కువైట్‌లోని మంగాఫ్ భవనంలో చెలరేగిన మంటలు మరణమృదంగాన్ని సృష్టించాయి. పొట్టచేతపట్టుకొని ఎడారి దేశం పోయిన శ్రమజీవులు 45 మంది భారతీయులు అగ్నికి ఆహూతైపోయారు. పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తన బిడ్డ ఏమైపోయాడో తెలియక బిహార్‌కు చెందిన ఒక తల్లి తల్లడిల్లి పోతోంది.
ఈ అగ్నిప్రమాదం గురించి విన్నప్పటి నుండి బిహార్‌లోని దర్భంగా జిల్లాలోని నైనా ఘాట్ ప్రాంతానికి చెందిన మదీనా ఖాతూన్ తన కొడుకు ఆచూకీకోసం ఆందోళన పడుతోంది. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సిన తన పెద్ద కొడుకు కాలూ ఖాన్ ఫోన్ కాల్స్‌కు స్పందించడంలేదనీ, అతని ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం తెలియడం లేదని వాపోతోంది. తన కుమారుడికి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదంటూ భయాందోళన వ్యక్తం చేసింది. శుభవార్త అందించు దేవుడా అంటూ ఖాతూన్ కన్నీరు మున్నీరవుతోంది.
కాలూ ఖాన్ ప్రమాదం జరిగిన భవనంలో నివసిస్తున్నాడని, పెళ్లి కోసం జూలై 5న రావాల్సి ఉందని చెప్పింది. "కొన్నేళ్లుగా కువైట్‌లో నివసిస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేనుఫోన్‌లో మాట్లాడాను. వచ్చే నెలలో తన వివాహం జరగాల్సి ఉన్నందున జూలై 5న దర్భంగా వస్తానని చెప్పాడు" అని ఆమె మీడియా ప్రతినిధులకు తెలిపింది. అతని ఫోటోలను ఎంబసీ అధికారులకు పంపామనీ, అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది.
"ఎలక్ట్రికల్ సర్క్యూట్" కారణంగా ఘోరమైన మంటలు సంభవించాయని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. కువైట్ మంగాఫ్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలతో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం కేరళలో ల్యాండ్ అయింది.
మృతిచెందిన వారి సంఖ్య రాష్ట్రాల వారిగా
కేరళ - 23
తమిళనాడు -7
ఉత్తరప్రదేశ్ -3
ఆంధ్రప్రదేశ్ -3
ఒడిశా- 2
బీహార్, వెస్ట్ బెంగాల్ పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
రూ. 2 లక్షల పరిహారం
కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment