Asthama
-
వింటర్ ఎంటరైంది..అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!
ఆస్తమా, అలర్జీ వేర్వేరనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఆస్తమా కూడా అలర్జీ తాలూకు వ్యక్తీకరణల్లో ఒకటి అని అంటున్నారు నిపుణులు. అలర్జీ వల్ల అప్పర్ ఎయిర్ వే అనే విండ్ పైపులోని పై భాగం ప్రభావితమైతే ‘అలర్జిక్ రైనైటిస్’ అనీ, అదే కింది భాగమైన లోయర్ రెస్పిరేటరీ ఎయిర్ వే ప్రభావితమైతే అయితే అది ఆస్తమా అని పేర్కొంటారన్నది నిపుణుల మాట. అందుకే తరచి చూసినప్పుడు మన జనాభాలోని బాధితుల్లో 60% నుంచి 70% మందిలో అలర్జీలూ, అస్తమా ఈ రెండూ ఉంటాయి. చలికాలంలో మరింత ప్రభావం చూపే అలర్జీలూ, ఆస్తమాల గురించి తెలుసుకుందాం. సరిపడని పదార్థమేదైనా ఒంట్లోకి ప్రవేశించినప్పుడు... ఒంట్లోని వ్యాధి నిరోధకశక్తి దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో వ్యాధినిరోధక శక్తి చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. ఆ తీవ్రత కారణంగా దేహంపై పడే ప్రతికూల ప్రభావాన్ని ‘అలర్జీ’ అంటారు. ఆ అలర్జీని కలిగించే పదార్థాలను ‘అలర్జెన్స్’ అంటారు. ఈ అలర్జీ అన్నది ఏ పదార్థం లేదా కారణం వల్లనైనా రావచ్చు. ఉదాహరణకు... కొందరిలో గోధుమలతో లేదా పాలతో చేసిన పదార్థాలు సరిపడకపోవచ్చు. ఇక ఆహారాలు కాకుండా పొగ, దుమ్ము ధూళి, ఫుడ్‌పై పడి, దోమల మందులు... ఇలా ఏ కారణాలతోనైనా రావచ్చు. అలాగే కొన్ని మందులు సరిపడకపోవడంతోనూ అలర్జీలు వచ్చే అవకాశముంది. అలర్జీ వచ్చినప్పుడు... అలర్జెన్స్ లోపలికి రాగానే కొందరికి అప్పర్ ఎయిర్వేలోని సున్నితమైన ప్రాంతాలు ఎర్రబారతాయి. అక్కడి ప్రాంతాలను రక్షించుకునేందుకు స్రావాలు వెలువడతాయి. ముక్కు, కళ్లు ఎరుపెక్కడం, దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలర్జీ కేవలం ముక్కు, దాని పరిసరాలూ, శ్వాస వ్యవస్థలో పైభాగానికే పరిమితమైతే దాన్ని ‘అలర్జిక్ రైనైటిస్’గా చెబుతారు, ఒకవేళ కింది భాగమూ ప్రభావితమైతే మాటిమాటికీ దగ్గు వస్తుండటం (రికరెంట్ కాఫ్), పిల్లికూతలు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం (బ్రీతింగ్ డిఫికల్టీ) కనిపిస్తాయి. ఆస్తమా అంటే...? అదే మరింత తీవ్రమై లోవర్ ఎయిర్వేస్ ప్రభావితం కావడం... అంటే ఊపిరితిత్తులూ, గాలిగదుల తోపాటు కాస్త పైన ఉండే గాలి పీల్చుకున్నప్పుడు ప్రవహించే నాళాలైన (బ్రాంకై) వాచి, బాగా సన్నబారి΄ోయి శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. అలా ఊపిరి తీసుకోవడం కష్టమై΄ోయే సమస్యను ‘ఆస్తమా’ అంటారు. కొందరిలో దీని తీవ్రతతో ఆయాసపడే స్థితి మరింత ఎక్కువైనప్పుడు అది ‘ఎనైఫిలాక్సిస్’’ అనే ప్రమాదకరమైన స్థితికి దారి తీయవచ్చు. ఆస్తమా లక్షణాలు... ఊపిరి అందడంలో ఇబ్బందితో ఆయాసం ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ఒక్కోసారి దగ్గు ఆయాసడుతున్నప్పుడు శ్వాస సమయంలో గొంతులోంచి పిల్లికూతలు వినిపించడం. ఆస్తమాను ప్రేరేపించే (ట్రిగర్ చేసే) అంశాలు... అలర్జిక్ ఆస్తమా : అలర్జీ తీవ్రతరమైనప్పుడు ఆస్తమాకి దారితీయవచ్చు. సరిపడని పదార్థాన్ని తిన్నప్పుడు లేదా సరిపడని అంశానికి ఎక్స్΄ోజ్ అయినప్పుడు ఆయాసం మొదలుకావచ్చు. వ్యాయామం : కాస్త కష్టమైన వ్యాయామం మొదలుపెట్టగానే కొందరిలో అది ఆస్తమాకు దారితీయవచ్చు. దాన్నే ‘ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా’ అంటారు. అజీర్తి / పులితేన్పులుతో : కొందరిలో తిన్న ఆహారం గొంతులోకి రావడమేనే సమస్య ఉంటుంది. దీన్నే ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ ఇంటస్టినల్ డిసీజ్’ (జీఈఆర్డీ) అంటారు. వీళ్లలో ఆహారం తీసుకున్న తర్వాత వాళ్ల కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడే యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. ఆ యాసిడ్ గొంతులోకి తన్నినప్పుడు కడుపు/గొంతులో మంట కనిపిస్తుంది. అది పులితేన్పుల రూపంలో గొంతులోకి రాగానే యాసిడ్ కారణంగా గొంతు మండుతుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. చాలామందిలో రాత్రి భోజనం కాస్త ఎక్కువగా తింటే కడుపు బరువుగా మారి, ఆయాసంగా ఉండటం, తర్వాత నిద్రలో సమస్య తీవ్రమై మెలకువ వచ్చి ఆయాసంతో బాధపడతారు. పెరిమెనుస్ట్రువల్ ఆస్తమా: మహిళల్లోని కొందరికి రుతుస్రావం మొదలుకాబోయే ముందుగా కెటామేనియల్ ఆస్తమా లేదా ప్రీ/పెరీమెనుస్ట్రువల్ ఆస్తమా అని పిలిచే ఆస్తమా కనిపిస్తుంది. ఇతర కారణాలతో : పొగాకు, పొగ, కట్టెల పొయ్యినుంచి వెలువడే పొగ, రంగులూ (పెయింట్స్) లేదా అగరుబత్తీల వంటి ఘాటైన వాసనలు సరిపడక΄ోవడంతో కూడా ఆస్తమా రావచ్చు. కొందరిలో తాము పనిచేసే ప్రదేశం తమకు సరిపడక΄ోవడం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. దీన్నే ‘వర్క్‌ప్లేస్ ఆస్తమా’ అంటారు. నిర్ధారణ పరీక్షలు... అలర్జీలో ముక్కు కారడం, దగ్గు, కొందరిలో చర్మం మీద ర్యాష్, ముక్కు/కళ్లు ఎర్రబారి బాగా రుద్దుకోవాలనిపించడం, దురదగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన ఆయాసం, పిల్లికూతలు వంటి లక్షణాలతో ఆస్తమాను తెలుసుకోవచ్చు. కొన్ని అలర్జీలను ‘స్కిన్ ప్రిక్ టెస్ట్’ అనే పరీక్షతో నిర్ధారణ చేస్తారు. స్పైరోమెట్రీ/పీఎఫ్‌టీ (PFT) అనే పరీక్ష ఆస్తమా నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో బాధితులతో ఓ పరికరం ద్వారా గాలి ఊదేలా చేస్తారు. బాధితులు ఏమేరకు ఊదగలుగుతున్నారనే అంశం ఆధారంగా వాయునాళాలు ఏమేరకు ముడుచుకుపోయాయనే అంశాన్ని తెలుసుకుని, దాని ఆధారంగా రూపొందించిన గ్రాఫ్ సహాయంతో ఆస్తమా తీవ్రతను తెలుసుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు : ఆస్తమా నిర్ధారణతో పాటు, దాని తీవ్రతను తెలుసుకోవడం కోసం ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు ముడుచుకు΄ోయేలా చేస్తారు. ఇందులో ‘మెథాకైలైన్’ అనే రసాయనాన్ని ఉపయోగించడం గానీ... లేదా కొందరితో వ్యాయామం చేయించి ఆయాసపడేలా చేస్తారు. అటుతర్వాత ‘పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో టెక్నిక్’ అనే ప్రక్రియతో ఆస్తమాను తెలుసుకుంటారు. ఎవరికైనా ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటే ఈ పరీక్ష సహాయంతో అది ప్రారంభం కాకముందే తెలుసుకోవచ్చు. నిశ్వాసలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ పరీక్ష (FENO): గాలి వదిలే నిశ్వాస ప్రక్రియలో కార్బన్ డై ఆక్సైడ్‌ను వదిలే సమయంలో ఆస్తమా బాధితుల్లో ఇజినోఫిల్స్ అనే తెల్ల రక్తకణాల వృద్ధి కారణంగా వారి నిశ్వాసలో నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లు ఎక్కువ. అందుకే ఆస్తమా బాధితుల్లో... మందులు ఏ మేరకు పనిచేస్తున్నాయి, ఊపిరితిత్తుల్లో వాపు, మంట, ఎర్రబారడం (ఇన్ఫ్లమేషన్) ఏమేరకు ఉన్నాయి అని తెలుసుకోడానికి ఈ పరీక్ష చేస్తారు. రక్తపరీక్ష : ఆస్తమా వచ్చినవారి రక్తంలో ఇజినోఫిల్స్ అనే తెల్లరక్తకణాలు ఎక్కువ. అవి రక్తంలో ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోడానికి ఈ పరీక్ష చేస్తారు. అలాగే ఓ వ్యక్తిలో ఏ నిర్దిష్టమైన పదార్థం వల్ల ఆస్తమా వచ్చిందనేది తెలుసుకోవడం కోసం కూడా కొన్ని సెన్సిటివిటీ రక్త పరీక్షలు చేస్తారు. ఎక్స్–రే : ఆస్తమా వ్యాధి నిర్ధారణలో ఎక్స్–రే కీలకం. సీటీ స్కాన్ : కొందరిలో సీటీస్కాన్ (ఛాతీ) అవసరం కావచ్చు. ఆస్తమా నిర్ధారణలో కేవలం... ఆయాసం, పిల్లికూతలు అనే రెండు ప్రధాన అంశాలతో ఆస్తమాను నిర్ధారణ చేయకూడదు. ఇవే లక్షణాలు గుండెజబ్బులు, కేన్సర్, సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), వోకల్ కార్డ్ లకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించే అవకాశమున్నందున ఆస్తమా నిర్ధారణలో నిశితమైన పరిశీలన అవసరం.నివారణ / చికిత్స... అలర్జీ అయినా లేదా ఆస్తమా అయినా దాన్ని ప్రేరేపించే ‘అలర్జెన్స్’కు దూరంగా ఉండటం అన్నది మంచి నివారణ మార్గం. కొంత వయసు పైబడినవారికి డాక్టర్ సలహా మేరకు ఫ్లూ, నిమోకోకల్ వ్యాక్సిన్లు ఇప్పిస్తూ ఆస్తమాను నివారించవచ్చు.అలర్జీలకు చికిత్స ఇలా... అలర్జీలను నెమ్మదింపజేయడానికి ‘అలర్జెన్ స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ’ (సిట్) చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు... అలర్జీ సమయంలో బాధితుల దేహంలో వెలువడే జీవరసాయనాలను బట్టి ఆయా వ్యక్తులకు వ్యక్తిగతమైన మందులు అంటే ‘హ్యూమనైజ్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీ’ల పరిశోధనలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. అయితే వాటి ప్రభావాలు అందరి విషయంలో ఒకేలా ఉండక΄ోవచ్చు. ఉదాహరణకు ఒమాలిజుమాబ్ వంటివి మాస్ట్ సెల్స్, బేసోఫిల్స్ మీద... ఇక రెస్లిసుమాబ్, మె΄÷లిజుమాబ్, బెర్నాలిజుమాబ్ వంటివి ఐఎల్–5ల సహాయంతో ఇజినోఫిల్స్ వెలువడటాన్ని అరికడుతూ... అలా తీవ్రమైన ఆస్తమాతో బాధపడే వారి విషయంలో ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. ఆస్తమా చికిత్స ఇలా..!ఆస్తమాను నివారించేందుకు ‘ప్రివెంటార్స్’ అనే ఇన్హేలర్లూ, ఆస్తమా వచ్చిన సమయంలో దాన్ని తగ్గించేందుకు ‘రిలీవర్స్’ అనే ఇన్హేలర్లు వాడుతుంటారు. ఈ ఇన్హేలర్లు హానికరమనే అ΄ోహ కొందరిలో ఉంటుంది. నిజానికి అవి పూర్తిగా సురక్షితమైనవి. ముందస్తు నివారణ కోసం నెబ్యులైజర్లలాంటి పీల్చే చికిత్స (ఇన్హెలేషన్ థెరపీ) కూడా చేస్తుంటారు. నేసల్ స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి బిగుసుకుపోయిన వాయునాళాలను రిలాక్స్ చేసి, తేలిగ్గా గాలి ఆడేలా చేస్తాయి. ఆస్తమా సమయంలో ఊపిరితిత్తుల లైనింగ్/మ్యూకస్ మెంబ్రేన్స్‌లో వచ్చిన వాపు, మంట, ఎర్రబారడాన్ని (ఇన్ఫ్లమేషన్ను) తగ్గించే యాంటీ హిస్టమైన్ వంటి మందుల్ని వాడతారు.ఇప్పుడు అలర్జీలనూ, ఆస్తమానూ వేర్వేరుగా చూడటం సరికాదని డాక్టర్లు చెబుతుంటారు. ఇందుకు ‘ఏరియా’ అనే అంశాన్ని ప్రమాణంగా చూపుతారు. ఇక్కడ ‘ఏరియా’ అంటే... ‘ఏ.. ఆర్... ఐ.. ఏ’ అనే స్పెలింగ్తో ‘అలర్జిక్ రైనైటిస్ అండ్ ఇంటర్మిట్టెంట్ ఆస్తమా’ అని అర్థం. అందుకే అలర్జీలనూ, ఆస్తమానూ కలిపి ‘ఒన్ ఎయిర్‌వే డిసీజ్’గా పరిగణిస్తూ... అవసరాన్ని బట్టి శ్వాసవ్యవస్థ పైభాగంలోని రైనైటిస్కూ, కింద ఆస్తమాకూ చికిత్స చేయాలన్నది ఇప్పుడు ఆధునిక దృష్టికోణంలో అవసమన్నది డాక్టర్లు చెబుతున్న మాట. ఇక అలర్జీ అంటే ఏమిటో, ఆస్తమా అని దేన్ని అంటారో చూద్దాం. డా. ఏ. రఘుకాంత్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ (చదవండి: ఆ నాలుగు 'వైట్ ఫుడ్స్'ని నివారిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
వర్షాకాలంలో ఆస్తమా సమస్యా? ఎలా కంట్రోల్ చేయాలి?
వర్షకాలంలో చాలామందిని వేధించే సమస్య ఆస్తమా. వాతావరణంలో మార్పులతో శ్వాసకోశ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉబ్బసం అటాక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మారుతున్న సీజన్లో ఆస్తమా రోగులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతారు. లక్షణాలను సకాలంలో గుర్తిస్తే ఆస్తమాను నివారించుకోవచ్చు. ఆస్తమా వ్యాధిని ఎలా అదుపులో పెట్టుకోవాలన్నది ప్రముఖ ఆయుర్వేద డా. నవీన్ నడిమింటి మాటల్లోనే విందాం. ఇలా చేస్తే దగ్గు, జలుబు ఈజీగా తగ్గుతుంది చిటికెడు పసుపును నీళ్ళలో వేసి మరిగించి ఆ ఆవిరిని రోజుకి పదిసార్లు పట్టాలి. పాలు, మిరియాలు పొడి పసుపు కలిపి మరిగించి రాత్రి పడుకునే ముందు తాగి, ముక్కు, ముఖానికి విక్స్ వేపరబ్ పట్టించి దుప్పటి తలమీద వరకు కప్పుకుని పడుకుంటే ఉదయం లేవగానే ఎంతో రిలీఫ్‌గా ఉంటుంది.తులసి ఆకుల రసం తేనె తో కలిపి తీసుకుంటే జలుబూ గొంతు నొప్పి,దగ్గు త్వరగా తగ్గుతాయి. జలుబు లేకపోయినా పొడి దగ్గు.. ఎందుకు? శరీరంలో నీరు సరిపోక ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా దగ్గు వస్తుంది.ఇలా వచ్చే దగ్గు వెంటనే తగ్గదు..కానీ ఉప్పునీళ్ళు గొంతు దాకా పుక్కిలించడం, మిరియాల కషాయం (రుచించడం కోసం కొంత బెల్లం కూడా కలపవచ్చు), లేదా వెచ్చటి తేనె, నిమ్మరసం కలిపిన నీరు లాంటివి కొంత ఉపశమనాన్ని కలిగించవచ్చు. ఇక దాహం వేసినప్పుడల్లా అశ్రద్ద చేయకుండా శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఉబ్బసం వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ఎలా…? కొన్ని రకాల పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఉబ్బసం వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.విటమిన్ సీ, ఈ,బెటాకెరోటిన్,ఫ్లేవనాయిడ్స్,మెగ్నీషియం,సెలీనియం,ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా లభించే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఉబ్బసం వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.కోడిగుడ్లు, పాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటితో పాటు పాలకూర వంటి ఆకుకూరలను రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. ►హోమియోలో Blatta orientalis అనే మందు ఉబ్బసం వ్యాధి నివారణ లో అద్భుతంగా పని చేస్తుంది. దీన్ని Mother Tincture రూపంలో రోజు 3 పర్యాయాలు అర గ్లాసు (చిన్న గ్లాసు) నీటిలో 10 చుక్కల వంతున వేసి ఇవ్వాలి. -డా.నవీన్ నడిమింటి(9703706660) ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు -
Diwali: పండక్కి ఫుల్లుగా తినండి కానీ... వీళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి! లేదంటే
Diwali 2022- Health Care Tips In Telugu: కాస్త జాగ్రత్తపండగనాడు బోలెడన్ని పిండివంటలు, స్వీట్లు వంటి వాటితో హైక్యాలరీ ఫుడ్ తినేసే అవకాశాలుంటాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని అనుసరించి ఏ మేరకు, ఎంత పరిమితిలో స్వీట్లు తినాలన్న విషయంపై జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు... ఒకోసారి పండగ సమయాల్లో వేడుకల్లో పడిపోయి సరైన వేళల్లో ఆహారం తీసుకోకపోవడం కూడా ఉంటుంది. ఈ అంశం డయాబెటిస్, హైబీపీ ఉన్న రోగులపై దుష్ప్రభావం చూసే అవకాశాలెక్కువ. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్త ఎంతో అవసరం. ►దీపావళి పండగకు స్వీట్స్ వినియోగం ఎక్కువ కాబట్టి... ఈ పండగ సమయంలో క్యాలరీలను తగ్గించే వ్యాయామాలను క్రమం తప్పనివ్వకూడదు. ►స్వీట్స్ పంచుకునే పండగ దీపావళి. కాబట్టి డయాబెటిస్ రోగులు తమ చక్కెర పాళ్లను నియంత్రణలో ఉంచుకోవడం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ►మీ డాక్టర్ ఇచ్చిన చక్కెర నియంత్రణ ట్యాబ్లెట్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోండి. ►అలాగే స్వీట్లు తిన్న తర్వాత కూడా భోజనం ఫుల్లుగా లాగించేయవద్దు. స్వీట్లు తింటే గనక ఆ మేరకు అన్నం కాస్త తగ్గించి తినడం మంచిది. ►మరో విషయం... బాణాసంచా కాల్చడం వల్ల వాతావరణంలోకి సల్ఫర్, పొటాషియం వంటి రసాయనాలు వెలువడి అలర్జీలు కలిగే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆస్తమా రోగులు తమ ఇన్హేలర్స్ను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకటి అదనంగా కొని స్పేర్‌లో పెట్టుకోవడమూ మంచిదే. చదవండి: Health Tips: నట్స్, డార్క్ చాక్లెట్స్, అరటి పండ్లు తరచూ తింటున్నారా? డోపమైన్ అనే హార్మోన్ విడుదల చేసి.. Paranoia: రోజూ రాగానే ఇల్లంతా వెతకడం.. వాడిని ఎక్కడ దాచావ్ అంటూ భార్యను తిట్టడం! ఈ పెనుభూతం వల్ల.. -
గాడిద పాలకు మంచి డిమాండ్.. కప్పు పాల ధర ఎంతంటే..
Health Benefits With Donkey Milk, Huge Demand in Telangana, Rates For A Cup సాక్షి, పాల్వంచ(ఖమ్మం): ప్రస్తుతం సమాజంలో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంది. గాడిదపాలు తాగిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం చేస్తూ పాలను విక్రయిస్తున్నారు. గాడిద పాలు కూడా తాగే వారి సంఖ్య పెరగడంతో ఈ పాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. కరము పాలు గరిటడైనా చాలు అన్నట్లుగా.. గాడిద పాలు తాగితే పలు రకాల మొండి వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని గాడిద పాల విక్రయదారులు అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలీదు కానీ, గాడిద పాలను కూడా అనేక మంది కొనుగోలు చేసి తాగుతున్నారు. మంచిర్యాలకు చెందిన కొంతమంది యువకులు మూడు గాడిదలతో ప్రతి సంవత్సరం ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు పాల్వంచ పట్టణ, మండలంలో ఊరూరా తిరుగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. పాలు కావాలంటే ఇంటివద్దనే గాడిదపాలను పితికి అక్కడిక్కడే ఇస్తారు. అర టీ కప్పు గాడిద పాలు చిన్న పిల్లలకు రూ.150, పెద్దలకు ఒక టీ కప్పు రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ గాడిద పాల విక్రయదారులు రోజుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. గిరాకీ ఉంటే అంతో ఇంతో ఆదాయం లభిస్తుందని, అది కూడా గాడిద పాల గురించి తెలిసిన వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో రకరకాల ఆహార పదార్థాలు వచ్చాయని దీంతో గాడిద పాలకు కాస్తా గిరాకీ తగ్గిందంటున్నారు. దగ్గు, దమ్ము, ఆస్తమా, గురక వంటి వ్యాధులను గాడిద పాలు తాగితే పూర్తిగా తగ్గిపోతుందని, ఈ పాలల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయని నిర్వాహకులు ప్రచారం చేస్తూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. గిరాకీ తగ్గింది ఆవు, గేదె, మేక పాలకు ఉన్న గిరాకీ గాడిద పాలకు ఉండటం లేదు. అయితే గాడిద పాలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని తాగడం ద్వారా చిన్నారులకు, పెద్దలకు పలు రకాల వ్యాధులు నివారణ అవుతాయి. చాలామందికి ఈ పాల వలన అనేక రకాల మొండి వ్యాధులు తగ్గిపోయాయి. – ఇరుగుదిండ్ల లక్ష్మి, మంచిర్యాల చదవండి: భార్య ఉసురుతీసిన భర్త వివాహేతర బంధం -
పిల్లల్లో ఆస్తమా.. ఆరు దశల్లో ఇలా చికిత్స
పిల్లల్లో ఆస్తమా అన్నది ఇటీవల చాలా సాధారణంగా కనిపించే మెడికల్ కండిషన్. పిల్లల్లో వారికి సరిపడని పదార్థమో లేదా ఏదైనా కాలుష్య కారకమో ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి కండరాలు బిగుసుకుపోతాయి. శ్వాసమార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఆ మార్గంలో జిగురు పదార్థం (మ్యూకస్ లేదా ఫ్లెమ్) ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీనివల్ల కూడా ఊపిరి అందదు. ఇలాంటి లక్షణాలు కనిపించనప్పుడు దాన్ని ఆస్తమాగా పేర్కన్నవచ్చు. పిల్లలకు సరిపడని ఆ పదార్థాన్ని ‘ట్రిగర్’ అంటారు. పిల్లల్లో ట్రిగర్స్ వేర్వేరుగా ఉంటాయి. మారిన వాతావరణం, కాలుష్యం, పొగ, ఇళ్లలోని దుమ్మూ, కార్పెట్లలోని ధూళి, సరిపడని ఆహారపదార్థాలు, ఘాటైన రసాయనాల వాసనలు, సాఫ్ట్ టాయ్స్, పెట్స్‌కు ఉండే వెంట్రుకల్లో దాగి ఉండే అలర్జెన్స్, పోలెన్స్, ఆహారానికి కలిపే రంగులు (ఫుడ్ అడెటివ్స్–పిల్లలకు మరింత ఆకర్శించేందుకు చాలా పదార్థాలకు ఇవి కలుపుతారు), కొన్నిరకాల మందులు (యాస్పిరిన్, సల్ఫా డ్రగ్స్ వంటివి) ఇలా ట్రిగర్స్ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరుగా ఉండవచ్చు. ట్రిగర్స్ నుంచి పూర్తిగా దూరంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కానీ వీలైనంతగా వాటినుంచి దూరంగా ఉండాలి. పిల్లల్లో ఆస్తమా వచ్చినప్పుడు సాధారణంగా వారిలో చికిత్స ఆరుదశల్లో ఉంటుంది. మొదటి స్టెప్‌లో: అప్పుడప్పుడూ అవసరాన్ని బట్టి రిలీవర్స్ ఇవ్వడం రెండో స్టెప్‌లో : పీల్చడానికి వీలైన తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్స్ (ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ – ఐసీఎస్) లేదా మాంటెలుకాస్ట్ మూడో స్టెప్‌లో : ఓ మోస్తరు తీవ్రత ఉన్నవారికి ఓమాదిరి మోతాదు (మాడరేట్ డోస్)లో పీల్చదగిన కార్టికోస్టెరాయిడ్స్ నాలుగో స్టెప్‌లో : ఓ మోస్తరు తీవ్రత ఉన్నవారికి ఐసీఎస్‌తో పాటు మాంటెలుకాస్ట్ లేదా లాంగ్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్స్ (ఎల్ఏబీఏ) ఐదో స్టెప్‌లో : ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఎక్కువ డోస్‌తో ఉండే ఐసీఎస్ మాంటెలుకాస్ట్ లేదా లాండ్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్స్ (ఎల్ఏబీఏ) ఆరో స్టెప్‌లో : మరీ తీవ్రంగా ఉన్నవారికి హైడోస్ ఐసీఎస్‌తో పాటు మాంటెలుకాస్ట్ ప్లస్ నోటి ద్వారా స్టెరాయిడ్స్ ఇవ్వడం. అయితే చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా సాధారణంగా వాళ్లు యుక్తవయసుకు వచ్చేనాటికి చాలామందిలో తగ్గిపోతుంది. కాబట్టి ఆందోళన అవసరం లేదు. చదవండి: క్రానిక్ స్మోకర్స్లో కంటి సమస్యలు -
ఈ ఆహారంతో అస్తమాకు చెక్!
కొన్ని రకాల ఆహారాలు ఆస్తమాను నివారిస్తాయి. అవి... 1.కిస్మిస్, వాల్నట్స్ వంటి ఢ్రై ఫ్రూట్స్, బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, కూర అరటి వంటి కూరగాయలు, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఈ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి కాబట్టి ఇవి కూడా ఎక్కువగా లభ్యమయ్యేలా ఆహారం తీసుకోవాలి. 2.బ్రేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు తీసుకోవాలి. 3.కూరల్లో లేదా తీసుకునే పదార్థాల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం– సోయా గింజలు ఉండటం మంచిది. 4.దనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. 5.పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి. ఆస్తమాను ప్రేరేపించడానికి అవకాశం ఉన్న ఆహారాలు ఇక ఆస్తమాను ప్రేరేపించే ఆహారాలూ ఉన్నాయి. అలా ట్రిగర్ చేసే ఈ కింది వాటిని సాధ్యమైనంతగా నివారించడం మేలు. అయితే... ఇవన్నీ అందరిలోనూ ఆస్తమాను ప్రేరేపించవు. వ్యక్తిగతంగా వారికి సరిపడక వారిలో మాత్రమే ఆస్తమాను ట్రిగర్ చేస్తాయి. అందుకే ఈ కింది వాటిలో ఏదైనా పదార్థం సరిపడక, దేని కారణంగానైనా ఆస్తమా వస్తుంటే దాన్నుంచి దూరంగా ఉండాలి. సాధారణంగా కొందరిలో ఆస్తమాను ప్రేరేపిస్తాయంటూ చెప్పే ఆహారాలు ఇవే... పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేయవచ్చు. అయితే ఇందులో కొన్ని మాత్రమే నిజం. వీటిలో ఫలానా ఆహారం నిర్దిష్టంగా అలర్జీని కలిగించి ఆస్తమాను ప్రేరేపిస్తుందని, అదే ట్రిగర్ అని తెలిస్తేనే... అప్పుడు దాన్ని మాత్రమే మానేయాలి. కమలాలు, నిమ్మ, బత్తాయి లాంటివి సి విటమిన్‌ను కలిగించి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి. నిర్దిష్టంగా ఆ ఆహారం అలర్జీని కలిగిస్తుందని అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, అది కచ్చితంగా అలర్జీని కలిగిస్తుందనే నిర్ధారణ పరీక్షను చేయించాకే... ఆ ఆహారం నుంచి దూరంగా ఉండాలి. -
ఆస్తమా ఎందుకు, ఎలా వస్తుందంటే..?
చలికాలం తీవ్రమైన చలి, ఎండాకాలంలో విపరీతమైన వేడిమి, అత్యధికంగా రేగే దుమ్ము వంటివి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఆస్తమా కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలోని మార్పులు ఎక్కువగా ఉంటే ఆస్తమా లక్షణాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దాంతో ఆస్తమాతో బాధపడేవారి పరిస్థితి తీవ్రంగా తయారవడాన్ని ఆస్తమా అటాక్ లేదా ఆస్తమా ఎపిసోడ్ అంటారు. ఈ పరిస్థితి హఠాత్తుగా ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ఇది విషమించి తక్షణ వైద్యసాయం అవసరమవుతుంది. ఆస్తమా అటాక్ జరిగినప్పుడు శ్వాసవ్యవస్థలో వేగంగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు. ►వాయునాళాల చుట్టూతా కండరాలు బిగుసుకుంటాయి. దాంతో గాలి ప్రయాణించే మార్గం మరింతగా కుంచిస్తుంది. ►శ్వాసకోశాలకు చేరే గాలి పరిమాణం బాగా తగ్గిపోతుంది ►వాయునాళాల వాపు ఎక్కువై, వాయువులు ప్రయాణం చేసే దారి మరింత సన్నబారిపోతుంది. ►వాయునాళాలలో వాపు వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు రోగనిరోధక వ్యవస్థ ఎక్కువ మ్యూకస్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో వాయునాళాలు మరింతగా మూసుకుపోతాయి. ఈ మార్పులతో సాధారణ స్థాయి నుంచి ప్రమాదకర స్థాయి వరకు ఆస్తమా అటాక్ జరుగుతుంది. ఈ అటాక్ ప్రారంభం లో ఊపిరితిత్తులకు కొంచెం తక్కువగానైనా ఆక్సిజన్ అందుతుంది. కానీ శ్వాసకోశాల నుంచి కార్బన్ డై ఆక్సైడ్ బయటకు రావడం కష్టంగా ఉంటుంది. ఇది మరికొంత సమయం కొనసాగే సరికి శ్వాసకోశాలలో కార్బన్ డై ఆక్సైడ్ నిలిచిపోయి శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. క్రమంగా ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్ పరిమాణం చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. దీంతో శరీరంలోని వివిధ భాగాలకు రక్తం ద్వారా అందే ఆక్సిజన్ తగ్గుతుంది. ఈ రకమైన ఆస్తమా అటాక్ చాలా ప్రమాదకరమైనది. రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. చదవండి: కాఫీ తాగడం మంచిదా..? కాదా..? -
అందుకే వస్తోంది.. ఆస్తమా..
సాక్షి, హైదరాబాద్ : ఒకప్పుడు బయటి వాతావరణ కాలుష్యం ఆస్తమాకు కారణమని అంతా భావించేవారు. ఇప్పుడీ ముప్పు నేరుగా ఇంట్లోనే తిష్టవేసుక్కూర్చుంది. ఇండోర్ పొల్యూషన్ (దుప్పట్లు, తలదిండ్లు, పర్ఫ్యూమ్లు, మస్కిటోకాయిల్స్, అగరొత్తులు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, ఎలుకల మలమూత్రాల నుంచి వెలువడే వాయువులు, దుమ్ముధూళి) ఆస్తమాకు ఎక్కువ కారణమవుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సర్వేలో తేలింది. ఇంటా, బయటా కాలుష్య సమస్య వల్ల పట్టణాల్లో 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 2 శాతం మంది ఆస్తమాతో బాధపడుతుండగా, బాధితుల్లో 10–12 శాతం మంది చిన్నపిల్లలే ఉన్నట్లు సర్వే తేల్చింది. శుక్రవారం హోటల్ తాజ్‌కృష్ణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఛాతీ వైద్యనిపుణుడు డాక్టర్ విజయ్‌కుమార్ ఆస్తమాకు కారణమవుతున్న అంశాలను వివరించారు. ఇంటా బయటా తంటానే.. ►గ్రేటర్లో 15 ఏళ్ల క్రితం ఉన్న 11 లక్షల వాహనాలు, 2019 నాటికి 55 లక్షలకు చేరాయి. వీటిలో పదిహేనేళ్ల సర్వీసు దాటినవి 10 లక్షలు. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. ►40 వేల వరకు ఉన్న పరిశ్రమలు వదిలే పొగ, వ్యర్థాల వల్ల క్యూబిక్ మీటర్ గాలిలో 130–150 మైక్రోగ్రాముల వరకు వివిధ కాలుష్య స్థాయిలు నమోదవుతున్నాయి. ►సల్పర్డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్‌మోనాక్సైడ్‌తో కూడిన గాలిని పీల్చడం వల్ల శ్వాస నాళాలు దెబ్బతింటున్నాయి. ►ఇంట్లో వాడే మస్కిటోకాయిల్స్, పర్ఫ్యూమ్స్, పరుపు, తలదిండ్లలో పేరుకుపోయిన దుమ్ము ఆస్తమా కలిగిస్తున్నాయి. ► పోతపాలు, జంక్‌ఫుడ్, అతిగా యాంటీబయాటిక్స్ వాడటం వంటివి ఐదేళ్లలోపు చిన్నారుల శ్వాసనాళాలను దెబ్బతీస్తున్నాయి. వ యసుతో పాటే తెరుచుకోవాల్సిన శ్వాసనాళాలు మూసుకుపోతున్నాయని తేలింది. ►ప్రసవం తర్వాత చాలామంది తల్లులు బిడ్డలకు డబ్బా పాలు పడుతున్నారు. సాధారణ జ్వరానికీ ఖరీదైన యాంటిబయాటిక్స్ వాడుతున్నారు. ఇది పిల్లల్లో ఆస్తమాకు కారణమవుతోంది. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువుపై ప్రభావం చూపుతోంది. నాడీ వ్యవస్థపై ప్రభావం – డాక్టర్ పి.సుదర్శన్‌రెడ్డి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఆస్తమాకు బయట ఉండే వాహన, పారిశ్రామిక కాలుష్యం, ధూమపానం వంటి వాటి కంటే ఇండోర్ పొల్యూషన్ (మస్కిటో కాయిల్స్, పర్ఫ్యూమ్స్, అగరొత్తులు, పెట్స్, దుప్పట్లు, దిండ్లు) ఎక్కువ ప్రమాదకరం. ఆస్తమా వల్ల శ్వాసనాళాలు మూసుకుపోయి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు, కిడ్నీల పనితీరు మందగిస్తుంది. ఇన్హేలర్తో ఉపశమనం – డాక్టర్ విజయ్‌కుమార్, ఫల్మనాలజిస్ట్, అపోలో ఆస్పత్రి ఇంట్లో ఇన్హేలర్ ఉండాలి. టాబ్లెట్స్, ఇంజక్షన్లు, నెబ్లైజర్తో పోలిస్తే ఇన్హేలర్తోనే ప్రయోజనం ఎక్కువ. వైద్య పరీక్షలతో పని లేకుండా క్లినికల్‌గానూ ఆస్తమాను నిర్ధారించవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నుంచి తొమ్మిది మాసాలు మందులు వాడితే చాలు. ఆస్తమా లక్షణాలివీ.. తరచూ దగ్గడం.. ఆయాసం.. కడుపు ఉబ్బరంగా ఉండటం. వీటికి దూరంగా ఉండాలి.. ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలు, కూలర్, ఏసీ, సిగరెట్, సిమెంట్, ఫ్లెక్సీ ప్రింటర్స్, పారిశ్రామిక, వాహన కాలుష్యం.. -
6 లక్షల మందికి 5 క్వింటాళ్ల చేప ప్రసాదం
చార్మినార్ : చేప ప్రసాదం పంపిణీలో భాగంగా మంగళవారం బత్తిని కుటుంబ సభ్యులు పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. ఏటా చేప పంపిణీ ప్రసాదానికి ముందు కుటుంబసభ్యులతో కలిసి ఈ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. పూజా కార్యక్రమాల్లో బత్తిని విశ్వనాథ్ గౌడ్, హరినాథ్ గౌడ్, శివానంద్ గౌడ్, శివ ప్రసాద్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్, సంతోష్ గౌడ్లతో పాటు దాదాపు 250 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాదం తయారీ కార్యక్రమం కొనసాగింది. బుధవారం ఉదయం 4 గంటలకు పూజల అనంతరం 6.30 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందని బత్తిని సోదరులు తెలిపారు. ఈసారి 6 లక్షల మందికి.. గతేడాది 3.5 క్వింటాళ్ల చేప ప్రసాదం పంపిణీ చేశామని... అయితే, అది చాలక పోవటంతో మరో 50 కిలోలను తయారు చేసి పంపిణీ చేసినట్లు బత్తిని గౌరీశంకర్ గౌడ్ తెలిపారు. ఈసారి అలాంటి సమస్య తలెత్తకుండా 5 క్వింటాళ్ల చేప ప్రసాదాన్ని ముందుగానే తయారు చేస్తున్నామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 34 లైన్లను ఏర్పాటు చేసి ఒక్కో లైన్లో నలుగురు చేప మందు పంపిణీ చేయనుండగా, వారికి మరో నలుగురు సహాయకులుగా పని చేస్తారన్నారు. 24 గంటల్లో మూడు షిప్టులలో తాము ప్రజలకు చేప ప్రసాదాన్ని అందజేయనున్నామన్నారు. ఉచితంగా ఆహారం.. టీఎస్ బసవ కేంద్రం అధ్యక్షుడు నాగ్నాథ్ మాశెట్టి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మంగళవారం ఉదయం చేప ప్రసాదం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి ఉచితంగా ఆహార పదార్థాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్ సైనీ, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ శ్వేత మెహంతి హాజరయ్యారు.