ఆస్తమా, అలర్జీ వేర్వేరనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఆస్తమా కూడా అలర్జీ తాలూకు వ్యక్తీకరణల్లో ఒకటి అని అంటున్నారు నిపుణులు. అలర్జీ వల్ల అప్పర్ ఎయిర్ వే అనే విండ్ పైపులోని పై భాగం ప్రభావితమైతే ‘అలర్జిక్ రైనైటిస్’ అనీ, అదే కింది భాగమైన లోయర్ రెస్పిరేటరీ ఎయిర్ వే ప్రభావితమైతే అయితే అది ఆస్తమా అని పేర్కొంటారన్నది నిపుణుల మాట. అందుకే తరచి చూసినప్పుడు మన జనాభాలోని బాధితుల్లో 60% నుంచి 70% మందిలో అలర్జీలూ, అస్తమా ఈ రెండూ ఉంటాయి. చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమాల గురించి తెలుసుకుందాం.
సరిపడని పదార్థమేదైనా ఒంట్లోకి ప్రవేశించినప్పుడు... ఒంట్లోని వ్యాధి నిరోధకశక్తి దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో వ్యాధినిరోధక శక్తి చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. ఆ తీవ్రత కారణంగా దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్ని ‘అలర్జీ’ అంటారు. ఆ అలర్జీని కలిగించే పదార్థాలను ‘అలర్జెన్స్’ అంటారు.
ఈ అలర్జీ అన్నది ఏ పదార్థం లేదా కారణం వల్లనైనా రావచ్చు. ఉదాహరణకు... కొందరిలో గోధుమలతో లేదా పాలతో చేసిన పదార్థాలు సరిపడకపోవచ్చు. ఇక ఆహారాలు కాకుండా పొగ, దుమ్ము ధూళి, ఫుడ్‌పై పడి, దోమల మందులు... ఇలా ఏ కారణాలతోనైనా రావచ్చు. అలాగే కొన్ని మందులు సరిపడకపోవడంతోనూ అలర్జీలు వచ్చే అవకాశముంది.
అలర్జీ వచ్చినప్పుడు...
అలర్జెన్స్ లోపలికి రాగానే కొందరికి అప్పర్ ఎయిర్‌వేలోని సున్నితమైన ప్రాంతాలు ఎర్రబారతాయి. అక్కడి ప్రాంతాలను రక్షించుకునేందుకు స్రావాలు వెలువడతాయి. ముక్కు, కళ్లు ఎరుపెక్కడం, దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అలర్జీ కేవలం ముక్కు, దాని పరిసరాలూ, శ్వాస వ్యవస్థలో పైభాగానికే పరిమితమైతే దాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా చెబుతారు, ఒకవేళ కింది భాగమూ ప్రభావితమైతే మాటిమాటికీ దగ్గు వస్తుండటం (రికరెంట్ కాఫ్), పిల్లికూతలు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం (బ్రీతింగ్ డిఫికల్టీ) కనిపిస్తాయి.
ఆస్తమా అంటే...?
అదే మరింత తీవ్రమై లోవర్ ఎయిర్‌వేస్ ప్రభావితం కావడం... అంటే ఊపిరితిత్తులూ, గాలిగదుల తోపాటు కాస్త పైన ఉండే గాలి పీల్చుకున్నప్పుడు ప్రవహించే నాళాలైన (బ్రాంకై) వాచి, బాగా సన్నబారి΄ోయి శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. అలా ఊపిరి తీసుకోవడం కష్టమై΄ోయే సమస్యను ‘ఆస్తమా’ అంటారు. కొందరిలో దీని తీవ్రతతో ఆయాసపడే స్థితి మరింత ఎక్కువైనప్పుడు అది ‘ఎనైఫిలాక్సిస్’’ అనే ప్రమాదకరమైన స్థితికి దారి తీయవచ్చు. ఆస్తమా లక్షణాలు...
ఊపిరి అందడంలో ఇబ్బందితో ఆయాసం
ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం
ఒక్కోసారి దగ్గు
ఆయాసడుతున్నప్పుడు శ్వాస సమయంలో గొంతులోంచి పిల్లికూతలు వినిపించడం.
ఆస్తమాను ప్రేరేపించే (ట్రిగర్ చేసే) అంశాలు...
అలర్జిక్ ఆస్తమా : అలర్జీ తీవ్రతరమైనప్పుడు ఆస్తమాకి దారితీయవచ్చు. సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా సరిపడని అంశానికి ఎక్స్΄ోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు.
వ్యాయామం : కాస్త కష్టమైన వ్యాయామం మొదలుపెట్టగానే కొందరిలో అది ఆస్తమాకు దారితీయవచ్చు. దాన్నే ‘ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్‌డ్ ఆస్తమా’ అంటారు.
అజీర్తి / పులితేన్పులుతో : కొందరిలో తిన్న ఆహారం గొంతులోకి రావడమేనే సమస్య ఉంటుంది. దీన్నే ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ ఇంటస్టినల్ డిసీజ్’ (జీఈఆర్‌డీ) అంటారు. వీళ్లలో ఆహారం తీసుకున్న తర్వాత వాళ్ల కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడే యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది.
ఆ యాసిడ్ గొంతులోకి తన్నినప్పుడు కడుపు/గొంతులో మంట కనిపిస్తుంది. అది పులితేన్పుల రూపంలో గొంతులోకి రాగానే యాసిడ్ కారణంగా గొంతు మండుతుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. చాలామందిలో రాత్రి భోజనం కాస్త ఎక్కువగా తింటే కడుపు బరువుగా మారి, ఆయాసంగా ఉండటం, తర్వాత నిద్రలో సమస్య తీవ్రమై మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు.
పెరిమెనుస్ట్రువల్ ఆస్తమా: మహిళల్లోని కొందరికి రుతుస్రావం మొదలుకాబోయే ముందుగా కెటామేనియల్ ఆస్తమా లేదా ప్రీ/పెరీమెనుస్ట్రువల్ ఆస్తమా అని పిలిచే ఆస్తమా కనిపిస్తుంది.
ఇతర కారణాలతో : పొగాకు, పొగ, కట్టెల పొయ్యినుంచి వెలువడే పొగ, రంగులూ (పెయింట్స్) లేదా అగరుబత్తీల వంటి ఘాటైన వాసనలు సరిపడక΄ోవడంతో కూడా ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం తమకు సరిపడక΄ోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్‌ప్లేస్ ఆస్తమా’ అంటారు.
నిర్ధారణ పరీక్షలు...
అలర్జీలో ముక్కు కారడం, దగ్గు, కొందరిలో చర్మం మీద ర్యాష్, ముక్కు/కళ్లు ఎర్రబారి బాగా రుద్దుకోవాలనిపించడం, దురదగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన ఆయాసం, పిల్లికూతలు వంటి లక్షణాలతో ఆస్తమాను తెలుసుకోవచ్చు.
కొన్ని అలర్జీలను ‘స్కిన్ ప్రిక్ టెస్ట్’ అనే పరీక్షతో నిర్ధారణ చేస్తారు.
స్పైరోమెట్రీ/పీఎఫ్‌టీ (PFT) అనే పరీక్ష ఆస్తమా నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో బాధితులతో ఓ పరికరం ద్వారా గాలి ఊదేలా చేస్తారు. బాధితులు ఏమేరకు ఊదగలుగుతున్నారనే అంశం ఆధారంగా వాయునాళాలు ఏమేరకు ముడుచుకుపోయాయనే అంశాన్ని తెలుసుకుని, దాని ఆధారంగా రూపొందించిన గ్రాఫ్ సహాయంతో ఆస్తమా తీవ్రతను తెలుసుకుంటారు.
కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు : ఆస్తమా నిర్ధారణతో పాటు, దాని తీవ్రతను తెలుసుకోవడం కోసం ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు ముడుచుకు΄ోయేలా చేస్తారు. ఇందులో ‘మెథాకైలైన్’ అనే రసాయనాన్ని ఉపయోగించడం గానీ... లేదా కొందరితో వ్యాయామం చేయించి ఆయాసపడేలా చేస్తారు. అటుతర్వాత ‘పీక్ ఎక్స్‌పిరేటరీ ఫ్లో టెక్నిక్’ అనే ప్రక్రియతో ఆస్తమాను తెలుసుకుంటారు. ఎవరికైనా ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటే ఈ పరీక్ష సహాయంతో అది ప్రారంభం కాకముందే తెలుసుకోవచ్చు.
నిశ్వాసలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ పరీక్ష (FENO): గాలి వదిలే నిశ్వాస ప్రక్రియలో కార్బన్ డై ఆక్సైడ్‌ను వదిలే సమయంలో ఆస్తమా బాధితుల్లో ఇజినోఫిల్స్ అనే తెల్ల రక్తకణాల వృద్ధి కారణంగా వారి నిశ్వాసలో నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఆస్తమా బాధితుల్లో... మందులు ఏ మేరకు పనిచేస్తున్నాయి, ఊపిరితిత్తుల్లో వాపు, మంట, ఎర్రబారడం (ఇన్‌ఫ్లమేషన్) ఏమేరకు ఉన్నాయి అని తెలుసుకోడానికి ఈ పరీక్ష చేస్తారు.
రక్తపరీక్ష : ఆస్తమా వచ్చినవారి రక్తంలో ఇజినోఫిల్స్ అనే తెల్లరక్తకణాలు ఎక్కువ. అవి రక్తంలో ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోడానికి ఈ పరీక్ష చేస్తారు. అలాగే ఓ వ్యక్తిలో ఏ నిర్దిష్టమైన పదార్థం వల్ల ఆస్తమా వచ్చిందనేది తెలుసుకోవడం కోసం కూడా కొన్ని సెన్సిటివిటీ రక్త పరీక్షలు చేస్తారు.
ఎక్స్–రే : ఆస్తమా వ్యాధి నిర్ధారణలో ఎక్స్–రే కీలకం.
సీటీ స్కాన్ : కొందరిలో సీటీస్కాన్ (ఛాతీ) అవసరం కావచ్చు.
ఆస్తమా నిర్ధారణలో కేవలం... ఆయాసం, పిల్లికూతలు అనే రెండు ప్రధాన అంశాలతో ఆస్తమాను నిర్ధారణ చేయకూడదు. ఇవే లక్షణాలు గుండెజబ్బులు, కేన్సర్, సీవోపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), వోకల్ కార్డ్ లకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించే అవకాశమున్నందున ఆస్తమా నిర్ధారణలో నిశితమైన పరిశీలన అవసరం.
నివారణ / చికిత్స...
అలర్జీ అయినా లేదా ఆస్తమా అయినా దాన్ని ప్రేరేపించే ‘అలర్జెన్స్’కు దూరంగా ఉండటం అన్నది మంచి నివారణ మార్గం. కొంత వయసు పైబడినవారికి డాక్టర్ సలహా మేరకు ఫ్లూ, నిమోకోకల్ వ్యాక్సిన్లు ఇప్పిస్తూ ఆస్తమాను నివారించవచ్చు.
అలర్జీలకు చికిత్స ఇలా...
అలర్జీలను నెమ్మదింపజేయడానికి ‘అలర్జెన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ’ (సిట్) చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు... అలర్జీ సమయంలో బాధితుల దేహంలో వెలువడే జీవరసాయనాలను బట్టి ఆయా వ్యక్తులకు వ్యక్తిగతమైన మందులు అంటే ‘హ్యూమనైజ్‌డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ’ల పరిశోధనలు ఇప్పటికే విజయవంతమయ్యాయి.
అయితే వాటి ప్రభావాలు అందరి విషయంలో ఒకేలా ఉండక΄ోవచ్చు. ఉదాహరణకు ఒమాలిజుమాబ్ వంటివి మాస్ట్ సెల్స్, బేసోఫిల్స్ మీద... ఇక రెస్లిసుమాబ్, మె΄÷లిజుమాబ్, బెర్నాలిజుమాబ్ వంటివి ఐఎల్–5ల సహాయంతో ఇజినోఫిల్స్ వెలువడటాన్ని అరికడుతూ... అలా తీవ్రమైన ఆస్తమాతో బాధపడే వారి విషయంలో ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి.
ఆస్తమా చికిత్స ఇలా..!
ఆస్తమాను నివారించేందుకు ‘ప్రివెంటార్స్’ అనే ఇన్‌హేలర్లూ, ఆస్తమా వచ్చిన సమయంలో దాన్ని తగ్గించేందుకు ‘రిలీవర్స్’ అనే ఇన్‌హేలర్లు వాడుతుంటారు. ఈ ఇన్‌హేలర్లు హానికరమనే అ΄ోహ కొందరిలో ఉంటుంది. నిజానికి అవి పూర్తిగా సురక్షితమైనవి. ముందస్తు నివారణ కోసం నెబ్యులైజర్‌లలాంటి పీల్చే చికిత్స (ఇన్‌హెలేషన్ థెరపీ) కూడా చేస్తుంటారు. నేసల్ స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి.
అవి బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి, తేలిగ్గా గాలి ఆడేలా చేస్తాయి. ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్‌లో వచ్చిన వాపు, మంట, ఎర్రబారడాన్ని (ఇన్‌ఫ్లమేషన్‌ను) తగ్గించే యాంటీ హిస్టమైన్ వంటి మందుల్ని వాడతారు.
ఇప్పుడు అలర్జీలనూ, ఆస్తమానూ వేర్వేరుగా చూడటం సరికాదని డాక్టర్లు చెబుతుంటారు. ఇందుకు ‘ఏరియా’ అనే అంశాన్ని ప్రమాణంగా చూపుతారు. ఇక్కడ ‘ఏరియా’ అంటే... ‘ఏ.. ఆర్... ఐ.. ఏ’ అనే స్పెలింగ్‌తో ‘అలర్జిక్ రైనైటిస్ అండ్ ఇంటర్‌మిట్టెంట్ ఆస్తమా’ అని అర్థం.
అందుకే అలర్జీలనూ, ఆస్తమానూ కలిపి ‘ఒన్ ఎయిర్‌వే డిసీజ్’గా పరిగణిస్తూ... అవసరాన్ని బట్టి శ్వాసవ్యవస్థ పైభాగంలోని రైనైటిస్‌కూ, కింద ఆస్తమాకూ చికిత్స చేయాలన్నది ఇప్పుడు ఆధునిక దృష్టికోణంలో అవసమన్నది డాక్టర్లు చెబుతున్న మాట. ఇక అలర్జీ అంటే ఏమిటో, ఆస్తమా అని దేన్ని అంటారో చూద్దాం.
డా. ఏ. రఘుకాంత్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్
(చదవండి: ఆ నాలుగు 'వైట్ ఫుడ్స్'ని నివారిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!)
Comments
Please login to add a commentAdd a comment