విజయపురిలో విశ్వనాథుడనే పండితుండేవాడు. ఆయన వద్ద పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన అనేక తాళపత్ర గ్రంథాలుండేవి. ఆయన వాటిని చదవడమేగాక జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. అంతేగాక తను కూడా కావ్యాలను రాస్తుండేవాడు. అయితే పేదరికం ఆయన్ను బాగా పీడిస్తుండేది. అయినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఒకసారి ఆయనకు అనారోగ్యం చేసింది. పట్టణానికి వెళ్లి వైద్యం చేయించుకోమని సలహా ఇచ్చాడు నాటువైద్యుడు. పట్టణంలో వైద్యం అంటే డబ్బుతో పని.
ఆయన భార్యకేమీ పాలుపోలేదు. డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియ లేదు. దిగాలుగా ఉన్న ఆమెతో పక్కింటామె ‘మీ ఇంట్లో తాళపత్ర గ్రంథాలు బోలెడున్నాయికదా! ఊళ్లో వాటినెవరికయినా అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో పట్టణంలో వైద్యం చేయించవచ్చు’ అన్నది. ‘ఈ ఊళ్లో గ్రంథాలు కొని, చదివే వాళ్లున్నారా?’ అని సందేహపడింది పండితుడి భార్య. ‘అది నిజమేకానీ ప్రయత్నిస్తే తప్పులేదు కదా!’ అంది పక్కింటామె.
ఆ ఉపాయం నచ్చి, తాళపత్ర గ్రంథాలను భుజానికెత్తుకుని ఊరంతా తిరిగింది పడింతుడి భార్య. ఒక్కరూ ఒక్క గ్రంథం కొన్న పాపాన పోలేదు. నొప్పి పెడుతున్న భుజాలతో చివరకు ఆ ఊళ్లోని వడ్డీ వ్యాపారి అనంతయ్య ఇంటికి వెళ్లింది. ‘మా ఇంట్లో చదివేవారు ఎవరూలేరమ్మా! అలా అని నేను కాదంటే నీ అవసరం తీరేదెలా? నేనీ పుస్తకాలు కొనను కానీ, తాకట్టు పెట్టుకుంటాను. మీకు ధనం సర్దుబాటు కాగానే నా బాకీ తీర్చి, మీ గ్రంథాలను మీరు తీసుకుపొండి’ అన్నాడు. ఆ మాటకు పండితుడి భార్య సరేనంది. ఆమెకు కావలసిన పైకం ఇచ్చి, తాళపత్ర గ్రంథాలను జాగ్రత్తగా దాచి పెట్టాడు వడ్డీ వ్యాపారి. ఆ ధనంతో భర్తకు వైద్యం చేయించింది.
త్వరలోనే ఆయనకు నయమైంది. ఇదిలా ఉండగా ఆ రాజ్యాన్నేలే ఆనందవర్ధనుడు.. కొడుకు అలోకవర్ధనుడికి పట్టాభిషేకం చేశాడు. అలోకవర్ధనుడికి గ్రంథపఠనం అంటే మహా ఇష్టం. తన పఠనానికి అనుకూలంగా అంతఃపురంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. రాజ్యమంతటా గ్రంథ సేకరణకు చాటింపు వేయించాడు. గ్రామాల నుంచి పాత తాళపత్ర గ్రంథాలున్నవారంతా రాజధానికి వచ్చి తమ వద్ద ఉన్న గ్రంథాలను ఇవ్వసాగారు. వడ్డీవ్యాపారి అనంతయ్య తన దగ్గరున్న గ్రంథాలను రాజుకు ఇవ్వలేదు. ఆనోటా ఈనోటా ఆ విషయం రాజుగారి చెవిన పడింది. ఆయన భటులను పంపి అనంతయ్యను సభకు రప్పించాడు. గ్రంథాల గురించి అడిగాడు.‘గ్రంథాలు నా దగ్గరున్న మాట వాస్తవమే ప్రభూ! అయితే వాటికి నేను యజమానిని కాదు.
అవి ఒక పండితుడివి. అతని వైద్యానికి అవసరం అయితే వాటిని నా వద్ద తాకట్టు పెట్టుకుని ధనం ఇచ్చాను. గ్రంథాలను తాకట్టు పెట్టుకోవడం మీకు కొత్తగా ఉండవచ్చు. నేను అలా ఎందుకు చేశానంటే.. నేనిచ్చే« ధనం వల్ల పండితుడికి వైద్యం లభించడమే కాదు, అలా ఆ గ్రం«థాలను భద్రపరచడం వల్ల అవి భవిష్యత్ తరాలకూ అందుతాయని ఆలోచించాను. అందుకే వాటిని తాకట్టు పెట్టుకున్నాను’ చెప్పాడు వడ్డీవ్యాపారి. అతని పెద్ద మనసుకు రాజు ఎంతగానో సంతోషించాడు.
తనకు అవసరం లేకపోయినా భవిష్యత్‌లో చదువరులకు గ్రంథాలను అందించాలన్న ఆలోచనతోపాటు, సాటి మనిషిని ఆదుకోవాలన్న మంచి మనసు కూడా వ్యాపారికుండటం అలోకవర్ధనుడిని ఆనందపరచింది. పండితుడి అప్పును రాజు తీర్చడమేకాక, ఆ వ్యాపారికి ‘గ్రంథమిత్ర’ అనే బిరుదును ఇచ్చి ఘనంగా సత్కరించాడు. తరవాత పండితుడి భార్యనూ సన్మానించి, ఆ పండితుడికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు రాజు. ఆ గ్రంథాలన్నింటినీ గ్రంథాలయానికి చేర్చి, జాగ్రత్త చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment