ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లపై ముందుకే
ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ
- వాటి పెంపునకు రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభించండి
- తమిళనాడు తరహా వ్యూహం ఖరారు చేయండి
- అక్కడికెళ్లి అధ్యయనం చేయండి.. అవసరమైతే నేనూ వస్తా
- అధికారులకు సీఎం ఆదేశాలు.. కోర్టు రద్దు చేసేలా ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేద ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఎన్నికల హామీ మేరకు ఈ రెండు వర్గాలకు రిజర్లేషన్లు పెంచి తీరుతామని స్పష్టం చేశారు. వారికి రిజర్వేషన్ల పెంపుకు అవసరమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదనే కోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాన్ని ఖరారు చేయాల్సిందిగా సూచించారు. ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపుపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం చర్చలు జరిపారు.
బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, బీసీ కమీషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరీశంకర్, ఆంజనేయులు గౌడ్‌తో పాటు ముస్లింల స్థితిగతులపై అధ్యయనం జరిపిన కమీషన్ ఛైర్మన్ సుధీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అధికంగా ఉన్నారని, వారిలో ఎక్కువ శాతం సామాజిక, ఆర్ధిక, విద్యాపరమైన వెనుకబాటుతనం అనుభవిస్తున్నారని ఈ సందర్భంగా సీఎం ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయాల్లో వారు ముందడుగు వేయాల్సిన అవసరముందన్నారు.
‘‘సామా జిక అంతరాలు, ఆర్ధిక అసమానతలు, వెనుకబాటుతనం వల్లే యువతలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. వీటిపై గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రాణనష్టం జరిగింది. కొత్త రాష్ట్రంలో ఈ పరిస్థితి మారాలి. పేదరికం అనుభవిస్తున్న బలహీన వర్గాలకు ప్రభుత్వ తోడ్పాటు అందాలి. వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అందినప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. రిజర్వేషన్ల పెంపుకు త్రికరణ శుధ్దితో పని చేయాల్సి ఉంది. రిజర్వేషన్ల పెంపు కోర్టు వివాదాల్లో చిక్కుకోకుండా, ఎవరూ ప్రశ్నించలేని విధంగా ప్రక్రియను నిర్వహించాలి’’ అని విస్పష్టంగా సూచించారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం
అందరికీ ఒకే న్యాయం ఉండాలని, అన్ని రాష్ట్రాలకూ ఒకే చట్టం అమలు కావా లని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ‘‘తమిళనాడులో అక్కడి బలహీనవర్గాలకు జనాభాకు అనుగుణంగా 69 శాతం రిజర్వే షన్లు అమలవుతున్నాయి. మిగతా రాష్ట్రా ల్లో మాత్రం 50 శాతం మించకుండా కోర్టు తీర్పులున్నాయి. మన రాష్ట్రంలోనూ రిజర్వే షన్లు పెంచి తీరాలి. ముందుగా ముస్లింలు, ఎస్టీలు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు పొందాలి. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతాం. తెలంగాణలో ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం.
తమిళనాడులో అనుసరించాల్సిన వ్యూహం, రిజర్వేషన్లు పెంపు నేపథ్యంపై అధ్యయనానికి అధికారుల బృందం త్వర లో చెన్నై వెళ్లి రావాలి. అవసరమైతే నేను కూడా వెళ్లి సంబంధిత అధికారులు, న్యా య నిపుణులతో చర్చిస్తా. మనం రిజ ర్వేషన్లను పెంచడం, కోర్టు దాన్ని రద్దు చేయడం జరగకూడదు. పెంచిన రిజర్వేష న్లు అమలయ్యేలా మన విధానం ఉండాలి’’ అని సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలయిందని, కానీ తెలంగా ణలో ఎస్టీల జనాభా 9 శాతానికి పైగా ఉం దని ఆయన తెలిపారు. రాజ్యాగం ప్రకారం ఎస్టీలకు సైతం జనాభా ఆధారంగా రిజర్వే షన్లు అమలు కావాల్సి ఉందన్నారు.