
మంచినీళ్లకే ప్రాధాన్యం
- అందుకు తగ్గట్టుగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కనీస నీటిమట్టాలుంచాలి: సీఎం కేసీఆర్
- గ్రామాలకు నీళ్లివ్వడం మొదలుపెట్టాక ఆపొద్దు
- ప్రాజెక్టుల వారీగా చార్టులు తయారు చేయాలి
- ఈ ఏడాది చివరి వరకు గ్రామాలకు నీళ్లందించాలి
- ‘మిషన్ భగీరథ’పై అధికారులకు దిశానిర్దేశం
- మూడో విడత హరితహారంపై సమీక్ష.. వికారాబాద్ అడవుల్లో ఔషధ మొక్కలు పెంచాలని సూచన
సాక్షి, హైదరాబాద్
నదీ జలాల వినియోగంలో మంచినీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఇందుకు అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కనీస నీటి వినియోగ మట్టాలను (మినిమమ్ డ్రా డౌన్ లెవల్స్–ఎండీడీఎల్) పాటించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథకు నీటి అవసరాలపై సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ నాగేందర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, మిషన్ భగీరథ ఈఎన్‌సీ సురేందర్ రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, సీఈ జగన్‌మోహన్‌రెడ్డి, సీఎంవో అధికారులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఇంటికి ప్రతిరోజూ నిరంతరాయంగా మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ అనే బృహత్తర కార్యక్రమం తీసుకున్నాం. ఒకసారి మంచినీరు ఇవ్వడం ప్రారంభమైన తర్వాత ఒక్కరోజు కూడా సరఫరా ఆపలేం. ఆపవద్దు కూడా. అందుకు నదీ జలాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలి. దీనికోసం ప్రాజెక్టుల్లో ఎండీడీఎల్ నిర్వహించాలి. ప్రాజెక్టుల్లో నీరు ఉండగానే సరిపోదు. అవసరమైనప్పుడు ఆ నీటిని విడుదల చేసుకోవడానికి అనువుగా ఉండేలా నీటిని నిల్వ ఉంచుకోవాలి. అప్పుడే అవసరమైనప్పుడు నీటిని విడుదల చేసుకుని మంచినీటి కొరత లేకుండా చూడగలం. మిషన్ భగీరథ కోసం 30 పాయింట్లను మనం రిసోర్స్‌లుగా పెట్టుకున్నాం. ఏ రిసోర్స్ వద్ద ఏడాదికి ఎన్ని నీళ్లు అవసరమో అంచనా వేసి, అందుకు 25 శాతం అదనంగానే నీరు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రాజెక్టుల వారీగా చార్ట్ రూపొందించి ఉత్తర్వులు జారీ చేయాలి. అందుకు అగుణంగానే ప్రాజెక్టుల వారీగా ఆపరేషనల్ రూల్స్ రూపొందించాలి. నీటిపారుదల, మిషన్ భగీరథ అధికారులు దీనిపై సంయుక్త సమావేశం నిర్వహించుకోవాలి’’అని చెప్పారు. ‘‘ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలో కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. వీటిలో 10 శాతం నీటిని మంచినీటికి రిజర్వు చేస్తున్నాం. కాబట్టి ప్రాజెక్టుల నీటిని మంచినీటిగా వాడుకోవడం తెలంగాణ హక్కు. కాళేశ్వరంతోపాటు ఇతర కొత్త ప్రాజెక్టులు పూర్తయితే చాలా నీరు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్ లాంటి వనరులున్నాయి. కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు మిషన్ భగీరథ నీటిని అందించడానికి ప్రస్తుత వనరులనే వాడాలి. వాటి నుంచే నీటిని అందించాలి. ఇందుకోసం మొదటి దశ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత శాశ్వత ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ ఏడాది చివరికే నదీ జలాలను గ్రామాలకు అందించాలి. అందుకు మొదటి దశ ప్రణాళికను అమలు చేయాలి. నీటి పారుదల శాఖతో సమన్వయం కోసం మిషన్ భగీరథ అధికారిని ప్రత్యేకంగా నియమించాలి’’అని సీఎం ఆదేశించారు.
వికారాబాద్‌ను మరో ఊటీ చేయాలి
అడవుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ అడవుల్లో ఎంపిక చేసిన ఔషధ మొక్కలు పెంచాలని సీఎం కేసీఆర్ సూచించారు. మూడో విడత హరితహారం కార్యక్రమంపై ఆయన సీఎంవో అధికారులతో సమీక్షించారు. నిజాం కాలంలో వికారాబాద్ ప్రాంతంలో సహజమైన ఔషధ మొక్కలతో కూడిన అడవి ఉండేదని, అందుకే అక్కడ టీబీ హాస్పిటల్ కూడా పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే వికారాబాద్ ప్రాంతాన్ని మరో ఊటీ మాదిరిగా తీర్చిదిద్దగల అవకాశాలున్నాయన్నారు. మూడో విడత హరితహారం కార్యక్రమంలో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి 29 కోట్ల మొక్కలు నాటామని అధికారులు చెప్పారు. మరో పదికోట్ల మొక్కలను ఈ నెలాఖరులోగా నాటాలని సీఎం ఆదేశించారు. ఓఆర్‌ఆర్ చుట్టూ మొక్కల పెంపకం జోరందుకోవాలని సూచించారు.
సంచార పశు వైద్యశాలలు సిద్ధం కావాలి..
రాష్ట్రవ్యాప్తంగా సంచార పశు వైద్యశాలలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. త్వరలోనే వాటిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి పెద్దఎత్తున వచ్చిన గొర్రెలతో పాటు ఇతర పశువులకు కూడా ఎక్కడికక్కడే వైద్యం అందించడానికి ఈ సంచార పశు వైద్యశాలలను ఉపయోగించాలని చెప్పారు.
18 నుంచి బతుకమ్మ చీరలు
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేదలందరికీ చీరలు పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం సూచించారు. ఇప్పటికే సగానికిపైగా చీరలు జిల్లా కేంద్రాలకు చేరాయని, రాబోయే రెండు మూడు రోజుల్లో మిగతావి చేరుతాయని అధికారులు చెప్పారు. జిల్లాలకు చేరిన చీరలను గ్రామాలకు చేర్చాలని, 18వ తేదీ నుంచి మూడ్రోజులపాటు పంపిణీ చేయాలని కలెక్టర్లను కోరారు.
చుక్క కూడా వదులుకోమని చెప్పండి
– నదుల అనుసంధానంపై మంత్రి హరీశ్‌కు కేసీఆర్ సూచన
మహానది–గోదావరి నదుల అనుసంధానంలో తమకు నష్టం జరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదనే విషయాన్ని కేంద్ర జల వనరుల శాఖకు కచ్చితంగా చెప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు సూచించినట్లు తెలిసింది. రాష్ట్రానికి ఉన్న నికర జలాల కేటాయింపుల్లో చుక్క నీటిని వదులుకోమని స్పష్టం చేయాల్సిందిగా సూచించారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరగనున్న నదుల అనుసంధాన సమావేశానికి హాజరుకానున్న మంత్రి హరీశ్‌రావు, స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి సోమవారం సీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్లుగా తెలిసింది. ‘‘మహానది విషయంలో తమ దగ్గర మిగులు జలాలు లేవని ఒడిశా చెప్పింది. వారిని ఒప్పించే ప్రయత్నాల్లో కేంద్రం కొన్ని ప్రత్యామ్నాయాలు చూపింది. మహానది నుంచి 230 టీఎంసీలు గోదావరికి వస్తాయి. అవి ధవళేశ్వరం వద్ద కలుస్తాయి. అయితే వచ్చే నీళ్ల కంటే పోయే నీళ్లు ఎక్కువగా ఉంటాయని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీ వద్దంది. కానీ ఇప్పుడు విడిపోయాక స్వాగతిస్తోంది. తెలంగాణకు గోదావరిలో మిగులు జలాలు లేవు. కేంద్రం వద్ద ఉన్న లెక్కలు ఎప్పుడో 20, 30 ఏళ్ల కిందటివి. అప్పుడు తెలంగాణ కట్టిన ప్రాజెక్టులే లేవు. ఇప్పుడు తుపాకులగూడెం, కాళేశ్వరం, దేవాదుల తదితర ప్రాజెక్టులన్నీ కడుతున్నాం. అప్పుడు నీళ్ల లభ్యత ఉన్నందున మిగులు అన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులు మొదలుపెట్టినందున బచావత్ కేటాయింపులను ఒక చుక్క కూడా వదులుకునేది లేదు. పాత లెక్క ప్రకారం 1,440 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని అవార్డు ఇచ్చింది. ఏపీకి సుమారు 500 టీఎంసీలు, తెలంగాణకు 954 టీఎంసీలు వస్తాయి. మన 954 టీఎంసీల వినియోగానికి తగ్గట్లు ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ఆ నీళ్లలో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదు. ఇదే విషయాన్ని కేంద్రం వద్ద చెప్పండి’అని సీఎం చెప్పినట్లుగా నీటి పారుదల వర్గాలు తెలిపాయి.