
హెచ్1బీ వీసాదారులకు గుడ్ న్యూస్
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు, ఇతరులకు భారీ ఉపశమనం లభించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అమలు చేయాలని చూస్తున్న పుట్టుకతో పౌరసత్వం (Birthright Citizenship) రద్దుకు సంబంధించిన ఆదేశాలకు మరో సారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేరీల్యాండ్‌లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఆటోమేటిక్ జన్మహక్కు పౌరసత్వాన్ని నిరవధికంగా పరిమితం చేయాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యను అడ్డుకున్నారు. అమెరికా పౌరసత్వం జీవితం.. స్వేచ్ఛ కంటే తక్కువ విలువైన హక్కు కాదు అంటూ జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ఆర్డర్‌ను నిరవధికంగా నిలిపివేశారు. ఈ ఆదేశాల అమలుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 19 నుండి అమలులోకి రానుంది.
ట్రంప్ బాధ్యతలు చేపట్టి, తొలి రోజున సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని అమెరికా జిల్లా న్యాయమూర్తి డెబోరా బోర్డ్‌మన్ బుధవారం తీర్పు ఇచ్చారు. 14వ సవరణపై ట్రంప్ పరిపాలన అందిస్తున్న వివరణను అమెరికాలోని ఏ కోర్టు కూడా ఆమోదించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఆదేశం దేశవ్యాప్తంగా వర్తిస్తుందనీ కేసు కొనసాగే వరకు అమలులో ఉంటుందని ఈ ఆర్డర్ స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. అమెరికా పౌరసత్వాన్ని ఆ నేలపై పుట్టిన వారికి అందించటం అత్యంత విలువైన హక్కుగా పేర్కొన్నారు. దీంతో వలసలను అడ్డుకోవాలనే ఆలోచనలో భాగంగా 125 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న చట్టాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ప్రణాళికలకు ఈ తీర్పు మరొక చట్టపరమైన దెబ్బ.

కాగా బర్త్‌రేట్ సిటిజిన్ షిప్ ఆర్డర్ జారీ చేసిన నాటి నుంచి, ఎన్ఆర్ఐలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో సంకెళ్లతో తరలించడం లాంటి అనేక కఠిన నిర్ణయాలు సగటు భారతీయుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి. అంతేకాదు అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు సైతం తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లిపోనున్నారనే భయాలు వెంటాడుతున్నాయి.
Birthright Citizenship అంటే ఏంటి?
అంతర్యుద్ధం తరువాత మాజీ బానిసలు, ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వం కల్పించడానికి 14వ సవరణ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డకు ఆటోమెటిక్‌గా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధన కింద జన్మహక్కు పౌరసత్వాన్ని పొందుతారని రాజ్యాంగ సవరణ వెల్లడిస్తుంది. అయితే దీన్ని రద్దు చేస్తే ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం అమెరికా పౌరులు కాని వ్యక్తులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఇకపై పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించరు. ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భావించారు. ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు వంటి చట్టబద్ధమైన తాత్కాలిక నివాసితులు కూడా తమ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం కోల్పోతారనే ఆందోళనలో పడిపోయారు. ప్రస్తుతానికి దీనికి బ్రేక్‌లు పడినట్టే.
ఈ ఉత్తర్వుల ద్వారా భారీ ఊరట లభించేది వీరికే
H-1B (వర్క్ వీసాలు)
H-4 (డిపెండెంట్ వీసాలు)
L (ఇంట్రా-కంపెనీ బదిలీలు)
F (స్టూడెంట్ వీసాలు)
ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్‌ప్రైజ్ గిప్ట్