మా వారిని రక్షించండి | Telangana Government have To Protect Gulf Victims Of Aadilabad | Sakshi

ఇరాక్‌లో చిక్కుకున్న వారి కోసం..

Jul 10 2019 10:49 AM | Updated on Jul 10 2019 10:49 AM

Telangana Government have To Protect  Gulf Victims Of  Aadilabad - Sakshi

విడిపించాలని వేడుకుంటున్న లచ్చన్న కుటుంబం 

సాక్షి, జన్నారం(ఆదిలాబాద్‌) : అకారణంగా జైళ్లో వేసి ఇబ్బందులకు గురిచేస్తున్న ఇరాక్‌ ప్రభుత్వం బారినుంచి తమ వారిని రక్షించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన బాధిత కుటుంబసభ్యులు ఢిల్లీబాట పట్టారు. తెలంగాణ గల్ఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాట్కూరి బసంతరెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో విదేశాంగశాఖ మంత్రిని కలిసేందుకు వెళ్లారు.  ముందుగా సీఏఆర్‌ఏ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ మంద రాంచంద్రరెడ్డిని కలిశారు 

ఎందుకు పట్టుకెళ్లారో తెలియని పరిస్థితి
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్‌ గ్రామానికి చెందిన కుంటాల ఎల్లయ్య, లచ్చవ్వ దంపతుల కొడుకు కుంటాల లచ్చన్న. ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన షేర్ల లక్ష్మి, లచ్చన్న దంపతుల కుమారుడు రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, అందరిలో ఉన్నతంగా బతుకాలనే ఉద్దేశంతో లచ్చన్న, రాజు 2015 ఆగస్టు 22న ఇరాక్‌ దేశం వెళ్లారు.

వీసా కోసం నిజామాబాద్‌ జిల్లాకు చెం దిన ఏజెంట్‌కు రూ.1.50 లక్షలు చెల్లించారు. తీరా అక్కడికి వెళ్లాక ఏజెంట్‌ మోసం చేశాడని తెలుసుకున్నారు. విజిట్‌ వీసాతో తమను పంపాడని తెలుసుకున్నారు. అకామా లేకుండా ఇరాక్‌లో ఉం డటం చాలా ఇబ్బంది. ఇది తెలిసి.. తెలిసిన వారి వద్ద ఉంటూ దొంగచాటున పనులు చేస్తూ జీవిం చారు. ఏడాది పాటు పనిచేసిన డబ్బులతో అకా మా చేయించుకున్నారు. అకామా వచ్చాక ఎర్బిల్‌లోని బాల పాఠశాలలో పనికి కుదిరారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 16న పోలీసులు వచ్చి ఎలాంటి కారణం చూపకుండా వీరిద్దరినీ పట్టుకెళ్లారు. ఎందుకు పట్టుకెళ్లారో..? ఎన్ని రోజులుంచుకుంటారో..? తెలియని పరిస్థితి ఏర్పడింది. 

మూడు నెలల నుంచి మాట్లాడలే
ఏప్రిల్‌ 16న పోలీసులు పట్టుకెళ్లక ముందు (మూడునెలల క్రితం) ఫోన్‌ చేశారు. ఆ తర్వాత ఫోన్‌లు బంద్‌ అయ్యాయి. తాజాగా ఈ నెల 12న ఫోన్‌ చేసి.. తమను ఎందుకు జైళ్లో వేశారో తెలియదని.. తాము ఏ తప్పూ చేయలేదని.. చాలా టార్చర్‌ చేస్తున్నారని ఏడుస్తూ తెలిపారని శేర్ల రాజు కుటుంబ సభ్యులు అంటున్నారు. వారు పనిచేస్తున్న పాఠశాలలో జరిగిన సంఘటనపై వారిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారని, ఆ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధమూ లేదంటున్నారని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. సంఘటన ఏం జరిగిందో..? వీరిపాత్ర ఎంతవరకు ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన పదిమంది కూడా ఢిల్లీకి వెళ్లినట్లు వారు పేర్కొన్నారు. 

విదేశాంగ మంత్రిని కలిసి విన్నవిస్తాం
ఇరాక్‌లో ఇరుక్కుపోయిన వారిని విడిపించేలా విదేశాంగ శాఖ మంత్రిని కలిసి విన్నవిస్తాం. వీరితోపాటు వివిధ జిల్లాలకు చెందిన పలువురి ఇదే పరిస్థితితో బాధపడుతున్నారు. వారందరిని తీసుకుని ఢిల్లీకి వెళ్లాం. ఇప్పటికే ఇరాక్‌ ఎంబసీ డైరెక్టర్‌ జనరల్‌ మణిపాల్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడాం. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితే తప్ప  వారు విడుదలయ్యే అవకాశం లేదు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. 
– పాట్కూరి బసంతరెడ్డి, గల్ఫ్‌వెల్ఫేర్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement