మనసులోమాట
పాలకుల దిగజారుడుతనం, ప్యాకేజీలకు, ప్రలోభాలకు లోబడి అమ్ముడు పోవడానికి సిద్ధమయ్యే వారి క్షీణ రాజకీయాలే ఫిరాయింపులకు ముఖ్యకారణమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆధారాలు చూపలేం కాని పార్టీలు మారిన వారిలో ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి ఏం ప్యాకేజి ఇచ్చారో బయట ఎవరినడిగినా చెబుతారని.. ఏ పార్టీ తరపున, ఏ ఐడియాలజీతో గెలుస్తున్నామో కూడా అర్థం లేకుండా పోయిందన్నారు. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే వారికి అమ్ముడుపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఫిరాయింపుల నిరోధక చట్టం ఇంత నిర్వీర్యమైపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని భయమేస్తుందని చెప్పారు. ప్రజలు దేన్నయినా సహిస్తారు కానీ పాలకుల అహంకారాన్ని, అమానవీయ దృక్పథాన్ని సహించరంటున్న ఉత్తమ్ కుమార్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
రాజకీయాల్లోకి రాకముందు మీ హోదాల గురించి చెబుతారా?
నేను 16 సంవత్సరాల వయస్సులోనే పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సైనిక శిక్షణ పొందాను. భారతీయ వాయుసేనలో పైలట్ ఆఫీసర్‌గా క్లాస్ వన్ గెజిటెడ్ ఆఫీసర్‌గా చేరాను. అధునాతన టెక్నాలజీ కలిగిన విమాన పైలట్‌గా పనిచేయడంతో పూర్తి సంతృప్తి పొందాను. బోర్డర్ సమీపంలో ఫ్లైయింగ్ చేస్తున్నప్పుడు విమానం గాల్లోనే పేలిపోయింది. అది సింగిల్ పైలట్ విమానం. విమానంలో నేను కూర్చుని ఉండగానే పేలిపోయింది. అయితే యుద్ధవిమానంలో ఎజెక్షన్ అనే బటన్ ఉంటుంది. దాన్ని నొక్కితే విమానం నుంచి సీట్‌తో సహా పైలట్‌ను బయటకు షూట్ చేస్తుంది. దాంతో పారాచూట్ సాయంతో సమీపంలోని అడవుల్లో పడ్డాను. తర్వాత రష్యన్ వైమానిక నిపుణులు వచ్చి చూశారు. ఇలాంటి ప్రమాద ఘటనల్లో పది లక్షల్లో ఒకరు కూడా బతికి బయటపడటం కష్టం. నీకు ఇది బోనస్ జీవితం అనుకో అన్నారు వారు. ఆ ప్రమాదంలో నా వెన్నెముక విరిగింది. మోకాలు ఫ్రాక్చర్ అయింది. ఆసుపత్రిలో ఉండి కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. ఆ తర్వాత కూడా కొంత కాలం పైలట్ గానే పనిచేశాను. అయితే మళ్లీ ఇలాంటి ప్రమాదంలో చిక్కుకుంటే వెన్నెముక పూర్తిగా డామేజ్ అవుతుంది కాబట్టి, పైలట్ బాధ్యతల నుంచి కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని రష్యన్ నిపుణులు సూచించారు. దాంతో ఎయిర్ చీఫ్ మార్షల్ నాటి భారత రాష్ట్రపతి వెంకట్రామన్‌ను సంప్రదించి పీస్ పోస్టింగ్ –రిస్క్ లేని ఉద్యోగం–లో భాగంగా ఆయన వద్ద ఉద్యోగం ఇప్పించారు. తర్వాత నా మిలిటరీ హోదాను ఐఏఎస్ హోదాకు మార్చి రాష్ట్రపతి వద్ద శాశ్వత ఉద్యోగిగా మార్చారు.
ఎంపీలు కూడా ఫిరాయించడానికి ప్రాతిపదిక ఏంటి?
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎవరైనా కావచ్చు మరోపార్టీకి అమ్ముడుపోతే, అమ్ముడు పోదల్చుకుంటే మనం ఏం చేయగలం? సుఖేందర్ గుప్తా ఎందుకు అమ్ముడు పోయారు అంటే ఏం చెప్తాం. ఒకటి మాత్రం నిజం. తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది కేసీఆరే. కొత్త రాష్ట్రంలో రాజకీయాలు ఇంతగా దిగజారుతాయని మేం ఊహించలేదు. ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి ఏం ప్యాకేజి ఇచ్చారో బయట ఎవరినడిగినా చెబుతారు. గుప్తాకు, ఆయన కుటుంబానికి కూడా ప్యాకేజీలు వచ్చాయి. కావాలంటే ఆ టెండర్ కాపీలు మీకు పంపుతాను. ఇంతస్థాయిలో పార్టీ మార్పిడి కార్యక్రమం జరగడానికి రెండే రెండు కారణాలు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు, అమ్ముడుపోవడానికి సిద్ధమైన వారి రాజకీయాలు. కానీ అన్నిపరిణామాలను ప్రజలు చూస్తున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని నా నమ్మకం.
పార్టీ మారితే రాజీనామా చేస్తే బాగుండేది కదా?
ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ దేశంలో అమలే కాకుంటే, భవిష్యత్తులో ఏం జరుగబోతుంది అనేది భయపెడుతోంది. తెలంగాణా టీడీపీ 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిస్తే, వారిలో 12 మంది పార్టీనుంచి ఫిరాయిస్తే ఇక ప్రజాస్వామ్యానికి ఏమి అర్థమున్నట్లు? పార్టీ సింబల్‌కి ఏమి అర్థం? ఏ పార్టీ తరఫున, ఏ ఐడియాలజీతో గెలుస్తున్నామో కూడా అర్థం లేకుండా పోయింది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే దానికి అమ్ముడుపోతున్నారు.
24 గంటల విద్యుత్ క్రెడిట్ కేసీఆర్‌దా లేక కాంగ్రెస్‌దా?
రెండో ప్రపంచయుద్ధ కాలంలో గోబెల్స్ అనే మంత్రి.. జర్మనీ గెలవబోతోంది అంటూ ఎప్పుడూ ఒకే ప్రచారం చేసేవాడు. ఆ ప్రచారాన్ని హిట్లర్ అంతటివాడు కూడా చచ్చేంతవరకు నమ్మాడు. అలాగే కేసీఆర్ తప్పుడు ప్రచారంతో, మీడియాలో వందలకోట్లు ప్రకటనలకు తగిలేసి వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో 27 రాష్ట్రాల్లో విద్యుత్ మిగులు ఉంది కాబట్టి 24 గంటలేమిటి ఇంకా ఎక్కువే ఇవ్వవచ్చు.
ఎరువుల కోసం రూ. 4 వేలు ఇస్తే, రైతులంతా సంతృప్తి చెందుతారా?
స్వాంతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో ఎక్కువమంది రైతుల ఆత్మహత్యలు జరిగింది కేసీఆర్ పాలిస్తున్న తెలంగాణలోనే అని గుర్తుంచుకోవాలి. మిర్చిపంటకు మంచి ధర కావాలని ఖమ్మం రైతులు వీధుల్లోకొస్తే వాళ్ల కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి మరీ జైల్లో కుక్కించిన దుర్మార్గ పాలన కేసీఆర్‌ది. రైతులను సంకెళ్లతో రోడ్డు మీద నడిపించారు. కేసులు పెట్టారు. రైతులను నాలుగేళ్లుగా నిర్లక్ష్యం చేసి వాళ్లు వాతపెట్టడానికి సిద్ధపడుతున్నారని తెలిసి ఇప్పుడు రైతులను ఉద్ధరిస్తున్నట్లు జిమ్మిక్కులకు సిద్ధమవుతున్నాడు కేసీఆర్.
మిషన్ భగీరథ పూర్తి చేసి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నారు కదా?
మిషన్ భగీరథలో ఆరు శాతం కమీషన్ గ్యారంటీ. అందుకే అది కమీషన్ భగీరథ. నీళ్లివ్వకపోతే ఓట్లు అడగనన్నారు కదా. అయితే దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానన్నారు. ఇవ్వలేదు. గిరిజనులకు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అన్నారు. చేయలేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇవ్వలేదు. మరి వీళ్లెవరినీ ఓట్లడగొద్దు. తెలంగాణ ప్రభుత్వంపై ఒక నిశ్శబ్ద విప్లవం జరగనుంది చూస్తూ ఉండండి. ప్రజలు సహించని విషయం ఏమిటంటే అహంకారం. తెలంగాణను పాలిస్తున్న వాళ్లు కళ్లు నెత్తికెక్కి, చిన్నా, పెద్దా, మంచీ చెడూ, డిగ్నిటీ ఏమీ లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కొడుకు నియోజకవర్గంలో దళితులను తీసుకుపోయి పోలీస్ టార్చర్ చేస్తే కనీసం దానిమీద చర్యలుండవు. అంటే ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. జగ్జీవన్ రాం బిడ్డ మీరా కుమార్ తెలంగాణకు వచ్చి వారిని చూసి కంట తడిపెడితే వీళ్లు హేళన చేస్తూ మాట్లాడతారు. ఉస్మానియాలో బీసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కనీస పరామర్శ కూడా ఉండదు. కామారెడ్డిలో బీసీకి చెందిన వీఆర్‌ఎను ఇసుక ట్రాక్టర్ కింద తొక్కించి చంపితే వీళ్లు పట్టించుకోరు. ఇదా వీరి పాలన. ఇంత అమానవీయం, ఇంత అహంకారం ఎన్నడైనా చూశామా.. వీళ్లను ప్రజలు తరిమి తరిమి కొడతారు చూస్తూ ఉండండి.
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రపై మీ అభిప్రాయం?
ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా ఆయనకు మా శుభాకాంక్షలు.
Comments
Please login to add a commentAdd a comment