సాక్షి, ఆదిలాబాద్: తన పాలనలో కేసీఆర్ ఏనాడూ ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించలేదని.. ఆలోచించి ఉంటే ఇవాళ నాగోబా ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చేదని నిలదీశారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి. శుక్రవారం సాయంత్రం ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించిన ఆయన.. వేదిక నుంచి బీఆర్‌ఎస్‌పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘ఈ వేదిక సాక్షిగా చెబుతున్నా.. ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటాం. ఈ అడవి బిడ్డల ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. తప్పకుండా ఆదివాసీ కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం. ఇందిరమ్మ సోనియా రాజ్యం తెచ్చుకుంటాం. కేసీఆర్‌నును నేరుగా అడుగుతున్నా. ఎప్పుడైనా ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా?. నిజంగా అభివృద్ధి చేస్తే ఎందుకు నీళ్ళ కోసం నాగోబా గుడి కోసం రోడ్ల కోసం నిధులు మేము ఇచ్చే పరిస్తితి ఎందుకు వచ్చింది. చెరుకు పంటలో అడవి పందులు ఏ విధంగా దాడి చేస్తాయో అదే విధంగా తెలంగాణ పై కేసీఆర్ కుటుంబం దాడి చేసి విధ్వంసం చేశారు.
.. ఎంత సేపు నీ బిడ్డలు నీ ఫామ్ హౌజ్ లు తప్ప.. రాష్ట్రంలోని బిడ్డల కోసం ఆలోచించావా?. కవిత ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చావు. మరి స్టాఫ్ నర్సులు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చావా? అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. బిల్లా రంగాలు(కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశిస్తూ..) ఎంత శాప నార్ధాలు పెట్టినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాదే అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఎవడ్రా కూల్చేది?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే శాప నార్డాలు పెడుతున్నారు. మరి 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు మీరు?. ప్రభుత్వం కూలి పోతుంది అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా?. ఎవడ్రా కూల్చేది?. ప్రజల్లారా.. మీరు ఊరుకుంటారా?. చెట్లకు కట్టేసి భరతం పట్టండి. కేసీఆర్ పాపాల భైరవుడు. మళ్లీ జీవితంలో సీఎం కారు. మూడు నెలలకో, ఆరు నెలలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని ఎవరైనా అంటే పళ్లు రాలగొడతాం.
.. ఆరేడు ఎంపీ సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు. వస్తే మోదీకి అమ్ముకుందాం అనా?. దేశంలో ఉన్నవి రెండే కూటములు. ఒకటి మోదీ కూటమి.. రెండోది ఇండియా కూటమి. కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి రానివ్వం. ఆ ఇంటి పిట్టను ఈ ఇంటి మీద వాలితే కాల్చి పారేస్తాం. మోదీ కేడీ(కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ..) ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. మళ్లీ మతం పేరుతో వాళ్లు ఎన్నికలకు వస్తున్నారు. మోదీ ఎవరి ఖాతాలో అయినా రూ.15 లక్షలు జమ చేశారా? సోయంబాపురావుకు కనీసం కేంద్ర మంత్రి కూడా ఇవ్వలేకపోయారు. అలాంటప్పుడు ఓటేందుకు వేయాలి?. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురాలి. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి’’ అని ప్రజల్ని కోరారాయన.
కడెం మరమ్మత్తుల బాధ్యత మాది
కోటి ఎకరాలకు నీళ్లు అన్నావ్? వస్తావా కేసీఆర్ ఆదిలాబాద్‌ను చూపిస్తాం. హెలికాఫ్టర్ పెడతాం.. ఎక్కడ నీళ్‌లు ఇచ్చావో చూపించు అని కేసీఆర్‌పై రేవంత్ ధ్వజమెత్తారు. ఇక.. తెలంగాణలో మహిళలకు రూ. 500 కు సిలిండర్ గ్యాస్ అందించే పథకం త్వరలోనే అమలు చేస్తామని.. 200 యూనిట్ల ఉచిత కరెంట్ త్వరలోనే అమలు చేస్తామని రేవంత్ అన్నారు. ‘‘తుమ్మిడి హిట్టి వద్ద ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేసే బాధ్యత మాది’’ అని రేవంత్ ప్రకటించారు.
త్వరలోనే ఆ రెండు హామీలు
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు హామీల అమలులో భాగంగా.. త్వరలో రెండింటిని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో మాట్లాడరు.
ఈ సందర్భంగా.. అతిత్వరలోనే రూ.500కి గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించారు. మరికాసేపట్లో ఇంద్రవెల్లి అమరుల స్థూపానికి గౌరవ వందనం సమర్పించి.. అక్కడి సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ఆయన ప్రసంగిస్తారు.
ప్రత్యేక పూజలు
ఇక.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్‌రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment