Indra Karan Reddy
-
బీఆర్ఎస్కు ఎదురు దెబ్బ : కాంగ్రెస్‌లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్,సాక్షి : పార్లమెంట్ ఎన్నికల తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దీపా దాస్ మున్షీ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.Former minister Indrakaran Reddy joined the Congress party in the presence of AICC in-charge Deepa Das Munshi at Gandhi Bhavan.• @IKReddyAllola pic.twitter.com/3JdkBWPBFA— Congress for Telangana (@Congress4TS) May 1, 2024 -
అటవీ పరిహారం పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వన్యప్రాణుల దాడుల్లో (పులులతో సహా) మరణాలు, పంట నష్టాలకు పరిహారం పెంచాలని రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రూ.ఐదు లక్షలు ఉన్న పరిహారాన్ని పది లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నారు. సాధారణ గాయాలైతే వాస్తవ వైద్యం ఖర్చు (లక్షకు మించకుండా), తీవ్రంగా గాయపడితే వైద్యానికి అయ్యే ఖర్చు (మూడు లక్షలకు మించకుండా), అంగవైకల్యం ఏర్పడితే లక్ష పరిహారం, పెంపుడు జంతువులు చనిపోతే వాస్తవ అంచనా, పంట నష్టానికి ప్రస్తుతం ఎకరాకు ఆరువేలు ఉన్న పరిహారాన్ని రూ.7,500కు పెంచాలని, పండ్ల తోటలకు నష్టపరిహారం కూడా రూ.7,500కు (గరిష్టంగా యాభై వేల దాకా) పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. సోమవారం అరణ్య భవన్లో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి మండలి (వైల్డ్ లైఫ్ బోర్డు), మనుషులు – జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనల కమిటీ సమావేశాలు జరిగాయి. ►అటవీశాఖ నేతృత్వంలో అడవుల రక్షణ, వన్యప్రాణి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ వివరించారు. రాష్ట్రంలో మొదటి సారి చేపట్టిన పులుల ఆవాసాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపు (కవ్వాల్ లో రెండు గ్రామాలు) ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు ►హైదరాబాద్ వనస్థలిపురంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. ►హరిణి వసస్థలికి చెందిన 1.354 హెక్టార్ల అటవీ భూమి నిబంధనలకు అనుగుణంగా మళ్లింపును అనుమతిని ఇచ్చారు. జాతీయ రహదారిలో విపరీతంగా పెరిగిన రద్దీ, ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ టెర్మినల్ నిర్మాణం కానుంది. ►శ్రీశైలం రహదారి విస్తరణ కోసం వచ్చిన ప్రతిపాదనను అమ్రాబాద్ లో ఉన్న వన్యప్రాణి సంరక్షణ దృష్టిలో పెట్టుకుని బోర్డు తిరస్కరించింది. ఇతర రోడ్డు, ఇరిగేషన్, (కడెం పరిధిలో లక్ష్మీపూర్ లిప్ట్, నాగార్జున సాగర్ పరిధిలో పెద్ద గుట్ట లిప్ట్) కేబుల్ పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. వన్యప్రాణులు ప్రమాదంలో పడ్డప్పుడు కాపాడేందుకు అవసరమైన రెస్క్యూ టీమ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సభ్యులు కోవ లక్ష్మి, రాఘవ, బానోతు రవి కుమార్, అనిల్ కుమార్, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం.సీ.పర్గెయిన్, అటవీశాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, ఓఎస్డీ శంకరన్ పాల్గొన్నారు. -
పెద్ద మనసుతో చెప్తున్నా.. బాబ్లీకి ఎత్తిపోసుకోండి
సాక్షి, హైదరాబాద్: ‘గోదావరి నది నుంచి మన కళ్ల ముందే రెండున్నర వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. సమస్యను అర్థం చేసుకునే శక్తి ఉంటే పార్టీలు, ప్రభుత్వాలుగా విడిపోకుండా పరిష్కరించుకుని వాడుకోవచ్చు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు సామర్ద్యం ఒక టీఎంసీ కూడా లేదు. పెద్ద మనసు చేసుకుని చెప్తున్నా తెలంగాణతో ఒప్పందం చేసుకోండి. గోదావరిలో నీటి లభ్యత ఉందనే విషయాన్ని రుజువు చేసి అవసరమైతే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి బాబ్లీ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసుకోండి’ అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్ర నాందేడ్ పర్యటనలో భాగంగా ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎనిమిది పదిమార్లు మహారాష్ట్రకు వచ్చి నాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను ఒప్పించి తెలంగాణలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. జాతీయస్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే నీటి వినియోగంలో విప్లవాత్మక ఎజెండా అమలు చేస్తామని, రాష్ట్రాల నడుమ కొట్లాటలు లేని జాతీయ విధానం తెస్తామన్నారు. అవసరానికి మించి నదీ జలాలున్న భారత్‌లో భారీ రిజర్వాయర్లు కట్టాల్సిన అవసరముందన్నారు. ఆరు నెలల్లోపు నియోజకవర్గాల పునర్విభజన బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించడంతో పార్లమెంటు, అసెంబ్లీల్లో 33శాతం సీట్లు రిజర్వు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆరు నెలల్లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి 33 శాతం సీట్లు పెంచి మహిళలకు ప్రత్యేకిస్తామన్నారు. రాష్ట్రాలు, జిల్లాల పునర్విభజనపై తమ పార్టీ విధానాన్ని దేశ ప్రజల ముందు పెడతామని చెప్పారు. గుణాత్మక అభివృద్ధి కోసం భిన్న ఆలోచనతో దేశ ఆలోచన విధానాన్ని మార్చడం కోసమే బీఆర్ఎస్ ఏర్పాటైందని కేసీఆర్ ప్రకటించారు. సింగపూర్, జపాన్, మలేషియా తదితర దేశాల తరహాలçో అభివృద్ధిని పరుగులు పెట్టించడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తమ పార్టీ విధానాన్ని అనుసరిస్తే రెండేళ్లలో భారత్ అద్భుతమైన అభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. 90 శాతం విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ అ«ధీనంలోనే పెడతామని, రెండేళ్లలోనే దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తామని స్పష్టంచేశారు. దేశంలో సంపూర్ణ పరివర్తన కోసమే... విద్య, వైద్యం సహా అన్ని రంగాలకు సంబంధించి తమ పార్టీ ఎజెండాపై నిపుణుల బృందం కసరత్తు చేస్తోందని కేసీఆర్ చెప్పారు. అన్ని రంగాల్లో సంపూర్ణ పరివర్తన కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వరంగ కంపెనీ ఎల్ఐసీని పారిశ్రామికవేత్త అదానీకి అప్పగించడం వాస్తవం కాదని చెప్తున్న కేంద్రం.. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలంటే ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. కేంద్రంతో ఉన్న మిత్రుత్వంతోనే అదానీ ప్రపంచంలో రెండో స్థానానికి ఎదిగాడన్నారు. మతం పేరిట దేశ ప్రజల విభజనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని తేల్చిచెప్పారు. తన తదుపరి మీడియా సమావేశం త్వరలో ఢిల్లీలో ఉంటుందని ప్రకటించారు. -
త్వరలోనే పోడు పట్టాల పంపిణీ
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో త్వరలోనే పోడు పట్టాలు పంపిణీ చేస్తామని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కేస్లాపూర్ నుంచే అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద ఎక్కువ మందికి న్యాయం చేసేలా చూస్తామని, రైతుబంధు వర్తింపజేస్తామన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరుగుతున్న నాగోబా జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి ఆమె విచ్చేశారు. నాగోబాను దర్శించుకున్న అనంతరం గిరిజన దర్బార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 3.8 లక్షల ఎకరాల పోడు భూములకు రైతుబంధు ఇచ్చి గిరిజనుల కోసం అనేక గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అగ్రికల్చర్ బీఎస్సీ ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. కొందరు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని నాగోబా జాతరకు వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను ఆమోదించి పంపితే కేంద్రం పక్కనబెట్టిందంటూ దుయ్యబట్టారు. మెస్రం పెద్దలు సూచించినట్లుగా అభివృద్ధి పనులు: ఇంద్రకరణ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో 10 శాతం రిజర్వేషన్ల ప్రకారం 9 వేలకుపైగా ఉద్యోగాలు గిరిజనులకే దక్కుతాయన్నారు. నాగోబా సన్నిధిలో అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 12.5 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేశారని తెలిపారు. మెస్రం పెద్దలు సూచించిన ప్రతిపాదనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు ఏమైనా నిధులు ఇచ్చిందా? అంటూ విమర్శించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా రాష్ట్రంలోని ఆలయాలకు మంజూరు చేశారా అంటూ ధ్వజమెత్తారు. గిరిజన దర్బార్‌లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దండే విఠల్, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, రేఖాశ్యామ్ నాయక్, రాథోడ్ బాపురావు తదితరులు పాల్గొన్నారు. -
వైల్డ్ లైఫ్ టూరిజం పునః ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలో ‘ఎకోఫ్రెండ్లీ వైల్డ్ లైఫ్ టూరిజం’ తిరిగి ప్రారంభం కానుంది. 2021 నవంబర్‌లో ప్రయోగాత్మకంగా మొదలైన ‘వైల్డ్‌లైఫ్ టూరిజం ప్యాకేజీ టూర్’ని జతచేసిన సరికొత్త హంగులు, ఆకర్షణలతో శుక్రవారం అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పునఃప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా టైగర్ సఫారీ కోసం సమకూర్చిన కొత్తవాహనాలను ఫ్లాగ్‌ఆఫ్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం మొదలుకానుంది. టూర్లో భాగంగా ‘టైగర్‌స్టే ప్యాకేజీ’ని ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌తో మంత్రి ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పర్యాటకులకు కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్న ఆరు కాటేజీలను కూడా మంత్రి ప్రారంభిస్తారు. ఏటీఆర్ పరిధిలో పులుల కదలికల ఫొటోలు, పాదముద్రలు, ఇతర అంశాలతో తయారుచేసిన ‘ఏటీఆర్ టైగర్‌బుక్’ను ఆవిష్కరిస్తారు. అటవీ, వన్యప్రాణుల పరిరక్షణకు కృషి చేస్తున్న ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఏటీఆర్‌క్లబ్’ సభ్యులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశం నిర్వహిస్తారు. ‘టైగర్‌స్టే ప్యాకేజీ’ ఇలా... టూరిజం ప్యాకేజీలో... టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీ, గిరిపుత్రులను కలుసుకుని వారి జీవనశైలి, అనుభవాలు తెలుసుకోవడం వంటివి జతచేశారు. దాదాపు 24 గంటల పాటు ఇక్కడ గడపడంతో పాటు రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టి ఇళ్లలో బస వంటివి అందుబాటులోకి తేనున్నారు. స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్ గైడ్లుగా వ్యవహరించనున్నారు. రాత్రిపూట అడవిలోని పర్క్యులేషన్ ట్యాంక్‌లో నీటిని తాగడానికి వచ్చే వన్యప్రాణుల వీక్షణకు నైట్‌విజన్ బైనాక్యులర్స్ ఏర్పాటు చేశారు. ఎకోఫ్రెండ్లీ చర్యల్లో భాగంగా... జ్యూట్‌బ్యాగ్ వర్క్‌షాపు, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌సెంటర్, బయో ల్యాబ్‌ల సందర్శన ఉంటుంది. -
‘ముక్కోటి’కి యాదాద్రి ముస్తాబు
యాదగిరిగుట్ట: వైకుంఠ (ముక్కోటి) ఏకాదశికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతో పాటు అనుబంధంగా ఉన్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబయ్యాయి. సోమవారం యాదాద్రీశుడు వైకుంఠనాథుడిగా ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రధానాలయం ప్రారంభమయ్యాక తొలి సారిగా వస్తున్న వైకుంఠ ఏకాదశి కావడంతో ఇది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ప్రధానాలయం పనులు జరుగుతున్న సందర్భంగా బాలాలయంలో తూర్పు ద్వారం గుండానే భక్తులకు శ్రీస్వామి వారు దర్శనం ఇచ్చారు. ఈ సారి ప్రధానాలయంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడంతో ఉత్తర రాజగోపురం నుంచి భక్తులకు వైకుంఠనాథుడి దర్శన భాగ్యం కల్పిస్తారు. ప్రధానాలయంలో.. వైకుంఠ ద్వార దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో రంగురంగుల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలు, విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరిపడా పులిహోర, లడ్డూ మహా ప్రసాదాలను సిద్ధం చేశారు. ప్రధానాలయంలో సోమవారం ఉదయం 6.48 గంటలకు శ్రీస్వామివారు వైకుంఠనాథుడిగా దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. పాతగుట్టలో.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా ఉదయం 6.48 గంటలకు ఉత్తర ద్వారానికి శ్రీస్వామి వారిని వేంచేపు చేయించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. అనంతరం శ్రీస్వామి వారిని ఆలయ ముఖ మండపంలో అధిష్టింపచేసి, క్యూలైన్లలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయమే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున్న ఉత్తరం వైపు భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం, ఆరాధన, తిరుప్పావై నిర్వహించి, అలంకార సేవను ఏర్పాటు చేస్తారు. ఉదయం 6.48 గంటల నుంచి 7 గంటల వరకు వైకుంఠద్వార దర్శనం, ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అలంకార దర్శనం కల్పిస్తారు. నేటి నుంచి అధ్యయనోత్సవాలు.. యాదాద్రీశుడి ఆలయంలో సోమవారం నుంచి ఈనెల 6వతేదీ వరకు ఐదు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలలో విశేష అలంకార సేవలు నిర్వహిస్తారు. ఐదురోజులపాటు లక్ష్మీ సమేతుడైన నారసింహుడు దశావతారాలతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక అలంకరణ సేవల్లో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అధ్యయనోత్సవాలు జరిగే ఐదు రోజుల పాటు భక్తులు నిర్వహించే మొక్కు, శాశ్వత బ్రహ్మోత్సవాలు, నిత్య, శాశ్వత కల్యాణోత్సవాలు, శ్రీసుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు. -
ప్రలోభాలకు తెలంగాణ లొంగదు
చౌటుప్పల్: ప్రలోభాలకు తెలంగాణ సమాజం లొంగబోదని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకత్వం ఆ పార్టీలో చేర్చుకునేందుకు చేసిన కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి వారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు నిరసన వ్యక్తం చేశారు. మోదీ, బీజేపీ, రాజగోపాల్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. బీజేపీ చేసే కుట్రలకు తెలంగాణలో తావు లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీకి మునుగోడులో ఓటమి తప్పదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించారు. మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ నాయకత్వం ప్రలోభాలకు గురిచేసిందన్నారు. అనంతరం వారు జాతీయ రహదారిపై బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ నిరసన.. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని విమర్శిస్తూ తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ నేతృత్వంలో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోదీ, అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
బాసరకు మంత్రి కేటీఆర్
నిర్మల్: ఎట్టకేలకు బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కలవనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన ఆర్జీయూకేటీకి రానున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడకు వెళ్లనున్నారు. అక్కడ జోగు రామన్నను పరామర్శించి బాసరకు రానున్నారు. విద్యార్థులతో మాటాముచ్చట.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రులు ఆర్జీయూకేటీ చేరుకోనున్నారు. ముందుగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆ తర్వాత వారితో మాట్లాడనున్నారు. రెండు గంటలు కేటీఆర్‌తోపాటు సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి వర్సిటీలో ఉండనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఇందుకు సీఎం లేదా మంత్రి కేటీఆర్ తమవద్దకు రావాలని జూన్‌లో విద్యార్థులు వారంపాటు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పుడిచ్చిన హామీ మేరకు కేటీఆర్ క్యాంపస్‌కు వస్తున్నట్లు చెబుతున్నారు. కేటీఆర్ రాకతో తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. -
మొక్కలు నాటడం జీవన విధానంలో భాగం కావాలి: ఇంద్రకరణ్‌రెడ్డి
గచ్చిబౌలి(హైదరాబాద్): మొక్కలు నాటడం జీవన విధానంలో భాగం కావాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బొటానికల్ గార్డెన్లో ఆయన జమ్మిచెట్టు నాటి రెండో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జమ్మి వృక్షం పవిత్రమైందని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా ప్రకటించిందని తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రతిగ్రామంలోనూ 1.20 లక్షల జమ్మిచెట్లను నాటేందుకు అటవీ, దేవాదాయ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయని చెప్పారు. బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా సంతోశ్ కుమార్‌ను ఎన్నుకున్నారు. ఊరూరా జమ్మిచెట్టు–గుడిగుడిలో జమ్మిచెట్టు, వాకర్స్ అసొసియేషన్ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా రన్ ఫర్ పీస్ కార్యక్రమం పోస్టర్, టీషర్ట్స్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్‌రెడ్డి, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్‌లో మళ్లీ జోరు వాన
సాక్షి నెట్వర్క్: నిర్మల్ జిల్లాలో ఆదివారం తగ్గుముఖం పట్టిన వాన సోమవారం మళ్లీ మొదలైంది. రోజంతా వర్షం పడింది. నీట మునిగిన ప్రాంతాలు, దెబ్బతిన్న పంటలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. మామడ మండలంలో దెబ్బతిన్న రోడ్లు, పంటలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించి.. స్థానికులతో మాట్లాడారు. ముథోల్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషరఫ్ పర్యటించారు. టాక్లి, బిద్రెల్లి, కిర్గుల్(బి) గ్రామాల్లో ముంపు బాధితులతో మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు, వంతెనలను పరిశీలించి.. వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖానాయక్ పర్యటించి.. నాగాపూర్, మందపల్లి చెరువు కట్టలను, వేణునగర్ గ్రామం వద్ద కాల్వను పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లా పరిధిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రామప్ప సరస్సు నీటిమట్టం 26 అడుగులకు చేరింది. గణపురం మండలం గణపసముద్రం చెరువు 31 అడుగట్లు గరిష్ట సామర్థ్యం కాగా.. సోమవారం సాయంత్రానికి 26 అడుగులకు చేరుకుంది. పాకాల సరస్సు పూర్తి స్థాయి మట్టానికి దగ్గరగా వచ్చింది. భద్రాద్రిలో గోదావరి వరద: భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో పలుచోట్ల సోమవారం కూడా వానలు కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 913 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. అయితే అంతకు మూడు రెట్లు నష్టం జరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గోదా వరి వరద రోడ్లపైకి రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వందకుపైగా ట్రాన్స్ఫార్మర్లు వరదలో మునిగినట్టు అంచనా వేశారు. ముంపు తలెత్తే ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తు న్నారు. మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్(ఎస్యూపీ) ఉత్పత్తులపై నిషేధం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం అమలుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీపీసీబీ) చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎస్యూపీ సరఫరా ముడి సరుకులు, ప్లాస్టిక్ డిమాండ్ తగ్గింపునకు చర్యలు, ఈ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాల ప్రోత్సాహం, ప్రజల్లో అవగాహన వంటివి చేపడతామన్నారు. వీటితోపాటు పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా పాలనాయంత్రాంగానికి అవగాహన కల్పన, మార్గనిర్దేశానికి ఈ ప్రణాళికలో భాగంగా పీసీబీ బహుముఖ విధానాన్ని అవలంబిస్తోందన్నారు. ఎస్యూపీలపై నిషేధం అమలుకు, ప్రత్యామ్నాయ వస్తువుల ప్రోత్సాహానికి కంపోస్టబుల్ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వన్ టైం సర్టిఫికెట్లు జారీ చేస్తుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్–టెక్నాలజీ (సిపెట్), జాతీయ ఎమ్మెస్ఎంఈ శిక్షణ సంస్థ, ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, ఇతర ఇండస్ట్రియల్ అసోసియేషన్ల సహకారంతో ఎస్యూపీలకు బదులుగా ఎమ్మెఎస్ఎంఈ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ టీపీసీబీ వర్క్‌షాపులను నిర్వహిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఫిర్యాదు చేయడానికి సీపీసీబీ ఎస్యూపీ–సీపీసీబీ ప్రత్యేక ఆన్లైన్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎస్యూపీ వస్తువుల వినియోగానికి స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించాలని సూచించారు. నిషేధిత జాబితాలోని ప్లాస్టిక్ వస్తువులు ఇవే ఇయర్ బడ్స్(ప్లాస్టిక్ పుల్లలున్నవి), బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్ (ప్లాస్టిక్ పుల్లలతో), ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్–పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ఐస్‌క్రీమ్ పుల్లలు(ప్లాస్టిక్ పుల్లలతో), అలంకరణ కోసం వాడే థర్మోకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు.. వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ప్లాస్టిక్ ఆహ్వానపత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, వంద మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు,, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు(స్ట్రిరర్స్). -
పుడమిని కాపాడటమే లక్ష్యం: జగ్గీ వాసుదేవ్
శంషాబాద్ రూరల్: ‘ప్రకృతిని పరిరక్షిస్తేనే భవిష్యత్ ఉంటుంది. పుడమిని కాపాడడమే సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సంయుక్త లక్ష్యం’ అని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గొల్లూరు అటవీ ప్రాంతంలో గురువారం ఆయన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఐదో విడతను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారంతో పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ మాట్లాడుతూ... తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ప్రారంభించానని, సద్గురు ఆశీస్సులు అందుకోవటం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, నవీన్‌రావు, విఠల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్ఎం డోబ్రియల్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ముచ్చింతల్ సమీపంలో ఉన్న సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన సద్గురు, శ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి ‘సేవ్ సాయిల్’ పోస్టర్లను ఆవిష్కరించారు. -
యాదాద్రి ఈఓ మార్పు తప్పదా?
సాక్షి, యాదాద్రి: యాదాద్రి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణ అధికారి(ఈఓ) గీతారెడ్డి మార్పు తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది. కూతురు వివాహం కోసం సెలవుపై వెళ్లిన ఈఓ గీతారెడ్డి మంగళవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. అయితే తాజాగా యాదాద్రిని చుట్టుముడుతున్న వివాదాలకు తెరదించడానికి ఈఓను తప్పించనున్నారని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో యాదాద్రిలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని మంత్రి ప్రకటించినప్పటికీ అంతర్గతంగా వాస్తవ పరిస్థితులపై సుదీర్ఘంగానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈఓ గీతారెడ్డి స్థానంలో ఐఏఎస్ లేదా రిటైర్డు ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. వివాదాస్పదమైన నిర్ణయాలు.. సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. అయితే మార్చి 28న ప్రధానాలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత దేవస్థానంలో అమలు చేసిన పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. భక్తులకు కనీస వసతులైన నీరు, నీడ కల్పించలేకపోవడం, కొండపైన పార్కింగ్ ఫీజు గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 చొప్పున చెల్లించాలని నిర్ణయించడంతో దేవస్థానం వ్యాపారమయంగా మారిందని ఇంటాబయటా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదనంగా గంటకు రూ.100 పార్కింగ్ ఫీజు వసూలును ఎత్తివేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ప్రకటించడంతో భక్తులకు కొంత ఊరట కలిగింది. మరోపక్క స్థానిక ఆటోలను కొండపైకి నిషేధించడంతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలతో కలసి పలుమార్లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ తీరుపై ఆటో కార్మికులు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు నాయకులు గుట్టకు వచ్చినప్పుడు 300 ఆటో డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈఓకు సూచించారు. దీంతో పాటు మీడియా ప్రతినిధులను కొండపైకి అనుమతించకపోవడం, ప్రశ్నించిన వారిని అరెస్టు చేయించడంతో ఈఓ, మీడియా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం, ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే యాదాద్రిలో జరిగిన నష్టం వంటి పలు అంశాలు దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీశాయని ఉన్నతస్థాయి వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈఓను మారుస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. -
లోపాల్లేవు, అకాల వర్షంతోనే అలా!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన అకాలవర్షంతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అతలాకుతలమైనప్పటికీ, పనుల్లో ఎక్కడా లోపాలు లేవని అధికారులు తేల్చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. ఓ వైపు పనులు జరుగుతుండగా, ఉన్నట్టుండి ఒకేసారి భారీ వర్షం కురవటంతోనే ఈ పరిస్థితి నెలకొందని, నాణ్యతలో లోపాలు లేవని నివేదించారు. ఈ మేరకు శనివారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సాక్ష్యంగా కొన్ని ఫొటోలు చూపించారు. వాన నిలిచిపోయిన వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు కూడా ఫొటోల ద్వారా వివరించారు. ఇటీవల ఉన్నట్టుండి భారీవర్షం కురవడంతో యాదగిరిగుట్ట దేవాలయం వద్ద దిగువన కొత్త రోడ్డు కొట్టుకుపోయి నేల కుంగిపోవడం, క్యూ కాంప్లెక్సుల్లోకి భారీగా వాననీరు చేరడం, చలువ పందిళ్లు కొట్టుకుపోవడం వంటివి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పనుల్లో నాణ్యత లోపం ఉందంటూ సర్వత్రా ఆగ్రహం, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం యాడా ఉన్నతాధికారులు, రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీతో సమీక్ష నిర్వహించారు. పనులన్నీ సవ్యంగానే సాగాయని అధికారులు మంత్రికి వివరించారు. పనులు జరుగుతున్న వేళ ఒకేసారి 79 మిల్లీమీటర్ల వాన కురవటంతో గుట్టపై నుంచి వరదలో మట్టి కొట్టుకొచ్చిందని, అది పైపులైన్లలోకి చేరి దిగువకు అడ్డుపడటం వల్లే క్యూ కాంప్లెక్సులోకి నీళ్లు చేరాయని పేర్కొన్నారు. రోడ్డు నాణ్యతతో నిర్మించినా, పైపులైన్ల కోసం పక్కన గుంతలు తవ్వటంతో ఒక్కసారిగా వచ్చిన వరదతో దిగువ మట్టి కొట్టుకుపోయి రోడ్డు దెబ్బతిన్నదని, ఆ ప్రాంతం కుంగిపోయిందని పేర్కొన్నారు. గుట్టపై నుంచి భారీగా కొట్టుకొచ్చిన ఇసుకలో బస్సులు దిగబడి ముందుకు సాగలేకపోయాయని వివరించారు. వానాకాలం నాటికి పూర్తిచేయండి ఒకేసారి భారీవర్షం కురవటంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనందున, వచ్చే వానాకాలం నాటికి పనులన్నీ పూర్తి చేస్తే ఈ పరిస్థితి పునరావృతం కాదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు కురిసేనాటికి అంతా సిద్ధం చేసి అప్రమత్తంగా ఉండాల ని ఆదేశించారు. ఇంత భారీ ప్రాజెక్టు పనులు పూర్తి అవుతున్న తరుణంలో ఇలాంటి చిన్న, చిన్న సమస్యలు ఉత్పన్నమవుతాయని, వీటిని అధిగమించేందుకు ప్రయత్నించాలని సూ చించారు. చలువ పందిళ్లు, మురుగునీటి నిర్వహ ణ, క్యూ లైన్లలో ఫ్యాన్ల ఏర్పాటు, వీల్చైర్లు అందుబాటులో ఉంచటం, గుట్ట దిగువన మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. రాజకీయలబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు చేయటం తగదని, ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడొద్దని, చిన్న, చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూడ్డం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, యాడా వైస్ చైర్మన్ కిషన్‌రావు తదితరులు హాజరయ్యారు. ఆ ‘ఖాళీ’ ముప్పుపై దృష్టి పెట్టండి యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ క్యూలైన్లో ఏర్పడిన ఖాళీపై ‘పొంచి ఉన్న ముప్పు’శీర్షికతో శనివారం సాక్షి లో ప్రచురితమైన వార్తపై దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పందించారు. శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో నిర్వహించిన వైటీడీఏ సమావేశంలో ప్రత్యేకంగా ఈ వార్తపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాక్షిలో ప్రచురితమైన వార్త క్లిప్పింగ్‌ను పరిశీలించమని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావుకు మంత్రి చూపించారు. ప్రమాదం జరగకుండా వెంటనే అక్కడ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. -
సమాన న్యాయంతోనే సార్థకత
సాక్షి, మేడ్చల్ జిల్లా/శామీర్‌పేట్: న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. హక్కులు, న్యాయం కోసం పోరాడేందుకు యువత ముందుకు రావాలని, యువత తమ శక్తిని పూర్తిగా వినియోగించుకున్నపుడే మెరుగైన భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పారు. ఆదివారం శామీర్‌పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయ విద్యార్థులు క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని, భాష ఏదైనా సమాచార సేకరణ సమర్థవంతగా ఉండాలన్నారు. న్యాయ విద్యా ర్థులు ఉన్నతస్థాయికి వెళ్లేందుకు ముందుగా విచారణ అనుభవాన్ని పొందాలని సూచించారు. విశ్వవిద్యాలయాల కంటే ప్రజలతో ప్రత్యక్షంగా నేర్చుకున్న పాఠాలే మేధోసంపత్తి ఎదుగుదలకు దోహదపడతాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అంతకుముందు వర్సిటీలో విద్యార్థుల హాస్టళ్ల భవనాలతోపాటు డైనింగ్ హాలును హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, నల్సార్ చాన్స్‌లర్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. గోల్డ్ మెడల్స్ అందజేత 2020, 2021 సంవత్సరాల్లో గోల్డ్‌మెడల్స్ సాధించిన 104 మంది విద్యార్థులకు జస్టిస్ రమణ గోల్డ్ మెడల్స్ అందజేశారు. అలాగే వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి పట్టాలను అందజేసి అభినందించారు. అనంతరం నల్సార్ వర్సిటీ రూపొందించిన పలు రివ్యూ డాక్యుమెంటరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రీ, జస్టిస్ పి.వెంకటరమణా రెడ్డి, కార్మిక మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మబంధువు–దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కవి, రచయిత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందించిన ‘ఆత్మబంధువు–దళిత సంక్షేమ బంధం’పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. దళితబంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషినంతా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు జూలూరు తెలిపారు. అనంతరం, తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ముఖ్యమంత్రికి జూలూరు గౌరీశంకర్ దంపతులు ఆహ్వానపత్రికను అందజేశారు. -
పోడుపై కీలక భేటీ.. కేసీఆర్ నిర్ణయాలపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్/ ఏటూరునాగారం /ములుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములు, అటవీ సంరక్షణ, హరితహారం వంటి అంశాలపై ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందా అన్న దానిపై అటవీశాఖ ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ముఖ్యమైన సమావేశంలో పోడు ఆక్రమణలను క్రమబద్ధీకరించే దిశలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఈ సమీక్షా సమావేశంలో పోడు భూములపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొననున్నారు. అటవీ శాఖతో పాటు పలు ఇతర శాఖల ఉన్నతాధి కారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. 2005 తర్వాత మళ్లీ పోడు భూముల పేరిట అటవీ ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తే జరిగే నష్టంపై పర్యా వరణ నిపుణుల వాదనలు, ఇతర అంశాలు పరిగణ నలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చ ని, అటవీశాఖకు సంబంధించిన ప్రత్యేక ఆదేశాలతో కార్యాచరణ ప్రణాళికలు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏరియల్ సర్వే పోడు భూముల సాగు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో అధికారులు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఫొటోలు తీయడంతో పాటు వీడియో చిత్రీకరణ చేసినట్లు సమాచారం. ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన భూముల వివరాలు, పోడు భూముల దరఖాస్తులపై ప్రభుత్వం ఇప్పటికే సమాచారాన్ని తెప్పించుకుంది. పోడు భూముల సర్వే పూర్తయ్యే వరకు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పోడు భూములపై ఆరా ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలు, అటవీశాఖ డీఎఫ్ఓలు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో.. పోడు భూముల కమిటీ సభ్యులు శాంతికుమారి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అటవీ ప్రాంతాల్లో ఏయే తెగలు నివాసం ఉంటున్నాయో ఆరా తీశారు. నాలుగు జిల్లాల్లో పోడు భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
నాయిని.. గరీబోళ్ల లీడర్
కవాడిగూడ(హైదరాబాద్): రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జీవితాంతం పేదలు, కార్మికుల పక్షాన పోరాడి గరీబోళ్ల లీడర్‌గా చెరగని ముద్ర వేశారని మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. నాయిని ప్రథమ వర్ధంతిని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, సుభాష్‌రెడ్డి, సాయన్న, ఎమ్మెల్సీ ప్రభాకర్, ప్రొటెం స్పీకర్ భూపాల్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్, నాయిని కుటుంబసభ్యులు, బంధువులు, టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు పేదలకు విద్య, వైద్యసేవలు అందించేందుకుగాను నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్‌ను ఆయన కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ లోగోను మహమూద్ అలీ ప్రారంభించారు. నియోజకవర్గంలోని 45 అంగన్వాడీ సెంటర్లకు కార్పెట్ల ను అందజేశారు. ఫౌండర్‌గా సమతారెడ్డి, వైస్ చైర్మన్‌గా నాయిని దేవేందర్‌రెడ్డి కొనసాగుతారు. -
వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
-
భద్రాద్రిలో కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం
సాక్షి, భద్రాచలం: భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో స్వామివారి తిరుకల్యాణ వేడుకలు జరుగుతున్నాయి. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు సమర్పించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు వేదపండితులు సీతారాముల కల్యాణ ఘట్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. ఈ కమనీయ కల్యాణ వేడుక శ్రీరాముని భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఇతర ప్రజాప్రతినిధులు కూడా కల్యాణ వేడుకకు హాజరయ్యారు. కరోనా కారణంగా రెండో ఏడాది ఆంతరంగికంగా రాములోరి కల్యాణం జరుగుతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా భక్తులకు అనుమతి నిరాకరించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. వరుసగా రెండో ఏడాదీ భక్తుల లేకుండా స్వామివారి కల్యాణం ఘట్టం పూర్తయింది. రేపు (గురువారం) శ్రీరాముని మహాపట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది. చదవండి: శ్రీరామనవమి ఇంట్లో ఎలా జరుపుకోవాలో తెలుసా? -
అమాత్యుల హస్తంతోనే..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘నాలుగేళ్లలో అనేకసార్లు సర్వేలు జరిపి అభ్యర్థులను ఎంపిక చేశాం. ప్రజల్లో ఆదరణ పెరిగిందన్న రిపోర్టుల ఆధారంగానే టికెట్లు ఇచ్చాం. కేవలం ఇద్దరికి తప్ప సిట్టింగులద్దరికి సీట్లు ఇవ్వడం జరిగింది.’ ఈనెల 6న శాసనసభ రద్దు తరువాత 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొందరి టికెట్ల విషయంలో మంత్రులు, ముఖ్య నేతల మాట చెల్లుబాటు అయినట్లు తెలుస్తోంది. టికెట్లు ఆశించిన నాయకులు, వారి అనుచరులు సైతం అదే నిజమని చెబుతుండడం గమనార్హం. జిల్లాకు చెందిన మంత్రులతో పాటు వచ్చే ప్రభుత్వంలో కీలక పదవులు పొందాలని భావి స్తున్న కొందరు నేతలు, ఓ ఎమ్మెల్సీ ముందు జాగ్రత్తగా సీనియర్ నాయకులకు టికెట్లు రాకుండా అడ్డుకున్నారని ఆరోపణ. ప్రధానంగా ఎస్టీ రిజర్వుడు సీట్లైన ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లో పార్టీ సిట్టింగ్‌లనే కొనసాగించడానికి కారణమదేనని చెపుతున్నారు. చెన్నూర్‌లో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలును తొలగించి ఎంపీ బాల్క సుమన్‌ను తీసుకురావడంలో కూడా నేతల అభిప్రాయాన్నే పరిగణలోకి తీసుకున్నారని సమాచారం. పార్టీలో, జిల్లాలో ఆధిపత్యం తగ్గకుండా ప్రణాళికబద్ధంగా సీనియర్లకు చెక్ పెట్టారని టికెట్లు రాని నేతల అనుచరులు ఆరోపిస్తున్నారు. రాథోడ్ టీఆర్ఎస్లో చేరకుండా ... కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తరువాత జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీలో అనతికాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు రాథోడ్ రమేష్. ఎస్టీ రిజర్వుడు ఖానాపూర్ నుంచి తొలుత గెలిచి, తరువాత ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. ప్రతికూల పరిస్థితుల్లో 2009లో టీడీపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. అయితే 2010 నుంచి మారిన రాజకీయ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన నాయకులంతా ఒక్కొక్కరిగా టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరినా, ఆయన అక్కడే కొనసాగారు. చివరికి 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసి ఓడిపోయినా, పార్టీని వీడలేదు. చివరికి 2017లో ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ద్వారా టీఆర్ఎస్లో చేరారు. అది కూడా తదుపరి ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పార్టీ టికెట్టు ఖాయమనే హామీతో. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... రమేష్ రాథోడ్ టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరేందుకు అంతకు ముందు చేసిన ప్రయత్నాలను ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు సాగనీయలేదు. కాంగ్రెస్, బీజేపీల నుంచి రాథోడ్‌కు ఆహ్వానాలు అందుతున్న తరుణంలో తుమ్మల ప్రోద్భలంతో ఆయన టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ కండువా కప్పుకున్న రోజే తాను వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేస్తానని, కేసీఆర్ టికెట్టు హామీ ఇచ్చారని ప్రకటించడం గమనార్హం. అయితే ఇప్పుడు టికెట్టు రాకపోవడానికి మంత్రులతో పాటు కొందరు టీఆర్ఎస్ నేతలే చక్రం తిప్పినట్లు ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. మంత్రిగా అడ్డు కాకూడదనేనా...? నాలుగేళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో బీసీ, అగ్ర వర్ణాలకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహించారు. ఎస్టీ రిజర్వుడు పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు గిరిజనులకు కేటాయించినవే. సాధారణంగా ఆదిలాబాద్ నుంచి ఎస్టీకి మంత్రి పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బోథ్ అసెంబ్లీ నుంచి మూడుసార్లు గెలిచిన గోడం నగేష్ టీడీపీ హయాంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన ఎమ్మెల్యే అయితే సీనియారిటీ, కుల సమీకరణల దృష్ట్యా ఆయనకు అవకాశం లభించడం ఖాయం. ఇక్కడే జిల్లాకు చెందిన ముఖ్య నేతలు చక్రం తిప్పారని బోథ్‌లో ప్రచారం జరుగుతోంది. ఆదివాసీ, లంబాడా ఉద్యమం ఉచ్ఛస్థితికి చేరుకున్న సమయంలో ఓ పథకం ప్రకారం ఆదివాసీకి చెందిన నగేష్‌ను ఎంపీగానే కొనసాగిస్తారని పార్టీ వర్గాల్లో లీక్ చేశారని ఆయన అనుయాయుల ఆరోపణ. ఇదే వాదనను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదికల రూపంలో చేరేలా పార్టీ ముఖ్య నేతలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించినట్లు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రుల నివేదికల్లో సిట్టింగ్‌లపై సానుకూలత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాగజ్‌నగర్ వచ్చిన సందర్భంలో ఆయన కొందరు ముఖ్య నాయకులతో వ్యక్తిగతంగా చర్చించినట్లు తెలిసింది. ఈ పరిణామాల్లో సిట్టింగ్‌ల్లో చెన్నూర్ నుంచి ఓదెలుకు మినహా తొమ్మిది మందికి సీట్లు ఖాయమనే ప్రచారం అప్పుడే ముఖ్య నాయకులు తమ సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. ఖానాపూర్, బోథ్‌లలో సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వబోతున్న విషయం కూడా మంత్రులకు ముందే తెలుసని సమాచారం . అలాగే ముఖ్యమంత్రికి సన్నిహితంగా వ్యవహరించే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు జోగు రామన్న సైతం ఉమ్మడి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల అధిష్టానానికి సానుకూల నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నీ విశ్లేషిస్తే బోథ్, ఖానాపూర్‌లలో సిట్టింగ్‌లను మారిస్తే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని ముఖ్య నాయకులు స్కెచ్ గీసినట్లు అర్థమవుతోంది. సుమన్ కోరిక మేరకే చెన్నూర్ సిట్టింగులకు సీట్లు ఇచ్చే క్రమంలో చెన్నూర్ నుంచి ప్రభుత్వ విప్‌గా వ్యవహరించిన నల్లాల ఓదెలుకు సీటు రావాలి. పెద్దపల్లి లోక్‌సభ సీటును ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేక్‌కు ఇవ్వడం అనివార్యం. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ ఎంపీ సుమన్‌ను అసెంబ్లీకి పంపించాలనేది వ్యూహం. సుమన్‌కు 2014లోనే చొప్పదండి ఎమ్మెల్యే సీటు ఇస్తారని భావించిగా, వివేక్ చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరడంతో సుమన్‌కు ఆ అవకాశం లభించింది. మారిన పరిస్థితుల్లో వివేక్‌కు ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే చొప్పదండి సుమన్‌కు కేటాయించాలి. కుల సమీకరణల విషయంలో కూడా ఇబ్బందులు ఉండవు. కానీ చొప్పదండి నుంచి పోటీ చేయడం ఇష్టం లేని సుమన్ చెన్నూర్ కోరడంతో ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన సుమన్ వచ్చే ప్రభుత్వంలో మంత్రి పదవి టార్గెట్‌గానే ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. -
రైతు సంక్షేమమే ధ్యేయం
సోన్(నిర్మల్) : రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ అభివృద్ధే మిగతా అన్ని రంగాల అభివృద్ధికి నాంది అనే భావనతో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు 125 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించనున్నట్లు తెలిపారు. జిల్లా సహకార అధికారి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రాల్లో గన్నీ సంచులు, టార్పాలిన్లు, ట్రాన్స్‌పోర్టు వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ధాన్యం రవాణాకు ముగ్గురు కాంట్రాక్టర్లను నియమించినట్లు తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 1.590 చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నల్లా వెంకట్రామిరెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జీవన్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రమేశ్‌రెడ్డి, సర్పంచ్ కృష్ణప్రసాద్‌రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, సర్పంచులు పాల్గొన్నారు. ‘డబుల్’ ఇళ్లకు శంకుస్థాపన మండలంలోని కూచన్‌పెల్లి గ్రామంలో చేపట్టిన 30 డబుల్ బెడ్రూం ఇళ్లకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూమిపూజ చేశారు. గ్రామానికి అదనంగా 25 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ బండి లింగన్న, ఈఈ సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
‘మాన్యం మాయం’పై ప్రభుత్వం ఆరా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో దేవాదాయ భూముల స్వాహా, రికార్డుల గల్లంతు విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. భూముల స్వాహా వెనక జరిగిన తతంగాన్ని ఆరా తీసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం కొందరు రాజకీయ నేతలు దేవాలయ భూములు స్వాహా చేసిన విషయంపై లోకాయుక్త ఆదేశంతో దేవాదాయ శాఖ పాత ఫైళ్లను వెతికి పట్టుకుని వాటిని తర్జుమా చేయిస్తున్న తీరుపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నివేదిక కోరినట్టు తెలిసింది. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రెండు రోజుల్లో ఆ శాఖ కమిషనర్‌తో భేటీ అయి ఈ మొత్తం వ్యవహారంపై చర్చించనున్నారు. జిల్లా పర్యటనలో ఉన్న తాను హైదరాబాద్‌కు రాగానే కమిషనర్‌తో చర్చిస్తానని, నిజాం కాలం నాటి రికార్డుల్లో అందుబాటులో ఉన్న పత్రాల తర్జుమా వ్యవహారాన్ని పర్యవేక్షిస్తానని ఇంద్రకరణ్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి దారుణాలు చోటుచేసుకున్నాయని, వీటిని సరిదిద్దుతామని వెల్లడించారు. అందుబాటులో ఉన్న దేవాలయ భూములను వెంటనే గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. వాటిని గుర్తించి దేవాలయాల వారీగా పాస్ పుస్తకాలను జారీ చేస్తామని, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారని వెల్లడించారు. కబ్జా అయిన భూములను గుర్తించి వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తామని పేర్కొన్నారు. -
నీ అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం
మంత్రి ఇంద్రకరణ్‌కు రేవంత్‌రెడ్డి ప్రతి సవాల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం తో నిర్మిస్తున్న జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి అవినీతిని బహిరంగంగా నిరూపించడానికి సిద్ధమని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రక టించారు. జేవీ ప్రాజెక్టుల్లో అవినీతిని నిరూపించాలంటూ ఇంద్రకరణ్ చేసిన సవాల్‌కు రేవంత్ ఈ మేరకు ప్రతి సవాల్ విసిరారు. సోమవారం ఇక్కడ రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ... తాను చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రావడానికి భయపడి వ్యక్తిగత దూషణలకు దిగితే మంత్రి బతుకేమిటో బయటపెడతానని హెచ్చరించారు. జేవీ ప్రాజెక్టుల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో 17 ప్రాజెక్టులకు హౌసింగ్ బోర్డు భూమిని కేటాయించారని, ఈ ప్రాజెక్టుల ఆదాయంలో వాటా ఇవ్వడంతోపాటు 10 శాతం బలహీన వర్గాల కోసం ఎల్‌ఐజీలు నిర్మించాల్సి ఉందన్నారు. ప్రైవేటు సంస్థలు నిర్మించే గృహ సముదాయాల ఆదాయంలో 3.5శాతం, వాణిజ్య సముదాయాల్లో 5శాతం ప్రభుత్వానికి చెల్లించాల నేది ఒప్పందమని రేవంత్ వివరించారు. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటాతో పాటు పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లు ఇవ్వకుండా ప్రైవేటు సంస్థలు అమ్ముకున్నాయని... దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలని సిఫారసు కూడా చేశారన్నారు. అయితే ఇంద్రకరణ్ ప్రైవేటు సంస్థల నుంచి ముడుపులు తీసుకుని వాటికి ఎన్ఓసీలు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. -
ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌టౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అమూల్యమైందని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని వైఎస్సాఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటరు జాబితాలో తమ పేరును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయాలంటే ప్రతీఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం సక్రమంగా ఉండాలంటే ఓటు హక్కు వినియోగించుకోవడం అవసరమన్నారు. ఓటు అనే ఆయుధంతో సాధారణ ప్రజలు సైతం ప్రజాప్రతినిధులు కావచ్చని తెలిపారు. ఓటు హక్కును దుర్వినియోగం చేయకుండా సరైన విధంగా ఉపయోగించుకుని మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకొన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రైల్యే లైన్ నిర్మాణానికి పంచజెండా.. రూ. 1200కోట్ల వ్యయంతో ఆర్మూర్– నిర్మల్ – ఆదిలాబాద్ వరకు 137 కి.మీ. మేర రైల్వే లైను నిర్మాణం పనుల కోసం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఈ ఏడాదే సర్వే చేయించి భూసేకరణ పూర్తిచేయిస్తామన్నారు. నిధులు విడుదల కాగానే వెంటనే పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఓటరు దినోత్సవం సందర్భంగా ‘ఓటు హక్కు’పై నిర్వహించిన వ్యాసరచన, వకృ్తత్వ, ఉపన్యాస, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మంత్రి ఐకేరెడ్డి బహుమతులను అందజేశారు. అవగాహన ర్యాలీ.. అనంతరం జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యం సక్రమంగా ఉండాలంటే ఎన్నికల వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. మనదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యవ్యవస్థ ఉన్న దేశమని తెలిపారు. ఓటు హక్కుపై విద్యార్థులకు, యువతకు వివిధ స్థాయిల్లో పోటీలు నిర్వహించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో 85 డిజిటల్ క్లాస్ రూంలలో ఓటు హక్కు ప్రాముఖ్యత విద్యార్థులకు వివరించినట్లు చెప్పారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద జెండా ఊపి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఓటరు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ ముందు మానవహారంగా ఏర్పడి అధికారులు, విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీ చైన్ గేట్ మీదుగా వైఎస్సాఆర్ ఫంక్షన్ హాల్ వరకు సాగింది. ఇందులో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి ప్రణీత, జిల్లా వైద్యాధికారి జలపతినాయక్, డీపీఓ నారాయణ, ఐసీడీఎస్ అధికారి విజయలక్ష్మీ, డీఏఎస్డబ్లు్య బాలసురేందర్, డీబీడబ్లు్యఓ నర్సారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.