Compensation
-
ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులు కస్టమర్లకు త్వరితగతిన సేవలు అందించాలని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వినియోగదారులకు అందించాల్సిన సేవలలో ఏ మాత్రం ఆలస్యం జరిగిన జరిమానా తప్పదని వెల్లడించింది.బ్యాంకులు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు కస్టమర్లకు అందించే సేవలలో ఎక్కువ ఆలస్యం చేస్తున్నాయని ఆర్బీఐ ఫిర్యాదులు అందుకుంది. దీంతో కొత్త ఆదేశాలను జారీ చేస్తూ.. నెల రోజులు లేదా 30 రోజుల లోపల వినియోగదారుల సమస్యలు పరిష్కారం కాకపోతే, రోజుకు 100 రూపాయలు జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఈ డబ్బు వినియోగదారునికే పరిహారం రూపంలో అందించడం జరుగుతుంది.వినియోగదారుల క్రెడిట్ సమాచారాన్ని బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ పొందినట్లయితే.. దానిని వారికి ఈమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ రూపంలో తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంతే కాకుండా ఖాతాదారుడు డిఫాల్ట్‌గా లోన్ చెల్లించకుండా ఉంటే ఆ విషయాన్ని కూడా బ్యాంకులు తెలియజేయాలి. ఈ విషయాన్ని 21 రోజులలోపు తెలియజేయకపోతే.. వినియోగదారునికి రోజుకి 100 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నియమం ఆర్ధిక సంస్థలకు కూడా వర్తిస్తుంది.ప్రస్తుతం భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే అధికారం పొందిన నాలుగు సీఐసీలు ఉన్నాయి. అవి సిబిల్, సీఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్. ఇవి కూడా వినియోగదారుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలి లేదా ఫిర్యాదుకు సంబంధించిన అప్డేట్ కస్టమర్‌కు తెలియజేయాలి. ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించినట్లయితే.. దానికి కారణం కూడా చెప్పాలని ఆర్బీఐ ఆదేశించింది.ఆర్బీఐ నిర్ణయం వెనుక ఉద్దేశ్యంవినియోగదారులు లేదా ఖాతాదారులు ఏదైనా సమస్యను పరిష్కరించాలనుకుంటే.. రోజుల తరబడి బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థల చుట్టూ పదే పదే తిరగాల్సి ఉండేది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని అన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించాలని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఏటీఎంల గురించి ఆర్బీఐనగదు సర్క్యులేషన్ రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. భారతీయ బ్యాంకులు ఏటీఎంలను, క్యాష్ రీసైక్లర్లను క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. చాలామంది ప్రజలు యూపీఐ, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల ఏటీఎంల వినియోగం కూడా భారీగా తగ్గిపోయిందని ఆర్బీఐ స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. భారతదేశంలో ఏటీఎంల సంఖ్య సెప్టెంబర్ 2023లో 2,19,000 ఉండేవి. కానీ వీటి సంఖ్య సెప్టెంబర్ 2024 నాటికి 2,15,000కు తగ్గిపోయింది. అదే సమయంలో ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య కూడా 97,072 నుంచి 87,638కి తగ్గాయి. సాధారణంగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి, అద్దె, సెక్యూరిటీ వంటి వాటికి.. సంబంధిత బ్యాంకులు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వినియోగం తగ్గినప్పుడు ఈ ఖర్చు మొత్తం వృధా. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సన్నద్ధమవుతున్నాయి. -
ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: పౌరులు ఆస్తిని కలిగి ఉండే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రజల నుంచి భూమిని సేకరిస్తే చట్టప్రకారం వారికి సరైన పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తగిన పరిహారం చెల్లించకుండా వారికి ఆస్తిని దూరం చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. బెంగళూరు–మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ విషయంలో 2022 నవంబర్‌లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. తీర్పు వెలువరించింది. రాజ్యాంగ(44 సవరణ) చట్టం–1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారని ధర్మాసనం వెల్లడించింది. అయినప్పటికీ సంక్షేమ రాజ్యంలో అది మానవీయ హక్కు అని ఉద్ఘాటించింది. ఆస్తి హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ కింద రాజ్యాంగ హక్కేనని వెల్లడించింది. ఆర్టికల్ 300ఏ ప్రకారం.. ప్రజలను వారి ఆస్తి నుంచి దూరం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాలను ఆదేశించింది. -
పరిహారం తేల్చకుండానే టెండర్లా?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు ఇచ్చే పరిహారం ఎంతనేది తేల్చకుండానే.. రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవడం ఏమిటని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. తరతరాలుగా తమ జీవనాధారమైన భూములను కోల్పోతే ఎలా బతకాలని నిలదీస్తున్నారు. ఎంతో విలువైన ఈ భూములకు కనీసం ఎకరాకు రూ.కోటిపైగా చెల్లించాల్సిందేనని, లేకుంటే భూములు ఇచ్చేదే లేదని పేర్కొంటున్నారు. త్వరలో భూసేకరణ అవార్డు.. ‘రీజనల్’ఉత్తర భాగం కింద 161.581 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఇటీవల టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. తొలివిడతలో సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు.. మొత్తం ఐదు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 3,429 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. సర్వే ప్రక్రియ కూడా పూర్తయింది. పరిహారం నిర్ణయించేందుకు... ఆయా గ్రామాల్లో ఇటీవల జరిగిన భూముల క్రయవిక్రయాల వివరాలను అధికారులు సేకరించి ప్రభుత్వానికి పంపారు. కానీ ఎకరానికి ఎంత మొత్తం చెల్లిస్తారనేది తేలలేదు. రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు ఈ భూసేకరణ ప్రక్రియలో రెవెన్యూ ఉన్నతాధికారుల ధోరణిని రైతులు తప్పుపడుతున్నారు. నిర్వాసితులకు కనీస సమాచారం ఇవ్వకుండా, కేవలం చట్టప్రకారం వ్యవహరిస్తామంటున్నారే తప్ప ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. భూముల విలువలు కొన్నేళ్లుగా భారీగా పెరిగాయని, దానికితోడు తాము జీవనాధారమూ కోల్పోతున్నామని... ఇలాంటి పరిస్థితుల్లో తగిన పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు కార్యాలయానికి నిర్వాసితులు.. తమ భూములకు ఇచ్చే పరిహారం తేల్చకుండానే టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనా కూడా స్థానిక రెవెన్యూ అధికారులు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ.. నిర్వాసితులు ఎన్హెచ్ఏఐ అధికారుల వద్దకు వెళ్లి నిలదీస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఉన్న ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు యూనిట్ కార్యాలయానికి పీడీని కలసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పరిహారంపై నిర్ణయం రెవెన్యూ అధికారులే తీసుకుంటారని వారు చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.వాళ్లు చెప్పడం లేదు.. వీళ్లు తేల్చడం లేదు.. మా భూముల నుంచి రోడ్డు వేస్తామంటున్నారు. ఈ రోడ్డుకు టెండర్లు కూడా మొదలయ్యాయట. కానీ మా భూములకు ఎంత ఇస్తారో తేల్చడం లేదు. రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. నేషనల్ హైవే అధికారులను అడిగితే వారు రెవెన్యూ వారే చెబుతారంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. – గొల్ల కృష్ణ, నిర్వాసితరైతు, గిర్మాపూర్, సంగారెడ్డి జిల్లా చట్ట ప్రకారం చెల్లిస్తాం రీజనల్ రోడ్డు భూసేకరణ ప్రక్రియపై త్వరలో అవార్డు ప్రకటిస్తాం. నిర్వాసితులకు చట్టప్రకారం పరిహారం చెల్లిస్తాం. ఎకరానికి ఎంత చొప్పున ఇస్తారని లెక్కించేందుకు ఓ విధానం ఉంటుంది. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – రవీందర్‌రెడ్డి, భూసేకరణఅధికారి, రీజనల్ రింగ్ రోడ్డు -
ఓఎన్జీసీ పరిహారంపై దాగుడుమూతలు
సాక్షి, అమలాపురం: చమురు సంస్థల కార్యకలాపాల కారణంగా నష్టపోయే అగ్నికుల క్షత్రియులకు క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన పరిహారం.. అలాగే, ఏటా అందించే మత్స్యకార భరోసా ఈ ఏడాది ఇప్పటివరకూ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఆర్నెలలైనా పరిహారం పంపిణీపై ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. గత నవంబరు 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఓఎన్జీసీ పరిహారంతో పాటు మత్స్యకార భరోసా అందజేస్తారని లబ్ధిదారులు ఎదురుచూశారు. కానీ, ఇప్పటికీ ఆ ఊసేలేదు. అయ్యవారు వచ్చేవరకూ అమావాస్య ఆగాల్సిందే అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం చూస్తుంటే!ఓఎన్జీసీ పనులతో వేటకు అంతరాయం..కోనసీమ జిల్లాలో కాట్రేనికోన మండలం బ్రహ్మసమేథ్యం పంచాయతీ పరిధి గోదావరి పాయపై ఓఎన్జీసీ చమురు సంస్థ చేపట్టిన పైపులై¯న్ పనులతో స్థానిక మత్స్యకారులకు వేట లేకుండాపోయింది. సముద్రం లోపల ఉన్న రిగ్గు (ఆఫ్‌షోర్ బావి) నుంచి గాడిమొగ సైట్ వరకు బ్రహ్మసమేథ్యం పరిధిలోని గోదావరి పాయల వెంబడి ఓఎన్జీసీ సంస్థ పైపులై¯న్ పనులు చేపట్టింది. ఇందుకు అనువుగా నదీపాయల్లో పెద్దఎత్తున డ్రెడ్జింగ్ నిర్వహించింది. దీనివల్ల నెలలపాటు వేటకు అంతరాయం ఏర్పడింది. కాట్రేనికోన మండలంతో పాటు ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, కె.గంగవరం.. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలానికి చెందిన గోదావరి నదీపాయలను ఆనుకుని జీవిస్తున్న మత్స్యకారుల వేటకు బ్రేక్ పడింది. తమ కార్యకలాపాలు ముగిసే వరకూ నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందించేందుకు ఓఎన్జీసీ సంస్థ ముందుకొచ్చింది. దీంతో జిల్లాలో 23,458 మంది మత్స్యకారులకు పరిహారం అందించాలి. ఒక్కో మత్స్యకారునికి రోజుకు రూ.460 చొప్పున నెలలో 25 రోజులకు రూ.11,500 ఇచ్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఓఎన్జీసీ అంగీకరించింది. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, పుదుచ్చేరి రాష్ట్ర ప్రత్యేక ప్రధినిధి మల్లాడి కృష్ణారావు, మత్స్యకార నాయకులతో జిల్లా కలెక్టరు సమక్షంలో బాధిత లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఓఎన్జీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి కోనసీమ జిల్లా పరిధిలో 16,408 మందికి, కాకినాడ జిల్లా, పుదుచ్చేరి యానాం పరిధిలో 7,050 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. జగన్ హయాంలో రూ.647.44 కోట్లు చెల్లింపు..గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదు విడతలుగా ఒకొక్కరికి రూ.2,76,000 చొప్పున రూ.647.44 కోట్లను 8 వేల మంది లబ్ధిదారుల ఖాతాలో జమచేశారు. ఇంకా సంస్థ నుంచి సుమారుగా తొమ్మిది నెలలకు పైబడి నష్ట పరిహారం లబ్ధిదారులకు రావాల్సి ఉందని బాధితులు చెబుతున్నారు. కానీ, సంస్థ మాత్రం కేవలం 5 నెలల 21 రోజుల పరిహారం మాత్రమే పెండింగ్ ఉందని.. అది జిల్లా కలెక్టర్ వద్ద ఉందని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెల్లిస్తామని చెబుతోంది. ఇలా చూసినా వేట నష్టపోయిన మత్స్యకారులకు రూ.157.54 కోట్ల పరిహారం అందించాల్సి ఉంది. అయితే, ఎప్పటికప్పుడు తేదీలు మారుస్తూ కూటమి ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోంది. అసలు నష్టపరిహారం తమకు వస్తుందో లేదో తెలీక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు..మరోవైపు.. చమురు సంస్థలు సముద్ర జలాలు, గోదావరి పాయల్లో చేపడుతున్న చమురు నిక్షేపాల వెలికితీత పనులు, చమురు వ్యర్థాలను విడుదల చేయడం, ఓడల రాకపోకలవల్ల జరుగుతున్న శబ్ధ కాలుష్యంతో గోదావరి సహజత్వం కోల్పోయి మత్స్య సంపద తగ్గిపోతోంది. దీంతో చేపల వేటలేక జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.పైగా.. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం చెల్లించే మత్స్యకార భరోసా, ఓఎన్జీసీ నష్టపరిహారం సకాలంలో చెల్లించకపోవడంతో ఉపాధి కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు రావాల్సిన ఓఎన్జీసీ నష్టపరిహారం చెల్లించాలని మత్స్యకారులు కోరుతున్నారు. నిజానికి.. ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసాను రూ.20 వేలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఈ ఏడాది మత్స్యకార భరోసా కింద రూ.22.61 కోట్లు అందించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ ప్రభుత్వం ఈ ఊసే ఎత్తడంలేదు.వేట లేక ఉపాధి కోల్పోతున్నాం..గోదావరిలో పైపులైన్ పనులతో ఏర్పడిన ఇసుక మేటలు తొలగించకపోవడంతో మత్య్స సంపద తగ్గిపోతోంది. పైపులు వేసిన తరువాత పూడ్చివేత పనులు చేపట్టడంలేదు. మత్య్స సంపదపై ఇది కూడా ప్రభావం చూపుతుంది. వేట లేకపోవడంతో ఉపాధి లేకుండా పోయింది. – సంగాని చిన్న కన్నయ్య, బ్రహ్మసమేథ్యం, కాట్రేనికోన మండలంనష్టపరిహారం చెల్లించండి..మాకు ఓఎన్జీసీ సంస్థ నుంచి రావాల్సిన నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఆ పరిహారం చెల్లించకుండా.. చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా సకాలంలో ఇవ్వకపోతే మేం ఎలా బతికేది? అప్పులుచేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది.– ఓలేటి తేజ, బలుసుతిప్ప, కాట్రేనికోన మండలం -
మరణించిన టీనేజర్ కుటుంబానికి రూ. 2,624 కోట్ల పరిహారం
న్యూయార్క్: అమెరికాలో అమ్యూజ్మెంట్ పార్క్‌లో నిట్టనిలువుగా కిందకు దూసుకొచ్చే ‘ఫ్రీ ఫాల్ టవర్ డ్రాప్ రైడ్’లో ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఒక టీనేజర్ కుటుంబానికి రూ.2,624 కోట్ల భారీ నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఐకాన్ పార్క్‌లో ఫన్‌టైమ్ హ్యాండిల్స్ అనే సంస్థ ఈ రైడ్‌ను నిర్వహించింది. 400 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి గంటకు 112 కిలోమీటర్లవేగంతో కిందకు దూసుకొస్తుంది. 2022 మార్చిలో 14 ఏళ్ల టైర్ శాంప్సన్ తన తోటి ఫుట్‌బాల్ టీమ్‌తో ఈ రైడ్ ఎక్కాడు. ఆరు అడుగుల ఎత్తు 173 కేజీల బరువున్న శాంప్సన్‌ను నిబంధనలకు విరుద్ధంగా రైడ్‌కు అనుమతించారు. వ్యక్తి 129 కేజీలకు మించి బరువుంటే ఈ రైడ్‌కు అనుమతించకూడదు. రెండుసార్లు పైకీ కిందకు సురక్షితంగా వెళ్లొచ్చిన శాంప్సన్ మూడోసారి పట్టుతప్పి 70 అడుగుల ఎత్తులో టవర్ నుంచి వేగంగా కిందకు పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ‘అధిక బరువు’, సేఫ్టీ సీట్ లాక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు శిక్షగా ఫన్‌టైమ్ హ్యాండిల్స్ సంస్థకు 310 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ మొత్తం నుంచి శాంప్సన్ తల్లిదండ్రులకు తలో 155 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా అందజేయాలని కోర్టు ఆదేశించింది. -
చాక్లెట్‌పై ఆ గుర్తులు లేవన్న వ్యక్తి.. పరిహారం చెల్లించిన కంపెనీ
ఏ వస్తువుకైనా దాని బ్రాండ్ గుర్తు చేసే కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులే లేకపోతే.. దానిని ఎవరు తయారు చేసారో చెప్పడం కష్టం. కాబట్టి ప్రతి కంపెనీ తమ వస్తువులకు తప్పకుండా కొన్ని గుర్తులను ముద్రిస్తుంది. ఇటీవల ఒక మార్స్ చాక్లెట్ బార్.. సాధారణ చాక్లెట్ మాదిరిగా కాకుండా, స్మూత్‌గా ఉన్నట్లు ఓ వ్యక్తి కనిపెట్టాడు.బకింగ్‌హామ్ షైర్లోని ఐల్స్బరీకి చెందిన 32 ఏళ్ల హ్యారీ సీగర్.. తన ఫేస్బుక్లో స్మూత్ చాక్లెట్ బార్ ఫోటో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో వైరల్ అయింది. అంతే కాకుండా దీనిని కంపెనీకి కూడా మెయిల్ ద్వారా పెంపించాడు. కంపెనీ దీనికి చింతిస్తూ.. క్షమాపణ చెప్పడమే కాకుండా అతనికి పరిహారంగా రూ. 215 చెల్లించింది.నిజానికి సీగర్ స్నేహితులతో కలిసి బర్మింగ్‌హామ్‌లోని ఒక క్లాసిక్ కార్ షోకు వెళుతుండగా.. ఆక్స్ఫర్డ్షైర్లోని సర్వీస్ స్టేషన్లో ఆగి చాక్లెట్ బార్‌ను కొనుగోలు చేశాడు. అయితే ఆ చాక్లెట్ మీద అలలు లాంటి గుర్తులు ఏమి లేకుండా మృదువుగా కనిపించింది. ఇది అతన్ని చాలా ఆకర్శించింది. దానినే సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతే కాకుండా కంపెనీకి మెయిల్ కూడా చేసాడు.కంపెనీ స్పందించి అతని పరిహారం అందించిన తరువాత, అతడు స్పందిస్తూ.. నేను పరిహారం కోసం కంపెనీకి మెయిల్ చేయలేదు. ఇలాంటి చాక్లెట్ ఎందుకు తయారు చేసారు? కారణం ఏమిటి అనే విషయాన్ని కనుక్కోవడానికి ఇలా చేసాను అని అన్నాడు. అయితే నాకు పరిహారం లభించింది. దీంతో నేను రెండు మార్స్ బార్లు కొనేయొచ్చు అని పేర్కొన్నాడు. -
ట్రాన్స్ విమెన్‌కి రికార్డు స్థాయిలో రూ. 6 లక్షల నష్టపరిహారం..!
ట్రాన్స్జెండర్లు హక్కులను గౌరవించమని, తాము మనుషులమే అని ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు, పోరాటాలు చేశారు. సుప్రీంకోర్టు సైతం వాళ్లకు కూడా కొన్ని హక్కులను ప్రసాదించింది. వారికి సమాజంలో సుమచిత స్థానం, గుర్తింపు ఇవ్వాలని స్పష్టం చేసింది కూడా. కానీ ఎక్కడో ఒక చోట వారిపై దాడులు, లింగ వివక్షత వంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. చెప్పాలంటే వారి విషయంలో సమాజం తీరు చాలావరకు మారాల్సి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితి వివిధ దేశాల్లో కూడా ఉండటం బాధకరం. కొన్ని దేశాలు వారిపట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తాయి. కనీసం వారి హక్కులకు కూడా ప్రాధాన్యత ఇవ్వదు. అలాంటి ఓ దేశం ఓ ట్రాన్స్ విమెన్ కేసుకి ప్రాధాన్యత ఇవ్వడమే సత్వరమే ఆమెకు న్యాయం జరిగేలా చేసింది. ఈ ఘటనను చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ సంఘటన ఏ దేశంలో చోటు చేసుకుందంటే..చైనాకు చెందిన ట్రాన్స్ విమెన్ మగవాడిగా జన్మించి.. స్త్రీగా మారింది. ఇలా ట్రాన్సవిమెన్గా మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు ఆమెను కిన్‌హువాంగ్‌డావో సిటీ ఫిఫ్త్ అనే మెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఏదో మానసిక సమస్య వల్ల ఇలా చేసిందంటూ ఇదివరకటి వ్యక్తిలీ మార్చేలా ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పారు. అక్కడ నుంచి ఆమెకు మొదలైన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ సిబ్బందితో సహా వైద్యులంతా తన ధోరణిని తప్పుపడుతూ బలవంతంగా మార్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఎవ్వరూ ఆమెను విభిన్న లింగానికి చెందినదిగా అంగీకరించపోగా, హేళనలు, చిత్కారాలతో ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశారు. ఆ నిమిత్తమైన సుమారు 97 రోజుల పాటు ఏడు సెషన్ల ఎలక్ట్రోషాక్ థెరపీ అందించారు. దీని కారణంగా మూర్చ(ఫిట్స్) వంటి సమస్యలు వచ్చాయి. ఆ ఆస్పత్రి బయట సమాజం అంగీకరించే విధంగా మార్చే ప్రయత్నంలో భాగంగా తనను శారీరకంగా మానసికంగా ఇబ్బందికి గురిచేసేలా వైద్యం చేశారు. దీని కారణంగా అనారోగ్యం పాలయ్యానంటూ కోర్టుని ఆశ్రయించింది. ట్రాన్స్ జెండర్లకి ప్రాధాన్యత ఇవ్వని చైనా దేశం ఆమె కేసుని టేకప్ చేయడమే కాకుండా సత్వరమే న్యాయం జరిగేలా చూసింది. చైనా మెంటల్ హెల్త్ చట్టాల ప్రకారం..వ్యక్తి ఇష్టానికి లోబడే చికిత్స చేయాలి. అలా కాకుండా వారి ఇష్టంతో సంబంధం లేకుండా ప్రమాదం కలిగించేలా చికిత్స చేస్తే దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది చైనా కోర్టు. ఈ మేరకు చాంగ్లీ కౌంటీ పీపుల్స్ కోర్ట్ స్వలింగ సంపర్కులు లేదా ట్రాన్స్ వ్యక్తులను "మార్చడానికి" హానికరమైన మందులు లేదా ఎలక్ట్రోషాక్ పద్ధతులను ఉపయోగించడం నేరం అని స్పష్టం చేసింది. ఆమెను అనారోగ్యం పాలు చేసినందుకు గానూ సదరు హాస్పిటల్ దాదాపు రూ. 6 లక్షలు పైనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా పేర్కొంది. (చదవండి: ఫ్యాషన్‌కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్ అదుర్స్..) -
దక్షిణ రింగు భూనిర్వాసితులకు అధిక పరిహారం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డులోని దక్షిణ భాగం పరిధిలో సేకరించే భూములకు పరిహారం భారీగా పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రింగురోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుండగా, దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. భూసేకరణ ప్రక్రియలో భాగంగా అవార్డులు పాస్ చేసి పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భాగంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రింగురోడ్డు అలైన్‌మెంటును ఖరారు చేసే కసరత్తు మొదలుపెట్టింది. ఆమేరకు భూసేకరణ జరగాల్సి ఉంది. పరిహారం మొత్తం పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా భూముల మార్కెట్ విలువను పెంచాలని నిర్ణయించింది. మార్కెట్ విలువ పెంచి పరిహారాన్ని భూసేకరణ, పునరావాస చట్టం–2013 ప్రకారం చెల్లించనుంది. మార్కెట్ విలువలు పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలంటూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. భూ యజమానులకు చట్టబద్ధంగా పరిహారం అందాలని, నష్టపోయామనే భావన వారిలో ఎక్కువగా కనిపించొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ప్రాజెక్టు నిర్వహణ విభాగం ఏర్పాటుభారీ రోడ్డు ప్రాజెక్టులు నిర్వహించే ఎన్హెచ్ఏఐలో మాదిరి దక్షిణ రింగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్తో రేడియల్ రోడ్ల ద్వారా అనుసంధానాన్ని ఈ విభాగం ఖరారు చేస్తుంది. ఇందులో పర్యావరణ విభాగానికి సంబంధించి జిల్లా అటవీ అధికారి, సాంకేతిక విభాగంలో ఒక చీఫ్ ఇంజనీర్, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పరిపాలన విభాగానికి సంబంధించి అకౌంటెంట్ ఉండనున్నారు. అటవీ, రోడ్లు, భవనాలు, ఆర్థిక శాఖల నుంచి ఈ అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేయనున్నారు. అలాగే, రీజినల్ రింగురోడ్డు పురోగతి పరిశీలనకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి దాసరి హరిచందనను నియమించారు. ఇక దక్షిణ రింగుకు సంబంధించి డీపీఆర్ తయారీ, టెండర్ల వ్యవహారం పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ సేవలు తీసుకోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఖరారుకు వీలుగా ఆర్ఎఫ్పీ బిడ్లు ఆహ్వానించాలంటూ రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీని ఆదేశించింది. -
పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ‘మూసీ నదీ గర్భం (రివర్ బెడ్)లో నిర్మాణం చేపట్టారంటూ మార్కింగ్ చేసిన ఇళ్లను పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా? నోటీ సులు జారీ సహా చట్టప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియను పాటిస్తున్నారా?’ అని రాష్ట్ర ప్రభుత్వా న్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ సమాధానమిచ్చారు. పరిహారంపై నిర్వాసితులతో మాట్లాడి, వారు సమ్మతించిన తర్వాతే ఇళ్ల కూల్చివేత చేపడుతున్నామని కోర్టుకు వివరించారు. ఏఏజీ చెప్పిన అంశాలను నమోదు చేసుకుంటున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు హైడ్రాను ఆదేశించింది.కేఏ పాల్ పిటిషన్ మేరకు..‘‘మూసీకి సంబంధించి సరైన సర్వే నిర్వహించి, ఆక్రమణలను గుర్తించే వరకు భవనాలను కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలని.. బాధితులకు నోటీసులు ఇచ్చి, ఇళ్లు ఖాళీ చేయడానికి లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి నెల రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుల ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.పారదర్శకంగా చర్యలు: ఏఏజీవిచారణ సందర్భంగా ఏఏజీ ఎక్కడ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయ వాదులు హాజరుకాకుంటే ఎలాగని, పిటిషనర్ల వాదనలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొంది. దీనితో ఏఏజీ విచారణకు హాజరై వాదనలు వినిపించారు. ‘‘చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. నోటీసు లిచ్చి సమయం ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు చేప డుతున్నాం. ప్రజలందరి విషయంలో ఒకేలా వ్యవ హరిస్తున్నాం. తారతమ్యాలు లేవు. పారదర్శకంగా, నిష్పక్ష పాతంగా చర్యలు చేపడుతున్నాం’’ అని వివరించారు. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఏర్పాటైందని.. రివర్ బెడ్లోని ఇళ్లకు మార్కింగ్ మాత్రమే చేసిందని, ఇంకా కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా జారీ చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏఏజీ వాదనలను రికార్డు చేశామని, ఈ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. బాధితుల్లో ఎక్కువ మంది పేదలే..: పాల్విచారణ సందర్భంగా పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ తానే వాదనలు వినిపించారు. ‘‘ఆక్రమణదారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిజిస్ట్రేషన్, విద్యుత్, నిర్మాణ, నల్లా అనుమతులు ఇచ్చిన అధికారులు అందరూ ఆనందంగానే ఉన్నారు. అనుమతులు ఉన్నాయి కదా అని కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి వారే రోడ్డున పడుతున్నారు. ‘హైడ్రా’ బాధితుల్లో ఎక్కువ మంది వారే. 462 నిర్మాణాలను, భవనాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారు. ఎన్ కన్వెన్షన్‌ను ఒక్కరోజులో కూల్చిన అధికారులు.. దాదాపు 250 మంది పెద్దలకు మాత్రం నోటీసులు జారీ చేసి వదిలేశారు. పేద, మధ్యతరగతికి సమయం ఇవ్వకుండా ప్రతాపం చూపిస్తున్నారు. కూల్చడానికి నేను వ్యతిరేకం కాదు.. కానీ, చట్టాన్ని పాటించాలి. న్యాయవాదులను పెట్టుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. లక్షల మంది హైడ్రా తమ ఇంటి మీదకు ఎప్పుడో వస్తుందో అని భయంతో బతుకుతున్నారు. అలాంటి వారి కోసమే పిల్ వేశాను. ఇళ్లు కూల్చే వారికి ముందే పరిహారం ఇవ్వాలి. నోటీసులిచ్చి ఖాళీ చేసే సమయం ఇవ్వాలి. తెలంగాణ మరో ఉత్తరప్రదేశ్‌లా మారకముందే చర్యలు తీసుకోవాలి. ఇళ్ల కూల్చివేతపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి’’ అని పాల్ వాదనలు వినిపించారు. -
ప్రతి అర్జీని పరిశీలించి నష్ట పరిహారం అందిస్తాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ నష్ట పరిహారం అందిస్తామని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా స్పష్టం చేశారు. సాక్షి పత్రిక మెయిన్ ఎడిషన్‌లో మంగళవారం ‘అర్జీలు బుట్టదాఖలు ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఇన్‌ఛార్జి కలెక్టర్ స్పందించారు. మంగళవారం నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు బుడమేరు వరద నష్టంలో భాగంగా గృహ, ఎంఎస్ఎంఈ, వాహనాలు తదితర విభాగాలకు సంబంధించి 1,44,672 మంది వరద ప్రభావిత బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.235.72 కోట్లను జమ చేశామని వివరించారు. 179 గ్రామ వార్డు సచివాలయాల్లో వరద గణన జాబితాల ప్రచురణతో పాటు అదనంగా వచ్చిన దరఖాస్తులను పిజిఆర్ఎస్ ఫ్లడ్ మాడ్యూల్లో నమోదు చేశారన్నారు. ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహారం జమ చేశారన్నారు. బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాని 476 ఖాతాలను అనుసంధానం చేసి చెల్లింపుల ప్రక్రియ జరిపేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 2,478 దరఖాస్తులను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 24వ తేదీలోగా అర్హులైన బాధితుల ఖాతాల్లో నష్ట పరిహారం జమ చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి బాధితునికి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కాగా.. సాయం కోసం కలెక్టరేట్‌కు ఎన్ని దరఖాస్తులొచ్చాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. -
కుటుంబానికి బీమా ధీమా..
షణ్ముఖ్, నిత్య దంపతులకు ఇద్దరు పిల్లలు. షణ్ముఖ్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నిత్య గృహిణి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేవు. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చిచ్చు పెట్టింది. షణ్ముఖ్ పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండున్నాయి. ఆ రెండింటి నుంచి వచ్చిన మొత్తం కేవలం రూ.15 లక్షలు. కుటుంబ జీవన అవసరాలకు ఈ మొత్తం చాలదని తెలియడంతో.. బాధను దిగమింగుకుని నిత్య ప్రైవేటు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. జీవిత బీమా రక్షణ లేని వారు కొందరు అయితే.. ఉన్నా తగినంత కవరేజీతో సరైన ప్లాన్ తీసుకోని వారే ఎక్కువ. ఇలాంటి వారికి షణ్ముఖ్ కేసు కనువిప్పు కలిగిస్తుంది. సరైన బీమా పథకాన్ని, తగినంత కవరేజీతో తీసుకున్నప్పుడే దాని లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. ఈ దిశగా అవగాహన కలి్పంచే కథనమే ఇది...తమపై ఎవరైనా ఆరి్థకంగా ఆధారపడి ఉంటే, అలాంటి ప్రతి ఒక్కరూ జీవిత బీమా రక్షణను (పాలసీ) తప్పకుండా తీసుకోవాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భాల్లో వారి కుటుంబం జీవన అవసరాల కోసం ఆరి్థకంగా ఇబ్బందులు పడకుండా జీవిత బీమా పరిహారం సాయంగా నిలుస్తుంది. కానీ, ఇదంతా సరైన, సరిపడా రక్షణ తీసుకున్నప్పుడే అని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. తమ విలువైన జీవితంపై చేస్తున్న అసలైన పెట్టుబడిగా అర్థం చేసుకోవాలి.కవరేజీ ఎంత?ఏజెంట్ లేదా బ్రోకర్ చెప్పిన మేరకు లేదా ప్రీమియం తమకు సౌకర్యంగా అనిపించిన మేరకు జీవిత బీమా కవరేజీని ఎక్కువ మంది తీసుకుంటుంటారు. కానీ, ఇది సరైన విధానం కాదు. ఎంత లేదన్నా వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం జీవిత బీమా రక్షణగా తీసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. అలాగే, వార్షిక ఆదాయానికి 25 రెట్ల వరకు కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. 20 రెట్లు మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ రుణాలు తీసుకుని ఉంటే ఆ మేరకు కవరేజీని అదనంగా ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.12 లక్షలు ఉంటే, కనీసం రూ.1.2 కోట్ల సమ్ అష్యూర్డ్‌తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే.. అప్పుడు రూ.1.2 కోట్లకు బదులు రూ.1.3 కోట్లను ఎంపిక చేసుకోవాలి. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ చెల్లించే పరిహారంతో అప్పులు తీర్చి, మిగిలిన మొత్తంతో కుటుంబం సాఫీగా జీవించడానికి అవకాశం ఉంటుంది.సరిపోతుందా..?ఇంతకు ముందు ఉదాహరణలో వార్షిక ఆదాయం రూ. 12 లక్షలకు పది రెట్లు అంటే రూ.1.2 కోట్లకు టర్మ్ లైఫ్ ప్లాన్ తీసుకున్న తర్వాత.. పాలసీదారు మరణించినట్టయితే వచ్చే పరిహారం కుటుంబానికి సరిపోతుందా..? ఇక్కడ రూ.1.2 కోట్ల డిపాజిట్‌పై 6 శాతం వార్షిక రేటు ఆధారంగా వచ్చే మొత్తం రూ.7.2 లక్షలు మించదు. అంటే అప్పటి వరకు వచ్చిన వార్షికాదాయం కంటే తక్కువ. తమకు ఏదైనా జరిగినా.. ఎప్పటి మాదిరే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇక్కడ రూ. 2.4 కోట్లకు బీమా రక్షణను (సమ్ అష్యూర్డ్) తీసుకోవాలి. ఉదాహరణకు షణ్ముఖ్ వయసు 30 ఏళ్లు. ప్రస్తుత వార్షికాదాయం రూ.12 లక్షలకు 20 రెట్ల చొప్పున రూ.2.4 కోట్లకు టర్మ్ లైఫ్ కవరేజీ తీసుకున్నాడని అనుకుందాం. 40 ఏళ్లకు వచ్చే సరికి షణ్ముఖ్ వార్షికాదాయం రూ.24 లక్షలకు పెరిగింది. ఈ ప్రకారం చూస్తే పదేళ్ల క్రితం తీసుకున్న టర్మ్ ప్లాన్‌లో రక్షణ వార్షిక ఆదాయానికి పది రెట్లకు తగ్గిపోయిందని తెలుస్తోంది. వయసు పెరిగే కొద్దీ జీవితంలో బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయని తెలిసిందే. కనుక పెరుగుతున్న ఆదాయానికి, జీవన వ్యయాలకు అనుగుణంగా బీమా కవరేజీ కూడా పెరిగేలా చూసుకోవాలి. సొంతిల్లు, పిల్లలకు మెరుగైన విద్య అన్నవి తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాలు. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించినప్పుడు వచ్చే పరిహారం కేవలం ఆ కుటుంబ జీవన అవసరాలే కాదు, ముఖ్యమైన జీవిత లక్ష్యాల సాకారానికీ తోడ్పాటునివ్వాలి. అందుకుని వాటికయ్యే వ్యయాలను కూడా కవరేజీని నిర్ణయించుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి..? ‘‘వివాహం అయిన తర్వాత లేదా పిల్లలు కలిగిన తర్వాత టర్మ్ ప్లాన్ తీసుకోవాలనే ధోరణి సరికాదు. ఎంత వీలైతే అంత ముందుగా టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాదు పాలసీ పూర్తి కాలానికి అదే కొనసాగుతుంది’’ అని ఆనంద్‌రాఠి ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌కు చెందిన దినేష్ దిలీప్ భోయ్ సూచించారు. వీలైనంత ముందుగా అంటే.. సంపాదన మొదలు పెట్టిన వెంటనే అని అర్థం చేసుకోవచ్చు. జీవితంలో స్థిరపడడంలో ఆలస్యమైన వారు.. కనీసం తమ సంపాదన మొదలైన మొదటి 30 రోజుల్లో అయినా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మరిచిపోవద్దు. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వయసు వారు టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఆలస్యం చేసిన కొద్దీ వయసుతోపాటు ప్రీమియం పెరుగుతుంది. పైగా నేటి రోజుల్లో చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు జీవిత బీమా తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసి, అనారోగ్య సమస్యలు పలకరించిన తర్వాత తీసుకోవాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్య వంతులతో పోలి్చతే ప్రీమియం 20–50 శాతం అధికంగా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రిస్క్ మరీ ఎక్కువ ఉంటుందని బీమా సంస్థలు భావిస్తే బీమా కవరేజీని తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదు.ఎంత కాలానికి? జీవిత బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత వయసు వచ్చే వరకు ఈ రక్షణ ఉండాలన్నది కూడా ముఖ్యమైన అంశమే అవుతుంది. మనలో చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఎక్కువ మంది 20–25 ఏళ్ల కాలానికే రక్షణను ఎంపిక చేసుకుంటుంటారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి జీవిత బీమా కవరేజీ తీసుకున్నారని అనుకుంటే.. అతడికి/ఆమెకు 50 ఏళ్లు వచ్చే సరికి ఆ రక్షణ ముగిసిపోతుంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ కొంత కాలానికి మరో పాలసీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రీమియం భారంగా మారుతుంది. ప్లాన్ తీసుకునే నాటికి తమ వయసు ఎంతన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతలేదన్నా రిటైర్మెంట్ వరకు (60 ఏళ్లు) జీవిత బీమా కవరేజీ ఉండాలి. కొందరికి ఆలస్యంగా వివాహం కావచ్చు. అంటే 30–45 ఏళ్ల మధ్యలో వివాహం చేసుంటే.. 60 ఏళ్లు వచ్చినా పిల్లలకు సంబంధించి, కుటుంబ బాధ్యతలు ఇంకా మిగిలి ఉంటాయి. పిల్లలకు కనీసం 23–25 ఏళ్ల వయసు వచ్చే వరకు అయినా తమకు టర్మ్ కవరేజీ ఉండేలా చూసుకోవడం సరైనది. రిటైర్మెంట్ నాటికి లేదా జీవితంలో అన్ని ముఖ్యమైన బాధ్యతలు తీరే నాటికి బీమా కవరేజీ ఉంటే సరిపోతుంది.ఎలాంటి టర్మ్ ప్లాన్? టర్మ్ ప్లాన్ అంటే అచ్చమైన బీమా రక్షణతో కూడిన పాలసీ కదా? అన్న సందేహం రావచ్చు. అవును టర్మ్ ప్లాన్ ఉద్దేశంఅదే. కానీ, వినియోగదారుల ధోరణి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా ఇందులోనూ పలు రకాలు వచ్చాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో బీమా రక్షణతోపాటు, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా కానీ రాబడి ప్రయోజనం లభిస్తుంది. అంటే అది బీమా, పెట్టుబడి కలిసిన సాధనం. టర్మ్ ప్లాన్ ఎలాంటి రాబడి ఇవ్వని.. కేవలం మరణించిన సందర్భాల్లోనే (పాలసీ కాల వ్యవధిలో) పరిహారం చెల్లించేది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి జీఎస్టీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం (టీఆర్‌వోపీ)గా దీన్ని పిలుస్తారు. లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇది అందరికీ తెలిసిన ప్లాన్. కాల వ్యవధి పూర్తయ్యే వరకు కవరేజీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకుంటే, కాల వ్యవధి ముగిసే వరకు రూ.50 లక్షల కవరేజీయే కొనసాగుతుంది. ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో సమ్ అష్యూర్డ్ స్థిరంగా ఉండదు. నిరీ్ణత కాలానికోసారి పెరుగుతూ పోతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి పరిహారానికి హెడ్జింగ్ లభిస్తుంది. అంతేకాదు పెరిగే వయసుకు తగ్గట్టు బాధ్యతలు కూడా అధికమవుతుంటాయి. ఈ విధంగానూ అదనపు రక్షణ అక్కరకు వస్తుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇంక్రీజింగ్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. నిరీ్ణత కాలానికోసారి కవరేజీ తగ్గుతూ వెళుతుంది. ఉదాహరణకు ఏదైనా లోన్ తీసుకుని, దానికి రక్షణ కోసం టర్మ్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. కొంత కాలానికి రుణ భారం తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా బీమా రక్షణ తగ్గేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో టర్మ్ ప్లాన్‌ను ఎండోమెంట్ లేదా హోల్‌లైఫ్ పాలసీగా మార్చుకోవచ్చు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్: నూరేళ్ల కాలానికి ఈ ప్లాన్‌లో రక్షణ లభిస్తుంది. నోట్: టర్మ్ ప్లాన్‌లో ఎన్ని రకాలున్నా.. అచ్చమైన టర్మ్ ప్లాన్ (లెవల్ టర్మ్ఇన్సూరెన్స్) సులభమైనది. మిగిలిన వాటిల్లో తమకు ఏదైనా మరింత ప్రయోజనం అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లెవల్ టర్మ్ ప్లాన్‌లో కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియం మారదు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్‌లో, కన్వర్టబుల్, హోల్‌లైఫ్ ప్లాన్లలో ప్రీమియం అధికంగా ఉంటుంది. సాధారణ లెవల్ టర్మ్ ప్లాన్‌తో పోల్చితే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌లోనూ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. రైడర్లు..టర్మ్ ప్లాన్‌కు అనుబంధంగా పలు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్: కేన్సర్, కాలేయ వైఫల్యం తదితర 20 నుంచి 64 వరకు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఈ రైడర్ నుంచి ఏక మొత్తంలో పరిహారం లభిస్తుంది. ఈ రైడర్లో ఎన్నింటికి కవరేజీ అన్నది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. వేవర్ ఆఫ్ ప్రీమియం: ప్రమాదంలో అంగవైకల్యం పాలైనా లేక తీవ్ర వ్యాధుల బారిన పడినా ఇక అక్కడి నుంచి పాలసీదారు ప్రీమియం చెల్లించే అవసరాన్ని ఇది తప్పిస్తుంది. బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియం చెల్లిస్తుంది. యాక్సిడెంటల్ డెత్, టోటల్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్: ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం పాలైనా ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర పరిహారం పొందొచ్చు. పరిహారం చెల్లింపు ఎలా..? పాలసీదారు మరణించినప్పుడు పరిహారం చెల్లింపులో పలు ఆప్షన్లను టర్మ్ ప్లాన్లు ఆఫర్ చేస్తుంటాయి. → ఎంపిక చేసుకున్న సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని ఒకే విడత చెల్లించడం ఇందులో ఒకటి. → సమ్ అష్యూర్డ్‌లో 50 శాతాన్ని ఏకమొత్తంగా చెల్లించి, మిగిలిన 50 శాతాన్ని సమాన వాయిదాల్లో కొన్ని సంవత్సరాల పాటు చెల్లించడం మరో ఆప్షన్. → సమ్ అష్యూర్డ్‌లో కొంత మొత్తాన్ని ఒకే విడత చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీగా పెంచుతూ చెల్లించడం మూడో ఆప్షన్.చిట్కాలు→ తగినంత కవరేజీ ఎంపిక చేసుకున్న తర్వాత.. అందుకు ఏటా చెల్లించే ప్రీమియం తమ సామర్థ్యం మేరకే ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం చెల్లించలేనంత భారంగా మారకూడదు. ప్రీమియం చెల్లించలేక పాలసీ మధ్య లో లాప్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకని తగినంత బీమా రక్షణ ఒక్కటే కాదు, తమ చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. → ఏదో ఒక కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం కాకుండా, వివిధ కంపెనీల మధ్య ఫీచర్లు, ప్రీమియం రేట్లను పరిశీలించి చూసుకోవాలి. → టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు అనుబంధంగా వచ్చే రైడర్లు, యాడాన్‌లను తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్‌ను తీసుకోవడం ఎంతో అవసరం. → ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంలో కొంత తగ్గింపు లభిస్తుంది. → పెరుగుతున్న జీవన అవసరాలకు అనుగుణంగా, అదనపు రుణం తీసుకున్న ప్రతి సందర్భంలో ఆ మేరకు బీమా కవరేజీని పెంచుకోవాలి. → ఎంపిక చేసుకునే బీమా సంస్థ, క్లెయిమ్‌లను ఏ మేరకు ఆమోదిస్తుందో తప్పకుండా పరిశీలించాలి. దీర్ఘకాలంలో మెరుగైన చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంపిక చేసుకోవాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
Group of ministers: జీఎస్టీ రేట్లలో సెస్సు విలీనం!
న్యూఢిల్లీ: జీఎస్టీ కాంపెన్సేషన్ (పరిహారం) సెస్సును జీఎస్టీ రేట్లలో విలీనం చేసే ప్రతిపాదనపై మంత్రుల బృందం (జీవోఎం) చర్చించింది. జీఎస్టీ ఆరంభంలో రాష్ట్రాలు కోల్పోయే పన్నును భర్తీ చేసేందుకు వీలుగా సెస్సును ప్రవేశపెట్టడం తెలిసిందే. ఒక్కసారి విలీనంపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ సెస్సు నుంచి మళ్లే క్రమంలో మరే వస్తువును లగ్జరీ లేదా సిన్ విభాగం కిందకు చేర్చకూడదని రాష్ట్రాలు సూచించాయి. 2026 మార్చిలో కాంపెన్సేషన్ సెస్సు ముగిసిన అనంతరం దాన్ని జీఎస్టీ రేట్లలో కలిపేయాలని.. అప్పటి వరకు ఏ వస్తువులకు సెస్సు అమలు చేశారో వాటికి సంబంధించి ప్రత్యేక రేటును జీఎస్టీలో ప్రవేశపెట్టాలన్నది రాష్ట్రాల అభిప్రాయంగా ఉంది. ‘‘జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సు ముగింపునకు వస్తోంది. దీని భవిష్యత్ ఏంటన్న దానిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం తమ అభిప్రాయాలను తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఇది తొలి సమావేశం’’అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. మంత్రుల బృందానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. సెస్సును కొనసాగించాలా లేదంటే దాన్ని పన్ను కిందకు మార్చాలా? లగ్జరీ విభాగంలో మార్పులు చేయాలా? అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సుపై నవంబర్ రెండో వారంలో జీవోఎం మరోసారి సమావేశమై చర్చించనుంది. అసోం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల మంత్రులు జీవోఎంలో సభ్యులుగా ఉన్నారు. -
వరద బాధితులందరికీ పరిహారం అందించాలి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ గురువారం విజయవాడలోని ధర్నాచౌక్‌లో నిరాహార దీక్ష చేపట్టింది. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇవ్వకపోవటంవల్లే బుడమేరు వరదలో ప్రజలు నిండా మునిగారని, పెద్ద ఎత్తున నష్టపోయారని దీక్షలో పాల్గొన్న నేతలు తెలిపారు. బాధితుల్లో ఒక్కరికీ పూర్తి నష్ట పరిహారం అందలేదని, ఆదుకోవాలంటూ సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరిగినా కనీసం పట్టించుకోవటంలేదని ధ్వజమెత్తారు. బుడమేరు గేట్లు ఎత్తిన ప్రభుత్వం, నష్టపరిహారం కోసం అర్జీలు తీసుకోకుండా కలెక్టరేట్ గేట్లు మూసేసిందని మండిపడ్డారు. వరద సహాయక చర్యల పేరుతో అవినీతి బురద పారిందని దుయ్యబట్టారు. సాయం చేయాల్సింది పోయి, బాధితులపై లాఠిఛార్జి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బాధితుల్లో చివరి వ్యక్తికి కూడా పరిహారం అందేవరకు పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు భరోసా ఇచ్చారు. బాబు వల్లే బుడమేరుకు వరద సీఎం చంద్రబాబు వల్లే బుడమేరు వరద విజయవాడను ముంచేసిందని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చెప్పారు. వరదతో నగరంలో 32 డివిజన్లలో 2.69 లక్షల కుటుంబాలు నీట మునిగాయన్నారు. సర్వస్వం కోల్పోయిన వరద బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని అడుగుతుంటే అధికార పార్టీ నేతలు వైఎస్సార్సీపీ మీద పడి ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.534 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని నిలదీశారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటం ప్రారంభించామని, ఈ ప్రభుత్వం పడిపోవడానికి ఇదే నాంది అని చెప్పారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ రూ.1.50 కోట్లు ఖర్చుపెట్టి 50 వేల కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసిందని చెప్పారు. వరద బాధితుల కోసం చేసిన ఖర్చుపై తమ లెక్కలు ఇస్తామని, ప్రభుత్వం లెక్కలు ఇవ్వాలని, వాటిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. సీఎం చంద్రబాబు ఇల్లు, అమరావతి మునిగిపోకుండా బుడమేరు గేట్లు ఎత్తేసి విజయవాడను ముంచేశారని ఎమ్మెల్సీ రుహూల్లా చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రతి దేవస్థానం నుంచి ఆహారాన్ని తీసుకొచ్చారని, దానిని బాధితులకు అందించకుండా బయట పడేసి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. నష్ట పరిహారం కోసం బాధితులు రోడ్ల మీద ఆందోళన చేసే దుస్థితి నెలకొందన్నారు. కంచికచర్లలో ముంపునకు గురైన ప్రాంతాల వారికి ప్రభుత్వం నష్ట పరిహారం అందించలేదని నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగలక్షి్మ, వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేష్, విజయవాడ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, పార్టీ నేత గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆటో’ బతుకులు అస్తవ్యస్థం
సాక్షి, అమరావతి: ‘అటో డ్రైవర్ కె.శివారెడ్డి ఊర్మిళనగర్ రెండో లైనులో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలకు ఆ ఇల్లు మునిగిపోయింది. జీవనాధారమైన ఆటోతో పాటు ద్విచక్రవాహనం పూర్తిగా పాడైపోయాయి. సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. అప్పు చేసి ఆటోకు మరమ్మతులు చేయించుకుంటే రూ.45 వేలు ఖర్చయింది. ఇంటికిగానీ, వాహనాలకు గానీ పరిహారం ఇప్పించాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.పదహారేళ్లుగా ఇదే ప్రాంతంలో ఆటో నడుపుతున్న నా పేరు ఎందుకు జాబితాలో లేదని ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని వాపోతున్నాడు.’’...ఇది బుడమేరు వరదల్లో ఆటోలను కోల్పోయిన వేలాది మంది డ్రైవర్ల ఆవేదన. నగరంలో తిరిగే ఆటోలలో అతకధికం సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, కండ్రిగ, వాంబేకాలనీ, మిల్క్ ప్రాజెక్ట్, డాబా కోట్లు సెంటర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, భరతమాత కాలనీ, ఊరి్మళనగర్ల నుంచే వస్తున్నాయి. అక్కడి నిరుద్యోగులు డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరి జీవితాలు అస్తవ్యస్ధంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల బతుకు చిత్రంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది.మరమ్మతులకు కొత్త అప్పులురోజుల తరబడి ముంపులోనే ఉండటంతో ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయట మెకానిక్ దగ్గర నుంచి కంపెనీ షోరూమ్ వరకూ ఒక్కో దాని మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం అవుతోంది. రేడియేటర్, ఇంజిన్, బ్యాటరీతో పాటు బీఎస్ 6 వాహనాల్లో సెన్సార్లు పాడవ్వడంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్‌ల కొరత ఉండటంతో రోజుల తరబడి మోటార్ షెడ్ల వద్దే ఆటోలు పడి ఉంటున్నాయి. ఒకసారి మరమ్మతు చేసినా మళ్లీ మళ్లీ కొత్త లోపాలు బయటపడుతున్నాయి. దీంతో కొత్త అప్పులు చేసి మరమ్మతులకు వెచి్చస్తున్నారు. ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగానీ తమను అసలు పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.బీమా సంస్థల కొర్రీలువరద నీటిలో మునిగిన ఆటోలకు క్లెయిమ్‌లు ఎగవేసేందుకు బీమా సంస్థలు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నాయి. బీమా చేసే సమయంలో డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియని షరతులను పొందుపరిచి వాటిని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నాయి. ఒక ఆటోకి బీమా రావాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని తప్పించుకుంటున్నాయి. అదికూడా వరద వచి్చనప్పటి నుంచి ప్రతి దశలోనూ తీసిన ఫొటోలు, వీడియోలు ఉంటేనే బీమా వర్తిస్తుందని మెలికపెడుతున్నాయి.ప్రాణాలే కాపాడుకుంటామా, ఫొటోలు తీస్తామా అంటూ బాధితులు అడుగుతుంటే బీమా సంస్థలు సమాధానం చెప్పడం లేదు. రెండు వారాల్లోనే క్లెయిమ్‌లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో మాత్రం అది శూన్యం. బీమా సంస్థలు కనీసం 45 రోజుల పాటు ఆటోను ఉన్న చోటు నుంచి కదపకుండా ఉంచాలని చెప్పాయి. అప్పటి వరకూ మరమ్మతు చేయకపోతే మొత్తానికే పనికిరాదని, ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.పరిహారం లేదురాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 1న విజయవాడలో వదర విలయం సృష్టించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి జీవనాధారాలైన ఆటోలు, మోటార్ సైకిళ్లు వరద నీటిలో పూర్తిగా మునిపోయాయి. రోజుల తరబడి బురద నీటిలోనే నానిపోవడంతో ఇంజిన్, సెన్సార్లు,కార్బొరేటర్ వంటి ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోకి రూ.10 వేలు, ద్విచక్ర వాహనానికి రూ.3 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం రకరకాల కొర్రీలతో మూడొంతుల మందిని మోసం చేసింది. ఆటో నడిపితేగానీ పూటగడవని నిరుపేదలు వాటిని బాగు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బుడమేరు వరదల వల్ల దాదాపు 15 వేలకుపైగా అటోలు నీట మునిగితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 6,515 మాత్రమే ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 4,348 ఆటోలకు పరిహారం అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వాస్తవానికి మొత్తం బాధితుల్లో దాదాపు 80 శాతం మంది ఆటోవాలాలకు నష్టం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు..కొందరి పేర్లు ఉన్నా వారికి డబ్బులు పడలేదు.ఎవరూ పట్టించుకోవట్లేదు‘‘వరదల్లో ఇల్లు మునిగిపోయింది. ఆటో బాగా బెబ్బతింది. ప్రస్తుతానికి నడిచేలా చేయడానికి రూ.8 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.10 వేల ఇస్తామని చెప్పింది. కానీ మా వివరాలను నమోదు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. సచివాలయంలో అడిగితే కలెక్టరేట్‌కు వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ –లింగయ్య, ఆటో డ్రైవర్, రాజీవ్‌నగర్ కాలనీజీవనాధారం పోతే పరిహారం రాదా?‘‘ఆటో నడిపితేగానీ మా కుటుంబం నడవదు. వరదల వల్ల ఆటో మునిగిపోయి జీవనాధారాన్ని కోల్పోయాం. బీమా రావాలంటే 45 రోజులు ఆటోను వాడకూడదంటున్నారు. బాగు చేయించుకునే స్తోమత కూడా లేదు. అయినా జాబితాలో మా పేరు లేదంటున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు. మా గోడును ఎవరికి చెప్పుకోవాలి. మమ్మల్ని ఆదుకునేవారెవరు.’’ –బాబ్జి, ఆటో డ్రైవర్, రాజరాజేశ్వరిపేటఅద్దె ఆటోనే ఆధారం‘‘నేను ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. వరదకు ఆటో మునిగిపోయింది. ఎలాంటి పరిహారం రాలేదు. ఎవరిని అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు.ఏం చేయాలో తెలియడం లేదు.’’ –దుర్గారావు, ఆటో డ్రైవర్, వాంబేకాలనీ.చాలా ఖర్చవుతోంది‘ఇంటర్ చదివి ఆటో నడుపుతున్నాను. మా నాన్న కూడా ఆటో డ్రైవరే. రెండు ఆటోలూ వరదలో మునిగిపోయాయి.ఒక సారి రిపేరుకి రూ.12 వేలు ఖర్చయ్యింది. కానీ మళ్లీ రేడియేటర్ పాడయ్యింది. నాలుగు రోజులుగా మెకానిక్ దగ్గరే పెట్టి బాగుచేయిస్తున్నాం.’’ –వై.సాయి, ఆటో డ్రైవర్, పాయకాపురం. -
అందని పరిహారం.. ఆగని దరఖాస్తులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): బుడమేరు వరద బాధితులు నెల రోజులుగా పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. వరదకు సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమకు ప్రభుత్వం సహాయం చేస్తుందేమోనన్న ఆశతో వేలాది బాధితులు నిత్యం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. కార్యాలయం గేట్లు మూసేసి పోలీసులు దూరంగా తోసేస్తున్నా, అధికారులు ఛీత్కరించుకుంటున్నా ‘వరదకు బలైపోయాం.. సాయం చేయండయ్యా’ అని వేడుకొంటున్న తీరు అందరినీ కదిలిస్తోంది తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం చలనం రావడంలేదు. బాధితులకు ఏదో చేసేశామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలే తప్ప.. వాస్తవంగా ఒరిగిందేమీ లేదు. ఈ విషయాన్ని కలెక్టరేట్ వద్దకు వస్తున్న బాధితుల సంఖ్యే చెబుతోంది. నిత్యం వందలాది బాధితులు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌కు క్యూ కడుతూనే ఉన్నారు. బాధితుల నుంచి గుట్టలుగుట్టలుగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. శనివారం నాడు కూడా కండ్రిక, వైఎస్సార్ కాలనీ, ఉడా కాలనీ, భవానీపురం ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారిని కలెక్టర్ కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో బందరు రోడ్డుపై ఎండలోనే చంటి పిల్లలతో సహా పడిగాపులుకాశారు. చాలా సేపటి తర్వాత అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరించారు. అయితే, దరఖాస్తులో సచివాలయ నంబర్ తప్పనిసరిగా రాయాల్సి రావడంతో బాధితులు ఇబ్బందులు పడ్డారు. తమ ప్రాంత సచివాలయ కోడ్ తెలియక ఒకటికి రెండు సార్లు ఇంటికి, కలెక్టరేట్‌కు తిరిగారు. నెల రోజులుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పటికీ రూపాయి సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు. పరిహారం ఎందుకు జమ కాలేదో ఏ ఒక్కరూ చెప్పడంలేదని మండిపడుతున్నారు. వరదల్లో అన్నీ కోల్పోయిన తమకు పరిహారం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది, స్థానిక వీఆర్వోలు కలెక్టరేట్‌కు వెళ్లమని చెబుతున్నారే తప్ప సరైన కారణాలు చెప్పడం లేదని మండిపడుతున్నారు. రీ సర్వే చేయాలి ఎఫ్‌సీఐలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యాను. హెచ్ఐజీ–2లో 235 ఫ్లాట్‌లో ఉంటున్నా. వరదలకు ఇల్లు మునిగిపోయింది. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మోటార్, కారు, స్కూటర్ మొత్తం దెబ్బతిన్నాయి. రూ. 2 లక్షలకు పైగా నష్టం వచి్చంది. సర్వే టీం రెండు మూడు సార్లు వచ్చి రాసుకున్నారు. వాళ్లేమి రాశారో తెలీదు. ఈ రోజుకు కూడా నాకు పరిహారం అందలేదు. స్థానిక ఎమ్మెల్యేను కలిసి విన్నవించాను. కలెక్టర్‌ను కలిసేందుకు వస్తే అందుబాటులో లేరు. మా ప్రాంతంలో రీ సర్వే చేసి నష్టం వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. – వీవీ సూర్యనారాయణ రావు, హౌసింగ్ బోర్డు కాలనీ, భవానీపురం -
నాడు ఇంటింటికీ వలంటీర్లు.. నేడు పేదల బతుకులు నడిరోడ్డు పాలు
గత ఐదేళ్లు ఏ విపత్తు వచ్చినా... బాధితులు కాలు బయట పెట్టకుండానే ప్రభుత్వ సాయం అందింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ... వలంటీర్లు వెంటనే వచ్చి భరోసా కల్పించేవారు. కానీ... నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘రెడ్‌బుక్’ పాలనలో కనీసం బాధితుల నుంచి అర్జీలు కూడా స్వీకరించే నాథుడే కరువయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుడమేరు వరద బాధితులు పరిహారం కోసం వార్డు సచివాలయం... తహసీల్దార్ కార్యాలయం... కలెక్టరేట్ చుట్టూ మండుటెండలో కాళ్లరిగేలా తిరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. చివరికి గురువారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు ఇచ్చేందుకు కూడా అనుమతించలేదు. ఏకంగా కలెక్టరేట్ గేట్లు మూసేశారు. గేటు బయటే బాధితుల నుంచి సిబ్బంది, పోలీసులు అర్జీలు స్వీకరించారు. వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లలతో వచి్చన బాధితులు విధిలేక మురుగు కాలువల పక్కన, ఫుట్‌పాత్‌లపైన కూర్చుని నరకయాతన అనుభవించారు. పనులు మానుకుని పరిహారం కోసం తిరుగుతున్నాం.. దయచేసి మా గోడు వినండి.. అంటూ బాధితులు వాపోతున్నారు. గత ఐదేళ్లు కాలు కదపకుండానే వలంటీర్లు తమ ఇంటికి వచ్చి ప్రభుత్వ సేవలు అందించారని గుర్తు చేసుకుంటూ... కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కొరివిలా మారి అల్లాడిస్తోందని విచారం వ్యక్తంచేస్తున్నారు. – గాందీనగర్ (విజయవాడ సెంట్రల్) -
సాయం అందక.. నిస్సహాయంగా
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) / విజయవాడ స్పోర్ట్స్: ‘‘ఇప్పటికి ఎనిమిది సార్లు అర్జీలు ఇచ్చా.. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. ఇంకెక్కడికని తిరగాలి..? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నీళ్ల నుంచి బయటపడ్డాం. సర్వం కోల్పోయాం. మాకు నష్ట పరిహారం రాలేదు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వక పోవడం ఏమిటి..? ఈ వయసులో పడుతూలేస్తూ కలెక్టరేట్‌కు వచ్చాం. ఇదేం ఖర్మ..? రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నాం. ఆయన (సీఎం చంద్రబాబు) వచ్చి న్యాయం చేయాలి కదా..?’’ విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన వరద బాధితురాలు నక్కా రమాదేవి కన్నీటి వేదన ఇదీ! సరిగ్గా నెల క్రితం బుడమేరు వరద నగరంపై విరుచుకుపడింది. జీవిత కాలం కష్టార్జితం అంతా నీటి పాలైంది. పది రోజులకుపైగా వరద, బురదలోనే బాధితులు మగ్గారు. కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నివ్వెరపోతున్నారు. పొంతన లేని విధంగా సర్వే వివరాలున్నాయి. కొందరి పేర్లు జాబితాలో ఉన్నా పరిహారం అందలేదు. సచివాలయాలకు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయమంటున్నారని, ఎమ్మెల్యే కార్యాలయంలోనూ అర్జీలు అందచేసినా కనీస స్పందన లేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడ్డ బాధితులు సోమవారం విజయవాడ కలెక్టరేట్‌కు పోటెత్తారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, ఒంటరి మహిళలు, బాలింతలు చంటి బిడ్డలను చంకనేసుకుని వేల సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వరద నీటిలో చంటి బిడ్డలను పెట్టుకుని పది రోజులు గడిపామని.. కనీసం పిల్లల ముఖాలు చూసైనా పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.చివరి రోజు కావడంతో..బాధితుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని సెప్టెంబర్ 25న ప్రభుత్వం ప్రకటించింది. 30వతేదీ లోగా బాధితులందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని పేర్కొంది. అయితే గడువు ముగుస్తున్నా తమ ఖాతాల్లో డబ్బులు పడకపోవడం.. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్నారని ప్రచారం జరగడంతో బాధితులంతా కలెక్టరేట్‌కు పోటెత్తారు. ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున చేరుకుని పడిగాపులు కాసినా సీఎం చంద్రబాబు రాలేదు. చివరి రోజు కావడంతో దరఖాస్తుల కోసం బాధితులు పరుగులు తీశారు. ఓవైపు మండే ఎండ.. మరోవైపు కనీస సౌకర్యాల లేక వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులు, గర్భిణులు నానా ఆగచాట్లు పడ్డారు.జాబితాలో చిత్ర విచిత్రాలు..‘‘ప్రియమైన పైడి సాయిదీపక్...! మీ బ్యాంకు ఖాతా ఆధార్ నంబరుతో లింక్ కాకపోవడం వల్ల వరద నష్ట పరిహారం ఖాతాలో జమ కాలేదు. వెంటనే మీ బ్యాంకు అధికారులను సంప్రదించి ఖాతాను ఆధార్‌తో లింకు చేసుకోవాలి..!’’ ఓ బాధితుడి మొబైల్‌కు ప్రభుత్వం పంపిన సందేశం ఇదీ! చిత్రమేమిటంటే సాయిదీపక్ వయసు 8 ఏళ్లు. ఆ చిన్నారికి బ్యాంకులో ఖాతా లేదు. ఇక ఆధార్ లింక్ అయ్యే అవకాశమే లేదు. నష్ట పరిహారం జాబితాలో తప్పులు దొర్లాయనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని దీపక్ తండ్రి వాపోయాడు. ఇలాంటి సందేశమే ఐదేళ్ల మరో బాలికకు కూడా వచ్చింది.పొంతన లేని లెక్కలు..ప్రభుత్వం 90 శాతం మందికి నష్ట పరిహారం అందజేసినట్లు ప్రకటించింది. మిగిలిన 10 శాతం మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలున్నట్లు తేల్చింది. అయితే ప్రభుత్వం చెబుతున్న వివరాలు కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. కలెక్టరేట్‌కు వచ్చిన బాధితుల్లో ఏ ఒక్కరినీ కదిలించినా తమకు పరిహారం అందలేదని.. ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో పేర్లు ఉన్నా.. బ్యాంకు ఖాతా వివరాలు సరిగానే ఉన్నా.. పరిహారం అందలేదని చెబుతున్నారు.జగన్ ప్రభుత్వమే ఉంటే..కలెక్టరేట్‌కు వచ్చిన పలువురు బాధితులు గత ప్రభుత్వ పాలన, వలంటీర్ల సేవలను గుర్తు చేసుకుని చర్చించుకోవడం కనిపించింది. ‘‘కరోనా లాంటి విపత్తులోనూ ఇంటింటికీ తిరిగి సేవలందించారు. ఏరోజూ మాకు ప్రభుత్వ సాయం అందలేదని రోడ్డెక్కలేదు. ఇప్పుడు వరదల్లో సర్వం కోల్పోయి పరిహారం కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. అదే వైఎస్ జగన్ ప్రభుత్వమే ఉండి ఉంటే మాకీ దుస్థితి వచ్చేది కాదు. పారదర్శకంగా అందరికీ సాయం అందేది..’’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున చర్చించుకోవడం గమనార్హం.అమ్మకు రిక్త హస్తం..వాంబే కాలనీ హెచ్ బ్లాక్‌లో ఉంటున్నాం. నా భర్త కూలీ. వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన అధికారులకు అన్ని వివరాలు ఇచ్చాం. జాబితాలో నా పేరుకు బదులు మా ఐదేళ్ల పాప ఉషశ్రీ పేరు వచ్చింది. పాప పేరుతో బ్యాంకు ఖాతా లేనందున డబ్బులు రాలేదు. కలెక్టరేట్లో అడుగుతుంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. – కురిటి సుజాత, వాంబే కాలనీగతంలో ప్రతిదీ ఇంటి వద్దే..జగన్ ప్రభుత్వమే ఉంటే కష్ట కాలంలో మాకు అండగా నిలిచేది. ఆఫీసుల చుట్టూ తిరగకుండా గతంలో ప్రతిదీ ఇంటి వద్దే అందజేశారు. కరోనా లాంటి కష్టంలోనూ ఇబ్బందులు పడనివ్వలేదు. వలంటీర్ల ద్వారా అన్నీ అందించారు. ఇవాళ ఈ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. కాళ్లు అరిగేలా సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం పెడుతున్న కష్టాలు చూస్తుంటే.. జగనన్న ప్రభుత్వం ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. – పాముల పద్మ, వాంబే కాలనీఇదిగో.. అదిగో అంటున్నారుప్రకాష్ నగర్లో అద్దెకు ఉంటున్నా. వరదతో ఇంట్లో సామాన్లు మొత్తం పోయాయి. అధికారులు ఇంటికి వచ్చి రాసుకుని ఫోటోలు తీసుకున్నా డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ ఇప్పటికి పది సార్లు తిరిగాను. ఇదిగో పడతాయి.. అదిగో పడతాయని ఆశ పెట్టి రోజూ తిప్పుకుంటున్నారు. కలెక్టరేట్లో అర్జీ ఇద్దామని వచ్చా. – షేక్ ఫాతిమా, ప్రకాష్నగర్ఏ ఒక్కరూ పట్టించుకోలేదు..కూలీ పనులు చేసుకుని బతికే వాళ్లం. కనీసం సొంత ఇల్లు లేదు. వాంబే కాలనీలో అద్దెకు ఉంటున్నాం. వరద వల్ల చాలా నష్టపోయాం. అపరిశుభ్రతతో పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. పూట గడవని పరిస్థితిలో ఉన్నాం. ఆదుకోవాలని నాయకుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మాలాంటి వాళ్లకు సాయం అందకుండా చేశారు. కాస్తయినా కనికరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – ఏల్చూరు సతీష్, మల్లీశ్వరి దంపతులుకాళ్లు అరిగేలా తిరిగా..పరిహారం కోసం సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగా. ఇదిగో అదిగో అంటూ రోజుకు నాలుగైదు సార్లు తిప్పారు. ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కలెక్టరేట్లో అర్జీ ఇచ్చేందుకు వచ్చా. సచివాలయంలో ఇప్పటికి పది అర్జీలు ఇచ్చా. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – వెంకాయమ్మ, పైపుల రోడ్డుఈ ఫొటోలో కనిపిస్తున్న వై.సీతకు కళ్లు కనిపించవు. ఆమె భర్త కూడా అంధుడే. గత ఆగస్టు 25న ఇందిరా నాయక్‌నగర్ కాలనీలోని కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 30వతేదీన ఆ ఇంటిని వరద ముంచెత్తింది. ఇద్దరు పిల్లలతో కలసి మూడు రోజుల పిల్లలతో పాటు నీళ్లలోనే గడిపారు. చుట్టుపక్కల వారి సాయంతో ఎట్టకేలకు బయట పడ్డారు. పది రోజులు నీళ్లలో నానడంతో ఇంట్లో వస్తువులన్నీ పాడయ్యాయి. కొత్త ఇంటికి డోర్ నెంబర్ లేదని పరిహారం ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి ఇంటి డాక్యుమెంట్స్ సమర్పించినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అర్జీ ఇచ్చేందుకు భర్తతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. -
వరద నష్టపరిహారంపై గందరగోళం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుడమేరు వరద నష్టపరిహారంపై గందరగోళ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. బాధితులకు వారి బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమచేస్తామని ప్రకటించినప్పటికీ అలా కాకపోవడంతో వారు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. ఇస్తామన్న కొద్దిపాటి పరిహారంలోనూ కోతలు, దానికితోడు సాంకేతిక కారణాలను చూపి నిలిపివేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కేవైసీ కాలేదని.. నీ ఖాతా వాడుకలో లేదనే బ్యాంకు సిబ్బంది సమాధానాలతో వరద బాధితులకు దిక్కుతోచడంలేదు.ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఎగ్గొట్టడానికే ఈ విధమైన ఎత్తుగడలను అనుసరిస్తోందంటున్నారు. తమకు జరిగిన అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ నగరంలోని పలు సచివాలయాల వద్ద వరద బాధితులు సోమవారం ధర్నాలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయానికి కూడా అనేకమంది తరలివెళ్లారు.బ్యాంకుల్లో బారులుతీరిన బాధితులు.. నిజానికి.. వరద నష్టపరిహారాన్ని ఈనెల 30 నాటికి బాధితుల ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బాధితులు బ్యాంకులకు పోటెత్తారు. అయితే, మీ ఖాతా వాడుకలో లేదని.. కేవైసీ చేయించుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించటంతో ఇళ్లకు వెళ్లి ఆధార్, పాన్‌కార్డుల జిరాక్స్‌లను తీసుకుని మళ్లీ వచ్చారు. ఆ తర్వాత క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించినప్పటికీ మళ్లీ ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లింక్ అంటూ మెలికపెట్టారు. ప్రభుత్వ పథకాల నగదు బ్యాంకు ఖాతాల్లో పడాలంటే ఎన్పీసీఐతో ఖాతాలు లింక్ అయి ఉండాలని అధికారులు చెప్పడంతో బాధితులు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. చాలా కుటుంబాల్లో నాలుగైదు ఏళ్ల క్రితం చనిపోయిన వారి ఖాతాల్లో నగదు జమకావడంతో వారేమి చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. -
పరిహారం..పరిహాసం
కంకిపాడు: ఎకరా వరి పంటకు పెట్టుబడి కనీసం రూ.25 వేలు. పసుపు పంటకు రూ.1.50 లక్షలు. కందకు రూ.1.70 లక్షలు, తమలపాకుకు రూ.2 లక్షలు. ఇలా ఏ పంట వేసినా రైతు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సాయం ఎకరాకు రూ.10 వేలు మాత్రమే. అదీ.. కొంతమందికే వచ్చింది. వారికీ పంట వేసిన విస్తీర్ణంలో కొంత మొత్తానికే ఇస్తున్నారు. ఇందుకు ఈడే సాంబశివరావే ఉదాహరణ. ఆయన 3.70 ఎకరాల్లో వరి వేస్తే ఇచ్చిన పరిహారం ఎకరాకు రూ.10 వేలే. అంటే దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి వరదలో కొట్టుకుపోతే బాబు సర్కారు విదిల్చింది రూ.20 వేలే. ఇటీవలి కృష్ణా, బుడమేరు వరదలు, భారీ వర్షాలతో పంట నాశనమైపోయిన అనేక గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇదే. చేతికి దిగుబడి అందే తరుణంలో పంటలు దెబ్బతినడం, ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో ఆదుకోకపోవడంతో అన్నదాత తల్లడిల్లిపోతున్నాడు.కౌలు రైతుకు మొండిచేయివాస్తవంగా రైతులకంటే కౌలుదారుల చేతుల్లోనే సాగు అధికంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులకూ మొండి చేయి చూపింది. కొన్ని చోట్ల కౌలుకు తీసుకున్న భూముల్లో కౌలుదారుకు కాకుండా భూ యజమాని ఖాతాలో ప్రభుత్వం పరిహారాన్ని జమ చేసింది. దీంతో కౌలుదారులు పూర్తిగా దెబ్బతిన్నారు. పలువురు రైతులకు బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం జరగకపోవటంతో పరిహారం విడుదలైనా చేతికి అందే పరిస్థితి లేదు.దయలేని సర్కారువైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకృతి విపత్తులకు పంట నష్టపోయిన ప్రతి రైతునీ ఆదుకుని, అండగా నిలిచేది. పెట్టుబడి సాయం, బీమా వర్తింపజేసి అన్నదాతను ఆదుకొనేది. కానీ కూటమి సర్కారు మాత్రం అన్నదాత పట్ల దయలేకుండా వ్యవహరిస్తోంది. ఉదాహరణకు కృష్ణా జిల్లావ్యాప్తంగా 48,641 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. ఇందులో 44,521 హెక్టార్లలో వరి, వేరుశనగ, మినుములు, చెరకు, ఇతర పంటలు, 4,700 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 50 హెక్టార్లలో పట్టు పంట దెబ్బతిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిబంధనల పేరుతో నష్టం అంచనాల్లో భారీగా కోత వేసింది. కృష్ణా జిల్లాలో 21,661.02 హెక్టార్లలోనే పంట నష్టం వాటిల్లిందని సగానికిపైగా కోత వేసింది. ఇవే లెక్కలతో రైతులు వాస్తవంగా నష్టపోయినదానికంటే అతి తక్కువ పరిహారం అందించి రైతులను నట్టేట ముంచింది.కౌలు రైతుల పరిస్థితి దారుణం గ్రామంలో 20 ఎకరాలు కౌలు తీసుకుని వరి సాగు చేస్తున్నా. బుడమేరు వరదతో పంట అంతా నీటి పాలైంది. ఎకరాకు రూ 25 వేలు వరకూ పెట్టుబడి అయ్యింది. తిరిగి మళ్లీ పంట సాగు చేసుకోవటానికి చేతిలో డబ్బు లేదు. ప్రభుత్వం పరిహారం కూడా మాకు ఇవ్వలేదు. అప్పులు చేసి సాగుకు వెళ్లాల్సిన పరిస్థితి. కౌలు రైతుగా నా పరిస్థితి దారుణంగా ఉంది. – కొలకలూరి కోటయ్య, కౌలురైతు, మంతెనబ్యాంకు ఖాతా లింక్ అవ్వలేదు అంటున్నారు నా పొలం మూడెకరాలు కౌలుకి ఇచ్చాం. బుడమేరు ముంపుతో దెబ్బతింది. దాని తాలూకా డబ్బులు వచ్చాయి. ఎకరం నిమ్మతోట వేశాను. వరదకి పంట కుళ్లిపోయింది. పంట ఆనవాళ్లు కూడా లేవు. ప్రభుత్వం నుంచి మెసేజ్ ఫోన్‌కి వచ్చింది. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని. మిగిలిన డబ్బులు వస్తున్నాయి. ఇది మాత్రం కొర్రీ పెట్టారు. అధికారులు స్పందించి పరిహారం అందేలా చూడాలి. – బద్దల శ్రీనివాసరావు, రైతు, మంతెనరైతు పేరు ఈడే సాంబశివరావు. మంతెన గ్రామం. కేసరపల్లి గ్రామం పరిధిలో 3.70 ఎకరాల పొలం ఉంది. బుడమేరు వరదతో ఈ పొలాల్లో వేసిన వరి పూర్తిగా నీటి మునిగి కుళ్లిపోయింది. అధికారులు నష్టం నమోదు చేశారు. కానీ రెండెకరాలకు మాత్రమే ఎకరాకు రూ 10 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలో పడ్డాయి. నష్టం భారీగా జరిగితే.. పరిహారం ఇంత తక్కువ వచ్చిందని సాంబశివరావు ఆవేదన చెందుతున్నారు. -
రైతు కష్టం వరదపాలు
-
సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి
సాక్షి, అమరావతి: వరద నష్టం ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి బాధితునికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నష్టం ఎన్యూమరేషన్, బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీట మునిగాయని, ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పాడైపోయాయని, 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఎన్యూమరేషన్లో రీ వెరిఫికేషన్ చేసి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పరిహారం విషయంలో కూడా శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సూచించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందజేద్దామని పేర్కొన్నారు. రుణాలు రీషెడ్యూల్ చేయండి: సీఎం వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారి బ్యాంక్ రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, ఈఎంఐల చెల్లింపునకు గడువు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆయన బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. -
మాది చేతల ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: విపత్తుల సమయాన గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా అమలు చేయలేదని.. తమది చేతల ప్రభుత్వం కావడంతో గత హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వరదలతో రూ.5,438 కోట్లు నష్టం జరిగినందున తక్షణమే సాయం చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన రాలేదని తెలిపారు. కేంద్రం స్పందించకున్నా ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు.మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారని.. తమతో పాటు ఆ పారీ్టకీ రాష్ట్రంలో ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచి్చనందున వారు కేంద్రం తరఫున రూ.25 లక్షలు పరిహారం ఇప్పించాలని సూచించారు. మంగళవారం ఉదయం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మానుకోట ఎంపీ పోరిక బలరాంనాయక్లతో కలిసి సీఎం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. మేం ఇళ్లలో కూర్చోలేదు.. ‘వరదలు, వర్షాలు వచ్చిన సమయంలో మేము ఇళ్లలో కూర్చోలేదు. మా మంత్రులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. మేం పర్యటించినప్పుడు ప్రజలు కోపగించుకున్నా ఫర్వాలేదు.. ఓటు వేసిన వారు మమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు.. ఫామ్‌హౌస్‌లో కూర్చున్న వారిని అడగలేరు కదా.. ప్రభుత్వానికి ఉన్న పరిమితుల దృష్ట్యా నష్టంపై అంచనా వేసి శాశ్వత సాయం అందజేస్తాం. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ.లక్ష కోట్లలో రూ.2 వేల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే బాధితులకు ఇంకా ఎక్కువ సాయం చేయొచ్చు..’అని సీఎం వ్యాఖ్యానించారు. ఆక్రమణలతోనే అనర్థాలు ‘నీళ్లలోకి మనం వెళ్లి ఇళ్లు కట్టుకుంటే నీళ్లు ఇళ్లలోకి వస్తాయి. ఖమ్మంలో అనేక ఆక్రమణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో పాత చెరువులు ఆక్రమించుకున్న వారిని వదిలేసి కొత్తగా చెరువులను నిర్మించడం ఎందుకు? కొత్త చెరువులకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అది కమీషన్ కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బలోపేతం చేసినట్లు గత ప్రభుత్వం చెప్పింది నిజమే అయితే ఇప్పుడు చెరువులు ఎందుకు తెగుతున్నాయి? మిషన్ కాకతీయ అనేది కమీషన్ కాకతీయ అని గతంలో నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలోనే చెప్పారు. నాటి ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు దీన్ని కమీషన్ కాకతీయగా మార్చారు..’అని సీఎం ఆరోపించారు. రిటైనింగ్ వాల్‌పై ఇంజనీర్లతో చర్చిస్తాం ‘మున్నేరుపై రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపు అంశంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి టెండర్లు ఆహా్వనించాం. కానీ ఇంతలోనే ఉపద్రవం ముంచుకొచి్చంది. ఇప్పుడు జరిగిన పరిణామాల ఆధారంగా సాంకేతికంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం..’అని రేవంత్ తెలిపారు. వెంటనే స్పందించాం.. ‘రాష్ట్రంలో వర్షాలతో ఉపద్రవం సంభవించినప్పుడు వెంటనే బాధ్యతగా స్పందించాం. 42 సెం.మీ. వర్షం గత 75 ఏళ్లలో ఎన్నడూ కురవలేదు. ఆ స్థాయిలో వర్షం పడినా తక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో బయటపడ్డామంటే ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణం. మా మంత్రులు నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు ఎప్పుడూ అండగా నిలిచింది. జిల్లాపై తమకు ఉన్న బాధ్యతతోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తనతో సహా ఇక్కడికి తరలి వచి్చంది. ఈ జిల్లాకు నష్టం జరగనివ్వం. పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది కాలనీల్లో బురద శుభ్రం చేయడానికి ట్యాంకర్లను పంపాం. పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. ప్రజలను ఆదుకోవడానికి పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది..’అని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని రేవంత్ అన్నారు. సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి న్యాయం చేస్తా కారేపల్లి: వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ వరదలో కొట్టుకుపోయి చనిపోవడం బాధాకరమని.. వారి కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో అశ్విని, మోతీలాల్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వారి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అశ్విని తల్లి నేజీతో మాట్లాడారు. బిడ్డ కొత్త జీతంతో ఇల్లు కట్టుకుందామని మొదలుపెడితే ఇప్పుడు ఇలా జరిగిందంటూ ఆమె రోదించారు. సీఎం స్పందిస్తూ.. హైదరాబాద్‌లో తమ కార్యాలయానికి వస్తే చర్చించి అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.రూ.10 వేలు దేనికి సరిపోతాయి? సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరద ముంపు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిని, సామగ్రి కొట్టుకుపోయిన వారికి తక్షణ సా యంగా రూ.10 వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇవి దేనికి సరిపోతాయంటూ బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరి ఇళ్లు కొట్టుకుపోగా, మరికొందరి ఇళ్లు కూలిపోయాయి.మరికొన్ని దెబ్బతిన్నాయి. ఇవికాకుండా ఒక్కో కుటుంబం సగటున రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇంట్లో ఉన్న సామగ్రి కోల్పోయారు. ప్రభుత్వం అందించే రూ.10 వేల తక్షణ సాయం ఈ నష్టాన్ని పూడుస్తుందా? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే పూర్తయ్యాక నష్టాన్ని అంచనా వేసి సాయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని, సర్వే ఎప్పుడు పూర్తవుతుంది?, పరిహారం ఎప్పుడు అందుతుందని ప్రశ్నిస్తున్నారు. -
వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని..రూ.25లక్షలు పరిహారం ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల వరకు పరిహారం ఇవ్వాలన్నారు. భారీ వర్ష సూచన ఉన్నా కుంభకర్ణ నిద్రలో ప్రభుత్వం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం ఫలితంగా ఓ యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు 20 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 27న ప్రకటించినా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకర్ణ నిద్రలో ఉందన్నారు. ‘ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్ర సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫొటోలకు పోజులకే పరిమితమవుతా డు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే ‘చీఫ్ మినిస్టర్’ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశి్నస్తాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. ఎస్‌ఎన్‌డీపీతోనే హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పింది విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ‘ఎస్ఎన్డీపీ’నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా..లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడటంలో ఎస్ఎన్డీపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం) కీలకపాత్ర పోషించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాహుల్‌గాంధీ ట్వీట్‌పై కేటీఆర్ ఆగ్రహం భారీవర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులు తనను ఆవేదనకు గురిచేశాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టిందంటూ రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. బాధపడుతున్నట్టుగా ప్రకటనలు చేస్తే సరిపోదని రాహుల్‌కు సూచించారు. తెలంగాణలో సహాయక కార్యక్రమాలను ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో లేదో తెలుసుకుంటే ప్రభుత్వ నిర్వాకం తెలిసేదని వ్యాఖ్యానించారు. -
‘హోర్డింగ్ ప్రమాదాలకు కంపెనీలదే బాధ్యత’
ఇటీవలికాలంలో దేశంలోని పలు నగరాల్లో హోర్డింగ్‌లు కూలిపోయి, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టేందుకు, ప్రభుత్వం త్వరలో అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ పాలసీ-2024ను తీసుకురాబోతోంది. దీని ప్రకారం రోడ్లు లేదా ఇంటి పైకప్పులపై అమర్చిన హోర్డింగ్‌లు పడిపోవడం వల్ల ఎవరైనా చనిపోతే లేదా వికలాంగులైతే ఈ ప్రకటనలు ఏర్పాటుచేసే కంపెనీలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.ఇదేవిధంగా ఇటువంటి ప్రమాదాల్లో ఆస్తులకు నష్టం జరిగినప్పుడు కూడా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు పరిహారం చెల్లించాలి. ఈ పరిహారం ఎంత అనేది తర్వాత నిర్ణయిస్తారు. ఇప్పటివరకూ అడ్వర్టైజింగ్ పాలసీలో ప్రమాదాల్లో పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈ పాలసీని అమలుచేయనున్నారు. పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన ఈ ప్రతిపాదిత విధానానికి ఉన్నత స్థాయిలో అంగీకారం లభించింది. అవసరమైన కొన్ని సవరణలు చేసిన తర్వాత కేబినెట్లోనూ ఆమోదం పొందింది.ప్రతిపాదిత విధానం ప్రకారం ఇళ్లు లేదా పైకప్పులపై హోర్డింగ్‌లు పెట్టే ముందు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పురపాలక సంస్థలు నగరాల్లో ఏర్పాటు చేసిన అన్ని హోర్డింగ్‌లను జియో ట్యాగింగ్ చేసి 90 రోజుల్లోగా పౌర సంస్థల వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అలాగే చట్టవిరుద్ధమైన ప్రకటనలను ఏర్పాటు చేస్తే భారీ జరిమానా విధించనున్నారు. -
పరిహారం.. పరిహాసం
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని గొప్పలు చెప్పుకునే సీఎం చంద్ర బాబు ప్రభుత్వం ఈ ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోంది. గతనెల కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఉభయ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలతో పాటు 16 జిల్లాల పరిధిలో 70 వేల మంది రైతులకు సంబంధించిన 1.65 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 5 వేల ఎకరాల్లో వరినారు మడులు, 1.25 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. నారుమళ్లున్న చోట ఎకరాకు రూ. 6వేలు, నాట్లుపడిన చోట ఎకరాకు రూ.10వేల వరకు రైతులు పెట్టిన పెట్టుబడులు కోల్పోయారు. ఇతర పంటలు సాగుచేసిన రైతులైతే ఎకరాకు రూ.20 వేలకు పైగా నష్టపోయారు. పైగా సీజన్లో విలువైన పంటకాలాన్ని కోల్పోయారు. వరదలు, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారులు పంటనష్టం అంచనాలు రూపొందించారు. పంట నష్టం కుదింపు.. తొలుత.. ప్రాథమిక అంచనాల్లో 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించగా.. తుది అంచనాల్లో అది 55 వేల ఎకరాలకు కుదించేశారు. అలాగే, 16 జిల్లాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ముందు అంచనా వేయగా, చివరికొచ్చేసరికి ఉభయ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకే పరిమితం చేశారు. ఈ నాలుగు జిల్లాల్లో 30 వేల మంది రైతులకు చెందిన 55 వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం వాటిల్లినట్లు లెక్కతేల్చారు. అదే విధంగా.. వరదల కారణంగా ఇసుక మేటలు వేయడంతో తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో మరో 914 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రాథమిక అంచనాల్లో లక్షా 25 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించిన అధికారులు చివరకు 40వేల ఎకరాలకు పరిమితం చేశారు. ఇలా మొత్తమ్మీద వరదలు, వర్షాలవల్ల పంటలు నష్టపోయిన 30వేల మంది రైతులకు రూ.37.33 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్ట పరిహారం) లెక్కతేల్చి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఫలించని రైతుల ఆశలు.. ఇక తుది నివేదిక రాగానే వారం పదిరోజుల్లోనే పరిహారం జమచేస్తామని క్షేత్రస్థాయి పర్యటనల్లో మంత్రులు ఊదరగొట్టారు. అలాగే, రైతులు తిరిగి పంటలు వేసుకునేందుకు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) వెంటనే విడుదల చేయాలంటూ ఆగస్టు మొదటి వారంలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంకేముంది.. తమ ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమవుతుందని రైతులు సంబరపడ్డారు. పెట్టుబడి సాయం ఎలాగూ జమచేయలేదు.. ఇన్పుట్ సబ్సిడీ అయినా చేతికొస్తే కొంతమేర ఆసరాగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ, వారి ఆశలు ఫలించలేదు. నెలరోజులు కావస్తున్నా ఆర్థికశాఖ నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఫైల్‌కు మోక్షం కలగకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సీజన్ ముగిసేలోగా వస్తుందిలే కంగారెందుకు అంటూ మండలస్థాయి అధికారుల నుంచి వస్తున్న పరిహాసపు సమాధానాలతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.