‘మా పెద్దోడు చాలా బాధ్యతగా ఉంటాడు. కానీ చిన్నోడికే అస్సలు బాధ్యత లేదు. ఏం చెప్పినా పట్టించుకోడు. వాడిని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారని వచ్చాను’ అన్నారు సుబ్బారావు. ‘మా పెద్దపాప ఇంట్లో అన్ని పనులూ అందుకుంటుంది. కానీ చిన్నపాప మాత్రం ఎప్పుడూ డాన్స్, స్పోర్ట్స్ అంటూంటుంది. దాన్ని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడంలేదు’ చెప్పారు కోమలి.
ఇంటికి పెద్ద బిడ్డ యజమాని లాంటి వాడు, బాధ్యతగా ఉంటాడు. రెండో బిడ్డ ప్రశాంతంగా ఉంటాడు. చివరివాడు బాధ్యతలేకుండా అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఇది నిజమేనని నమ్మేవాళ్లూ ఉంటారు.. ఇదంతా ట్రాష్ అని కొట్టేసేవాళ్లూ ఉంటారు. దీనిపై సైకాలజిస్టులు కూడా అధ్యయనం చేశారు.
ప్రముఖ ఆస్ట్రియన్ సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ అడ్లర్ 20వ శతాబ్దం ప్రారంభంలో బర్త్ ఆర్డర్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. కుటుంబంలో జన్మించిన క్రమం బిడ్డ ప్రవర్తన, భావోద్వేగాలు, ఇతర వ్యక్తులతో సంబంధాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. మొదటి బిడ్డలు ఎక్కువ శ్రద్ధ (బాధ్యత), మధ్యస్థ శిశువులు తక్కువ శ్రద్ధ (ఎక్కువ స్వాతంత్య్రం)ను పొందుతారనే ఆలోచనలో కొంత నిజం ఉండవచ్చు.
చివరి బిడ్డలకు ఎక్కువ స్వేచ్ఛ (తక్కువ క్రమశిక్షణ) లభిస్తాయి. అయితే బర్త్ ఆర్డర్ ఒక ఫ్యాక్టర్ మాత్రమే. తల్లిదండ్రులు, తోబుట్టువులతో సంబంధాలు, జన్యువులు, పర్యావరణం, సామాజిక.. ఆర్థిక స్థితి వంటి అంశాలు కూడా పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. పేరెంటింగ్ స్టైల్ అనేది పిల్లల వ్యక్తిత్వాన్ని అమితంగా ప్రభావితం చేస్తుందనేది అనేక పరిశోధనల సారాంశం. అడ్లర్ సిద్ధాంతం ప్రకారం ఏ పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకుందాం.
మొదటి బిడ్డ
అడ్లర్ బర్త్ ఆర్డర్ సిద్ధాంతం ప్రకారం, తొలి సంతానం.. వారి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ శ్రద్ధ, సమయాన్ని పొందుతారు. కొత్త తల్లిదండ్రులు అప్పుడే పిల్లల పెంపకం గురించి నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొన్నిసార్లు కఠినంగా, కొన్నిసార్లు న్యూరోటిక్‌గా కూడా ఉండవచ్చు. మొదటి సంతానం టైప్ A వ్యక్తిత్వాలతో బాధ్యతాయుతమైన నాయకులుగా ఉంటారు.
కుటుంబంలోకి రెండో బిడ్డ వచ్చినప్పుడు తనకు కేటాయించే సమయం తగ్గడంవల్ల రెండో బిడ్డను చూసి అసూయపడతారు. ఆ తర్వాత తన తోబుట్టువుల పోషణ బాధ్యత తీసుకోవాల్సి రావడం వల్ల ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. మొదట జన్మించిన పిల్లలు అధునాతన అభిజ్ఞాభివృద్ధిని కలిగి ఉంటారని పరిశోధన కనుగొంది, ఇది చదువులో మంచి ఫలితాలను సాధించేందుకు ఉపయోగపడుతుంది.
మిడిల్ చైల్డ్
తనకన్నా పెద్ద బిడ్డకు, చిన్న బిడ్డకు మధ్య విభేదాలకు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉన్నందున, మధ్య పిల్లలు కుటుంబంలో శాంతిని కలిగించేవారుగా ఉంటారని అడ్లర్ సూచించాడు. పేరెంట్స్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల వారి దృష్టిని ఆకర్షించేందుకు, ఆదరణ పొందేందుకు వారిని ఆహ్లాదపరచేలా ప్రవర్తిస్తారు. తోబుట్టువులతో నిరంతరం పోటీలో ఉన్నట్లు అనిపించవచ్చు.
వీరిలో అభద్రతా భావం, తిరస్కరణ భయం, బలహీనమైన ఆత్మవిశ్వాసం ఉండవచ్చు. తిరస్కరణ పట్ల సున్నితంగా ఉంటారు. తోబుట్టువులకు భిన్నంగా నిలబడాలనుకున్నప్పుడు తిరుగుబాటు లక్షణాలను కలిగి ఉంటారు. మధ్య పిల్లలు తమ తల్లులతో సన్నిహితంగా ఉండే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఆఖరి బిడ్డ
చివరి బిడ్డ పుట్టే కాలానికి తల్లిదండ్రులకు పిల్లల పెంపకంలో అనుభవం ఉండటం వల్ల కొన్నిసార్లు తక్కువ కఠినంగా ఉంటారు. చివరి బిడ్డ అని గారాబంగా పెంచడంవల్ల, మిగతావారితో పోల్చినప్పుడు చెడిపోయినట్లు కనిపిస్తారు. చిన్నపిల్లలుగా దొరికే స్వేచ్ఛవల్ల కలివిడిగా, స్నేహంగా, చార్మింగ్‌గా ఉంటారు. అయితే ఈ పిల్లలు తక్కువ స్వీయ–నియంత్రణ నైపుణ్యాలను కలిగి ఉండవచ్చు. ఇతరులపై ఎక్కువ ఆధారపడవచ్చు. మేనిప్యులేటివ్‌గా, అపరిపక్వంగా, సెల్ఫ్ సెంటర్డ్‌గా కనిపిస్తారు.
ఏకైక సంతానం
కుటుంబంలో ఏకైక సంతానంగా ఉన్నవారు తల్లిదండ్రుల దృష్టిని, వనరులను తోబుట్టువులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలతో ఎక్కువగా సంభాషిస్తారు కాబట్టి, వయసుకు మించి పరిణతి చెందినట్లు కనిపిస్తారు. క్రియేటివ్ ఆలోచనలతో ఏకాంత సమయాన్ని ఆస్వాదిస్తారు.
తన ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉంటారు. తల్లిదండ్రుల అధిక అంచనాల కారణంగా అన్నీ ఫర్ఫెక్ట్‌గా ఉండాలనే ధోరణి కలిగి ఉంటారు. జీవితంలో ఉన్నతమైనదాన్ని సాధించాలనే కోరిక ఉంటుంది. సాధిస్తారు. స్వావలంబన, ఊహాత్మక ధోరణి ఉంటుంది. సెన్సిటివ్‌గా ఉంటారు.
సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment