అటవీ పరిహారం పెంపు | Telangana Wildlife Board Key Decision On Forest Compensation | Sakshi
Sakshi News home page

అటవీ పరిహారం పెంపు

Feb 14 2023 2:19 AM | Updated on Feb 14 2023 7:13 AM

Telangana Wildlife Board Key Decision On Forest Compensation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వన్యప్రాణుల దాడుల్లో (పులులతో సహా) మరణాలు, పంట నష్టాలకు పరిహారం పెంచాలని రాష్ట్ర వైల్డ్‌ లైఫ్‌ బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రూ.ఐదు లక్షలు ఉన్న పరిహారాన్ని పది లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నారు.

సాధారణ గాయాలైతే వాస్తవ వైద్యం ఖర్చు (లక్షకు మించకుండా), తీవ్రంగా గాయపడితే వైద్యానికి అయ్యే ఖర్చు (మూడు లక్షలకు మించకుండా), అంగవైకల్యం ఏర్పడితే లక్ష పరిహారం, పెంపుడు జంతువులు చనిపోతే వాస్తవ అంచనా, పంట నష్టానికి ప్రస్తుతం ఎకరాకు ఆరువేలు ఉన్న పరిహారాన్ని రూ.7,500కు పెంచాలని, పండ్ల తోటలకు నష్టపరిహారం కూడా రూ.7,500కు (గరిష్టంగా యాభై వేల దాకా) పెంచాలని కమిటీ ప్రతిపాదించింది.

సోమవారం అరణ్య భవన్‌లో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి మండలి (వైల్డ్‌ లైఫ్‌ బోర్డు), మనుషులు – జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనల కమిటీ సమావేశాలు జరిగాయి. 

►అటవీశాఖ నేతృత్వంలో అడవుల రక్షణ, వన్యప్రాణి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ వివరించారు. రాష్ట్రంలో మొదటి సారి చేపట్టిన పులుల ఆవాసాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపు (కవ్వాల్‌ లో రెండు గ్రామాలు) ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. 

వైల్డ్‌ లైఫ్‌ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు 
►హైదరాబాద్‌ వనస్థలిపురంలో బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. 

►హరిణి వసస్థలికి చెందిన 1.354 హెక్టార్ల అటవీ భూమి నిబంధనలకు అనుగుణంగా మళ్లింపును అనుమతిని ఇచ్చారు. జాతీయ రహదారిలో విపరీతంగా పెరిగిన రద్దీ, ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ టెర్మినల్‌ నిర్మాణం కానుంది.  

►శ్రీశైలం రహదారి విస్తరణ కోసం వచ్చిన ప్రతిపాదనను అమ్రాబాద్‌ లో ఉన్న వన్యప్రాణి సంరక్షణ దృష్టిలో పెట్టుకుని బోర్డు తిరస్కరించింది. ఇతర రోడ్డు, ఇరిగేషన్, (కడెం పరిధిలో లక్ష్మీపూర్‌ లిప్ట్, నాగార్జున సాగర్‌ పరిధిలో పెద్ద గుట్ట లిప్ట్‌) కేబుల్‌ పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. వన్యప్రాణులు ప్రమాదంలో పడ్డప్పుడు కాపాడేందుకు అవసరమైన రెస్క్యూ టీమ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.  

సమావేశంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సభ్యులు కోవ లక్ష్మి, రాఘవ, బానోతు రవి కుమార్, అనిల్‌ కుమార్, పీసీసీఎఫ్‌ (ఎఫ్‌ఏసీ) ఎం.సీ.పర్గెయిన్, అటవీశాఖ అడిషనల్‌ సెక్రటరీ ప్రశాంతి, ఓఎస్డీ శంకరన్‌ పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement