భగీరథలో అవినీతిని నిరూపిస్తా: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకంలో అవినీతిని నిరూపిస్తానని టీడీఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. శనివారం అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ అవినీతి లేకుండా చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మిషన్ భగీరథపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ చేశారు. అవినీతిని నిరూపించలేకుంటే ప్రభుత్వం, ప్రజలు ఏ శిక్ష విధించినా సిద్ధమేనని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
మిషన్ భగీరథతో సహా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులైన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అవినీతి బాగోతాన్ని శాసనసభలో బయటపెడతాననే భయంతోనే తనను సభ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. సభ నుంచి బయటకు పంపితే, ప్రజాక్షేత్రంలోనే అవినీతిని ఎండగడ్తామని హెచ్చరించారు. అవినీతిపై బహిరంగంగా చర్చించడానికి కేసీఆర్ స్వగ్రామం చింతమడక అయినా, తోటపల్లి అయినా సిద్ధమని రేవంత్ సవాల్ చేశారు.