నీ అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం
మంత్రి ఇంద్రకరణ్‌కు రేవంత్‌రెడ్డి ప్రతి సవాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం తో నిర్మిస్తున్న జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి అవినీతిని బహిరంగంగా నిరూపించడానికి సిద్ధమని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రక టించారు. జేవీ ప్రాజెక్టుల్లో అవినీతిని నిరూపించాలంటూ ఇంద్రకరణ్ చేసిన సవాల్‌కు రేవంత్ ఈ మేరకు ప్రతి సవాల్ విసిరారు. సోమవారం ఇక్కడ రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ... తాను చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రావడానికి భయపడి వ్యక్తిగత దూషణలకు దిగితే మంత్రి బతుకేమిటో బయటపెడతానని హెచ్చరించారు.
జేవీ ప్రాజెక్టుల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో 17 ప్రాజెక్టులకు హౌసింగ్ బోర్డు భూమిని కేటాయించారని, ఈ ప్రాజెక్టుల ఆదాయంలో వాటా ఇవ్వడంతోపాటు 10 శాతం బలహీన వర్గాల కోసం ఎల్‌ఐజీలు నిర్మించాల్సి ఉందన్నారు. ప్రైవేటు సంస్థలు నిర్మించే గృహ సముదాయాల ఆదాయంలో 3.5శాతం, వాణిజ్య సముదాయాల్లో 5శాతం ప్రభుత్వానికి చెల్లించాల నేది ఒప్పందమని రేవంత్ వివరించారు. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటాతో పాటు పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లు ఇవ్వకుండా ప్రైవేటు సంస్థలు అమ్ముకున్నాయని... దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆ సంస్థలపై చర్యలు తీసుకోవాలని సిఫారసు కూడా చేశారన్నారు. అయితే ఇంద్రకరణ్ ప్రైవేటు సంస్థల నుంచి ముడుపులు తీసుకుని వాటికి ఎన్‌ఓసీలు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు.