కొన్ని రకాల ఆహారాలు ఆస్తమాను నివారిస్తాయి. అవి...
1.కిస్‌మిస్, వాల్‌నట్స్ వంటి ఢ్రై ఫ్రూట్స్, బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, కూర అరటి వంటి కూరగాయలు, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఈ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి కాబట్టి ఇవి కూడా ఎక్కువగా లభ్యమయ్యేలా ఆహారం తీసుకోవాలి.
2.బ్రేక్‌ఫాస్ట్‌లో... పండ్లు, తేనె, కిస్‌మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్‌రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు తీసుకోవాలి.
3.కూరల్లో లేదా తీసుకునే పదార్థాల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం– సోయా గింజలు ఉండటం మంచిది.
4.దనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి.
5.పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి.
ఆస్తమాను ప్రేరేపించడానికి అవకాశం ఉన్న ఆహారాలు
ఇక ఆస్తమాను ప్రేరేపించే ఆహారాలూ ఉన్నాయి. అలా ట్రిగర్ చేసే ఈ కింది వాటిని సాధ్యమైనంతగా నివారించడం మేలు. అయితే... ఇవన్నీ అందరిలోనూ ఆస్తమాను ప్రేరేపించవు. వ్యక్తిగతంగా వారికి సరిపడక వారిలో మాత్రమే ఆస్తమాను ట్రిగర్ చేస్తాయి. అందుకే ఈ కింది వాటిలో ఏదైనా పదార్థం సరిపడక, దేని కారణంగానైనా ఆస్తమా వస్తుంటే దాన్నుంచి దూరంగా ఉండాలి. సాధారణంగా కొందరిలో ఆస్తమాను ప్రేరేపిస్తాయంటూ చెప్పే ఆహారాలు ఇవే... పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేయవచ్చు.
అయితే ఇందులో కొన్ని మాత్రమే నిజం. వీటిలో ఫలానా ఆహారం నిర్దిష్టంగా అలర్జీని కలిగించి ఆస్తమాను ప్రేరేపిస్తుందని, అదే ట్రిగర్ అని తెలిస్తేనే... అప్పుడు దాన్ని మాత్రమే మానేయాలి. కమలాలు, నిమ్మ, బత్తాయి లాంటివి సి విటమిన్‌ను కలిగించి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి. నిర్దిష్టంగా ఆ ఆహారం అలర్జీని కలిగిస్తుందని అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, అది కచ్చితంగా అలర్జీని కలిగిస్తుందనే నిర్ధారణ పరీక్షను చేయించాకే... ఆ ఆహారం నుంచి దూరంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment