mesram descendants
-
నాగోబా వైభవం: ఆడపడుచులు... కొత్తకోడళ్లు
నాగోబా అంటే మహిళామణుల మహా జాతర దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర ‘నాగోబా’ మహిళలకు పెద్ద పీట వేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో జాతర మొదలైంది. ‘ఈరోజు కోసమే’ అన్నట్లుగా సంవత్సరమంతా ఎదురు చూసిన ఇంద్రవెల్లి కొండలు, కెస్లాపూర్ పరిసరాలు పండగ కళతో వెలిగిపోతున్నాయి. ఈ జాతరలో మహిళలది ప్రేక్షక పాత్ర కాదు. అడుగడుగునా ప్రధాన పాత్ర...నాగోబా జాతర సందడి మొదలైంది. గిరిజనుల్లోని ఆదివాసీ మెస్రం వంశీయులకు సర్ప దేవుడు ఆరాధ్య దైవం. భక్తిశ్రద్ధలతో ప్రతియేడు పుష్య అమావాస్యలో ఆ దేవుడికి మహాపూజలు అందించడం ద్వారా ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ మహాపూజకు ముందు, వెనకాల జరిగే తంతులలో మెస్రం వంశంలోని మహిళల పాత్రే కీలకం. ఇంటి ఆడపడుచులను అందలం ఎక్కిస్తూనే, ఆ ఇంటికి వచ్చిన కోడళ్లకు అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రతువులో వీరిద్దరి భాగస్వామ్యం మనకు కనిపిస్తుంది.ఆడపడుచులకు ప్రాధాన్యతమెస్రం వంశీయులు తమ ఇంటి ఆడపడుచుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. మహాపూజకు ముందు కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులే ముందు ఉంటారు. ముందుగా పురుషులు అందరూ కలిసి నాగోబా ప్రతిమను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. మహిళలు బిందెల్లో నీళ్లు, గుళ్లల్లో ఆవుపేడను తీసుకొస్తారు. ఆలయ ప్రవేశం తర్వాత అందరు కలిసి నాగోబా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సంప్రదాయ పూజలు మొదలుపెడతారు. ఈ ప్రక్రియలో ఆడపడుచుకు ఎంత విలువ ఇస్తారనేది మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కొత్త కుండలను ఆడపడుచులకు అందజేస్తారు. ఈ కుండలను అందుకున్న ఆడపడుచులు, తమ భర్తతో కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ ఆలయ ఆవరణలోని మర్రిచెట్టు దగ్గర ఉన్న కోనేరు దగ్గరకు వెళ్తారు. అక్కడ కుండల్లో నీళ్లు తీసుకొని అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మెస్రం అల్లుళ్లు పాత పుట్టలను తొలగిస్తారు. ఆపై ఆడపడుచులు పుట్టమట్టి, ఆవుపేడ, కోనేరు నుంచి తీసుకొచ్చిన జలంతో కలిపి కొత్త పుట్టలను తయారు చేస్తారు.కొత్త కోడళ్లు వస్తారునాగోబా మహాపూజ ముగిసిన తర్వాత అర్ధరాత్రి మరో ముఖ్యమైన ఘట్టం ఈ కత్రువులో ఆవిష్కృతం అవుతుంది. ఇంటి ఆడపడుచును ఏవిధంగా ఆరాధిస్తారో ఆ ఇంటి గడపకు వచ్చిన కోడళ్లకు కూడా అంతే విలువ ఇస్తారు అనడానికి ఈ ప్రక్రియ నిదర్శనంగా నిలుస్తుంది. నాగోబా సన్నిధికి వచ్చే కొత్త కోడళ్లు మొదట సతీ దేవతకు పూజలు చేస్తారు. తరువాత మెస్రం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆపై నాగోబా దేవుడిని దర్శించుకుంటారు. దీన్ని మెస్రం వంశీయులు ‘భేటింగ్’గా సంబోధిస్తారు. అర్ధరాత్రి మొదలయ్యే ఈ తంతు తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ భేటింగ్ తర్వాతనే ఆ కొత్త కోడళ్లు నాగోబా దర్శనానికి ఎప్పుడైనా వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.ఎప్పుడు వచ్చినా కొత్తగానే..‘కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులను, అల్లుళ్లను భాగస్వాములను చేస్తాం. వ్యవస్థలో మహిళలు, పురుషులకు సమ్రపాధాన్యత అనేది ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది. కొత్త కోడళ్లు దేవుడి దర్శనం ద్వారా మా సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుసుకుంటారనేదే ఈ కార్యంప్రాధాన్యత’ అంటున్నాడు ఉట్నూర్‌కు చెందిన మెస్రం మనోహర్.‘నాగోబా జాతరకు ఎన్నోసార్లు వచ్చాను. విశేషం ఏమిటంటే ఎప్పుడు వచ్చినా కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విశేషం తెలుసుకుంటూనే ఉంటాను. నాగోబా జాతర అంటే మహిళలకుప్రాధాన్యత ఇచ్చే మహా జాతర’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన గిరిజ.‘నాగోబా’ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. తరగని మౌఖిక కథలు ఉన్నాయి. అన్నింట్లో మహిళ మహారాణిగా, మíßమాన్వితంగా వెలిగిపోతూనే ఉంటుంది. అదే ఈ మహ జాతర ప్రత్యేకత. పవిత్రత. – గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి. -
నాగోబాకు మహాపూజలు
సాక్షి, ఆదిలాబాద్: నాగోబా మహాపూజలందుకుంది. తమ ఆరాధ్య దైవాన్ని మెస్రం వంశీయులు భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం ఇందుకు వేదికైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు పురుషులు కలిసికట్టుగా కాలినడకన బయల్దేరి నాగోబా ప్రతిమను ఊరేగిస్తూ సంప్రదాయ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. వారు ధోవతి, చొక్కా, మెడలో కండువా, తలపాగతో పైనుంచి కింది వరకు తెల్లని వ్రస్తాలు ధరించారు. మహిళలు సంప్రదాయ వ్రస్తాలు ధరించి చ్చిచనా, భుజం పైనుంచి తెల్లని వస్త్రాన్ని కప్పుకొని తలపై బిందెల్లో నీళ్లతో అందరూ కలిసికట్టుగా వచ్చారు. మురాడి నుంచి మెస్రం వంశీయులు ఇలా వేలాదిగా ఆలయానికి చేరుకుంటున్న ఘట్టం కన్నుల పండువగా సాగింది. కొత్త కుండలు అందజేత ఆలయానికి చేరుకున్న తర్వాత మెస్రం వంశీయులు తమ సంప్రదాయ పూజలు మొదలుపెట్టారు. మొదటగా మెస్రం పెద్దలు 22 కితల్లోని మహిళలు, ఆడపడుచులకు కొత్త కుండలను అందజేయగా, ఆడపడుచులు, మహిళలు, అల్లుళ్లు కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ వెళ్లి కోనేరు వద్దకు చేరుకున్నారు. అక్కడ జలాన్ని సేకరించి అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత మెస్రం అల్లుళ్లు పాత పుట్టలను తొలగించారు. ఆపై ఆడపడుచులు, మహిళలు పుట్ట మట్టి, పశువుల పేడ, కోనేరు నుంచి తీసుకొచ్చిన జలంతో కొత్త పుట్టలను తయారు చేశారు. ఇలా ఒక్కో ఘట్టంలో వారి సంప్రదాయం, ఆచార వ్యవహారాలు కొట్టొచి్చనట్టుగా కనిపించాయి. నాగోబా ఆలయంలోని బౌల సతీ దేవత ముందు ఏడు వరుసలతో తయారు చేసిన దేవతామూర్తులను ఉంచారు. రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య నాగోబాకు మహాపూజ నిర్వహించారు. కొద్ది రోజుల ముందు పాదయాత్రగా వెళ్లి గోదావరినది నుంచి కలశాల్లో తీసుకొచి్చన పవిత్ర జలంతో పూజలు చేశారు. ఇలా ఉదయం నుంచి సంప్రదాయ పూజలు, రాత్రి మహాపూజ నిర్వహించి నాగోబా జాతరను మొదలుపెట్టారు. అర్ధరాత్రి కొత్త కోడళ్ల భేటింగ్ మహాపూజ అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత తమ సంప్రదాయ పద్ధతిలో మెస్రం వంశీయులు భేటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కొత్త కోడళ్ల పరిచయమే ఈ భేటింగ్. కొత్త కోడళ్లు నాగోబా సన్నిధికి వస్తారు. ఈ సన్నిధికి వచ్చిన తర్వాతే వారు తమ సంప్రదాయ పూజల్లో నిరంతరం పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఇలా మెస్రం వంశీయులు చేపట్టే ఈ కార్యక్రమంలో వారి ఆచార వ్యవహారాలు నిండుగా కనిపిస్తాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మహాపూజలో పాల్గొన్నారు. జాతరకు పలు రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. -
‘నాగోబా’ ప్రచార యాత్రకు శ్రీకారం
ఇంద్రవెల్లి/సిరికొండ: ప్రచార రథాన్ని ప్రారంభించి నాగోబా జాతరకు మెస్రం వంశీయు లు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌కు మెస్రం వంశీయులు భారీగా తరలివచ్చారు. నాగోబా మురాడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ సమక్షంలో కటోడ మెస్రం కోసేరావ్, పర్ధాన్ దాదారావ్ల ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు.ఏడు రోజుల పాటు మెస్రం వంశీయులు ఉన్న గ్రామాల్లో ప్రచా రం చేపడతారు. ఇందులో భాగంగా తొ లిరోజు సిరికొండ మండలకేంద్రంలోని కుమ్మరిస్వామి వద్ద మహాపూజకు అవసరమయ్యే కుండల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. అక్కడి నుంచి అదే మండలంలోని రాజన్పేట్కు చేరుకొని తమ వంశీయుల ఇళ్ల వద్ద రాత్రి బస చేశారు. ఇలా రోజుకో ఊరిలో బస చేస్తూ, ఈనెల 10న ఉదయం కేస్లాపూర్‌లోని నాగోబా మురాడి వద్దకు తిరిగి చేరుకుంటా రు. అదే రోజున పవిత్ర గంగా జల సేకరణకు పాదయాత్ర ప్రారంభిస్తామని వెంకట్రావ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి హస్తినమడుగు వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడి నుంచి పవిత్ర గంగాజలం తీసుకొస్తారు. ఆ గంగాజలంతో ఈనెల 28న నాగోబాను అభిషేకించి జాతరను ప్రారంభిస్తామని వెంకట్రావ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశపెద్దలు చిన్ను, బాదిరావ్, హనుమంత్‌రావ్, కోసేరావ్, తుకారాం, దాదారావ్, తిరుపతి, వంశ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రచారం రథంజాతర నిర్వహణలో ప్రచార రథానికి (చకడ) ప్రత్యేకత ఉంది. దీనికి పదేళ్ల తర్వాత సొబగులు అద్దారు. నార్నూర్ మండలం గుండల గ్రామానికి చెందిన మెస్రం మల్కు ఆధ్వర్యంలో కొంతమంది కొలాంల సహకారంతో కొత్తగా నాగోబా ప్రతిమతో కూడిన జడపతోపాటు జువ్వను అమర్చారు. శుక్రవారం కేస్లాపూర్‌కు తీసుకొచి్చన దీనిని మెస్రం వంశీయులు ఆసక్తిగా తిలకించారు. -
Nagoba Jatara: కొత్త కోడళ్ల భేటింగ్
ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల పూజలు కొనసాగుతున్నాయి. కొత్త కోడళ్ల భేటింగ్ ఆదివారం వేకువజాము వరకు కొనసాగింది. ముందుగా ఆలయ సమీపంలోని గోవడ్ వద్ద బస చేసిన మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయ వాయిద్యాలతో ఆలయానికి చేరుకున్నారు. 190 మంది కొత్త కోడళ్లు సతీదేవత ఆలయంలో పూజల అనంతరం భేటింగ్ (పరిచయం)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఉదయం కోనేరు నుంచి పవిత్ర జలాన్ని గోవడ్ వద్దకు తీసుకువచ్చారు. ఆ నీటితో నైవేద్యం తయారు చేసి నాగోబా, సతీదేవతలకు సమర్పించారు. ఈ ప్రక్రియ అనంతరం వారంతా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. అనంతరం కొత్తకోడళ్లు దీక్ష విరమించారు. ఆదివారం జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈనెల 28 వరకు జాతర కొనసాగుతుందని ఈవో రాజమౌళి, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం తెలిపారు. -
మొదలైన ‘నాగోబా’ జాతర.. ఆదివాసీలతో జనసంద్రంగా మారిన కేస్లాపూర్
ఇంద్రవెల్లి/ఉట్నూర్(ఖానాపూర్): ఆదివాసీలు గూడేలు వీడెను. నాగోబా నీడన చేరెను. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. మూడురోజులుగా వడమర(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు తూమ్ పూజలు(చనిపోయిన వారికి కర్మకాండలు) నిర్వహించి శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. పుష్య అమావాస్య అర్థరాత్రి పవిత్ర గంగాజలాలతో నాగోబాను అభిషేకించిన అనంతరం జాతర ప్రారంభమైంది. మెస్రం వంశీయులు ఉదయం నుంచి ఆచార సంప్రదాయాలు పాటిస్తూ నాగోబాను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ సమీపంలోని వడమర వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు, పెద్దలు(పటేళ్లు) శనివారం తెల్లవారుజామున 84 మందికి తూమ్ నిర్వహించారు. శనివారం నాగేంద్రుడి విగ్రహంతో నియమనిష్టలు, వాయిద్య చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకున్నారు. సిరికొండ మండల కేంద్రం నుంచి తెప్పించిన మట్టికుండలకు మెస్రం పెద్దలు పూజలు నిర్వహించారు. మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన ఆడపడుచులు పెద్దలకు, పూజారులకు పాదాభివందనం చేస్తూ నాయక్పాడ్ నుంచి మట్టికుండలు స్వీకరించారు. అనంతరం వడమర సమీపంలోని కోనేరు నుంచి పవిత్రజలాలను నాగోబా సన్నిధికి తెచ్చారు. గతేడాది నిర్మించిన మట్టిపుట్టలను మెస్రం వంశ అల్లుళ్లు తొలగించగా దానిస్థానంలో కొత్తగా పుట్టలను తయారు చేశారు. మట్టి ఉండలను మహిళలు చేతుల మీదుగా తరలించి సతిదేవతల ఎదుట మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మెస్రం వంశీయులు గోవాడా (గుండ్రంగా గోడకట్టి ఉండే ప్రదేశం) చేరుకుని విడిది చేశారు. మహాపూజకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాగా జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనేతరులు భారీగా తరలివచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాగోబా జాతర నిర్వహణకు తొలి అడుగు
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర నిర్వహణకు తొలి అడుగు పడింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించే నాగోబా మహా పూజకు గంగాజలం కోసం మెస్రం వంశీయులు ఆదివారం బయల్దేరి వెళ్లారు. ఏడు రోజులపాటు మెస్రం వంశీయులున్న గ్రామాల్లో నాగోబా మహాపూజ, గంగాజలం సేకరణపై ప్రచారం నిర్వహించి కేస్లాపూర్ చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు అదివారం కేస్లాపూర్ గ్రామానికి చేరి నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ ఆధ్వర్యంలో సమావేశమై గంగాజలం పాదయాత్ర, నాగోబా మహాపూజ నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఝరి (కలశం) దేవతకు మెస్రం వంశీయులు, మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం గంగాజలం సేకరణ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు బుందో పట్టగా... మెస్రం వంశీయులు కానుకలు వేసి ముందుకు సాగారు. -
నాగోబా మహాపూజ ప్రచారయాత్ర షురూ
ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా మహాపూజకు తొలి అడుగుపడింది. జనవరి 21న నిర్వహించనున్న మహాపూజలో భాగంలో సోమవారం ప్రచారయాత్ర ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలివచ్చిన మెస్రం వంశీయులు కేస్లాపూర్‌లోని మురాడి వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రచారయాత్ర, గంగాజల యాత్ర, మహాపూజ, జాతర నిర్వహణపై చర్చించారు. అనంతరం పూజలు చేసి ప్రచారరథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాథోడ్ జనార్దన్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, మెస్రం వంశ పెద్దలు పాల్గొన్నారు. –ఇంద్రవెల్లి -
ఘనంగా నాగోబా నూతనాలయ ప్రారంభం
ఇంద్రవెల్లి: మెస్రం వంశీయులు రూ. 5 కోట్ల సొంత నిధులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నూతనంగా నిర్మించిన నాగోబా ఆలయ ప్రారంభోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వేకువజామున 4:30 గంటలకు కొడప వినాయక్‌రావ్, ఆత్రం పురుషోత్తం మహారాజ్ ఆధ్వర్యంలో నాగోబా విగ్రహంతోపాటు సతీదేవతల విగ్రహాల ప్రతిష్టాపన, కలశాల ఆవిష్కరణ జరిగింది. ముందుగా వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాల్లో విగ్రహాలను శుద్ధిచేసి ప్రతిష్టించారు. అనంతరం మెస్రం వంశీయులు హోమం నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి ప్రారంభోత్సవ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖానాయక్, ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారిని మెస్రం వంశీయులు సన్మానించారు. వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి మెస్రం వంశీయులు, ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మెస్రం యువకులు ఏర్పాట్లను పర్యవేక్షించగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
నాగోబా నూతన ఆలయ ప్రారంభోత్సవం
సాక్షి,ఆదిలాబాద్/ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివారం మెస్రం వంశీయులు కొత్తగా నిర్మించిన నాగోబా ఆలయం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా నూతనంగా తీర్చిదిద్దిన నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గత సోమవారం ప్రారంభమైన ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు తుది అంకానికి చేరాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి తదితరులు శనివారం జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తొలుత పుట్టకే పూజలు.. తొలినాళ్లలో మెస్రం వంశీయులు నాగోబా దేవత వెలిసిన పుణ్య స్థలం (పుట్ట)ను మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డి పరకలతో చిన్న గుడిసెను నిర్మించి పూజించారు. 1995లో సిమెంట్, ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో మందిరాన్ని నిర్మించారు. ప్రస్తుతం శిలలతో నూతన ఆలయాన్ని నిర్మించారు. పుష్య మాసంలో మెస్రం వంశీయులు నిర్వహించే నాగోబా జాతర రాష్ట్రంలో గిరిజన జాతరల్లో రెండో అతి పెద్దది. సొంతంగా చందాలతో.. నాగోబా ఆలయ నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మెస్రం వంశంలోని 22 కితల (తెగల) వంశస్తులు ఎవరిపై ఆధారపడకుండా తమకు తాముగా చందాల రూపంలో డబ్బులు జమ చేసి రూ.5 కోట్లతో ఈ దేవస్థానాన్ని నిర్మించారు. ఈ వంశంలోని రైతు కుటుంబం నుంచి ఏడాదికి రూ.5 వేలు, ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు, రాజకీయ నాయకుల నుంచి రూ.10 వేల నుంచి ఆపైన నిధులు సేకరించారు. ఇ లా 2017 నుంచి ఏటా డబ్బులు పోగుచేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కాగా ఆలయం చుట్టూ ప్రాకారం, నాలుగు దిక్కులా రాజగోపురాల నిర్మాణానికి దేవాదాయ శాఖ రూ.6 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం నిర్మాణ పనులు తుదిదశకు వచ్చాయి. ఆలయ నిర్మాణం ఇలా.. గర్భగుడి ద్వారాన్ని నాగదేవత పడగ రూపంలో తయారు చేశారు. ఆదివాసీల్లోని ఒక తెగ అయిన మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి, పద్ధతులను మనకు కళ్లకు కట్టినట్లు ఆ ఆలయ మండపంలో స్తంభాలపై చెక్కిన శిల్పాలు వివరిస్తాయి. ఒకప్పటి గోండ్వానా రాజ్య చిహ్నాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన శిల్పి తలారి రమేశ్ అక్కడే రాతిపై శిల్పాలు చెక్కారు. తర్వాత వాటిని కేస్లాపూర్‌కు తీసుకొచ్చి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. -
నాగోబా ఆలయ ఉద్ఘాటన షురూ
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో మెస్రం వంశీయులు తమ సొంత నిధులతో పునర్నిర్మించుకున్న నాగోబా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. ఆలయ పీఠాధి పతి మెస్రం వెంకట్రావ్ ఆధ్వర్యంలో ఈ వంశస్తులు దీప, నైవేద్యాలతో ఆలయానికి చేరుకున్నారు. ఆదివాసీ వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. బోథ్ బాబ్డే గ్రామానికి చెందిన పురుషోత్తం, ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహారాజ్ కొడప వినాయక్‌రావ్ ఆధ్వర్యంలో నవగ్రహ పూజ నిర్వహించారు. ఆలయానికి చేరిన పవిత్ర జలం: ఈనెల 18న చేపట్టనున్న ఆలయ శుద్ధి కోసం ఐదు ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్ర జలాలను గుడి వద్దకు తీసుకువచ్చారు. కెరమెరి మండలంలోని వజ్జకస్సా, జన్నారం మండలం వద్ద గోదావరి నదిలోని హస్తినమడుగు, గుడిహత్నూర్ మండలంలోని పులికహ్చర్, బేల మండలంలోని పెందల్వాడ, ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయం కోనేరు నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చినట్లు వెంకట్రావ్ తెలిపారు. -
మెస్రం బేతాళ్ నృత్యం
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో గతనెల 31న మహాపూజతో ప్రారంభమైన ఆదివాసీల నాగోబా జాతర ఘనంగా కొనసాగుతోంది. వేడుకల్లో భాగంగా మెస్రం వంశీయులు శుక్రవారం బేతాళ్, మండగాజిలింగ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దల కాళ్లు కడిగి ఆహ్వానం పలికారు. ఆదివాసుల ఆనవాయితీ ప్రకారం ప్రధాన్ (పటడి)లకు మెస్రం వంశీయులు, మహిళలు, కోడళ్లు బుందో(కానుకలు) సమర్పించారు. తర్వాత వంశ పెద్దలు వెదురు కర్ర పట్టుకుని బేతాళ్ నృత్యాలు చేశారు. కోడళ్లు, మహిళలు, మెస్రం వంశీయులు సంప్రదాయ నృత్యాలు చేశారు. సాయంత్రం వాయిద్యాలు వాయిస్తూ అందరూ నాగోబాను దర్శించుకుని సంప్రదాయ పూజలను ముగించారు. ఈ పూజల్లో మెస్రం వంశం పటేల్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, మెస్రం వంశం పెద్దలు మెస్రం చిన్ను పటేల్, కటోడ మెస్రం కోసేరావ్, మెస్రం బాదిపటేల్ తదితరులు పాల్గొన్నారు. -
38 మంది కొత్త కోడళ్లకు భేటింగ్
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి నాగోబాకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి ఘనంగా పూజలు చేశారు. మెస్రం వంశంలోని 38 మంది కొత్త కోడళ్లను భేటింగ్ చేయించారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టిన చొంగ్తూ నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, జాతర నిర్వహణ, అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలు సుకున్నారు. ఆదివాసీలు జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి వెలుగులు నింపిన హైమన్‌డార్ఫ్ శిష్యుడు మైకెల్ యోర్క్, మైకెల్ వాలరీ నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు వారికి అతిథి మర్యాదలు చేసి శాలువాలతో సన్మానించారు. మైకెల్ యోర్క్ దంపతులు గోడవ్ వద్ద బస చేసిన మెస్రం వంశీయులను గోండి భాషలో పలకరించి సందడి చేశారు. మైకెల్యోర్క్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంటోంది. -
నేడే నాగోబాకు మహాపూజ
ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబాకు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి మహాపూజ నిర్వహించనున్నారు. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా ఈ మహాపూజ నిర్వహించేందుకు మెస్రం వంశీయులు సర్వం సిద్ధం చేశారు. మెస్రం వంశీయుల మహాపూజలతో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 10 వరకు అధికారికంగా..15 వరకు అనధికారికంగా జాతర జరగనుంది. గోదావరి నది హస్తిన మడుగు నుంచి పవిత్ర గంగాజలం తీసుకొని కాలినడకన మెస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్ మర్రిచెట్టు (వడమర్ర)వద్దకు చేరుకున్నారు. అక్కడ వారి సంప్రదాయం ప్రకారం మెస్రం వంశం లో మృతి చెందిన 91 మంది పేరిట ‘తుమ్’పూజలను ఆదివారం తెల్లవారు జామున నిర్వహించారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకొని మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు సోమవా రం ఉదయం నాగోబా ఆలయానికి చేరుకొని పూజలు చేయనున్నారు. మహాపూజ అనంతరం అతిథులుగా వచ్చే జిల్లా స్థాయి అధికారులు, ఇతర ప్రముఖులు ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తారు. మహాపూజ చేసిన మెస్రం వంశీయులు సోమ వారం రాత్రి ఒంటి గంట నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు భేటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు నాగోబా సన్నిధికి రాని మె స్రం వంశం కోడళ్లను నాగోబా దర్శనం చేయించి వారి వంశం పెద్దలను పరిచయం చేసి ఆశీస్సులు అందజేస్తారు. ఈ భేటింగ్‌తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్టు భావిస్తారు. ఈ కార్యక్రమాలతో కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభమైనట్లు పెద్దలు ప్రకటిస్తారు. సామాజిక శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్ శిష్యు డు మైకేల్ యోర్క్ జాతరకు రానున్నారు. -
మార్చి 7న నాగోబా జాతర
గంగాజలం కోసం బయల్దేరిన మెస్రం వంశీయులు ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నాగోబా జాతర మహాపూజలకు అవసరమయ్యే గంగాజలం తీసుకొచ్చేందుకు బుధవారం మెస్రం వంశీయులు బయలుదేరి వెళ్లారు. గంగాజలం సేకరించే ఝారీ (కలషం) దేవతకు సంప్రదాయపూజలు చేశారు. తర్వాత కాలినడకన యాత్రను ప్రారంభించారు. బుధవారంరాత్రి మండలంలోని వడగామ్ పొలిమేరలో బస చేయగా గురువారం ఉట్నూర్ మండలం సాలేవాడ, 22న అస్నాపూర్, 23న జైనూర్ మండలంలోని గౌరి, 24న సిర్పూర్ మండలంలోని కోహినూర్, 25న కడెం మండలం ఇస్లాపూర్, 26న జన్నారం మండలం కలమడుగు, 27న గోదావరి హస్తిన మడుగుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి గంగాజలం సేకరిస్తారు. తిరుగు ప్రయాణంలో 28న సిర్పూర్ మండలం దన్నోర, 29న జైనూర్ మండలం గౌరి గ్రామాల్లో బస చేస్తారు. ఫిబ్రవరి 3న ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి అదేరోజు సాయంత్రం నుంచి ఆరో తేదీ వరకు కేస్లాపూర్ పొలిమేరలోని మర్రి చెట్టు వద్ద బస చేస్తారు. ఇంకా వివిధ గ్రామాల నుంచి మెస్రం వంశీయులు అక్కడికి చేరుకుంటారు. 7న ప్రత్యేక పూజలు చేసి అదేరోజు రాత్రి పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రిని పురస్కరించుకుని సేకరించిన గంగాజలంతో నాగోబాకు మహాపూజలు చేస్తారు. తర్వాత నాగోబా జాతరను ప్రారంభిస్తారు.