Nagoba Temple
-
కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే దమ్ముందా?: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, ఆదిలాబాద్: తన పాలనలో కేసీఆర్ ఏనాడూ ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించలేదని.. ఆలోచించి ఉంటే ఇవాళ నాగోబా ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చేదని నిలదీశారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి. శుక్రవారం సాయంత్రం ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన.. వేదిక నుంచి బీఆర్ఎస్పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఈ వేదిక సాక్షిగా చెబుతున్నా.. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటాం. ఈ అడవి బిడ్డల ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. తప్పకుండా ఆదివాసీ కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం. ఇందిరమ్మ సోనియా రాజ్యం తెచ్చుకుంటాం. కేసీఆర్‌నును నేరుగా అడుగుతున్నా. ఎప్పుడైనా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా?. నిజంగా అభివృద్ధి చేస్తే ఎందుకు నీళ్ళ కోసం నాగోబా గుడి కోసం రోడ్ల కోసం నిధులు మేము ఇచ్చే పరిస్తితి ఎందుకు వచ్చింది. చెరుకు పంటలో అడవి పందులు ఏ విధంగా దాడి చేస్తాయో అదే విధంగా తెలంగాణ పై కేసీఆర్ కుటుంబం దాడి చేసి విధ్వంసం చేశారు. .. ఎంత సేపు నీ బిడ్డలు నీ ఫామ్ హౌజ్ లు తప్ప.. రాష్ట్రంలోని బిడ్డల కోసం ఆలోచించావా?. కవిత ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చావు. మరి స్టాఫ్ నర్సులు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చావా? అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బిల్లా రంగాలు(కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశిస్తూ..) ఎంత శాప నార్ధాలు పెట్టినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాదే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎవడ్రా కూల్చేది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే శాప నార్డాలు పెడుతున్నారు. మరి 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు మీరు?. ప్రభుత్వం కూలి పోతుంది అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా?. ఎవడ్రా కూల్చేది?. ప్రజల్లారా.. మీరు ఊరుకుంటారా?. చెట్లకు కట్టేసి భరతం పట్టండి. కేసీఆర్ పాపాల భైరవుడు. మళ్లీ జీవితంలో సీఎం కారు. మూడు నెలలకో, ఆరు నెలలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని ఎవరైనా అంటే పళ్లు రాలగొడతాం. .. ఆరేడు ఎంపీ సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. వస్తే మోదీకి అమ్ముకుందాం అనా?. దేశంలో ఉన్నవి రెండే కూటములు. ఒకటి మోదీ కూటమి.. రెండోది ఇండియా కూటమి. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి రానివ్వం. ఆ ఇంటి పిట్టను ఈ ఇంటి మీద వాలితే కాల్చి పారేస్తాం. మోదీ కేడీ(కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ..) ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. మళ్లీ మతం పేరుతో వాళ్లు ఎన్నికలకు వస్తున్నారు. మోదీ ఎవరి ఖాతాలో అయినా రూ.15 లక్షలు జమ చేశారా? సోయంబాపురావుకు కనీసం కేంద్ర మంత్రి కూడా ఇవ్వలేకపోయారు. అలాంటప్పుడు ఓటేందుకు వేయాలి?. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురాలి. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి’’ అని ప్రజల్ని కోరారాయన. కడెం మరమ్మత్తుల బాధ్యత మాది కోటి ఎకరాలకు నీళ్లు అన్నావ్? వస్తావా కేసీఆర్ ఆదిలాబాద్‌ను చూపిస్తాం. హెలికాఫ్టర్ పెడతాం.. ఎక్కడ నీళ్లు ఇచ్చావో చూపించు అని కేసీఆర్‌పై రేవంత్ ధ్వజమెత్తారు. ఇక.. తెలంగాణలో మహిళలకు రూ. 500 కు సిలిండర్ గ్యాస్ అందించే పథకం త్వరలోనే అమలు చేస్తామని.. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే అమలు చేస్తామని రేవంత్ అన్నారు. ‘‘తుమ్మిడి హిట్టి వద్ద ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేసే బాధ్యత మాది’’ అని రేవంత్ ప్రకటించారు. త్వరలోనే ఆ రెండు హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు హామీల అమలులో భాగంగా.. త్వరలో రెండింటిని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో మాట్లాడరు. ఈ సందర్భంగా.. అతిత్వరలోనే రూ.500కి గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించారు. మరికాసేపట్లో ఇంద్రవెల్లి అమరుల స్థూపానికి గౌరవ వందనం సమర్పించి.. అక్కడి సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ఆయన ప్రసంగిస్తారు. ప్రత్యేక పూజలు ఇక.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్‌రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
Nagoba Jatara: కొత్త కోడళ్ల భేటింగ్
ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల పూజలు కొనసాగుతున్నాయి. కొత్త కోడళ్ల భేటింగ్ ఆదివారం వేకువజాము వరకు కొనసాగింది. ముందుగా ఆలయ సమీపంలోని గోవడ్ వద్ద బస చేసిన మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయ వాయిద్యాలతో ఆలయానికి చేరుకున్నారు. 190 మంది కొత్త కోడళ్లు సతీదేవత ఆలయంలో పూజల అనంతరం భేటింగ్ (పరిచయం)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఉదయం కోనేరు నుంచి పవిత్ర జలాన్ని గోవడ్ వద్దకు తీసుకువచ్చారు. ఆ నీటితో నైవేద్యం తయారు చేసి నాగోబా, సతీదేవతలకు సమర్పించారు. ఈ ప్రక్రియ అనంతరం వారంతా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. అనంతరం కొత్తకోడళ్లు దీక్ష విరమించారు. ఆదివారం జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈనెల 28 వరకు జాతర కొనసాగుతుందని ఈవో రాజమౌళి, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం తెలిపారు. -
కేస్లాపూర్ నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ నేడు(ఆదివారం) రానున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కేశ్లాపూర్ చేరుకోనున్నారు. గిరిజన ఆరాధ్యదైవమైన నాగోబాను దర్శించుకోనున్నారు. అనంతరం గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో నేతలు పాల్గొననున్నారు. కాగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల రాకతో జిల్లా నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో అర్జున్ ముండా, బండి పాల్గొని ప్రసంగించనున్నారు. సభ ముగిసిన తరువాత సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. మొదలైన నాగోబా జాతర ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర శనివారం మొదలైంది. వేలాదిగా తరలివచ్చిన గిరిజనులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. మూడురోజులుగా వడమర(మర్రిచెట్ల) వద్ద విడిది చేసిన మెస్రం వంశీయులు తూమ్ పూజలు(చనిపోయిన వారికి కర్మకాండలు) నిర్వహించి శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. చదవండి: ఆదివాసీలతో జనసంద్రంగా మారిన కేస్లాపూర్ -
ఘనంగా నాగోబా నూతనాలయ ప్రారంభం
ఇంద్రవెల్లి: మెస్రం వంశీయులు రూ. 5 కోట్ల సొంత నిధులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నూతనంగా నిర్మించిన నాగోబా ఆలయ ప్రారంభోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వేకువజామున 4:30 గంటలకు కొడప వినాయక్‌రావ్, ఆత్రం పురుషోత్తం మహారాజ్ ఆధ్వర్యంలో నాగోబా విగ్రహంతోపాటు సతీదేవతల విగ్రహాల ప్రతిష్టాపన, కలశాల ఆవిష్కరణ జరిగింది. ముందుగా వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాల్లో విగ్రహాలను శుద్ధిచేసి ప్రతిష్టించారు. అనంతరం మెస్రం వంశీయులు హోమం నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి ప్రారంభోత్సవ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖానాయక్, ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారిని మెస్రం వంశీయులు సన్మానించారు. వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి మెస్రం వంశీయులు, ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మెస్రం యువకులు ఏర్పాట్లను పర్యవేక్షించగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
నాగోబా నూతన ఆలయ ప్రారంభోత్సవం
సాక్షి,ఆదిలాబాద్/ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివారం మెస్రం వంశీయులు కొత్తగా నిర్మించిన నాగోబా ఆలయం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా నూతనంగా తీర్చిదిద్దిన నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గత సోమవారం ప్రారంభమైన ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు తుది అంకానికి చేరాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి తదితరులు శనివారం జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తొలుత పుట్టకే పూజలు.. తొలినాళ్లలో మెస్రం వంశీయులు నాగోబా దేవత వెలిసిన పుణ్య స్థలం (పుట్ట)ను మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డి పరకలతో చిన్న గుడిసెను నిర్మించి పూజించారు. 1995లో సిమెంట్, ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేశారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో మందిరాన్ని నిర్మించారు. ప్రస్తుతం శిలలతో నూతన ఆలయాన్ని నిర్మించారు. పుష్య మాసంలో మెస్రం వంశీయులు నిర్వహించే నాగోబా జాతర రాష్ట్రంలో గిరిజన జాతరల్లో రెండో అతి పెద్దది. సొంతంగా చందాలతో.. నాగోబా ఆలయ నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మెస్రం వంశంలోని 22 కితల (తెగల) వంశస్తులు ఎవరిపై ఆధారపడకుండా తమకు తాముగా చందాల రూపంలో డబ్బులు జమ చేసి రూ.5 కోట్లతో ఈ దేవస్థానాన్ని నిర్మించారు. ఈ వంశంలోని రైతు కుటుంబం నుంచి ఏడాదికి రూ.5 వేలు, ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు, రాజకీయ నాయకుల నుంచి రూ.10 వేల నుంచి ఆపైన నిధులు సేకరించారు. ఇ లా 2017 నుంచి ఏటా డబ్బులు పోగుచేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కాగా ఆలయం చుట్టూ ప్రాకారం, నాలుగు దిక్కులా రాజగోపురాల నిర్మాణానికి దేవాదాయ శాఖ రూ.6 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం నిర్మాణ పనులు తుదిదశకు వచ్చాయి. ఆలయ నిర్మాణం ఇలా.. గర్భగుడి ద్వారాన్ని నాగదేవత పడగ రూపంలో తయారు చేశారు. ఆదివాసీల్లోని ఒక తెగ అయిన మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి, పద్ధతులను మనకు కళ్లకు కట్టినట్లు ఆ ఆలయ మండపంలో స్తంభాలపై చెక్కిన శిల్పాలు వివరిస్తాయి. ఒకప్పటి గోండ్వానా రాజ్య చిహ్నాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన శిల్పి తలారి రమేశ్ అక్కడే రాతిపై శిల్పాలు చెక్కారు. తర్వాత వాటిని కేస్లాపూర్‌కు తీసుకొచ్చి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. -
నాగోబా ఆలయ ఉద్ఘాటన షురూ
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో మెస్రం వంశీయులు తమ సొంత నిధులతో పునర్నిర్మించుకున్న నాగోబా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. ఆలయ పీఠాధి పతి మెస్రం వెంకట్రావ్ ఆధ్వర్యంలో ఈ వంశస్తులు దీప, నైవేద్యాలతో ఆలయానికి చేరుకున్నారు. ఆదివాసీ వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. బోథ్ బాబ్డే గ్రామానికి చెందిన పురుషోత్తం, ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహారాజ్ కొడప వినాయక్‌రావ్ ఆధ్వర్యంలో నవగ్రహ పూజ నిర్వహించారు. ఆలయానికి చేరిన పవిత్ర జలం: ఈనెల 18న చేపట్టనున్న ఆలయ శుద్ధి కోసం ఐదు ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్ర జలాలను గుడి వద్దకు తీసుకువచ్చారు. కెరమెరి మండలంలోని వజ్జకస్సా, జన్నారం మండలం వద్ద గోదావరి నదిలోని హస్తినమడుగు, గుడిహత్నూర్ మండలంలోని పులికహ్చర్, బేల మండలంలోని పెందల్వాడ, ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయం కోనేరు నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చినట్లు వెంకట్రావ్ తెలిపారు. -
డిసెంబర్ 18న నాగోబా విగ్రహ ప్రతిష్టాపన
ఇంద్రవెల్లి: మెస్రం వంశీయులు సొంత నిధులతో నిర్మించిన నాగోబా ఆలయ ప్రారంభోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ ప్రకటించారు. కేస్లాపూర్ నాగోబా ఆలయ దర్బార్‌హాల్‌లో ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఆలయ ప్రారంభోత్సవం, వేడుకలకు అతిథుల ఆహ్వానంపై చర్చించారు. ఈ సందర్భంగా వెంకట్రావ్ మాట్లాడుతూ డిసెంబర్ 12 నుంచి 18 వరకు ప్రారంభోత్సవాలుంటాయని వెల్లడించారు. ఏడు రోజుల పాటు భజన, కీర్తన కార్యక్రమాలతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు. 17న మెస్రం వంశ ఆడపడుచులకు అతిథి మర్యాదలు చేసి కొత్త దుస్తులు అందించనున్నట్లు పేర్కొన్నారు. 18న ఉదయం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజల మధ్య నాగోబా విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి కుల, మత భేదాలు లేకుండా అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. మెస్రం వంశీయులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరై నాగోబా దర్శనం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెస్రం వంశ పెద్దలు చిన్ను పటేల్, బాదిరావ్‌పటేల్, కోసేరావ్ కటోడ, మెస్రం వంశం ఉద్యోగులు మనోహర్, సోనేరావ్, దేవ్‌రావ్ తదితరులున్నారు. -
సంస్కృతి కళ్లకు కట్టేలా నాగోబా ఆలయం
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల్లో మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి కళ్లకుకట్టేలా నాగోబా ఆలయం రూపు దిద్దుకుంటోంది. నాగదేవత పడగ ఆకారంలో గర్భగుడి ద్వారం, ఆలయ మండపంలో మెస్రం చరిత్రను తెలిపేలా రూపొందిన శిల్పాలు దర్శనమిస్తాయి. ఒకప్పటి గోండ్వాన రాజ్యం చిహ్నాలు కూడా కనిపించేలా నిర్మాణం చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆలయ రాతికట్టడం పునర్నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. రానున్న పుష్యమాసంలో నాగోబా జాతర నిర్వహిస్తారు. ఈసారి కరోనా నేపథ్యంలో జాతరను సంప్రదాయ పూజలకే పరిమితం చేయనున్నారు. చదవండి: ఇళ్ల నిర్మాణాలకు పక్కా ప్రణాళిక నాగోబా ఆలయ ఆవరణలో కొనసాగుతున్న మండప నిర్మాణం, భావితరాలకు చరిత్ర తెలిసేలా: మెస్రం వంశీయుల ఇంటి దేవుడు నాగోబా. పూర్వం ఈ ప్రాంతం గోండ్వాన రాజ్యంలో ఉండేది. అప్పుడు ఒక గుడిసె కింద నాగోబా పూజలు అందుకున్నట్లు మెస్రం వంశీయులు చెబుతుంటారు. 2005లో రూ. 10 లక్షలతో నాగోబా ఆలయాన్ని విస్తరించారు. నాగోబా చరి త్రను భావితరాలకందించేలా ఆలయ నిర్మాణం ఉండాలని యోచించిన మెస్రం వంశీయులు 2017 జూన్‌లో రూ.3 కోట్లతో పనులు ప్రారంభిం చారు. ప్రస్తుతం రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. పైకప్పు పనులు జరగాల్సి ఉంది. గర్భగుడులకు మెస్రం వంశీయులే విరాళాలు ఇస్తుండగా, మండప నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 లక్ష లు అందించనుంది. ఏపీ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి తలారి రమేశ్.. ఈ శిల్పాలు చెక్కుతున్నారు. ఫిబ్రవరిలో గోదావరి నుంచి గంగాజలాన్ని కేస్లాపూర్‌కు తీసుకురావడంతో పూజలు ప్రారంభమవుతాయి. -
కిక్కిరిసిన కేస్లాపూర్
ఇంద్రవెల్లి(ఖానాపూర్) : నాగుల పంచమి పండుగ సందర్భంగా బుధవారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీగా తరలిరావడంతో జాతరను తలపించింది. ఉదయం నుంచే మండలంలోపాటు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు, మెస్రం వంశీయులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు హాజరై నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు నాగుల పంచమి పండుగ సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో వండిన జొన్న గట్కాను వారి ఆచారం ప్రకారం మోదుగ ఆకుల్లో భోజనం చేశారు. ఆలయ పరిసర ప్రాంతంలో దుకాణాలు, రంగుల రాట్నాలు, సర్కస్‌లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఉల్లాసంగా గడిపారు. మొదటి రోజు నాగుల పంచమి పూజలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు మూడు కిలోమీటర్ల వరకు ట్రాపిక్ జాం అయింది. దీంతో ముత్నూర్ నుంచి కాలనడకన నాగోబా ఆలయానికి వెళ్లి భక్తులు పూజలు చేశారు. నాగుల పంచమి పూజలు గురువారం వరకు కొనసాగుతాయని మెస్రం వంశీయులు తెలిపారు. ఆకట్టుకున్న ఆటల పోటీలు ఈ సందర్భంగా శ్రీ నాగోబా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలు అకట్టుకున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచే కాక మహారాష్ట్రలోని కిన్వట్ తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. సుమారు 20కు పైగా వాలీబాల్ జట్లు, 42 కబడ్డీ జట్లు పాలొగన్నాయి. ఈ పోటీలను ఎంపీ గోడం నగేశ్, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, జెడ్పీటీసీ దేవ్‌పూజే సంగీత, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గడ్గే సుబాష్, కృష్ణకుమార్, పెందోర్ తులసీరాం, జీవీ రమణ, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావ్, మాజీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్, మెస్రం వంశీయులు మెస్రం చిన్ను, మెస్రం హనుమంత్‌రావ్, కోసు, మెస్రం వంశం ఉద్యోగస్తులు మెస్రం శేఖర్, మెస్రం దేవ్‌రావ్ ఉన్నారు. పోలీసు భారీ బందోబస్తు కేస్లాపూర్ నాగోబా ఆలయంలో పూజలకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉట్నూర్ సీఐ వినోద్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ట్రాపిక్ సమస్య తలెత్తకుండా ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు ప్రత్యేకంగా పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు. -
గిరిజన సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా
మంత్రులు అల్లోల, జోగు నాగోబా సన్నిధిలో ప్రజాదర్బార్ ఉట్నూర్: గిరిజన సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయాన్ని శాశ్వతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర దేవదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నలు పేర్కొన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయ సన్నిధిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వారు మాట్లాడుతూ నాగోబా అలయంలో శాశ్వత అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు జాతర నిర్వహణకు రూ.పది లక్షలు మాత్రమే కేటాయించాయన్నారు. ఉట్నూర్ కేంద్రంగా ఉన్న ఐటీడీఏ ఉమ్మడి జిల్లాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం పని చేస్తోందని, ఐటీడీఏకు త్వరలోనే పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారిని నియమించేలా చర్యలు చేపడతామని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుమ్రం భీం ప్రాంతం జోడేఘాట్ అభివృద్ధికి రూ.25 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి ఐదు వందల జానాభా ఉన్న గిరిజన తండాలు, గూడాలను పంచాయతీలుగా గుర్తించి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రజాదర్బార్‌లో ఆదిలాబాద్ ఎంపీ గెడం నాగేశ్, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లా కలెక్టర్లు, జ్యోతి బుద్దప్రకాశ్, ఆర్వీ కర్ణన్, చంపాలాల్, ఆదిలాబాద్ ఏస్పీ శ్రీనివాస్, ట్రైనీ కలెక్టర్ అనురాగ్ జయంతి, రాయి సెంటర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు లక్కెరావ్, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావ్ పాల్గొన్నారు. సతి స్థానంలో పతి నాగోబా ఆలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సతుల స్థానంలో పతులు వేదికపై కూర్చున్నా రు. ప్రజాదర్బార్ సందర్భంగా మంత్రు లు, ఎంపీ, అధికారులు వేదికపై కూర్చున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ను వేదికపై ఆహ్వానించారు. కార్యక్రమానికి ఆమె హాజరు కాలేదు. కానీ, ఆమె భర్త సత్యనారాయణగౌడ్ వేదికపైకి వచ్చి బోకే అందుకున్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్‌తో పాటు ఆమె భర్త శ్యాంనాయక్ వేదికపై కూర్చున్నారు. -
అందాల నెలవు.. ఆదిలాబాద్
అడవులు, జలపాతాలకు పేరు గిరిజనులకు ఆలవాలం.. ఇది.. అనాదిగా అక్షరక్రమంలో ముందు తగ్గిన జిల్లా విస్తీర్ణం.. అడవుల జిల్లాగా.. ఆదివాసులు ఖిల్లాగా.. జలపాతాల నెలవుగా ఉన్న పేరు అలాగే ఉంది. కానీ వాటి పరిధి మాత్రం తగ్గనుంది. తూర్పున కొమురంభీం(ఆసిఫాబాద్) జిల్లా, ఉత్తర, పడమరల్లో మహారాష్ట్ర, దక్షిణాన నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మూడు జిల్లాల విభజనకు ముందు 16,105 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండగా, ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా మొత్తం విస్తీర్ణం 4,153 కిలో మీటర్లు. నూతన జిల్లా ఏర్పాటుతో ఆదిలాబాద్ విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. రిమ్స్ వైద్య కళాశాల కాస్త పెద్ద రోగమొస్తే హైదరాబాద్‌కో, మహారాష్ట్రకో పోవాల్సిందే. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో నుంచి జిల్లాకు మెరుగైన వైద్యాన్ని అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆయన హయాంలోనే ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని గిరిజన, పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చినట్లైంది. 500పడకలతో పాటు అన్ని వ్యాధులకు సంబంధించిన ఆధునాతన పరికరాలు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నారు. అందమైన కుంటాల దేశంలోని ఎత్తై జలపాతాలలో ఒకటిగా.. తెలుగు రాష్ట్రాలలోనే ఎత్తై జలపాతంగా పేరొందింది కుంటాల జలపాతం. నేరడిగొండ మండలం కుంటాల గ్రామం వద్ద కడెం వాగుపై ఎత్తై కొండలు, దట్టమైన అడవుల మధ్య ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. తెలంగాణ జిల్లాల పర్యాటకులతో పాటు మహారాష్ట్ర నుంచీ సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ప్రకృతి ఒడిలో గలగల పారే ఈ జలపాతం మధ్యలో రాతిగుహలో సోమేశ్వరుడు కొలువై ఉన్నాడు. పొచ్చెర జలజలా.. నిర్మల్-ఆదిలాబాద్ మార్గంలో 44వ జాతీయరహదారి(బోథ్ ఎక్స్‌రోడ్డు) నుంచి 5-6కిలోమీటర్ల దూరంలో బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామ సమీపంలో ఉంది. ఎత్తై గుట్ట ప్రాంతం నుంచి గుండ్రని లోయకి జాలువారే ఈ జలపాతం చూడగానే ఆకట్టుకుంటోంది. చుట్టూ చెట్లతో ప్రకృతి ఒడిలో ఉందీ జలపాతం. ఇక్కడ ప్రభుత్వం పర్యాటకుల కోసం కార్తీకవనాన్ని ఏర్పాటు చేసింది. నాగోబా ఆలయం గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువై ఉంది కోవెల. తరతరాలుగా తమదైన ప్రత్యేక సంప్రదాయాలతో మెస్రం వంశీయులు చేసే పూజలు, వారు నాగోబాను కొలిచే తీరు ఇక్కడి విశేషం. ఏడురోజుల పాటు నాగోబా జాతర ఘనంగా కొనసాగుతుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసే దర్బారులో గిరిప్రజల సమస్యలను జిల్లా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు. ఐటీడీఏ కేంద్రం అడవినే నమ్ముకున్న ఆదివాసీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ. ఐఏఎస్ క్యాడర్ అధికారి ప్రత్యేకాధికారిగా ఈ సంస్థ గిరిజన ప్రజల సంక్షేమం, పురోభివృద్ధి కోసం పనిచేస్తోంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోంది. గిరిజనులు చేసే ఉత్పత్తులు అమ్మేందుకు చర్యలు తీసుకుంటోంది. విద్య, వైద్య, యువత, మహిళలకు ఉపాధి, గిరిజనుల హక్కుల కోసం కృషిచేస్తోంది. లక్ష్మీనారాయణస్వామి ఆలయం మహారాష్ట్రలోని యావత్మాల్ ప్రాంతం నుంచి తీసుకువచ్చి, పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయం తెలంగాణకే తలమానికం. 11 శతాబ్ధంలో జైనులు నిర్మించినట్లు చెబుతుంటారు. కార్తీక మాసంలో నేరుగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడటం విశేషం. డిసెంబర్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సాత్నాల ప్రాజెక్టు జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు సామర్థ్యం 1.5024 టీఎంసీ. ఆయకట్టు 25వేల ఎకరాలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు కింద లక్ష్మీపూర్ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టడం పూర్తయ్యింది. దీనికి 7,600 ఎకరాల ఆయకట్టు ఉంది. కొరటా-చనాఖా బ్యారేజీ తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల చేసుకున్న చరిత్రాత్మక ఒప్పందం ఈ ప్రాజెక్టు. జిల్లా సరిహద్దులో ఉన్న పెన్‌గంగ నదిపై మండలంలోని కోర్ట, మహారాష్ట్రలోని చనాఖా గ్రామాల మధ్య బ్యారేజీని నిర్మిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పనులు నిలిచాయి. మొత్తం 51 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.