నేటి బాలలే రేపటి పౌరులంటే అందరూ ఒప్పుకుంటారు. కానీ, నేటి బాలలే రేపటి మేధావులంటే అనుమానంగా చూస్తారు. పిల్లలందరూ జీనియస్‌లు ఎలా కాగలరు? అని ప్రశ్నిస్తారు. నాకో పదిమంది పిల్లలను ఇవ్వండి. వారు పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకుంటే అదయ్యేలా పెంచగలనని అప్పుడెప్పుడో చెప్పాడు ప్రముఖ బిహేవియరల్ సైకాలజిస్ట్ జేబీ వాట్సన్.
ఇదిగో వీరికి సాధ్యమైంది..
తల్లిదండ్రులు తలచుకుంటే, సరైన వాతావరణాన్ని సృష్టిస్తే ప్రతి బిడ్డా తానెంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరతాడనడానికి అనేక ఉదాహరణలున్నాయి. 1898లో పుట్టిన విలియమ్ జేమ్స్ సిడిస్ అనే బాలుణ్ని బాలమేధావిగా మార్చారు. రిచర్డ్స్ విలియమ్స్ అనే తండ్రి తన బిడ్డలిద్దరినీ ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణులు విలియమ్స్ సిస్టర్స్‌గా తీర్చిదిద్దాడు. లాజ్లో పోల్గార్ అనే టీచర్ తన ముగ్గురు బిడ్డలనూ చెస్ గ్రాండ్ మాస్టర్స్ పోల్గార్ సిస్టర్స్‌గా తీర్చిదిద్దాడు. పట్నాకు చెందిన నారాయణ్ తులసి అనే ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుడు తథాగత్ అవతార్ తులసిని బాల మేధావిగా తీర్చిదిద్దాడు. తాజాగా కేరళకు చెందిన ఆవిర్భావ్ అనే ఏడేళ్ల బాలుడు సూపర్ స్టార్ సింగర్–3 విజేతగా నిలిచాడు. రెండేళ్ల వయసు నుంచే అతని చుట్టూ సంగీత ప్రపంచాన్ని సృష్టి్టంచడంతో అది సాధ్యమైంది.
గట్టిగా అనుకుంటే అవుతుంది..
మీరు తలచుకుంటే మీ బిడ్డనూ మేధావిగా పెంచవచ్చు. అందుకు చేయాల్సిందల్లా వారి మనసులోని అనేకానేక మ్యాట్రిక్స్‌లను బలోపేతం చేయడమే.
కాగ్నిటివ్ మ్యాట్రిక్స్: పిల్లల మేధో వికాసానికి పునాది. సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో, ప్రతికూలతలను అధిగమించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఎందుకు’, ‘ఎలా’ వంటి ప్రశ్నలతో సంభాషణలను ప్రోత్సహించడం ద్వారా ఇన్వెంటివ్ మైండ్‌సెట్‌ని ప్రోత్సహించాలి.
ఎమోషనల్ మ్యాట్రిక్స్: పిల్లలకు తెలివితేటలు ఎంత ముఖ్యమో భావోద్వేగాలు కూడా అంతే ముఖ్యం. భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఇది వారిలో ధైర్యాన్ని, ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
హెరిడిటరీ మ్యాట్రిక్స్: కుటుంబ వాతావరణం, సామాజిక పరిస్థితులు జన్యు వ్యక్తీకరణను ప్రభావితం చేయగలవని ఎపిజెనెటిక్స్ పరిశోధనలు చెబుతున్నాయి. ఇంట్లో సానుకూల, ప్రేరణాత్మక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా జీన్స్ మ్యాట్రిక్స్‌ను అభివృద్ధి చేయవచ్చు.
లాంగ్వేజ్ మ్యాట్రిక్స్: పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మనసులోని భావాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి భాష అవసరం. పిల్లలతో కలిసి కథలు చదవడం, చెప్పడం, చర్చించడం ద్వారా దీన్ని సుసంపన్నం చేయవచ్చు.
బిహేవియర్ మ్యాట్రిక్స్: పిల్లల దీర్ఘకాల విజయంలో అలవాట్లు, సంకల్పం ప్రధానపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన రొటీన్లను సృష్టించడానికి పిల్లలకు సహాయం చేయడం ద్వారా దీన్ని బలోపేతం చేయవచ్చు.
సోషల్ మ్యాట్రిక్స్: మనిషి సంఘజీవి. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో కుటుంబం, స్నేహితులు, పరిసరాల ప్రభావం ఉంటుంది. గౌరవం, దయ, సానుభూతి వంటి లక్షణాలను పిల్లలకు నేర్పడంలో ఆదర్శంగా ఉండాలి.
మోరల్ మ్యాట్రిక్స్: పిల్లలు ఎదుగుతున్న కొద్దీ నైతిక భావనలు అభివృద్ధి చెందుతాయి. ఇవి వారి ప్రవర్తనను, నిజాయితీని, జీవితం పట్ల వారి ఉద్దేశాన్ని ప్రభావితం చేస్తాయి. న్యాయం, దయ, బాధ్యత గురించి పిల్లలతో చర్చించడం ద్వారా వారిలో బలమైన నైతిక చైతన్యాన్ని పెంపొందించవచ్చు.
స్కూల్లో చేర్పించడంతో తల్లిదండ్రుల పాత్ర పూర్తికాదని గుర్తించాలి. వారి మనసులోని అనేకానేక మ్యాట్రిక్స్‌లను అభివృద్ధి చేయడం బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే బిడ్డ సంపూర్ణ సామర్థ్యంతో ఎదుగుతాడు. అతనిలోని జీనియస్ మ్యాట్రిక్స్ ఆవిష్కృతమవుతుంది. ఆ దిశగా ఈరోజే అడుగులు వేయండి. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రతి బిడ్డా మేధావే..
పుట్టిన ప్రతి బిడ్డా జీనియస్ కాగలిగిన సామర్థ్యంతోనే పుడుతుంది. కానీ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పరిసరాలు, పాఠశాల, ఉపాధ్యాయులు, సమాజం ఆ బిడ్డ చుట్టూ కనిపించని పరిమితులను ఏర్పరుస్తారు. కనిపించని ఆ వలలో చిక్కుకున్నవారు అదే నిజమని నమ్మి, ఆ పరిమితుల్లోనే పనిచేసి, పరిమితమైన విజయాలతో సంతృప్తి చెందుతుంటారు. కొద్దిమంది మాత్రమే తమ చుట్టూ ఉన్న పరిమితులను అధిగమించి, తమలోని ప్రతిభను పూర్తిగా చాటడం ద్వారా జీవితాల్లో, సమాజంలో శాశ్వతమైన మార్పు తీసుకువస్తారు. అలాంటి వ్యక్తులనే జీనియస్ అంటారు.
Comments
Please login to add a commentAdd a comment