అడవులు, జలపాతాలకు పేరు
గిరిజనులకు ఆలవాలం.. ఇది..
అనాదిగా అక్షరక్రమంలో ముందు
తగ్గిన జిల్లా విస్తీర్ణం..
అడవుల జిల్లాగా.. ఆదివాసులు ఖిల్లాగా.. జలపాతాల నెలవుగా ఉన్న పేరు అలాగే ఉంది. కానీ వాటి పరిధి మాత్రం తగ్గనుంది. తూర్పున కొమురంభీం(ఆసిఫాబాద్) జిల్లా, ఉత్తర, పడమరల్లో మహారాష్ట్ర, దక్షిణాన నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మూడు జిల్లాల విభజనకు ముందు 16,105 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండగా, ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా మొత్తం విస్తీర్ణం 4,153 కిలో మీటర్లు. నూతన జిల్లా ఏర్పాటుతో ఆదిలాబాద్ విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
రిమ్స్ వైద్య కళాశాల
కాస్త పెద్ద రోగమొస్తే హైదరాబాద్‌కో, మహారాష్ట్రకో పోవాల్సిందే. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో నుంచి జిల్లాకు మెరుగైన వైద్యాన్ని అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆయన హయాంలోనే ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని గిరిజన, పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చినట్లైంది. 500పడకలతో పాటు అన్ని వ్యాధులకు సంబంధించిన ఆధునాతన పరికరాలు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నారు.
అందమైన కుంటాల
దేశంలోని ఎత్తై జలపాతాలలో ఒకటిగా.. తెలుగు రాష్ట్రాలలోనే ఎత్తై జలపాతంగా పేరొందింది కుంటాల జలపాతం. నేరడిగొండ మండలం కుంటాల గ్రామం వద్ద కడెం వాగుపై ఎత్తై కొండలు, దట్టమైన అడవుల మధ్య ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. తెలంగాణ జిల్లాల పర్యాటకులతో పాటు మహారాష్ట్ర నుంచీ సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ప్రకృతి ఒడిలో గలగల పారే ఈ జలపాతం మధ్యలో రాతిగుహలో సోమేశ్వరుడు కొలువై ఉన్నాడు.
పొచ్చెర జలజలా..
నిర్మల్-ఆదిలాబాద్ మార్గంలో 44వ జాతీయరహదారి(బోథ్ ఎక్స్‌రోడ్డు) నుంచి 5-6కిలోమీటర్ల దూరంలో బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామ సమీపంలో ఉంది. ఎత్తై గుట్ట ప్రాంతం నుంచి గుండ్రని లోయకి జాలువారే ఈ జలపాతం చూడగానే ఆకట్టుకుంటోంది. చుట్టూ చెట్లతో ప్రకృతి ఒడిలో ఉందీ జలపాతం. ఇక్కడ ప్రభుత్వం పర్యాటకుల కోసం కార్తీకవనాన్ని ఏర్పాటు చేసింది.
నాగోబా ఆలయం
గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో కొలువై ఉంది కోవెల. తరతరాలుగా తమదైన ప్రత్యేక సంప్రదాయాలతో మెస్రం వంశీయులు చేసే పూజలు, వారు నాగోబాను కొలిచే తీరు ఇక్కడి విశేషం. ఏడురోజుల పాటు నాగోబా జాతర ఘనంగా కొనసాగుతుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసే దర్బారులో గిరిప్రజల సమస్యలను జిల్లా ఉన్నతాధికారులు తెలుసుకుంటారు.
ఐటీడీఏ కేంద్రం
అడవినే నమ్ముకున్న ఆదివాసీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ. ఐఏఎస్ క్యాడర్ అధికారి ప్రత్యేకాధికారిగా ఈ సంస్థ గిరిజన ప్రజల సంక్షేమం, పురోభివృద్ధి కోసం పనిచేస్తోంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోంది. గిరిజనులు చేసే ఉత్పత్తులు అమ్మేందుకు చర్యలు తీసుకుంటోంది. విద్య, వైద్య, యువత, మహిళలకు ఉపాధి, గిరిజనుల హక్కుల కోసం కృషిచేస్తోంది.
లక్ష్మీనారాయణస్వామి ఆలయం
మహారాష్ట్రలోని యావత్‌మాల్ ప్రాంతం నుంచి తీసుకువచ్చి, పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయం తెలంగాణకే తలమానికం. 11 శతాబ్ధంలో జైనులు నిర్మించినట్లు చెబుతుంటారు. కార్తీక మాసంలో నేరుగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడటం విశేషం. డిసెంబర్‌లో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
సాత్నాల ప్రాజెక్టు
జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు సామర్థ్యం 1.5024 టీఎంసీ. ఆయకట్టు 25వేల ఎకరాలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు కింద లక్ష్మీపూర్ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టడం పూర్తయ్యింది. దీనికి 7,600 ఎకరాల ఆయకట్టు ఉంది.
కొరటా-చనాఖా బ్యారేజీ
తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల చేసుకున్న చరిత్రాత్మక ఒప్పందం ఈ ప్రాజెక్టు. జిల్లా సరిహద్దులో ఉన్న పెన్‌గంగ నదిపై మండలంలోని కోర్ట, మహారాష్ట్రలోని చనాఖా గ్రామాల మధ్య బ్యారేజీని నిర్మిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పనులు నిలిచాయి. మొత్తం 51 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
అందాల నెలవు.. ఆదిలాబాద్
Published Tue, Oct 11 2016 11:04 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
Advertisement
Advertisement