
జాతర మొదలైంది
నాగోబా అంటే మహిళామణుల మహా జాతర దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర ‘నాగోబా’ మహిళలకు పెద్ద పీట వేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో జాతర మొదలైంది. ‘ఈరోజు కోసమే’ అన్నట్లుగా సంవత్సరమంతా ఎదురు చూసిన ఇంద్రవెల్లి కొండలు, కెస్లాపూర్ పరిసరాలు పండగ కళతో వెలిగిపోతున్నాయి. ఈ జాతరలో మహిళలది ప్రేక్షక పాత్ర కాదు. అడుగడుగునా ప్రధాన పాత్ర...
నాగోబా జాతర సందడి మొదలైంది. గిరిజనుల్లోని ఆదివాసీ మెస్రం వంశీయులకు సర్ప దేవుడు ఆరాధ్య దైవం. భక్తిశ్రద్ధలతో ప్రతియేడు పుష్య అమావాస్యలో ఆ దేవుడికి మహాపూజలు అందించడం ద్వారా ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ మహాపూజకు ముందు, వెనకాల జరిగే తంతులలో మెస్రం వంశంలోని మహిళల పాత్రే కీలకం. ఇంటి ఆడపడుచులను అందలం ఎక్కిస్తూనే, ఆ ఇంటికి వచ్చిన కోడళ్లకు అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రతువులో వీరిద్దరి భాగస్వామ్యం మనకు కనిపిస్తుంది.
ఆడపడుచులకు ప్రాధాన్యత
మెస్రం వంశీయులు తమ ఇంటి ఆడపడుచుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. మహాపూజకు ముందు కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులే ముందు ఉంటారు. ముందుగా పురుషులు అందరూ కలిసి నాగోబా ప్రతిమను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. మహిళలు బిందెల్లో నీళ్లు, గుళ్లల్లో ఆవుపేడను తీసుకొస్తారు. ఆలయ ప్రవేశం తర్వాత అందరు కలిసి నాగోబా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సంప్రదాయ పూజలు మొదలుపెడతారు.
ఈ ప్రక్రియలో ఆడపడుచుకు ఎంత విలువ ఇస్తారనేది మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కొత్త కుండలను ఆడపడుచులకు అందజేస్తారు. ఈ కుండలను అందుకున్న ఆడపడుచులు, తమ భర్తతో కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ ఆలయ ఆవరణలోని మర్రిచెట్టు దగ్గర ఉన్న కోనేరు దగ్గరకు వెళ్తారు. అక్కడ కుండల్లో నీళ్లు తీసుకొని అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మెస్రం అల్లుళ్లు పాత పుట్టలను తొలగిస్తారు. ఆపై ఆడపడుచులు పుట్టమట్టి, ఆవుపేడ, కోనేరు నుంచి తీసుకొచ్చిన జలంతో కలిపి కొత్త పుట్టలను తయారు చేస్తారు.
కొత్త కోడళ్లు వస్తారు
నాగోబా మహాపూజ ముగిసిన తర్వాత అర్ధరాత్రి మరో ముఖ్యమైన ఘట్టం ఈ కత్రువులో ఆవిష్కృతం అవుతుంది. ఇంటి ఆడపడుచును ఏవిధంగా ఆరాధిస్తారో ఆ ఇంటి గడపకు వచ్చిన కోడళ్లకు కూడా అంతే విలువ ఇస్తారు అనడానికి ఈ ప్రక్రియ నిదర్శనంగా నిలుస్తుంది. నాగోబా సన్నిధికి వచ్చే కొత్త కోడళ్లు మొదట సతీ దేవతకు పూజలు చేస్తారు. తరువాత మెస్రం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆపై నాగోబా దేవుడిని దర్శించుకుంటారు. దీన్ని మెస్రం వంశీయులు ‘భేటింగ్’గా సంబోధిస్తారు. అర్ధరాత్రి మొదలయ్యే ఈ తంతు తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ భేటింగ్ తర్వాతనే ఆ కొత్త కోడళ్లు నాగోబా దర్శనానికి ఎప్పుడైనా వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
ఎప్పుడు వచ్చినా కొత్తగానే..
‘కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులను, అల్లుళ్లను భాగస్వాములను చేస్తాం. వ్యవస్థలో మహిళలు, పురుషులకు సమ్రపాధాన్యత అనేది ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది. కొత్త కోడళ్లు దేవుడి దర్శనం ద్వారా మా సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుసుకుంటారనేదే ఈ కార్యంప్రాధాన్యత’ అంటున్నాడు ఉట్నూర్‌కు చెందిన మెస్రం మనోహర్.
‘నాగోబా జాతరకు ఎన్నోసార్లు వచ్చాను. విశేషం ఏమిటంటే ఎప్పుడు వచ్చినా కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విశేషం తెలుసుకుంటూనే ఉంటాను. నాగోబా జాతర అంటే మహిళలకుప్రాధాన్యత ఇచ్చే మహా జాతర’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన గిరిజ.
‘నాగోబా’ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. తరగని మౌఖిక కథలు ఉన్నాయి. అన్నింట్లో మహిళ మహారాణిగా, మíßమాన్వితంగా వెలిగిపోతూనే ఉంటుంది. అదే ఈ మహ జాతర ప్రత్యేకత. పవిత్రత.
– గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్
ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment