మధ్యలోనే మింగేస్తున్న రాజకీయనాయకులు, అధికారులు.. | Victims Still Not Got Their Compensation | Sakshi
Sakshi News home page

మధ్యలోనే మింగేస్తున్న రాజకీయనాయకులు, అధికారులు..

Published Sun, Nov 18 2018 5:21 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

Victims Still Not Got Their Compensation - Sakshi

ప్రకృతి విపత్తులు జిల్లాకు కొత్త కాదు.. నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లింపు అంతకన్నా కొత్తకాదు! కానీ టీడీపీ ప్రభుత్వం టెక్నాలజీ పేరుతో ప్రకృతి విపత్తుల పరిహారం చెల్లింపులను ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడమే ఇక్కడ కొత్త! రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అంటూ ఓ పదాన్ని తెరపైకి తీసుకొచ్చి తెరవెనుక మాత్రం బాధితుల పొట్టకొట్టే ప్రయత్నం జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు సౌకర్యంగా ఉండాల్సింది బదులు అదే పెద్ద సమస్యగా మారడమే ఇప్పుడొక విచిత్రం! దీని లక్ష్యం కేవలం ఏదొక సాకుతో పరిహారం ఎగవేయడమే!


సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో గత నెల 10వ తేదీన తిత్లీ తుపాను,  తదనంతరం వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదుల వరదలతో దాదాపు 77,690 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. దీనివల్ల 2,07,786 మంది రైతులు నష్టపోయారు. వారికి సుమారు రూ.159.26 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే కొబ్బరి, జీడిమామిడి, అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు 28,083 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ఇందుకుగాను 1,10,739 మంది రైతులకు రూ.263.55 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే 9,535 పశువులు, పౌల్ట్రీ కోళ్లు 1.50 లక్షలు చనిపోవడంతో పాటు 16 వేల పశువుల శాలలు, పౌల్ట్రీ షెడ్లు కూలిపోయాయి. ఇందుకుగాను 29,800 మంది రైతులకు పరిహారంగా రూ.34.49 కోట్లు చెల్లించాల్సి ఉంది.

అన్ని రకాలు కలిపి 47,606 ఇళ్లు నష్టపోయిన బాధితులకు రూ.49.83 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఇదే తరహాలో మత్స్యశాఖకు సంబంధించి రూ. 8.36 కోట్లు, చేనేత జౌళి రంగానికి సంబంధించిన బాధితులకు రూ.9 లక్షలు, అలాగే పరిశ్రమలు దెబ్బతిన్నవారికి, ఇతరత్రా రంగాల్లో జరిగిన నష్టాలకు కలిపి మొత్తం దాదాపు 4.30 లక్షల మంది తిత్లీ బాధితులకు రూ.520 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంది. అయితే శనివారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తిత్లీ తుపాను బాధితులకు నష్టపరిహారం చెల్లింపుల్లో అవకతవకలు, అక్రమాలు, అవినీతి, చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం తదితర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యులంతా గళమెత్తారు.
 
చెప్పిందొకటి... జరిగేదొకటి...
తిత్లీ బాధితులకు నష్టపరిహారం మొత్తాలను బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు ఈనెల 5వ తేదీన పలాసలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తన చిత్రంతో డమ్మీ చెక్‌లను సైతం పంపిణీ చేశారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా 25 రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ బాధిత రైతులకు మాత్రం ఇప్పటివరకూ ఊరట లభించలేదు. టెక్నాలజీతో తిత్లీ తుఫానును హ్యాండిల్‌ చేశామని నేతలు చెబుతున్నారు. కానీ అదే సాంకేతిక పరిజ్ఞానంతో బాధిత రైతులను బోల్తా కొట్టిస్తున్నారనడంలో సందేహం లేదు. తుపాను వల్ల ఎలాంటి నష్టం జరిగినా పరిహారం పక్కాగా అందించాల్సింది బదులుగా ఏదో ఒక్క పంటకే పరిహారం, కొంత విస్తీర్ణంగల భూమిలో పంటకే గణన... ఇలా సవాలక్ష కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చారు. దీంతో రైతులు పరిహారం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు.

ఆర్‌టీజీఎస్‌తోనే మాయాజాలం...
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తరచుగా వల్లిస్తున్న రియల్‌టైమ్‌ గవర్నన్స్‌ (ఆర్‌టీజీఎస్‌)తోనే పరిహారం మాయాజాలం నడుస్తోంది. వాస్తవానికి నష్టపరిహారం చెల్లింపులు గతంలో నేరుగా చెక్‌ల ద్వారా జరిగేవి. ఆ చెక్‌లను బాధితులు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకొనేవారు. ఈసారి మాత్రం మొత్తం వ్యవహారం అంతా ఆర్‌టీజీఎస్‌కు అప్పగించారు. అదొక ప్రైవేట్‌ ఏజెన్సీ మాత్రమే. తిత్లీ నష్టపరిహారాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చెప్పారు. ఈ ప్రకారం ట్రెజరీ శాఖ ద్వారా నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కానీ ఆ చెల్లింపుల మొత్తాన్ని ట్రెజరీ నుంచి బ్యాంకులకు చేరకుండా ఆర్‌టీజీఎస్‌కు అప్పగించారు. తర్వాత ఆర్‌టీజీఎస్‌ నుంచి బాధితుల ఖాతాల్లో మాత్రం రకరకాల కొత్త నిబంధనలు, కారణాలను చూపించి జమ చేయట్లేదు. వాస్తవానికి తుఫానుతో నష్టపోయిన పంటలకు, తోటలకు, ఇళ్లకు జియోట్యాగింగ్‌ చాలావరకూ జరగలేదు. నష్టాల గణన కూడా ఆదరాబాదరాగానే నిర్వహించారు. దీంతో ప్రభుత్వం విడుదల చేశామని చెబుతున్న రూ.520 కోట్ల పరిహారం సొమ్ములో కేవలం ఇప్పటివరకూ రూ.120 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగినట్లు అంచనా. మిగతా సొమ్ము అంతా ఆర్‌టీజీఎస్‌ ఖాతాలోనే ఉంది. దీనివల్ల ఆ సంస్థకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. తుఫాను బాధిత రైతులకు మాత్రం పరిహా రం అందలేదనే ఆవేదన మిగులుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement