ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తికాదు. లేచినప్పటి నుంచి నిద్రకు ఉపక్రమించే వరకు పక్కన స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. సగం పనులు దీనితోనే అవున్నాయంటే మాటలు కాదు. ఒక వైపు స్మార్ట్ ఫోన్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతకుమించి సమస్యలూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఫోన్ పెను ప్రభావం చూపుతోంది.
జీవనశైలే మారిపోయింది
ప్రస్తుతం 99 శాతం మంది చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ ఫోన్ల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 1995 తర్వాత పుట్టిన పిల్లలు తమ కౌమారమంతా స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్న మొదటి తరమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్లు వచ్చాక మనిషి జీవన శైలే మారియిందని పేర్కొంటున్నాయి. 1995 తర్వాత పుట్టిన పిల్లలు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. కబుర్లు, సరదాలు, ఆట పాటలూ అన్నీ అందులోనే. పుస్తకాలు చదవడం, నిద్రపోవడం, స్నేహితులతో గడపడం, శారీరక ఆటలకు కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ.
ఈ జీవన శైలి వలన పిల్లల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులూ హెచ్చరిస్తున్నారు. ముందు తరాలవారితో పోల్చుకుంటే జీవన నైపుణ్యాల్లో ఇప్పటి పిల్లలు వెనకబడిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. వీటికి అదనంగా ఒంటరితనంతోపాటు ఇతర మానసిక సమస్యలూ ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు తేల్చాయి. స్మార్ట్ ఫోన్లు పిల్లలు, టీనేజర్ల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపి సృజనాత్మకతను చంపేస్తున్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. అమెరికా సైకాలజీ ప్రొఫెసర్ జీన్ అధ్యయనమూ ఇదే విషయాన్ని మరింత విడమరిచి చెప్పింది.
టీనేజర్లు తీవ్ర నిరాశలోకి..
టీనేజర్ల ఆరోగ్యం, ప్రవనర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్, ఐజెన్ కన్సెల్టింగ్ వైద్యురాలు జీన్ త్వెంగే అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలిసి 13 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పది లక్షలకుపైగా పిల్లపై పరిశోధనలు చేశారు. టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుపుతన్నారనేది మానసిక ఆరోగ్య కోణంలో ఓ ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. ఆమె 2011 నుంచి ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు బాగా పెరగడం గుర్తించినట్టు చెప్పారు.
జీవితం వృథా అనే భావనకు చాలామంది వస్తున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలని, ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేర పెరిగాయని వివరించారు. తమను తాము గాయపరుచుకునేంతగా అవి విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికల్లో ఈ ప్రమాదకర ధరోణి రెండు మూడింతలు పెరిగిందని పేర్కొన్నారు. కొన్నేళ్లలోనే టీనేజర్ల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని జీన్ తన అధ్యయనంలో వివరించారు.
ఫోన్ వ్యసనంలా..
మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లుకుపైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారట. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే భావనలో ఉంటున్నారట. ఇదొక వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
ఇప్పుడేం చేయాలి?
► రోజుకు రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం డిజిటల్ మీడియాకు కేటాయించడం మంచిది. ఇది మానసిక ఆరోగ్యానికి ఆనందానికి దోహదపడుతుంది.
► అయితే డిజిటల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా విచారానికి కారణమవుతుంది.
► మన సమయం మన చేతిలోనే ఉంటుంది. ఉండాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
► స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు మాత్రమే సోషల్ మీడియాను వాడాలి. ఒకవేళ పిల్లలకు ఫోన్ చాలా అవసరమని భావిస్తే ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫోన్ మాత్రమే ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి.
చిన్నపిల్లలకు ఫోన్‌లు ఇవ్వకూడదు
చిన్న పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వకూడదు. అది వారికి అలవాటు చేయడం వల్ల వారి పెరుగుదలతోపాటు మెదడుపై ప్రభావం చూపుతోంది. మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పెద్దలు కూడా అవసరానికి మించి స్మార్ట్‌ఫోన్లు వాడకూడదు. దీనివల్ల మతిమరుపు నిద్రలేమి సమస్యలకు లోనవుతారు. మీపిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినట్లు అనుమానం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment