yellampalli project
-
మంచిర్యాల జిల్లాలో పొంగి పొర్లుతోన్న వాగులు, వంకలు
-
ఆచితూచి ఎత్తిపోత!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో నదిలో ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు రెండువేల క్యూసెక్కుల మేర ఉన్న ప్రవాహాలు ఆదివారం ఐదు వేలకు పెరిగాయి. ఈసారి మంచి వర్షాలే పడతాయన్న అంచనాల నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా ఆచితూచి, సమగ్ర ప్రవాహ అంచనాతో ఎత్తిపోతలు చేపట్టాలని ప్రభుత్వం భావి స్తోంది. కడెం నుంచి ప్రవాహాలు మొదలైతే ఎత్తిపోతలు చేపట్టే అవసరం ఉండదని భావిస్తోంది. అన్నీ లెక్క చూసుకొనే ఎత్తిపోత గడిచిన రెండు మూడ్రోజులుగా ఎగువన మహారాష్ట్రలో మంచి వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద పెరిగింది. ఆదివారం ఉదయానికి మేడిగడ్డ వద్ద 5,200 క్యూసెక్కుల మేర వరద కొనసాగగా, సాయంత్రానికి 18 వేల క్యూసెక్కులకు చేరింది. మరిన్ని రోజులు మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే ప్రవాహాలు పెరిగే చాన్స్ ఉంది. రాష్ట్రంలోనూ ఈ ఏడాది మంచి వర్షాలుంటాయనే అంచనాలున్నాయి. దీంతో గోదావరి బేసిన్‌లోని కడెం ప్రాజెక్టుకు జూన్ చివరి వారం నుంచే ప్రవా హాలు నమోదవుతాయని భావిస్తున్నారు. ప్రస్తు తం కడెంలో 7.60 టీఎంసీలకు 3.14 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. దీనిలోకి గతేడాది గరిష్టంగా 40–50వేల క్యూసెక్కుల వరకు సైతం ప్రవాహాలు కొనసాగిన సందర్భాలున్నాయి. అదే జరిగితే ప్రాజెక్టు ఒక్కరోజులోనే నిండుతుంది. కడెం నుంచి దిగువకు ఏటా 15–20 టీఎంసీల మేర వరద దిగువకు వస్తుంటుంది. ఇది ఎల్లంపల్లికి చేరుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 5.50 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎల్లంపల్లి సైతం నిండితే గ్రావిటీ ద్వారా నీరు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ద్వారా మేడిగడ్డకు ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. గతేడాది మేడిగడ్డ ద్వారా నీటిని ఎత్తి మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ల నింపాక కడెం, ఎల్లంపల్లి నుంచి భారీగా వరద ప్రవాహాలు వచ్చాయి. దీంతో చాలా నీరు తిరిగి నదిలో కలిసిపోయింది. గతానుభవాల దృష్ట్యా, ఈ ఏడాది వర్షపాతం, ఎగువ నుంచి వచ్చే అంచనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరైన అంచనా లేకుండా నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నడిపిస్తే కరెంట్ ఖర్చు అనవసరపు భారం కానుంది. మేడిగడ్డలో నీటి నిల్వ 0.6 టీఎంసీల డెడ్ స్టోరేజీ ఉండగా, అన్నారంలో 2టీఎంసీలు, సుందిళ్లలో 2టీఎంసీల మేర నిల్వలున్నాయి. వీటిని అంచనా వేసుకుంటూ దిగువన ఎల్లంపల్లి మొదలు, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గోదావరి ఎత్తిపోతలను మొదలుపెట్టే అవకాశం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. -
ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోత
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత మళ్లీ మొదలైంది. లోయర్ మానేరు డ్యామ్(ఎల్ఎండీ)లో నీటి నిల్వలు తగ్గడంతో ఎల్లంపల్లి దిగువన ఉన్న పంపుల ద్వారా నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల ప్రకారం ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా ఎల్ఎండీకి 5 టీఎంసీల మేర నీటిని తరలించాలని నిర్ణయించినట్లు నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎస్సారెస్పీ–2 కింద చివరకు చేరిన నీరు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నింపుతూనే ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్ఎండీలను పూర్తిగా నింపారు. 24 టీఎంసీల పూర్తి సామర్థ్యాన్ని చేరిన అనంతరం ఎల్ఎండీ నుంచి దాని కింద ఉన్న ఎస్సారెస్పీ–2 ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేందుకు నీటిని వినియోగిస్తూ వచ్చారు. ఎస్సారెస్పీ–2 కింద నిర్ణయించిన 592 చెరువులను నింపుతూ, వరంగల్ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించారు. దీంతో సూర్యాపేట జిల్లాలో చిట్టచివర ఉన్న పెన్‌పహాడ్ మండలంలోని మాచారం రాయిచెరువుకు గోదావరి నీళ్లు చేరాయి. ఎస్సారెస్పీ–2కి నీటి విడుదల జరగడంతో ఎల్ఎండీలో నిల్వ 24 టీఎంసీలకు గానూ 8.31 టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతం ఎల్ఎండీ నుంచి మరింత నీటి విడుదల అవసరాలున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరు మీదుగా తరలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం ఎల్లింపల్లిలో 20.18 టీఎంసీలకు గానూ 13.40 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అక్కడి నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలోని 5 మోటార్లను సోమవారం రాత్రి 9 గంటలకు ప్రారంభించి సుమారు 16వేల క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. రాత్రి సమయంలో విద్యుత్ కొనుగోళ్ల ధరలు తక్కువ ఉంటున్న నేపథ్యంలో రాత్రిపూట 8 గంటల పాటు నడపాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు చెబుతున్నారు. దీంతో మంగళవారం సైతం ఇదేరీతిన మోటార్లను నడిపించి నీటిని మిడ్‌మానేరుకు ఎత్తిపోశారు. ఇక మిడ్‌మానేరులో 25 టీఎంసీల మేర నిల్వ తగ్గకుండా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎల్ఎండీకి తరలిస్తున్నారు. కనిష్టంగా ఎల్ఎండీలో నిల్వలు 13 టీఎంసీలకు చేరే వరకు నీటి పంపింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఇక నీటి ఎత్తిపోతలతో ఎల్లంపల్లిలో నిల్వలు తగ్గితే, ఎగువ మేడిగడ్డ నుంచి నీటిని తరలించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
అదనపు టీఎంసీకి శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరంలో అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ పనుల వేగిరానికి శ్రీకారం చుడుతోంది. మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే 3వ టీఎంసీ నీటిని తీసుకునేలా పంప్‌హౌస్‌ల నిర్మాణం కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు ఉన్న పనులు జరుగుతున్నాయి. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు మొత్తంగా రూ.25 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టే కసరత్తులు చేస్తోంది. వచ్చే నెలలో సీఎం శంకుస్థాపన.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీ, దిగువన ఒక టీఎంసీ నీటిని తీసుకునేలా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం అదనంగా మరో టీఎంసీని తీసుకుంటూ మిడ్‌మానేరు వరకు 3 టీఎంసీలు, దిగువన 2 టీఎంసీల నీటిని తీసుకునేలా పనులు చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లలో ఉన్న 28 పంపులకు అదనంగా మరో 15 పంపుల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు పనులను త్వరగా చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో నీటి పారుదల శాఖ ఎల్లంపల్లి నుంచి రెండు పంప్‌హౌస్‌లను నిర్మించి, దేవికొండ రిజర్వాయర్ ద్వారా వరద కాల్వ నుంచి నీటిని మిడ్‌మానేరు తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 3 టీఎంసీల మేర నీటిని తరలించేలా వరద కాల్వను మరింత వెడల్పు చేయాలని నిర్ణయించి ఈ ప్రక్రియకు మొత్తంగా రూ.11,800 కోట్లు అవుతుందని లెక్కించారు. ఈ పనులను 4 లేక 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు పైప్‌లైన్ నిర్మాణానికి రూ.10,260 కోట్లు కలిపి మొత్తంగా రూ.14,362 కోట్ల మేర వ్యయం కానుంది. ఈ పనులను సైతం 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచే యోచనలో నీటి పారుదల శాఖ అధికారులు ఉన్నారు. మొత్తంగా రూ.25 వేల కోట్ల పనులకు ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ముగించేలా కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే అవకాశముంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే అదనపు టీఎంసీ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఎత్తిపోతలకు కుదరని ముహూర్తం.!
సాక్షి, రామగుండం: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1లో భాగంగా కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోయడం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం పంపుహౌజ్‌ల నుంచి ఎత్తిపోతలు ప్రారంభించి రివర్స్ పంపింగ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–1లో చివరి పార్వతీ (సుందిళ్ళ–గోలివాడ) పంపుహౌజ్ ఎత్తిపోతలకు ముహుర్తం కుదరడం లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ఇన్‌ఫ్లో భారీగా వస్తుండడంతో ఎల్లంపల్లి నిండుకుండను తలపిస్తుంది. గతేడాదితో పోల్చితే ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు మూడు దఫాలుగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. ఫలితంగా పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎల్లంపల్లిలోకి రివర్స్ పంపింగ్‌తో ఎత్తిపోతలు ప్రారంభించలేదు. జూలై 31న తొలిసారి పంపుహౌజ్‌లో ఒకటవ నెంబర్ మోటార్‌కు వెట్ రన్ చేసిన అధికారులు క్రమంగా నాలుగు, ఐదు రోజుల వ్యవధిలో దశల వారీగా అన్ని మోటార్లను వెట్ రన్ నిర్వహించి ఎత్తిపోతలకు సిద్ధం చేసినా ఇంకా వాటితో అవసరం పడడం లేదు. ప్రకృతి అనుకూలించడంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎల్లంపల్లి నుంచి వదిలిన నీరు సుందిళ్ల బ్యారేజీకి చేరాయి. అక్కడ వరద నీటి నిల్వలు పెరగడంతో, గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఫలితంగా పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎత్తిపోతలు చేపట్టే అవకాశాలు లేకపోవడంతో మరింత కాలం పట్టే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ అధికార యంత్రాంగం పేర్కొంటుంది. పార్వతీ పంపుహౌజ్‌లో ఉన్న తొమ్మిది మోటార్లను అధికారులు వెట్ రన్ నిర్వహించి సిద్ధంగా ఉంచారు. ఒక్కో మోటారు 40 మెగావాట్ల సామర్థ్యం గల 24 గంటలు నిరంతరంగా మోటారు నడిపిస్తే 2,600 క్యూసెక్కులను ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. తొమ్మిది మోటార్లు నిరంతరంగా 24 గంటలు నడిపిస్తే 23,400 క్యూసెక్కులను ఎత్తిపోయవచ్చన్నారు. కాగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీ ద్వారా నీటి మళ్లింపు జరిగి, ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకుంటేనే పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు 148 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీలు వరద నీరు కాగా ప్రస్తుతం 148 మీటర్ల ఎత్తులో 19.60 టీఎంసీలు నిల్వ ఉంది. ఫలితంగా పార్వతీ పంపుహౌజ్ డెలివరీ సిస్టర్న్ వరకు వరద నీటి ఉధృతి ఉంది. ఏది ఏమైనా ప్రకృతి సహకరించడంతో భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో పార్వతీ పంపుహౌజ్ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలకు ముహుర్తం రాకపోవడం గమనార్హం. నిండుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 148 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీ సామర్థ్యం కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 147.8 మీటర్ల ఎత్తులో 19.65 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి మంగళవారం ఇన్‌ఫ్లో 46,898 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 54,190 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టుకు మధ్యలో పది గేట్లను మీటరు ఎత్తు వరకు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. -
పది టీఎంసీలకు పడిపోయిన ‘ఎల్లంపల్లి’
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): తగ్గుముఖం పట్టిన వర్షాలు... ఎగువ ప్రాంతాల నుంచి నిలిచిన నీటి ప్రవాహం... హైదరాబాద్‌కు నీటి తరలింపు.. తదితర కారణాల వల్ల ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టులోని నీటి మట్టం రోజురోజుకు తగ్గుతూ వస్తుంది. 10 రోజుల క్రితం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 10.679 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 19.700 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. వర్షాలు పడి భారీ నీటి నిల్వలతో ఉన్న ప్రాజెక్టు ఇలా ఖాళీ అవ్వడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. ప్రాజెక్టు 148 మీటర్ల క్రస్ట్ లెవెల్‌కు గాను 144 మీటర్లు ఉండగా 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 10.679 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో లేదు. ఇక హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్(సుజల స్రవంతి పథకం) ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌కు 300ల క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని, మిషన్ భగీరథ కింద పెద్దపల్లి–రామగుండం నీటి పథకానికి 63 క్యూసెక్కులు, మంచిర్యాల నియోజకవర్గానికి 15 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఎల్లంపల్లి ప్రాజెక్టు సగం ఖాళీ..!
సాక్షి, రామగుండం: ఎత్తిపోతలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు క్రమంగా ఖాళీ అవుతుండడంతో ప్రస్తుతం నీటి సామర్థ్యం సగానికి చేరింది. కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసిన నీరు అన్నారం బ్యారేజీ వరకు, అక్కడి నుంచి పార్వతీ (సుందిళ్ల) బ్యారేజీలో ఉన్న నీటిని పార్వతీ (గోలివాడ–సుందిళ్ల) పంపుహౌస్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పంపింగ్ చేస్తారు. ఈ క్రమంలో గత నెల 31న పార్వతీ పంపుహౌస్ నుంచి ఒక మోటారు రన్ చేసి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోశారు. అప్పటికే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో క్రమంగా ఎల్లంపల్లిలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో మోటార్లకు టెస్టింగ్ చేసే నిమిత్తం అరగంట పాటు రన్చేసి ఆఫ్ చేశారు. కాళేశ్వరం–ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలు విజయవంతం కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్–1 పూర్తయింది. సగానికి పడిపోయిన నీటి మట్టం.. గడిచిన వారం రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6లో భాగంగా ప్రాజెక్టులోకి బ్యాక్ వాటర్‌ను పంపింగ్ చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతుంది. దీనికి తోడు ఎగువన భారీ వర్షాలు, వరదలు నిలిచిపోవడంతో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో నిలిచిపోవడంతో ఇందులోని వాటర్ క్రమంగా రివర్స్ పంపింగ్ విధానం చేపడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వేంనూర్ నుంచి నంది మేడారం చెరువులోకి గ్రావిటీ ద్వారా వెళుతుంది. అక్కడ నాలుగు మోటార్లతో 3,500 క్యూసెక్కులు వరద కాల్వకు ఎత్తిపోయడంతో అవి మిడ్‌మానేర్‌కు చేరుతున్నాయి. మిడ్ మానేర్ గేట్లు ఎత్తివేయడంతో లోయల్ మానేర్ డ్యాంలోకి చేరుతున్నాయి. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి మట్టం సగానికి పడిపోవడంతో పార్వతీ పంపుహౌస్ హెడ్ రెగ్యురేటర్, డెలివరీ సిస్టం వద్ద నీటి నిల్వలు కనుమరుగయ్యాయి. ఎల్లంపల్లి దిగువన ఇసుక తెప్పలు దర్శనమిస్తున్నాయి. వివిధ అవసరాలకు నీటి కేటాయింపులు.. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.915 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2,502 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 11,137 క్యూసెక్కులుగా ఉంది. కాగా ప్రాజెక్టు నుంచి నీటి కేటాయింపుల్లో అబ్దుల్ కలాం సుజల స్రవంతి తాగునీటి సరఫరాకు 336 క్యూసెక్కులు (2.64 టీఎంసీలు), కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6కు 10,588 క్యూసెక్కులు (13.03 టీఎంసీలు), రామగుండం–పెద్దపల్లి నియోజకవర్గాల తాగునీటి అవసరాలకు 59 క్యూసెక్కులు, మంచిర్యాల జిల్లా మిషన్ భగీరథకు 25 క్యూసెక్కులు, వేంనూర్ పంపుహౌస్‌కు 0.13 టీఎంసీలు, ఎన్టీపీసీకి 0.57 టీఎంసీలు, సాధారణ నష్టం 129 క్యూసెక్కులుగా ఉంది. ఫలితంగా వరద నీటి మట్టం సగానికి పడిపోయింది. ఎత్తిపోతలు ప్రారంభించేనా..! కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ విధానంలో భాగంగా కన్నెపల్లి బ్యారేజీ నుంచి సుందిళ్ల బ్యారేజీ, అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలకు అనుకూలంగా ఉండడంతో నీటిపారుదలశాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. కన్నెపల్లి బ్యారేజీ సామర్థ్యం 16 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండగా, అక్కడి నుంచి పంపింగ్ చేసి అన్నారం బ్యారేజీలోకి వరద నీటిని మళ్లిస్తారు. దీని సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం పది టీఎంసీలున్నాయి. అక్కడి నుంచి పంపింగ్ ద్వారా పార్వతీ (సుందిళ్ల) బ్యారేజీ మళ్ళిస్తారు. దీని సామర్థ్యం 8.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.24 టీఎంసీలు నిల్వ ఉంది. పార్వతీ పంపుహౌస్ ద్వారా ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయనున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి మట్టం/నీటి నిల్వ సగానికి చేరడంతో ఎత్తిపోతలు ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ఇప్పటికే పార్వతీ పంపుహౌస్‌లో ఆరు మోటార్లు రన్ చేసేందుకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆదేశాలు రాలేదు పార్వతీ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు ప్రారంభించాలనే విషయమై తమకు ఉన్నతాధికారుల నుంచి ఏలాంటి ఆదేశాలు జారీ కాలేదు. కాగా ఇప్పటికే పార్వతీ పంపుహౌస్‌లో ఆరు మోటార్లు వెట్‌రన్ చేసి సిద్ధం చేశాం. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన మరుక్షణమే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు ప్రారంభిస్తాం. – బండ విష్ణుప్రసాద్, ఈఈ, పార్వతీ బ్యారేజీ -
సోలార్ ప్లాంట్లు ఇవి నీటిపై తేలుతాయి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్ముందు భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తిని మరింత మెరుగుపరచుకునే అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పాదకతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో నీటితో ఉండే రిజర్వాయర్ల పరిధిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవకాశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. నీటిపై తేలియాడే సోలార్ పానెళ్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే దేశంలో పేరొందిన పలు సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కాళేశ్వరం పరిధిలోని ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, అనంతగిరి, రంగనాయక్‌సాగర్, కొండపోచమ్మ సాగర్ల పరిధిలో వీటి ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం పరిశీలన చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 28, 29న ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరులలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. కాళేశ్వరం బ్యారేజీలు, రిజర్వాయర్లే టార్గెట్.. రాష్ట్రంలో సోలార్ విద్యుదుత్పత్తి ప్రస్తుతం 3,700 మెగావాట్లకు చేరుకోగా, 2022 నాటికి 5వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. మరో అడుగు ముందుకేసి రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్‌ప్లాంట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 141 టీఎంసీల సామర్ధ్యంతో బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మల్లన్నసాగర్ వంటి 50 టీఎంసీల రిజర్వాయర్‌తో పాటు 20 టీఎంసీల ఎల్లంపల్లి, 25 టీఎంసీల మిడ్‌మానేరు, 15 టీఎంసీల కొండపోచమ్మసాగర్ వంటి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. గంధమల 9, బస్వాపూర్ 11 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుల్లో వాటర్ స్ప్రెడ్ ఏరియా చాలా ఉంటోంది. ఈ ఏరియాను వినియోగించుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. రిజర్వాయర్లపై తేలియాడే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా గణనీయంగా విద్యుత్ ఉత్పత్తి ఉంటుందని, ఇదే సమయంలో రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలను నివారించవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. నీటిపై తేలియాడే సోలార్ ప్యానెళ్లతో ఉత్పత్తయ్యే విద్యుత్, నాణ్యతతో పాటు పలు అంశాల్లో లాభదాయకంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా భూమిపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు ఖాళీ స్థలాలు అవసరమని, భారీ ప్లాంట్ల ఏర్పాటుకు ఖాళీ స్థలాల లభ్యత ఆషామాషీ వ్యవహారం కానందున, రిజర్వాయర్ల పరిధిలో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ఆమోదయోగ్యమని అంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపినట్లుగా తెలిసింది. అయితే కాళేశ్వరం పరిధిలో నది పరీవాహకంపై నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలో ప్యానెళ్ల నిర్మాణం కష్టసాధ్యమని, ఇక్కడ భారీ వరదలు వచ్చినప్పుడు సోలార్ ప్యానెళ్లు కొట్టుకొనిపోయే ప్రమాదం ఉంటుందని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు పరిధిలోనూ ఇదే సమస్య ఉంటుందన్నారు. అయితే అనంతగిరి, రంగనాయక్‌సాగర్, బస్వాపూర్, గంధమల, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల పరిధిలో మాత్రం వీటిని ఏర్పాటుచేసే వీలుంటుందని చెబుతున్నారు. అయితే వీటి నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలన్న దానిపై పూర్తి స్థాయి అధ్యయనం జరగాల్సి ఉందని అంటున్నారు. కాగా రిజర్వాయర్ల పరిధిలో సోలార్ పానెళ్ల ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 28, 29 తేదీల్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సింగరేణి కాలరీస్‌కు సంబంధించిన ఉన్నతాధికారులు మిడ్‌మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లిలో పర్యటించి నీటిపై తేలియాడే విద్యుత్ ప్లాంట్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. -
కుటుంబంలో మా ఆవిడ బంగారం: ఎమ్మెల్యే
వయస్సు ఏడు పదులు సమీపిస్తున్నా.. నవ యువకులు ఈర్ష్యపడే చురుకుదనం. మండుటెండను లెక్కచేయకుండా.. వేకువజాము నిద్రలేచింది మొదలు.. అర్ధరాత్రి వరకూ ప్రజాసేవలో తలమునకలవడం.. నిరుపేదలను ఆదుకోవడంలోనే తృప్తిని వెతుక్కునే నైజం. చిన్ననాటి నుంచే అలవడిన నాయకత్వ లక్షణం.. విద్యార్థి, కార్మిక, రాజకీయ నాయకుడిగా వివిధ దశల్లో ప్రజాసేవలో తరించడం. మంచిర్యాలలో పుట్టి.. పెరిగి.. ఇక్కడే చదివి.. ఇక్కడే ప్రజాసేవలో ఏడు దశాబ్దాలుగా పెనవేసుకున్న బంధం ఆయనది. కుటుంబం.. పిల్లల పెంపకంలో తన భార్య బంగారమని.. ఎల్ఐసీలో ఏజెంట్‌గా వచ్చిన గుర్తింపును ఎప్పటికీ మర్చిపోనని, దైవభక్తే తనను ముందుకు నడిపిస్తోందని అంటున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ‘సాక్షి’ పర్సనల్ టైమ్‌తో మరిన్ని విశేషాలు పంచుకున్నారు. సాక్షి, మంచిర్యాల: నేను పుట్టి పెరిగింది అంతా పాత మంచిర్యాలలోనే. అమ్మానాన్న నడిపెల్లి రమాదేవి, లక్ష్మణ్‌రావు. మేం మొత్తం ఆరుగురు సంతానం. ఇద్దరు అన్నలు, ఒక అక్క, తమ్ముడు, చెల్లి. పాత మంచిర్యాలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకు విద్యాభ్యాసం. ఇంటర్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలలోనే చదివాను. ఏసీసీలో కళాశాల విద్య చదివేందుకు ప్రతిరోజు పన్నెండు కిలోమీటర్లు నడిచేవాళ్లం. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక మళ్లీ నడుచుకుంటూ మంచిర్యాలకు వచ్చి బస్టాండ్ ఏరియాలో అడ్డా పెట్టేవాళ్లం. అలారోజు కనీసం 20 కిలోమీటర్లు కాలినడకన తిరిగేవాళ్లం. తొమ్మిదేళ్లకే రాజకీయాల్లోకి.. చిన్నప్పటి నుంచే రాజకీయాలంటే ఇష్టం. తొమ్మిదేళ్ల వయస్సున్నప్పుడే ఎన్నికల ప్రచారంలో తిరిగిన. అప్పట్లో సోషలిస్టు, కాంగ్రెస్ పార్టీలు ఉం డేవి. ప్రస్తుతం ఉన్న ఏసీసీ ప్రాంతంలోనే జూ ని యర్, డిగ్రీ కాలేజ్‌లు ఉండేవి. అందరూ అక్కడే చదువుకునేవాళ్లు. ఏసీసీ కంపెనీ సమీపంలోనే మంచిర్యాల రాజకీయం నడిచేది. జూనియర్ కళాశాలలో విద్యార్థి సంఘం నేతగా ఎన్నుకోబడ్డాను. ఆ సమయంలోనే పక్కవాళ్లకు సాయం చేయాలనే ఆలోచన ఉండేది. కళాశాలలో ఎవరికి సీటు కావా లన్నా ఇప్పించడంతోపాటు, పేద విద్యార్థులకు కాలేజీ నుంచి బుక్స్ ఇప్పించి, వారి చదువు అయిపోయాక మళ్లీ వాటిని కళాశాలలో అప్పగించేలా చేసేవాణ్ణి. 1969లో పదో తరగతి చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిం ది. అప్పటి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా. 1972–75 వరకు ఆంధ్రా ఉద్యమం పెద్ద ఎత్తునే నడిచింది. డిగ్రీ పూర్తి కాగానే 1976లోనే పాతమంచిర్యాలలో కిరాణ దుకాణం పెట్టాం. ఎల్ఐసీలో టాప్‌లో ఉండేవాణ్ణి.. ఎల్ఐసీ ఏజెంట్‌గా మంచిర్యాల ప్రజలకు నేను సుపరిచితుడిని. ఎల్ఐసీలో నంబర్‌వన్ ఏజెంట్‌గా గుర్తింపు వచ్చింది. ఏడాది టార్గెట్ అంతా ఆర్థిక సంవత్సరం చివరినెల ఒక్క మార్చిలోనే చేసేవాడిని. ఎమ్మెల్యే అయ్యాక ఏజెంట్ నుంచి తప్పుకున్న. ‘ఆమె’ సహకారంతోనే.. డిగ్రీ పూర్తికాగానే పెద్దపల్లి జిల్లా అంతర్గాంకు చెందిన రాజకుమారితో వివాహమైంది. ఇద్దరు కొడుకులు రజిత్, విజిత్. పెద్ద కొడుకు రజిత్ అమెరికాలో ఉంటున్నాడు. చిన్నకొడుకు మూడేళ్లపాటు అమెరికాలోనే ఉండొచ్చాడు. ప్రస్తుతం నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి నా జీవితం మొత్తం రాజకీయాలకు అంకితం కావడంతో కుటుంబ బాధ్యతలన్నీ నా భార్య(రాజకుమారి)నే చూసుకునేది. పిల్లల పెంపకంలో ఇప్పటికీ ఆమే కీలకం. రాజకీయంగా, కుటుంబపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రెండింటిని సమంగా చూసుకోవడం ద్వారా సంతోషంగా ఉన్నాం. నా బాటలోనే నా పిల్లలు పయనిస్తున్నారు. ఎవరికి ఎలాంటి దురలవాట్లూ లేవు. ప్రజాసేవతోనే ఆరోగ్యం.. నాకు 67 ఏళ్లు వచ్చాయంటే నాకే నమ్మశక్యంగా లేదు. ఇప్పటికీ ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకే నిద్ర లేస్తా. రాత్రి 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి, మళ్లీ వేకువజామునే నా దినచర్య ప్రారంభం అవుతుంది. ఇది చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకున్నా. బయటకు ఎక్కడికి వెళ్లినా మాంసాహారం తీసుకోను. పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి మాత్రం ఎక్కువగా తీసుకుంటా. ఇంటి భోజనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. ఎలాంటి దురలవాట్లు లేకపోవడం కూడా నా ఆరోగ్యానికి ఒక కారణం. నిత్యం ప్రజల మధ్యలో ఉండడం.. వాళ్ల సమస్యలు పరిష్కరిస్తుండడంవల్ల కలిగే మానసిక ఉల్లాసంతోనే ఆరోగ్యంగా ఉంటున్నానని అనుకుంటున్న. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సాధన మరిచిపోలేనిది 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 35 ప్రాజెక్టులను ప్రకటించారు. ఆ జాబితాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు లేదు. అసెంబ్లీలో వైఎస్సార్‌ను కలిసి ప్రాజెక్ట్ కావాలని కోరాను. రెండు నెలల్లోనే ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రకటించి.. శంకుస్థాపన చేశారు. నేడు రాష్ట్రంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగినది. ప్రాజెక్ట్‌ల సాధన జీవితంలో మరిచిపోలేని విషయం. గుడికి వెళ్తా.. నాకు మొదటి నుంచి అన్ని మతాలు, దేవుళ్లను ఆరాధించడం అలవాటు. మంగళ, గురు, శనివారాల్లో తప్పనిసరిగా గుడికి వెళతాను. పాత మంచిర్యాలలో పురాతన రామాలయం శిథిలావస్థకు చేరుకుంటే గ్రామస్తులు, ప్రభుత్వ సహకారంతో ఆ ఆలయాన్ని పునర్నిర్మించే అవకాశం నాకు లభించడం మహాభాగ్యంగా భావిస్తుంటాను. ప్రతి గుడికి వెళ్లి దేవున్ని పూజించడం అలవాటుగా మారింది. ఎన్నికల సమయంలో ఫలితాలు వచ్చేవరకూ ఆధ్యాత్మికం వైపు మొగ్గుచూపుతా. అన్ని దేవుళ్లకు మొక్కి నామినేషన్ వేసి, మళ్లీ అదే తరహాలో దేవుళ్లకు మొక్కిన తరువాతే ఓటువేస్తాను. ప్రజల కోసం సేవా కార్యక్రమాలు ప్రజల కోసం వ్యక్తిగతంగా ఏదో ఒకటి చేయాలని నడిపెల్లి ట్రస్టు ప్రారంభించా. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చల్లని మినరల్ వాటర్‌తో ‘చలివేంద్రాలు’, ‘దివాకరన్న పెరుగన్నం’ అందిస్తున్నాం. హైదరాబాద్ వంటి నగరాల్లో ఉండే ఐటీ కంపెనీలు, ఇతర కంపెనీలలో ఉద్యోగాల కోసం మంచిర్యాలలో నిరుద్యోగులకు ‘జాబ్‌మేళా’ నిర్వహించి, వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పి స్తున్నాం. క్రీడల్లో రాణించే వారి కోసం క్రికెట్ పోటీలను జిల్లాస్థాయిలో నిర్వహించాం. ఎవరు పెళ్లికి పిలిచినా వెళ్లుడే.. ఎమ్మెల్యేకంటే ముందే నుంచే నాకు ఇక్కడి ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దివాకర్‌రావు అంటే ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పటికీ పెళ్లిళ్ల సీజన్లో కనీసం 20 పెళ్లిళ్లకు హాజరవుతాను. ప్రతిఒక్కరూ వారింట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా.. ఇంటికొచ్చి పిలుస్తారు. ఆ రోజు వీలును బట్టి కచ్చితంగా కలిసివస్తా. మంచి జరిగినా.. చెడు జరిగినా ఆ ఇంటికి వెళ్లి పలకరించి రావడం ఎప్పటినుంచో అలవాటుగా మారింది. నేను ఒక్కరోజులో హాజరైన శుభకార్యాలు, మరెవరూ హాజరుకాకపోవచ్చంటే అతిశయోక్తి కాదు. -
ట్రయల్ రన్ షురూ
సాక్షి, హైదరాబాద్/ధర్మారం(ధర్మపురి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టానికి తెరలేచింది. తొలిసారిగా గోదావరి నీటితో ట్రయల్ రన్ ప్రక్రియ మొదలైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టు ఇంజనీర్లు బుధవారం ఉదయం ఎల్లంపల్లి బ్యారేజీ ఫోర్‌షోర్ నుంచి గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న ప్యాకేజీ–6 కాల్వలకు విడుదల చేశారు. ఈ నీరు అప్రోచ్ చానల్ ద్వారా ప్యాకేజీ–6లో భాగంగా నిర్మిస్తున్న టన్నెళ్ల నుంచి సర్జ్పూల్కు చేరనుంది. అనంతరం ఇప్పటికే అమర్చిన మోటార్ల ద్వారా వెట్‌రన్ నిర్వహించి ఆ నీటిని నందిమేడారం రిజర్వాయర్‌కు తరలిస్తారు. గోదావరికి హారతి ఇచ్చి... ట్రయల్ రన్లో భాగంగా తొలుత పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేంనూర్ గ్రామ సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో నిర్మించిన రెగ్యులేటర్ వద్ద అధికారులు పూజలు నిర్వహించి గోదావరికి హారతి ఇచ్చారు. అనంతరం సీఎంఓ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్రావు, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్‌లు ఎల్లంపల్లి ఫోర్‌షోర్ నుంచి 300 క్యూసెక్కుల నీటిని ప్యాకేజీ–6లోని ఇన్‌టేక్ రెగ్యులేటర్‌లో ఉన్న 5 గేట్లలో మూడో గేటుని 6 అంగుళాల మేర ఎత్తి అప్రోచ్ చానల్‌కు విడుదల చేశారు. ఈ నీటి విడుదలను క్రమంగా వెయ్యి క్యూసెక్కులకు పెంచుతూ వెళ్లారు. కిలోమీటర్ పొడవున్న అప్రోచ్ చానల్ ద్వారా ప్రవహించిన నీరు.. ట్రాష్ రాక్ గేట్ల ద్వారా 9.34 కిలోమీటర్ల పొడవున్న జంట టన్నెళ్లలోకి ప్రవేశించింది. ఈ నీరు నందిమేడారం పంప్‌హౌజ్‌లోని సర్జ్‌పూల్‌కి గురువారం ఉదయానికి చేరుకుంటుంది. టన్నెళ్లలోకి నీరు చేరిన తర్వాత ప్రతీ అంశాన్ని ఇంజనీర్లు క్షుణ్నంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయేమో గుర్తిస్తారు. అలాగే ఇతర అవాంతరాలు ఏవైనా ఉంటే వాటిని కూడా గుర్తించి అప్పటికప్పుడు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తారు. ఈ నీరంతా సర్జ్పూల్కు చేరాక దాన్ని తొలుత 10 శాతం వరకు నింపుతారు. అనంతరం దశలవారీగా పూర్తి స్థాయిలో నింపనున్నారు. ఈ దశలోనూ ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేలా, లీకేజీలను గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. విడతల వారీగా సర్జ్‌పూల్ నింపాక 126 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్ల ద్వారా పంపింగ్ ప్రక్రియ మొదలుపెడతారు. సర్జ్‌పూల్‌లో ఉన్న నీటితో ప్రతి మోటార్‌ను 20 నుంచి 30 నిమిషాలు రన్ చేసి చూస్తారు. అన్ని పంపులను వెట్‌రన్ చేసేందుకు సుమారు 0.20 టీఎంసీల నీరు అవసరం అవుతుందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. వీలైనంత మేర ఈ నెల 23 లేక 24న పంపుల వెట్‌రన్ నిర్వహిస్తామని ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రకటించారు. అధికారుల సంబరాలు... కాళేశ్వరం ట్రయల్ రన్ నేపథ్యంలో ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తంచేశారు. తాము పడిన కష్టానికి ఫలితం లభించడం సంతోషంగా ఉందని సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. ట్రయల్ రన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. మేడారం నుంచి మిడ్‌మానేరుకు, రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి తరలించి నీటిని సద్వినియోగం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవయుగ డైరెక్టర్ వెంకటరామారావు, జీఎం శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
గోదారి పారే దారేది?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా... బాబ్లీ నుంచి దిగువకు నీరు విడుదల కాలేదు... శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్ఆర్ఎస్పీ) పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలకు ప్రస్తుతం ఉన్నది 15.82 టీఎంసీలే... ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20 టీఎంసీలకు ప్రాజెక్టులో ఉన్న నీరు 13.489 టీఎంసీలే. ఈ పరిస్థితిల్లో ప్రాజెక్టులను మినహాయిస్తే బాబ్లీ దిగువ నుంచి 300 కిలోమీటర్ల గోదావరి పరీవాహక ప్రాంతం ఎడారిని తలపిస్తోంది. జూలై నెలలో ఇప్పటివరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని చెరువుల్లో సైతం నీరు చేరలేదు. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డ గోదావరి నదీ ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయని ఎస్సారెస్పీపై ఆధారపడ్డ రైతాంగం ఎదురుచూస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి గోదావరిలోని నీటిని వదిలితే తప్ప దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండే పరిస్థితి లేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఆధారపడ్డ హైదరాబాద్ ప్రజానీకంతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ వంటి సంస్థలు, కరీంనగర్ పూర్వ జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఎ ల్లంపల్లి దిగువన మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య నుంచి సాగే గోదావరి నిర్మాణంలో ఉన్న అన్నారం బ్యారేజీ వరకు ఎడారిని తలపిస్తోంది. ఆగస్టు నుంచి అక్టోబర్ లోపు భారీ వర్షాలు, తుపానులు వస్తే తప్ప గోదావరి డెల్టాలో ఎస్సారెస్పీపై ఆధారపడ్డ ఉత్తర తెలంగాణకు ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవు. ఎస్సారెస్పీలో ప్రమాదకర రీతిలో నీరు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు వరప్రదాయినిగా చెప్పుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాదకర స్థితికి చేరుకుంది. అంతర్రాష్ట్ర నీటి ఒప్పందాల ప్రకారం మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై నుంచి అక్టోబర్ వరకు ఎత్తితే ఎస్సారెస్పీ నిండుతుంది. జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తినప్పటికీ, లక్ష క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేయలేదు. ఎగువన బాబ్లీ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోకపోవడమే అందుకు కారణంగా ఆ రాష్ట్ర సర్కారు చెపుతోంది. దీంతో ఎస్సారెస్పీకి ఇటీవలి కాలంలో వచ్చిన నీరు రెండు టీఎంసీలే. దీంతో 90 టీఎంసీల సామర్థ్యం గల ఎస్సారెస్పీలో గురువారం 15.82 టీఎంసీల నీటి మట్టం ఉంది. ఈ ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 30 అడుగుల లోటుతో 1061 అడుగులకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్సారెస్పీని నమ్ముకొని ఇప్పటికీ నార్లు పోయని ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల ప్రజలు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు. ఎల్లంపల్లిలో ఆరు టీఎంసీల లోటు హైదరాబాద్‌కు తాగునీటితో పాటు కరీంనగర్ ప్రాంతానికి సాగునీటిని, సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలకు నీరు అందించే ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ప్రస్తుతం లోటు నీటిమట్టంతో ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 668 క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన నీరును వచ్చినట్టే ఔట్‌ఫ్లో చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్‌కు 280 క్యూసెక్కులు, సింగరేణికి 200 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 200 క్యూసెక్కుల వరకు విడుదల చేసే అధికారులు నీటి లోటుతో తగ్గించి వదులుతున్నారు. గూడెం, వేమునూరు, పెద్దపల్లి–రామగుండం మిషన్ భగీరథ సెగ్మెంట్‌కు కూడా ఇక్కడి నుంచే నీరివ్వాలి. వేసవి కాలంలోనే నీటి సరఫరాపై ఆంక్షలు విధించిన ప్రాజెక్టు అధికారులు కేవలం హైదరాబాద్‌కు, సింగరేణి, ఎన్టీపీసీలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తూ కాపాడుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదతో ఆరు టీఎంసీల స్థాయి నుంచి 13 టీఎంసీలకు నీటిమట్టం పెరిగినప్పటికీ, పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోకపోతే హైదరాబాద్‌కు నీటి సరఫరాలో ఇబ్బంది ఎదురవుతుందని అధికారులు చెపుతున్నారు. ఎడారిని తలపిస్తున్న గోదావరి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి ఎగువకు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు నీరు కనిపిస్తుందే తప్ప మిగతా గోదావరి అంతా ఎడారిని తలపిస్తోంది. వర్షాలు కురిసిన తరువాత అక్కడక్కడ నిలిచిన నీటితో ఇసుకలో గడ్డి, పిచ్చిమెక్కలు మొలిచిన తీరు కనిపిస్తోంది. ఎల్లంపల్లి దిగువన నిర్మాణంలో ఉన్న సుందిళ్ల బ్యారేజీ వరకు గల 31 కిలోమీటర్ల దూరంలో సన్నని దార తప్ప గోదావరిలో నీరు లేదు. అక్కడి నుంచి 31.5 కిలోమీటర్ల దూరంలోని అన్నారం బ్యారేజీ వరకు అదే పరిస్థితి. అన్నారం నుంచి మేడిగడ్డ బ్యారేజీ వరకు ప్రాణహిత వరద పోటెత్తింది. ఇదే పరిస్థితి ఎస్సారెస్పీ నుంచి దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గల 140 కిలోమీటర్లలో ధర్మపురి వరకు ఎడారి పరిస్థితే. ధర్మపురి నుంచి నీటి ప్రవాహం కొంతమేర పెరిగింది. బాసర సరస్వతి చెంతనే నీరు లేని పరిస్థితి. బాబ్లీ దిగువన ఎస్సారెస్పీ వరకు కూడా నీటి ప్రవాహం లేక ఇసుక తిన్నెలు, పిచ్చిమొక్కలు గోదావరిలో కనిపిస్తున్నాయి. -
ఎల్లంపల్లిలో నీరు.. కాళేశ్వరం జోరు!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో కాళేశ్వరం బ్యారేజీ, పంప్‌హౌజ్‌ల పనులకు ఆటంకాలు ఎదురవుతున్నా ఎల్లంపల్లి బ్యారేజీకి గోదావరి జలాలు పోటెత్తుతుండటంతో దిగువన పనులు ఊపందుకున్నాయి. వర్షాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు ఆలస్యమైనా ఎల్లంపల్లికి చేరుతున్న నీటిని ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. 20 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లిలో ఇప్పటికే 10 టీఎంసీల నిల్వలు ఉండగా.. ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సెప్టెంబర్ నుంచి కాళేశ్వరం లోని ప్యాకేజీ–6 మోటార్ల ద్వారా మేడారం రిజర్వాయర్‌కు, అటునుంచి ప్యాకేజీ–7, 8ల ద్వారా మిడ్ మానేరుకు నీరు తరలించేలా నీటి పారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది. కౌంట్‌డౌన్ మొదలు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను పొలాలకు ఎత్తిపోసేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌజ్ పనులు వేగంగా సాగుతున్నా వర్షాలతో కొంత ఆటంకం కలుగుతోంది. గేట్లు, మోటార్లు అమర్చే ప్రక్రియ మొదలైనా అవి పూర్తయ్యేందుకు నవంబర్, డిసెంబర్ వరకు సమయం పట్టే అవకా శం ఉంది. దీంతో ఎగువ పనులు పూర్తి కాకున్నా ఎల్లంపల్లిలో చేరిన నీటిని దాని దిగువనున్న 3 ప్యాకేజీల ద్వారా మిడ్ మానేరుకు తరలించేలా పనులు జరుగుతున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఎల్లంపల్లి 20 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి చేరుకుంటుందని అధికారుల అంచనా. సెప్టెంబర్‌లో మేడారం రిజర్వాయర్‌కు.. ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు సిదమయ్యాయి. ఆగస్టు చివరికి మరొకటి పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక్కో మోటార్‌కు 3,200 క్యూసెక్కుల(రోజుకు) నీటిని తరలించే సామర్థ్యం ఉండగా గరిష్టంగా ఒక టీఎంసీ నీటి ని తరలించేలా పనులు సాగుతున్నాయి. మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ఇంకా సిద్ధం కావాల్సి ఉండటంతో డ్రై రన్ జరుగ లేదు. సబ్‌స్టేషన్ ఈ నెలాఖరుకు సిద్ధం కానుండటం తో ఆగస్టు 15కి డ్రై రన్ చేయాలని మంత్రి హరీశ్‌రావు గడువు విధించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఎల్లంపల్లి నుంచి 1.5 టీఎంసీ సామర్థ్యం ఉన్న మేడారం రిజర్వాయర్‌కు నీటిని తరలించాలన్నది ప్రస్తుత లక్ష్యంగా నిర్ణయించారు. లైనింగ్ పూర్తయితే లైన్ క్లియర్ ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇందులో 13 మీటర్ల పనే మిగిలింది. లైనింగ్ పనులు సెప్టెంబర్ చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్ పంపులు 2 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్‌ను ఆగస్టు చివరికి సిద్ధం చేయనున్నారు. దీని పరిధిలో ఉన్న గ్రావి టీ కెనాల్ పూర్తయితే మిడ్ మానేరుకు నీరు తరలించవచ్చు. ఎల్లంపల్లి నుంచి ప్యాకేజీ–6 ద్వారా నీరు తరలించేందుకు ఇబ్బంది లేకున్నా ప్యాకేజీ– 7లో టన్నెల్ లైనింగ్ పనులు పూర్తయితేనే ప్యాకేజీ–8 ద్వారా మిడ్ మానేరుకు నీరు తరలించడం సులభమని ప్రాజెక్టు వర్గాలు చెబు తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ తొలివారంలో ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతల ఆరంభం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ఆరంభం అవుతుందని చెబుతున్నాయి. -
ఎల్లంపల్లి ఎండుతోంది .!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాగునీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీరు అందిస్తున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. 20.175 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో సోమవారం ఉదయం 8 గంటలకు 6.980 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రతిరోజు 1,300 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళుతుండటంతో వేగంగా నీటి మట్టం తగ్గుతోంది. దీంతో ఇప్పటికే గూడెం లిఫ్ట్‌కు సరఫరా చేసే 290 క్యూసెక్కుల నీటిని ఈనెల 26 నుంచి నిలిపివేసిన ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు సోమవారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమునూరు పంప్‌హౌస్‌కు నీటి సరఫరాను ఆపేశారు. ఈ పంప్‌హౌస్‌కు ప్రతిరోజు 500 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా చేసే అధికారులు 26వ తేదీ నుంచి 250 క్యూసెక్కులకు తగ్గించి సోమవారం పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్, ఎన్టీపీసీ, సింగరేణికి నీటి సరఫరాలో ఆటంకం కలగకుండా ఉండేందుకే గూడెం, వేమునూరులకు నీటిని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు నీటి కష్టాలు తప్పవా..? ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వ్యవసాయానికన్నా హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నేరుగా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్‌బోర్డుకు ప్రతిరోజు 248 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, సింగరేణికి అవసరాన్ని బట్టి 225 క్యూసెక్కుల నుంచి 400 క్యూసెక్కుల వరకు విడుదల చేస్తున్నారు. కొద్దిరోజులుగా 90 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు ఆదివారం 400 క్యూసెక్కులు రిలీజ్ చేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఎల్లంపల్లిలో గోదావరి నీటిమట్టం అతివేగంగా తగ్గే అవకాశం ఉంది. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురిసి ఎల్లంపల్లికి నీరు రావడం జూన్ నెలాఖరు వరకు గానీ ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. అంటే ఇంకా రెండు నెలల పాటు ఈ 6.8 టీఎంసీల నీటిని కాపాడుకోవలసి ఉంది. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకు కృష్ణా, ఎల్లంపల్లితో పాటు అక్కంపల్లి (కృష్ణా), మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి ప్రతిరోజు 516 మిలియన్ గ్యాలన్ల నీరు (ఎంజీడీ) అవసరం కాగా ప్రస్తుతం 387 ఎంజీడీలు మాత్రమే సరఫరా అవుతోంది. అందులో 86 ఎంజీడీ ఎల్లంపల్లి నుంచే సరఫరా కావలసి ఉంది. ఎల్లంపల్లి నీటి మట్టం ఇదే వేగంతో తగ్గితే హైదరాబాద్‌కు నీటి కష్టాలు తప్పవని ప్రాజెక్టు అధికారులు చెపుతున్నారు. భగీరథకు తప్పని తిప్పలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న మిషన్ భగీరథకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సరఫరా అయ్యే నీరే ప్రధానం. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలలోని అనేక గ్రామాలకు మిషన్ భగీరథ కింద ఎల్లంపల్లి నీటిని సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఫిల్టర్‌బెడ్స్, పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేశారు కూడా. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మిషన్ భగీరథ పథకం కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీటి సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు ట్రయల్ రన్ కూడా పూర్తయింది. అయితే ఇప్పుడు నీటి కొరత ఏర్పడి పాత పంప్‌హౌస్ నుంచి మంచిర్యాల మునిసిపాలిటీకి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ద్వారా వేమునూరు గ్రామం వద్ద పంప్‌హౌస్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి సాగునీరుతో పాటు సమీప గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కూడా జరగనుంది. సోమవారం నుంచి వేమనూరుకు కూడా నీటిని నిలిపివేశారు. గత ఏడాదితో పోలిస్తే వేగంగా తగ్గిన నీటి మట్టం ఎల్లంపల్లి ప్రాజెక్టులో గత సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీకి 10.860 టీఎంసీల నీరు నిల్వ ఉండగా సరిగ్గా ఏడాదికి సోమవారం నాడు 6.980 టీఎంసీలకు పడిపోయింది. అంటే గత ఏడాది కన్నా 4 టీఎంసీల లోటు. ఇప్పటి వరకు రెండు నెలలుగా ప్రతి రెండు వారాలకు 3 టీఎంసీల చొప్పున నీటి మట్టం తగ్గుతూ రావడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి ఎగువ వరకు నిల్వ ఉన్న గోదావరి నీరు వెనక్కు వెళ్లిపోయింది. ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 148 మీటర్ల నుంచి 141 మీటర్లు తగ్గింది. మంచిర్యాలకు నీటి సరఫరా చేసే పంప్‌హౌస్ కూడా బయటకు తేలిపోయింది. దీంతో మంచిర్యాల మునిసిపాలిటీకి నీటి సరఫరా రెండు రోజులకోసారి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎల్లంపల్లి నుంచి నీటిని పొదుపుగా విడుదల చేయాలని ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. -
పరిహారం... పన్నాగం
మంచిర్యాలరూరల్(హాజీపూర్) : పరిహారం కోసం బోగస్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. గ్రామాల్లో లేనివారు, 18 సంవత్సరాలు నిండనివారు పునరావాస ప్యాకేజీ పరిహారం జాబితాలోకి వస్తున్నారు. అసలు ఊర్లో లేని వారి పేర్లు సైతం జాబితాలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లంపల్లి (శ్రీపాదసాగర్) ప్రాజెక్ట్ కింద ముంపునకు గురయ్యే గ్రామాల్లో యువతకు మేజర్ సన్స్ కింద అందజేసే ప్రత్యేక పరిహారం కోసం ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం తయారు చేస్తున్న జాబితాలో ఎక్కువ శాతం బోగస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ముంపు గ్రామాలు 09 నిర్వాసిత కుటుంబాలు 3,646 సేకరించిన భూమి (ఎకరాలు) 6,035 మేజర్సన్స్ జీవో విడుదల 2015లో వచ్చిన దరఖాస్తులు 627 ఒక్కొక్కరికి పరిహారం రూ.2,00,000 మంచిర్యాలరూరల్(హాజీపూర్) : ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన గ్రామాల్లోని 18 సంవత్సరాలు నిండిన యువతకు మేజర్సన్స్ పరిహారం చెల్లించాలని 2015లో జీఓ విడుదలైంది. అప్పటినుంచి పరిహారం కోసం అర్హులు ఎంతగానో ఎదురుచూస్తున్నా పంపిణీ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడంలేదు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా హాజీపూర్ మండలంలోని ఏడు గ్రామాలు, లక్సెట్టిపేట మండలంలోని రెండు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2004 జూలై 18న ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడగా పదేళ్ల అనంతరం నిర్మాణం పూర్తయ్యింది. ఆ సమయంలో కొంతమంది మేజర్సన్స్కు పరిహారం అందించారు. ప్రాజెక్ట్ పూర్తి కావడంలో జాప్యంతో పాటు నిర్వాసితుల కుమారులు మేజర్ అయిన వారికి కూడా పరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో నాటినుంచి ఇప్పటివరకు 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రత్యేక పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం 2015లో జీఓ విడుదల చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న తొమ్మిది గ్రామాల్లో మొత్తం 3,646 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. 6,035 ఎకరాల భూమిని సేకరించారు. అయినా ఇప్పటివరకు మాత్రం యువతకు పరిహారం అందకపోవడం శోచనీయం. 627 దరఖాస్తులు... 2015 జనవరి 1నాటికి 18 సంవత్సరాలు నిండిన యువకుల నుంచి మేజర్సన్స్ కింద రూ.2 లక్షల ప్యాకేజీ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. 627 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సోషల్ ఎకనామిక్ సర్వే (ఎస్ఈఎస్) ప్రకారం 174 మంది పేర్లతో ప్రత్యేక జాబితా తయారు చేశారు. ఈ జాబితాలో నుంచి కూడా అన్నివిధాలుగా సర్వే చేసి పూర్తి అర్హులను మాత్రమే ఎంపిక చేస్తారు. ఇక మిగతా దరఖాస్తులను కూడా పరిశీలించి త్వరలోనే ముంపు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శించనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. దీంతోపాటు ఇంకా అర్హులు ఉంటే వారి వివరాలు కూడా తీసుకుంటారు. ప్రతిపాదిత జాబితాలో బోగస్ పేర్లు... గుడిపేట, నంనూర్, చందనాపూర్, రాపల్లి, పడ్తనపల్లి, కర్ణమామిడి, కొండాపూర్‌లతో పాటు లక్సెట్టిపేట మండలంలోని సురారం, గుల్లకోట గ్రామాలతో కలిపి తొమ్మిది గ్రామాలు ముంపునకు గరయ్యాయి. మేజర్సన్స్ జాబితాలో ఎక్కువగా బోగస్ పేర్లు ఉన్నాయంటూ పలువురు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇదివరకు పరిహారం పొందిన వారి పేర్లతో పాటు 18 సంవత్సరాలు నిండనివారి పేర్లు, గ్రామాల్లో లేనివారి పేర్లు, మైనర్ల పేర్లను చేరుస్తూ పరిహారం కాజేయడానికి పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి దశలో ఉన్న సమయంలో దాని ప్యాకేజీ కింద పరిహారం పొందినవారి పేర్లను తిరిగి 18 సంవత్సరాలు నిండిన జాబితాలో నమోదు చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. గుడిపేట, రాపల్లి, కర్ణమామిడి గ్రామాల్లో ఈ అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కొంతమంది అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా స్పందించడం లేదంటున్నారు. అయితే అర్హుల జాబితా తయారు చేయలేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. చెరో సగం... ఎల్లంపల్లి ముంపు గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన యువతకు పరిహారం చెల్లించేందుకు విడుదలైన జీవో కొంతమంది పైరవీకారులకు వరంగా మారింది. పరిహారం కోసం తయారు చేసే జాబితాలో పేరు చేర్పిస్తే రూ.50 వేల నుంచి పరిహారంలో సగం ఇవ్వాల్సిందేనంటూ బేరాలు కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన యువతకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద పరిహారం చెల్లించనుంది. ఇందులో రూ.లక్ష అనర్హులకు, మరో రూ.లక్ష పైరవీకారులకు అన్న చందంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. మేజర్సన్స్ కింద అందజేసే పరిహారం చెల్లింపులకు ప్రభుత్వం మూడు నెలల కిందటే నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది. జాబితా ఖరారు అయితే వెంటనే పరిహారం పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. జీపీలో జాబితా ప్రదర్శిస్తాం.. నిర్వాసిత గ్రామాలకు ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో గల గ్రామపంచాయతీ కార్యాలయాల ఆవరణలో వారం రోజుల్లోగా అర్హుల జాబితాలను ప్రదర్శిస్తాం. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పూర్తి స్థాయి సర్వే చేస్తున్నాం. పరిహారం పొందినవారి పేర్లు, అనర్హులు ఉన్నట్లయితే వాటిని తొలగిస్తాం. ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దు. గ్రామాల వారిగా ప్రదర్శించిన అర్హుల జాబితాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. వీటిపై వారం రోజుల్లో విచారణ జరుపుతాం. గతంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. తుది జాబితా ఖరారు కాగానే ప్రత్యేక ప్యాకేజీ పరిహారం పంపిణీ చేస్తాం. – వంగల మోహన్‌రెడ్డి, తహసీల్దార్, హాజీపూర్ -
సింగరేణికి ‘మిషన్ భగీరథ’
గోదావరిఖని(రామగుండం) : గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్లకు, గుడిసె ప్రాంతాలకు గోదావరినది ఒడ్డున ఉన్న ఫిల్టర్‌బెడ్ ద్వారా తాగునీటిని అందించిన యాజమాన్యం ఇక నుంచి మిషన్ భగీరథ ద్వారా నీటిని తీసుకోబోతున్నది. రామగుండం మండలం కుక్కలగూడూరు–మద్దిర్యాల నుంచిరామునిగుండాల గుట్టపై నిర్మించిన సంప్ వరకు వచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని గోదావరిఖనిలోని శారదానగర్ మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంక్ వరకు గ్రావిటీ ద్వారా సరఫరా చేస్తారు. అక్కడి నుంచి సింగరేణి సంస్థ గంగానగర్‌లోని సింగరేణి ఫిల్టర్‌బెడ్ వరకు పైపుల ద్వారా నీటిని మళ్లించి కార్మికుల క్వార్టర్లకు తాగునీటిని అందించనున్నది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించింది. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంతో.. సింగరేణి సంస్థ తన పరిధిలో ఉన్న ఆర్జీ–1 డివిజన్లోని గోదావరిఖనిలో 7,300 క్వార్టర్లు, ఆర్జీ–2 డివిజన్లోని ౖయెటింక్లయిన్‌కాలనీలో 5,600 క్వార్టర్లు, ఆర్జీ–3 డివిజన్లోని సెంటినరీకాలనీలో మరో ఐదు వేల క్వార్టర్లకు గోదావరిఖని ఇంటెక్వెల్ నుంచి నీటిని శుద్ధిచేసి సరఫరా చేస్తున్నారు. దీనికితోడు మొన్నటి వరకు నడిచిన సింగరేణి పవర్‌హౌస్‌కు కూడా నీటిని అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోతల ద్వారా సరఫరా చేసేందుకు వీలుగా సుందిళ్ల వద్ద బ్యారేజీని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరినదిలో సుందిళ్ల నుంచి గోలివాడ పంప్‌హౌస్ వరకు నీరు నిల్వ ఉండనున్నది. పట్టణంలోని మురికినీరంతా నిల్వ నీటిలో చేరనుండడంతో ఆ నీటిని శుద్ధి చేసే పరిస్థితి లేకుండా పోతుంది. కాగా ప్రభుత్వం ఇంటింటికి తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా రామగుండం కార్పొరేషన్ పరిధిలో నీటిని సరఫరా చేస్తున్నది. ఇదే క్రమంలో కార్పొరేషన్‌కు వచ్చే నీటి నుంచి సింగరేణి క్వార్టర్లకు కూడా 20 మిలియన్ లీటర్స్ ఫర్డే (ఎంఎల్డీ) తాగునీటిని అందించాలని సింగరేణి యాజమాన్యం విన్నవించింది. సెంటినరీకాలనీ ఏరియాకు మంథని నుంచినీటిని కేటాయిస్తున్న నేపథ్యంలో గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ ఏరియాల క్వార్టర్లతో పాటు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, భూగర్భ గనులకు కూడా ఈ నీటినే వాడేందుకు సింగరేణి సిద్ధమైంది. దీంతో ఈ నెల 12న జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో సింగరేణి ఆశించిన మేరకు 20 ఎల్ఎల్డీ నీటిని కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. ఇక శారదానగర్ నుంచి గంగానగర్ వరకు సింగరేణి యాజమాన్యం అవసరమైన మేరకు పైపులైన్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కాలనీల ప్రజలు కొత్త కనెక్షన్లు తీసుకోవాల్సిందే... సింగరేణి క్వార్టర్ల ఏరియాకు నీటిని సరఫరా చేసేందుకు పైపులు బిగించగా, పలుకార్మిక కాలనీలలో ఆ పైపులకే కనెక్షన్లు ఇచ్చుకుని అక్రమంగా నీటిని వినియోగిస్తున్నారు. ఇలా సింగరేణి నీటిని వాడుతున్న కనెక్షన్లు 22 వేల వరకు ఉంటాయి. కాలనీలకు సుమారుగా 6 ఎంఎల్డీ నీటిని సింగరేణి సరఫరా చేసేది. కాగా... మిషన్ భగీరథ ద్వారా నీటిని ఉపయోగించే క్రమంలో ఈ కనెక్షన్లకు నీటి సరఫరా నిలిచిపోనున్నది. ఇదిలా ఉండగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో 45 వేల నివాసుండగా, అందులో 16 వేల నల్లా కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అమృత్ స్కీమ్ కింద అనేక కాలనీలలో తాగునీటి పైపులైన్లను అమర్చిన నేపథ్యంలో మిగిలిన ఇళ్ళకు నల్లా కనెక్షన్లు తీసుకునే వీలుంది. త్వరలో సింగరేణి అందించే నీటి సరఫరా నిలిచిపోతున్న క్రమంలో ఆయా ఇళ్ళ యజమానులు అనివార్యంగా కార్పొరేషన్ నుంచి కొత్తగా నల్లా కనెక్షన్లను పొందాల్సి ఉంటుంది. -
ఎల్లంపల్లి పైప్‌లైన్ లీక్
ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపురం వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్‌లైన్ లీకేజీ అయింది. ఎయిర్ గేట్ వాల్వ్ ఎగిరిపోవటంతో నీరు 100 అడుగుల ఎత్తులో ఎగసిపడుతోంది. దీంతో సమీప పొలాల్లోకి నీరు వృథాగా పోతోంది. ప్రెషర్ తగ్గిన తర్వాతే మరమ్మతులు చేపట్టడం వీలవుతుందని అధికారులు తెలిపారు. -
నల్లబంగారు నేల.. మంచిర్యాల
ఘన చరిత్ర.. ఈ ప్రాంతం సొంతం ఖనిజ సంపద, బొగ్గు నిక్షేపాలకు నెలవు పారిశ్రామికంగానూ ఎంతో అభివృద్ధి రెండో అన్నవరంగా కొలువైన గూడెం సత్తన్న గుడి.. సిరుల వేణి సింగరేణి నెలవైన బొగ్గు గని... ఎల్లంపల్లి జలసిరి.. ఎల్‌మడుగు అందాల ఝరి.. జైపూర్ విద్యుత్ వెలుగులు.. దట్టమైన కవ్వాల్ అడవులు.. ఇవీ... మంచిర్యాల జిల్లాలో అలరారే అద్భుతాలు. ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న మంచిర్యాల నేటి నుంచి స్వయం ప్రతిపత్తిని పొంది, మంచిర్యాల జిల్లాగా ఆవిర్భవిస్తోంది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా విశేషాల సమాహారం. - మంచిర్యాల టౌన్ ఈ పేరెలా వచ్చిందంటే.. మంచిర్యాల అనే పేరు వెనక పెద్దగా కథలేమీ లేకపోయినా, ప్రాచుర్యంలో మాత్రం ఇక్కడ కొన్ని కథలు వినిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా రాముడు సీత కోసం వెతుక్కుంటూ ఇక్కడి ప్రాంతంలోని గోదావరి తీరానికి వచ్చాడని, ఇక్కడే సేద తీరగా, రాత్రి సమయంలో ఎన్నడూ లేని విధంగా బాగా నిద్రపోయాడని, అనంతరం ఇక్కడి నుంచి వెళ్లే సమయంలో ఇక్కడ మంచి నిద్ర వచ్చింది, ఈ నేల మంచిదని అంటూ వెళ్లాడని ఓ కథనం ఉంది. మంచి నేల అనేది వాడుకలోకి వచ్చేసరికి మంచిర్యాల అనే పేరు వచ్చిందని చెబుతారు. దీంతో పాటు మరో కథనం ఉంది. బ్రిటీషు వారి కాలంలో నిజాం నవాబులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు రైల్వే లైను వేశారు. ఆ సమయంలో మధ్యలో ఎక్కడా స్టేషన్ లేకపోగా, సేద తీరేందుకు ఇక్కడే ఓ గెస్ట్ హౌజ్‌ను కట్టారని, ఇక్కడి వాతావరణం నచ్చడంతో, మరో మాంచెస్టర్గా దీన్ని తయారు చేయాలని అప్పుడు నిర్ణయించినట్లు చెబుతారు. అందుకే మంచిర్యాలలో ఇనుము ఫ్యాక్టరీని సైతం ఏర్పాటు చేశారు. కానీ కాలక్రమేణా అది మూతపడింది. మరో మాంచెస్టర్ సిటీగా చేయాలనుకోవడంతోనే దీనికి ఆ పేరు వచ్చిందని, ఆ పేరు వాడుకలో మారుతూ మంచిర్యాలగా నిలిచిందన్నది మరో కథనం. గోదావరి తీరాన ఉండడం, ఇక్కడికి రకరకాల రాళ్లు కొట్టుకు వస్తుండడంతో, ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది రాళ్ల సేకరణకు వచ్చేవారని, అందుకే దీనిని మంచి రాళ్లు దొరికే స్థలంగా పిలుస్తూ, మంచిర్యాల అన్నారనే కోణమూ ఉంది. వెలుగు తెచ్చిన నేతలు మంచిర్యాల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం సంపాదించింది ఇక్కడి రాజకీయవేత్తలే. 1967-72లో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జేవీ నర్సింగరావుది దండేపల్లి మండలం ధర్మరావుపేట్. శాసనసభ్యుడిగా, మంత్రిగా, విద్యుత్ శాఖ బోర్డు చైర్మన్‌గా, ఉప ముఖ్యమంత్రిగా తన సేవలను అందించారు. న్యాయశాస్త్రం చదివిన జేవీ విద్యార్థి దశ నుంచే సేవపై తన అభిరుచిని పెంచుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి అపజయం పొందారు. 1955లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించి, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఏర్పడిన నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో జేవీ రోడ్లు, భవనాలు, నీటి పారుదల, విద్యుత్ శాఖలను నిర్వహించారు. 1963 నుంచి 1967లో అప్పటి లక్సెట్టిపేట నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికై, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెన్నెల మండలం జోగాపూర్‌కి చెందిన ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో తిరుగులేని పాత్ర పోషించారు. హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ట్ అయిన చంద్రయ్యది జన్నారం మండలం తిమ్మాపూర్. జిల్లాకే తలమానికం బొగ్గు గనులు మొదట బొగ్గు గని ఖమ్మం జిల్లాలో ఏర్పాటవగా ఆ తర్వాత 1927లో మన బెల్లంపల్లిలోనే తవ్వారు. అప్పటి నుంచి బెల్లంపల్లిలో సౌత్‌క్రాస్‌కట్. నెం.2 ఇంక్లయిన్, 24 డిప్, 84, 85 డిప్ గనులు, 68 డిప్ గని, శాంతిఖని, 1961లో మందమర్రి, రామకృష్ణాపూర్‌లలో, 1971లో శ్రీరాంపూర్, 1991లో చెన్నూరు ప్రాంతాల్లో బొగ్గు గనులు ఆవిర్భవించాయి. తూర్పు ప్రాంతంలో వెలసిన భూగర్భ బొగ్గు గనులు, ఓపెన్‌కాస్టు గనులతో మంచిర్యాల జిల్లాలో సుమారు 14 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. దీంతో పాటు మరో ఏడు వేల మంది కాంట్రాక్టు కార్మికులు, సింగరేణిపై ఆధారపడి మరో 15 వేల మంది ఉపాధిని పొందుతున్నారు. జైపూర్‌లో 1200ల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహాలు, ఖనిజ, వృక్ష సంపద, ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం సత్యనారాయణస్వామి ఆలయం ఇక్కడి మరిన్ని విశేషాలు. ఏసీసీ ప్రాంతంలో సిమెంట్ తయూరీ కంపెనీ ఉంది. -
వైఎస్ఆర్ ముందుచూపుతోనే...
కరీంనగర్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముందుచూపుతోనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జీవన్‌రెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలో ప్రాజెక్టుల జలకళ కాంగ్రెస్ ఘనతేనన్నారు. కాంగ్రెస్ పార్టీ హాయాంలోనే 90 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తే కాంగ్రెస్‌కు పేరొస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టును ప్రారంభించినా...లేకపోయినా పంప్‌హౌస్‌లు పూర్తి చేసి 2 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును సందర్శించిన వారిలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, జీవన్ రెడ్డి ఉన్నారు. -
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
కరీంనగర్: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. 20 టీఎంసీల సామర్ధ్యంగల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 18.5 టీఎంసీల నీరు ఉంది. అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి 93 వేల342 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 62 వేల 881 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. -
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ
-
ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో దూకి మహిళ ఆత్మహత్య !
రామగుండం : ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీనంగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా పనులు నిర్వహించుకుంటున్న కొందరు వ్యక్తులు బ్రిడ్జిపై హ్యాండ్ బ్యాగ్ ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హ్యాండ్‌బ్యాగ్‌ను పరిశీలించారు. అందులోభాగంగా ఓ చీటి కనిపించింది. అందులో.. రామగుండం మండలం గూడూరు గ్రామానికి చెందిన గాజుల పద్మగా రాసి ఉంది. అలాగే ఆమె స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేసినట్లు ఆధారాలు లభించాయి. దాంతో పోలీసులు బ్యాంకు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. అయితే పద్మ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అలాగే పద్మ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారుల దాడులు
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ఇసుక మాఫియాపై ఆదివారం అధికారులు దాడులు నిర్వహించారు. మంచిర్యాల మండలం గోదావరి తీరం నుంచి అనుమతి, పర్మిట్లు లేకుండా ఇసుక తరలిస్తున్న 17 లారీలను పట్టుకుని పోలీసులు జరిమానా విధించారు. ఈ నెల 10వ తేదీన సాక్షిలో ‘తోడేస్తున్నారు’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో ఇసుక మాఫియా రవాణాను కొద్ది రోజులు నిలిపి వేసింది. మళ్లీ ఆదివారం గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీరాంపూర్‌లోని సింగాపూర్ వద్ద గల గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. గతంలో రాత్రుళ్లు మాత్రమే ఇసుకను రవాణా చేసిన అక్రమార్కులు ఆదివారం ఉదయం అనుమతులు లేకుండా, ఓవర్‌లోడ్‌తో అక్రమంగా తరలించారు. సమాచారం అందుకున్న హాజీపూర్ పోలీసులు వాహనాలను తనీఖీ చేయగా, అనుమతి పత్రాలు లేకపోవడంతో జరిమానా విధించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. -
తోడే స్తున్నారు!
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : మంచిర్యాల మండలం గోదావరి నది నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. గుడిపేట వద్ద నిర్మిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ భాగం లో ఉన్న గోదావరి నుంచి రోజూ వంద ల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ఈ ఇసుకను గోదావరి సమీపంలోని పంటపొలాలు, ఖాళీస్థలాల్లో డంప్ చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువ భాగాన ఇసుక తోడటంతో ఇప్పటికే 20 మీటర్లకుపైగా గుంతలు ఏర్పడ్డాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు, విద్యుత్ టవర్లకు సమీపంలోనే భారీగా గుంతలు ఏర్పడటంతో భవిష్యత్తులో వాటికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పదిహేను రోజులుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా రెవెన్యూ, భూగర్భశాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలా లు అడుగంటి పోయే ప్రమాదం ఉండగా, సమీపంలోని పంటపొలాల్లోకి దుమ్ము చేరి పంటలు పాడవుతున్నాయి. దిగుబడి తగ్గుతోంది. ట్రా క్టర్లు, లారీల రాకపోకలతో రహదారులు గుంతలుగా మారి పూర్తిగా పాడయ్యాయి. దుమ్ముతో పల్లెవాసులు అవస్థలు పడుతున్నారు. ముంపు గ్రామస్తుల కనుసన్నల్లో.. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గుడిపేట, నంనూరు, రాపల్లి, చందనాపూర్ గ్రామాలకు చెందిన పలువురు ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా మారి ఈ అక్రమ ఇసుక రవాణాకు తెరలేపారు. వారి గ్రామాలు ముంపులో పోతున్నందున వారికి కేటాయించిన పునరావాస కాలనీల్లో ఇసుక తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులకు పలుమార్లు విన్నవించారు. దీంతో ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను నిర్వాసితులు గోదావరి నుంచి తీసుకోవచ్చని అధికారులు సూచన ప్రాయంగా తెలిపారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. ముంపు పరిహారం రూ. లక్షలు నిర్వాసితుల దగ్గర ఉండడంతో, గ్రామంలో చాలామంది ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. అప్పటి వరకు గ్రామంలో కేవలం పదుల సంఖ్యలో ఉన్న ట్రాక్టర్లు కొద్దిరోజుల్లోనే వందల సంఖ్యకు చేరాయి. పునరావాస కాలనీల్లోని ప్లాట్లలో ఇసుకను పోస్టూ అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు అన్ని గ్రామాల ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా మారి అధికారులకు ఇవ్వాల్సిన ముడుపులు అందించి గోదావరిలో ఇష్టారీతిన తవ్వకాలు చేస్తున్నారు. వీరికి మంచిర్యాలకు చెందిన ఇసుక మాఫియా తోడవడంతో నిల్వ చేసిన ఇసుకను లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రివేళల్లో హైదరాబాద్‌కు తరలింపు రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను గోదావరి సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ కేంద్రాలకు తరలిస్తుం టారు. గుడిపేటలో డంపింగ్ కేంద్రాలు వందకు పైగా ఉన్నాయంటే రోజూ ఎంత ఇసుకను తవ్వుతున్నారో అర్థమవుతుంది. మరికొందరు గుడిపేట వద్ద గల పునరావాస కాలనీలో ఇసుకను నిల్వ చేస్తున్నారు. రాత్రివేళల్లో వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్ల ద్వారా డంప్ చేసిన ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇందుకు ఆయా ట్రాక్టర్ యజమానులకు ఒక్కో లారీలోడుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తున్నారు. ఇదే ఇసుకను హైదరాబాద్‌కు తరలించి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముకుంటున్నారు. గోదావరి నది ఇసుకకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అక్రమార్కులు ఇసుకను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రాజెక్టుకు, విద్యుత్ టవర్లకు పొంచి ఉన్న ముప్పు గుడిపేట వద్ద నిర్మిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సమీపంలో కేవలం 15 రోజుల్లోనే 20 మీటర్ల మేర ఇసుకను తవ్విన అక్రమార్కులు, మరో నెలరోజులు ఇలాగే ఇసుకను తవ్వేస్తే ప్రాజెక్టు మనుగడకే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు రెండుసార్లు గోదావరిలో వేసిన విద్యుత్ టవర్లు నీటిలో కొట్టుకుపోయాయి. తూర్పు జిల్లాకు అందించే విద్యుత్ టవర్లు కూలిపోవడంతో రెండు నెలలపాటు తూర్పు జిల్లా వాసులు చీకట్లోనే గడిపారు. ప్రస్తుతం అవే టవర్ల సమీపంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో విద్యుత్ టవర్లు మరోసారి కూలే ప్రమాదం లేకపోలేదు. వచ్చే వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగితే ప్రాజెక్టుతో పాటు, విద్యుత్ టవర్లకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. -
ఎట్లస్తరో చూస్తం
గోదావరిఖని/రామగుండంరూరల్, న్యూస్‌లైన్: తలాపునే గోదావరినది పారుతున్నా రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తాగు, సాగునీరు ఎందుకివ్వరని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, ఉపనేత టి.హరీష్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం ఎలా ప్రారంభిస్తారో చూస్తామని సవాల్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రామగుండం మండల ప్రజలకు తాగు, సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల రాజేందర్, హరీష్‌రావు మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది పారుతున్నా ఆ జిల్లాకు నీరందించకపోవడం వల్ల ప్రజలు బతుకుదెరువు లేక వలసపోతున్నారని అన్నారు. నల్లగొండ జిల్లాకు నీటిని కేటాయించకపోవడంతో ఫ్లోరైడ్ సమస్యతో బతుకులు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రామగుండం మండలంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు ఇవ్వకుండా దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రామగుండంప్రాంతంలోని బొగ్గుగనులు, నీటివనరులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇంధనంగా నడిపిస్తున్నా.. ఇక్కడి ప్రజలనే ఇబ్బందులకు గురిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు జాగలు త్యాగం చేసిన నిర్వాసితులకే జలవనరులపై పూర్తి హక్కులుంటాయనే విషయాన్ని మరువరాదన్నారు. సీపీడబ్ల్యూ పథకంలో నిధుల కేటాయింపునకు సంబంధించిన డిజైన్ (ఫీజుబిలిటీ రిపోర్టు) రూపొందించి ప్రభుత్వానికి ఖర్చు తగ్గించే పని చేసినప్పటికీ దానిని మంత్రి శ్రీధర్‌బాబు పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. అధికారం శాశ్వతం కాదని, మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, అభివృద్దిని అడ్డుకుంటే రామగుండం నియోజకవర్గ ప్రజల దృష్టిలో మంత్రి శాశ్వతంగా శత్రువుగా మారుతారని, అనవసరంగా అధికారులపై ఒత్తిడి తేవద్దని వారు సూచించారు. ఇప్పటికే సింగూరు జలాలను మెదక్‌కు కాకుండా హైదరాబాద్ మీదుగా ఆంధ్రకు తరలించుకు పోయారని, ప్రస్తుతం ఎల్లంపల్లి జలాలను రూ.4,500 కోట్లతో సుజల స్రవంతి పేరుతో హైదరాబాద్‌కు తరలించుకుపోయేందుకు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంత ప్రజల గోడు పట్టించుకోకుండా నీటిని తరలిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. పెద్దపల్లి జి.వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగా సీమాంధ్ర మంత్రులు రూ.165 వేల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేయించుకున్నట్లు జీఓఎంలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో జిల్లాలోని ఆరు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురికాగా అందులో ఏడు వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. రూ.63 కోట్లతో 20వేల ఎకరాలకు సాగునీరు, రూ.10లక్షలతో ఎల్కలపల్లిలో వాల్వ్ ద్వారా మరో 3వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. పాక్షికంగా ముంపునకు గురయ్యే కుక్కలగూడూర్‌ను కూడా ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ మీదుగా బొట్టు నీటిని హైదరాబాద్‌కు పోనివ్వమని, పైపులు పగులకొట్టి మానేరు డ్యాం నింపుకుంటామని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో సిర్పూర్(టి) ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, పార్టీ నేతలు కోరుకంటి చందర్, బుడిగె శోభ, మాడ నారాయణరెడ్డి, గుంపుల ఓదెలు, సోమారపు అరుణ్‌కుమార్, దీటి బాలరాజు, పెద్దంపేట శంకర్‌తోపాటు వివిధ గ్రామాల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మహాధర్నా కొనసాగింది.