సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీర వనిత, వన దేవత.. ‘సమ్మక్క’పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు బ్యారేజీకి ‘సమ్మక్క బ్యారేజీ’గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని ఇంజనీర్–ఇన్–చీఫ్ మురళీధర్‌రావును ఆదేశించారు. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలు బలంగా ఉండటంతోనే రాష్ట్రంలో అభివృద్ధి అనుకున్న రీతిలో సాగుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తై బీడు భూముల్లోకి కాళేశ్వరం నీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు. కాగా, సీఎం కేసీఆర్ గురువారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. బుధవారం రాత్రి ఆయన కరీంనగర్ జిల్లా తీగలగట్టుపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడే బస చేసి గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తా రు. తర్వాత లక్ష్మీ బ్యారేజీని సందర్శించి, అక్కడే మధ్యాహ్న భోజనం చేసి తిరిగి తీగలగట్టుపల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.
నీటి విడుదలపై సమీక్ష...
సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వర్లు, ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండేతో సమీక్ష నిర్వహించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుతోంది. బ్యారేజీలు నిండుకుండలా మారినయ్. రానున్న వానా కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీకి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసే దిశగా.. అటు నుంచి కాలువలకు మళ్లించేలా.. ఇరిగేషన్ శాఖ అప్రమత్తం కావాలి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు కమలాకర్, అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి బ్యారేజీలో ప్రస్తుతం 16.12 టీఎంసీ నిల్వలకు గాను 14 టీఎంసీల మేర నిల్వలు ఉన్నాయి. దీంతో లక్ష్మి పంప్‌హౌజ్ పరిధిలో 11 పంప్‌లను రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా సిద్ధం చేశారు.
ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరు రిజర్వాయర్ ద్వారా ఎల్‌ఎండీకి తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మి బ్యారేజీలో ఉన్న నీటిని ఎల్లంపల్లికి తరలించడంపై కేసీఆర్ గురువారం నాటి పర్యటన సందర్భంగా అధికారులకు ఆదేశాలిచ్చే అవకాలున్నాయి. ఇదిలా ఉండగా, తుపాకులగూడెం బ్యారేజీకి వనదేవత శ్రీసమ్మక్క పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment