Children Health
-
చిన్నపిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? టీనేజ్‌లో డిప్రెషన్‌తో..
ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తికాదు. లేచినప్పటి నుంచి నిద్రకు ఉపక్రమించే వరకు పక్కన స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. సగం పనులు దీనితోనే అవున్నాయంటే మాటలు కాదు. ఒక వైపు స్మార్ట్ ఫోన్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతకుమించి సమస్యలూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఫోన్ పెను ప్రభావం చూపుతోంది. జీవనశైలే మారిపోయింది ప్రస్తుతం 99 శాతం మంది చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ ఫోన్ల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 1995 తర్వాత పుట్టిన పిల్లలు తమ కౌమారమంతా స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్న మొదటి తరమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్లు వచ్చాక మనిషి జీవన శైలే మారియిందని పేర్కొంటున్నాయి. 1995 తర్వాత పుట్టిన పిల్లలు ఎక్కువ సమయం ఆన్లైన్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. కబుర్లు, సరదాలు, ఆట పాటలూ అన్నీ అందులోనే. పుస్తకాలు చదవడం, నిద్రపోవడం, స్నేహితులతో గడపడం, శారీరక ఆటలకు కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. ఈ జీవన శైలి వలన పిల్లల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులూ హెచ్చరిస్తున్నారు. ముందు తరాలవారితో పోల్చుకుంటే జీవన నైపుణ్యాల్లో ఇప్పటి పిల్లలు వెనకబడిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. వీటికి అదనంగా ఒంటరితనంతోపాటు ఇతర మానసిక సమస్యలూ ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు తేల్చాయి. స్మార్ట్ ఫోన్లు పిల్లలు, టీనేజర్ల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపి సృజనాత్మకతను చంపేస్తున్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. అమెరికా సైకాలజీ ప్రొఫెసర్ జీన్ అధ్యయనమూ ఇదే విషయాన్ని మరింత విడమరిచి చెప్పింది. టీనేజర్లు తీవ్ర నిరాశలోకి.. టీనేజర్ల ఆరోగ్యం, ప్రవనర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్, ఐజెన్ కన్సెల్టింగ్ వైద్యురాలు జీన్ త్వెంగే అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలిసి 13 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పది లక్షలకుపైగా పిల్లపై పరిశోధనలు చేశారు. టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుపుతన్నారనేది మానసిక ఆరోగ్య కోణంలో ఓ ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. ఆమె 2011 నుంచి ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు బాగా పెరగడం గుర్తించినట్టు చెప్పారు. జీవితం వృథా అనే భావనకు చాలామంది వస్తున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలని, ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేర పెరిగాయని వివరించారు. తమను తాము గాయపరుచుకునేంతగా అవి విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికల్లో ఈ ప్రమాదకర ధరోణి రెండు మూడింతలు పెరిగిందని పేర్కొన్నారు. కొన్నేళ్లలోనే టీనేజర్ల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని జీన్ తన అధ్యయనంలో వివరించారు. ఫోన్ వ్యసనంలా.. మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లుకుపైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారట. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే భావనలో ఉంటున్నారట. ఇదొక వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? ► రోజుకు రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం డిజిటల్ మీడియాకు కేటాయించడం మంచిది. ఇది మానసిక ఆరోగ్యానికి ఆనందానికి దోహదపడుతుంది. ► అయితే డిజిటల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా విచారానికి కారణమవుతుంది. ► మన సమయం మన చేతిలోనే ఉంటుంది. ఉండాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ► స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు మాత్రమే సోషల్ మీడియాను వాడాలి. ఒకవేళ పిల్లలకు ఫోన్ చాలా అవసరమని భావిస్తే ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫోన్ మాత్రమే ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వకూడదు. అది వారికి అలవాటు చేయడం వల్ల వారి పెరుగుదలతోపాటు మెదడుపై ప్రభావం చూపుతోంది. మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పెద్దలు కూడా అవసరానికి మించి స్మార్ట్ఫోన్లు వాడకూడదు. దీనివల్ల మతిమరుపు నిద్రలేమి సమస్యలకు లోనవుతారు. మీపిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినట్లు అనుమానం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. -
పిల్లలు మానసికంగా ఎదగకపోవడానికి, అంగవైకల్యంతో పుట్టడానికి కారణాలు ఇవే
-
పిల్లల్లో విరోచనం కాకపోతే ఏం చేయాలి? సునాముఖి ఆకుతో ఇలా చేస్తే..
చిన్నపిల్లలున్న ఇల్లు! అసలే వీపరీతమైన పని, ఒత్తిడి. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు! ఏం తినాలో, ఏం తినకూడదో వారికి తెలియదు, తల్లితండ్రులకు వారిని అర్థం చేసుకునే సమయం తక్కువ! 24 గంటలూ పిల్లలనే కనిపెట్టుకుని వుండాలంటే కొద్దిగా కష్టమే! అయినా కళ్ళల్లో వత్తు లేసుకుని కాపలా కాస్తూనే వున్నప్పటికీ పిల్లలు ఏదో తినేస్తుంటారు. ఇబ్బంది పడతారు. మరి అప్పుడేం చెయ్యాలి? ఆందోళన చెందకుండా ఆయుర్వేదం ఎలాంటి పరిష్కారాలు సూచిస్తోంది? 1. పిల్లలు తెలియకుండా ఏదో ఒకటి నోట్లో పెట్టుకుని తర్వాత కడుపు నొప్పి అంటూ విలవిలలాడితే? కొద్దిగా జీలకర్ర తీసుకుని బాగా శుభ్రపరిచి, దోరగా వేయించాలి. ఆ వేగిన జీలకర్రను మెత్తటి వుండగా చేసుకుని ఓ సీసాలో భద్రపరచు కోవాలి. మాదీఫల రసాయనం సీసాను తెచ్చుకుని ఓ చెంచా జీలకర్ర పొడిలో మాదీఫల రసాయనం కలపాలి. దాన్ని చెంచాలో తీసుకుని పిల్లలకు పట్టాలి. దీని వల్ల వాంతులే కాదు వామ్టింగ్ సెన్సేషన్ కూడా వుండమన్నా వుండదు. పత్యం చెయ్యాల్సిన అవసరం లేదు. 2. హఠాత్తుగా విరేచనాలు మొదలయితే ఏం చేయాలి? జిగట, మామూలు, నెత్తురు, చీము వంటి విరేచనాల లక్షణాలు కనిపిస్తున్నప్పుడు, ఆ విరేచనాల ప్రాథమిక దశలోనే జాగ్రత్త తీసుకుంటే వాటి బారి నుంచి రక్షణ పొందవచ్చు. ఎలాగంటే ఓ రెండు చింతగింజల్నీ, ఓ చెంచా గసగసాలనూ తీసుకుని ఈ రెంటినీ కలిపి కొద్దిగా నీటిని జోడించి మెత్తగా నూరాలి. అప్పుడు వచ్చే రసాన్ని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చొప్పున ఓ నాలుగైదు రోజుల పాటు ఇవ్వాలి. అవసరాన్ని బట్టి వ్యాధి తగ్గేంత వరకూ మందు ఇవ్వాలి. విరేచనాలు పూర్తిగా తగ్గిపోయేంత వరకూ మజ్జిగ అన్నం పెడితే మంచిది. 3. దీర్ఘకాలిక జ్వరాలకు ఏం చేయాలి? ఎప్పుడు చూసినా లో-ఫీవర్ వుంటుంటే దీర్ఘజ్వరం వున్నట్లుగా భావిస్తాం. దీర్ఘజ్వరం వున్నవాళ్లు చల్ల మిరియం విధానం వినియోగిస్తే సత్వర ఫలితం వుంటుంది. రోజుకో మిరియం చొప్పున మింగిస్తూ, మిరియపు గింజను మజ్జిగలో నానబెట్టి, మెత్తగా నూరి కడుపులోకి తీసుకుని కొద్దిగా మజ్జిగ తాగుతుంటే దీర్ఘజ్వరాలు తగ్గిపోతాయి. ఈ విధంగా 41 రోజులపాటు చల్లమిరియం వాడవల్సి వుంటుంది. 4. విరోచనం కాకపోతే ఏం చేయాలి? విరేచనం బిగపట్టి ఇబ్బందిగా వుంటే చిన్న చిట్కాతో ఈ ఇబ్బందిని తొలగించవచ్చు. కొద్దిపాటి సునాముఖి ఆకును తీసుకుని దీనిని గుండుగా చేసి భద్రపరచాలి. అనంతరం పంచదార పాకం పట్టి అందులో సునాముఖి ఆకు గుండను వేసి ఆరబెట్టి చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇది సుమారు రెండు మూడు నెలలపాటు నిల్వ వుంటుంది. అన్ని వయసులవారు నిరభ్యంతరంగా వాడదగిన ఈ మందు విరోచనం ఫ్రీగా అవడానికి సహకరిస్తుంది. 5. పిల్లలు తరచుగా దగ్గు, రొంపకు గురయితే ఏం చేయాలి? దగ్గు, రొంప విపరీతంగా వున్నప్పుడు చిన్న చిన్న చిట్కాలను ప్రయోగిస్తే ఫలితం సంతృప్తికరంగా వుంటుంది. తులసి ఆకుల రసాన్ని రోజుకు రెండు మూడు సార్లు రెండు, మూడు చుక్కలు ఇస్తే పిల్లలకు దగ్గు, రొంప అసలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ నాలుగైదు తమలపాకులు ముందుగా వెచ్చ చేసి, ఆపై నూరి రసం తీసి, దానిలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక పెద్ద చెంచాడు కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ వుంచాలి. దీనిని ఛాతీకి, గొంతుకకూ రాస్తే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఒక గుప్పెడు జామాయిలు (యూకలిప్టస్ ) ఆకుల్ని రెండు గ్లాసుల నీళ్లల్లో పోసి అవి మరిగి ఒక గ్లాసు అయ్యేదాకా మరగబెట్టాలి. అనంతరం ఆ నీటిని వడగట్టి అందులో కొంచెం పంచదార కలిపి, రోజుకు మూడుసార్లు తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ముందు ముందు రాకుండా ఉంటుంది. 6. తరచుగా ఇంజక్షన్లు చేయిస్తున్నారా? ఇవి పరిశీలనలోకి తీసుకోండి. సూది మందు వీటికి వద్దు. ►చిన్న చిన్న జబ్బులకు ►సాధారణంగా వచ్చే దగ్గు, జలుబుకు ►విటమిన్ టాబ్లెట్లు ►కాల్షియం మందు ►రక్తహీనతకు వాడే బి12, లివర్ ఎక్స్ట్రాక్ట్, ఇన్‌ఫెర్రాన్ లాంటివి. విటమిన్ టాబ్లెట్లు నోటి ద్వారా తీసుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే విటమిన్లు, మందుల రూపంలోకన్నా ఆహారం ద్వారా వీటిని తీసుకోవడం అన్ని విధాలా క్షేమదాయకం. రక్తహీనతకు ఇంజెక్షన్ల కంటే కూడా నోటి ద్వారా తీసుకునే ఫెర్రస్ సల్ఫేట్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు మంచివి. పైగా అపరిశుభ్రమైన సూదుల ద్వారా అవసరం లేని ఇబ్బందులు, అప్పుడప్పుడు నరాలకు, రక్తనాళాలకు గాయాలు కావచ్చు. -నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
'నేనున్నాను'.. మీకేం కాదు
సాక్షి ప్రతినిధి, కడప: ఆస్తులమ్ముకున్నా రోగం నయం కాక తల్లడిల్లిపోతున్న రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం పులివెందులలో ఉన్న సీఎంను ఆ రెండు కుటుంబాలు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన కుంచెపు శివకుమార్, వరలక్ష్మి దంపతులు పదేళ్లుగా పులివెందులలో మిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి హైందవ్ (8), కుశల్ (5)అనే కుమారులు ఉన్నారు. వీరిద్దరికీ పుట్టినప్పటి నుంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ లేదు. వైద్యం కోసం చెన్నై, బెంగళూరు, వేలూరు, హైదరాబాద్ తదితర నగరాల్లోని పలు ఆస్పత్రులకు తిరిగారు. వైద్య ఖర్చుల కోసం ఉన్న ఇంటిని అమ్ముకున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే ఫలితం ఉంటుందని వైద్యులు సూచించారు. ఇందుకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేని శివకుమార్ దంపతులు శనివారం పులివెందులకు వచ్చిన ముఖ్యమంత్రిని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహాయంతో హెలిప్యాడ్‌లో కలిశారు. వారి సమస్యను విన్న ముఖ్యమంత్రి తానున్నానంటూ ధైర్యం చెప్పారు. పిల్లల వైద్యం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ వి.విజయరామరాజులకు సూచించారు. వైద్యం కోసం వెళ్లేందుకు ఖర్చుల కింద తక్షణమే రూ.లక్ష మంజూరు చేయాలని ఆదేశించారు. వారికి ఇల్లు కూడా మంజూరు చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌కు తన భర్త అనారోగ్య సమస్యను వివరిస్తున్న శివజ్యోతి ప్రభుత్వమే వైద్యం చేయిస్తుంది.. అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన జగన్మోహన్రెడ్డి అనే పేద రైతు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూపించారు. చికిత్స కోసం రూ.20 లక్షలకు పైగానే ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఏం చేయాలో దిక్కుతోచని భార్య శివజ్యోతి.. కుమార్తెలు సౌమ్య, హరిప్రియ, యామినితో కలిసి శనివారం పులివెందులకు వచ్చి, సీఎంను కలిసింది. తమ పరిస్థితి వివరించి.. మీరే ఆదుకోవాలని వేడుకుంది. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. వారు వైద్యం కోసం వెళ్లేందుకు సత్వరమే రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరు కుటుంబాల వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి ఈ రెండు కుటుంబాల్లోని వారి వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించదు. ఈ ముగ్గురి చికిత్స కోసం రూ.50 లక్షలకు పైగానే ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. సీఎం ఆదేశాలతో ఈ మొత్తం డబ్బును ప్రభుత్వమే వెచ్చించనుంది. -
పిల్లల్లో కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్ల వలయం?
పెద్ద వయసు వాళ్లలో కంటి నల్లగుడ్డు చుట్టూ తెల్లటి వలయం రావడం మామూలే. వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల్లోని చాలామందిలో ఇది కనిపిస్తుంది. కానీ పిల్లల్లోనైతే ఇది రావడానికి వాతావరణ కాలుష్యం ఓ కారణమనీ, దాంతో వచ్చే అలర్జీ కారణంగానే ఇలా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఆరుబయట తిరుగుతూ దువు్మూ ధూళి, ఆరుబయటి కాలుష్య, పుప్పొడి వంటి వాటికి నిత్యం ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు... ఏదైనా అంశంతో అలర్జీ కలిగితే ఈ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలా కార్నియా చుట్టు తెల్లవలయం రావడాన్ని వైద్య పరిభాషలో వెర్నల్ కెరటో కంజంక్టవైటిస్ (వీకేసీ) అంటారు. ఈ సమస్య నివారణ కోసం వాతావరణ కాలుష్యాలకు దూరంగా ఉండటం ద్వారా కంటిని రక్షించుకోవాలి. ఇందుకోసం ప్లెయిన్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడటం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఈ సవుస్య ఉన్నవారు వీలైనన్నిసార్లు కంటిని స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. కంటి డాక్టర్‌ను కలిసి... వారు సూచించిన యాంటీ అలర్జిక్ చుక్కల వుందుల్ని వాడాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు ఒకింత ఎక్కువ కాలం పాటు వీటిని వాడాల్సిరావచ్చు. వీటిల్లోనూ స్టెరాయిడల్, నాన్ స్టెరాయిడల్ (స్టెరాయిడ్ లేనివి) అనే రెండు రకాల మందులు ఉంటాయి. స్టెరాయిడ్ మోతాదులు ఉన్న మందుల్ని మాత్రం డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు మాత్రమే వాడాలి. ఎక్కువకాలం వాడితే సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల డాక్టర్ సూచించిన కాలానికి మించి వాటిని వాడకూడదు. ఇక నాన్‌స్టెరాయిడ్ (స్టెరాయిడ్ లేని) మందుల్ని మాత్రం చాలా కాలంపాటు వాడవచ్చు. ఉదాహరణకు ఓలోపాటడిన్ వంటి నాన్‌స్టెరాయిడ్ డ్రాప్స్ రోజుకు రెండుసార్లు చొప్పున ఆరుమాసాల వరకు వాడవచ్చు. అలాగే లూబ్రికెంట్ డ్రాప్స్ కూడా వాడాలి. దాంతో అలర్జెన్స్ పలచలబారుతాయి. కంటికి ఉపశమనం కలుగుతుంది. ఈ మందుల్ని వాడుతున్న కొద్దీ నల్లగుడ్డు చుట్టూ ఉన్న తెల్లటి రంగు క్రమంగా మాయమవుతుంది. అలర్జీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచనల మేరకు యాంటీహిస్టమైన్ ఐ డ్రాప్స్‌తో పాటు కొందరిలో యాంటీహిస్టమైన్ మాత్రలు కూడా వాడాల్సి వస్తుంది. ఈ సవుస్య గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేకపోయినా... నిర్లక్ష్యం మాత్రం మంచిది కాదు. -
పిల్లల ఆరోగ్యానికీ భరోసా
సాక్షి, అమరావతి: చిన్నారుల్లో శారీరక లోపాలు, అ నారోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి భరోసా ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 18 ఏళ్ల పిల్లల వరకు వైద్య పరీక్షలు నిర్వహించి.. వారిలో ఆరోగ్య సమస్యలు గుర్తించి, ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ చేపడుతోంది. ఇందులో భాగంగా పిల్లల వైద్య పరీక్షలకు గత నెలలో శ్రీకారం చుట్టింది. తొలుత అంగన్వాడీల్లోని చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత నెల మొదటి వారంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వైద్య పరీక్షలు చేయడం మొదలుపెట్టింది. కానీ, కరోనా వ్యాప్తి ఈ వైద్య పరీక్షలపై ప్రభావం చూపింది. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 6,124 కేంద్రాల్లో 1,62,069 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు చేశారు. 796 మందికి సమస్యలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి 580 మందికి జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రాల్లో (డీఈఐసీ) చికిత్స అందించారు. శస్త్రచికిత్స అవసరమైన 23 మంది చిన్నారులను పెద్దాసుపత్రులకు సిఫార్సు చేశారు. 193 మందికి మెరుగైన వైద్యం కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. వీరందరికీ ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తోంది. మార్చిలోగా పాఠశాల పిల్లలకూ.. ఇక ఈ నెలాఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా 55,605 అంగన్వాడీల్లో 28,18,368 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తిచేయాలని కార్యాచరణ రూపొందించారు. అలాగే, వచ్చే మార్చి నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని పిల్లలందరికీ వైద్య పరీక్షలు పూర్తిచేయాలని వైద్యశాఖ అధికారులు లక్ష్యం నిర్ధేశించుకున్నారు. వైద్య పరీక్షలు వేగవంతం కరోనా వ్యాప్తి కారణంగా వైద్య పరీక్షలు మందకొడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో.. జాగ్రత్తలు పాటిస్తూ వైద్య పరీక్షలు వేగవంతం చేస్తున్నాం. నెలాఖరులోగా అంగన్వాడీల్లో చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తిచేస్తాం. చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీనివాస రెడ్డి, ఆర్బీఎస్కే రాష్ట్ర ప్రత్యేక అధికారి 30 రకాల సమస్యలకు ఉచిత పరీక్షలు న్యూరల్ ట్యూబ్ లోపం, డౌన్స్ సిండ్రోమ్, గ్రహణ మొర్రి, పెదవి చీలిక, వంకర పాదాలు, నడుం భాగం వృద్ధి లోపం, సంక్రమిక కంటిపొర, గుండె జబ్బులు, పుట్టుకతో వచ్చే చెవుడు, రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ, రక్తహీనత, విటమిన్ల లోపం, మేధోపరమైన అసమానత, వయసుకు అనుగుణంగా మాటలు రాకపోవటం, ఆటిజమ్, అభ్యసనా సమస్యలు, తలసీమియా సహా ఇతర 30 రకాల ఆరోగ్య సమస్యలు, లోపాలు గుర్తించడానికి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. -
పిల్లల్లో ఆస్తమా.. ఆరు దశల్లో ఇలా చికిత్స
పిల్లల్లో ఆస్తమా అన్నది ఇటీవల చాలా సాధారణంగా కనిపించే మెడికల్ కండిషన్. పిల్లల్లో వారికి సరిపడని పదార్థమో లేదా ఏదైనా కాలుష్య కారకమో ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి కండరాలు బిగుసుకుపోతాయి. శ్వాసమార్గం మూసుకుపోయినట్లుగా అవుతుంది. ఆ మార్గంలో జిగురు పదార్థం (మ్యూకస్ లేదా ఫ్లెమ్) ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీనివల్ల కూడా ఊపిరి అందదు. ఇలాంటి లక్షణాలు కనిపించనప్పుడు దాన్ని ఆస్తమాగా పేర్కన్నవచ్చు. పిల్లలకు సరిపడని ఆ పదార్థాన్ని ‘ట్రిగర్’ అంటారు. పిల్లల్లో ట్రిగర్స్ వేర్వేరుగా ఉంటాయి. మారిన వాతావరణం, కాలుష్యం, పొగ, ఇళ్లలోని దుమ్మూ, కార్పెట్లలోని ధూళి, సరిపడని ఆహారపదార్థాలు, ఘాటైన రసాయనాల వాసనలు, సాఫ్ట్ టాయ్స్, పెట్స్‌కు ఉండే వెంట్రుకల్లో దాగి ఉండే అలర్జెన్స్, పోలెన్స్, ఆహారానికి కలిపే రంగులు (ఫుడ్ అడెటివ్స్–పిల్లలకు మరింత ఆకర్శించేందుకు చాలా పదార్థాలకు ఇవి కలుపుతారు), కొన్నిరకాల మందులు (యాస్పిరిన్, సల్ఫా డ్రగ్స్ వంటివి) ఇలా ట్రిగర్స్ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరుగా ఉండవచ్చు. ట్రిగర్స్ నుంచి పూర్తిగా దూరంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కానీ వీలైనంతగా వాటినుంచి దూరంగా ఉండాలి. పిల్లల్లో ఆస్తమా వచ్చినప్పుడు సాధారణంగా వారిలో చికిత్స ఆరుదశల్లో ఉంటుంది. మొదటి స్టెప్‌లో: అప్పుడప్పుడూ అవసరాన్ని బట్టి రిలీవర్స్ ఇవ్వడం రెండో స్టెప్‌లో : పీల్చడానికి వీలైన తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్స్ (ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ – ఐసీఎస్) లేదా మాంటెలుకాస్ట్ మూడో స్టెప్‌లో : ఓ మోస్తరు తీవ్రత ఉన్నవారికి ఓమాదిరి మోతాదు (మాడరేట్ డోస్)లో పీల్చదగిన కార్టికోస్టెరాయిడ్స్ నాలుగో స్టెప్‌లో : ఓ మోస్తరు తీవ్రత ఉన్నవారికి ఐసీఎస్‌తో పాటు మాంటెలుకాస్ట్ లేదా లాంగ్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్స్ (ఎల్ఏబీఏ) ఐదో స్టెప్‌లో : ఆస్తమా సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఎక్కువ డోస్‌తో ఉండే ఐసీఎస్ మాంటెలుకాస్ట్ లేదా లాండ్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్స్ (ఎల్ఏబీఏ) ఆరో స్టెప్‌లో : మరీ తీవ్రంగా ఉన్నవారికి హైడోస్ ఐసీఎస్‌తో పాటు మాంటెలుకాస్ట్ ప్లస్ నోటి ద్వారా స్టెరాయిడ్స్ ఇవ్వడం. అయితే చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా సాధారణంగా వాళ్లు యుక్తవయసుకు వచ్చేనాటికి చాలామందిలో తగ్గిపోతుంది. కాబట్టి ఆందోళన అవసరం లేదు. చదవండి: క్రానిక్ స్మోకర్స్లో కంటి సమస్యలు -
పండ్లు అలవాటైతే జంక్‌ని నెట్టేస్తారు
బడి పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఇటీవల కేరళ ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లలకు ‘మంచి నీటి గంట’ను ప్రవేశపెడితే.. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం పాఠశాల క్యాంటీన్లలో జంక్‌ఫుడ్ అమ్మకాలపై నిషేధం విధించబోతోంది. అంతేకాదు, బడికి యాభై మీటర్ల పరిధిలో ఫాస్ట్ ఫుడ్‌ను విక్రయించకూడదని కూడా ఆదేశాలు జారీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై జంక్ ఫుడ్ చూపే ప్రభావాలు, జంక్‌ని మాన్పించే మార్గాల గురించి తెలుసుకుందాం. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. స్కూల్ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే సంస్కృతి ఇప్పుడు పల్లెలలో కూడా వ్యాపించింది. జంక్ ఫుడ్ ప్రధానంగా పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. భావోద్వేగాలపైన కూడా! ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే భవిష్యత్తులో డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు కొంతమంది పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత వారు ఈ విషయాన్ని నిర్ధారించారు. పాఠశాల వయసులోనే! ప్రస్తుతం డిప్రెషన్‌కు గురయ్యే వారిలో ఎక్కువమంది పాఠశాల వయసువారే ఉంటున్నారు. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలలో ఎక్కువ మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని జాతీయ డేటా విశ్లేషణలో తేలింది. 2005–2017 మధ్య కాలంలో ఇది 52 శాతం పెరిగింది. పరిశోధన జరిగిన తీరు ఫాస్ట్‌ఫుడ్ పిల్లలపై చూపే ప్రభావాల పరిశోధన కోసం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే 84 మంది పాఠశాల వయసు గల బాల బాలికలను తీసుకున్నారు. వీరిలో 95 శాతం మంది తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్లు. వారిలోని సోడియం, పొటాషియంల శాతాన్ని పరీక్షించడం కోసం ప్రతి రోజు రాత్రిపూట వారి మూత్ర నమూనాలు సేకరించారు. ఇలా ఏడాదిన్నర కాలంపాటు అధ్యయనం చేసిన తర్వాత.. జంక్‌ఫుడ్ తీసుకునేవారిలో సోడియం శాతం పెరిగి, పొటాషియం తగ్గుతుందని కనుగొన్నారు. ‘‘జంక్‌ఫుడ్‌లో ఎక్కువ మొత్తం కొవ్వు, చక్కెర, ఉప్పు ఉంటాయి. శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్స్, విటమిన్స్, ఇతర పోషక పదార్థాలు వుండవు. మనకు అవసరమైన పీచు పదార్థాలు లభించవు’’ అని యూనివర్సిటీ ఆఫ్ అలబామా మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ సిల్వీ మ్రగ్ సిల్వీ తన పరిశోధన తర్వాత వెల్లడించారు. బీన్స్, చిలగడ దుంపలు, బచ్చలికూర, టమాటాలు, అరటిపండ్లు, నారింజ, పెరుగు, కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే పొటాషియం శాతం తగ్గుతుందని కూడా సిల్వీ చెప్పారు. తినకుండా ఉండలేని వారు..! జంక్ ఫుడ్‌ని తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యంతో పాటు డిప్రెషన్‌కు లోనవుతున్నారు. అందుకని జంక్ ఫుడ్‌ని తినకుండా ఉండలేనివారు తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో పాటు కొద్ది మోతాదులో మాత్రమే ఫాస్ట్‌ఫుడ్ తీసుకోవడం మంచిదని కూడా ఆహార నిపుణులు సూచిస్తున్నారు. – శెట్టె అంజి, సాక్షి వెబ్ డెస్క్ -
‘భవిష్యత్’ బలహీనం!
సాక్షి, హైదరాబాద్: శరీరానికి సరిపడా పోషకాహారాన్ని తీసుకోకపోవడంతో భావిపౌరులు సత్తువ కోల్పోతున్నారు. వసతిగృహాల్లో పౌష్టికాహారాన్ని ఇస్తున్నప్పటికీ అక్కడి విద్యార్థుల్లో రక్తహీనత అధికంగా ఉంటోంది. తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయో... లేక సరైన ఆహారమే అందడం లేదో కాని అత్యధికుల్లో రక్తహీనత లోపం కనిపిస్తోంది. ఒక ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,245 సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటి పరిధిలో 2.85 లక్షల మంది విద్యా ర్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతమున్న వసతి గృహాల్లో 1,722 వసతి గృహాలు ప్రీ మెట్రిక్ హాస్టళ్లు కాగా.. మిగతా 523 వసతి గృహాలు పోస్టుమెట్రిక్ హాస్టళ్లు. తాజాగా ప్రీ మెట్రిక్ హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్య స్థితిపై ఓ సంస్థ అధ్యయనం చేసింది. అనీమియా కారణంగా దాదాపు 65.3 శాతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది. వీరిలో అత్యధికంగా బాలికలే ఉండడం గమనార్హం. బాలికల్లో అత్యధికం.. రక్తహీనత బాలుర కంటే బాలికల్లోనే అత్యధికంగా ఉంది. సాధారణంగా పిల్లల రక్తంలో ప్రతీ డెస్సీలీటర్‌కు కనీసం 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనత సమస్య ఉన్నట్లే. కానీ చాలామంది చిన్నారుల్లో 10 గ్రాములు/డీఎల్ కంటే తక్కువ ఉన్నట్లు తేలింది. ప్రతి 100 మంది బాలికల్లో 55 మందిలో రక్తహీనత తీవ్రంగా ఉంది. అదే బాలుర కేటగిరీలో 50 మంది పిల్లల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమైంది. ప్రతి 100 మందిలో 13 మంది పిల్లల ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రక్తహీనతతోపాటు పోషక లోపాలతో ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. నూరు మందిలో కేవలం 35 మంది పిల్లలు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. అనర్థాలకు దారితీసేలా.. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 లోపించిన చిన్నారుల్లో రక్తహీనత సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లో రక్తహీనత సమస్య పలు అనర్థాలకు దారితీస్తాయి. ముఖ్యంగా చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అదేవిధంగా శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు సోకి దీర్ఘకా లిక వ్యాధులకు ఆస్కారం ఉంటుంది. రోగ నిరోధక శక్తి కోల్పోయి పలు రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో వారు ఏకాగ్రతను క్రమంగా కోల్పోయి అనారోగ్యానికి గురవుతారు. ఏఎన్ఎమ్లు వసతిగృహాలకు క్రమం తప్పకుండా వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాల్సి ఉంది. అయితే అదేమీ లేకపోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మరోవైపు సంక్షేమ శాఖలు కూడా దీనికి సంబంధించి ఎటువంటి నివారణ చర్యలను చేపట్టడం లేదు. -
‘పలకరింపు’లో నిర్లక్ష్యం
సాక్షి, తిరుపతి : ఐదేళ్ల లోపు చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన పలుకరింపు కార్యక్రమం ప్రచారం ఎక్కువ ఫలితం తక్కువ అన్నచందంగా మారింది. ‘పలకరింపు– మీ చిన్నారి ఆరోగ్యం’ పేరుతో సోమవారం నుంచి ప్రారంభమైన కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. 0–5 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్లు వేశారా? లేదా? అని తెలుసుకునేందుకు చేపట్టిన కార్యక్రమానికి అవసరమైన సామగ్రి ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది. జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారులు 4.67 లక్షల మంది ఉన్నారు. వీరిలో కొందరు చిన్నారులకు వ్యాక్సిన్లు వేయలేదు. వ్యాక్సిన్లు వేసుకునే సమయంలో తల్లిదండ్రులు చిన్నారులతో వేరొక చోటుకు వెళ్లటం, ముఖ్యంగా కూలీల కుటుంబాల్లో కొందరు చిన్నారులు వ్యాక్సిన్లు వేసుకోకుండా అనారోగ్యాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు అర్ధంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయం తెలిసిందే. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘పలకరింపు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలా పలకరించాలి.. జిల్లాలో 644 ఆరోగ్య ఉపకేంద్రాలు, 104 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, మరో 14 సీఎం ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ వర్కర్లు, మెప్మా సిబ్బంది ప్రతి నివాసానికీ వెళ్లి ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నారా? లేదా? అని తెలుసుకోవాలి. వారికి సరైన సమయంలో వ్యాక్సిన్లు వేసుకున్నారా? లేదా ఆరా తియ్యాలి. వేసుకున్నా, వేసుకోకపోయినా వారి వివరాలు నమోదు చేసుకోవాలి. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా? గ్రహణమొర్రి, మానసిక స్థితి, పోలియో వంటి జబ్బులు ఉన్న వారిని గుర్తించాలి. అటువంటి వారికి వెంటనే వైద్య చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. వ్యాక్సిన్లు వేయించుకోలేదంటే వెంటనే వేయాల్సి ఉంటుంది. వివరాలన్నీ ఫాం–1, ఫాం–2, ఫాం–3లో నమోదు చేసుకోవాలి. నమోదు ప్రక్రియ పూర్తయ్యాక ఆ నివాసానికి ప్రభుత్వం ఇచ్చిన ఒక స్టిక్కర్‌ను అంటించాలి. అలా ప్రతి ఒక్కరూ 50 నివాసాలు తిరిగి కనీసం పది మంది చిన్నారులను గుర్తించాలి. ఇవేమీ లేకనే ఫీల్డ్‌లోకి.. కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సర్వే పత్రాలు, స్టిక్కర్లు, అవసరమైన వ్యాక్సిన్లు చేర్చాలి. అయితే జిల్లాలో నిన్నటి వరకు ఎటువంటి సామగ్రి చేరలేదు. చిత్తూరుకు మాత్రం ప్రతిరోజూ అవసరమైన సామగ్రి ఉంచుకున్నారు. పలకరింపు కార్యక్రమంలో భాగంగా ఇద్దరు చిన్నారులకు టీబీ ఉన్నట్లు గుర్తించారు. వారికి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆరోగ్య కేంద్రానికి రెఫర్ చేశారు. మిగిలిన ప్రాంతాలకు అతి తక్కువ మోతాదులో పత్రాలు, స్టిక్కర్లు, వ్యాక్సిన్లు సరఫరా చేసినట్లు తెలిసింది. వరదయ్యపాలెం పీహెచ్‌సీకి సుమారు 6 వేల నుంచి 7వేలు పత్రాలు, స్టిక్కర్లు, వ్యాక్సిన్లు అవసరమైతే సోమవారానికి కేవలం 200 నివాసాలకు సరిపడా పత్రాలు, స్టిక్కర్లు మాత్రమే సరఫరా చేసినట్లు తెలిసింది. అదేవిధంగా చిన్నపాండూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి 7వేలు అవసరమైతే కేవలం 60 నివాసాలకు సరిపడా పత్రాలు, స్టిక్కర్లను మాత్రం సరఫరా చేసినట్లు తెలిసింది. అవి కూడా సోమవారానికే అయిపోయినట్లు తెలిసింది. అందుకే వారు జిరాక్స్ చేసి వాడుతున్నారు. మంగళవారం నివాసాలు తిరగటం తప్ప చిన్నారుల వివరాలు నమోదు చేసుకోలేకపోయినట్లు సమాచారం. తిరుపతి నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లు, మంగళం, రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఏ ఒక్క సామగ్రి చేరకపోవటం గమనార్హం. ప్రచారంపై యావ.. చిన్నారుల ఆరోగ్య విషయంలో చేపట్టిన పలకరింపు కార్యక్రమంలోనూ టీడీపీ ప్రచార యావ తగ్గలేదు. నివాసాలు సర్వే చేసిన అనంతరం అంటించే స్టిక్కర్లపై సీఎం చంద్రబాబు ఫొటో ముద్రించి ఉండటం గమనార్హం. -
రోజుకో పండు తినేవారెందరు?
సాక్షి, న్యూఢిల్లీ: నగరాల్లో ఉండే చిన్నారుల్లో ఎక్కువ మంది అనారోగ్యకర ఆహార అలవాట్లతో ఇబ్బందులు పడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకునే చిన్నారులు 18 శాతం మంది మాత్రమే రోజుకో పండు తింటున్నారని వెల్లడైంది. దేశవ్యాప్తంగా దాదాపు 100 పాఠశాలలను నిర్వహిస్తున్న పొదార్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఈ సర్వే చేపట్టింది. పిల్లల ఆహార అలవాట్లపై దేశంలోని మెట్రో నగరాల్లో ఉంటున్న1,350 మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవి 35శాతం మంది పిల్లలు మాత్రమే రోజు వారీగా శాకాహారం తీసుకుంటున్నారు. సగం మంది పిల్లలు జంక్‌ఫుడ్, స్వీట్లు రోజూ తీసుకోవటం వంటి అనారోగ్యకర ఆహార అలవాట్లను కలిగి ఉన్నారు. సుమారు 76 శాతం మంది చిన్నారులు ఆటలు ఆడుకునే అలవాటు ఉన్నట్లు తేలటం కొంత ఊరట కలిగించే అంశం. మిగతా 24 శాతం మందికి ఎటువంటి శారీరక శ్రమ పడటం లేదట. ఈ సర్వేపై పొదార్ గ్రూప్ ట్రస్టీ రాఘవ్ పొదార్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాల చిన్నారుల్లో ఊబకాయ పెను సమస్యగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు దశాబ్దాల్లో చిన్నారులు యుక్తవయస్కు(5-19 ఏళ్లు)లో ఊబకాయం పది రెట్లు పెరిగినట్లు తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. చిన్నారుల ఆరోగ్యం చాలా కీలకమైన అంశం.. దీనిపై తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంది. పౌష్టికాహారంపై చిన్నారులకు పాఠాలు బోధించటం కన్నా వారికి ఆ ఆహారం ఎంతమేరకు ఇస్తున్నారనేది కూడా ముఖ్యమని న్యూట్రిషనిస్ట్ శ్రీప్రియా వెంకటేషన్ తెలిపారు. అంతే కాకుండా, ఏఏ వయస్సుల వారు ఎంత ఆహారం తీసుకోవాలనేది కూడా చిన్నారులకు అవగాహన కల్పించాలని, శుభకార్యాలకు వెళ్లిన సందర్భాల్లో ఆహారం మితంగా భుజించాలనేది కూడా తెలపాలని కోరారు. నియమిత వేళల్లో ఆహారం తీసుకోవటం ముఖ్యమని కూడా చిన్నారులకు తెలపాలని, ఆహారం మానేయటం వల్ల కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు. ఆహారం తీసుకున్న మూడు గంటల తర్వాతే పిల్లలు నిద్రకు ఉపక్రమించేలా అలవాటు చేయాలని కోరారు. ఆరోగ్యంగా, పుష్టిగా ఉండటానికి రోజుకు కనీసం గంట పాటు ఆటలు ఆడటం చాలా ముఖ్యమని తెలిపారు. వ్యాయామం లేని చిన్నారుల్లో చదువులో వెనుకబాటుతనంతో పాటు, చురుకుదనం తగ్గి, దుందుడుకు స్వభావం అలవాటు అవుతుందని, డయాబెటిస్, ఊబకాయం వంటివి వస్తాయని ఎడ్యుస్పోర్ట్స్ కో ఫౌండర్ పర్మిందర్ కౌర్ పేర్కొన్నారు. -
‘బాల ఆరోగ్య రక్ష’కు అనారోగ్యం..!
కెరమెరి : బాల్యానికి భరోసా.. బాలల ఆరోగ్యాకి రక్షా అంటూ ఆర్భాటంగా ప్రారంభించిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం అటకెక్కింది. కాగితాలకే పరిమిత మైంది. పిల్లలకు మంచి చేస్తుందని అందరూ భావించి సంతోషించినా ఆచరణలో మందగించింది. దీంతో ఈ పథకం 50శాతం కూడా లక్ష్యాన్ని సాధించలేదు. హడావుడిగా ఆరోగ్య కార్డులు అందజేసిన అధికారులు ఇప్పుడు వాటి గురించి పట్టించుకోవడం లేదు. పథకం అమలుకు కమిటీలు వేశామని, నెలనెలా వైద్య పరీక్షలు, విద్యార్థుల ప్రగతి వివరాల నమోదు చేస్తామని చెప్పినా అదంతా కేవలం ప్రకటనలకే పరిమితమైంది. పథకం ప్రారంభం ఇలా.. 2010 నవంబర్ 14న ఈ పథకం ప్రారంభమైంది. 1 నుంచి 10వ తరగతి పరకు పాఠశాలలో చదువుతున్న పిల్లలు పలు అనారోగ్య కారణాలతో హాజరు కావడం లేదని గుర్తించారు. దీన్ని నివారించడానికి పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా అవసరమైన మందులు, చికిత్సలు అందించాలనేది పథకం ఉద్దేశం. అమల్లో భాగంగా 1 నుంచి 10 తరగతి వరకు అందరికీ ఆరోగ్య రక్షా కార్డులు పంపిణీ చేశారు. కార్డుల్లో చిన్నారుల ఆరోగ్యం వివరాలు పూర్తిగా నమోదు చేయాల్సి ఉంది. కార్డుల పంపిణీ తర్వాత వాటి ఊసే లేదు. మొదట్లో వైద్యులతో కొన్ని చోట్ల మొక్కుబడిగా వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత తమ పనైపోయిందని చేతులు దులిపేసుకున్నారు. పథకం నిర్వహణ కోసం వేసిన కమిటీలు పత్తా లేకుండా పోయాయి. చాలాచోట్ల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించలేదు. కుప్పలుగా ఆరోగ్య రక్ష పుస్తకాలు.. జవహర్ బాల ఆరోగ్య రక్ష పేరుతో అధికారులు కరదీపికలను ముద్రించారు. వీటిలో విద్యార్థులకు ఎలా పరీక్షలు నిర్వహించాలి, పలు సూచనలు, సలహాల సమాచారం ఉంది. ప్రస్తుతం అనేక పాఠశాలల్లో, ఎమ్మార్సీల్లో కుప్పలుగా పడి ఉన్నాయి. ప్రతి నెలా పరీక్షలు చేయాల్సి ఉన్నప్పటికీ గత విద్యాసంవత్సరంలో ఆరోగ్యశాఖాధికారులు పట్టించుకోలేదు. పథకం ఆరంభంలో కొన్ని పాఠశాలలో ఈ పథకం పని చేయగా తర్వాత కనుమరుగైంది. ఇలా చేయాలి..! * మండల స్థాయిలో ఎంపీడీవో చైర్మన్‌గా , ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, ఎంఈవోలు సభ్యులుగా ఉంటారు. * కమిటీ సభ్యులు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వారి సమక్షంలో పరీక్షలు జరిగేలా చూడాలి. వారి ఆరోగ్య సమాచారాన్ని మొత్తాన్ని ఆ కార్డులో నమోదయ్యేలా పర్యవేక్షించాలి. * ప్రతి మంగళవారం పాఠశాల ఆరోగ్య రోజుగా పాటించేలా చూడాలి. ప్రత్యేక చికిత్స అవసరమైన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. * ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు జరిగేలా చూసే బాధ్యత తరగతి ఉపాధ్యాయుడితోపాటు ప్రధానోపాధ్యాయుడికి కూడా ఉంది. అలా జరుగుతుందో లేదో కమిటీ పర్యవేక్షించాలి. * పాఠశాల ఆరోగ్య పరీక్షలు జరిగేటప్పుడు తల్లితండ్రులను కూడా పిలిచి వారితో సదరు విద్యార్థి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని నమోదు చేశారో లేదో చూడాలి. * విద్యార్థుల తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు, గ్రేడుల వివరాలు రికార్డుల్లో నమోదు అయ్యాయో లేదో పర్యవేక్షించాల్సి ఉంది. * అలాంటి దాఖలాలు అనేక ప్రభుత్వ పాఠశాల్లో కనిపించడం లేదు. ఆరోగ్య శాఖ, విద్యా శాఖ మధ్య సరైన సమన్వయం లేకపోవడంతోనే పిల్లలకు వైద్య పరీక్షలు అందడం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు.