అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు తొలి షాక్ తగిలింది. ఆయన జారీ చేసిన తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలు విషయంలో చుక్కెదురైంది. జన్మతఃపౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాదు రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించింది. దీంతో జన్మతః పౌరసత్వం చట్ట రద్దుతో బెంబేలెత్తుతున్న భారతీయులకు (NRI) భారీ ఊరట లభించింది.
జన్మహక్కు పౌరసత్వాన్ని (birthright citizenship) రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును గురువారం యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నిలిపివేశారు. "ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వు" అని న్యాయమూర్తి జాన్ కఫ్‌నౌర్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ దీనిపై "అప్పీల్" చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ట్రంప్ ఉత్తర్వు ఎవరికి వర్తిస్తుంది?
ఫిబ్రవరి 19 తర్వాత ఆ ఉత్తర్వు తేదీ నుండి 30 రోజుల తర్వాత యుఎస్‌లో జన్మించిన వ్యక్తులకు మాత్రమే 14వ సవరణ యొక్క ఈ కొత్త వివరణ వర్తిస్తుంది.
ట్రంప్ ఆదేశంఅమలులోకి వస్తే ఏటా 1.5 లక్షలకు పైగా నవజాత శిశువులకు పౌరసత్వం నిరాకరించబడుతుందని డెమొక్రాటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు నివేదించాయని రాయిటర్స్ తెలిపింది.
ఇది భారతీయులను ఎలా ప్రభావితం చేస్తుంది?
అమెరికా పౌరసత్వం పొందడానికి మార్గంగా ఉపయోగించే బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్ రద్దు భారతీయ కుటుంబాలపై చాలా ప్రభావం పడుతుంది. ట్రంప్ ఆదేశం అమల్లోకి వస్తే, ఎన్‌ఆర్‌ఐ పిల్లలు అమెరికాలో ఉండేందుకు వేరే మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. దాదాపు 5.2 మిలియన్ల మంది భారత సంతతికి చెందిన ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. అమెరికాలో భారతీయ అమెరికన్లు రెండో అతిపెద్ద వలసదారుల గ్రూప్‌గా ఉన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గత సంవత్సరం ప్రచురించిన మరో నివేదిక ప్రకారం 2022 నాటికి అమెరికాలో 2.2 లక్షల మంది అనధికార భారతీయ వలసదారులు నివసిస్తున్నారని అంచనా వేసింది. ఇది 2018లో 4.8 లక్షలలో సగం కంటే తక్కువ.
జనవరి 20న, 47వ యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.అమెరిక ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో విప్లవాత్మక మార్పులతీసుకొస్తానన్న వాగ్దానం చేసిన ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఉత్తర్వు ప్రకారం, పత్రాలు లేని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు ఆటోమేటిక్ పౌరసత్వానికి అర్హులు కారు.కాగా 1868 నుంచేఅమెరికాలో ఈ చట్టం అమల్లో ఉంది.దేశంలో అంతర్యుద్ధం అనంతరం 14వ రాజ్యాంగ సవరణ తర్వాత శరణార్ధుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అమెరికా మాత్రమే కాదు.. దాదాపు 30 దేశాలు తమ దేశంలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment