తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన తీరు విన్నూత్నంగా ఉంది. సాధారణంగా అన్ని రంగాల ప్రస్తావనతో మానిఫెస్టో ఉంటుంది. కాని ఆయన తన పార్టీ పక్షాన దాదాపు పూర్తిగా సంక్షేమ కార్యక్రమాల ప్రణాళికనే ప్రకటించడం కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. అదే సమయంలో అందులో ఆయన ధైర్యం కనిపిస్తుంది.
✍️తెలంగాణలో అభివృద్దికి సంబంధించి ఒక నివేదికను ఇవ్వడంతో పాటు, వచ్చే ఐదేళ్లలో ఏమి చేస్తామో ఆయా పార్టీలు చెబుతుంటాయి. కాని కేసీఆర్ అందుకు విరుద్దంగా కేవలం ఒక రంగానికి సంబంధించి వాగ్దానాలను ప్రకటించి సరిపెట్టుకున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు వాగ్దానాలను దృష్టిలో ఉంచుకుని కొన్నిటిని ప్రకటించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, తదితర భారీ ప్రాజెక్టుల ప్రస్తావన ఉండేది. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి వాటి గురించి వివరించి, ఆ తరహాలో ఇంకేమి చేస్తారో చెప్పేవారు. అలాగే పరిశ్రమల రంగం, ఉపాధి రంగం మొదలైనవాటి గురించి హామీలు ఇస్తుంటారు.
✍️ఒక వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు గందరగోళంగా మారడం, నిరుద్యోగ యువతలో కొంత అసంతృప్తి ఉందన్న ప్రచారం సాగుతున్నప్పటికీ, కేసీఆర్ వాటిని పెద్ద సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు. తాను ఇప్పటివరకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, అలాగే వాటిని భవిష్యత్తులో ఇంకా అధికంగా ఇచ్చే తీరునే మానిఫెస్టో లో పెట్టారు. ప్రత్యేకించి హైదరాబాద్‌కు సంబంధించి కొత్త ఆలోచనలేవీ ప్రకటించలేదు. అయితే కొత్తగా కేసీఆర్ బీమా- ప్రజలకు ధీమా అన్న స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని అర్హమైన 94 లక్షల కుటుంబాలకు బీమా పథకం అమలు చేస్తామని ప్రకటించారు. దీనిద్వారా ఎవరైనా మరణిస్తే ఐదు లక్షల బీమా మొత్తం అందుతుంది. ఇదే ప్రధానమైన కొత్త హామీ అని చెప్పాలి.
✍️అలాగే గ్యాస్ సిలిండర్‌ను 400 రూపాయలకే సరఫరా చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఐదు వందలకే సిలిండర్ అంటే ఈయన ఇంకో వంద తక్కువకే సరఫరా చేస్తానని చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తమ హామీలను కాపీ కొట్టారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ స్కీమ్‌ను పదిహేను లక్షలకు పెంచుతామని కేసీఆర్ తెలిపారు. వీటిని జర్నలిస్టులకు కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా, పలు కొత్త స్కీములు కూడా అమలు చేశామని, దళిత బంధు మొదలైనవాటిని ఆయన ఉదహరించారు.
✍️ఈసారి పాతవాటికే కొనసాగింపుగా హామీలు ఇస్తూ, ఉద్దీపనలు ఉంటాయని ఆయన చెప్పారు. ఉదాహరణకు రైతు బంధు పథకం కింద ఇంతవరకు ఎకరాకు రెండు దపాలుగా పదివేల రూపాయలు చొప్పున ఇస్తుండగా, దానిని క్రమేపి పదహారువేల కు తీసుకు వెళతామని అన్నారు. అధికారంలోకి మళ్లీ వచ్చిన వెంటనే దీనిని పన్నెండువేలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పదిహేనువేలు ఇస్తామని వాగ్దానం చేస్తే, కేసిఆర్ మరో వెయ్యి అదనంగా ఇస్తానంటున్నారు. ఈసారి ఆయన ఏ స్కీమ్ అయినా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పకుండా దశలవారీగా చేస్తామని ప్రకటించడం విశేషం. ఆర్థిక భారం రీత్యా ఇలా చేస్తామని తెలిపారు.
✍️కాంగ్రెస్ పార్టీ ఆరు వాగ్దానాలను కూడా దృష్టిలో పెట్టుకుని వివిధ స్కీములను కేసీఆర్ విస్తరిస్తున్నా, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అర్హులైన పేదలకే అని షరతు చెప్పారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న వృద్దాప్య పెన్షన్ స్కీమ్ ను ప్రశంసించడంలో కూడా వ్యూహం ఉన్నట్లు అనిపించింది. తెలంగాణలో ఉన్న జగన్ అభిమానులను ఆకట్టుకోవడానికి ఆయన ఇలా చేసి ఉండవచ్చు. జగన్ ఏపీలో పెన్షన్‌ను రెండువేల నుంచి ప్రతి ఏటా కొంత పెంచుకుంటూ మూడువేల రూపాయలకు తీసుకువెళ్లి విజయవంతగా అమలు చేస్తున్నారని అభినందించారు.
✍️అలాగే తెలంగాణలో పెన్షన్‌ను ముందుగా మూడువేల రూపాయలు చేసి, ఆ తర్వాత ఏటా ఐదు వందల చొప్పున ఐదువేల రూపాయలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాలుగువేల రూపాయల పెన్షన్ అంటే కేసీఆర్ ఇంకో వెయ్యి పెంచారు. అర్హులైన మహిళలకు నెలకు మూడు వేల రూపాయల భృతి స్కీమ్‌ను కూడా హామీ ఇచ్చారు. ఇది కూడ కాంగ్రెస్ తరహా స్కీమ్ అయినా, కొంత అదనంగా ఇస్తామని అంటున్నారు. కాకపోతే అర్హత అన్న షరతు పెట్టారు. అగ్రవర్ణ పేదలకు కూడా గురుకుల పాఠశాలలు ప్రతి నియోజకవర్గంలో పెడతామని కొత్తగా కేసీఆర్ హామీ ఇచ్చారు.
✍️కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమ కార్యక్రమాలు మానిఫెస్టోలో పెట్టి, అమలు చేయలేక ఇబ్బంది పడుతోంది. దానిని గమనంలోకి తీసుకుని కేసీఆర్ కొంత జాగ్రత్తపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో మాదిరి అన్నీ అధికారంలోకి రాగానే ఇచ్చేస్తామని ప్రకటించారు. నిజానికి అది చాలా కష్టం. అందుకే కేసీఆర్ ప్రజలకు నమ్మశక్యంగా ఉండేలా హామీలు ఇచ్చినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ కేసీఆర్ ఈ మానిఫెస్టోకి ఎంత వ్యయం అవుతుందన్న దానిపై వివరాలు ఇవ్వగలిగితే బాగుండేది. తద్వారా ఈ వాగ్దానాల అమలు సాధ్యాసాధ్యాలు అందరికి తెలిసేవి. రాజకీయ పార్టీలు వనరుల గురించి పట్టించుకోకుండా, హామీలు ఇచ్చేస్తూ ప్రజలను భ్రమపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పై అదే విమర్శ రాగా, ఇప్పుడు బిఆర్ఎస్ కూడా ఆ కోవలోకే వెళ్లిందని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment