ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో గతనెల 31న మహాపూజతో ప్రారంభమైన ఆదివాసీల నాగోబా జాతర ఘనంగా కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా మెస్రం వంశీయులు శుక్రవారం బేతాళ్, మండగాజిలింగ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దల కాళ్లు కడిగి ఆహ్వానం పలికారు. ఆదివాసుల ఆనవాయితీ ప్రకారం ప్రధాన్ (పటడి)లకు మెస్రం వంశీయులు, మహిళలు, కోడళ్లు బుందో(కానుకలు) సమర్పించారు.
తర్వాత వంశ పెద్దలు వెదురు కర్ర పట్టుకుని బేతాళ్ నృత్యాలు చేశారు. కోడళ్లు, మహిళలు, మెస్రం వంశీయులు సంప్రదాయ నృత్యాలు చేశారు. సాయంత్రం వాయిద్యాలు వాయిస్తూ అందరూ నాగోబాను దర్శించుకుని సంప్రదాయ పూజలను ముగించారు. ఈ పూజల్లో మెస్రం వంశం పటేల్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, మెస్రం వంశం పెద్దలు మెస్రం చిన్ను పటేల్, కటోడ మెస్రం కోసేరావ్, మెస్రం బాదిపటేల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment