గిరిజన సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా
మంత్రులు అల్లోల, జోగు నాగోబా సన్నిధిలో ప్రజాదర్బార్
ఉట్నూర్: గిరిజన సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయాన్ని శాశ్వతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర దేవదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నలు పేర్కొన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయ సన్నిధిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వారు మాట్లాడుతూ నాగోబా అలయంలో శాశ్వత అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు జాతర నిర్వహణకు రూ.పది లక్షలు మాత్రమే కేటాయించాయన్నారు. ఉట్నూర్ కేంద్రంగా ఉన్న ఐటీడీఏ ఉమ్మడి జిల్లాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం పని చేస్తోందని, ఐటీడీఏకు త్వరలోనే పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారిని నియమించేలా చర్యలు చేపడతామని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుమ్రం భీం ప్రాంతం జోడేఘాట్ అభివృద్ధికి రూ.25 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి ఐదు వందల జానాభా ఉన్న గిరిజన తండాలు, గూడాలను పంచాయతీలుగా గుర్తించి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రజాదర్బార్‌లో ఆదిలాబాద్ ఎంపీ గెడం నాగేశ్, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లా కలెక్టర్లు, జ్యోతి బుద్దప్రకాశ్, ఆర్వీ కర్ణన్, చంపాలాల్, ఆదిలాబాద్ ఏస్పీ శ్రీనివాస్, ట్రైనీ కలెక్టర్ అనురాగ్ జయంతి, రాయి సెంటర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు లక్కెరావ్, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావ్ పాల్గొన్నారు.
సతి స్థానంలో పతి
నాగోబా ఆలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సతుల స్థానంలో పతులు వేదికపై కూర్చున్నా రు. ప్రజాదర్బార్ సందర్భంగా మంత్రు లు, ఎంపీ, అధికారులు వేదికపై కూర్చున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ను వేదికపై ఆహ్వానించారు. కార్యక్రమానికి ఆమె హాజరు కాలేదు. కానీ, ఆమె భర్త సత్యనారాయణగౌడ్ వేదికపైకి వచ్చి బోకే అందుకున్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్‌తో పాటు ఆమె భర్త శ్యాంనాయక్ వేదికపై కూర్చున్నారు.