కంచిలి తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న తిత్లీ బాధిత జాడుపూడి గ్రామస్తులు
నందిగాం మండలం దేవుపురం పంచాయతీ పరిధిలోని సంతోషపురం రెవెన్యూ పరిధిలో కింజరాపు లలితకుమారికి రెవెన్యూ ఖాతా నంబరు 384 ప్రకారం 2.64 ఎకరాల భూమి మాత్రమే ఉంది. అందులో ఎలాంటి చెట్లు కానీ, పంట కానీ లేదు. కానీ తిత్లీ తుపాను దెబ్బతో 4.95 ఎకరాలల్లో వరి పంట నష్టపోయినందుకు రూ.39,600, మరో మూడెకరాల్లో జీడిచెట్లు కూలిపోయినందుకు రూ.36,421 అలాగే మరో 2.5 ఎకరాలలో మామిడి చెట్లు పోయినందుకు రూ.30,351 చొప్పున నష్టపరిహారం చెల్లించేశారు. అంటే సుమారు రెండున్నర ఎకరాల భూమి అదీ ఎలాంటి పంటల్లేకున్నా తొమ్మిదిన్నర ఎకరాలుగా నమోదుచేసి రూ.లక్షకు పైగా ప్రజాధనం జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీరా ఆమె ఎవరో కాదు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడి భార్య కావడం గమనార్హం.
కంచిలి మండలంలోని జాడుపూడి గ్రామంలో తిత్లీ తుపానుతో నష్టపోయిన సుమారు 50 మంది రైతులకు పైసా కూడా విదల్చకుండా సెంటు భూమి లేనివారిని సైతం బినామీలుగా పేర్లను నమోదుచేయించి రూ.లక్షల్లో నష్టపరిహారం నొక్కేసిన వ్యవహారం కూడా టీడీపీ నాయకులకే చెల్లింది. బసవ హలియాకు రూ.78 వేలు, బసవ దేవకికి రూ.1,18,500 అలాగే బుడ్డ పురుషోత్తంకు రూ.1.92 లక్షలు, గాలి దూదమ్మకు రూ.76 వేలు, జామి సావిత్రికి రూ.1.51 వేలు, జీరు గంగయ్య రూ.1.72 వేలు ఇలా... చాలామందికి భారీగా నష్టపరిహారం చెల్లింపు జరిగిపోయింది.
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: తిత్లీ తుపానుతో అన్ని విధాలా నష్టపోయిన రైతులు, సామాన్యులు నేటికీ నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కానీ టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు బినామీలను సృష్టించి, లేదంటే తక్కువ భూమి ఉన్నా విస్తీర్ణం పెంచేసి ఖజానాకు చిల్లుపెడుతున్నారు. పరిహారం కైంకర్యం చేస్తే అక్రమార్కులెవ్వరైనా కఠిన చర్యలు తీసుకుంటానని పలాస వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించినా తమ్ముళ్లు మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నారు. తిత్లీ తుపాను జిల్లాను కకావికలం చేసి నలభై రోజులు దాటిపోయినా బాధితులు తమకు నేటికీ న్యాయం జరగలేదని వాపోతున్నారు. అసలైన బాధితులకు తగిన నష్టపరిహారం అందించాలని, అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు ఆందోళనలు చేపట్టింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకూ స్పందన కనిపించట్లేదు.
తుపానుతో జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడం, పరిహారం చెల్లింపుకోసం జాబితాల తయారీ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు జోక్యం చేసుకొని, అధికారులు, ప్రభుత్వ సిబ్బందిపై ఒత్తిళ్లు తీసుకొచ్చి తమ ఇష్టానుసారం నష్టపరిహారం నమోదు చేయించారు. పంట నష్టపోయిన భూవిస్తీర్ణం ఎక్కువగా చూపించడం, ఫలసాయం అధికంగా లెక్కలేయించడం తదితర విషయాల్లో ఎక్కడికక్కడ వారు చక్రం తిప్పారు. చివరకు సెంటు భూమి లేనివారికి సైతం నష్టపరిహారం జాబితాల్లో చోటు కల్పించారంటే పరిస్థితి ఊహించవచ్చు. ఇక బినామీల వ్యవహారం కూడా గుట్టుచప్పుడు గాకుండా టీడీపీ నాయకులు నడిపించారు. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరి జాతకం నెమ్మదిగా వెలుగుచూస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలామంది అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండదండలతో నష్టపరిహారం చాలావరకూ చేజిక్కించుకున్నారు.
చెల్లింపులు జరిగిపోయాయ్...
జిల్లాలో తిత్లీ తుపాను, వరద ప్రభావంతో వరి పంటకు జరిగిన నష్టంతో 2,13,478 మంది రైతులు నష్టపోయారు. కొబ్బరి, జీడిమామిడి తదితర ఉద్యానవన పంటలు నష్టపోయిన రైతులు 1,18,415 మంది ఉన్నారు. పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకలు నష్టపోయినవారు 28,879 మంది ఉన్నారు. మత్స్యశాఖకు సంబంధించి వలలు, బోట్లు, ఇతర సామగ్రి నష్టపోయినవారు 4,715 మంది ఉన్నారు. ఇక ఇళ్లు విషయానికొస్తే పక్కాఇళ్లు, పూరిళ్లు, గుడిసెలు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నవారు 44,697 మంది ఉన్నారు. పెట్టీ షాపులు నష్టపోయినవారు 2,512 మంది ఉన్నారు. ఇలా వివిధ అంశాల్లో జిల్లావ్యాప్తంగా తిత్లీ బాధితులు 4,30,925 మంది ఉన్నారు. వారిలో ఇప్పటివరకూ 3,45,949 మందికి నష్టపరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం గణాంకాలు చూపిస్తోంది. ఈ ప్రకారమే ఇంకా 84,976 మందికి ఈ పరిహారం అందలేదు. కానీ పరిహారం అందుకున్నవారిలో చాలామంది సెంటు భూమి లేని బినామీలు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘ఆన్‌లైన్’లో కనిపించని సమాచారం...
తిత్లీ తుపాను వల్ల జరిగిన నష్టం, చెల్లించిన పరిహారం, లబ్ధిపొందిన బాధితుల పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారమే తొలి కొద్దిరోజులు మాత్రమే అమలుజరిగింది. అయితే ఎక్కడికక్కడ అవినీతి వెలుగుచూడటంతో ఆ జాబితాలు కీలకంగా మారాయి. గ్రామాల వారీగా ఇచ్చిన ఆ పరిహారం జాబితాలను డౌన్‌లోడ్ చేసి, అవినీతిని ప్రజలు ఎక్కడికక్కడ బట్టబయలు చేస్తున్నారు. మరోవైపు అక్రమాలపై జిల్లా అధికారులకు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో గ్రామస్థాయి జాబితాలు మాయమవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment