ఈనెల 28 నుంచి ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా..
మెస్రం వంశీయుల ఆచార సంప్రదాయాలకు ప్రతీక
ఏటా పలు రాష్ట్రాల నుంచి భక్తుల ఆగమనం
పుష్యమాస అమావాస్య నుంచి ప్రక్రియ షురూ
జాతర ముగిసే వరకు పవిత్రతకు పెద్దïపీట
సాక్షి, ఆదిలాబాద్: నాగోబా జాతరను ఈనెల 28 నుంచి ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం వేదికగా.. ఏటా నిర్వహించే ఈ జాతర ప్రసిద్ధి చెందింది. ఆదివాసీల్లోని మెస్రం వంశీయుల ఆచార సంప్రదాయాలు ఇందులో ప్రతిబింబిస్తాయి.
పుష్యమాస అమావాస్య నుంచి ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే ప్రచార రథయాత్ర పూర్తి చేసిన వంశీయులు.. ప్రస్తుతం గంగా జల సేకరణ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో మేడారం తర్వాత నాగోబా జాతరను పెద్దఎత్తున నిర్వహిస్తుంటారు. ప్రభుత్వం ఈ జాతరను అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల భక్తులు జాతరకు పెద్ద ఎత్తున తరలివస్తారు.
మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం..
గిరిజనుల్లోని ఆదివాసీ తెగకు చెందిన మెస్రం వంశీయులకు నాగోబా ఆరాధ్య దైవం. ఏటా పుష్య మాసంలో నాగోబా మహాపూజ, జాతర నిర్వహిస్తారు. నెలవంక కనిపించిన మర్నాడు గంగాజల సేకరణ పాదయాత్రను వంశీయులు చేపడతారు. కలశాల్లో సేకరించిన జలంతోనే నాగోబాకు మహాపూజ రోజు అభిషేకం నిర్వహిస్తారు.
అంతకుముందు ఆలయానికి సమీపంలోని ఇంద్రాదేవికి పూజలు చేసి అక్కడి మర్రిచెట్టు వద్ద బస చేస్తారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయానికి చేరుకుని నాగోబాను అభిషేకించడంతో జాతర మొదలవుతుంది. జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తారు.
నూతన ఆలయంలో..
తొలినాళ్లలో మెస్రం వంశీయులు నాగోబా దేవత వెలిసిన పుణ్య స్థలాన్ని (పుట్ట) మాత్రమే పూజించేవారు. తర్వాత కాలంలో 1956లో గడ్డి పొరకలతో చిన్న గుడిసెను నిర్మించి పూజించేవారు. 1995లో సిమెంట్ ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ఆధునికతను జోడిస్తూ ప్రభుత్వ సహకారంతో మందిరాన్ని నిర్మించారు.
రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో నూతనంగా నిర్మించి 2022 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఈ ఆలయం గర్భగుడి ద్వారమే నాగదేవత పడగ. మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి, పద్ధతులు కళ్లకు కట్టేలా ఆలయ మండపంలోని స్తంభాలపై శిల్పాలు చెక్కారు. ఒకప్పటి గోండ్వానా రాజ్యం చిహ్నాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
నిర్మాణ విశిష్టత..
నాగోబా ఆలయ నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మెస్రం వంశస్తులు ఎవరిపై ఆధారపడకుండా డబ్బులు జమ చేసి రూ.5 కోట్లతో ఈ దేవస్థానాన్ని నిర్మించారు. 2017 నుంచి ఏటా డబ్బులు పోగుచేసి.. ఈ నిర్మాణాన్ని 2022లో పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన శిల్పి తలారి రమేశ్ అక్కడే రాతిపై శిల్పాలు చెక్కిచ్చారు.
వాటిని కేస్లాపూర్‌కు తీసుకొచ్చి ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. కాగా ఆలయం చుట్టూ ప్రాకారం, నాలుగు దిక్కుల్లో రాజగోపురాల నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి అప్పట్లో రూ.6 కోట్లు మంజూరు చేసింది. ఆ నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం నూతనంగా నిర్మించిన ఆలయంలోనే మూడేళ్లుగా జాతర నిర్వహిస్తున్నారు.
అతి ప్రాచీనమైన గోండి ధర్మం..
అతి ప్రాచీనమైన గోండి ధర్మాన్ని ఆచరించే మెస్రం వంశస్తుల మూల పురుషుడు పడియోర్. ‘పాతాళ్ శ్రీ శేకు నాగోబా’వెలిసిన పుణ్య క్షేత్రం కేస్లాపూర్‌లో తరతరాల నుంచి ధర్మ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను కాపాడుతూ.. ముందు తరాలకు సంస్కృతిని అందించే కేంద్రంగా విరజిల్లుతోంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆదివాసీ గోండు తెగలోని మెస్రం వంశీయులకు ప్రత్యేక స్థానం ఉంది.
ఏటా పుష్యమాసం ప్రారంభం నుంచి కఠోర దీక్షలు, నియమనిష్టలు పా టిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్ర గంగాజలం కోసం తెల్లని వస్త్రాలు ధరించి వరుస క్రమంలో కాలినడకన వందల కిలోమీటర్లు పయనిస్తారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి దగ్గర గోదావరిలోని హ స్తినమడుగు నుంచి కలశంలో గంగాజలం సేక రించి తిరుగు పయనమవుతారు. పుష్యమాసం అమావాస్య రోజు నాగోబా మహాదేవుడి అభిషేకం, మహాపూజ కార్యక్రమం నిర్వహిస్తారు.
గిరిజన దర్బార్‌కు ప్రాధాన్యం
నాగోబా జాతరలో గిరిజన దర్బార్‌కు ప్రాధాన్యం ఉంది. 1940లో గిరిజన పోరాట యోధుడు కుమురంభీం వీరమరణం తర్వాత.. అప్పటి నిజాం సర్కార్ గిరిజనుల్లో అసంతృప్తి, తిరుగుబాటుకు కారణాలపై పరిశోధన కోసం మానవ పరిణామ శాస్త్రవేత్త, లండన్‌కు చెందిన హైమన్‌డార్ఫ్‌ను నియమించారు. ఆయన అప్పట్లో తన సతీమణి బెట్టి ఎలిజబిత్‌తో ఇక్కడికి వచ్చి జైనూర్ మండలం మార్లవాయిలో స్థిరపడ్డారు.
ఆయన ఆదివాసీ జీవితాలను పరిశోధించడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గిరిజన ప్రజల కోసం వివిధ విద్య, ఇతర పథకాల అమలుకు కృషి చేశారు. అన్ని దేశీయ సంస్కృతులు, భాషలను సంరక్షించడం కోసం ప్రభుత్వాలకు సూచనలు చేశారు. గిరిజనులు అత్యధికంగా కేస్లాపూర్‌లో కలుస్తారని, 1942 కాలంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అక్కడ గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను ప్రస్తావిస్తారు. అప్పట్లో నిజాం సర్కార్ వరకు ఇవి చేరేవి. దీంతో గిరిజన దర్బార్‌కు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. దేశం కాని దేశం వచ్చి ఇక్కడి గిరిజనుల కోసం విశేషంగా కృషి చేసిన దివంగత హైమన్‌డార్ఫ్, ఆయన సతీమణి బెట్టి ఎలిజబిత్ దంపతుల విగ్రహాలను మార్లవాయి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఏటా ఆ దంపతుల వర్ధంతిని గిరిజనులు నిర్వహిస్తున్నారు.
భవిష్యత్తు తరాలకు తెలియజేస్తాం
నాగోబా ప్రాశస్త్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేస్తాం. పవిత్రమైన ఈ జాతర నిర్వహణలో మెస్రం వంశీయులం పాల్గొంటాం. మూడేళ్ల క్రితం నూతన ఆలయాన్ని ప్రారంభించాం. వంశీయులమంతా డబ్బులు జమ చేసుకుని సొంతంగా ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాం.
Comments
Please login to add a commentAdd a comment