జలకళతో ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్‌ | Master Plan For Use Godavari Water Through Kaleshwaram | Sakshi
Sakshi News home page

జీవధార ఆరదు..

Published Sat, Feb 15 2020 3:05 AM | Last Updated on Sat, Feb 15 2020 5:04 AM

Master Plan For Use Godavari Water Through Kaleshwaram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి నదిలోని ఒక్క నీటి చుక్కనూ వదలొద్దనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా నీటిని ఒడిసిపట్టే బృహత్‌ ప్రణాళికను సిద్ధం చేసింది. గోదావరి నీటిని వినియోగిస్తూ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ప్రతి బ్యారేజీ, రిజర్వాయర్‌లో నీటిని రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తూనే నిరంతరం అవి జలకళతో ఉట్టిపడేలా మాస్టర్‌ప్లాన్‌ వేసింది. ఇప్పటికే ఖాళీ అయిన లోయర్‌మానేరు డ్యామ్‌కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం... మరోపక్క ఎల్లంపల్లిని నింపేందుకు నిండుగా ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ నుంచి పంపింగ్‌ మొదలుపెట్టింది. ఏప్రిల్‌లో మేడిగడ్డ మొదలు అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీలను పూర్తిగా ఖాళీ చేసి ఆ నీటితో దిగువన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని తరలించేలా ప్రణాళిక తయారు చేసింది. మొత్తంగా మేడిగడ్డ నుంచి లోయర్‌ మానేరు వరకు 100 టీఎంసీలు నిరంతరం లభ్యతగా ఉండేలా, జూన్‌లో ఖరీఫ్‌ మొదలయ్యే నాటికి ఎస్సారెస్పీలో కనీసం 50 టీఎంసీల నీటి లభ్యత పెంచేలా భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది.

ఎల్‌ఎండీకి సాగుతున్న తరలింపు...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా ఎల్‌ఎండీకి నీటి తరలింపు కొనసాగుతోంది. రాత్రి సమయంలో నంది, గాయత్రి పంపులను 8 గంటలపాటు నడుపుతూ ఎల్లంపల్లి నుంచి నీటిని ఎల్‌ఎండీకి తరలిస్తున్నారు. రోజుకు అర టీఎంసీకి తగ్గకుండా సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇప్పటివరకు 2 టీఎంసీల మేర నీటిని తరలించగా ఎల్‌ఎండీలో ప్రస్తుతం 24 టీఎంసీలకుగాను 8.35 టీఎంసీల నిల్వలున్నాయి. మరో వారంపాటు ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించి 13 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు మిడ్‌మానేరులో నీటి నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 25.87 టీఎంసీలకుగాను 24.63 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.

ఎల్లంపల్లికి మొదలైన ఎత్తిపోత...
ఎల్‌ఎండీకి నీటిని తరలిస్తుండటంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను 10.98 టీఎంసీ ల మేర నిల్వలున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లికి మరో 5 టీఎంసీల మేర నీటిని తరలించాలని గురువారం కాళేశ్వరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో నిండుకుండలా ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని తరలించేలా శుక్రవారం రాత్రి మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని మోటార్లను ప్రారంభించి ఎత్తిపోతల మొదలుపెట్టారు. ప్రస్తుతం మేడిగడ్డలో 16.12 టీఎంసీలకుగాను 14.80 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడి నుంచి 5 టీఎంసీలను అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల ద్వారా ఎల్లంపల్లికి తరలించనున్నారు. మేడిగడ్డలో 11 మోటార్లు సిద్ధంగా ఉండగా ఎన్ని మోటార్లతో ఎంతమేర నీటిని, ఎన్ని రోజులపాటు నడపాలన్నది విద్యుత్‌ శాఖ సూచనల మేరకు నిర్ణయించనున్నారు. ఇక అన్నారంలో ఇప్పటికే 10.87 టీఎంసీలకుగాను 6 టీఎంసీలు, సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 4.5 టీఎంసీల మేర నిల్వలున్నాయి.

ఏప్రిల్‌లో మూడు బ్యారేజీలు ఖాళీ...
ప్రస్తుతం మేడిగడ్డ మొదలు ఎల్‌ఎండీ వరకు 100 టీఎంసీలకుగాను సుమారు 70 టీఎంసీల మేర నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లిని ఖాళీ చేస్తూ ఎల్‌ఎండీని నింపుతుండగా ఎల్లంపల్లిని నింపేందుకు మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించారు. దీంతో ఎల్లంపల్లి నుంచి ఎల్‌ఎండీ వరకు నీటి లభ్యత గణనీయంగా పెరగనుంది. ఇక వర్షాకాలం ప్రారంభమైతే జూన్‌ 15 నుంచే మేడిగడ్డ వద్ద గోదావరి నీటి లభ్యత పెరుగుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రోజుకు కనీసం 2 టీఎంసీల మేర మొత్తంగా 530 టీఎంసీలను ఎత్తిపోసేలా ఇప్పటికే మోటార్లు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో లభ్యతగా ఉండే నీటినంతా ఖాళీ చేసి దిగువ ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు వదలాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. వాటిల్లో లభ్యతగా ఉన్న సుమారు 25 టీఎంసీల మేర నీటిని దిగువకు వదిలి మిగతా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయనున్నారు. బ్యారేజీలను ఖాళీ చేసి వాటిలో ఏమైనా మరమ్మతులు చేయాల్సి ఉన్నా పగుళ్లు, లీకేజీలు వంటివి ఏమైనా ఉంటే వాటిని గుర్తించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయనున్నారు. జూన్‌లో మళ్లీ గోదావరిలో ప్రవాహాలు మొదలయ్యే నాటికి అన్ని పరిశీలనలు, మరమ్మతులు చేసి ఎత్తిపోతలకు వాటిని సిద్ధంగా ఉంచనున్నారు. 

జూన్‌లోనే ఎస్సారెస్పీ నుంచి సాగుకు నీళ్లు..
అయితే బ్యారేజీలను ఖాళీ చేసే సమయంలో నీటిని దిగువ ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్‌ఎండీలను నింపుతూనే మరోపక్క కొంత నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం దాని కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో 90 టీఎంసీలకుగాను 62 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ప్రస్తుత యాసంగిలో మరో 25 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్‌లో బ్యారేజీలను ఖాళీ చేసే సమయానికి ఎస్సారెస్పీలో 36–37 టీఎంసీల మేర నిల్వ ఉంటుంది. బ్యారేజీల నుంచి వదిలే 24 టీఎంసీల్లో కనీసం 15–20 టీఎంసీలను ఎస్సారెస్పీకి తరలిస్తే అక్కడ 50 టీఎంసీల మేర లభ్యత పెరుగుతుంది. ఈ లభ్యత నీటితో జూన్‌ నుంచే ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. నిజానికి ఎస్సారెస్పీకి ఆగస్టు వరకు ఎగువ నుంచి ప్రవాహాలు రావు. కానీ ప్రస్తుతం కాళేశ్వరం నీటితో జూన్‌ నుంచే లభ్యత పెంచడంతోపాటు సాగుకు నీటి విడుదల సాధ్యమయ్యేలా ప్రణాళిక రచించారు.

సమాంతరంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం..
కృష్ణా, గోదావరి నీటిని కాల్వల ద్వారా ఆయకట్టుకు మళ్లిస్తున్న ప్రభుత్వం... వాటి నిర్మాణాలకు సమాంతరంగా రాష్ట్ర పరిధిలో కురిసే ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడ ఒడిసిపట్టేలా భారీగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపడుతుండటం తెలిసిందే. తొలి విడతగా ఈ ఏడాది 615 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయించగా ఇందులో గోదావరి పరిధిలో 410, కృష్ణాలో 205 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని ఈ ఏడాది వర్షాలు కురిసే నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కాళేశ్వరం కాల్వల పరిధిలోని 150 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించగా ఇందులో కరీంనగర్‌ జిల్లా పరిధిలోవే 32 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. కాళేశ్వరం పరిధిలోని చెక్‌డ్యామ్‌లను జూన్‌ నాటికి పూర్తి చేస్తే వాటి కింద నీటి కట్టడి సాధ్యం కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement