K Chandrashekar Rao
-
అధికారంలోకి వస్తే 15 ఏళ్లు మనమే!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే మరో 15 ఏళ్లు కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరిగే అవకాశముందని, మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ తరఫున ఎవరికి బీ ఫామ్ దక్కినా గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ మంగళవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు ‘తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. పార్టీ నేతలకు సమన్వయంతో పాటు ఓపిక అవసరం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. త్వరలో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు సోషల్ మీడియా విభాగాన్ని కూడా పటిష్టంగా తయారు చేస్తాం. పార్టీ నాయకులను సృష్టిస్తుంది.. నాయకులు పార్టీని సృష్టించరు. భవిష్యత్తులో సమర్ధవంతమైన యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రజా జీవితంలో అడుగు పెట్టిన తర్వాత అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే వారే నిజమైన రాజకీయ నాయకులు..’అని స్పష్టం చేశారు. పిచ్చి పనులు కాంగ్రెస్‌కు అలవాటే ‘ప్రజలతో ఛీత్కారాలు పొందే లక్షణం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి పనులు చేయడం కూడా వారికి అలవాటే. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత 1989లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇదే రీతిన వ్యవహరించింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు సవ్యంగా పనిచేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు, తాగునీరు, శాంతిభద్రతల సమస్యలు రావడం బాధ కలిగిస్తోంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని చెప్తున్నవారు తెచ్చిన తెలంగాణను కూడా చెరిపివేస్తారా? వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాలను పేర్లు మార్చకుండా నేను కొనసాగించా. వ్యవసాయ స్థిరీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధుకు ఎగనామం పెట్టే ప్రయత్నం జరుగుతోంది. సాగు లెక్కలు, ఇతరత్రా కారణాలు పరిగణనలోకి తీసుకుంటే రైతుబంధు అమల్లో అవినీతి మొదలవుతుంది..’అని మాజీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో జెడ్పీ చైర్మన్ల కీలక పాత్ర జెడ్పీ ఛైర్మన్లు రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించారని కేసీఆర్ ప్రశంసించారు. పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జెడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో సహా ఈ భేటీకి హాజరు కాగా, కేసీఆర్ వారిని పేరు పేరునా పలుకరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్లకు జ్ఞాపికలతో పాటు యాదాద్రి ప్రసాదాన్ని కేటీఆర్ అందజేశారు. ఈ భేటీలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్లు జనార్దన్ రాథోడ్ (ఆదిలాబాద్), కోరిపెల్లి విజయలక్ష్మి (నిర్మల్), దాదన్నగారి విఠల్ రావు (నిజామాబాద్), దఫేదార్ శోభ (కామారెడ్డి), దావా వసంత సురేష్ (జగిత్యాల), పుట్టా మధుకర్ (పెద్దపల్లి), కనుమళ్ల విజయ (కరీంనగర్), న్యాలకొండ అరుణ (రాజన్న సిరిసిల్ల), పటోళ్ల మంజుశ్రీ (సంగారెడ్డి), ర్యాకల హేమలత (మెదక్), వేలేటి రోజారాణి (సిద్దిపేట), శాంతకుమారి (నాగర్ కర్నూల్), బండా నరేందర్ రెడ్డి (నల్లగొండ), గుజ్జ దీపిక (సూర్యాపేట), ఎలిమినేటి సందీప్ రెడ్డి (యాదాద్రి భువనగిరి), ఆంగోత్ బిందు (మహబూబాబాద్), గండ్ర జ్యోతి (వరంగల్ రూరల్), మారపల్లి సు«దీర్ కుమార్ (వరంగల్ అర్బన్), జక్కు శ్రీహర్షిణి (జయశంకర్ భూపాలపల్లి ), బడే నాగజ్యోతి (ములుగు), లింగాల కమల్ రాజ్ (ఖమ్మం) హాజరయ్యారు. -
కేసీఆర్ పరిపాలన తెలంగాణకు వరం: బీఆర్ఎస్ ఆస్ట్రేలియా హర్షం
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలు చేపట్టిందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యలతో తెలంగాణ సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందని తెలిపింది. మెల్బోర్న్లో విశ్వామిత్ర మంత్రి ప్రగడ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రగతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం దిశగా రైతు రుణమాఫీతో పాటు హైదరాబాద్ లో మెట్రోరైలు విస్తరణ, నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ నిర్ణయం, తదితర అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ, రైతు పక్షపాతిగా నిలిచిందని, రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని సభ్యులు కొనియాడారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, ఉప్పు సాయిరాం, విశ్వామిత్ర,వినయ్ గౌడ్, సురేష్, ఉదయ్, జమాల్ , సాయి యాదవ్, వేణు , సతీష్ , రాకేష్, సూర్య తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త పాలనకు నాంది.. నేడే సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నుంచి పరిపాలన వ్యవహారాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శ్రీకారం చుట్టనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్‌ను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. తర్వాత సీఎంతోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సెక్రటేరియట్ నుంచి తొలి సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత అతిథులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఉదయం సుదర్శన యాగంతో.. నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సుదర్శన యాగంతో శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం సచివాలయ ప్రాంగణంలో యాగశాలను సిద్ధం చేశారు. శృంగేరి పీఠానికి చెందిన వైదికుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6 గంటలకు యాగం ప్రారంభం కానుంది. మద్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్, శోభ దంపతులు పాల్గొంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. కాసేపు సచివాలయంలో కలియదిరిగి.. 6వ అంతస్తులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. తన సీట్లో ఆసీనుడై పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేస్తారు. మధ్యాహ్నం 1.58 – 2.04 గంటల మధ్య మంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులు, అదనపు/సంయుక్త/ఉప కార్యదర్శులు, సెక్షన్ అధికారులు, అదనపు సెక్షన్ అధికారులు తమకు కేటాయించిన చాంబర్లు/ సెక్షన్లలో ఆసీనులై ఏవైనా ఫైల్స్‌పై తొలి సంతకాలు చేస్తారు. 2,500 మంది అతిథులకు ఆహ్వానం మధ్యాహ్నం 2.15–2.45 గంటల మధ్య సచివాలయం ప్రాంగణంలో మంత్రులు, సచివాలయ అధికారులు, ఇతర అతిథులతో జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ప్రారం¿ోత్సవ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, మేయర్లతో సహా మొత్తం 2,500 మంది అతిథులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. మూడేళ్ల 10 నెలల తర్వాత.. పాత సచివాలయ భవనాలను కూల్చి నూతన సచివాలయం కట్టేందుకు 2019 జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. సుమారు మూడేళ్ల 10 నెలల తర్వాత ప్రారం¿ోత్సవం జరుగుతోంది. వాస్తవానికి అన్ని అనుమతులు లభించాక 2021 జనవరిలో నిర్మాణ పనులను ప్రారంభించి.. ఈ నెలాఖరు నాటికి 26 నెలల్లో పూర్తి చేశామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇన్నాళ్లూ బీఆర్కేఆర్ భవన్లో తాత్కాలికంగా సచివాలయాన్ని నిర్వహించారు. హైమాస్ట్ లైట్ పోల్‌పై కెమెరా.. మొత్తం 300 కెమెరాలు తొలిరోజున పని మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పనులను చిత్రీకరించేందుకు.. సచివాలయం ఎదురుగా తూర్పు దిశలో రోడ్డుపై ఉన్న భారీ హైమాస్ట్ లైట్ స్తంభంపై ప్రత్యేకంగా కెమెరాను ఏర్పాటు చేశారు. మూడేళ్లుగా జరిగిన పనులను అది చిత్రిస్తూ వచి్చంది. దాని ఆధారంగా ఇటీవలే ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు కూడా. సీఎం ప్రజాదర్బార్‌కు ఏర్పాట్లు కొత్త సచివాలయం 6వ అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఎం చాంబర్ ఏర్పాటు చేశారు. పూర్తిగా పాలరాతితో సీఎం కార్యాలయం, సిబ్బంది విభాగాలను తీర్చిదిద్దారు. సీఎం ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ‘జనహిత’ పేరిట 250 మంది కూర్చునే సామర్థ్యంతో ఒక హాల్‌ను ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికిపైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాల్‌ను సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60మంది కూర్చునేలా ఒక హాల్, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాల్ నిర్మించారు. ఈ నాలుగు సమావేశ మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలసి భోజనం చేసేందుకు 25 మంది కూర్చోగలిగే అత్యాధునిక డైనింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు. సచివాలయం విశేషాలివీ.. సచివాలయంలో మొత్తం 28 ఎకరాల స్థలం ఉండగా.. 2.45 ఎకరాల(7,79,982 చదరపు అడుగుల)లో.. 265 అడుగుల ఎత్తుతో భవనాన్ని నిర్మించారు. మొత్తం 635 గదులు, 30 సమావేశ మందిరాలు, 34 గుమ్మటాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రధాన భవనం ఆరు అంతస్తులు ఉండగా.. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులు కలిపి మొత్తం 11 అంతస్తులతో నిర్మించారు. సెక్రటేరియట్ ముందువైపు 10 ఎకరాల్లో పచి్చక మైదానం ఉండగా.. కోర్ట్ యార్డు (భవనం మధ్య ఖాళీ భాగంలో) రెండెకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు. మొత్తంగా రూ.617 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేయగా.. ఇప్పటివరకు రూ.550 కోట్లకుపైగా ఖర్చు చేశారు. ఇంకా కొన్ని పనులు సాగుతున్నాయి. అనుకున్న దానికంటే 20–30 శాతం వ్యయం ఎక్కువ అవుతోందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త సచివాలయం విస్తీర్ణం వివరాలివీ.. మొత్తం భూ విస్తీర్ణం: 28 ఎకరాలు భవనం నిర్మించిన ప్రాంతం: 2.45 ఎకరాలు ల్యాండ్ స్కేపింగ్: 7.72 ఎకరాలు సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్: 2.2 ఎకరాలు పార్కింగ్ సామర్థ్యం: 560 కార్లు, 700 బైకులు ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా: 8,58,530 చదరపు అడుగులు లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు: 14 అడుగులు మొత్తం ఎత్తు: 265 అడుగులు నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి ఉక్కు: 8,000 టన్నులు సిమెంటు: 40,,000 టన్నులు ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు) కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు ఇటుకలు: 11 లక్షలు ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు మార్బుల్: లక్ష చదరపు అడుగులు ధోల్పూర్ రెడ్‌స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు కలప: 7,500 క్యూబిక్ అడుగులు పనిచేసిన కారి్మకులు: మూడు షిప్టుల్లో 12,000 మంది యాక్సెస్ కార్డు ఉంటేనే లోపలికి.. నూతన సచివాలయ భవనంలోకి ప్రవేశించాలంటే ప్రత్యేకంగా రూపొందించే యాక్సెస్ కార్డు పాస్ తప్పనిసరి. ఏదైనా పనిమీద వచ్చేవారు ఏ శాఖ కార్యాలయానికి వెళ్లాలో అక్కడివరకు మాత్రమే వెళ్లగలిగేలా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. లోపలికి అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండేలా భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు షిఫ్టుల్లో 300 మంది చొప్పున సచివాలయంలో పహారా కాస్తారు. వారికి నిర్ధారిత డ్యూటీ పాయింట్లు ఉంటాయి. – గతంలో పాత సచివాలయంలో కూడా పాస్‌ల జారీ విధానం ఉండేది. ఒకసారి లోనికి వెళ్లాక సీఎం ఉండే సీ బ్లాక్‌లోకి తప్ప మిగతా అన్ని భవనాల్లోకి సులువుగా వెళ్లేందుకు అవకాశం ఉండేది. – సచివాలయంలోకి వెళ్లేందుకు నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి. ఇందులో ఆగ్నేయం (గతంలో పెట్రోల్ బంకు ఉండే ప్రాంతం) వైపు ఉండే ద్వారం నుంచి సందర్శకులను అనుమతిస్తారు. సందర్శకులు నిర్ధారిత కార్యాలయానికి వెళ్లేందుకు అక్కడ అనుమతి తీసుకుని, యాక్సెస్ పాస్ పొందాలి. లోపల ఉండే చెకింగ్ పాయింట్ల వద్ద ఆ పాస్‌ను చూపుతూ వెళ్లాలి. ఆ పాస్‌లో ఏ కార్యాలయానికి, ఎటువైపు అనుమతి ఉంటుందో అక్కడికి మాత్రమే సిబ్బంది అనుమతిస్తారు. – మీడియాను కూడా – భవిష్యత్తులో ఫేస్ రీడింగ్‌తో కూడిన యాక్సెస్ కార్డులను జారీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి మ్యాన్యువల్‌గా తనిఖీ చేసి పంపే యాక్సెస్ కార్డులను జారీ చేయనున్నారు. – సచివాలయం భద్రత కోసం 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మీడియాకూ ఆంక్షలు! ఆగ్నేయ దిక్కున గేటు సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లోకి మాత్రమే అనుమతిస్తారు. ఏదైనా మంత్రిత్వ శాఖ సమావేశ మందిరాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే.. ముందుగా అధికారులు సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇస్తేనే.. మీడియాను లోపలికి పంపుతారని అధికార వర్గాలు చెప్తున్నాయి. లేకుంటే సంబంధిత అధికారులు మీడియా సెంటర్ వద్దకే వచ్చి సమాచారం ఇచ్చి వెళ్లేలా యోచన కూడా చేస్తున్నారు. -
KCR: పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న వ్యూహచతురుడు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాజకీయ జీవితంపై భవిష్యత్తులో పరిశోధనాత్మక గ్రంధాలు రావచ్చు. పలువురు దీనిపై థీసిస్‌లు సమర్పించవచ్చు. ఒక సామాన్య నేత అంచెలంచెలుగా ఎదిగి సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక రెకంగా అది అద్భుతం, అమోఘం. ఒక నాడు తాను స్థాపించిన రాజకీయ పార్టీకి సొంత ఆఫీస్ లేదు. ఎవరో ఇచ్చిన భవంతిలోనో ఆఫీస్ నడపవలసి వచ్చేది. కాని ఈ రోజుబ్రహ్మాండమైన నవాబుల నాటి సంస్కృతితో నిర్మించిన భారీ భవనం. చేతిలో అవసరమైన సొమ్ము ఉండేది కాదు.అన్నిటికి కటకటే! మరి ఇప్పుడు ఆయన పార్టీ ఖాతాలోనే 1200 కోట్ల సొమ్ము. ఒకప్పుడు ఆయన శాసనసభలో ఒకే ఒక్కడు. తనకు కేటాయించిన చాంబర్లో మీడియావారితో కబుర్లతో గడిపేవారు. ఈ రోజు ఆయనను కలుసుకోవడమే కష్టం. తనకు ఒకప్పుడు బాగా తెలిసినవారైనా, ఆయనకు ఇష్టం లేకపోతే అప్పాయింట్ మెంటే దొరకదు. అలా తెలంగాణ ఉద్యమ జీవితాన్ని ఆరంభించిన ఆయన ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ పెద్ద,పెద్ద పార్టీలను కూడా తనదారిలోకి తెచ్చుకున్న ఘనాపాటి. తెలంగాణ జనజీవితాలను నిర్దేశించే నేత గానే కాదు. దేశాన్నే ఏలే స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తున్న నేత. ఇదంతా కేసీఆర్ స్వయంకృషే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తనతో ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా తాను అనుకున్న మార్గంలో ముందుకు సాగి ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీని స్థాపించి తన సత్తాను చాటుతున్న నేత. ఒకప్పుడు ప్రాంతీయవాది అయినా, ఇప్పుడు ఆయనలో జాతీయవాది కనిపిస్తున్నారు. ఇదంతా రెండు దశాబ్దాల వ్యవధిలోనే. ఎన్నో ఉత్ధాన ,పతనాలు చూశారు. అయినా చలించలేదు. ఒక దశలో పార్టీని ఎత్తివేయవలసి వస్తుందా అన్న ఆందోళన కూడా లేకపోలేదు. అయినా చలించలేదు. పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకున్న వ్యూహచతురుడు. ఆయనపై ఎన్ని రకాల విమర్శలైనా ఉండవచ్చు.ఎన్ని ఆరోపణలు ఉండవచ్చు. కుటుంబపాలన అని ప్రత్యర్ధులు ద్వజమెత్తవచ్చు. లోపాలు ఎన్ని ఉన్నాయన్నదాని గురించి కాదు. ఒక వ్యక్తి తన మేధస్సుతో రాజకీయాలలో ఎలా అత్యున్నత స్థానానికి చేరవచ్చని రుజువు చేసిన నేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సాధించి అనర్ఘళంగా ప్రసంగించగల అరుదైన నేత కేసీఆర్. 2001 లో ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని ఆయన అవమానంగా భావించారు. దానిని జీర్ణించుకోలేకపోయారు. ఈయనలోని అసంతృప్తిని చల్లార్చడానికి ఉప సభాపతి పదవి ఇచ్చినా, ఆయన సంతృప్తి పడలేదు. తనకంటూ అప్పటికే ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. ఇది సాద్యమేనా అన్న సంశయం నూటికి తొంభైమందికి ఉండేది. అయినా ఆయనలో ఆత్మ విశ్వాసం తగ్గలేదు. సిద్దిపేట సీటుకు రాజీనామా చేసి, టీడీపీకి గుడ్ బై చెప్పి ఉప ఎన్నికలో పోటీచేసినప్పుడు ఆయన సత్తా తెలియడం ఆరంభం అయింది. చంద్రబాబు ఆయనను ఓడించడానికి చేయని ప్రయత్నం లేదు. విశేషం ఏమిటంటే కేసీఆర్‌ను ఆనాడు పరాజితుడిని చేయడానికి కృషి చేసిన పలువురు ఇప్పుడు ఆయన క్యాబినెట్ లో మంత్రులు లేదా ఆయన ఇచ్చిన నామినెటెడ్ పదవులలో ఉన్న నేతలు. ఉదాహరణకు తలసాని శ్రీనివాసయాదవ్, వేణుగోపాలచారి వంటివారిని తీసుకోవచ్చు. వీరే కాదు. ఇంకా చాలామందే ఉన్నారు. అప్పట్లో ఏపీలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా మళ్లీ పీఠం ఎక్కాలన్న ధ్యేయంతో ఉండడం కేసీఆర్‌కు కలిసి వచ్చింది. నిజానికి అప్పుడు టీఆర్ఎస్తో పొత్తు లేకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. కాని ఎవరి భయం వారిది కదా!తెలంగాణ కాంగ్రెస్ నేతలు జి.వెంకటస్వామి, డి.శ్రీనివాస్ తదితరులు ఎలాగైనా కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ ద్వారా గెలవాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. దాంతో కాంగ్రెస్ చరిత్ర కన్నా టీఆర్ఎస్ భవిష్యత్తేమారిపోయింది. కేసీఆర్ఏకంగా కేంద్రంలో మంత్రి అయ్యారు. వైఎస్ క్యాబినెట్ లో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. అయినా తెలంగాణ రాష్ట్ర సాధన పై పట్టు వీడకపోవడం కేసీఆర్ప్రత్యేకత అని చెప్పాలి. తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడమే కాకుండా, తాను సైతం రాజీనామా చేసి ఉప ఎన్నికల ద్వారా సెంటిమెంట్ ను నిలబెట్టడంలో ఆయన సఫలం అయ్యారు. ఆ ఎన్నికలలో కొన్ని సీట్లలో గెలిచినా, ఓడినా ప్రజలో సానుభూతి సంపాదించడంలో ఆయన విజయవంతం అయ్యారు. అదే సమయంలో సమైక్యవాద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అధికార కాంక్షను కేసీఆర్పెట్టుబడిగా వాడుకోగలిగారు. తనతో పొత్తు పెట్టుకోవాలంటే తెలంగాణపై తీర్మానం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దానికి లొంగిపోయిన చంద్రబాబు అదే ప్రకారం తీర్మానం చేసి టీఆర్ఎస్ తో కలిసి మహాకూటమి కట్టారు. నిజానికి చంద్రబాబుకు మనసులో తెలంగాణ రాష్ట్ర అనుకూలత లేదు. అది అయ్యేదికాదని, ఎలాగైనా కేసీఆర్‌ను మాయచేయవచ్చన్నది ఆయన వ్యూహం. నువ్వొకందుకు పోస్తే, నేనొకందుకు తాగుతా అన్న సామెత మాదిరి అటు కాంగ్రెస్ ను, ఇటు టీడీపీని తన దారిలోకి తెచ్చుకున్న కేసీఆర్సగం విజయం సాధించినట్లయింది.ఈ మధ్యలో భారీ బహిరంగ సభలు, దేశంలో ఉన్న కొంతమంది ప్రముఖ నేతలను రప్పించి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడించేవారు.అవసరమైతే ఆంద్ర ప్రాంతంపై తనదైన శైలిలో తీవ్ర పదజాలంతో మాట్లాడేవారు. తద్వారా తెలంగాణ ప్రజలలో ప్రత్యేక రాష్ట్ర భావనను బాగా నాటకలిగారు. ఈ తరుణంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా సోనియాగాంధీకి స్వయం నిర్ణయ తెలివితేటలు అంతంతమాత్రమే కావడం కేసీఆర్‌కు కలిసివచ్చిన మరో అంశం. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డికి ఏపీ పీఠం అప్పగించి ఉంటే చరిత్ర మరో విధంగా ఉండేదని చాలా మంది నమ్ముతారు. రాష్ట్ర విభజన జరిగే అవకాశం చాలా తక్కువగా ఉండేదని పలువురు విశ్వసిస్తారు.కాని కాంగ్రెస్ లో వర్గాలు జగన్ పై లేనిపోని పితూరీలు చెప్పి, చివరికి అధిష్టానానికి ఆయనను దూరం చేసి, సొంతంగా పార్టీ పెట్టే పరిస్థితికి తీసుకువెళ్లారు. ప్రజలలో అంత పట్టు లేని రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ నమ్ముకుని మునిగిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి అయితే తొలుత తెలంగాణపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినా, తర్వాత తిరగబడి పార్టీని గంగలో ముంచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఏపీలో సొంత ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని రాష్ట్రపతి పాలన పెట్టుకునే దశకు వెళ్లడంలోనే ఆ పార్టీ బలహీనత కనిపిస్తుంది. మరో వైపు జగన్ ను తప్పుడు కేసులలో ఇరికించి 16 నెలలపాటు జైలులో ఉంచడం ప్రజలలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకతను తెచ్చింది. ఇలా కాంగ్రెస్ చేసిన స్వయంకృతాపరాధాలన్నీ కేసీఆర్‌కు వరంగా మారాయి. సోనియా పుట్టిన రోజున తెలంగాణ ప్రకటన చేయడం , ఆ తర్వాత ఆపడం తెలంగాణ ప్రజలలో పెనుమార్పులకు దారి తీసింది. కేసీఆర్తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ తెలుగుదేశం తదితర చిన్నాచితక పార్టీల నేతలను ,ప్రజాసంఘాలను కూడగట్టుకుని తెలంగాణలో ఏకైక పెద్ద నాయకుడుగా ఆవిర్భవించారు. అదే ఆయన పెద్ద విజయం. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న అభిప్రాయానికి ఆయన కట్టుబడి ఉన్నా, కాంగ్రెస్ నాయకత్వం పూర్తి అసమర్దంగా వ్యవహరించడం కేసీఆర్‌కు కలిసి వచ్చింది. అప్పుడు ఆయన రిస్కు తీసుకుని ఒంటరిగా పోటీ చేయడంతో ఆయన రాజకీయ జీవితమే మారిపోయింది. 2014లో ముఖ్యమంత్రి కావడం ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించగలిగారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఓటు కు నోటు కేసులో బుక్ చేసి హైదరాబాద్ నుంచి వెళ్లిపోయేలా చేయగలిగారు. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను బలహీనం చేసే కృషిలో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు డజను మందిని టీఆర్ఎస్లో కలిపేసుకున్నారు. టీడీపీ, సిపిఐ , బిఎస్పి వంటి పార్టీల ఎమ్మెల్యేలు సైతం అదే దారిపట్టారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం కేసీఆర్నెత్తిన పాలు పోసినట్లయింది.ప్రజలలో కాంగ్రెస్,టీడీపీ యాంటి సెంటిమెంట్ ను సృష్టించి మరోసారి అధికారంలోకి వచ్చారు. అదే సమయంలో రైతు బంధు, 24 గంటలు విద్యుత్ సరఫరా తదితర స్కీములను కూడా ఆయన విజయవంతంగా అమలు చేయడం ఉపకరించింది. 2018లో గెలిచాక మళ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చిపారేశారు. దాంతో ఆ పార్టీ మళ్లీ పుంజుకోవడానికి చాలా కష్టాలు పడవలసి వస్తోంది.సడన్ గా బీజేపీ రూపంలో కొంత ఇబ్బంది వచ్చినా, కాంగ్రెస్ , బీజేపీల నడుమ మరోసారి అధికారం సాధించడానికి ఆయన వ్యూహరచన చేసి 2023 ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఒకప్పుడు ఉప ప్రాంతీయ పార్టీగా రంగంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా (బిఆర్ఎస్ ) మారి జాతీయ పార్టీగా అవతరించడం మరో గొప్ప విశేషం. ఇప్పుడు ఆయన తన నివాసంగా ప్రగతి భవన్ ను కట్టుకున్నారు. సచివాలయానికి ఉన్న భవనాలు కూల్చివేసి అధునాతన సౌధాన్ని నిర్మించారు. ఇలా నాడు పార్టీకి సొంత భవనం లేని స్థితి నుంచి అటు పార్టీపరంగా, ఇటు ప్రభుత్వపరంగా తన ఆధిపత్యాన్ని చాటుతూ దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదగాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. నిజంగానే కేసీఆర్ రాజకీయ ప్రస్తానాన్ని అధ్యయనం చేయడం, పరిశోధన చేయడం ద్వారా ఎన్ని డాక్టరేట్లు అయినా సాధించవచ్చు. కేసీఆర్ ఇప్పుడు ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. అప్పట్లో తన వెనుక ఎవరు ఉన్నారో వెతుక్కోవలసిన పరిస్థితి. మరి ఈనాడు ఆయన చూపు పడితే చాలు అనుకునే నేతలు కోకొల్లలుగా ఉన్న పరిస్థితి. 2023 శాసనసభ ఎన్నికలలో మరోసారి విజయం సాధిస్తే కేసీఆర్ దేశ రాజకీయాలను నిజంగానే ప్రభావితం చేసే స్థాయికి ఎదగవచ్చు. హాట్సాఫ్ టు కేసీఆర్. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ -
కొత్త ఒరవడితో.. సమస్యల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ‘‘మూస ధోరణులు, సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా వినూత్నంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. రొటీన్‌గా కాకుండా మరింత గొప్పగా పనిచేయాలి. నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పనిచేయగలమని రోజూ ఆలోచించాలి. ఒక పనిని ఎంత శాస్త్రీయంగా ఆలోచించి చేస్తున్నామనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదగగలం’’ అని అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం సీఎం పురపాలక శాఖ అంశాలు, నిజామాబాద్ నగర అభివృద్ధిపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే సామాజిక అభివృద్ధి వేగవంతం అవుతుందని.. అప్పుడే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని చెప్పారు. ఒక్కో రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడంలో ఉద్యోగుల సమష్టి కృషి కీలకమని స్పష్టం చేశారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిననాడే గుణాత్మక ప్రగతిని ప్రజలకు చేరవేయగలుగుతామన్నారు. నాణ్యమైన సేవలు అందాలి పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా పెరుగుతున్న ప్రజావసరాలను తీర్చడానికి అందరం కలిసి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. ఉమ్మడి పాలనలో శిథిలమైన అన్ని రంగాలను తీర్చిదిద్ది గాడిలో పెట్టగలిగామని, అన్ని రంగాలు వాటంతట అవి పనిచేసుకుంటూ పోయే స్థితికి తెచ్చుకున్నామని చెప్పారు. ‘‘నాడు తెలంగాణలో కనీస వసతులు లేవు. నేడు అన్ని రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధించింది. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు సమకూరాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతి సాధించింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తెలంగాణ సమాజంలో అన్నివర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. ఉత్తమ సేవలను అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది సౌకర్యాల పెంపునకు డిమాండ్ పెరుగుతోందంటే ప్రభుత్వంపై ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని కేసీఆర్ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఒకనాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానాలు, ఇతర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా ఉంటున్నాయి. ఒకనాటి వలసలు నేడు రివర్స్ అయ్యాయి. 30లక్షల మంది పక్క రాష్ట్రాల నుంచి వలసవచ్చి బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో రాబడులు, ఆర్థిక వనరులు పెరిగాయి. సంస్కరణలతో గడపగడపకూ పాలనను తీసుకుపోతున్నాం. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలి. పెరిగిన అభివృద్ధికి సమానంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల ప్రాథమిక, నిత్యావసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రభుత్వోద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలి’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాలు లేని సమయంలోనే పూర్తి చేయాలి గతంలో వానాకాలం రెండు మూడు నెలలే వర్షాలు పడేవని, ఇప్పుడు వానలు పడే రోజులు పెరిగి నిర్మాణ పనులకు సమయం తగ్గిందని సీఎం కేసీఆర్ చెప్పారు. అందువల్ల వర్షాలు లేని ఆరేడు నెలల్లోనే పనులు వేగంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తిచేయాలని, నిధులకు కొరత లేదని.. రెండు నెలల్లో తాను స్వయంగా పర్యటించి పనులను పరిశీలిస్తానని చెప్పారు. ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీసుకుని నిజామాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమీక్ష సందర్భంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను సీఎంకు మంత్రి కేటీఆర్ వివరించారు. సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కె.కవిత తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమా? -
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లపై తేల్చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, పార్టీ శ్రేణులంతా ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు. ఎన్నికలకు 10 నెలల సమయమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలి. మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మూడోసారి కూడా మనదే గెలుపు కావాలని ఆకాంక్షించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. వాళ్లకు దర్యాప్తు సంస్థలు ఉంటే మనకు కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రసంస్థలో రాష్ట్ర సంస్థలో తేల్చుకుందామని అన్నారు. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. నాకు తెలియకుండా ఏదో చేస్తున్నామనుకుంటే మీ పొరపాటు. మీ ఫోన్లపై నిఘా ఉంటుంది. పార్టీ మారాలని ఎవరైనా ఒత్తిడి తేస్తే నాకు సమాచారం ఇవ్వండి అని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. చదవండి: (ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ) -
నా ఫోన్లూ ట్యాపింగ్.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘‘నా వద్ద ఏడీసీగా పనిచేసిన తుషార్ భాసన్ పేరును, రాజ్‌భవన్‌ను ‘టీఆర్ఎస్ న్యూస్’ అనే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలోకి లాగారు. అందులో రాజ్‌భవన్ పాలుపంచుకుందని ఆరోపణలు చేశారు. నా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. తుషార్ కొద్దిరోజుల కింద హైదరాబాద్‌కు వచ్చి నన్ను కలవాలని రెండు మూడు రోజులు కాల్ చేశారు. ఇలా నాకు ఎవరెవరు కాల్ చేస్తున్నారో వాళ్లు (రాష్ట్ర ప్రభుత్వం) కనుక్కున్నారు. నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులు నెలకొని ఉన్నాయి’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్‌భవన్ పారదర్శకమైన కార్యాలయమని, తాను అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. కావాలంటే తన ఫోన్ ఇచ్చేస్తానని, చూసుకోవచ్చని.. అంతా పారదర్శకంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు గవర్నర్ మాటల్లోనే.. ‘‘బిల్లులను ఆమోదించడానికి ఎలాంటి టైం లిమిట్ లేదు. ఆమోదించే వ్యక్తులకు వాటిని మదింపు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నాకు అవసరమైనంత సమయాన్ని తీసుకుంటాను. నేను బిల్లులపై కూర్చున్నానని, సూపర్ పవర్ అని తప్పుడు ప్రచారాలు చేశారు. ఆరు బిల్లులు పంపించారు. ఒకదాని తర్వాత ఒక బిల్లును పరిశీలిస్తున్నా. నేను నియామకాల ప్రక్రియకు అడ్డంకిగా మారినట్టు తప్పుడు ప్రచారం చేశారు. కేవలం ఒకే నెల అయింది. బిల్లులను మదించడానికి నాకు సమయం వద్దా? బిల్లు పంపించి సింపుల్‌గా ఆమోదించేయాలంటే కుదరదు. వివరాలు కావాలి. వర్సిటీలకు చాన్స్‌లర్‌గా నాకు అన్ని హక్కులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ బోర్డుకు సరైన వ్యక్తి ఉండాలి కదా. నా ఒత్తిడితోనే ప్రభుత్వంలో కదలిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని కోరుతూనే ఉన్నాను. వీసీలందరితో మాట్లాడి వర్సిటీల పరిస్థితులపై ప్రభుత్వానికి పెద్ద రిపోర్టు కూడా పంపాను. ఆ రిపోర్టు ప్రధాన ఎజెండా పోస్టుల భర్తీయే. నేను పదేపదే ఒత్తిడి చేయడంతోనే ఎనిమిదేళ్లు ఖాళీగా ఉన్న 13 వర్సిటీల వీసీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది స్పష్టత మాత్రమే కోరాను వర్సిటీల్లో నియామకాలకు ఇప్పటికే ఒక విధానం ఉండగా కొత్త బోర్డు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఎలా ఏర్పాటు చేస్తారు, ఏ పద్ధతిని అనుసరిస్తారు?దీనికి చట్టబద్ధత ఉంటుందా? యూజీసీ ఒప్పుకుంటుందా? చైర్మన్‌గా ఎవరిని నియమిస్తారు? ఏం ప్రొటోకాల్‌ను పాటిస్తారు? ఏటా నియామకాలు చేస్తారా? యూనివర్సిటీ కేంద్రంగా నియామకాలుంటాయా? అన్ని వర్సిటీలను కలిపి కేంద్రీకృతంగా నియామకాలు చేపడతారా? వీటిపై స్పష్టత రావాలి. ఒకవేళ న్యాయపరమైన చిక్కులొస్తే బోధన, బోధనేతర సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందిపడతారు. సత్వర నియామకాల కోసమే బోర్డు అని మీరు అంటున్నారు. బోర్డు ఏర్పాటుకు చాలా సమయం పడుతుంది. పారదర్శకంగా నియామకాలు జరగాలి. పక్షపాతం వల్ల అర్హులైన విద్యావేత్తలు నష్టపోరాదు. అందుకే బిల్లు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాను. ఆరేడు నెలలుగా బిల్లులు ఆపినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేవలం ఒక నెల, ఆపై కొన్ని రోజులు మాత్రమే అయింది. రోజూ అనుమానాల నివృత్తి కోసం కొంత సమయం గడుపుతున్నాను. ప్రత్యేక బోర్డులు కలిగిన రాష్ట్రాలను సంప్రదిస్తే.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కిందే అవి పనిచేస్తున్నట్టు తెలిసింది. ప్రజాప్రయోజనాల రీత్యానే స్పష్టత కోరుతూ మంత్రికి లేఖ రాశాను. ఇలాగైతే ప్రగతిభవన్‌కు ప్రజల గొంతు చేరుతుందా? నేను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నానని, లేఖ అందలేదని మంత్రి (సబితా ఇంద్రారెడ్డి) అనడం ఆశ్చర్యం కలిగించింది. సీఎం నుంచి లేఖ మంత్రికి చేరడానికి, రాజ్‌భవన్ నుంచి గవర్నర్ గొంతు మంత్రికి చేరడానికే ఇంత జాప్యం జరిగితే.. ప్రజల గొంతు ప్రగతిభవన్‌కు ఎలా చేరుతుంది? గవర్నర్ లేఖ రాశారా, లేదా? అని మంత్రి తెలుసుకుని ఉండాల్సింది. వాస్తవం తెలుసుకోకుండా రాజ్‌భవన్‌ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారు. బిల్లుపై స్పష్టత కోసమే మంత్రిని రమ్మన్నాను. అగ్నివీర్ పథకంపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళన చేస్తున్న వారిని రాజ్‌భవన్ ఎదుట ఆందోళన చేయాలంటూ (టీఆర్ఎస్) అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పిలుపునివ్వడాన్ని గుర్తుంచుకోవాలి. ముందు ప్రభుత్వ వర్సిటీలను పట్టించుకోండి ప్రభుత్వ వర్సిటీల్లో మెస్‌లు, హాస్టళ్లు దుర్భరంగా ఉన్నాయి. బెడ్లు, టేబుళ్లు. ట్యూ బ్లైట్లు లేవు. పారిశుధ్యం లేదు. కలుషిత ఆహారం నిత్యకృత్యమైంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు వర్సిటీలను అభివృద్ధి చేసేందుకు బిల్లు తెస్తారా? వాటి సంఖ్యను పెంచాలనుకుంటారా? ఎందుకు? విద్య వ్యాపారం కాదని సుప్రీంకోర్టు అన్నది. ముందు ప్రభు త్వ వర్సిటీల దుస్థితిని పట్టించుకోండి. ఆ తర్వాత ప్రైవేటు బిల్లు గురించి ఆలోచిద్దాం. గవర్నర్లే వీసీలుగా ఉండాలి వర్సిటీల చాన్స్లర్లుగా గవర్నర్లే ఉండాలి. వారిని తొలగించి సీఎంలను నియమించడంపై విస్తృత చర్చ జరగాలి. సెక్యులరిజంపై వ్యాఖ్యలు చేసినంత మాత్రాన తమిళనాడు గవర్నర్‌ను భర్తరఫ్ చేయాలని అక్కడి ప్రభు త్వం కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం లేదు’ అని తమిళిసై స్పష్టం చేశారు. తెలుగు ప్రజల గురించి అలా అనలేదు తమిళనాడులో తెలుగు ప్రజలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని తాను చెప్పలేదని, తన మాటలను వక్రీకరించారని ఓ ప్రశ్నకు గవర్నర్ తమిళిసై బదులిచ్చారు. తాను కేవలం మాతృభాష గురించి మాట్లాడానని వివరించారు. ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నిరసనలు తెలపాలంటూ పలువురు పిలుపునివ్వడంపై గవర్నర్ స్పందించారు. ప్రధాని పర్యటనతో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, దీనిని సానుకూల దృక్పథంతో చూడాలని సూచించారు. అందుకే ఖైదీల క్షమాభిక్షను తిరస్కరించా.. కేంద్ర హోంశాఖ నిబంధనలను పాటించకపోవడంతోనే ఖైదీల క్షమాభిక్ష ప్రతిపాదనలను తిరస్కరించినట్టు గవ ర్నర్ స్పష్టం చేశారు. జీవిత ఖైదీలను వెంటనే విడుదల చేయడం కుదరదని.. క్షణికావేశంలో నేరాలు చేసిన వారికే క్షమాభిక్ష వర్తిస్తుందని పేర్కొన్నారు. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే -
ఉక్రెయిన్ విద్యార్థులను ఇక్కడే చదివిద్దాం
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశం నుంచి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా దేశంలోని వైద్య కళాశాలల్లో చదువులు పూర్తి చేయడానికి వారికి అవకాశం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం లేఖ రాశారు. నిబంధనలను సడలించి దేశంలోని వైద్య కళాశాలల్లో సమాన సెమిస్టర్లలో ఉక్రెయిన్ విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని కోరారు. ఒకసారి అవకాశం (వన్ టైమ్ బేసిస్) కింద దామాషా ప్రకారం వైద్య కళాశాలల్లో సీట్లను పెంచాలని సూచించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభం కావడంతో ఆ దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో చదువుతున్న 20 వేల భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని, అందులో 700 మందికి పైగా తెలంగాణ విద్యార్థులున్నారని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వారి ఫీజులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఉక్రెయిన్ విద్యార్థుల్లో అధిక శాతం విద్యార్థులు మధ్య తరగతి కుటుంబాల వారేనని సీఎం పేర్కొన్నారు. వారి తల్లిదండ్రులు తమ జీవిత కాల శ్రమతో దాచిపెట్టుకున్న డబ్బులను ఖర్చు చేసి తమ పిల్లలకు వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు పంపించారని, అయితే యుద్ధం వల్ల విద్యార్థుల చదువులు అర్ధంతరంగా ఆగిపోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తే ఇక ఉండవు అంతే..) -
సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. Birthday wishes to Telangana CM Shri KCR Garu. Praying for his long and healthy life. @TelanganaCMO — Narendra Modi (@narendramodi) February 17, 2022 తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షుని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Warm greetings to Telangana CM Sri KCR garu on his birthday. May God bless him with good health and long life.@TelanganaCMO — YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2022 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 'మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వుండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/ZNzxoIRZM1 — Chiranjeevi Konidela (@KChiruTweets) February 17, 2022 సీఎం కేసీఆర్‌కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు, మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.@TelanganaCMO pic.twitter.com/MXUlXKi0Fj — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 17, 2022 -
‘మోదీ డ్రామా.. బహిరంగ సభకు జనం రాలేదనే..’
సాక్షి, హైదరాబాద్: పంజాబ్ పర్యటనలో మోదీ డ్రామాలాడారని.. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బహిరంగ సభకు జనం రాలేదని నాటకాలు ఆడారని ఎద్దేవా చేశారు. చదవండి: పర్యాటకుల్లా వచ్చి కేసీఆర్‌పై విమర్శలా? ‘‘పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. 371డి పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎల్పీ నుండి లేఖ రాస్తున్నాం. ధ్యానం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కొనుగోలు చేయాల్సిందే. తామర పురుగుతో లక్షల ఎకరాల మిర్చి పంటకు నష్టం ఏర్పడింది. పసుపు, పత్తి పంటలకు కూడా నష్టపరిహారం అందించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దయనీయ పరిస్థితిలో ఉంది. పోలీసులు యంత్రాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ తన క్యాడర్ గా మార్చుకుంది. సీఎల్పీ బృందం.. గవర్నర్‌తో పాటు రాష్ట్ర డీజీపీని కలవాలని నిర్ణయించింది. విద్యుత్ చార్జీల పెంచితే పోరాటం చేస్తాం. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, వనమాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలంటూ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. -
పుస్తకాలు చదివే కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు
కవాడిగూడ (హైదరాబాద్): పుస్తకాలు చదవడంతోనే ప్రజలకు మంచి పరిపాలన అందించడం సాధ్యమవుతుందని, అందుకుని దర్శనమే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాలన అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల వేలాది పుస్తకాలు చదివి తెలంగాణను సాధించారని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సాధనకోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజలను చైతన్య పరిచి రాష్ట్రానికి తన జీవితాన్ని అర్పించారని మంత్రి వివరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌కు బోనాలతో స్వాగతం పలికారు. చిందు ఎల్లమ్మ వేదికపై జరిగిన సమావేశంలో బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు ఎల్లప్పుడు పూర్తి సహకారం ఉంటుందని హామీనిచ్చారు. గోల్కొండ పత్రికతో కవులు, రచయిత సంఖ్య తెలియజెప్పారు నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతంలో కవులు రచయితలు లేరన్న సందర్భంలో సు రవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక నిర్వహిస్తూ తెలంగాణలో కవులు రచయితల సంఖ్యను చెప్పిన మహోన్నత వ్యక్తి అని మంత్రి గుర్తు చేశారు. నిరంతరం బుక్‌ఫెయిర్ నిర్వహించేందుకు రవీంద్రభారతిలో స్థలం కేటాయిస్తామని బుక్‌ఫెయిర్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. గౌ రీశంకర్ మాట్లాడుతూ బుక్‌ఫెయిర్‌ను పుస్త క ప్రేమికులు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సాంస్కృతిశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. సోమవారం జరగనున్న బాపూజీ 106వ జయంతి సందర్భంగా ఆయన చేసిన స్ఫూర్తిదాయక నిస్వార్థ సేవలను సీఎం స్మరించుకున్నారు. సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మతో సహా పలువురికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది బాపూజీ అని కొనియాడారు. దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని, ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన అన్ని పోరాటాల్లో అదే స్ఫూర్తిని కొనసాగించిన కొండా లక్ష్మణ్ బాపూజీ, దేశం గర్వించదగ్గ గొప్ప నేత అని ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల సాధనకు, సహకార రంగాల పటిష్టతకు తన జీవితకాలం కృషి చేశారన్నారు. బహుజన నేతగా.. దేశవ్యాప్తం గా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందన్నారు. బా పూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. -
హుజురాబాద్‌లో పోటీకి కేసీఆర్ సై అంటే.. బరిలోకి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోటీచేస్తే ఆయనకు పోటీగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి బరిలోకి దిగుతారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొరెడ్డి అయోధ్యరెడ్డి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో దళితబంధు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్..ఆయన దత్తత గ్రామం వాసాలమర్రిలో సైతం ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కేసీఆర్ కలవగానే హుజూరాబాద్ ఉపఎన్నికలు వాయిదా పడ్డాయని, దీంతో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి పోస్టు కూడా వాయిదా పడిపోయిందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్లు కలసి లోపాయికారీగా పనిచేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మోదీని కలసి కేసీఆర్ అక్రమాలపై విచారణకు ఆదేశించేలా పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. -
రేపు హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ
కరీంనగర్: రేపు(సోమవారం) హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. కాగా శనివారం హుజూరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఈనెల 16న హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌లోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. దళిత బంధును ఇక్కడ అమలు చేయడానికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నిధులతో 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు ఇక్కడినుంచి ప్రారంభించినప్పుడు కూడా.. కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన కొందరు నాయకులు, ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తుంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. ఎన్నికల కోసం ఈ పథకం తెచ్చారంటున్నారని, కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే ఈ పథకం గురించి చెప్పామని హరీశ్ గుర్తుచేశారు. మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారని చెప్పారు. -
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
హైదరాబాద్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి అయినా చేసేది ప్రభుత్వమేనని.. వ్యక్తులు కాదన్నారు. దళితుల కోసం రాజీనామా చేశానని ప్రవీణ్‌కుమార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దందళిత బంధుకు ప్రవీణ్‌కుమార్ వ్యతిరేకమా? అని గాదరి కిశోర్ ప్రశ్నించారు. కాగా దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని సీఎం కేసీఆర్‌ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దళితులపై ప్రేమ ఉంటే కేసీఆర్ తన ఆస్తులు అమ్మి దళితబంధు అమలు చేయాలి, తెలంగాణలో ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో తెలంగాణలో ఎన్ని ఆస్పత్రులు కట్టారు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు? అని ఆయన నిలదీశారు. -
ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. అయినా దక్కని గవర్నర్, రాజ్యసభ పదవులు
సాక్షి, యాదాద్రి: సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేయడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చజరుగుతోంది. 2020 జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా వేసుకున్న వెత్కుపల్లి.. సంవత్సరంన్నర కాలంలోనే బయటకు వచ్చారు. ఆ పార్టీ విధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు పంపించారు. అయితే, నర్సింహులు టీఆర్ఎస్లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న మోత్కుపల్లికి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలికారని, ఆ నేపథ్యంలో ఆయన బీజేపీకి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు అంటున్నారు. కేసీఆర్ మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకొని ఎస్సీ సాధికారిత కార్యక్రమంలో భాగస్వామిని చేసే అవకాశాలున్నాయంటున్నారు. మోత్కుపల్లి, కేసీఆర్ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కాలంలో మంచి మిత్రులు కావడం గమనార్హం. రాజకీయ విభేదాలతో ఇంతకాలం దూరంగా ఉన్నారు. అంతేకాదు.. పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. కలిసి పనిచేసే సమయం వచ్చిందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మోత్కుపల్లి అనుచరులు చెబుతున్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు ఇప్పటికే మెజార్టీగా టీఆర్ఎస్లో ఉన్నారు. కొందరు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారు. మోత్కుపల్లి టీఆర్ఎస్లోకి వస్తున్నారన్న సంకేతాలతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్కని గవర్నర్, రాజ్యసభ పదవులు మోత్కుపల్లి నర్సింహులు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత. టీడీపీ, బీజేపీ పొత్తులో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నర్‌గా అవకాశం కోసం ఎదురు చూశారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో తనకు గవర్నర్ పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే, చంద్రబాబునాయుడు వల్లే తనకు గవర్నర్ పదవి రాలేదని అలాగే.. ఇస్తామన్న రాజ్యసభ పదవి కూడా ఇవ్వకుండా డబ్బున్న వాళ్లకు అమ్ముకున్నాడని మోత్కుపల్లి చంద్రబాబు పై అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనకు ఏ పదవీ దక్కకుండాపోయింది. తాజా బీజేపీలో చేరిన ఆయనకు జాతీయ స్థాయిలో ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి వస్తుందన్న ప్రచారం జరిగింది. అలాగే గవర్నర్ పదవుల్లో కూడా అవకాశం ఉందన్న నమ్మకం ఆయన అనుచరుల్లో వ్యక్తమైంది. అవేవీ రాకపోవడంతో మోత్కుపల్లి అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ నేతనైన తన సేవలను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదన్న కారణంతో రాజీనామా చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచి ఆయన రికార్డు విజయాలను నమోదు చేసుకున్నారు. 1982లో ఎన్టీఆర్ స్థాపింన తెలుగుదేశం పార్టీలో విద్యార్థి దశలోనే చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఆలేరు నుం టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985లో టీడీపీ నుం, 1989 ఇండిపెండెంట్‌గా, 1994 టీడీపీ నుం గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ నుంచి ఆలేరులో గెలుపొందిన ఆయన 2004లో టీడీపీ తరపున ఆలేరులోనే ఓటమిపాలయ్యారు. 2008లో జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయ్యారు. ఆ తర్వాత 2009లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2014లో ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓటమి చెందారు. అంతేకాకుండా నర్సింహులు 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి బహిష్కరణ అనంతరం ప్రజావేదిక ఏర్పాటు చేసి ముందస్తు ఎన్నికల్లో బీఎల్ఎఫ్ మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటమిని చవిచూశారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో గనులు, విద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమం, టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. -
Land Value: తెలంగాణలో పెరిగిన భూమి విలువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/ అపార్ట్మెంట్ల విలువలను ప్రభుత్వం సవరించింది. అలాగే రిజి స్ట్రేషన్ ఫీజు కూడా పెంచింది. సవరించిన ప్రభుత్వ భూముల విలువలు, పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు (జీవో నం.58) జారీ చేశా రు. దీంతో ఎనిమిదేళ్ల (2013 తర్వాత)కు భూముల ప్రభుత్వ విలువలను సవరించడంతో పాటు రిజి స్ట్రేషన్ల ఫీజును పెంచినట్టయింది. ఏ మూలనైనా రూ.75 వేలు భూముల విలువల సవరణలో భాగంగా రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలోనైనా వ్యవసాయ భూమి ఎకరానికి రూ.75 వేలు కనిష్ట విలువగా ప్రభుత్వం నిర్ధారించింది. ఆ తర్వాత ప్రాంతం, భూమి విలువ లను బట్టి 30–50% పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఖాళీ స్థలాలకు సంబంధించి చదరపు గజం కనీసం రూ.200గా ఖరారు చేసిన ప్రభుత్వం వాటి విలువలను కూడా 50, 40, 30 శాతం శ్లాబుల్లో సవరించింది. ఇక, ఫ్లాట్లు/అపార్ట్మెంట్ల విషయంలో చదరపు అడుగు కనీసం రూ.1,000గా నిర్ధారించింది. వీటి విలువలను ఆయా ప్రాంతాల్లోని జనాభా ఆధారంగా వర్గీకరించి 20, 30 శాతం శ్లాబుల్లో పెంచుతూ సవరించింది. 1.5 శాతం పెరిగిన స్టాంపు డ్యూటీ ఇప్పటివరకు 6 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఇందులో స్టాంపు డ్యూటీ గతంలో 4% ఉండగా దాన్ని 5.5 శాతానికి పెంచింది. ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద 1.5 శాతం, రిజిస్ట్రేషన్ కింద 0.5 శాతం ఫీజును యథాతథంగా కొనసాగించింది. రాష్ట్రంలోని భూములు, ఆస్తుల విలువల సవరణ.. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఎలా జరుగుతుందన్న దానిపై ‘సాక్షి’ ఈనెల 18న ‘సాగుభూమి రూ.75 వేలు’ శీర్షికన సవివరంగా కథనాన్ని ప్రచురించడం గమనార్హం. అదనపు ఫీజు చెల్లించాలి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసుకున్న వారు కూడా ఈ నెల 22 నుంచి పెరిగిన విలువలు, రిజిస్ట్రేషన్ల ఫీజు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మాడ్యూల్‌ను ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదనంగా చెల్లించాల్సిన ఫీజును రిజిస్ట్రేషన్ జరిగే రోజు చెల్లించవచ్చని తెలిపారు. భూముల విలువల సవరణ, రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు విషయంలో ఎలాంటి సందేహాలున్నా 18005994788 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా లేదా ‘ఏఎస్సీఎంఆర్ఓఎట్దిరేట్తెలంగాణడాట్జీవోవీడాట్ఇన్’ కు ఈ మెయిల్ పంపడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని వెల్లడించారు. నిలిచిన కార్యకలాపాలు సవరించిన మార్కెట్ విలువలు, పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజును అప్లోడ్ చేయడం కోసం అటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఇటు ధరణి పోర్టల్‌లో కార్యకలాపాలను మంగళవారం నుంచే నిలిపివేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ధరణి పోర్టల్ బంద్ కాగా, సాయంత్రం 5 గంటల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని కంప్యూటర్లను సాంకేతిక బృందాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బుధవారం ఉదయం కల్లా ఈ వివరాలన్నీ సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాల్లోని కంప్యూటర్లకు సర్వర్ ద్వారా అప్లోడ్ కానున్నాయి. బుధవారం బక్రీద్ కారణంగా ఎలాగూ ప్రభుత్వ సెలవు ఉన్నందున గురువారం నుంచి కొత్త విలువలు, చార్జీలు అమల్లోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బుధవారం ప్రభుత్వ సెలవు అయినా సబ్ రిజిస్ట్రార్లు, తహశీల్దార్లు కార్యాలయాలకు వచ్చి తమ తమ మండలాలు, తమ పరిధిలోనికి వచ్చే ప్రాంతాలకు సంబంధించి అప్లోడ్ అయిన వివరాలను పరిశీలిస్తారని, గురువారం నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ రిజిస్ట్రేషన్ల ఫీజును మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు పెంచుతున్నట్టు సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. తెలంగాణతో పోలిస్తే పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు ఎక్కువ ఉన్నాయని, తమిళనాడులో 11, కేరళలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 7.5 శాతం చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇప్పటివరకు విలువలు సవరించలేదని తెలిపారు. మరోవైపు ఐటీ, ఫార్మా, పర్యాటక, మౌలిక వసతుల రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించడం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో సాగు ఆయకట్టు పెరగడంతో భూముల విలువలు పెరిగాయని వివరించారు. దీంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 50 శాతం అదనపు ఆదాయం అంచనా ప్రభుత్వ విలువల సవరణ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ద్వారా దాదాపు 50 శాతం అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏటా రూ.6 వేల కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తుండగా, తాజా మార్పులతో అది రూ.9 వేల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం లెక్కలు కడుతోంది. కానీ, 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా వస్తాయని భావిస్తోన్న రూ.9 వేల కోట్లకు తోడు మరో రూ.3 వేల కోట్లను కూడా ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఎలా పెరుగుతాయంటే... వ్యవసాయ భూములకు ఇలా.. ఈనెల 22 నుంచి అమల్లోకి వచ్చే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ల ఫీజు ప్రకారం వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ల కింద చెల్లించాల్సిన ఫీజు పెరగనుంది. ఉదాహరణకు ఎకరం భూమి ప్రభుత్వ విలువ గతంలో రూ.20 వేలు ఉంటే ఆ భూమికి రూ.1,200 (6 శాతం) ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.75 వేలు అయింది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు 7.5 శాతానికి పెరిగింది. అంటే ఇప్పుడు అదే ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రూ.5,625 చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీ ప్లాట్లకు ఇలా... ఖాళీ స్థలాల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తించనుంది. మండల కేంద్రాల స్థాయిలో గతంలో చదరపు గజం రూ.201–1,000గా ఉన్న విలువను 50 శాతానికి పెంచారు. అంటే రూ.1,000 చదరపు గజం విలువ ఇప్పుడు రూ.1,500 అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 6 నుంచి 7.5 శాతానికి పెరిగింది. కాబట్టి ఇప్పుడు 100 గజాల ఖాళీ స్థలాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు రూ.11,250 చెల్లించాల్సి ఉంటుంది. అదే గతంలో అయితే రూ.6,000 కడితే సరిపోయేది. ఫ్లాట్లు/ అపార్ట్మెంట్లకు ఇలా.. లక్షలోపు జనాభా ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఫ్లాట్లు/అపార్ట్మెంట్లకు చదరపు అడుగుకు కనీస ధర రూ.1,000గా నిర్ణయించారు. గతంలో రూ.800 ఉండేది. ఈ ధర ప్రకారం 700 చదరపు అడుగుల ఫ్లాటును రిజిస్టర్ చేసుకునేందుకు గాను 6 శాతం ఫీజు చొప్పున రూ.33,600 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సవరించిన ధరల ప్రకారం చదరపు అడుగుకు రూ.1,000 చొప్పున రూ. 52,500 (7.5 శాతం ) రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/ అపార్ట్మెంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన విలువల ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. -
కొత్త జోనల్ విధానంతో స్థానికులకు న్యాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు రూపొందించి చట్టం చేయడం, అది రాష్ట్రపతి ఆమోదం పొందడం చిరస్మరణీయమని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి. ఈ విధానానికి రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసినందుకు, అందుకనుగుణంగా 50 వేల కొత్త ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, కార్యదర్శి, టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కలిశారు. ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి విన్నవించిన సమస్యలివీ.. ఆర్డర్‌టుసర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జోనల్ విధానాన్ని అనుసరించి వారి స్వస్థలాలకు/ జిల్లాలకు ఆప్షన్ ద్వారా పంపించడానికి చర్యలు తీసుకుని ఆర్డర్‌టుసర్వ్‌ను రద్దు చేయాలి. ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించడం కోసం పీఆర్సీ సూచన మేరకు ఒక శాతం మూల వేతనాన్ని ప్రభుత్వ కార్పస్ ఫండ్‌కు ఇవ్వడానికి రాష్ట్రంలోని ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు తదితర ఉద్యోగులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేసేలా జీవో విడుదల చేయాలి. ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో ఉన్న వ్యత్యాసాలను సవరించడానికి అనమలీస్ కమిటీని ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీలతో ఏర్పాటు చేయాలి. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలి. ఆంధ్రాలో మిగిలి ఉన్న జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ స్థాయి, గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలి. కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ శాఖల్లో జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయాలి. -
సొంతింటికి వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్
బంజారాహిల్స్ (హైదరాబాద్): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీమణి శోభతో కలిసి సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం.14 నందినగర్‌లోని తన సొంత ఇంటికి వచ్చారు. కొంత కాలంగా ఈ ఇంటిలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించేందుకు వచ్చారు. పావుగంట పాటు సీఎం కేసీఆర్ పనులను చూసి పలుచోట్ల మార్పులు, చేర్పులు సూచించారు. ఇదిలా ఉండగా ఆయన మనవడు హిమాన్షు ఉదయం ఈ ఇంటికి వచ్చి గంటపాటు ఉండి వెళ్లారు. -
కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా.. న్యాయం మావైపే..
అమరావతి: తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లపై కేంద్రం, కేఆర్ఎంబీ వద్ద వాదనలు వినిపిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేఆర్ఎంబీ మీటింగ్ వదిలి కేసీఆర్ ఢిల్లీ వెళ్తే ఏమవుతుంది? అని సజ్జల ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా... న్యాయం మావైపే ఉందని ఆయన అన్నారు. కేఆర్ఎంబీ మీటింగ్‌కు వచ్చి తెలంగాణ తమ వాదన వినిపిస్తే బాగుంటుందని ఆయన కోరారు. సమస్య ఇక్కడే పరిష్కారం అయ్యేది.. ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని అన్నారు. న్యాయబద్ధ హక్కు కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సజ్జల తెలిపారు. కేఆర్ఎంబీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్షించారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్ట్‌లు కేఆర్ఎంబీకి కనిపించడం లేదా? అని నిలదీశారు. విద్యుత్ పేరుతో అక్రమంగా నీటిని వృథా చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ సగం వాటా అడగడం అసంబద్ధం అని ఆయన విమర్శించారు. విభజన జరిగినప్పుడే ఎవరి వాటా ఏంటనేది నిర్ణయించారని సజ్జల గుర్తు చేశారు. ఇక ఈ సమస్యంతా చంద్రబాబు వల్లే వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆరోజు తెలంగాణ ప్రాజెక్ట్‌లపై మాట్లాడి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అన్నారు. నాడు పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి సీఎంని విమర్శించడం అర్ధరహితమిని, కృష్ణా జలాల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. -
27న అఖిల పక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించనుంది. రాష్ట్రంలోని దళితుల గుణాత్మక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ’సీఎం దళిత సాధికారత’ పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం ఈ నెల 27న ప్రగతి భవన్లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం ప్రారంభంకానున్న ఈ సమావేశం రోజంతా కొనసాగనుంది. అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల శాసనసభా పక్షనేతలు కూడా పాల్గొంటారు. వీరికి అధికారికంగా ఆహ్వానాలు పంపించనున్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాల్సిందిగా ఇప్పటికే ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభధ్రంకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి కోరారు. దళితుల సమస్యల పట్ల అవగాహన కలిగి, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులను ఆహ్వానించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దళితుల సంక్షేమానికి సర్కారు కృషి ‘నూతన తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మారుమూలన ఉన్న దళితులు తమ జీవితాల్లో గుణాత్మక అభివృద్ధిని మరింతగా సాధించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలో, ఈ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరం చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం.’ అని కేసీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరేళ్ల విరామం తర్వాత రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఇది రెండోసారి. తొలిసారిగా 2014 డిసెంబర్ 16న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పు అంశంపై రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష భేటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించారు. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్ళీ అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు. 2017 జనవరి 27న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. కానీ ఇందులో కొన్ని పార్టీల నేతలు మాత్రమే పాల్గొన్నారు. ఇది అఖిలపక్ష భేటీ అని ప్రభుత్వం కూడా చెప్పుకోలేదు. అయితే అసైన్డ్ భూముల సమస్యలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇప్పుడు సుమారు ఆరేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: ఈడీ విచారణకు హాజరుకాని ఎంపీ నామా -
కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి?
హైదరాబాద్: గులాబీ గూటికి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ అండ లేకుండానే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారా? అంటూ ఈటల రాజేందర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి? ఈటెల బీజేపీలో చేరి పెట్రోల్-డీజిల్ తగ్గిస్తారా? పోలవరం తరహాలో తెలంగాణకు జాతీయస్థాయి ప్రాజెక్టు రప్పిస్తారా? ఈటెలకు మర్యాద ఇవ్వలేదు అంటే ఎలా? మంత్రి పదవి ఇచ్చారు చాలదా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఈటలపై నమ్మకంతో కేసీఆర్ ఫ్లోర్ లీడర్ అవకాశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గొప్పతనాన్ని పొడిగిన విషయం గుర్తుచేసుకోవాలి అన్నారు. ఈటల వ్యక్తిగతంగా జరిగిన తప్పును నిరూపించుకోలేక నిరాశలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్లు ఈటలను పెంచి పోషించిన కేసీఆర్‌పై అబండాలు వెయ్యడం సరైంది కాదని, అన్నం పెట్టిన పార్టీపై విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇక ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వరవరరావుని జైల్లో పెట్టిన పార్టీలో ఎలా జాయిన్ అవుతారని అన్నారు. బీజేపీపై నెలక్రితం చేసిన విమర్శలు ఈటలకు గుర్తులేవా? అని ఆయన అడిగారు. నాడు దయ్యంలా కనిపించిన బీజేపీ.. నేడు దైవం అయ్యిందా? అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. చదవండి: వారు గాడిదపై ప్రయాణిస్తున్నట్టున్నారు! -
లాక్డౌన్: రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ
-
Telangana: నేటి నుంచి బడి బంద్..
ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఈనెల 24వ తేదీ నుంచి జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమా ప్రథమ, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ప్రకటించింది. మిగతా సెమిస్టర్ల వారికి ఆన్లైన్ తరగతులను నిర్వహించాలని ఆదేశించింది. జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు తమ పరిధిలోని కాలేజీల్లో ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని ఆదేశించాయి. అయితే సెమిస్టర్, సప్లిమెంటరీ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించాయి. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కూడా తమ పరిధిలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని వెల్లడించింది. ఇంటర్మీడియట్లో వచ్చే నెల ఏడో తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. విద్యాసంస్థల మూసివేత నేపథ్యంలో ప్రాక్టికల్స్ వాయిదా పడే పరిస్థితి ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కరోనా కేసులు పెరిగితే.. ప్రాక్టికల్స్‌కు బదులుగా ఇంటర్నల్ అసెస్మెంట్తో మార్కులు వేసే పరిస్థితి ఉండొ చ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తృతి నేపథ్యంలో విద్యాసంస్థలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని నాలుగు రోజుల కిందట సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం శాసనసభలో ప్రకటన చేశారు. పద్దులపై చర్చ సందర్భంగా మంత్రులు సమాధానం చెప్తున్న సమయంలో అత్యవసర ప్రకటన ఉం దంటూ స్పీకర్ పోచారం వెల్లడించారు. ఆ వెంటనే సబితారెడ్డి స్కూళ్లు, కాలేజీల మూసివేతకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘దేశంలో మరోసారి కరోనా తీవ్రంగా వ్యాపి స్తోంది. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుమదురుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి. దానివల్ల కరోనా విజృంభించే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థలను మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని విజ్ఞప్తులు వచ్చా యి. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట.. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ బుధవారం (24 మార్చి) నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య కళాశాలలు మినహా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలకు వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించినట్టుగా ఆన్లైన్ శిక్షణ తరగతులు కొనసాగుతాయి..’’ అని సబితారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని ఆమె కోరారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష బోధన ప్రారంభమై 50 రోజులు కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చిలో విద్యా సంస్థలను మూసివేసింది. చాలా వరకు పరీక్షలను కూడా రద్దు చేసి, విద్యార్థులను ప్రమోట్ చేసింది. తర్వాత జూన్‌లో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం కూడా వాయిదా పడింది. చివరికి విద్యార్థులు నష్టపోతున్నారనే ఆలోచనతో.. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్/ డిజిటల్ విద్యా బోధనను ప్రారంభించింది. చాలా వరకు కార్పొరేట్, పెద్ద ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ విద్యా బోధన చేపట్టగా.. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలను (టీశాట్, దూరదర్శన్ పాఠాలు, యూట్యూబ్‌లో వీడియో పాఠాలు) పాఠాలను ప్రారంభించారు. సాధారణ స్కూళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలలకు అమలుచేసిన డిజిటల్ పాఠాలనే విద్యార్థులకు సూచించాయి. ఇలా ఐదు నెలలు కొనసాగాయి.కరోనా నిబంధనల్లో చాలా వరకు సడలింపులు ఇవ్వడం, సాధారణ జనజీవనం మొదలుకావడం, ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇవ్వాలని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఒత్తిడి తేవడంతో.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో అన్ని కోర్సులకు, స్కూళ్లలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించవచ్చని ఫిబ్రవరి 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యాజమాన్యాలు స్కూళ్లు, కాలేజీలు తెరిచాయి. తర్వాత అదే నెల 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారికి కూడా ప్రత్యక్ష బోధన మొదలైంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలు చేసుకున్నాయి. కానీ మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో విద్యాసంస్థల మూసివేతకు సర్కారు నిర్ణయం తీసుకుంది. అన్నింటిలో ఆన్లైన్ తరగతులనే కొనసాగించాలని ప్రకటించింది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై తర్వాత నిర్ణయం విద్యాసంస్థల మూసివేతపై అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన అనంతరం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి అనుగుణంగా పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన కూడా డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల బంద్‌కు సంబంధించి చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే గతంలో ఆన్లైన్ విద్యా బోధన నిర్వహించినపుడు ప్రభుత్వ టీచర్లు, కాలేజీల లెక్చరర్లు రొటేషన్ పద్ధతితో 50 శాతం చొప్పున హాజరయ్యారు. ఇప్పుడు వారి విషయంలో స్పష్టత ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం మే ఒకటో తేదీ నుంచి ఇంటర్, అదే నెల 17వ తేదీ నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు జరగాల్సి ఉంది. వీటిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేస్తున్నామని.. టెన్త్, ఇంటర్, ఇతర పరీక్షల విషయంలో ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆయా పరీక్షలకు ఇంకా సమయం ఉందని చెప్పారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు. 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయన్నారు. హైదరాబాద్‌లోని అన్ని చెరువులు పూర్తిగా నిండాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులకు గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. ( డ్రైనేజీ సిస్టం దారుణంగా ఉంది: కిషన్‌రెడ్డి ) కాగా, భారీ వర్షాలు, వరదలు కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకునేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత సోమవారం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి రూ.లక్ష.. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున తక్షణసాయం, వరదతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థికసహాయం అందజేస్తామని చెప్పారు. ఈ సహాయం అందించేందుకు మున్సిపల్ శాఖకు.. రూ.550 కోట్లు విడుదల చేశారు.