Mission Bhagiratha
-
అడుగంటిన పాలేరుకు జీవం
సాక్షి, మహబూబాబాద్: మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు జలాశయంలో నీరు అడుగంటడంతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీరు వదిలారు. ఎడమ కాల్వనుంచి రోజుకు 3,300 క్యూసెక్కుల నీటిని పాలేరు జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో నాలుగు జిల్లాలకు పొంచి ఉన్న తాగునీటి ముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోని 2,439 గ్రామాలకు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు, నర్సంపేట మున్సిపాలిటీలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు. వీటి పరిధిలోని సుమారు 22లక్షల జనాభాకు పాలేరు నుంచి వచ్చే గోదావరి నీరే ఆధారం. ఇటీవల పాలేరు జలాశయం అడుగంటే పరిస్థితికి చేరుకుంది. 2.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో నీరు బుధవారం నాటికి 0.49 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ఉన్న నీటితో రెండు, మూడు రోజులకు మించి తాగునీరు అందదని అధికారులు భావించి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు, రాష్ట్ర ఉన్నతాధికారులకు వివరించారు. ఈ నేపథ్యంలో సాగర్ జలాలు విడుదల చేయడంతో ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు విడుదల చేసే నీరు ఏప్రిల్, మే నెలలకు సరిపోనుందని, ప్రస్తుతానికి గండం తప్పినట్లేనని పాలేరు గ్రిడ్ డీఈ మురళీకృష్ణ చెప్పారు. -
గొంతెండిపోతోంది
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గుడమామిడి పరిధి మాన్కుగూడ. ఇక్కడ మిషన్‌భగీరథ నీరు సరిగా రాకపోవడంతో బావి నీటిపైనే గ్రామస్తులు ఆధారపడుతున్నారు. వేసవిలో బావి నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నారు. పటా్నపూర్లోనూ ఇదే సమస్య ఉంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటికి గోస తప్పడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో నీటి కటకట నెలకొంది. బావులు, చేతి పంపులు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావులనుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా జరగాల్సి ఉన్నా.. అంతర్గత పైపులైన్లు, పంపింగ్ మోటార్ల నిర్వహణ లోపంతో పాటు లీకేజీల కారణంగా పల్లెలు అలాగే పట్టణాల్లోనూ తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. చేతి పంపులు, బావుల నుంచి ఎడ్ల బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నామనిఈ ప్రాంతాల ప్రజలుచెబుతున్నారు. అనేకచోట్ల అడుగంటిన బావుల నుంచి పూడిక తీస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి ‘భగీరథ’నీరు సక్రమంగా రాకపోవడంతో ఉన్న ఒకేఒక చేతిపంపు వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాంగూడ, చిత్తగూడ, గట్టెపల్లి, సాలెగూడకు తాగునీటి సమస్య ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలకు భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నీటి కోసం పని మానేస్తున్నాం గట్టేపల్లి, చిత్తగూడ గ్రామాలకు నీళ్లు రావడం లేదు. ఉన్న ఒక్క చేతిపంపు,బావి నుంచి ఎడ్ల బండ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నాం. అన్ని పనులు మానేసి నీటి కోసమే సమయం వెచ్చిస్తున్నాం. –కొడప కర్ణు, గట్టేపల్లి, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా బోరు నీళ్లే తాగుతున్నాం భగీరథ నీళ్లు అన్ని ఇళ్లకు రావడం లేదు. బోరింగ్ పంపు నీళ్లే తాగుతున్నాం. అయితే ఊరిలో ఒకే చేతిపంపు ఉండడంతో నీటి కోసం ఎంతో ఇబ్బంది అవుతోంది. –రాథోడ్ సరితా బాయి, లింగాపూర్, ఆసిఫాబాద్ జిల్లా -
గ్రామీణ ప్రాంతాల నీటిసరఫరాపై పర్యవేక్షణ ఉంచండి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని శాఖ ఇంజనీర్లను కోరారు. మేడారం జాతరపై త్వరలోనే వివిధ విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో శుక్రవారం మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్లు, నదులు తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి ఆ శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ మంత్రికి వివరించారు. -
పాముకాటుతో అటెండర్ మానస మృతి
వరంగల్ :పాముకాటుతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నర్సంపేట మండలం మహేశ్వరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బండి మానస (30) నర్సంపేట మిషన్‌భగీరథ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీన సాయంత్రం ఇంట్లో పని చేస్తున్న క్రమంలో మానసను పాము కాటు వేసింది. దీంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శీలం రవి తెలిపారు. -
జీతం చాలడంలేదని లేఖ.. మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్య
నల్లగొండ క్రైం: నెల వారి జీతం సక్రమంగా ఇవ్వకపోవడంతోనే ఆర్థిక ఇబ్బందుల కారణంగా మిషన్ భగీరథ 35 ఎంఎల్‌డీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సింగం పుష్పలత ఆత్మహత్య చేసుకుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గత 6నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. ఈమేరకు నల్లగొండ ఎస్పీని కలిసి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు. పుష్పలత ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌ను వారికి అందజేశారు. పుష్పలత భర్త మహేష్ 10 నెలల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు భార్య ఆత్మహత్య చేసుకుందన్నారు. చిన్నారుల అనాథలుగా మారారన్నారు. కార్మికుల వేతనం రూ.19 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.9వేలు ఇవ్వడం అన్యామన్నారు. కార్మికుల పొట్ట కొడుతున్నప్పటికీ అధికారులు, మంత్రి, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాలియా: మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగిని ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హాలియా మున్సిపాలిటీలోని సాయిప్రతాప్ నగర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్) మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన సింగం పుష్పలత(26)కి చిన్నవయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. మేనమామ అయిన జోలం సాంబయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు. పుష్పలతను ఎనిమిదేళ్ల క్రితం నల్లగొండలోని పానగల్‌కు చెందిన సింగం మహేష్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు. మహేష్ పానగల్‌లోని మిషన్ భగీరథలో కాంట్రాక్టు పద్ధతిలో కంట్రోల్ రూం ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమార్తె సాన్విత, కుమారుడు సాయినందన్ ఉన్నారు. మహేష్‌కు వచ్చే జీతం సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో గతేడాది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి చెందడంతో పుష్పలతకు హాలియా మిషన్ భగీరథలో కాంట్రాక్టు ఉద్యోగిగా అవకాశం కల్పించారు. ఈమె 6 నెలల క్రితం హాలియా పట్టణంలోని సాయిప్రతాప్ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇంటి యజమాని గమనించి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండలోని ఏరియా ఆస్పత్రికి తరలించి, అనంతరం బంధువులకు అప్పగించారు. మృతురాలు మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. కాగా.. ఏడాది క్రితం తండ్రి, ఇప్పుడు తల్లిని కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. చావుకు ఎవరూ కారణం కాదు.. సూసైడ్ నోట్లో ఇలా ఉంది.. పుష్పలత మృతదేహం సమీపంలో సూసైడ్ నోట్ కనిపించింది. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, మిషన్ భగీరథలో చేసే ఉద్యోగానికి తనకు వచ్చే జీతం రూ. 9,500లు సరిపోకపోవడం, అది కూడా రెండు, మూడు నెలల వరకూ రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని పేర్కొని ఉంది. తన కడుపులో గడ్డ కావడంతో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్‌కు రూ. 2లక్షలు ఖర్చు అవుతుందనడంతో ఆర్థిక స్థోమత లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి ఉంది. -
‘భగీరథ’కు అవార్డుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు అంశం రెండు ప్రభుత్వాల మధ్య తాజాగా వివాదం రాజేసింది. ఈ పథకానికి జాతీయ అవార్డు లభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని కేంద్రం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. కేసీఆర్ సర్కార్ పేర్కొన్నట్లుగా జాతీయ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకాన్ని తాము మదింపు చేయలేదని.. తెలంగాణలో 100% నల్లాల ద్వారా క్రమబద్ధమైన తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు తాము నిర్ధారించలేదని స్పష్టం చేసింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వమే 100% నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొందని వివరించింది. కేవలం ఫంక్షనాలిటీ అసెస్మెంట్–2022 కింద జాతీయ జల్ జీవన్ మిషన్ నిబంధనలను అనుసరించి రోజుకు 55 లీటర్ల తలసరి తాగునీరు అందుతోందో లేదోనని పరిశీలించడంతోపాటు నీటి నాణ్యత బీఎస్ఐ 10,500 ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదోనని మాత్రమే పరిశీలించామని కేంద్ర జలవనరుల శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ఆ నివేదికలోని గణాంకాల ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా 8% నివాసాలకు నిత్యం తలసరి 55 లీటర్లకన్నా తక్కువ తాగునీరు అందుతోందని, మొత్తం నమూనాల్లో 5% నివాసాల్లో నీటి నాణ్యత జాతీయ జల్‌జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం లేదని గుర్తించినట్లు వివరించింది. అవార్డు ఆ విభాగంలోనే.. గ్రామీణ గృహసముదాయాలకు క్రమబద్ధమైన నీటి సరఫరా విభాగంలో మాత్రమే తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసిన ఆదివారం బహూకరిస్తున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ వివరణ ఇచ్చింది. నీటి సరఫరాలో క్రమబద్ధత అనేది మొత్తం పనితీరు మదింపు కోసం స్వీకరించే అనేక అంశాల్లో ఒకటి మాత్రమేనని స్పష్టం చేసింది. 100% నల్లా నీటి కనెక్షన్లను ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం అవసరమైన గ్రామ పంచాయతీల ద్వారా ధ్రువీకరణ జరగలేదని తెలిపింది. పదేపదే అబద్ధాలెందుకు?: ఎర్రబెల్లి ‘గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నది మిషన్ భగీరథ ద్వారానే. తెలంగాణలో 100% ఇళ్లకు తాగునీరు అందుతోందని మీ జలజీవన్ మిషన్ వెబ్సైట్లోనూ ఉంది. గ్రామీణ గృహసముదాయాల నీటి సరఫరాకు అవార్డు ఇస్తే అది మిషన్ భగీరథకు కాకుండా మరి దేనికి వచ్చినట్లు అవుతుంది?’అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. కేంద్రం తీరును తప్పుబడుతూ శనివారం రాత్రి ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అభ్యంతరాలను లేవనెత్తిన లేఖలోనే మిషన్ భగీరథ పథకాన్ని సమీక్షించామని చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. గ్రామ పంచాయతీలన్నీ ధ్రువీకరించాలని తీర్మానాలు చేయలేదని కొత్త మెలిక పెట్టడం ఏమిటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అబద్ధాలు పదేపదే చెప్పడం వల్ల అవి నిజాలు కావనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో షాకింగ్ ఘటన.. -
‘బోగస్ ప్రాజెక్టుకు కేంద్రం అవార్డులా?’
జోగిపేట (ఆంధోల్): మిషన్ భగీరథ బోగస్ ప్రాజెక్టు అని, ఈ పథకానికి కేంద్రం అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ఈ ప్రాజెక్టును రూ.40 వేల కోట్లతో చేపట్టగా పెద్దమొత్తంలో కమీషన్లు తిన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌కు ఎందుకు అవార్డులిస్తోందని ఆమె ప్రశ్నించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రూ.100 కోట్ల సంక్షేమ నిధి ఏమైందని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా.. దళిత ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతికిరణ్ ఏనాడూ ప్రశ్నించలేదని షర్మిల విమర్శించారు. నేరెళ్ల, మరియమ్మ ఘటనలపై ఈ ఎమ్మెల్యే నోరు మెదపలేదని మండిపడ్డారు. ఆయన చంటి క్రాంతికిరణ్ కాదని, కంత్రీ కిరణ్ అని షరి్మల ఎద్దేవాచేశారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్‌ల మాటల యుద్ధం -
వణికిపోతున్న భద్రాద్రి వాసులు.. మిషన్ భగీరథ అధికారుల కీలక ప్రకటన
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మిషన్ భగీరథ ద్వారా విడుదల చేస్తున్న నీరు కలుషితమైంది. కుళాయి ద్వారా మట్టి, మురికి రూపంలో నీరు వస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ అధికారులు మంగళవారం కీలక ప్రకటన చేశారు. భద్రాచలంలో మిషన్ భగీరథ కింద సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితం అయ్యిందని వెల్లడించారు. తాగునీటి పైపులు, నల్లాలు పగిలిమురికి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. దీంతో భద్రాచలం ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగొద్దని అధికారులు హెచ్చరించారు. వీలైనంత త్వరగా పైపులు, నల్లాలు శుభ్రం చేసి తాగునీరు అందిస్తామని వెల్లడించారు. అప్పుడు కూడా కాచి, చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని సూచించారు. ఒకవేళ నీరు కలుషితం అయినట్లు అనుమానం వస్తే 7995660289, 9948139928 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు. చదవండి: క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు -
భద్రాచలంలో మిషన్ భగీరథ నీరు కలుషితం
-
ప్రశంసలు సరే.. పైసలివ్వండి: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: శుద్ధి చేసిన మంచి నీరందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిం దంటూ కేంద్రం ప్రశంసించినందుకు ధన్యవాదాలని.. ప్రశంసలతో పాటు నిధులు కూడా ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు రాష్ట్రంలో మిషన్ భగీరథ అమలుకు వెంటనే రూ.19 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర జలశక్తి, పీఆర్ శాఖలు, ఎన్ఐఆర్డీ, యూని సెఫ్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ వాటర్ శానిటేషన్ హైజిన్ కాంక్లేవ్–2022 సదస్సులో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇంటింటికీ శుద్ధి చేసిన మంచి నీరందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని ప్రశంసించారు. కేంద్రమంత్రి ప్రశంసలకు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందిస్తూ ధన్యవా దాలు తెలిపారు. మిషన్ భగీరథ కింద రాష్ట్రం లోని 100 శాతం గ్రామీణ ఆవాసాలకు తాగు నీటి సౌకర్యం కల్పించామన్నారు. ఇంటింటికీ నల్లా పథకంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. -
మిషన్ భగీరథ పైపులైన్‌ను ఢీకొట్టిన లారీ
మిషన్ భగీరథ పైపులైన్‌ను లారీ ఢీకొన్న ఘటనలో నీరు భారీగా ఎగసిపడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఈద్గామ్ చౌరస్తా నుంచి భైంసా వెళ్లే మార్గంలో మిషన్ భగీరథ పైపులైన్ వద్ద నిలిపి ఉన్న లారీని, భైంసా నుంచి వస్తున్న టిప్పర్ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీ ముందు భాగం పైపును ఢీకొట్టడంతో ఒక్కసారిగా నీరు ఎగసిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అక్కడికి చేరుకుని త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. – నిర్మల్ చైన్‌గేట్ -
Photo Feature: ఐడియా అదిరింది సారు...
ఇవి నిర్మల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పశువులు. రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించే పశువులపై మున్సిపల్ సిబ్బంది ఎంసీఎన్ అని రాస్తారు. దీంతో వాటిని సదరు పశువుల యజమానులు మళ్లీ రోడ్లపైకి వదలకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ అవే పశువులు మళ్లీ రోడ్డుపై కనిపిస్తే వాటిని కార్పొరేషన్ సిబ్బంది పట్టుకుని గోశాలకు తరలిస్తారు లేదా అడవిలో వదిలేస్తారు. గేదెలు, మేకల వంటివి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రయాణికులకు ఆటంకం కలిగించడంతోపాటు ప్రమాదాలకు కూడా కారణమవుతున్న నేపథ్యంలో వీటికి చెక్ చెప్పేందుకు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఇలా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్. అవ్వకెంత కష్టం.. చేతితో చిల్లిగవ్వలేదు.. ఉన్న ఒక్క కొడుకు బతుకుతెరువు కోసం వెళ్లి వేరే ఊరిలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కాసిపేట మండలంలోని లక్ష్మీపూర్‌లో ఉంటున్న కన్న కూతురును చూడాలనిపించింది ఈ అవ్వకు. అయితే, ప్రయాణానికి డబ్బులు లేవు.. కానీ కూతురును చూడాలనే కోరిక ముందు ఇదేమీ కష్టం అనిపించలేదు. దీంతో ఇలా కాలినడకన నెత్తిన బట్టలమూటతో బయలుదేరి వెళ్తూ సాక్షి కెమెరాకు కనిపించింది. – సాక్షి ఫోటోగ్రాఫర్, మంచిర్యాల వినూత్న యంత్రం.. పనిలో వేగం జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన రైతు ముత్తినేని సత్యం పవర్ వీడర్ యంత్రానికి మార్పులు చేర్పులు చేసి మరింత సులభంగా సాగు పనులు చేస్తుండడం ఇతర రైతులను ఆకట్టుకుంటోంది. పత్తి, మిరప పంటల సాగు చేసే సత్యం రూ.55 వేలతో పవర్ వీడర్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. స్వతహాగా మెకానిక్ అయిన ఆయన యంత్రానికి కొన్ని మార్పులు చేశాడు. నడుస్తూ పనిచేయాల్సిన పవర్ వీడర్‌ను బైక్‌లా మార్చేందుకు ముందు భాగంలో మూడో చక్రాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి తోడు వెనుక భాగంలో ట్రాక్టర్ మాదిరి గొర్రు పైకి.. కిందకు లేపేలా బిగించాడు. దీంతో ఎన్ని ఎకరాలైనా సరే.. కూర్చుని మరీ పత్తి, మిరప తోటలో గుంటుక తీయడం, కలుపు తీయడం సులభమవుతోందని తెలిపాడు. పత్తి, మిరప, కూరగాయల సాగు చేసే రైతులకు ఈ యంత్రం ఉపయోగకరంగా ఉంటుందని సత్యం వెల్లడించాడు. ఉప్పొంగిన ‘భగీరథ’ మహబూబ్‌నగర్ మండలంలోని మన్యం కొండ స్టేజీకి సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ వాల్వ్ నుంచి గురువారం నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ ఎత్తున నీరు లీకేజీ కావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. దీనిపై మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణను వివరణ కోరగా.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి, మహబూబ్‌నగర్ మండలం రాంరెడ్డి గూడెంలోని వాల్వులు కొంత కాలంగా లీక్ అవుతున్నాయని, వాటికి మరమ్మతు చేయడానికి వీలుగా మన్యంకొండ వద్ద నీరు విడిచామని తెలిపారు. నీరు మొత్తం ఖాళీ అయితేనే వాల్వు మరమ్మతు చేయడానికి వీలవుతుందని, నీరు ఖాళీ అయ్యాక తాను వాల్వ్‌లను పరిశీలించి లీకేజీలను సరిచేయించానని ఆయన వివరించారు. – జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) -
ఎగిసిపడిన ‘భగీరథ’
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్ – తోటపల్లి రాజీవ్ రహదారి సమీపంలో మంగళవారం మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలింది. దీంతో నీరు ఉవ్వెత్తున్న ఎగిసిపడింది. పెద్దలైన్ కావడం.. ప్రెషర్ ఎక్కువగా ఉండటంతో రాజీవ్ రహదారికి ఇరువైపులా నీళ్లు విరజిమ్మాయి. దీంతో కొంతసేపు ప్రయాణానికి ఆటంకం కలిగింది. సమీపంలోని శనగ పంట పూర్తిగా నీట మునిగింది. సమాచారం తెలుసుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. చదవండి: (హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం) -
‘కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథాకాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించడం సంతోషంగా ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కార్యాలయంలో బుధవారం దయాకర్‌రావు మాట్లాడుతూ.. రాష్టంలోని ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ నాలుగేళ్ళ క్రింద విషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. దీనికి 46 వేల 123 కోట్లు అంచనాతో చేపట్టినట్లు పేర్కొన్నారు. కానీ ఈ బడ్జెట్ కంటే తక్కువగా బడ్జెట్ ఖర్చు జరిగిందన్నారు. 33 వేల కోట్ల ఇప్పటికే ఖర్చు చేశామని, కేంద్రం కూడా తెలంగాణాను ఆదర్శంగా తీసుకొని మిషన్ భగీరథ పేరు మార్చి జలజీవన శక్తి మిషన్ పేరుతో ఈ పథకం అమలు చేస్తోందన్నారు. చదవండి: ‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్ మాయం ‘మిషన్ భగీరథకు ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వటం లేదు. కేంద్రానికి సీఎం లేఖలు రాశారు.. ఇతర రాష్ట్రాలు కూడా మిషన్ భగీరథను అమలు చేస్తోంది. 40 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం.. గుజరాత్ కంటే మంచి పథకం ఇది. దేశంలో మిగితా రాష్ట్రాల ప్రతినిధులు కూడా తెలంగాణలో మిషన్ భగీరథను పరిశీలించారు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణను మార్చలన్న ఉద్దేశ్యంతో పెట్టింది. కేంద్రం బోర్ నీళ్లతో నీళ్లు ఇస్తోంది. ఇక్కడ కృష్ణ గోదావరి నీళ్లని మంచి నీటిని ఇస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో నిధులు ఇస్తూ ఇక్కడ మాత్రం ఇవ్వటం లేదు. చదవండి: త్వరలోనే సీఎం కేసీఆర్ శుభవార్త రాష్ట్రంలో 23 వేల 787 అవాసాలకు నీరు అందిస్తున్నాం. రెండేళ్లుగా అడుగుతున్న నిధులు రాలేదు. ఫ్లోరైడ్ రహిత తెలంగాణగా కేంద్రం ప్రకటించింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్‌లో గొప్పగా తెలంగాణను పొగిడారు. మిగితా రాష్ట్రాలకు ఇచ్చే 2000 కోట్లు ఇక్కడ కూడా మెయింటనెన్స్ కోసమైన ఇవ్వాలని ఆడిగాం. మా ఇంజనీర్ల సలహాలు తీసుకున్నారు. మా మిషన్ భగీరథను కాపీ కొట్టి పథకం అమలు చేస్తున్నారు.. నిధులు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. -
కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 2 కోట్ల రూపాయల విలువ చేసే మిషన్ భగీరథ సామాగ్రి దగ్ధమైంది. హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత గదుల్లో మిషన్ భగీరథ మీటర్లు, పైప్ లైన్ సామాగ్రి నిల్వచేశారు. అందులో అర్థరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఉవ్వెత్తున ఎగిసి పడిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చేసరికే మిషన్ భగీరథకు సంబంధించిన సామాగ్రి బుగ్గిపాలు అయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. సుమారు రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్ మాయం
సాక్షి, హైదరాబాద్: అంగవైకల్యం.. అంతుపట్టని అనారోగ్యం.. మరుగుజ్జుతనం.. బుద్ధిమాంద్యం.. వయసు తగ్గట్టుగా ఎదగని శరీరం.. ఇవి ఫ్లోరైడ్ బారిన పడిన వారి ఆనవాళ్లు. ఫ్లోరైడ్ రక్కసి కాటుకు బలైన కుటుం బాలెన్నో.. జీవచ్ఛవాలుగా బతుకులీడ్చినవారెందరో.. ఇది ఒకప్పుడు. మరిప్పుడో? దాని పీడ విరగడైంది. ఇప్పుడు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారింది. దాని కోసం ‘భగీరథ’ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లేవని పార్లమెంటు సాక్షిగా కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ రక్కసి బారిన పడి అల్లాడుతున్న 967 ఆవాసాలకు ఊరట కలిగింది. ‘మిషన్ భగీరథ’పథకం ప్రవేశపెట్టడానికి ముందు.. అంటే 2015 ఏప్రిల్ ఒకటి నాటికీ రాష్ట్రంలో 976 ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలుండగా.. గత నెల ఒకటో తేదీ నాటికీ ఈ సంఖ్య సున్నాకు చేరుకుంది. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద రక్షిత తాగునీరు అందించడంతో అది జాడ లేకుండా పోయింది. తొలిసారి దర్శిలో గుర్తింపు భూగర్భజలాల్లో తొలిసారి ఫ్లోరైడ్ ఆనవాళ్లు 1937లో ప్రకాశం జిల్లా దర్శిలో, 1945లో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం బట్లపల్లి(పాత)లో కనిపించాయి. ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకునేందుకు ఉపరితల నీటివనరుల సేవనమే మార్గమని శాస్త్రవేత్త డాక్టర్ ఎంకే దాహూర్ అప్పటి నిజాం ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు నిజాం నవాబు చర్లగూడ, ఇబ్రహీంపట్నం, పసునూరు, తంగడిపల్లి, మునుగోడు చెరువులను తవ్వించినా వర్షాభావ పరిస్థితులు, కరువుతో అవి రానురాను అడుగంటిపోయాయి. దీంతో ఫ్లోరోసిస్ భూతం ఉగ్రరూపం దాల్చింది. 1985లో బట్లపల్లిలో ప్రపంచం లోనే అత్యధిక పరిమాణం(28 పీపీఎం)లో ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన మర్రిగూడ, నాంపల్లి, చండూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు మండలాల ప్రజలు అనివార్యంగా బోరుబావుల నీటినే సేవించాల్సి వచ్చింది. 2003లో పోరుయాత్రలో భాగంగా మర్రిగూడకు వచ్చిన ప్రస్తుత సీఎం కేసీఆర్.. ఫ్లోరైడ్ బాధితులను చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే చౌటుప్పల్‌లో మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించి 2017 చివరి నుంచి ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించారు. మిషన్ భగీరథ ఫలితంగానే.. తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారేం దుకు మిషన్ భగీరథ పథకమే కారణమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలం గాణ ఆవిర్భావానికి ముందు కేవలం 5,767 గ్రామాలకు మాత్రమే తాగునీటి సదుపాయం ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలో 23,968 ఆవాసాలకు, 120 పట్టణాలకు మిషన్ భగీరథ రక్షిత మంచినీరందుతోందని చెప్పారు. భగీరథ నీటితో ఫ్లోరైడ్ విముక్తి మిషన్ భగీరథ నీరు రాకమునుపు ఊరంతా ఫ్లోరైడ్ నీరే శరణ్యం. ఫ్లోరైడ్ నీరు తాగి, ఒంటి నొప్పులు ఇతర సమస్యలతో బాధపడేవారు. ఇప్పుడు అలాం టి పరిస్థితి లేదు. గతేడాది నుంచి రక్షిత నీరు ఇంటింటికీ సరఫరా చేస్తున్నాం. –కొట్టం మాధవిరమేష్ యాదవ్, సర్పంచ్ తమ్మడపల్లి, మర్రిగూడ మండలం, నల్లగొండ జిల్లా ఆరోగ్యం కుదుటపడింది ఫ్లోరైడ్ వల్ల చాలామంది మా మండలంలో వికలాంగులుగా మారారు. ఈ నీరు తాగినప్పుడు కాళ్లు, చేతులకు నొప్పులు ఉండేవి. ఏ పనీ చేయలేని పరిస్థితి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు ఇస్తున్నారు. అనారోగ్య సమస్యలు పోయాయి. –అల్వాల అంజయ్య, తిరుగుండ్లపల్లి, మరిగూడ మండలం -
‘భగీరథ’ గుట్టపై కలకలం
గజ్వేల్: మిషన్ భగీరథ పథకానికి కేంద్ర బిందువుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ప్రాంతం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండ మిషన్ భగీరథ గుట్టపై సోమవారం కలకలం రేగింది. తమను విధుల నుంచి తొలగించారని ఆగ్రహంతో ఉన్న భగీరథ పథకం ఔట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లేలా తమ నిరసనకు వ్యూహాత్మకంగా గజ్వేల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 200 మందికిపైగా ఉద్యోగులు వివిధ దారుల్లో తరలివచ్చి ఒక్కసారిగా మిషన్ భగీరథ హెడ్‌వర్క్స్‌కు చేరుకొని మెరుపు ఆందోళనకు దిగారు. ఓవర్‌హెడ్ ట్యాంకులపైకి ఎక్కి తమను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. సుమారు ఏడు గంటలకుపైగా ఈ ఆందోళన కొనసాగడంతో పోలీసు, రెవెన్యూ, మిషన్ భగీరథ అధికారులు ఉరుకులు, పరుగులు పెటాల్సి వచ్చింది. రాత్రి 7 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఆ తర్వాత పోలీసులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నచ్చజెప్పి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చూస్తామని, ఆందోళన చేపట్టినందుకు కేసులు ఉండవని హామీ ఇవ్వడంతో వారు స్వచ్ఛందంగా ట్యాంకుల పైనుంచి కిందకు దిగారు. ఆ తర్వాత వారందరినీ బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో.. మిషన్ భగీరథ పథకంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేయడానికి 2015లో రాష్ట్రవ్యాప్తంగా 709 మందిని ఎంపిక చేశారు. ఇందులో 662 మంది వర్క్ ఇన్స్పెక్టర్లుగా, 47 మంది జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వీరి పోస్టులను ఏడాదికోసారి రెన్యువల్ చేస్తుంటారు. ఈసారి మార్చి 31న వీరిని రెన్యువల్ చేయాల్సి ఉండగా అది జరగలేదు. జూన్ 30 వరకు అలాగే విధుల్లో కొనసాగించారు. ఆ తర్వాత జూలై 1 నుంచి విధుల్లోకి రావొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ పరిణామంతో ఆందోళనకు గురైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ రూపాల్లో తమ నిరసనను కొనసాగిస్తున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. తమను యథాతథంగా విధుల్లో కొనసాగించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తే కనీసం ఈ ఏడాదైనా కొనసాగించి వచ్చే ఏడాది తొలగించాలని చెబుతూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి వీరికి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ సమస్యను తెలపాలన్న భావనతో వ్యూహాత్మకంగా గజ్వేల్‌ను ఆందోళనకోసం ఎంచుకున్నారు. -
కనీస మట్టం..ఇది నీటి కష్టం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస నీటి మట్టానికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాలు తమ అవసరాలకోసం నీటిని వినియోగిస్తుండటంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టు నిల్వలు కనీస నీటి మట్టం 834 అడుగులకు చేరింది. వేసవి ఇంకా పూర్తి స్థాయిలో ఆరంభం కాకముందే నిల్వలు తగ్గడం ఇరు రాష్ట్రాలకు మున్ముందు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశాల నేపథ్యంలో మున్ముందు వినియోగంపై నియంత్రణ అవసరమని కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. సాగర్ ఒక్కటే దిక్కు..? ఈ సీజన్లో విస్తారంగా కురిసిన వర్షాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 1,784 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తంగా 675 టీఎంసీల నీటిని వినియోగించుకున్నాయి. ఇందులో ఏపీ 513, తెలంగాణ162 టీఎంసీల వినియోగం చేసినట్లు కృష్ణాబోర్డు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సైతం శ్రీశైలం ద్వారా వివిధ అవసరాల నిమిత్తం ఇరు రాష్ట్రాలు 3,591 క్యూసెక్కుల నీటిని వినియోగం చేసుకుంటున్నాయి. దీంతో గురువారం ఉదయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 885 అడుగులకు గానూ కనీస నీటి మట్టం 834 అడుగులకు పడిపోయింది. నిల్వలు 215 టీఎంసీలకు గానూ 53.85 టీఎంసీలకు చేరాయి. కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి నీటిని వినియోగించాలంటే కృష్ణాబోర్డు అనుమతి తప్పనిసరి. ఇప్పటికే బోర్డు, శ్రీశైలంలో రోజుకు 440 క్యూసెక్కుల మేర నీరు ఆవిరవుతోందని, దీంతో మట్టాలు మరింత వేగంగా తగ్గే అవకాశాలున్న దృష్ట్యా, శ్రీశైలం నుంచి నీటి విడుదలను తగ్గించాలని వారం కిందట సూచించింది. అయినప్పటికీ వినియోగం కొనసాగుతుండటంతో నిల్వలు కనీస నీటి మట్టానికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాగు అవసరాలకు నాగార్జున సాగర్‌పైనే అధారపడాల్సి ఉంటుంది. సాగర్‌లో ప్రస్తుతం 590 అడుగులకు గానూ 551 అడుగుల్లో 212 టీఎంసీల నిల్వలున్నాయి. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 86 టీఎంసీల మేర ఉంటుంది. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది. మిషన్ భగీరథ మట్టాల్లో మార్పులు.. మిషన్ భగీరథ కింద తాగు నీటి అవసరా లకు ఏటా 60 టీఎంసీల నీటి అవసరాలను అధికారులు గుర్తించి, దీనికి అనుకూలంగా కృష్ణాబేసిన్‌లోని 15, గోదావరి బేసిన్‌లోని 21 రిజర్వాయర్ల పరిధిలో తాగునీటిని తీసుకునేలా కనీస నీటి మట్టాలను గతంలో నిర్ధారించారు. ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు తాగునీటికి 30 టీఎంసీల అవసరాలుంటాయని ఇప్పటికే సాగునీటి శాఖకు ప్రతిపాదించారు. ప్రాజెక్టుల్లో రెండు సీజన్లకు సరిపడేంత నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో పలు ప్రాజెక్టుల పరిధిలో నీటి మట్టాలను పెంచాలని మిషన్ భగీరథ ఇంజనీర్లు ప్రతిపాదించారు. జూరాలలో కనీస నీటి మట్టాలు గతంలో 313.75 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం దాన్ని 315 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఎస్సారెస్పీలో గతంలో 320.35 మీటర్లు ఉండగా..322.67 మీటర్లకు, కడెంలో 204.21 మీటర్లకు గానూ 206.89 మీటర్లు, కొమరంభీమ్లో 234.60 మీటర్లకు గానూ 236.10 మీటర్లకు పెంచుతూ ప్రతిపాదించారు. ఇవి ప్రస్తుతం సాగునీటి శాఖ పరిశీలనలో ఉన్నాయి. -
తెలంగాణ దేశానికే ఆదర్శం
నాంపల్లి: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజన్ తెలంగాణ’ ఇంటరాక్టివ్ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన గుజరాత్, కేరళ రాష్ట్రాలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. మొన్న ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు వంటి పథకాలను తీసుకువస్తామని మేనిఫెస్టోలో పార్టీలు పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. ఐదేళ్లలోనే కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలు గమనిస్తున్నారని, మిషన్ భగీరథ అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథం లో పయనింపజేస్తున్నట్లు వివరించారు. మిషన్ భగీరథ కింద 1.70 లక్షల పైపులైన్లు వేసి ఇంటింటికి తాగేందుకు మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల ప్రోత్సాహానికి మంత్రి కేటీఆర్ నిత్యం తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, పరిశ్రమల స్థాపనతో ఉపాధి, ఉత్పత్తులను పెంపొందించుకోవడానికి వీలుంటుందని పదే పదే చర్చిస్తున్నారని వివరించారు. భూసేకరణతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయ నున్న టెక్స్టైల్ పార్కు ఆలస్యమవుతోందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించి కొద్ది నెలల్లోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తామన్నారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి ప్రభుత్వానికి పారిశ్రామిక వేత్తలు సూచనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్య క్షుడు కరుణేంద్ర జాస్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు రమకాంత్ ఇనానీ తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా మిషన్ ‘భగీరథ’
సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశవ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన కేంద్రానికి ఉన్నదని కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని, ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు అమలు చేయడంతోపాటు, మురుగు నీటిని (సీవరేజ్) ట్రీట్ చేసి ఆ నీళ్లను వ్యవసాయ, గృహోపయోగానికి ఉపయోగించే విధానాలు అవలంబించాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రగతిభవన్‌లో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథపథకం గురించి షెకావత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులు మిషన్ భగీరథ స్వరూపాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఆర్థిక సహకారం ఇవ్వండి.. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ‘తెలంగాణ రాష్ట్రంలో 24 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతి రోజూ మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకం చేపట్టాం. రాష్ట్రంలో చాలా చోట్ల మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది. చాలా చోట్ల ఫ్లోరైడ్ సమస్య ఉండేది. అసలు తాగునీళ్లే దొరకక పోయేది. దొరికిన నీళ్ళు కూడా శుభ్రంగా ఉండకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు. అందుకే గోదావరి, కృష్ణా జలాలను శుద్ధి చేసి ప్రజలకు అందివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. పథకం దాదాపు పూర్తయింది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ పథకం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు ఇబ్బందులు తప్పాయి. వారి జీవన పరిస్థితులు మెరుగయ్యాయి. రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభాను కూడా అంచనా వేసుకుని, అప్పటి అవసరాలు కూడా తీర్చే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశాం. ఇలాంటి పథకం దేశమంతా అమలయితే మంచిది. ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడొద్దు’ అని ముఖ్యమంత్రి వివరించారు. ఇదే సమయంలో ‘దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధిస్తోంది. కాబట్టి మిషన్ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించండి’ అని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. 11వ శతాబ్ధంలోనే కాకతీయలు వేలాది చెరువులు తవ్వించారని, సమైక్య పాలనలో అవన్నీ నాశనమయ్యాయని సీఎం చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో జరిగిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి వివరించారు. 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేయగలిగామని వెల్లడించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి, తాను త్వరలోనే మరోసారి తెలంగాణలో పర్యటించి క్షేత్ర స్థాయిలో ఈ పథకాల అమలును స్వయంగా చూస్తానని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వర్రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ భగీరథకు జాతీయ జల్ మిషన్ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ : నీటి యాజమాన్య పద్ధతులు, జల సంరక్షణ, నీటి వినియోగంలో ఉత్తమ విధానాల అమలుకుగానూ జాతీయ జల్ మిషన్ ప్రదానం చేసే అవార్డుల్లో తెలంగాణకు 3 అవార్డులు దక్కాయి. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఢిల్లీలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం వల్ల తాగు నీటి సామర్థ్యం 20% పెంపుదల విభాగంలో మొదటి బహుమతి కింద రూ.2 లక్షల చెక్కును రాష్ట్ర మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి అందుకున్నారు. జలవనరుల సమాచారం, నిర్వహణ లో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నడిచే తెలం గాణ వాటర్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం రెండో స్థానంలో నిలవగా ఆ అవార్డును రాష్ట్ర సాగు నీటి శాఖ తరఫున సీఏడీఏ కమిషనర్ మల్సూర్ అందుకున్నారు. ప్రమాదకర స్థితికి చేరిన భూగర్భ జలాల పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యలకుగాను రాష్ట్ర భూగర్భ జల విభా గం 3వ స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అందజేశారు. -
అడ్డంగా దొరికిపోయిన భగీరథ అధికారులు
సాక్షి, వికారాబాద్: మిషన్ భగీరథ పథకంలో అందినకాడికి దోచుకుంటున్నారు కొందరు అధికారులు. తాజాగా బిల్లులు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన మిషన్ భగీరథ అధికారులు అడ్డంగా దొరికిపోయారు. జిల్లాలోని తాండూరులో మంగళవారం ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గురువయ్య మిషన్ భగీరథ కాంట్రాక్టర్. అతనికి రూ.20 లక్షలు బిల్లులు రావాల్సి ఉంది. అందుకోసం నెలరోజులుగా డబ్ల్యూఎస్‌డీఈ శ్రీనివాస్ చుట్టూ తిరుగుతున్నాడు. బిల్లులు చెల్లించడానికి ముందు తమ జేబులు తడపాలని శ్రీనివాస్ కోరాడు. రూ.30 వేలు ముట్టచెపితేనే బిల్లులు చేస్తానని చెప్పడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. వారి సూచన మేరకు కాంట్రాక్టర్ డీఈ శ్రీనివాస్‌కు రూ.30 వేలు డబ్బులు ఇవ్వబోయాడు. అతను వారించి వర్కింగ్ ఇన్స్పెక్టర్ మహేందర్‌కు ఇవ్వాలని సూచించడంతో అతనికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఇద్దరి అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. -
కేంద్రం కరుణించలేదు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : మాటలు కోటలు దాటతాయి గానీ చేతలు గడప కూడా దాటవన్నట్లుంది రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ఈ దేశానికే ఆదర్శమని నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించినా కేంద్రం మాత్రం వీటికి పైసా విదిల్చడం లేదు. పురోగతిలో ఉన్న ఈ ప్రాజెక్టు, పథకాల అమలుకు కేంద్ర సాయం కోసం ఎదురుచూసి విసుగెత్తిన రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు దృష్టి సారించింది. ఆ దిశగా అవసరమైన వనరు లను గుర్తించే పనిలో పడింది. కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన మిషన్ భగీరథకు తగిన ఆర్థిక సహాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం కోరినట్లుగా తగినన్ని నిధులు కేటాయిస్తే మిగతా ప్రాజెక్టులకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరో రూ.30 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.15 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అయ్యే ఖర్చు దీనికి అదనం. వీటితో పాటు చిన్నా చితకా ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు అవసరం. ప్రాజెక్టులు, పథకాల అమలుతో పాటు మౌలిక సదుపాయాలు, పేదరిక నిర్మూలన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణం పొందింది. దీంతో మళ్లీ రుణానికి వెళ్లడం కంటే సొంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉంది. భూముల వేలం ద్వారా రూ.10 వేల కోట్లు! ఈ ఏడాది ప్రాజెక్టులు, ఇతరత్రా పనులు చేపట్టడానికి అవసరమైన రూ.10 వేల కోట్లను భూములను వేలం వేయడం ద్వారా రాబట్టుకోవాలని భావిస్తోంది. కోకాపేటలో హెచ్ఎండీఏకు ఉన్న 140 ఎకరాలు, రాయదుర్గంలో టీఎస్ఐఐసీకి ఉన్న 180 ఎకరాలను వేలం వేస్తే రూ.10 వేల కోట్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కోకాపేట, రాయదుర్గం ప్రాంతాలు ఇప్పుడు రాజధానిలో అత్యంత విలువైన ప్రాంతాలు. వేలం వేస్తే ఎకరాకు కనిష్టంగా రూ.30 కోట్లు గరిష్టంగా రూ.40 కోట్లు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ భూములు వేలం వేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు వస్తాయని తద్వారా ప్రభుత్వానికి వచ్చేఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని భూమి బ్యాంక్‌లుగా నిర్ధారించింది. ప్రభుత్వ అవసరాలకు పోను మిగిలిన వాటిని అభివృద్ధి చేసి పారిశ్రామిక, గృహ అవసరాలకు వినియోగించాలని నిర్ణయంతీసుకుంది. కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై కేంద్రం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించనే లేదు. మూడేళ్లుగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవిస్తూనే ఉంది. కేంద్రం పట్టించుకోకపోయినా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని బ్యాంక్‌ల కన్సార్టియం ద్వారా నిధులు సేకరించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.80 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇటీవలే ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే ఏడాది నాటికి ఇది పూర్తి స్థాయిలో నీటిని తోడటం ప్రారంభిస్తే తెలంగాణలోని సగం జిల్లాలకు సాగు, తాగునీరు అందించడానికి దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంత భారీ ప్రాజెక్టు పట్ల కేంద్రం స్పందించిన తీరు పూర్తి నిరాశజనకంగా ఉందని ఓ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. నీతి అయోగ్ సిఫారసు చేసినా.. మిషన్ భగీరథ బాగుందని ప్రశంసించిన నీతి అయోగ్ ఈ పథకానికి రూ.19 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు దోహదపడేందుకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు కూడా రూ. ఐదు వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే, కేంద్రం మాత్రం ఇప్పటివరకూ ఈ పథకాలకు గానీ, ప్రాజెక్టులకు గానీ పైసా విదల్చలేదు. నీతి అయోగ్ సిఫారసు చేసినా రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పోయింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టులు, పథకాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. మా ప్రయత్నం మేం చేస్తున్నాం ‘‘మేం ప్రాజెక్టులు చేపడుతున్నాం, వాటిని పూర్తి చేసేందుకు త్రికరణశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. కేంద్రం తగిన తోడ్పాటు అందిస్తే బాగుండేది. అయినా మేము ఎక్కడా వెనకడుగు వేయకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం’’–టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
వారం, పది రోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్
సాక్షి, హైదరాబాద్: వారం, పదిరోజుల్లో సర్పంచ్‌లకు చెక్ పవర్‌తోపాటు అధికారాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మిషన్ భగీరథ పథకం పనుల పురోగతిపై మంత్రి శుక్రవారం హైదరాబాద్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమీక్షాసమావేశంలో ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. రోజువారీ నీటి సరాఫరా, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, గ్రామాల్లో అంతర్గత నీటి సరాఫరా పనులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఇంటింటికీ శుద్ధమైన తాగునీటి పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నీటి సరఫరాలో అవాంతరాలు ఉండొద్దని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పథకం కోసం కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేలా ప్రయత్నిద్దామని చెప్పారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వ సమావేశంలోనూ ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రతినిధులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. మిగిలిపోయిన పనులకు జూలై 15 డెడ్‌లైన్ ‘మిషన్ భగీరథ పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మీ పని తీరువల్లే ఇది సాధ్యమైంది. మిగిలిపోయిన పనులను కూడా జూలై 15 లోపు పూర్తి చేసి ఇంకా మంచిపేరు తెచ్చుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఎంతో గొప్పది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇదే. నా 33 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా. ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా బిందెలు, కుండలతో నీళ్ల కోసం మహిళలు ఎదురుపడేవారు. మిషన్ భగీరథతో ఇలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది’అని మంత్రి అన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని, వారం, పది రోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్, అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ‘గ్రామపంచాయతీ నిధులతో వాటర్‌ట్యాంకుల మరమ్మతు పనులు చేయించండి. సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు పూర్తి అయ్యేలా చూడండి. ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం గడువులోపు పూర్తి కావాలి. గ్రామాల్లో అంతర్గత నీటి సరఫరా పనులు కీలకం. ఈ పనుల కోసం తవ్విన సిమెంట్ రోడ్లను వెంటనే పునరుద్ధరించాలి. పాత రోడ్డు తరహాలోనే ఈ మరమ్మతులుండాలి.. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీలకు కచ్చితంగా నీటి సరఫరా చేయాలి. దీనికి తగినట్టుగా పనులు చేయాలి’’అని అధికారులకు మంత్రి దయాకర్‌రావు సూచించారు. -
భగీ‘వ్యథ’..
సాక్షి, కొత్తగూడెం: ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం.. భగీ‘వ్యథ’గా మారింది. వరుసగా పైపులైన్లు లీకవుతున్నాయి. ప్రధాన పైపులైన్ తరచూ లీకవుతుండడంతో నీరు భారీగా ఎగసిపడుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో తిప్పలు తప్పడం లేదు. పలుచోట్ల పౌరులు గాయాలపాలవుతున్నారు. 16 నెలల క్రితం పైపులైన్ పనుల సమయంలో పాల్వంచ మండలంలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అనేక చోట్ల పైపులు లీకవుతూనే ఉన్నాయి. ఇక ఇంట్రావిలేజ్ పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలోని మూలమలుపు వద్ద జాయింట్ వాల్వ్ లీక్ అయి ఇటీవల నీరు ఏరులై పారింది. చండ్రుగొండలోని బొడ్రాయి సెంటర్, మసీదు వద్ద భగీరథ పైపులు పగిలాయి. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఈ నెల 14వ తేదీన మండల కేంద్రంలోని బాలాజీస్వామి ఆలయం ఎదురుగాగల హోటల్ ముందు పైపు పగిలిపోవడంతో హోటల్ ధ్వంసమైంది. రేకులు మొత్తం కూలిపోయి ఇద్దరికి గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోయాయి. ఇంట్లోకి మొత్తంనీరు వెళ్లింది. చర్ల మండల కేంద్రంలోని పూజారిగూడెం, కుదునూరు, కలివేరు గ్రామాల్లో వారం రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్లు పగిలిపోయి నీళ్లు వృథాగా పోయాయి. కలివేరు, పూజారిగూడెంలలో పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేయగా, కుదునూరులో పగిలిన పైపులైన్‌కు ఇంకా మరమ్మతులు చేయలేదు. ములకలపల్లి మండలంలో మిషన్ భగీరథ పథకంలో గత ఏడాది మే 20వ తేదీన పాల్వంచ నుంచి మండల పరిధిలోని రామచంద్రాపురం వరకు ట్రయల్‌రన్ చేయగా, మాదారం అటవీ ప్రాంతంలో పైపులైన్ లీకయింది. ఫౌంటెన్లా నీరు విరజిమ్మింది. సంబంధిత అధికారులు మరమ్మతులు నిర్వహించారు. 2018 జూలై 31వ తేదీన చుంచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ పగిలిపోవడంతో అటుగా వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడటమే కాకుండా ట్రాఫిక్ నిలిచిపోయింది. మిషన్ భగీరథ పైప్‌లైన్ ఒక్కసారిగా లీకై పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు విడుదలయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున నీరు ప్రవహించడంతో రహదారి నీటి ప్రవాహంగా మారింది. పాల్వంచ మండలం జగన్నాధపురం పంచాయతీ తోగ్గూడెం–జగన్నాధపురం గ్రామాల మధ్య మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ పనుల్లో భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో.. 2017 అక్టోబర్ 7వ తేదీన నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు.వారు పైపులు బిగిస్తుండగా వర్షం కురిసింది. ఆ సమయంలో లోతులో పనిచేస్తున్నవారు పైకి వచ్చే పరిస్థితి లేక.. మట్టి పెళ్లలు పడడంతో ముగ్గురూ మృతి చెందారు.