order
-
New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు
‘ట్రింగ్.. ట్రింగ్ ’ అని బెల్ మోగిస్తూ ఒక పోస్ట్‌మ్యాన్ ఆ కుగ్రామంలోనికి సైకిల్ మీద వచ్చాడు. ఒక ఇంటి ముందు ఆగిన ఆయన.. ‘కమలా.. పట్నం నుంచి నీ భర్త మనీ ఆర్డర్ పంపించాడు’ అని పెద్దగా చెప్పాడు. వెంటనే ఆమె ఇంటిలో నుంచి బయటకు వచ్చి.. ‘సారూ మా ఆయన ఎంత పంపించాడు?’ అని అడిగింది. దీనికి ఆయన 250 రూపాయలు అని చెబుతూ, ఆ మెత్తాన్ని ఆమె చేతిలో పెట్టి, తన దగ్గరున్న రిజిస్ట్రర్‌లో ఆమె చేత వేలిముద్ర వేయించుకున్నాడు’ఇది ఒకప్పటి కథ. నాటి తరం వారికి గుర్తుండే ఉంటుంది. పాత సినిమాల్లోనూ ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. నాడు పట్టణంలో ఉద్యోగం చేసే భర్త ప్రతినెలా పంపే డబ్బు కోసం భార్య ఎదురు చూసేది. ‘మనీ ఆర్టర్’ తీసుకుని పోస్ట్‌మ్యాన్ ఎప్పడు వస్తాడా అని మహిళలు ఇళ్ల ముందు కాపలా కాసేవారు.నేటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology), ఇంటర్నెట్ యుగంలో ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చిచేరింది. డబ్బుతో లావాదేవీలు చేసేందుకు ఈ-బ్యాంకింగ్‌తో పాటు, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే మొదలైన యాప్‌లు మన మొబైల్లో అందుబాటులో ఉంటున్నాయి. నేడు మనం ఈ యాప్‌ల సాయంతో ప్రపంచంలోని ఏ మూలకైనా ఇన్‌స్టంట్‌గా డబ్బును పంపవచ్చు. అయితే మునుపటి కాలంలో డబ్బును పంపేందుకు మనీఆర్డర్ ఆధారంగా ఉండేది.ఉత్తరాల బట్వాడా కోసం భారత ప్రభుత్వం 1854లో పోస్టల్ శాఖను నెలకొల్పింది. ఇది జరిగిన 25 ఏళ్ల తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ 1880, జనవరి ఒకటిన మనీ ఆర్డర్(Money order) సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఎవరైనా సరే తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి డబ్బు జమ చేసి, వారు పంపించాలనుకుంటున్న చోటుకు నగదును పంపించవచ్చు. ఆ నగదు చేరాల్సిన పోస్టాఫీసు రాగానే, అక్కడి పోస్ట్‌మ్యాన్స్ సంబంధిత చిరునామాకు ఆ మొత్తాన్ని అందజేసేవాడు. నాటి కాలంలో పోస్టల్‌శాఖలో ఇదొక విప్లవం అని చెబుతుంటారు.మనీ ఆర్డర్ ద్వారా ఉత్తరాల మాదిరిగానే డబ్బును కూడా పంపగలగడం నాటి ప్రజలకు ఎంతో సౌకర్యంగా అనిపించింది. ఉపాధి కోసం నగరాల్లో ఉన్నవారికి.. గ్రామాల్లో ఉంటున్న వారి సంబంధీకులకు ఇదొక వారధిలా మారింది. అంతకుముందు వరకూ ఇతరులకు డబ్బు పంపడం అనేది పెద్ద సమస్యగా ఉండేది. అయితే మనీ ఆర్డర్ రాకతో ఈ సమస్యకు చెక్ పడింది. తొలినాళ్లలో పెళ్లి వేడుకలకు వెళ్లే అవకాశం లేనివారు నూతన దంపతులకు కానుకల రూపంలో మనీ ఆర్డర్ ద్వారా డబ్బును పంపేవారట.పోస్టల్‌శాఖ(Postal Department)లో మనీ ఆర్డర్ సేవ దశాబ్దాల కాలం పాటు సాగింది. ప్రజల నుంచి ఎంతో ఆదరణను కూడా పొందింది. అయితే కాలానుగుణంగా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఇన్స్టంట్ పేమెంట్ యాప్‌లు రావడంతో మనీ ఆర్డర్‌కు ప్రాధాన్యత తగ్గింది. ఈ పరిణామాల దరిమిలా 2015లో ఇండియన్ పోస్ట్ మనీ ఆర్డర్ సేవలను నిలిపివేసింది. అయితే ఆ తరువాత పోస్టల్ శాఖ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ (ఈఎంఓ), ఇన్స్టంట్ మనీ ఆర్డర్ (ఐఎంఓ)సేవలను ప్రారంభించింది. త్వరిత గతిన డబ్బును అందించేందుకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ఇన్స్టంట్ మనీ ఆర్డర్ సర్వీస్ కింద రూ.1,000 నుండి రూ.50,000 వరకు నగదు బదిలీ చేసే సదుపాయం ఉంది. ఐఎంవో సదుపాయం కలిగిన ఏదైనా పోస్టాఫీసు నుండి, ఒక గుర్తింపు రుజువుతో పాటుగా ఇ-ఫారమ్‌ను పూరించి, ఇంటర్నెట్ ఆధారిత తక్షణ సేవ ద్వారా డబ్బును పంపవచ్చు. ఈ విధంగా నిర్దిష్ట పోస్టాఫీసుల నుండి మాత్రమే డబ్బును పంపేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకెళ్లినప్పటికీ, గతానికి సంబంధించిన అనేక విషయాలు మన మదిలో జ్ఞాపకాలుగా తారాడుతుంటాయి. మన ఇంట్లోని పెద్దలను అడిగితే, మనీ ఆర్డర్‌కు సంబంధించి వారికున్న అనుభవాలను చెబుతారు. ఇది కూడా చదవండి: ‘సరిహద్దులు’ దాటిన మరో ప్రేమకథ.. నూతన సంవత్సరంలో ఏమవునో.. -
టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) నుండి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. ఇందులో భాగంగా యూపీఎస్‌ఆర్‌టీసీకి 1,297 బస్ ఛాసిస్‌లను కంపెనీ సరఫరా చేయనుంది. ఒక ఏడాదిలో యూపీఎస్ఆర్టీసీ నుండి ఆర్డర్ అందుకోవడం టాటా మోటార్స్‌కు ఇది మూడవది.మొత్తం ఆర్డర్ పరిమాణం 3,500 యూనిట్లకుపైమాటే. పోటీ ఈ–బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆర్డర్ గెలుచుకున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం బస్ ఛాసిస్‌లను దశలవారీగా డెలివరీ చేస్తామని వివరించింది. టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్ ఛాసిస్ నగరాల మధ్య, సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.‘ఈ ఆర్డర్ మెరుగైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో సంస్థ నిబద్ధతకు శక్తివంతమైన ధృవీకరణ. స్థిర పనితీరు, అభివృద్ధి చెందుతున్న యూపీఎస్ఆర్టీసీ రవాణా అవసరాలను తీర్చగల సామర్థ్యం.. ప్రజా రవాణా పర్యావరణ వ్యవస్థలో కంపెనీ సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి’ అని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ హెడ్ ఎస్.ఆనంద్ తెలిపారు.టాటా ఎల్‌పీవో 1618 బస్టాటా ఎల్‌పీవో 1618 డీజిల్ బస్సు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారైంది. ఇందులోని కమ్మిన్స్ 5.6L ఇంజన్ 180 బీహెచ్పీ, 675 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6 ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఫేస్ కౌల్ రకం ఛాసిస్ 10,700 కిలోల వరకు మోయగలదు. -
ఎయిర్ ఇండియాలోకి మరో 100 ఎయిర్‌బస్ విమానాలు
టాటా గ్రూప్ యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) మరో వంద కొత్త విమానాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 10 ఏ350 వైడ్‌బాడీ, మరో 90 ఏ320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి.ఎయిర్ ఇండియా గతేడాది ఎయిర్‌బస్‌కు 250 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 40 ఏ350 విమానాలు, 210 ఏ320 విమానాలు ఉన్నాయి. కొత్తగా చేరనున్న విమానాలతో కలిపి ఎయిర్‌బస్‌కు ఇచ్చిన ఆర్డర్ల సంఖ్య 350కి చేరింది.కొత్త విమానాల కోసం ఆర్డర్ చేయడం మాత్రమే కాకుండా.. ఎయిర్ ఇండియా ఏ350 విమానాలను సంబంధించిన విడి భాగాలు, నిర్వహణ కోసం ఎయిర్‌బస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్‌బస్‌తో 250 విమానాల కోసం గతంలో ఆర్డర్ చేసినప్పుడే.. 220 విమానాల కోసం బోయింగ్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కంపెనీ ఆర్డర్ చేసిన మొత్తం కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 570కి పెరిగింది.కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన సందర్భంగా టాటా సన్స్ అండ్ ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. మన దేశంలో మౌలిక సదుపాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం చాలామంది యువత ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎయిర్ ఇండియాలో విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు, సేవలను ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.100 more @Airbus aircraft! ✈️We are happy to announce new orders for 10 A350s and 90 A320 Family aircraft, adding 100 more aircraft to our firm orders for 250 Airbus aircraft placed last year.With this, the total number of new aircraft we have ordered rises to 570, of which… pic.twitter.com/OmfSWbJwbi— Air India (@airindia) December 9, 2024 -
రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వాలి
సాక్షి, అమరావతి: ఏదైనా కేసులో తనకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అందుకు గల కారణాలతో కూడిన రిమాండ్ ఆర్డర్‌ను తనకు అందజేయాలని నిందితుడు కోరితే, ఆ ఆర్డర్‌ను నిందితునికి సత్వరమే అందజేయాల్సి ఉంటుందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. పౌరుల హక్కులు ముడిపడి ఉన్న కేసుల్లో కింది కోర్టులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పప్పుల వెంకటరామిరెడ్డి అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రిమాండ్ ఆర్డర్ కోసం వెంకటరామిరెడ్డి సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో తెలుసుకోవాలని ఆయన తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వకపోతే అది చెల్లదు..తన కుమారుడు పప్పుల వెంకటరామిరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు అతనికి విధించిన రిమాండ్ చెల్లదంటూ పప్పుల చెలమారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెలమారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రిమాండ్‌కు గల కారణాలను నిందితుడైన వెంకటరామిరెడ్డికి అందచేయలేదన్నారు. రిమాండ్ ఆర్డర్‌ను నిందితునికి అందచేయడం తప్పనిసరని, అలా ఇవ్వని పక్షంలో ఆ రిమాండ్ చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి పలు తీర్పులున్నాయన్నారు. అంతకుముందు.. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, వెంకటరామిరెడ్డిని అరెస్టుచేసి కోర్టు ముందు హాజరుపరిచామన్నారు. అందువల్ల ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. నిందితుడు కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఎలాంటి విచారణ అవసరంలేదన్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా అతనికి తెలియజేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కింది కోర్టులు నిందితులకు వారి రిమాండ్ ఆర్డర్‌ను సత్వరమే అందజేయాలని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడు రిమాండ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేయలేదని తెలిపింది. ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాము మరోసారి పరిశీలన చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది. -
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌లో భారీ ఆర్డర్
దేశంలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్న ఏఎం గ్రీన్ సంస్థ ఇందులో భాగంగా ఎలక్ట్రోలైజర్ల కోసం కోసం జాన్ కాకెరిల్ హైడ్రోజన్ కంపెనీతో భారీ ఒప్పందం చేసుకుంది. ఇది దేశంలోనే అత్యంత భారీ ఎలక్ట్రోలైజర్ ఆర్డర్.1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో ఉత్పత్తి చేసే తొలి మిలియన్-టన్నుల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంట్‌లో ఏర్పాటు చేస్తున్న దీని కోసం ఏఎం గ్రీన్ గత ఆగస్ట్‌లో తుది పెట్టుబడి నిర్ణయాన్ని (FID) సాధించింది. ఈ ప్లాంట్ 2026 ద్వితీయార్థంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. రెండు దశల్లో సరఫరా అయ్యే 1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి గ్రీన్ అమ్మోనియాగా మారుస్తారు.ఒప్పందంలో భాగంగా జాన్ కాకెరిల్ హైడ్రోజన్ సంస్థ మొదటి దశలో 640 మెగా వాట్ల సామర్థ్యం గల అధునాతన ఒత్తిడితో కూడిన ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్లను సరఫరా చేస్తుంది. అలాగే ఇరు సంస్థలు కాకినాడలో దేశపు అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని (ఏటా 2 గిగావాట్ల ఉత్పత్తి) అభివృద్ధి చేయనున్నాయి. తద్వారా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యానికి దోహదపడనున్నాయి. ఈ ప్లాంట్ రెండో దశలొ 640మెగా వాట్ల ఎలక్ట్రోలైజర్లను ఏఎం గ్రీన్ కాకినాడ ప్రాజెక్టుకు సరఫరా చేస్తుంది. ఏఎం గ్రీన్ గురించి.. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్కో గ్రూప్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ఏఎం గ్రీన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ఇంధన మార్పిడి పరిష్కారాలను అందించే దేశంలోని ప్రముఖ సంస్థలలో ఒకటి. ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో సరికొత్త సాంకేతికతలు, మార్గాలను అన్వేషించడంలో కృషి చేస్తోంది. -
క్విక్ విస్తరణ!
క్విక్ కామర్స్ కంపెనీలకు దండిగా నిధులు లభిస్తుండటంతో విస్తరణ జోరు పెంచాయి. నగరాల్లో ఈ మోడల్ మంచి సక్సెస్ సాధించడంతో జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ తదితర సంస్థలు డార్క్ స్టోర్ల సంఖ్యను భారీగా పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. కిరాణాతో మొదలు పెట్టిన కంపెనీలు ఇప్పుడు నెమ్మదిగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, మేకప్, టాయ్స్ వంటి ఇతర ప్రొడక్టులను కూడా కార్ట్‌లోకి చేర్చుతున్నాయి. అయితే, బడా నగరాల్లో ఈ మైక్రో వేర్‌హౌస్‌ల కోసం స్థలాల వేట కష్టతరంగా మారుతోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.సమీపంలోని ప్రాంతాలకు 30 నిమిషాల్లోపే ఆర్డర్లను డెలివరీ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసే చిన్న స్థాయి గోడౌన్లను డార్క్ స్టోర్లుగా పేర్కొంటారు. కిక్కిరిసిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహరం. అయినప్పటికీ కంపెనీలు తగ్గేదేలే అంటున్నాయి. మరోపక్క, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, క్విక్ డెలివరీ విషయంలో లోటుపాట్లు లేకుండా చూసేందుకు భారీ స్థాయిలో సిబ్బంది నియామకాలతో ఈ రంగంలో హైరింగ్ కళకళలాడుతోంది. చిన్న నగరాల్లో స్పీడ్... నగరాల్లోని కిక్కిరిసిన ప్రాంతాల్లో డార్క్ స్టోర్ల ఏర్పాటు సవాలుగా మారుతోందని జెప్టో సీఈఓ ఆదిత్ పలీచా చెబుతున్నారు. గత రెండు నెలల్లోనే బిలియన్ డాలర్లను (దాదాపు రూ.8,400 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా, చండీగఢ్, భువనేశ్వర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వేగంగా స్థలాలు దొరుకుతుండటంతో అక్కడ విస్తరణ స్పీడ్ పెంచుతున్నామని పలీచా పేర్కొన్నారు. ‘ఈ రంగంలోకి నిధులు పుష్కలంగా వస్తున్నాయని పసిగట్టిన స్థిరాస్తి యజమానులు అద్దెలు భారీగా పెంచేస్తున్నారు.కొన్నిచోట్ల పోటీ కారణంగా బిడ్డింగ్‌లో పాల్గొనాల్సి వస్తోంది’ అని పలీచా వివరించారు. జొమాటో బ్లింకిట్ సైతం భటిండా, హరిద్వార్, విజయవాడ వంటి నగరాల్లో అడుగుపెట్టింది. కస్టమర్లకు వేగంగా సేవలదించేలా డార్క్ స్టోర్ల సైజును కంపెనీలు పెంచుతున్నాయి. గతంలో సగటున 2,500 చదరపు అడుగులున్న ఈ స్టోర్ సైజు 4,000–5,000 చ.అ.కు పెరిగింది. కొన్నిచోట్ల 10,000 చ.అ., మరికొన్ని చోట్ల ఏకంగా 25,000 చ.అ. డార్క్ స్టోర్లు కూడా ఏర్పాటవుతుండటం ఈ రంగంలో జోరుకు నిదర్శనం.‘అమ్మతోడు అరగంటలోపే డెలివరీ చేసేస్తాం’ క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో స్లోగన్ ఇది! ఇందుకు తగ్గట్టుగానే శరవేగంగా దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ రంగంలో కంపెనీలు నువ్వానేనా అనేలా తలపడుతున్నాయి. బంపర్ వేల్యుయేషన్లతో ఈ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో సేవలను ‘క్విక్’గా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. సిబ్బంది నియామకాలతో పాటు డార్క్ స్టోర్ల సంఖ్య, సైజును కూడా భారీగా పెంచుకుంటున్నాయి. దీంతో కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులు లభించడంతో పాటు మరింత వేగంగా సేవలు లభించేందుకు దోహదం చేస్తోంది.రూ. 300-500 : సగటు ఆర్డర్ విలువ (గతంలో ఇది 200–250గా ఉండేది)4,000 చ. అ. : డార్క్ స్టోర్ ప్రస్తుత సగటు సైజు (అంతక్రితం 2,500 స్థాయిలో ఉండేది). కొన్ని ఏరియాల్లో 10,000 చ. అ. స్టోర్లు కూడా ఉన్నాయి.హైరింగ్.. ఫుల్ స్వింగ్ ‘క్విక్’ విస్తరణ నేపథ్యంలో సిబ్బంది డిమాండ్ తారస్థాయికి చేరుకుంది. ‘ఈ రంగంలో అన్ని విభాగాల్లోనూ హైరింగ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. ఐదు ప్రధాన కంపెనీలు అగ్ర స్థానం కోసం పోటీ పడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ప్రధానంగా లాజిస్టిక్స్ ఇక్కడ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటంతో ఇతర కంపెనీల్లోని నిపుణులైన ఉద్యోగులకు గాలం వేస్తున్నాయి’ అని ఒక క్విక్ కామర్స్ సంస్థ చీఫ్ వెల్లడించారు. ‘మినిట్స్’ పేరుతో లేటుగా ఈ విభాగంలోకి అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాల వేగం పెంచేందుకు బిగ్‌బాస్కెట్ వంటి ఇతర కంపెనీల నుంచి చాలా విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, బిగ్‌బాస్కెట్ సైతం పూర్తి స్థాయి క్విక్ కామర్స్ మోడల్లోకి మారే ప్రయత్నాల్లో ఉండటం విశేషం. ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేశ్ ఝా ఇటీవలే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓగా చేరారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు మధ్య స్థాయి మేనేజర్లకు డిమాండ్ నెలకొంది. క్యూ–కామర్స్‌లోని మార్కెటింగ్, ఆపరేషన్స్, సప్లయ్ చైన్, ఫైనాన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ వలసలు జోరందుకోవడం గమనార్హం. జెప్టో కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్లీ, ఓలా, అర్బన్ కంపెనీ తదితర కంపెనీల నుంచి కీలక సిబ్బందిని భారీగా నియమించుకుంటోంది. కంపెనీ ప్రధాన కేంద్రాన్ని బెంగళూరు నుంచి మంబైకి మార్చే సన్నాహాల్లో ఉన్న జెప్టో.. 500 మంది ఎగ్జిక్యూటివ్‌ల వేటలో ఉన్నట్లు పలీచా తెలిపారు. -
భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా రోడ్డు విస్తరణ కోసం భూమి తీసేసుకున్న అధికారులు, తీసుకున్న ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని బాధిత కుటుంబానికి వాగ్దానం చేసి ఆ తరువాత పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాన్ని అనవసరంగా కోర్టుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులకు, పురపాలక శాఖ డైరెక్టర్, అనంతపురం మునిసిపల్ కమిషనర్లకు రూ.50వేలను ఖర్చులు కింద జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు.ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా... ప్రత్యామ్నాయ భూమి ఇవ్వని అధికారులుఅనంతపురం పట్టణంలోని సర్వే నంబర్ 1940/4లో టి.నిజాముద్దీన్‌కు చెందిన 0.02 సెంట్ల భూమిని 1996లో మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నారు. చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకున్న అధికారులు, తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని చెప్పారు. నిజాముద్దీన్ ప్రత్యామ్నాయ భూమి కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో చివరకు మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ éనిజాముద్దీన్‌కు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలంటూ 2001లో జీవో జారీ చేసింది. అయినప్పటికీ పలు కారణాలరీత్యా అధికారులు ఆ భూమిని నిజాముద్దీన్‌కు కేటాయించలేదు. ఈ లోపు ఆయన మరణించారు. వారి హక్కులను హరించడమే.. ఆయన వారసులు న్యాయ పోరాటం ప్రారంభించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత పిటిషనర్లకు భూమి ఇవ్వకపోవడం వారి హక్కులను హరించడమేనని తేల్చి చెప్పారు. అంతేకాక అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూల జీవో జారీ చేసినా కూడా నిజాముద్దీన్ తన జీవిత కాలంలో ప్రత్యామ్నాయ భూమిని పొందలేకపోయారని తెలిపారు.భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకోవడాన్ని దోపిడీగా అభివర్ణించిన న్యాయమూర్తి..అధికారుల తీరు కోర్టుని షాక్‌కు గురిచేసిందని తన తీర్పులో పేర్కొన్నారు. తీసుకున్న 0.02 సెంట్ల భూమికి 2013 భూ సేకరణ చట్టం కింద పిటిషనర్లకు గరిష్టంగా 8 వారాల్లోపు పరిహారం చెల్లించాలని, పిటిషనర్లకు రూ.50వేలను ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు. -
డార్క్ వెబ్‌లో హెరాయిన్ ఆర్డర్.. స్పీడ్ పోస్ట్‌లో డెలివరీ!
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్‌లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్లోని హిడెన్ వెబ్సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్‌లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్‌ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్‌ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్‌ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఆ పార్సిల్లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్‌లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో జనరల్ డైరీ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాల యాల్లో జనరల్ డైరీ పెట్టాలి.. అందులో రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రజలు(కక్షిదారులు) వివరాలన్నీ పేర్కొనాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఎందుకు వచ్చారు.. ఎప్పుడు వచ్చారు.. లాంటి వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో వస్తున్న అవాంతరాలను తగ్గించేందుకు అధికారులు, ప్రజలకు హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ అధికారులు ఈ మార్గదర్శకాలు అమలు చేసేలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ చర్యలు తీసుకోవాలి. ఈ ఆర్డర్ కాపీని సంబంధిత అధికారులకు చేరేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కోర్టు వివాదం పరిష్కారమైన తర్వాత కూడా రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన అనంత రామేశ్వరిదేవితోపాటు మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ.శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. ఒకరిద్దరు అధికారులు కాదు.. అసలు రెవెన్యూ వ్యవస్థలోనే లోపాలున్నాయని అభిప్రాయపడ్డారు.కోర్టులో విచారణ ముగిసినా మళ్లీ ఆదేశాలు తీసుకురావాలంటూ వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదవారు కొద్దోగొప్పో భూమి కొనుగోలు చేద్దామని అనుకుంటే రిజిస్ట్రేషన్, జీఎస్టీ, స్టాంపు డ్యూటీ వసూలు చేస్తున్నారని.. ఇప్పుడు బాధితులకు కోర్టు ఫీజులు అదనంగా మారాయని స్పష్టం చేసింది. ఎలాంటి నిషేధ ఉత్తర్వులు లేకున్నా పిటిషనర్లకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదని పెద్ద అంబర్పేట్ సబ్ రిజిస్ట్రార్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులకు మార్గదర్శకాలు ⇒ ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రజలు సంప్రదించినప్పుడు రిజిస్ట్రేషన్ చట్టం–1908, ఇండియన్ స్టాంప్ ప్రకారం అన్ని చట్టప్రకారం ఉంటే వారంలోగా రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేయాలి. లేనిపక్షంలో తిరస్కరించాలి. ఇదే విషయాన్ని వారికి తెలియజేయాలి. తిరస్కరణ మౌఖికంగా ఉండకూడదు. లిఖితపూర్వక పత్రం ఇవ్వాలి. ⇒ ఒకవేళ రిజిస్ట్రేషన్ పత్రాలు తిరస్కరిస్తే అప్పటికే చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల వాపసు ప్రక్రియ సరళీకృతం చేయాలి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించే ముందు ప్రజలు వాపసు విధానాన్ని కూడా తెలుసుకోవాలి. ⇒ కోర్టు ఆదేశాలు లేనప్పుడు, ఉత్తర్వులు ఎత్తివేసినప్పుడు, అప్పీల్ పెండింగ్ లేనప్పుడు.. మళ్లీ దానిపై న్యాయస్థానం ఆదేశాలు కావాలని ప్రజలను ఒత్తిడి చేయకుండా సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు సర్క్యులర్లు, నోటిఫికేషన్లు జారీ చేయాలి. ∙తీర్పు వెల్లడించిన, కొట్టివేసిన పిటిషన్లలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లను రిజిస్టరింగ్ అథారిటీలు తిరస్కరించకూడదు.⇒ ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక వాచ్ రిజిస్టర్/జనరల్ డైరీ నిర్వహించాలి. ప్రజల తమ పత్రాల రిజిస్ట్రేషన్‌కు వచి్చన తేదీ, సమయాన్ని అందులో పేర్కొనాలి. వారు ఎందుకు వచ్చారో కూడా నమోదు చేయాలి. అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం, తప్పులు జరగకుండా ఇది తోడ్పడుతుంది. ⇒ కోర్టు ఉత్తర్వుల కోసం పట్టుబట్టకుండా సబ్ రిజిస్ట్రార్, మండల్ రెవెన్యూ అధికారి ఉత్తర్వులు జారీ చేయాలి. ∙వింజమూరి రాజగోపాలాచారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్వెక్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసుల్లో న్యాయస్థానాలు ఇచి్చన మార్గదర్శకాలను రిజిస్టరింగ్ అధికారులు పాటించాలి. ప్రజల(కక్షిదారులు)కు సూచనలు.. ⇒ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే వాచ్ రిజిస్ట్రర్ లేదా జనరల్ డైరీలో తమ వివరాలు నమోదు చేయాలి. అసలు కక్షిదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికే రాలేదు.. రిజిస్ట్రేషన్ కోసం పత్రాలు సమర్పించలేదని భవిష్యత్‌లో అధికారులు తప్పించుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. ⇒ రిజిస్ట్రర్ కార్యాలయాన్ని సంప్రదించే ముందు పార్టీలు ప్రతిపాదిత ఆస్తి నిషేధిత జాబితాలో లేదని నిర్ధారించుకోవాలి. ∙ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే చట్టం ప్రకారం ఆ జాబితా నుంచి ఆస్తిని తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ నేరుగా కోర్టును ఆశ్రయించకూడదు. ⇒ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమరి్పంచిన పత్రాలు ఆ చట్టంలోని నిబంధనల మేరకు ఉండేలా చూసుకోవాలి. -
TG: పవర్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కమిషన్‌ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 16) విచారణ జరిపింది. పిటిషన్‌ను విచారించిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డి తీరుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి విచారణకు సంబంధించిన విషయాలపై ఓపెన్‌గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు.న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనిపించాలని వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్‌ను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలిసింది. లంచ్ తర్వాత కొత్త చైర్మన్ ఎవరనేది చెబుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో పిటిషన్ విచారణను లంచ్ తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. విచారణలో కేసీఆర్ తరపున సీనియర్న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్‌తో సీఎం రేవంత్ మంతనాలు .. కొత్త చైర్మన్ ఎవరనేదానిపై చర్చ పవర్ కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. ఆదేశాల గురించి తెలియగానే కలెక్టర్ల సమావేశ హాల్ నుంచి వెళ్లి అడ్వకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్‌రెడ్డితో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్నదానిపై సీఎం ఏజీతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
ఆరేళ్లుగా అందని డెలివరీ.. ఇన్నాళ్లకు స్పందించిన ఫ్లిప్‌కార్ట్
ఏదైనా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే.. రెండు మూడు రోజులు లేదా ఓ పది రోజులలో డెలివరీ అయిపోతుంది. అయితే ఓ వ్యక్తికి మాత్రమే వింత అనుభవం ఎదురైంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టిన ఆరేళ్లకు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. దీంతో యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.ముంబైకి చెందిన అహ్సన్ ఖర్బాయి 2018 మే 16న ఫ్లిప్‌కార్ట్‌లో ఓ జత చెప్పులు ఆర్డర్ చేశారు. వీటి ధర 485 రూపాయలు. ఆర్డర్ చేసిన తరువాత మూడు రోజుల్లో షిప్పింగ్ అని స్టేటస్‌లో కనిపించింది. 20వ తేదీన డెలివరీ చేస్తామని వెబ్సైట్లో కనిపించింది. అయితే యూజర్ ఇప్పటి వరకు డెలివరీ పొందలేదు. ప్రతో రోజూ అరైవింగ్ టుడే అని మాత్రం కనిపించేది. మొత్తానికి ఇలా ఆరేళ్ళు గడిచిపోయింది.After 6 yrs @Flipkart called me for this order 😂Asking me what issue I was facing pic.twitter.com/WLHFrFW8FV— Ahsan (@AHSANKHARBAI) June 25, 2024ఆర్డర్ పెట్టిన ఆరు సంవత్సరాలకు అహ్సన్ ఖర్బాయికు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. సమస్య ఏంటని ఆరా తీసింది. తనకు ఎదురైనా ఈ అనుభవాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.అహ్సన్ ఖర్బాయి ఆర్డర్ పెట్టినప్పుడే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నారు. కాబట్టి డెలివరీ గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆలస్యమైందని క్యాన్సిల్ కూడా చేయలేదు. దీనికి ఫ్లిప్‌కార్ట్ రిప్లై ఇస్తూ.. మీకు ఎదురైన ఈ అనుభవానికి క్షమించండి, ఇన్ని రోజులు ఎదురు చూటడం గొప్ప విషయం అని పేర్కొంది.I'm really sorry for this experience. Our team has already gotten in touch with you on this and they are looking into your concern related to the recent order. Please be assured that you'll hear from us. Appreciate your patience.— FlipkartSupport (@flipkartsupport) June 26, 2024 -
1000 ట్రక్కుల భారీ ఆర్డర్.. దక్కించుకున్న బెంగళూరు స్టార్టప్
ఎలక్ట్రిక్ ట్రక్కులు తయారు చేసే బెంగళూరు ఆధారిత స్టార్టప్ ట్రెసా మోటార్స్ లాజిస్టిక్స్ కంపెనీ భారీ ఆర్డర్ దక్కించుకుంది. జేఎఫ్‌కే ట్రాన్స్పోర్టర్స్ నుండి 1,000 ట్రక్కుల కోసం ప్రీ-ఆర్డర్‌ను పొందింది. ఈ కంపెనీ మోడల్ V0.1ని అందిస్తోంది. దీన్ని గతేడాది జూలైలో ఆవిష్కరించింది. ట్రెసా కంపెనీ 18T-55T స్థూల వాహన బరువు విభాగంలోనూ ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. ట్రెసా ట్రక్కులు ప్రస్తుతం 300kWh బ్యాటరీ ప్యాక్, 24,000Nm మోటరును కలిగి ఉన్నాయి. ఇవి 15 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జీకి సపోర్ట్ చేస్తాయి. 120kmph గరిష్ట వేగాన్ని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో ఎంత రేంజ్ ఇస్తాయన్నది కంపెనీ వెల్లడించలేదు."మేము ఈ స్థితికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. జేఎఫ్‌కే ట్రాన్స్పోర్టర్స్ వంటి ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీలు ముందుకు రావడం మరియు మాపై విశ్వాసం ఉంచడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని ట్రెసా మోటర్స్ సీఈవో రోహణ్ శ్రవణ్ పేర్కొన్నారు. ట్రెసా మోటార్స్ అధునాతన ఎలక్ట్రిక్ ట్రక్కులను తమ ఫ్లీట్‌లో చేర్చడం ద్వారా కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించే తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నామని జేఎఫ్‌కే ట్రాన్స్పోర్టర్స్ ఎండీ ఆదిల్ కొత్వాల్ అన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది?
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది? స్టీల్ ప్లాంట్ భూములను ఏమైనా విక్రయించారా? విక్రయిస్తే ఎంత మేర విక్రయించారు? తదితర వివరాలను తమ ముందుంచాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే భూములను ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్ కేఏ పాల్‌ను ఆదేశించింది. ఏది పడితే అది ఆరోపిస్తే సరిపోదని.. ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని పాల్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ నరేందర్ ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే నడుస్తోందని చెప్పారు. ఒకవేళ నష్టాల్లో ఉంటే.. ఆ మొత్తాన్ని భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన 2 వేల ఎకరాల భూములను ఇప్పటికే విక్రయించారని ఆరోపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆరోపణలు చేస్తే సరిపోదని.. భూములు విక్రయించినట్లు ఆధారాలు చూపాలని పాల్‌కు స్పష్టం చేసింది. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనిపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ కూడా రాశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను నష్టాల నుంచి బయటపడేసేందుకు ఏం చేయాలో కూడా కేంద్రానికి సూచనలు చేశామన్నారు. భూములిచ్చిన వారు నష్టపోకూడదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని శ్రీరామ్ తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ప్లాంట్ భూములను విక్రయించామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. -
ఒరిజినల్ ఆధార్ పీవీసీ కార్డు.. ఇంటికే కావాలంటే ఇలా చేయండి..
Aadhar PVC Card: ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇటువంటి మీ ఆధార్ కార్డ్ పోయినా లేదా పాడైనా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. కేవలం రూ. 50 రుసుము చెల్లించి యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. పీవీసీ కార్డ్‌లను పాలీ వినైల్ క్లోరైడ్‌తో తయారు చేస్తారు. అందుకే వీటిని పీవీసీ కార్డ్‌లు అంటారు. ఇది ఒక రకమైన ప్లాస్టిక్ కార్డ్. దీనిపై ఆధార్ కార్డ్ సమాచారంతా ముద్రిస్తారు. యూఐడీఏఐ ప్రకారం.. ఈ కార్డ్ సురక్షిత క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, జారీ చేసిన తేదీ, కార్డ్ ప్రింటింగ్ తేదీ తదితర సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయండిలా.. యూఐడీఏఐ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యూఐడీఏఐ వెబ్సైట్లో, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను ఎంటర్ చేయండి ఓటీపీ కోసం ‘Send OTP’పై క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయండి అనంతరం 'మై ఆధార్' విభాగానికి వెళ్లి, 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అనంతరం పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు వస్తాయి. దీని తర్వాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ రూ. 50 రుసుము డిపాజిట్ చేయాలి. చెల్లింపును పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్ పీవీసీ కార్డ్ కోసం ఆర్డర్ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత యూఐడీఏఐ ఆధార్‌ను ప్రింట్ చేసి ఐదు రోజుల్లోగా ఇండియా పోస్ట్‌కి అందజేస్తుంది. పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి ఆధార్ పీవీసీ కార్డును డెలివరీ చేస్తుంది. -
మణిపూర్: ఎస్టీ జాబితా నుంచి మైతేయిల తొలగింపు
ఇంఫాల్: మణిపూర్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాలైన కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణకు దారితీసిన తమ వివాదాస్పద ఉత్తర్వులో సవరణ చేసింది. మైతేయి వర్గాన్ని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)ల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2023 మార్చి 27న జారీ చేసిన ఉత్తర్వులో ఒక పేరాను తొలగించింది. అప్పట్లో కోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ గిరిజనులైన కుకీలు ఆందోళన ప్రారంభించారు. క్రమంగా పెద్ద ఘర్షణగా మారింది. రాష్ట్రంలో నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో దాదాపు 200 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. హైకోర్టు ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆల్ మణిపూర్ ట్రైబల్ యూనియన్ గతేడాది అక్టోబర్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివాదాస్పద ఉత్తర్వులో రెండు తెగల మధ్య శత్రుత్వానికి కారణమైన ఒక పేరాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. . గిరిజనులను జాబితాలో చేర్చడం, మినహాయించడం అనే ప్రక్రియలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి గతేడాది కుకీ తెగ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఎస్టీ జాబితాను కోర్టులు సవరించడం, మార్పులు చేయడం కుదరదని పేర్కొంది. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసింది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని గతేడాది కేంద్ర గిరిజన శాఖకు కోర్టు ప్రతిపాదించింది. దీనిపై నాగా, కుకీ-జోమి తెగలు రిజర్వేషన్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశాయి. వారికి రిజర్వేషన్లు దక్కితే అటవీ ప్రాంతాల్లో తమ నివాసాలు, ఉద్యోగాల వాటా తగ్గిపోతాయని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వివాదాస్పద పేరాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. -
బర్త్ ఆర్డర్ కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది!
‘మా పెద్దోడు చాలా బాధ్యతగా ఉంటాడు. కానీ చిన్నోడికే అస్సలు బాధ్యత లేదు. ఏం చెప్పినా పట్టించుకోడు. వాడిని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారని వచ్చాను’ అన్నారు సుబ్బారావు. ‘మా పెద్దపాప ఇంట్లో అన్ని పనులూ అందుకుంటుంది. కానీ చిన్నపాప మాత్రం ఎప్పుడూ డాన్స్, స్పోర్ట్స్ అంటూంటుంది. దాన్ని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడంలేదు’ చెప్పారు కోమలి. ఇంటికి పెద్ద బిడ్డ యజమాని లాంటి వాడు, బాధ్యతగా ఉంటాడు. రెండో బిడ్డ ప్రశాంతంగా ఉంటాడు. చివరివాడు బాధ్యతలేకుండా అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఇది నిజమేనని నమ్మేవాళ్లూ ఉంటారు.. ఇదంతా ట్రాష్ అని కొట్టేసేవాళ్లూ ఉంటారు. దీనిపై సైకాలజిస్టులు కూడా అధ్యయనం చేశారు. ప్రముఖ ఆస్ట్రియన్ సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ అడ్లర్ 20వ శతాబ్దం ప్రారంభంలో బర్త్ ఆర్డర్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. కుటుంబంలో జన్మించిన క్రమం బిడ్డ ప్రవర్తన, భావోద్వేగాలు, ఇతర వ్యక్తులతో సంబంధాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. మొదటి బిడ్డలు ఎక్కువ శ్రద్ధ (బాధ్యత), మధ్యస్థ శిశువులు తక్కువ శ్రద్ధ (ఎక్కువ స్వాతంత్య్రం)ను పొందుతారనే ఆలోచనలో కొంత నిజం ఉండవచ్చు. చివరి బిడ్డలకు ఎక్కువ స్వేచ్ఛ (తక్కువ క్రమశిక్షణ) లభిస్తాయి. అయితే బర్త్ ఆర్డర్ ఒక ఫ్యాక్టర్ మాత్రమే. తల్లిదండ్రులు, తోబుట్టువులతో సంబంధాలు, జన్యువులు, పర్యావరణం, సామాజిక.. ఆర్థిక స్థితి వంటి అంశాలు కూడా పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. పేరెంటింగ్ స్టైల్ అనేది పిల్లల వ్యక్తిత్వాన్ని అమితంగా ప్రభావితం చేస్తుందనేది అనేక పరిశోధనల సారాంశం. అడ్లర్ సిద్ధాంతం ప్రకారం ఏ పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకుందాం. మొదటి బిడ్డ అడ్లర్ బర్త్ ఆర్డర్ సిద్ధాంతం ప్రకారం, తొలి సంతానం.. వారి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ శ్రద్ధ, సమయాన్ని పొందుతారు. కొత్త తల్లిదండ్రులు అప్పుడే పిల్లల పెంపకం గురించి నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొన్నిసార్లు కఠినంగా, కొన్నిసార్లు న్యూరోటిక్‌గా కూడా ఉండవచ్చు. మొదటి సంతానం టైప్ A వ్యక్తిత్వాలతో బాధ్యతాయుతమైన నాయకులుగా ఉంటారు. కుటుంబంలోకి రెండో బిడ్డ వచ్చినప్పుడు తనకు కేటాయించే సమయం తగ్గడంవల్ల రెండో బిడ్డను చూసి అసూయపడతారు. ఆ తర్వాత తన తోబుట్టువుల పోషణ బాధ్యత తీసుకోవాల్సి రావడం వల్ల ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. మొదట జన్మించిన పిల్లలు అధునాతన అభిజ్ఞాభివృద్ధిని కలిగి ఉంటారని పరిశోధన కనుగొంది, ఇది చదువులో మంచి ఫలితాలను సాధించేందుకు ఉపయోగపడుతుంది. మిడిల్ చైల్డ్ తనకన్నా పెద్ద బిడ్డకు, చిన్న బిడ్డకు మధ్య విభేదాలకు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉన్నందున, మధ్య పిల్లలు కుటుంబంలో శాంతిని కలిగించేవారుగా ఉంటారని అడ్లర్ సూచించాడు. పేరెంట్స్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల వారి దృష్టిని ఆకర్షించేందుకు, ఆదరణ పొందేందుకు వారిని ఆహ్లాదపరచేలా ప్రవర్తిస్తారు. తోబుట్టువులతో నిరంతరం పోటీలో ఉన్నట్లు అనిపించవచ్చు. వీరిలో అభద్రతా భావం, తిరస్కరణ భయం, బలహీనమైన ఆత్మవిశ్వాసం ఉండవచ్చు. తిరస్కరణ పట్ల సున్నితంగా ఉంటారు. తోబుట్టువులకు భిన్నంగా నిలబడాలనుకున్నప్పుడు తిరుగుబాటు లక్షణాలను కలిగి ఉంటారు. మధ్య పిల్లలు తమ తల్లులతో సన్నిహితంగా ఉండే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆఖరి బిడ్డ చివరి బిడ్డ పుట్టే కాలానికి తల్లిదండ్రులకు పిల్లల పెంపకంలో అనుభవం ఉండటం వల్ల కొన్నిసార్లు తక్కువ కఠినంగా ఉంటారు. చివరి బిడ్డ అని గారాబంగా పెంచడంవల్ల, మిగతావారితో పోల్చినప్పుడు చెడిపోయినట్లు కనిపిస్తారు. చిన్నపిల్లలుగా దొరికే స్వేచ్ఛవల్ల కలివిడిగా, స్నేహంగా, చార్మింగ్‌గా ఉంటారు. అయితే ఈ పిల్లలు తక్కువ స్వీయ–నియంత్రణ నైపుణ్యాలను కలిగి ఉండవచ్చు. ఇతరులపై ఎక్కువ ఆధారపడవచ్చు. మేనిప్యులేటివ్గా, అపరిపక్వంగా, సెల్ఫ్ సెంటర్డ్గా కనిపిస్తారు. ఏకైక సంతానం కుటుంబంలో ఏకైక సంతానంగా ఉన్నవారు తల్లిదండ్రుల దృష్టిని, వనరులను తోబుట్టువులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలతో ఎక్కువగా సంభాషిస్తారు కాబట్టి, వయసుకు మించి పరిణతి చెందినట్లు కనిపిస్తారు. క్రియేటివ్ ఆలోచనలతో ఏకాంత సమయాన్ని ఆస్వాదిస్తారు. తన ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉంటారు. తల్లిదండ్రుల అధిక అంచనాల కారణంగా అన్నీ ఫర్ఫెక్ట్గా ఉండాలనే ధోరణి కలిగి ఉంటారు. జీవితంలో ఉన్నతమైనదాన్ని సాధించాలనే కోరిక ఉంటుంది. సాధిస్తారు. స్వావలంబన, ఊహాత్మక ధోరణి ఉంటుంది. సెన్సిటివ్‌గా ఉంటారు. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
నియోజకవర్గానికి రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా సర్పంచ్‌లకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అయితే సర్పంచ్ల పదవీకాలం నెలాఖరుతో ముగుస్తున్నందున అధికారులు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కతో కలసి సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద కేటాయించిన రూ.10 కోట్లలోంచి రూ. కోటి చొప్పున తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్త రిజర్వాయర్లన్నింటినీ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని.. తద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సరఫరా సులభమవుతుందని సీఎం తెలిపారు. గ్రామాల వరకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని, ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్‌ను సర్పంచులకే అప్పగించాలన్నారు. నీరురాని గ్రామాల సర్వే.. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు తాగునీరు అందట్లేదో సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని ఆవాసాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకొనేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు... స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్‌లను కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. రహదారులు లేని గ్రామాలకు తారురోడ్లు... రోడ్డు సౌకర్యంలేని గ్రామాల్లో రోడ్లను నిర్మించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 422 గ్రామ పంచాయతీలు, 3,177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించగా వాటన్నింటికీ తారురోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను అనుసంధానించి వాటిని పూర్తి చేయా లని చెప్పారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో కేంద్ర నిధులు రాలేదు.. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచి్చనట్లు గత ప్రభుత్వం చెప్పుకోవడంతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ ప్రకటనలతో కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయన్నారు. ఇకపై వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు. -
విభజన హామీలపై నిలదీయండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒక్కటేనని, వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఎంపీలు ఆయా అంశాలపై మాట్లాడా లని చెప్పారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింతపై గళం విప్పాలని ఆదేశించారు. తెలంగాణ నీటి వనరులను గుప్పిట పెట్టుకునేందుకు కేంద్రం చేస్తు న్న ప్రయత్నాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్ష తన సుమారు మూడు గంటల పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, కేటీ రామారావు, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లొద్దు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఎంపీల పైనే ఉందని స్పష్టం చేశారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణలోని వెను కబడిన జిల్లాలకు ఐదో ఇన్స్టాల్మెంట్ కింద రూ.450 కోట్ల విడుదల, ఎన్హెచ్ఏఐ సాయంతో ఆదిలాబాద్ సీసీఐ పునరుద్దరణ, రాష్ట్రంలో ఐఐఎం, 23 నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి ప్రస్తావించాలని కేసీఆర్ చెప్పారు. అలాగే పెండింగులో ఉన్న రైల్వే పనులు వేగవంతం చేసేందుకు నిధుల విడుదల, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీ రథకు రూ.19,205 కోట్ల మంజూరు, బయ్యారంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు, జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు, ఎస్సీల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలు లేవనెత్తాలని సూచించారు. త్వరలో అన్ని కార్యక్రమాలకు..! ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కేఆర్ సురేష్‌రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తుంటి ఎముక చికిత్స అనంతరం కోలుకుంటూ తొలిసారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, మునుపటి తరహాలో చురుగ్గా ఉన్నారని పలువురు ఎంపీలు తెలిపారు. త్వరలో పార్టీ పరంగా జరిగే అన్ని కార్యక్రమాలకు తాను స్వయంగా హాజరవుతానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఈ భేటీలో ఎలాంటి ప్రస్తావన రాలేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీ పరంగా జరుగు తున్న సన్నద్ధతపైనా కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లా డారు. నియోజకవర్గాల వారీ సన్నాహక సమావే శాల్లో కేడర్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, పార్టీ పరంగా చేపట్టబోయే దిద్దుబాటు చర్యలు, కార్యక్రమాల గురించి తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహాలు, ఎత్తుగడలను వివరించారు. శని వారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే లోక్‌సభ ఎన్ని కల సన్నాహక సమావేశాల గురించి ప్రస్తావిస్తూ, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటూనే ఈ భేటీ లకు ఎంపీలు హాజరుకావాలని ఆదేశించారు. -
ఒకేసారి 150 విమానాలు.. హైదరాబాద్ వేదికగా ఆర్డర్
WingsIndia2024: ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్ ఏకంగా 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు. ఆకాశ ఎయిర్ భారతదేశపు సరికొత్త విమానయాన సంస్థ అయినప్పటికీ.. 2022లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి నాలుగు శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ గతంలో 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 22 విమానాలను డెలివరీ చేసుకుని నిర్వహణలో ఉంచింది. అంతర్జాతీయ విస్తరణ వైపు అడుగులు వేస్తున్న ఆకాశ ఎయిర్ ప్రణాళికలో భాగంగానే ఈ కొత్త ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. భారత్ నుంచి ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ సహా సమీప విదేశీ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బోయింగ్ విమానాలను ఉపయోగిస్తారు. ఇదీ చదవండి: టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఈఓ ఏమన్నారంటే? గత ఏడాది మరో ఎయిర్‌లైన్స్‌లో చేరటానికి ఎలాంటి నోటీసు లేకుండానే సుమారు 40 మంది పైలట్లు రాజీనామా చేయడంలో విమానయాన సంస్థ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో సంస్థ సంక్షోభంలోకి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆకాశ ఎయిర్ తన కార్య కలాపాలను నిలిపివేసే అవకాశం ఉందని చాలామంది భావించారు. ఆ తరువాత కొత్త ఫైలెట్లను నియమించుకుని ముందుకు సాగుతోంది. Thank you, Hon’ble @JM_Scindia for your constant support and encouragement. We are proud to be a part of the India growth story and are committed to create an inclusive travel environment by connecting people, places, and cultures. #AkasaAir #ItsYourSky #WingsIndia2024 https://t.co/5AhlZ30z1j — Akasa Air (@AkasaAir) January 18, 2024 -
రూ. 1,127 కోట్ల ఆర్డర్.. పెద్ద ప్రయత్నమే చేస్తున్న బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్రయత్నమే చేస్తోంది. తమ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ (OTN) ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా మార్చేయబోతోంది. ఇందుకోసం హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ (HFCL) అనే కంపెనీకి భారీ ఆర్డర్ ఇచ్చింది. ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ మార్పు కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నుంచి రూ. 1,127 కోట్ల ఆర్డర్‌ను పొందినట్లు హెచ్ఎఫ్సీఎల్ తాజాగా తెలిపింది. ఈ సంస్థ చేపట్టే సమగ్ర నెట్వర్క్ అప్‌గ్రేడ్ కేవలం కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సేవల అవసరాలను తీర్చడమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో మెరుగైన 4జీ సేవలను అందించడంతోపాటు 5జీ సర్వీస్‌పైనా దృష్టి పెట్టే స్థాయిలో బీఎస్ఎన్ఎల్ను నిలుపుతుందని భావిస్తున్నారు. సంక్లిష్ట వ్యవస్థలను ఏకీకృతం చేయడంలో తమ అసమానమైన నైపుణ్యంతో అత్యాధునిక ఆప్టికల్ టెక్నాలజీని అమలు చేయడానికి నోకియా (NOKIA) నెట్‌వర్క్‌తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు హెచ్ఎఫ్సీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: 51 టెంకాయలు ఆర్డర్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్!
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. భారత్ విజయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతంగా ఎదురు చూశారు.. అన్ని వర్గాల వారు ఆకాంక్షించారు.. ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించి కప్ గెలిస్తే కొట్టడానికి 51 టెంకాయలను థానేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్‌డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఈ సమాచారాన్ని స్విగ్గీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. థానే నుంచి ఎవరో ఇప్పుడే 51 టెంకాయలు ఆర్డర్ చేశారు. బహుశా వరల్డ్ కప్ ఫైనల్ గెలుపు కోసమే అయిఉండచ్చు. అదే నిజమై భారత్‌కు కప్ రావాలని ఆకాంక్షించింది. కాగా స్విగ్గీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఆర్డర్ చేసింది తానే అంటూ ఓ వ్యక్తి స్విగ్గీ పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే కొట్టడానికే టెంకాయలు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ముందు టెంకాయలు ఉంచిన దృశ్యాన్ని ఈ ట్వీట్‌కు జత చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. లక్షల్లో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. కాగా ఇదే వ్యక్తి భారత్ విజయాన్ని వ్యక్తీకరించడానికి 240 అగరబత్తులను ఆర్డర్ చేశారు. haan bhay yeh someone from thane bhi mai hi hoon, 51 nariyal for unreal manifestation✨ https://t.co/aNa3WACNOp pic.twitter.com/kVuQ6WjCjH — gordon (@gordonramashray) November 19, 2023 -
వ్యభిచారాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలి: ఎంపీ ప్యానెల్
ఢిల్లీ: కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేపట్టిన పార్లమెంటరీ ప్యానెల్.. కీలక సవరణలు చేసింది. సుప్రీంకోర్టు కొట్టేసిన సెక్షన్ 497(వ్యభిచారం)ని మళ్లీ నేరంగా పరిగణించాలని అంటోంది. వివాహ వ్వవస్థ పవిత్రమైనది దానిని పరిరక్షించాలని పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత బిల్లులపై తన రిపోర్టును కేంద్రానికి సమర్ఫించింది. ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ (gender-neutral ) నేరంగా పరిగణించాలని నివేదికలో పేర్కొంది. ఈ కేసుల్లో పురుషుడు, మహిళ సమాన బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. భారతీయ న్యాయ సంహితపై తదుపరి పరిశీలన కోసం బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను ఒక వేళ పార్లమెంట్ ఆమోదం తెలిపితే.. వివాహేతర సంబంధాలపై 2018 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును పక్కకు పెట్టినట్లవుతుంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను కేంద్రం తేనుంది. వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం బీజెపి ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి ఆగస్టులో పంపారు. సుప్రీం తీర్పు.. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధం’’ అని ప్రకటించింది. ఇదీ చదవండి: 377, 497 సెక్షన్లు మళ్లీనా?.. భారతీయ న్యాయ సంహిత బిల్లులో సవరణలతో చేర్చే ప్రతిపాదన! -
పేదల ఇళ్లకు పావలా వడ్డీకే రుణాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79 శాతం మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. ఈ మొత్తానికి అదనంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇంటికి అవసరమైన ఇతర సామగ్రిని తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి రూ.4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు మహిళల పేరుతో చేసినందున పావలా వడ్డీ రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నారు. నిర్మాణాలపై సీఎస్ సమీక్ష ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. వర్షాకాలం ముగిసిన దృష్ట్యా ఇళ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వారం ఎన్ని ఇళ్లు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకుని.. ఆ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు తరచూ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయించడంపై శ్రీకాకుళం, ఎన్టీఆర్, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లా కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. వెనుకబడిన జిల్లాల్లో మరింత దృష్టి లబ్ధిదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ చెప్పారు. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ప్రత్యేక సూచనలు ఇచ్చారన్నారు. పావలా వడ్డీ రుణాలు మంజూరులో నాలుగైదు జిల్లాలు వెనుకబడగా.. ఆయా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారన్నారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినందున అదే స్ఫూర్తితో రెండో దశలో మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వారం వారం లక్ష్యాలను నిర్థేశించుకోవాలని జైన్ పేర్కొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. బెయిల్ వచ్చినా మూడేళ్లు జైళ్లోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. జైలు అధికారుల నిర్లక్ష్యం ఓ దోషి పాలిట శాపంగా మారింది. బెయిల్ వచ్చినప్పటికీ మూడేళ్లపాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. లక్ష రూపాయల జరిమానా విధించింది. చందన్ జీ ఠాకూర్(27)కు ఓ కేసులో జీవితఖైదు శిక్ష పడింది. సెప్టెంబర్ 29, 2020న హైకోర్టు అతని శిక్షను నిలిపివేసింది. అందుకు సంబంధించిన ఆర్డర్ పత్రాలను హైకోర్టు రిజిస్ట్రీ మెయిల్ ద్వారా పంపించింది. ఆ మెయిల్ అటాచ్‌మెంట్‌ను జైలు అధికారులు ఓపెన్ చేయలేదు. దీంతో చందన్ ఠాకూర్ ఇప్పటివరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం మళ్లీ కోర్టును సంప్రదించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు కోర్టు పంపిన ఆర్డర్ కాపీలను మెయిల్లో ఓపెన్ చేయలేదనే విషయం ఈ వ్యవహారంలో బయటపడింది. దీనికారణంగా చందన్ ఠాకూర్‌కు శిక్ష నుంచి విముక్తి కలిగినా.. ప్రయోజనం లభించలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. జైలు అధికారుల నిర్లక్ష్యానికి రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
ఆర్టీసీకి 910 కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: మూడునెలల్లో ఆర్టీసీకి 910 కొత్త బస్సులు సమకూరబోతున్నాయి. చాలా కాలంగా పాతబడ్డ బస్సులతో లాక్కొస్తుండగా, వాటిల్లోంచి కొన్నింటిని తుక్కుగా మార్చేసి.. కొత్త బస్సులు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే టెండర్లు పిలవగా టాటా, అశోక్ లేలాండ్ కంపెనీలు తక్కువ కొటే షన్తో ముందుకొచ్చాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నెగోషియేషన్స్ ద్వారా వాటి కొటేషన్ మొత్తాన్ని కొంతమేర తగ్గించేందుకు ఆర్టీసీ అధి కారులు చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రో జుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండు కంపెనీలు ఒకే ధరకు ముందుకొచ్చేలా చేసి, వాటికే ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నెలలోనే కంపెనీ లకు బస్సులు ఆర్డర్ ఇస్తే...బస్ బాడీల నిర్మా ణానికి మూడు నెలల సమయం పడుతుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులు 540 ఆర్టీసీలో బాగా డిమాండ్ ఉన్న ఎక్స్‌ప్రెస్ కేటగిరీని బలోపేతం చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం అద్దె బస్సులుపోను సొంతంగా 1,800 వరకు ఎక్స్‌ప్రెస్ బస్సులున్నాయి. ఇవి ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. దూర ప్రాంత పట్టణాల మధ్య ఇవి తిరుగుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో 540 కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ అనుకుంటోంది. వాటి రాకతో డొక్కు ఎక్స్‌ప్రెస్ బస్సులు అదే సంఖ్యలో తొలగిస్తారు. వాటిల్లో కొన్నింటిని సిటీ బస్సులుగా, మరికొన్నింటిని పల్లెవెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. అంతమేర సిటీ, పల్లెవెలుగు పాత డొక్కు బస్సులను తుక్కుగా మారుస్తారు. స్లీపర్ కమ్ సీటర్ రాజధాని బస్సులు 50 లేదా 60 ఇక దూరప్రాంత పట్టణాల మధ్య తిరుగుతున్న రాజధాని (ఏసీ) బస్సులకు కూడా మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఉన్న బస్సులు బాగా పాతబడిపోయాయి. వాటిల్లోంచి మరీ పాత బస్సులను తొలగించి కొన్ని కొత్తవి సమకూ ర్చాలన్న ఉద్దేశంతో 50 లేదా 60 బస్సులు కొంటున్నారు. ప్రస్తుతం రాజధాని కేటగిరీ బస్సు లన్నీ సీటర్ బస్సులే. తొలిసారి ఆ కేటగిరీలో స్లీపర్ బస్సులు సమకూర్చనున్నారు. పైన కొన్ని బెర్తులు, దిగువ సీట్లు ఉండే స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తీసుకోవాలని నిర్ణయించారు. ఎట్టకేలకు పల్లెవెలుగుకు కొత్త బస్సులు సాధారణంగా ఎక్స్‌ప్రెస్, రాజధాని బస్సులు పాతబడ్డాక వాటిని తొలగించి సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. దీంతో ఆ బస్సులు చాలా పాతబడి ఉంటున్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు 100 నుంచి 120 మధ్యలో కొత్త బస్సులు సమకూర్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం చాలా ఊళ్లకు అద్దె బస్సులే నడుస్తున్నాయి. మరో 200 కొత్త బస్సులు హైదరాబాద్ సిటీకి కేటాయిస్తారు.