
మంచిర్యాలరూరల్(హాజీపూర్) : పరిహారం కోసం బోగస్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. గ్రామాల్లో లేనివారు, 18 సంవత్సరాలు నిండనివారు పునరావాస ప్యాకేజీ పరిహారం జాబితాలోకి వస్తున్నారు. అసలు ఊర్లో లేని వారి పేర్లు సైతం జాబితాలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లంపల్లి (శ్రీపాదసాగర్) ప్రాజెక్ట్ కింద ముంపునకు గురయ్యే గ్రామాల్లో యువతకు మేజర్ సన్స్ కింద అందజేసే ప్రత్యేక పరిహారం కోసం ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం తయారు చేస్తున్న జాబితాలో ఎక్కువ శాతం బోగస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తం ముంపు గ్రామాలు 09
నిర్వాసిత కుటుంబాలు 3,646
సేకరించిన భూమి (ఎకరాలు) 6,035
మేజర్‌సన్స్ జీవో విడుదల 2015లో
వచ్చిన దరఖాస్తులు 627
ఒక్కొక్కరికి పరిహారం రూ.2,00,000
మంచిర్యాలరూరల్(హాజీపూర్) : ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన గ్రామాల్లోని 18 సంవత్సరాలు నిండిన యువతకు మేజర్‌సన్స్ పరిహారం చెల్లించాలని 2015లో జీఓ విడుదలైంది. అప్పటినుంచి పరిహారం కోసం అర్హులు ఎంతగానో ఎదురుచూస్తున్నా పంపిణీ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడంలేదు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా హాజీపూర్ మండలంలోని ఏడు గ్రామాలు, లక్సెట్టిపేట మండలంలోని రెండు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2004 జూలై 18న ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడగా పదేళ్ల అనంతరం నిర్మాణం పూర్తయ్యింది. ఆ సమయంలో కొంతమంది మేజర్‌సన్స్‌కు పరిహారం అందించారు. ప్రాజెక్ట్ పూర్తి కావడంలో జాప్యంతో పాటు నిర్వాసితుల కుమారులు మేజర్ అయిన వారికి కూడా పరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో నాటినుంచి ఇప్పటివరకు 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రత్యేక పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం 2015లో జీఓ విడుదల చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న తొమ్మిది గ్రామాల్లో మొత్తం 3,646 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. 6,035 ఎకరాల భూమిని సేకరించారు. అయినా ఇప్పటివరకు మాత్రం యువతకు పరిహారం అందకపోవడం శోచనీయం.
627 దరఖాస్తులు...
2015 జనవరి 1నాటికి 18 సంవత్సరాలు నిండిన యువకుల నుంచి మేజర్‌సన్స్ కింద రూ.2 లక్షల ప్యాకేజీ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. 627 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సోషల్ ఎకనామిక్ సర్వే (ఎస్‌ఈఎస్) ప్రకారం 174 మంది పేర్లతో ప్రత్యేక జాబితా తయారు చేశారు. ఈ జాబితాలో నుంచి కూడా అన్నివిధాలుగా సర్వే చేసి పూర్తి అర్హులను మాత్రమే ఎంపిక చేస్తారు. ఇక మిగతా దరఖాస్తులను కూడా పరిశీలించి త్వరలోనే ముంపు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శించనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. దీంతోపాటు ఇంకా అర్హులు ఉంటే వారి వివరాలు కూడా తీసుకుంటారు.
ప్రతిపాదిత జాబితాలో బోగస్ పేర్లు...
గుడిపేట, నంనూర్, చందనాపూర్, రాపల్లి, పడ్తనపల్లి, కర్ణమామిడి, కొండాపూర్‌లతో పాటు లక్సెట్టిపేట మండలంలోని సురారం, గుల్లకోట గ్రామాలతో కలిపి తొమ్మిది గ్రామాలు ముంపునకు గరయ్యాయి. మేజర్‌సన్స్ జాబితాలో ఎక్కువగా బోగస్ పేర్లు ఉన్నాయంటూ పలువురు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇదివరకు పరిహారం పొందిన వారి పేర్లతో పాటు 18 సంవత్సరాలు నిండనివారి పేర్లు, గ్రామాల్లో లేనివారి పేర్లు, మైనర్ల పేర్లను చేరుస్తూ పరిహారం కాజేయడానికి పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి దశలో ఉన్న సమయంలో దాని ప్యాకేజీ కింద పరిహారం పొందినవారి పేర్లను తిరిగి 18 సంవత్సరాలు నిండిన జాబితాలో నమోదు చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. గుడిపేట, రాపల్లి, కర్ణమామిడి గ్రామాల్లో ఈ అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కొంతమంది అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా స్పందించడం లేదంటున్నారు. అయితే అర్హుల జాబితా తయారు చేయలేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
చెరో సగం...
ఎల్లంపల్లి ముంపు గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన యువతకు పరిహారం చెల్లించేందుకు విడుదలైన జీవో కొంతమంది పైరవీకారులకు వరంగా మారింది. పరిహారం కోసం తయారు చేసే జాబితాలో పేరు చేర్పిస్తే రూ.50 వేల నుంచి పరిహారంలో సగం ఇవ్వాల్సిందేనంటూ బేరాలు కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన యువతకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద పరిహారం చెల్లించనుంది. ఇందులో రూ.లక్ష అనర్హులకు, మరో రూ.లక్ష పైరవీకారులకు అన్న చందంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. మేజర్‌సన్స్ కింద అందజేసే పరిహారం చెల్లింపులకు ప్రభుత్వం మూడు నెలల కిందటే నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది. జాబితా ఖరారు అయితే వెంటనే పరిహారం పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
జీపీలో జాబితా ప్రదర్శిస్తాం..
నిర్వాసిత గ్రామాలకు ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో గల గ్రామపంచాయతీ కార్యాలయాల ఆవరణలో వారం రోజుల్లోగా అర్హుల జాబితాలను ప్రదర్శిస్తాం. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పూర్తి స్థాయి సర్వే చేస్తున్నాం. పరిహారం పొందినవారి పేర్లు, అనర్హులు ఉన్నట్లయితే వాటిని తొలగిస్తాం. ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దు. గ్రామాల వారిగా ప్రదర్శించిన అర్హుల జాబితాపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. వీటిపై వారం రోజుల్లో విచారణ జరుపుతాం. గతంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. తుది జాబితా ఖరారు కాగానే ప్రత్యేక ప్యాకేజీ పరిహారం పంపిణీ చేస్తాం.
– వంగల మోహన్‌రెడ్డి, తహసీల్దార్, హాజీపూర్