురద, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు అలర్జీ కలిగించే సాధారణ పదార్థాలుచెట్లు, మొక్కల నుంచి వెలువడే పుప్పొడి, గడ్డిపరకలు, కలుపుమొక్కల వంటివి.కార్పెట్లు, పరదాల మాటున ఉండే దుమ్ము (నిజానికి ఈ దుమ్ములో ఉండే డస్ట్‌మైట్స్ అనే క్రిముల వల్ల అలర్జీ వస్తుంటుంది).పిల్లి, కుక్క, గుర్రాలు, చెవులపిల్లులు వంటి వాటి వెంట్రుకలు, చర్మం నుంచి వెలువడే పొట్టులాంటి పదార్థాలుకీటకాలు కుట్టడం వల్ల వెలువడే రసాయనాలు, విషాలుసిగరెట్ పొగ, పెర్ఫ్యూమ్స్/సెంట్స్ వంటి వాటి ఘాటైన వాసనలు, కారు నుంచి వెలువడే పొగవాసనలుఇక కొన్ని ఆహారాలు తీసుకున్నప్పుడు అవి కూడా అలర్జెన్స్లా పనిచేస్తాయి. ఉదాహరణకు వేరుశెనగపల్లీలు, గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు. పిల్లల్లో అలర్జీ లక్షణాలు చర్మంపై దద్దుర్లు / పగుళ్ల వంటివి రావడం శ్వాసతీసుకోవడం కష్టం కావడం (ఆస్తమా) తుమ్ములు, దగ్గులు, ముక్కు నుంచి నీళ్లు కారడం కడుపులో ఇబ్బంది వికారంగా వాంతి వస్తున్నట్లుగా అనిపించడం అలర్జిక్ రైనైటిస్ (ఇందులో ముక్కు దురదగా ఉండి తుమ్ములు వస్తూ, ముక్కుకారుతుంటుంది. కళ్లలోంచి కూడా నీళ్లు వస్తుంటాయి) ముక్కు దిబ్బడ వేయడం (దీని వల్ల ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం కష్టమై, రాత్రివేళల్లో నోటి ద్వారా శ్వాసతీసుకుంటూ ఉంటారు) చెవిలో ఇన్ఫెక్షన్ (అలర్జీల వల్ల చెవిలో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి, చెవి నొప్పి రావచ్చు) అలర్జీలు తెచ్చి పెట్టే ఆహారాలు... పిల్లలు తీసుకునే ఆహారంతో వచ్చే అలర్జీలలో ముఖ్యమైనవి వేరుశెనగపప్పు లతో వస్తుంటాయి. ఇక పాల వల్ల కూడా కొందరిలో అలర్జీ వస్తుంటుంది. కొందరిలో గుడ్లు, చేపలు, పీతలు, లాబ్‌స్టర్స్, రొయ్యల వల్ల కూడా అలర్జీలు వస్తుంటాయి. ఇక మరికొందరిలో సోయా ఉత్పాదనలు, జీడిపప్పు వంటి నట్స్ వల్ల కూడా అలర్జీలు రావచ్చు. తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక... పిల్లలు తింటున్న పదార్థాల వల్లగానీ అలర్జీలు కలుగుతుంటే దాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. లేదా పిల్లలకు ఏ అంశం సరిపడటంలేదో గుర్తించడం తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన పని. ఎందుకంటే సాధారణ అలర్జీలైన దద్దుర్లు, తుమ్ములు, ముక్కు నుంచి నీళ్లు కారడాలు, ఒంటి మీద దురద పెట్టడాల వంటి లక్షణాల వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ... ఒక్కోసారి పిల్లలకు ఊపిరి అందనంతగా శ్వాసతీసుకోవడం కష్టం కావడం, ఆయాసం రావడం, అకస్మాత్తుగా రక్తపోటు పూర్తిగా పడిపోవడం, వారి శరీరం షాక్‌కు గురికావడం వంటివి జరిగితే అది పిల్లల ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి పిల్లలకు ఏ పదార్థాలు / అంశాలు / వస్తువులు సరిపడటం లేదన్న విషయాన్ని తల్లిదండ్రులు నిశితంగా గుర్తించి, వాటి నుంచి పిల్లలను దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. అలర్జీ ఉన్న పిల్లలు...స్కూలు విషయంలో తల్లిదండ్రుల బాధ్యత... తమ పిల్లలకు ఏయే అంశాలు అలర్జీని కలిగిస్తాయన్న విషయాన్ని స్కూలు యాజమాన్యానికి తెలియజేయాలి. పిల్లల్లో అలర్జీలు కనిపించినప్పుడు స్కూలు యాజమాన్యం తక్షణం చేపట్టాల్సిన ముందుజాగ్రత్తలనూ వారికి తెలియజేయాలి. పిల్లలను నెబ్యులైజేషన్ (పీల్చే మందును మాస్క్‌లా పెట్టగలిగే వసతి) ఇచ్చే ఆసుపత్రికి లేదా ఆరోగ్యకేంద్రానికి తరలించాలని చెప్పడంతో పాటు... చిన్నారికి అలర్జీ వచ్చినప్పుడు తాము సంప్రదించే డాక్టర్ ఫోన్ నెంబరు, ఆసుపత్రి చిరునామా తెలిపాలి. స్కూలు యాజమాన్యం కూడా పిల్లల్లో అలర్జీ లక్షణాలు కనిపించగానే తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలిపాలి. నివారణ... పిల్లలకు వచ్చే అలర్జీల విషయంలో నివారణ చాలా తేలిక. ఉదాహరణకు వారికి సరిపడని వస్తువు, అంశం, ఆహారం... ఇలా అదేమిటో గుర్తించి, వాటి నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. అదే అన్నిటికంటే మంచి నివారణ. పిల్లలను దుమ్మూ ధూళి నుంచి దూరంగా ఉంచాలి. వారి దుస్తులు, పక్కబట్టలు (బెడ్‌షీట్స్), టవల్స్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు జంతువుల జుట్టు / చర్మపు పొట్టు వంటి వాటి వల్ల వారికి అలర్జీ ఉందని తేలితే... పిల్లలను పెంపుడు జంతువుల వద్దకు అనుమతించకూడదు. ఇంట్లోని వాతావరణంలో ఆకస్మికంగా మార్పు రాకుండా చూసుకోవాలి. దాదాపు ఎప్పుడూ ఒకే రకమైన వాతావరణం ఉండేలా జాగ్రత్త వహించాలి. ఇక దుమ్ము, ధూళి వంటి వాటిని శుభ్రం చేసే సమయంలోనూ, బూజులు దులిపే సమయంలోనూ పిల్లలను ఇంట్లో ఉంచకూడదు. చికిత్స పిల్లల్లో అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే వాటికి విరుగుడు మందులైన యాంటీ హిస్టమైన్స్ ఇస్తుంటారు. ఒకవేళ పిల్లల్లో అలర్జీ వల్ల కలిగిన తీవ్రత ఎక్కువగా ఉంటే వారికి ఎపీనెఫ్రిన్ (ఎడ్రినాలిన్) వంటి మందులు వాడుతుంటారు. ఇక అలర్జీ కారణంగా శ్వాస అందని సందర్భాల్లో , శ్వాస తేలిగ్గా తీసుకునేందుకు వీలుగా పీల్చేమందులు (ఇన్హేలర్స్/నెబ్యులైజర్స్) కూడా వాడుతుంటారు. ఒకవేళ అలర్జీ వల్ల పిల్లల్లో ఆస్తమా ప్రేరేపితమైతే... దాన్ని తగ్గించేందుకు కూడా ఇప్పుడు అత్యంత ఆధునికమైన పీల్చే మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ టి.పి. కార్తీక్ పీడియాట్రీషియన్, నియోనేటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్