సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు కరోనా లాక్‌డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. రాత్రి పూట కర్ఫ్యూ యథాతథంగా అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. మే 5వ తేదీన మరో మారు మంత్రి వర్గ సమావేశం నిర్వహించి అప్పటి కరోనా పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ 20వ తేదీనుంచి సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో సడలింపులు ఇవ్వటం లేదు. నిత్యావసరాలకు తప్ప రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు లేవు. ప్రజారోగ్యమే మాకు ముఖ్యం.
దేశంలో ఎనిమిది రోజులకో సారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తెలంగాణలో కరోనా వైరస్ కంట్రోల్‌లో ఉంది. కేసుల సంఖ్య రెట్టింపు కావటానికి 10 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతోంది. జబ్బు సోకిన వారిలో మరణించే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా 3.22 శాతం, తెలంగాణలో 2.44 శాతం ఉంది. డెత్ రేట్‌లో కూడా మనం తక్కువే ఉన్నాం. వైద్య సిబ్బందికి అవసరమైన మెడికల్ పరికరాలు పూర్తి స్థాయిలో వచ్చాయి. జబ్బును కంట్రోల్ చేయటానికి అవసరమైన మందులు కూడా సరిపడా ఉన్నాయి.
మే 1వ తేదీ తరువాత కేసులు తగ్గే అవకాశం ఉంది. విదేశాలనుంచి వచ్చిన వారంతా డిశ్చార్జ్ అయిపోయారు. పండుగలు, ప్రార్థనలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్లలోనే చేసుకోవాలి. ఇది ఏ ఒక్క వర్గానికో, మతానికో పరిమితం కాదు. అందరూ ఈ నియమాలను పాటించి తీరాలి. సామూహిక ప్రార్థనలు అనుమతించబడవు. మక్కా, జుమ్మా మసీదుల్లో కూడా ఇద్దరు.. ముగ్గురు మాత్రమే ఉండి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అన్ని ఆలయాలు మూసివేశారు. తిరుపతి, శ్రీశైలం, వేములవాడ, యాదాద్రి దేవాలయాలు కూడా మూసివేశారు. సిగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ సర్వీసులు నిలిపివేస్తున్నాము. దీని వల్ల ప్రభుత్వానికి వాటినుంచి వచ్చే టాక్స్ కూడా రాదు.. అయినా తప్పడం లేదు.
మే7 తరువాత కూడా పెళ్లిళ్లు, ఫంక్షన్లు అనుమతించబడవు. మ్యారేజ్ హాల్స్ అన్నింటిని ధాన్యం నిలువకోసం ఉపయోగించాలని నిర్ణయించాం. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నాం. మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు జరుగుతుంది. ఇప్పటి వరకు 50 వేల వాహనాలు సీజ్ చేశారు. ఎవ్వరు కూడా బయటికి రావొద్దు. అద్దె ఇంట్లో ఉండేవారినుంచి యాజమానులు మే నెల వరకు అద్దె తీసుకోవద్దు.. ఇది రిక్వెస్ట్ కాదు, ప్రభుత్వం ఆర్డర్. ఎవరైనా అద్దె అడిగితే 100కి డయల్ చేయొచ్చ’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment