ఆలయంలో పూజలు చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి తదితరులు, ప్రారంభోత్సవానికి సిద్ధమైన నాగోబా నూతన దేవాలయం
సాక్షి,ఆదిలాబాద్/ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివారం మెస్రం వంశీయులు కొత్తగా నిర్మించిన నాగోబా ఆలయం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా నూతనంగా తీర్చిదిద్దిన నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గత సోమవారం ప్రారంభమైన ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు తుది అంకానికి చేరాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి తదితరులు శనివారం జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
తొలుత పుట్టకే పూజలు..
తొలినాళ్లలో మెస్రం వంశీయులు నాగోబా దేవత వెలిసిన పుణ్య స్థలం (పుట్ట)ను మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డి పరకలతో చిన్న గుడిసెను నిర్మించి పూజించారు. 1995లో సిమెంట్, ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో మందిరాన్ని నిర్మించారు. ప్రస్తుతం శిలలతో నూతన ఆలయాన్ని నిర్మించారు. పుష్య మాసంలో మెస్రం వంశీయులు నిర్వహించే నాగోబా జాతర రాష్ట్రంలో గిరిజన జాతరల్లో రెండో అతి పెద్దది.
సొంతంగా చందాలతో..
నాగోబా ఆలయ నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మెస్రం వంశంలోని 22 కితల (తెగల) వంశస్తులు ఎవరిపై ఆధారపడకుండా తమకు తాముగా చందాల రూపంలో డబ్బులు జమ చేసి రూ.5 కోట్లతో ఈ దేవస్థానాన్ని నిర్మించారు. ఈ వంశంలోని రైతు కుటుంబం నుంచి ఏడాదికి రూ.5 వేలు, ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు, రాజకీయ నాయకుల నుంచి రూ.10 వేల నుంచి ఆపైన నిధులు సేకరించారు.
ఇ లా 2017 నుంచి ఏటా డబ్బులు పోగుచేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కాగా ఆలయం చుట్టూ ప్రాకారం, నాలుగు దిక్కులా రాజగోపురాల నిర్మాణానికి దేవాదాయ శాఖ రూ.6 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం నిర్మాణ పనులు తుదిదశకు వచ్చాయి.
ఆలయ నిర్మాణం ఇలా..
గర్భగుడి ద్వారాన్ని నాగదేవత పడగ రూపంలో తయారు చేశారు. ఆదివాసీల్లోని ఒక తెగ అయిన మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి, పద్ధతులను మనకు కళ్లకు కట్టినట్లు ఆ ఆలయ మండపంలో స్తంభాలపై చెక్కిన శిల్పాలు వివరిస్తాయి. ఒకప్పటి గోండ్వానా రాజ్య చిహ్నాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన శిల్పి తలారి రమేశ్ అక్కడే రాతిపై శిల్పాలు చెక్కారు. తర్వాత వాటిని కేస్లాపూర్‌కు తీసుకొచ్చి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment