పిల్లలు అడిగనవన్నీ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ట్రాప్‌లో పడ్డట్లే! | What Are The Side Effects Of Mobile Addiction In Children | Sakshi
Sakshi News home page

Effects of Mobile Phones on Children: పిల్లలు అడిగనవన్నీ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ట్రాప్‌లో పడ్డట్లే!

Published Sat, Sep 9 2023 1:24 PM | Last Updated on Sat, Sep 9 2023 2:42 PM

What Are The Side Effects Of Mobile Addiction In Children - Sakshi

ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్‌ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా రెండేళ్ల లోపు చిన్నారులు కూడా ఫోన్‌లో బొమ్మలు చూస్తూ గంటల తరబడి గడిపేస్తున్నారు. భోజనం తినాలన్నా, నిద్ర పోవాలన్నా ఫోన్‌ పక్కన ఉండాల్సిందే అనేంతలా అలవాటుపడుతున్నారు.

ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల చేతిలో ఫోన్‌ పెడితే అన్నం తినిపించడం సులువు అని ఈజీగా మొబైల్‌ అలవాటు చేస్తున్నారు. ఇది చిన్నారుల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది మానసికంగా, శారీరకంగా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 


1. మీ పిల్లల స్నేహితులందరికీ సెల్ ఫోన్ ఉందని, మీ బిడ్డకు కూడా సెల్ ఫోన్ కొనిచ్చారా? 

 2.మీ పిల్లలు హోంవర్క్ పుస్తకం మర్చిపోతే మీరు స్కూల్ కు వెళ్లి ఇచ్చి వస్తున్నారా? 

3.మీ పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కు కావాల్సిన మెటీరియల్ కోసం మీరు షాపుల చుట్టూ తిరుగుతున్నారా? 

4.మీ బిడ్డను చాలా యాక్టివిటీస్ లో చేర్పించడం వల్ల అసలు ఖాళీ సమయమే ఉండటం లేదా? 

5. మీరు పికప్ చేసుకోవడానికి వెళ్లేందుకు కాస్తంత లేటయితే వెంటనే మీకు మెసేజ్ వస్తుందా? 

వీటిలో ఏ ఒక్కటి చేస్తున్నా.. మీరు పేరెంట్ ట్రాప్‌లో చిక్కుకున్నట్లే. పిల్లలు కష్టపడకూడదని చాలామంది పేరెంట్స్‌ పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేస్తుంటారు. అలాగే వాళ్ల ప్రాజెక్ట్‌ వర్క్స్‌ కూడా చేస్తుంటారు. ఫ్రెండ్స్ తో, టీచర్స్ తో వారికి ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులే పరిష్కరిస్తుంటారు. దీనివల్ల పిల్లలు తమకు సొంతంగా సమస్యలను పరిష్కరించుకొని, స్కిల్స్‌ సాధించుకునే అవకాశాన్ని కోల్పోతారు. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం ఇతరులవైపు చూసే, ఇతరులపై ఆధారపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యే ప్రవర్తననే parenttrap(పేరెంట్‌ ట్రాప్‌)అంటారు. 

కంట్రోల్‌ ట్రాప్‌(Control Trap): తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా నియంత్రించడం, వాళ్లు ఏం చేస్తున్నారో, సోషల్‌ మీడియా వాడకం వరకు ప్రతీది నిర్దేశించినప్పుడు ఇది జరుగుతంది. పిల్లల భద్రత, శ్రేయస్సు కోసం కొంత నియంత్రణ అవసరం. అయితే అతిగా నియంత్రించడం వల్ల పిల్లల్లో ఆందోళన, స్వీయగౌరవ సమస్యలు ఏర్పడతాయి.  

క్రిటిసిజమ్‌ ట్రాప్‌(Criticism Trap): కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం విమర్శిస్తుంటారు, నిరంతరం వారిలో తప్పులను వెతుకుతుంటారు. ఇది వారి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.

కంపారిజన్‌ ట్రాప్‌(Comparison Trap): చాలామంది పేరెంట్స్ పిల్లలను తోబుట్టువులతోనూ, తోటివారితోనూ పోల్చుతుంటారు. నిరంతరం ఇతరులతో పోల్చడం వారి ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.

గివింగ్‌ ట్రాప్‌(Giving Trap): ఇతర పిల్లలకు ఉన్నవి తమకు లేవని పిల్లలు బాధపడకూడదని తల్లిదండ్రులు భావిస్తారు. అందువల్ల వారు అడగకుండానే అన్నీ తెచ్చి పెడతారు. దీనివల్ల పిల్లలకు అవసరంలేని వస్తువులను ఇచ్చే ఉచ్చులో పడతారు.

గిల్ట్‌ ట్రాప్‌(Guilt Trap): పిల్లల అసంతృప్తికి తాము కారణం కాకూడదని పేరెంట్స్ భావిస్తారు. తమ బిడ్డ కలత చెందడానికి కారణం తామేనని తల్లిదండ్రులు భావించి అపరాధ భావనకు లోనవుతారు. దాన్ని అధిగమించేందుకు పిల్లలు కోరినవీ, కోరనివీ కొనిచ్చి తమ భారం దింపుకుంటారు. 

హర్రీడ్‌ ట్రాప్‌(Hurried Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ శక్తిమేరకు ప్రతిదీ చేయాలని కోరుకుంటారు. దీనివల్ల పిల్లల  అవసరాలు వెంటనే తీరతాయని భావిస్తుంటారు. తక్షణ తృప్తి  (#instantgratification)కి అలవాటు పడతారు. అలా తక్షణ తృప్తి దొరకనప్పుడు తీవ్రంగా నిరాశ చెందుతారు, విపరీత నిర్ణయాలు తీసుకుంటారు.

 

పర్మీసివ్‌ ట్రాప్‌(Permissive Trap): కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసినా ఏమీ అనరు, ఏం చేయాలనుకున్నా అనుమతిస్తారు. పిల్లలతో సంఘర్షణ నివారించడానికి ఇది సులువైన మార్గంగా భావిస్తారు. కానీ దీనివల్ల పిల్లల్లో స్వీయ క్రమశిక్షణ లోపిస్తుంది, విచ్చలవిడితనానికి దారితీయవచ్చు. 

ప్రెజర్‌ ట్రాప్‌(Pressure Trap): తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను పంచుకోవడం గర్వంగా భావిస్తారు. పోటీలో పిల్లలు ముందుంటే సంతోషిస్తారు, ఏమాత్రం వెనుకంజ వేసినా ఆందోళన పడుతుంటారు. ముందుకు దూసుకుపోవాలని పిల్లలను ఒత్తిడి చేస్తారు. 

రెస్క్యూ ట్రాప్‌(Rescue Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలను చూసి బాధపడతారు. వాటినుంచి బయట పడేయడం ద్వారా వారిని ‘రక్షించాలని’ భావిస్తారు, బయటపడేస్తారు. పర్యవసానంగా కొన్ని పనులు జరగాలంటే వేచి ఉండటం ( delayed gratification) అవసరమనే విషయం పిల్లలకు ఎప్పటికీ అర్థం కాదు. అలాగే తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే అవకాశం ఉండదు.

పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే... 
పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే ఎప్పటికప్పుడు తమ ప్రవర్తనను గమనించుకుంటూ, అంచనా వేసుకుంటూ, అవసరమైనమేరకు మార్చుకునేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. 

 ప్రతి బిడ్డ ప్రత్యేకమని, ఎవరి ప్రత్యేక సామర్థ్యాలు వారికి ఉంటాయని గుర్తించాలి. 

 బిడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పోల్చకూడదు. 

►  సరిహద్దులను నిర్ణయించి స్థిరంగా అమలు చేయాలి. వాటి పరిధిలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛనివ్వాలి. 

►  కష్టమైన అంశాలపై మాట్లాడటానికి, అవసరమైనప్పుడు కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. 

 ► విమర్శించడం కంటే నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించడంపై దృష్టి పెట్టాలి. 

►  పిల్లల బలాలను, విజయాలను, సానుకూల ప్రవర్తనలను ప్రశంసించాలి. 

►  పిల్లలు తమ పనులు తాము చేసుకునేలా ప్రోత్సహించండి. 

 ► తమకు కావాల్సినవి తాము కష్టపడి సాధించుకోవడం నేర్పించండి. 

 తమ సమస్యలు తామే పరిష్కరించుకునేందుకు ప్రోత్సహించండి.

-డా. మీ నవీన్ నడిమింటి(9703706660),
ప్రముఖ ఆయుర్వేద నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement