Victims of Gulf
-
Kuwait Fire వచ్చే నెలలోనే పెళ్లి... భగవంతుడా నాబిడ్డ ఎక్కడ?
కువైట్‌లోని మంగాఫ్ భవనంలో చెలరేగిన మంటలు మరణమృదంగాన్ని సృష్టించాయి. పొట్టచేతపట్టుకొని ఎడారి దేశం పోయిన శ్రమజీవులు 45 మంది భారతీయులు అగ్నికి ఆహూతైపోయారు. పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తన బిడ్డ ఏమైపోయాడో తెలియక బిహార్‌కు చెందిన ఒక తల్లి తల్లడిల్లి పోతోంది.ఈ అగ్నిప్రమాదం గురించి విన్నప్పటి నుండి బిహార్‌లోని దర్భంగా జిల్లాలోని నైనా ఘాట్ ప్రాంతానికి చెందిన మదీనా ఖాతూన్ తన కొడుకు ఆచూకీకోసం ఆందోళన పడుతోంది. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సిన తన పెద్ద కొడుకు కాలూ ఖాన్ ఫోన్ కాల్స్‌కు స్పందించడంలేదనీ, అతని ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం తెలియడం లేదని వాపోతోంది. తన కుమారుడికి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదంటూ భయాందోళన వ్యక్తం చేసింది. శుభవార్త అందించు దేవుడా అంటూ ఖాతూన్ కన్నీరు మున్నీరవుతోంది.కాలూ ఖాన్ ప్రమాదం జరిగిన భవనంలో నివసిస్తున్నాడని, పెళ్లి కోసం జూలై 5న రావాల్సి ఉందని చెప్పింది. "కొన్నేళ్లుగా కువైట్‌లో నివసిస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేనుఫోన్లో మాట్లాడాను. వచ్చే నెలలో తన వివాహం జరగాల్సి ఉన్నందున జూలై 5న దర్భంగా వస్తానని చెప్పాడు" అని ఆమె మీడియా ప్రతినిధులకు తెలిపింది. అతని ఫోటోలను ఎంబసీ అధికారులకు పంపామనీ, అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది."ఎలక్ట్రికల్ సర్క్యూట్" కారణంగా ఘోరమైన మంటలు సంభవించాయని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. కువైట్ మంగాఫ్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలతో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం కేరళలో ల్యాండ్ అయింది.మృతిచెందిన వారి సంఖ్య రాష్ట్రాల వారిగా కేరళ - 23 తమిళనాడు -7ఉత్తరప్రదేశ్ -3ఆంధ్రప్రదేశ్ -3ఒడిశా- 2బీహార్, వెస్ట్ బెంగాల్ పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. రూ. 2 లక్షల పరిహారంకువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారికి రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. -
గల్ఫ్‌లో శ్రమ దోపిడీ
సాక్షి, కామారెడ్డి: నాలుగురాళ్లు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆశతో గల్ఫ్‌బాట పట్టారు. కంపెనీ వీసా పేరుమీద పని దొరుకుతుందని తెలియడంతో రూ.లక్షలు పోసి దేశం కాని దేశానికి వెళ్లారు. మొదట్లో అక్కడ అంతా బాగానే గడిచింది. కంపెనీల మోసాలు ఒక్కొక్కటిగా పెరిగిపోయి జీతాలు పెరిగిపోయాయి. ఏడాదికిపైగా జీతాలు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిలువునా దోపిడీకి గురైన తర్వాత చేసేదేమి లేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుప్పెడు దుఃఖాన్ని గుండెల్లో నింపుకుని ఇళ్లకు తిరిగివచ్చారు. ఒమన్ దేశం నుంచి మొత్తం 13 మంది గల్ఫ్ కార్మికులు గురువారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో దిగారు. వీరిలో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాగా ఒకరు ఆంధ్రప్రదేశ్, మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కార్మికులు. వీరిలో ఐదుగురు కామారెడ్డి జిల్లాకు చెందినవారు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన బుర్రస్వామిగౌడ్, గంగావత్ చందర్, మాచారెడ్డి మండలం ఫరీదుపేటకు చెందిన అబ్దూల్ మాజీద్, కామారెడ్డి మండలం క్యాసంపల్లికి చెందిన రవి, చిన్నమల్లారెడ్డికి చెందిన పంపరి గోపాల్ ఉన్నారు. రూ.లక్షల్లో నష్టపోయారు.. జిల్లాకు చెందిన కార్మికులు కంపెనీ వీసాపై ఓమన్ దేశంలోని మస్కట్‌లో హసన్ జుమాబాకర్ అనే భవన నిర్మాణ కంపెనీలో పని చేసేందుకు ఏడాదిన్నర క్రితం వెళ్లారు. ఆ సమయంలో ఒక్కొక్కరు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు వీసాలు, టిక్కెట్ల పేరిట చెల్లించుకున్నారు. మొదట కొంతకాలం జీతాలు సక్రమంగానే ఇచ్చిన కంపెనీ ఏడాది కాలంగా జీతాలు సక్రమంగా ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ.లక్ష 50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు రావాల్సి ఉంది. జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లాయర్‌ను సంప్రదించి కంపెనీ మీద కేసు వేశారు. ఇండియన్ ఎంబసిని కూడా ఆశ్రయించారు. ఎవరూ సరిగ్గా పట్టించుకోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కంపెనీ ప్రతినిధులను గట్టిగా నిలదీస్తే బెదిరింపులు, జైల్లో పెట్టిస్తామని భయపెట్టేవారని తెలిపారు. గత ఫిబ్రవరి నుంచి పనులకు హాజరుకాలేదు. చేతిలో చిల్లి గవ్వ లేక తిండికి కూడా కష్టంగా మారింది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వారు నివాసం ఉండే క్యాంపుల వద్దకు భోజనం తీసుకువచ్చి పెట్టేవారని బాధితులు చెబుతున్నారు. దాతల సహకారంతో స్వదేశానికి.. కంపెనీ మోసంతో స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించారు. వారు సహకారం అందించి అక్కడి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి స్వస్థలాలు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఓమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అనే సామాజిక సంస్థ కన్వీనర్ నరేంద్ర పన్నీరు వీరిని అక్కడి క్యాంపులో కలుసుకుని జేబు ఖర్చులకు ఒక్కొక్కరికి రూ.500 అందజేసినట్లు స్వస్థలాలకు చేరిన కార్మికులు తెలిపారు. మస్కట్ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 13 మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ విభాగం పక్షాన ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున ఎయిర్‌పోర్టు ప్రొటోకాల్ సిబ్బంది సహాయం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయుల సంఘం ప్రతినిధులు కోటపాటి నర్సింహానాయుడు, సురేందర్సింగ్ ఠాకూర్ బాధితులను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అష్టకష్టాలు పడ్డాం... మొత్తం 45 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు మా కంపెనీలో పనిచేసేశారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి 2.50 లక్షల వరకు సదరు కంపెనీ నుంచి జీతాలు రావాల్సి ఉంది. ఏడాదిగా ఇవ్వలేదు. అడిగితే జైల్లో పెడుతా మన్నారు. పని మానేశాక ఎన్నో కష్టాలు పడ్డాం. ఎంబసి వారు కూడా పట్టించుకోలేదు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరిగి వచ్చాం. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. –అబ్దుల్ మాజిద్, ఫరీదుపేట, మాచారెడ్డి మండలం. -
మా వారిని రక్షించండి
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్) : అకారణంగా జైళ్లో వేసి ఇబ్బందులకు గురిచేస్తున్న ఇరాక్ ప్రభుత్వం బారినుంచి తమ వారిని రక్షించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన బాధిత కుటుంబసభ్యులు ఢిల్లీబాట పట్టారు. తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాట్కూరి బసంతరెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో విదేశాంగశాఖ మంత్రిని కలిసేందుకు వెళ్లారు. ముందుగా సీఏఆర్ఏ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ మంద రాంచంద్రరెడ్డిని కలిశారు ఎందుకు పట్టుకెళ్లారో తెలియని పరిస్థితి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన కుంటాల ఎల్లయ్య, లచ్చవ్వ దంపతుల కొడుకు కుంటాల లచ్చన్న. ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన షేర్ల లక్ష్మి, లచ్చన్న దంపతుల కుమారుడు రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, అందరిలో ఉన్నతంగా బతుకాలనే ఉద్దేశంతో లచ్చన్న, రాజు 2015 ఆగస్టు 22న ఇరాక్ దేశం వెళ్లారు. వీసా కోసం నిజామాబాద్ జిల్లాకు చెం దిన ఏజెంట్‌కు రూ.1.50 లక్షలు చెల్లించారు. తీరా అక్కడికి వెళ్లాక ఏజెంట్ మోసం చేశాడని తెలుసుకున్నారు. విజిట్ వీసాతో తమను పంపాడని తెలుసుకున్నారు. అకామా లేకుండా ఇరాక్‌లో ఉం డటం చాలా ఇబ్బంది. ఇది తెలిసి.. తెలిసిన వారి వద్ద ఉంటూ దొంగచాటున పనులు చేస్తూ జీవిం చారు. ఏడాది పాటు పనిచేసిన డబ్బులతో అకా మా చేయించుకున్నారు. అకామా వచ్చాక ఎర్బిల్లోని బాల పాఠశాలలో పనికి కుదిరారు. ఈ క్రమంలో ఏప్రిల్ 16న పోలీసులు వచ్చి ఎలాంటి కారణం చూపకుండా వీరిద్దరినీ పట్టుకెళ్లారు. ఎందుకు పట్టుకెళ్లారో..? ఎన్ని రోజులుంచుకుంటారో..? తెలియని పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల నుంచి మాట్లాడలే ఏప్రిల్ 16న పోలీసులు పట్టుకెళ్లక ముందు (మూడునెలల క్రితం) ఫోన్ చేశారు. ఆ తర్వాత ఫోన్లు బంద్ అయ్యాయి. తాజాగా ఈ నెల 12న ఫోన్ చేసి.. తమను ఎందుకు జైళ్లో వేశారో తెలియదని.. తాము ఏ తప్పూ చేయలేదని.. చాలా టార్చర్ చేస్తున్నారని ఏడుస్తూ తెలిపారని శేర్ల రాజు కుటుంబ సభ్యులు అంటున్నారు. వారు పనిచేస్తున్న పాఠశాలలో జరిగిన సంఘటనపై వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారని, ఆ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధమూ లేదంటున్నారని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. సంఘటన ఏం జరిగిందో..? వీరిపాత్ర ఎంతవరకు ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పదిమంది కూడా ఢిల్లీకి వెళ్లినట్లు వారు పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిని కలిసి విన్నవిస్తాం ఇరాక్‌లో ఇరుక్కుపోయిన వారిని విడిపించేలా విదేశాంగ శాఖ మంత్రిని కలిసి విన్నవిస్తాం. వీరితోపాటు వివిధ జిల్లాలకు చెందిన పలువురి ఇదే పరిస్థితితో బాధపడుతున్నారు. వారందరిని తీసుకుని ఢిల్లీకి వెళ్లాం. ఇప్పటికే ఇరాక్ ఎంబసీ డైరెక్టర్ జనరల్ మణిపాల్‌సింగ్‌తో ఫోన్లో మాట్లాడాం. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితే తప్ప వారు విడుదలయ్యే అవకాశం లేదు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. – పాట్కూరి బసంతరెడ్డి, గల్ఫ్‌వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు -
అభివృద్ధిని విస్మరించారు.. ఆస్తులు పెంచుకున్నారు!
నిజామాబాద్‌కల్చరల్ : సమైక్య రాష్ట్రంలో పదేళ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని విస్మరించారని, ఆస్తులను సంపాదించుకోవడంలోనే తలమునకలయ్యారని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లాలో ఉన్న పెద్దపెద్ద నాయకులు జిల్లా అభివృద్ధిని పూర్తిగా మరచిపోయారని, కేవలం తమ సొంత ఆస్తులను పెంచుకోవడంతోనే సరిపెట్టుకున్నారని విమర్శించారు. అంతకు ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అందువల్లే జిల్లా అభివృద్ధి చెందలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాల్లోనే ఎన్నికల్లోని మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేస్తూ, ఎన్నికల్లో ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తోందన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి మంచినీటిని అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకం సర్వే పనులు కొనసాగుతున్నాయన్నారు. రైతులకు గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని ఇన్పుట్ సబ్సిడీని అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. గల్ఫ్ బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ తెలంగాణలో గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కేరళ రాష్ట్రం తరహాలో సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ముస్లిం, గిరిజనలకు రిజర్వేషన్ల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఉన్న 85 శాతం అణగారిన వర్గాల వారి అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఆర్మూర్‌లో ఎర్రజొన్న రైతులకు రూ.10 కోట్ల బకాయిలను చెల్లించామన్నారు. సమైక్య రాష్ట్రంలో కోస్తాంధ్రలో ఆంధ్ర నాయకులు ఈదురుగాలులకు కొబ్బరిచెట్లు కుప్పకూలితే బాధితులకు రూ. 5 వేల నష్టపరిహారం ఇచ్చారని, తెలంగాణలో రైతుల పంట వడగండ్ల వానకు నష్టపోయినా, విద్యుత్ కోతలతో ఎండిపోయినా నయా పైసా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ఆసరా పథకంపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిజామాబాద్ స్మార్ట్‌సిటీ కోసం ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ, ఆసరా పథకం ద్వారా అర్హులైన వారికి పింఛన్ తప్పనిసరిగా అందుతుందన్నారు.సమావేశంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏ ఎస్ పోశెట్టి తదితరులు ఉన్నారు. -
గల్ఫ్ బాధితులకు ఊరట
నిర్మల్ : కన్నవారిని.. ఉన్న ఊరిని.. భార్యా, పిల్లలను వదిలి ఎడారి దేశాలకు ఉపాధి కోసం పయనమైన వారిలో కొందరు మోసాల బారిన పడుతున్నారు.. మరికొందరేమో దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతూ దినదినగండంగా కాలం నెట్టుకొస్తున్నారు. ఇంకొందరేమో అటు ఆ దేశం పెట్టే బాధలు భరించలేక.. పనులు లేక.. చేసిన అప్పులు చెల్లించకముందే ఇళ్లకు పయనమవుతున్నారు. ఇన్ని బాధలు పడుతున్న గల్ఫ్ బాధితులకు కేంద్రం తాజా నిర్ణయం ఊరటనిస్తోంది. గల్ఫ్ బాధితులకు అండగా ఉంటామంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో ఆయా కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎడారి దేశాలకు.. ఉపాధి కోసం జిల్లాలోని నిర్మల్, ముథోల్, బోథ్, ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూర్, ఆదిలాబాద్ తదితర నియోజకవర్గాల నుంచి దుబాయి, మస్కట్, సౌదీ, ఓమన్, ఇరాక్ వంటి గల్ఫ్ దేశాలకు నిత్యం వలస వెళ్తున్నారు. జిల్లాలో దాదాపు 30 వేలకు పైనే గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ప్రధానంగా వీరంతా ఉన్న ఊరిలో చేసేందుకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, సాగు లాభసాటి కాకపోవడంతో చేసిన అప్పులు తీర్చేందుకు, తమ కుటుంబాలకు ఆర్థికంగా మంచి హోదాలో ఉంచాలన్న ఆశతో రూ.లక్షల్లో అప్పులు చేసి గల్ఫ్ బాటపడుతున్నారు. అయితే కొందరు ఏజెంట్లు చేసే మోసాల బారినపడి వారు ఎడారి దేశాల్లో కడు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చేసేందుకు సరైన పనులు లేక, అప్పులు తీర్చే మార్గాలు లేక, వడ్డీలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. మరికొందరైతే అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇంకొందరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయనీయ పరిస్థితుల్లో కుటుంబాలు.. ఎడారి దేశ ఆశలు అనేక కుటుంబాలను దయనీయ పరిస్థితులకు నెట్టేశాయి. గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు తీర్చే మార్గాలు లేకపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఆ అప్పులను తీర్చలేక ఉన్న భూములను అమ్ముకుంటున్నారు. మరికొందరైతే అక్కడ జరిగే ప్రమాదాల బారినపడి విగతజీవులుగా మారుతున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గానీ, సాధారణంగా గానీ మృత్యువాతపడితే ఆ మృతదేహం వచ్చేందుకు నెలల తరబడి వేచిచూసే పరిస్థితి ఉంది. అందని ఆసరా.. కొందరు ఏజెంట్లు, కొన్ని కంపెనీలు చేసిన మోసాలతో రూ.లక్షల్లో అప్పులతో తిరిగి స్వగ్రామాలకు వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. గతంలో దుబాయి ప్రభుత్వం, ఇటీవల సౌదీ ప్రభుత్వం జారీ చేసిన నితాఖత్ చట్టాలతో వందలాది మంది తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. అయితే వారు వెళ్లేందుకు చేసిన అప్పులు అలాగే మిగిలిపోయాయి. దీంతో తీర్చే మార్గాలు లేక నిత్యం అనేక అష్టకష్టాలు పడుతున్నారు. వీరి కోసం ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలూ ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. కేంద్రం భరోసా.. గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్న వారిని తాము అన్నివిధాలా ఆదుకుంటామని విదేశాంగ, ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. ఈ మేరకు గత సోమవారం ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 మంది ఎంపీలతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఇరు ప్రాంతాల నుంచి అత్యధికంగా గల్ఫ్‌లో ఉండడంతో ఈ సమావేశం నిర్వహించినట్లు కేంద్ర మంత్రి వారితో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ అష్టకష్టాలు పడుతున్న గల్ఫ్ వాసులతోపాటు, అప్పుల కుంపట్లో కొట్టుమిట్టాడుతూ తిరిగి స్వగ్రామాలకు వచ్చిన గల్ఫ్ బాధితులకూ బాసటాగా నిలవాలని నిర్ణయించారు. దీనిపై జిల్లా గల్ఫ్ బాధితులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పట్టించుకుని తమలాంటి వారికి సాయం అందించాలని కోరుతున్నారు.