సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య చైనాకు మరో షాక్ తగిలింది. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్‌నెస్(ఇస్కాన్) కూడా చైనా కంపెనీతో చేసుకున్న కోట్ల రూపాయల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రెండువందల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కురుక్షేత్రలో కృష్ణార్జున దేవాలయానికి అవసరమైన గుర్రాలను చైనానుంచి కాకుండా ఇండోనేషియా నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది.
కృష్ణార్జున మందిరానికి అవసరమైన 4గుర్రాలను చైనానుంచి కొనుగోలుకు చర్చలు దాదాపు ఖరారయ్యాయి. కానీ దేశంలో చైనా వ్యతిరేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆలోచనను విరమించుకుంది. ఈ పరిణామాన్నిఇస్కాన్ అధ్యక్షుడు గోపాల్ దాస్ ధృవీకరించారు. నాలుగు గుర్రాల కోసం చైనా కంపెనీతో చర్చలు జరిపామనీ, అయితే చైనా వ్యతిరేకత కారణంగా ఆర్డర్ ఇవ్వకూడదని నిర్ణయించామని తెలిపారు. ఇండోనేషియాలోని ఒక సంస్థతో చర్చలు జరుగుతున్నామని త్వరలోనే ఖరారు చేయనున్నామని వెల్లడించారు.
గోపాల్ దాస్ అందించిన సమాచారం ప్రకారం 34 అడుగులఎత్తు 41 మీటర్ల పొడవుతో పాలరాయితో నాలుగు గుర్రాలను రూపొందించనున్నారు. ఒక్కోదానికి 80-90లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఈ ఆలయ సముదాయం నిర్మాణం 2018లో ప్రారంభం కాగా 2022 లో పూర్తి కానుంది. ఆరు ఎకరాలలో 23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులు, 165 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను కలిగి ఉంటుంది. అన్ని గ్రంథాలతో లైబ్రరీ, గోవింద రెస్టారెంట్, 75 గదుల గెస్ట్ హౌస్, ఆర్ట్ గ్యాలరీ, ఆధ్యాత్మిక గిప్ట్స్ షాప్, సూపర్ మార్కెట్, కేఫ్ సౌకర్యాలను కూడా ఇందులో ఏర్పాటు చేస్తారు. 60 శాతం నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment