సాక్షి, హైదరాబాద్ : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో నదిలో ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు రెండువేల క్యూసెక్కుల మేర ఉన్న ప్రవాహాలు ఆదివారం ఐదు వేలకు పెరిగాయి. ఈసారి మంచి వర్షాలే పడతాయన్న అంచనాల నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా ఆచితూచి, సమగ్ర ప్రవాహ అంచనాతో ఎత్తిపోతలు చేపట్టాలని ప్రభుత్వం భావి స్తోంది. కడెం నుంచి ప్రవాహాలు మొదలైతే ఎత్తిపోతలు చేపట్టే అవసరం ఉండదని భావిస్తోంది.
అన్నీ లెక్క చూసుకొనే ఎత్తిపోత
గడిచిన రెండు మూడ్రోజులుగా ఎగువన మహారాష్ట్రలో మంచి వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద పెరిగింది. ఆదివారం ఉదయానికి మేడిగడ్డ వద్ద 5,200 క్యూసెక్కుల మేర వరద కొనసాగగా, సాయంత్రానికి 18 వేల క్యూసెక్కులకు చేరింది. మరిన్ని రోజులు మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే ప్రవాహాలు పెరిగే చాన్స్ ఉంది. రాష్ట్రంలోనూ ఈ ఏడాది మంచి వర్షాలుంటాయనే అంచనాలున్నాయి. దీంతో గోదావరి బేసిన్‌లోని కడెం ప్రాజెక్టుకు జూన్ చివరి వారం నుంచే ప్రవా హాలు నమోదవుతాయని భావిస్తున్నారు. ప్రస్తు తం కడెంలో 7.60 టీఎంసీలకు 3.14 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. దీనిలోకి గతేడాది గరిష్టంగా 40–50వేల క్యూసెక్కుల వరకు సైతం ప్రవాహాలు కొనసాగిన సందర్భాలున్నాయి. అదే జరిగితే ప్రాజెక్టు ఒక్కరోజులోనే నిండుతుంది.
కడెం నుంచి దిగువకు ఏటా 15–20 టీఎంసీల మేర వరద దిగువకు వస్తుంటుంది. ఇది ఎల్లంపల్లికి చేరుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 5.50 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎల్లంపల్లి సైతం నిండితే గ్రావిటీ ద్వారా నీరు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ద్వారా మేడిగడ్డకు ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. గతేడాది మేడిగడ్డ ద్వారా నీటిని ఎత్తి మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల నింపాక కడెం, ఎల్లంపల్లి నుంచి భారీగా వరద ప్రవాహాలు వచ్చాయి. దీంతో చాలా నీరు తిరిగి నదిలో కలిసిపోయింది. గతానుభవాల దృష్ట్యా, ఈ ఏడాది వర్షపాతం, ఎగువ నుంచి వచ్చే అంచనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరైన అంచనా లేకుండా నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నడిపిస్తే కరెంట్ ఖర్చు అనవసరపు భారం కానుంది. మేడిగడ్డలో నీటి నిల్వ 0.6 టీఎంసీల డెడ్ స్టోరేజీ ఉండగా, అన్నారంలో 2టీఎంసీలు, సుందిళ్లలో 2టీఎంసీల మేర నిల్వలున్నాయి. వీటిని అంచనా వేసుకుంటూ దిగువన ఎల్లంపల్లి మొదలు, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గోదావరి ఎత్తిపోతలను మొదలుపెట్టే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment