పిల్లల్లో ఆస్తమా అన్నది ఇటీవల చాలా సాధారణంగా కనిపించే మెడికల్ కండిషన్. పిల్లల్లో వారికి సరిపడని పదార్థమో లేదా ఏదైనా కాలుష్య కారకమో ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి కండరాలు బిగుసుకుపోతాయి. శ్వాసమార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఆ మార్గంలో జిగురు పదార్థం (మ్యూకస్ లేదా ఫ్లెమ్) ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీనివల్ల కూడా ఊపిరి అందదు. ఇలాంటి లక్షణాలు కనిపించనప్పుడు దాన్ని ఆస్తమాగా పేర్కన్నవచ్చు.
పిల్లలకు సరిపడని ఆ పదార్థాన్ని ‘ట్రిగర్’ అంటారు. పిల్లల్లో ట్రిగర్స్ వేర్వేరుగా ఉంటాయి. మారిన వాతావరణం, కాలుష్యం, పొగ, ఇళ్లలోని దుమ్మూ, కార్పెట్‌లలోని ధూళి, సరిపడని ఆహారపదార్థాలు, ఘాటైన రసాయనాల వాసనలు, సాఫ్ట్ టాయ్‌స్, పెట్స్‌కు ఉండే వెంట్రుకల్లో దాగి ఉండే అలర్జెన్స్, పోలెన్స్, ఆహారానికి కలిపే రంగులు (ఫుడ్ అడెటివ్స్–పిల్లలకు మరింత ఆకర్శించేందుకు చాలా పదార్థాలకు ఇవి కలుపుతారు), కొన్నిరకాల మందులు (యాస్పిరిన్, సల్ఫా డ్రగ్స్ వంటివి) ఇలా ట్రిగర్స్ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరుగా ఉండవచ్చు. ట్రిగర్స్ నుంచి పూర్తిగా దూరంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కానీ వీలైనంతగా వాటినుంచి దూరంగా ఉండాలి.
పిల్లల్లో ఆస్తమా వచ్చినప్పుడు సాధారణంగా వారిలో చికిత్స ఆరుదశల్లో ఉంటుంది.
- మొదటి స్టెప్‌లో: అప్పుడప్పుడూ అవసరాన్ని బట్టి రిలీవర్స్ ఇవ్వడం
- రెండో స్టెప్‌లో : పీల్చడానికి వీలైన తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్స్ (ఇన్‌హేల్‌డ్ కార్టికోస్టెరాయిడ్స్ – ఐసీఎస్) లేదా మాంటెలుకాస్ట్
- మూడో స్టెప్‌లో : ఓ మోస్తరు తీవ్రత ఉన్నవారికి ఓమాదిరి మోతాదు (మాడరేట్ డోస్)లో పీల్చదగిన కార్టికోస్టెరాయిడ్స్
- నాలుగో స్టెప్‌లో : ఓ మోస్తరు తీవ్రత ఉన్నవారికి ఐసీఎస్‌తో పాటు మాంటెలుకాస్ట్ లేదా లాంగ్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్స్ (ఎల్‌ఏబీఏ)
- ఐదో స్టెప్‌లో : ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఎక్కువ డోస్‌తో ఉండే ఐసీఎస్ మాంటెలుకాస్ట్ లేదా లాండ్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్స్ (ఎల్‌ఏబీఏ)
- ఆరో స్టెప్‌లో : మరీ తీవ్రంగా ఉన్నవారికి హైడోస్ ఐసీఎస్‌తో పాటు మాంటెలుకాస్ట్ ప్లస్ నోటి ద్వారా స్టెరాయిడ్స్ ఇవ్వడం.
అయితే చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా సాధారణంగా వాళ్లు యుక్తవయసుకు వచ్చేనాటికి చాలామందిలో తగ్గిపోతుంది. కాబట్టి ఆందోళన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment